మట్టి విలువ తెలిసిన మనుషుల మధ్య ఆమె జీవితం ఊపిరి పోసుకుంది. పట్టణంలోని పల్లె వాతావరణంలో పెరిగి ప్రకృతి పరిమళాలకు చిన్నతనాన్నే పరవశించించారు. దేశభక్తి కి ప్రతీకగా నిలిచే సైనికుల కుటుంబాల జీవితాలను చాలా దగ్గరగా చూశారు. భర్త చేయి పట్టుకుని పారిశ్రామిక వాడలో అడుగుపెట్టి అక్షరం తో దోస్తి కట్టారు. జీతం పెరుగుతుందన్న ఆశతో చదివిన డిగ్రీలు ఆమె జీవనగమనాన్ని మార్చాయి. కూలీగా, కార్మికురాలిగా, రచయితగా, జర్నలిస్ట్ గా, న్యాయవాదిగా, సామాజిక కార్యకర్తగా, తెలంగాణ ఉద్యమకారిణి బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచిన ఆమెకు రాజకీయ రంగం ఆహ్వానం పలికింది. ఏ రంగంలో ఉన్నా ప్రజల మధ్య ప్రజల మనిషిగా ఉంటే అవకాశాలు అవంతట అవే వస్తాయి అని ప్రగాఢంగా నమ్మే వ్యక్తి ఆమె.. అందుకే దినసరి కూలీగా జీవితం ప్రారంభించినా జాతీయ స్థాయి నాయకురాలిగా ఎదిగారు. ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పం ఉంటే కాలం తప్పక అవకాశం ఇస్తుందన్న తన నమ్మకం నిజమైంది అంటారు ఆమె. అంచెలంచెలుగా తనను తాను మలచుకుంటూ ప్రస్తుతం రాజకీయరంగంలో జాతీయస్థాయి లీడర్ గా కొనసాగుతున్నారు. ఆమే ప్రముఖ రచయిత, భారత బొగ్గు గనుల శాఖ నుంచి సెంట్రల్ కోల్ ఫీల్డ్ , జార్ఖండ్ రాష్ట్రానికి ఇండిపెండెంట్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహించిన భారతీయ జనతా పార్టీ జాతీయ నేత జాజుల గౌరీ గారితో ముఖాముఖి….. (తరుణివారపత్రిక సౌజన్యంతో)
తరుణి : రైతు బిడ్డగా, కార్మికురాలిగా పనిచేస్తూనే సామాజిక కోణం నుంచి ఆలోచిస్తూ అనేక రచనలు చేశారు. ఇది ఎలా సాధ్యమైంది.
జాజుల గౌరీ : కంటి ముందు కనిపించే అనేక అంశాలు నా కథల్లో పాత్రలుగా మారాయి. అందుకే నేను రాసిన కథలు సామాజిక అంశాల చుట్టూ అల్లుకున్నవి. చిన్నతనం నుంచి నేను పెరిగిన వాతావరణం, అణచివేత అనేక కొత్త విషయాలు నాకు నేర్పింది. నా చుట్టూ ఉన్న సంఘటనలు, వ్యక్తులు నా కథల్లోని ఇతివృత్తాలుగా , పాత్రలుగా మారారు. వాస్తవికతకు అద్దంగా పట్టేలా నా సాహిత్యం ఉంటుంది.
తరుణి : మీరు పెరిగిన వాతావరణం గురించి చెప్పండి.
