( సుధామురళి రచించిన “తడి ఆరని వాక్యమొకటి” కవితా సంపుటి పై సమీక్ష )
ఆరంభం
నిల్చున్న పళంగా మన నెత్తి మీద ఒక పిడుగు పడితే ఎలా ఉంటుంది? చల్లగాలిలో, చుక్కల చిన్న వెల్తురు నడుమ పిట్టగోడంచున రిలాక్స్డ్ గా నిలబడి ఉన్నప్పుడు, ఒక్క ఉదుటన గుండెల మీద దబదబామని ఎవరైనా వచ్చి గట్టిగా గుద్దేస్తే..??, ఊట ఊరిపోతున్న ఉమ్మనీరు తడితోనో, ఊహలన్నీ కాలిపోతున్నాయని ఆర్పడానికి విడుదల చేసిన కన్నీటి జలపాతపు చిత్తడి తోనో చితాగ్గా తడిసిన చీరకొంగు మొహం మీద మొత్తేస్తే..???, ఊపిరాడకుండా చేసేస్తే…????,అంతలోనే సరికొత్త మిరపకాయ కారం కళ్ళల్లోకి కసి తీరా చల్లేస్తే…?????, అతలాకుతలమైపోమా…???!!! ఇదిగో, ఈ ‘ తడి ఆరని వాక్యమొకటి ‘ కవితా సంపుటి చదివినా అదే బాధ, అదే ఊపిరాడనితనం. “ఏతమేసి తోడినా..ఏరు ఎండదు,పొగిలి పొగిలి ఏడ్చినా..పొంత నిండద”న్న జాలాది మహాశయుడి పాత సినీగేయం చప్పున స్ఫురణకు వచ్చేలా ఈ తడి ఆరని వాక్యంలోని “తడి” (అది కన్నీటిదా, బహిష్టు రక్తానిదా, తల తెగిన అమాయకపు ఆడపడుచు కలదా..అన్న సంగతి పక్కన పెడితే…) నానబెట్టి, నాచు పట్టేలా మనల్ని గుచ్చి-గుచ్చి బాధిస్తుంటే.., ‘ఎవరిదీ కొత్త గొంతుక, ఏ ఎడారి కోయిల తన ఆక్రోశాన్నిలా విన్పిస్తోంద”ని కాలూ, చేయి కూడ తీసుకుని ఈ కవిత్వాన్ని చదవడం మొదలెడతాం. ఒక్కో సునామీ కుదిపినప్పుడు కదూ, అసలు నువ్వేంటో కొసరు నేనేంటో ఎరుకలోకి వచ్చేది , ఒక్కో విషపు చుక్క గొంతు దిగుతున్నప్పుడే కదూ, అసలు రంగు తను కుబుసాన్ని విడిచేద( మాయాలోకం )ని సుధామురళి తన కుబుసాన్ని విడిచి, మడి కట్టుకొని, తాను చేసే సర్పయాగంలోకి పితృస్వామ్యపు మగ కొండచిలువలను ఆమంత్రణతో అమాంతం మండిస్తున్నప్పుడు…,నిజానికప్పుడు, ఆ దారి నిండా ఖననమైపోయిన మనసు వాసన రానే రాదు.., యుగయుగాలుగా స్త్రీ జాతి మీద అధికారం చెలాయిస్తున్న పితృస్వామ్య పాషండం ఫెటిల్లున పగిలి, గాజు ముక్కల శబ్దం గుండె గదిలో మూలమూలనా ప్రతిధ్వనిస్తుంది, ధూళి, దుమ్ము, కన్నీరు, నెత్తురు కలిసిన ఒక క్రొత్త వాసన సుళ్ళు సుళ్ళుగా కలియ తిరుగుతుంది.