జాజుల గౌరీ : సికింద్రబాద్ లోని బొల్లారం దవఖానాలో పుట్టాను. లోతుకుంటలో జాజుల బాయి లో పెరిగాను. మాది దళిత వ్యవసాయ కుటుంబం. మా నాయిన జాజుల మల్లయ్య, అమ్మ జాజుల లక్ష్మమ్మ. నాయిన వాళ్లు 1930 ప్రాంతంలో రంగారెడ్డి జిల్లాలోని కీసర నుంచి వచ్చి అల్వాల్ లోని వ్యవసాయ భూముల్లో మాదిగతనం చేస్తూ స్థిరపడ్డారు. ఆ తర్వాత ఎనిమిది ఎకరాల బీడు భూమిని లోతు కుంటలో సాగు చేస్తూ అక్కడే స్థిరపడ్డారు. అమ్మమ్మ వాళ్లది అంబర్ పేట. ఇప్పుడు ఈ ప్రాంతమంతా పట్టణంగా మారింది. కానీ మా చిన్నతనంలో చుట్టూ పచ్చని పొలాలు ఉండేవి. ఒకవైపు కిసాన్.. మరోవైపు జవాన్. మా ఇల్లు, పక్కనే పొలాలు. మరోవైపు చూస్తే మిలట్రీ ఏరియా. పొద్దుగాల పొద్దుగాల సైనికుల కవాతులు , వారి క్రమశిక్షణతో కూడ జీవితం కనిపించేది. ఊహ తెలిసే నాటికే నిస్వార్థమెరుగుని రైతు, దేశం కోసం ప్రాణాలు ఇచ్చే సైనికుల కుటుంబాల మధ్య పెరిగాను. నాయిన వ్యవసాయ పనులతో పాటు మేస్త్రిగా పనిచేసేవాడు. మా ఇల్లు మేమే కట్టుకున్నాం. అంతేకాదు వాయుపురి, మల్కాజ్ గిరి, సఫిల్ గూడ, సికింద్రబాద్ కాలనీలో చాలా ఇండ్లు మా వాళ్లు కట్టినవే. మేం ఏడుగురు పిల్లలం. అక్క, ముగ్గురు అన్నల తర్వాత నేను, గంగ కవలలుగా పుట్టాం. ఆ తర్వాత ఒక చెల్లెలు. అమ్మ పొలం పనులు చేస్తూనే జానపాదాలను ఎంతో బాగా పాటలు పాడేది. అలవోకగా వందకు పైగా జానపదాలు ఆమె నోట నానేవి. అక్షర ముక్కరాని జీవితంలోని సందర్భాలకు అనుగుణంగా అప్పటికప్పుడు ఆమె పదాలను అల్లుతూ పాటలు పాడేది. ఇంట్లో రేడియో మాత్రం ఎప్పుడు మోగుతూనే ఉండేది. చదువు జీవితాన్ని మార్చుతుందని నాన్న చెప్పేవారు. మా వంశంలో బడికి పోయినా మొదటి ఆడపిల్లను నేనే. లోతుకుంట ప్రాథమిక పాఠశాలలో చదువుకున్నాను. అక్కడ జరిగిన సంఘటనలు నా జీవితంపై చాలా ప్రభావం చూపించాయి. నా మొట్టమొదటి టీచర్ అన్నమ్మ చూపించిన ప్రేమ నా జీవితంపై ఎంతో ప్రభావం చూపింది. జీవితాలను ఆవరించి కులం ఒకటి ఉంటుందని స్కూలు స్థాయిలోనే గ్రహించాను. జీవితంలో ఉన్నత దశకు చేరుకోవాలంటే చదువు ముఖ్య సాధనమని అర్థమైంది. ఒకవైపు పచ్చని ప్రకృతి, మిలట్రీ ప్రాంతపు క్రమశిక్షణతో కూడిన కవాతులు, మరోవైపు అమ్మ పాటలు..రేడియోలో వచ్చే బాలానందం, బాల వినోదం కార్యక్రమాలు నాలో సాహిత్య అభిలాషను కలిగించాయి. పాటల్లోని పదాల్లో అంత్యప్రాసలను గమనించేదాన్ని. చిన్న కాగితం దొరికినా చదవుతూ.. నా మనసుకు తట్టిన భావాలను రాసుకునేదాన్ని. అలా అలా రాయడం మాత్రం స్కూలు స్థాయిలోనే అలవాటు అయ్యింది. పట్టణీకరణలో ముందుగా మాయం అయ్యేవి దళితుల వ్యవసాయ భూములే. అలా మాకు ఉన్న పొలం కాస్త కాలనీలుగా రూపాంతరం చెందాయి. వైవిధ్యభరితమైన వాతావరణంలో పెరిగాను.
తరుణి : చదువు జీవితాన్ని మార్చుతుందని నమ్మారు కదా మరి చదువు మీ జీవితంలో తీసుకువచ్చిన మార్పు గురించి చెప్పండి.
జాజుల గౌరీ : పెద్దపెద్ద చదువులు చదవాలని ఎంతగా ఉన్నా కుటుంబ పరిస్థితులు అనుకూలించాలి కదా. పెండ్లీ కారణంగా చదువు ఎనిమిది లోనే ఆగిపోయింది. మా ఆయన మునింగం నాగరాజు. ఆల్వీన్ కంపెనీలో పనేచేసేవాడు. దాంతో పొలాల మధ్య నుంచి పరిశ్రమల మధ్యకు శాస్త్రీ నగర్, ఎర్రగడ్డకు మకాం మారింది. మాకు ఇద్దరు పిల్లలు, చాలీ చాలనీ జీతం. చదువు మీద నాకు ఎప్పుడూ ఆసక్తి ఉండేది అది గ్రహించి మా వారు నాకు పుస్తకాలను కొని ఇచ్చారు. కానీ సరైన గైడెన్స్ లేక నేను డైరెక్ట్ గా టెన్త్ రాయలేకపోయాను. అయితే నాకు అలవాటు ఉండేది అదేమిటంటే కనిపించిన ప్రతి చిత్తు పేపర్ ని తీసుకుని చదవడం నాకు సాహిత్యం పై ఆసక్తిని పెంచింది. సనత్ నగర్ , బాలానగర్ పారిశ్రామిక వాడలకు అతి దగ్గరగా మా ఇల్లు ఉండటంతో ఇల్లు గడవడం కోసం, పిల్లల చదువుల కోసం ఫ్యాక్టరీలకు పనికి వెళ్లక తప్పలేదు. కరెంటు మీటర్లు తయారు చేసే కంపెనీలో ఐదురూపాయల వేతనానికి పనిచేశాను. అక్కడ నాతో పాటు పనిచేసే శారద చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది అని చెప్పింది. అక్కడే ఉన్న హస్పిటల్ లో ఆయాగా పనిచేస్తే రెండు వందల రూపాయలు ఎక్కువ ఇస్తారని తెలిసి అక్కడ చేరాను. అయితే రక్తం చూస్తే కళ్లు తిరిగేవి.. దాంతో ఆ ఉద్యోగం కొద్దిరోజులే. 1989 నుంచి నా జీవితంలో దుర్భరమైన పరిస్థితులు. అల్విన్ లో మా వారి కాంట్రాక్ట్ లేబర్ ఉద్యోగం రేపు మాకు అన్నట్లుగా ఉండి మొత్తానికి 1990 ప్రాంతంలో ఆల్వీన్ మూతపడింది. దాంతో మా ఆయన ఆంధ్ర ప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖలో డైలీ లేబర్ గా చేరారు. 9 వందల రూపాయల జీతం. ఎటు సరిపోని సంపాదన. బతుకు ఉద్యమం మొదలైంది. పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివించడం కోసం మంచి ఉద్యోగం రావాలంటే ముందుగా పై చదువులు చదవాలని నిర్ణయించుకున్నాను. రిసెప్షనిస్ట్ గా పనిచేస్తే ఎక్కువ జీతం వస్తుందని ఎవ్వరో చెప్పగా తెలిసింది. మా చుట్టూ ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగాలంటే చదువు ఒక్కటే మార్గంగా కనిపించింది. నా తపన గమనించి ఫ్యాక్టరీలో పనిచేసే గోపాల్ అనే ఒకతను అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష అప్లికేషన్ తీసుకువచ్చి ఇచ్చాడు. పరీక్ష రాసి.. 1993లో డిగ్రీలో జాయిన్ అయ్యాను. అదే సమయంలో శ్రీలక్ష్మి ఎంటర్ ప్రైజెస్ బ్రిక్స్ కంపెనీలో రిసెప్షనిస్ట్ గా ఉద్యోగం వచ్చింది. కొండల్ రావు గారు ఆ సంస్థ యజమాని. పిల్లలను తీసుకుని వెళ్లి ఆఫీస్ లో కూర్చునేదాన్ని. మొదటిసారి ఫోన్ చూసింది మాట్లాడింది అక్కడే. దాదాపు ఐదేండ్లు అక్కడే పనిచేశాను. ఆ తర్వాత 2008 వరకు చదువు కొనసాగింది. డిగ్రీ, ఎంసిజె, ఎంఎ, ఎల్ఎల్ ఎం పూర్తి చేశాను. పిహెచ్ డిలోనూ సీటు వచ్చింది.
తరుణి : మీ తొలి రచన ఎప్పుడు ప్రచురించబడింది.
జాజుల గౌరీ : చిన్నతనం నుంచి అమ్మ పాడే జానపద గేయాలు. రేడియోలో నిరంతరంగా వచ్చే పాటలు, నాటికలు ఎంతగానో ఆకట్టుకునేవి. రేడియోలో పాట వస్తుంటే ఆ పాటలోని పదాలను గుర్తు పెట్టుకుని రోజంతా అవే పాడేసరికి పదాల మధ్య ఉన్న ప్రాసలు తెలిసి కవిత్వం రహస్యం ఏమిటో అర్థం అయ్యేది. 1980లో నాలోని స్పందనలు రాయడం మొదలుపెట్టాను. అయితే డిగ్రీలో తెలుగు సాహిత్యం చదువుతున్నప్పుడు అమ్మ పాడిన పాటే మౌఖిక సాహిత్యం అని, గ్రంథస్తం అయితేనే అది సాహిత్యంగా పదికాలాలు నిలుస్తుందని తెలిసి చాలా ఆశ్చర్యపోయాను.
తెలిసి తెలియని వయసులో రాసిన కవిత్వం గుర్తుకువచ్చింది. సాహిత్యంపై అవగాహనతో రచన ప్రక్రియ మొదలైంది. పత్రికలకు పంపించాను. కానీ ఏ పత్రికలు కూడా నా రచనలను ప్రచురించలేదు. అదే సమయంలో ఒక సభలో పరిచయం అయిన గెస్ట్ లెక్చరర్ డాక్టర్ ప్రభంజన్ కుమార్ యాదవ్ రాంనగర్ లోని ఏకలవ్య పత్రిక సంపదకులైన కె. జి. సత్యమూర్తి గారికి నన్ను పరిచయం చేశారు. 1997లో దసరా దీపావళి సంచికలో ఉతికి ఆరేస్తా అన్న కవిత మొదటిసారి అచ్చు అయ్యింది. అలా పత్రికలో నా సాహితీ ప్రస్థానం మొదలైంది. డా. ననుమాస స్వామి, ప్రొ. సత్యనారాయణ తదితరులు నా కవిత్వాన్ని మెచ్చుకున్నారు. ఆ తరువాత మాదిగ సాహిత్య వేదిక వ్యవస్థాపకులు డాక్టర్ నాగప్ప గారి సుందర్ రాజుగారు ఈనాడులో మాదిగ రచయితల నుండి కవితలు కావాలంటూ పత్రిక ప్రకటన ఇచ్చారు. అది చదివి నేను అందులో జాయిన్ కావడం జరిగింది. నాగప్ప గారి సుందర్ రాజుగారు సాహిత్య రచన మేలుకువలు నన్ను సాహిత్య పీఠంపై నిలిపాయి. వెనిక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది. మాదిగ సాహిత్య వేదిక ద్వారా నా సాహిత్య ప్రస్థానం వ్యాసం, కవిత, కథ, నవల ప్రక్రియలకు దారితీసింది. నేను రాసిన మొదటి కథ మన్ను బువ్వ, దస్తకత్ కథలు ఎదురుచూపులు కథాసంకలనంలో వచ్చాయి. మాదిగ సాహిత్య వేదిక ఉపాధ్యక్షురాలిగా కొనసాగాను. ఆ సమయంలో , దార్ల వెంకటేశ్వరరావు, కొల్లూరి చిరంజీవి తదితరులతో సాహిత్యచర్చలు జరిగేవి. అదే సమయంలో నాగప్ప గారి సుందర రాజు గారి మరణంతో మాదిగ సాహిత్య వేదిక ద్వారా రచనలు రావడం ఆగిపోయింది. నా రచన వ్యాసాంగం కొనసాగుతున్నా పత్రికలకు పంపే సాహసం చేయలేదు. ఎందుకంటే ఎంతో శ్రమపడి రాసిన నా కథలు చెత్తబుట్టలో పడటం నాకు ఇష్టం లేకపోయింది.
తరుణి : ఉద్యమంలోకి ఎలా వచ్చారు. సత్యమూర్తి లాంటి ప్రముఖులతో మీ పరిచయం ఎలా జరిగింది.
జాజుల గౌరీ : కొన్ని సంఘటనలు ఎందుకు జరుగుతాయో తెలియదు. కానీ, కాలం మనల్ని కొన్నింటికి ఎంపిక చేసుకుంటుంది అని మాత్రం నేను నమ్ముతాను. సోషల్ వెల్పేర్ ఆఫీస్ లో పనిచేసే క్రమంలో మా ఆయన సభలకు, సమావేశాలకు వెళ్లేవారు. అలా ఒకసారి జె.బి రాజు గారి సభకు మా ఆయన వెళ్లడం.. డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ పుస్తకం ఆయన చేతికి వస్తే పుస్తకాలపై నాకున్న ఆసక్తి తెలిసి ఆ పుస్తకం తీసుకువచ్చి నాకు ఇవ్వడం జరిగింది. రాజ్యాంగం నిర్మాత అంబేద్కర్ గారి గురించి తెలుసుకునే అవకాశం ఆ పుస్తకం ద్వారా కలిగింది. 14 ఏప్రిల్, 1996 ఆ రోజు ఆదివారం. బేగంపేటలోని మహిళా డిగ్రీ కాలేజ్ కి క్లాస్ కు వెళ్లాను. లంచ్ తర్వాత సెమినార్ హాల్ లో ఉపన్యాస పోటీ ఉంది అంటే అందరం వెళ్లాం. అంబేద్కర్ గురించి అందరూ మాట్లాడారు. ఇంకా ఎవ్వరైనా మాట్లాడండి అంటూ ఐదు నిమిషాలు టైం ఇచ్చారు. అందరి మాటలు విన్న నేను బి. ఆర్. అంబేద్కర్ గురించి అంతకు ముందే చదివిన విషయాలు గుర్తుకు తెచ్చుకున్నాను. మాట్లాడేందుకు సిద్ధమై వేదికపైకి వెళ్ళాను. జీవితానికి, కులానికి ఉన్న సంబంధం అర్థం చేసుకుంటూ రాజ్యాంగ రచనకు ప్రేరణ ఇచ్చిన ఆయన జీవితం నుంచి చదువే జీవితాన్ని మార్చుతుందన్న నా జీవితం వరకు నేను గమనించిన కొన్ని అంశాలను చెప్పాను. ఐదు నిమిషాలు కాస్త 25 నిమిషాలు అయ్యింది. అందరూ చప్పట్లతో నా ఉపన్యాసాన్ని మెచ్చుకున్నారు
. ఆ పోటీల్లో నాకే ఫస్ట్ ఫ్రైజ్ వచ్చింది. ఆ తర్వాత మా గెస్ట్ లెక్చరర్ డాక్టర్ ప్రభంజన్ కుమార్ యాదవ్ గారు నాతో మాట్లాడారు. ఆయన అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్నారు. ఉద్యోగం కోసం డిగ్రీలో చేరాను అని తెలిసి జర్నలిజం చదువు పిఆర్ ఓ ఉద్యోగం వస్తుందని చెప్పారు. ఒక రోజు ఓయూ అంతా తిప్పి చూపించారు. ఉస్మానియా యూనివర్సిటీలోఆర్ట్స్ కాలేజీ డోం ముందు నిలబడి జీవితంలో ఎత్తైన స్థాయికి చేరుకోవాలని కలలు కంటూ వాటిని పట్టుదలతో సాకారం చేసుకోవాలి అంటూ చెప్పారు. ఆ క్షణం ఆ మాటలు నాతో పట్టుదలను మరింత పెంచాయి. ఓయూలో బిసిజె, ఎంసిజె చేశాను. కేసరి పత్రికలో కొన్నిరోజులు జర్నిలిస్ట్ గా పనిచేశాను. అయితే జీతం ఇచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో అక్కడ మానేశాను. ప్రభంజన్ సార్ ద్వారానే ప్రముఖ విప్లవ రచయిత కె.జి. సత్యమూర్తిగారు పరిచయం. రాంనగర్ లోని ఆయన ఇంటికి మొదటిసారి వెళ్లినప్పుడు ఆయన అడిగిన మొదటి ప్రశ్న బిడ్డ అన్నం తిన్నావా అని.. బిడ్డా అంటూ పిలిచిన ఆయనను నేను నాయిన అంటూ పిలిచేదాన్ని. ఎంతో మంది ప్రముఖులు, సాహిత్యకారులు అక్కడకు వచ్చేవారు.
తరుణి : మీరు రాసిన కవిత్వంలో ఆవేశం, కథలో ఒక ఆలోచన ఉంటాయి. మీ సాహిత్యానికి ప్రేరణ.
జాజుల గౌరీ : చిన్నతనం నుంచి నేను చూసిన జీవితాలే నాకు ప్రేరణ. నిరంతర శ్రమ జీవి మా నాయిన, తర్కంతో కూడిన ప్రేమ మూర్తి మా అమ్మ, మన జీవితాలను మనమే నిర్మించుకోవాలని నేర్పించారు. సైన్యంలోకి వెళ్లిన కొడుకు కోసం ఏండ్ల తరబడి కండ్లు కాయలు కాచేలా ఎదురుచూసే తల్లు లు, సాటి మనిషిని కులం కోణంలో చూసే సమాజంలో దళితుల జీవన విధానం, సమస్యలు ఎలా ఎన్నో ప్రేరణ ఇచ్చే అంశాలున్నాయి.