తెలుగు సాహిత్యంలోకి దూకుడుగా ప్రవేశించిన ‘స్త్రీవాద సాహిత్య పరంపర’ను పుణికి పుచ్చుకుంటూ, ఆ లోతుల్ని అవగాహన చేసుకుంటూ, తన కవిత్వానికి పురుషుడు, పితృస్వామ్య సమాజం, స్త్రీ దేహం, దాని పై జుగుప్స, సామాజిక రుగ్మతలు వంటివి ప్రాతిపదికలుగా చేసుకుని, యుగయుగాల స్త్రీ అణచివేతను నిరసిస్తూ, అందులోనూ నైసర్గిక వాస్తవాలను (native realities) విస్మరించకుండా, దిశా హీనత (direction less) కాకుండా, కేవలం శరీర దృష్టితో సామాజిక ధర్మాన్ని తిరస్కరించే వికృత ధోరణిలోకి పడిపోకుండా, చాలా చాకచక్యంగా తనను తాను బ్యాలెన్స్ చేస్కుంటూ, స్త్రీ జాతికి మేల్కొలుపుగా, పురుష జాతికి హెచ్చరికగా, కవితా ప్రియంభావుకులకు తడివాక్యంలో వెచ్చదనాన్ని పరిచయించిన [ఈ పదాన్ని కవయిత్రి మూడు సార్లు వాడింది] సుధామురళి వినిపించిన సొంత గొంతు..ఈ 90 కవితల సంపుటి, తడి ఆరని వాక్యమొకటి.
స్త్రీవాదమా..స్త్రీ చైతన్యమా?
ఈ సమీక్షను సుధ గారి కవిత్వం పై చేస్తున్నాను గనుక, ఆ పరిధికి మించిన భావజాల పరంపరతో నేను తగువు పెట్టుకో దలుచుకోలేదు, తల దూర్చడమూ లేదు. సంపుటి నిండా స్త్రీ అస్తిత్వాన్ని అనేక కోణాలలో ఆమె అక్షరీకృతం చేసింది. దేహము, ఋతుచక్రము, నేకేడ్ పెరేడ్, రేప్ లాంటి ఎన్నో సంఘటనలు కవితలుగా పురుడు పోసుకున్నాయి. (ఒక్క మెనోపాజ్ ను మాత్రమే ఈమె స్పృశించలేదు) ఈ రకమైన స్త్రీ సంబంధిత విషయాల కవిత్వాన్ని ఈమె రచించడం వల్ల ప్యూరిటన్ ఫెమినిస్ట్(puritan feminist) , పొలిటికల్ ఫెమినిస్ట్(political feminist), లేదూ పాజిటివ్ ఫెమినిస్ట్ (positive feminist) అన్న వర్గీకరణలోకి పూర్తిగా చొరబడకుండా, సైద్ధాంతిక నిరూపణలలో పొరపడకుండా , ఈ కవితా గుచ్ఛాన్ని మనస్ఫూర్తిగా ఆఘ్రాణించి, దాని ఆనుపానులను తరచి చూడడం మాత్రమే నా ప్రస్తుతపు కర్తవ్యంగా నిర్ణయించుకున్నాను. కానీ, ఒక మాట చెప్పక తప్పదు.
Local Feminism/ Rooted Culture
తమిళనాడుకు చెందిన ‘పెరుమాళ్ మురుగన్’ వన్ పార్ట్ వుమన్ ( తమిళంలో మాథోరూపగన్ ) పుస్తకాన్ని, దాని తరువాత మరి రెండు పుస్తకాలను అత్యద్భుతంగా అప్పటి సామాజిక రీతుల పై(multi generational gendered trauma within families) సంధించిన ఒక అస్త్రంలా గొప్ప ట్రయాల్జీని సృష్టించాడు. ఈ ట్రయాలజీ లోని మొదటిది ఎంతో వివాదానికు గురైంది. ఒక వర్గం వారు, వారి మాననీయ స్త్రీల మాన-మర్యాదలు మంటగలుస్తున్నాయని కోర్టుకెక్కడం కూడా జరిగింది. మురుగన్ పూర్తిగా సాహిత్య సన్యాసం తీసేసుకుని, దుఃఖంతో, నాలోని రచయిత మరణించాడని ప్రకటించేసి, పారిపోయి రాయడమే మానేశాడు. చివరికి కోర్టు ఫేవరబుల్‌గా జడ్జ్మెంట్ ఇవ్వటం వల్ల, ఆ పుస్తకాలు మనకు అందుబాటులోకి వచ్చాయి. నేను ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావించానంటే మురుగన్ నవలల పై వ్యాసం రచించిన న్యూయార్క్ కు చెందిన అమితావా కుమార్ ఒక గొప్ప మాట అంటాడు. “I immediately recognized the novel as belonging to a genre called rooted literature. Murugan offered an opportunity to conceptualize local feminism and patriarchy through his novels”అని. [Pg 25, Nalini Iyer , Truama, Gender & Caste, Narratives of Truama in South Asian Literature, Routledge, 2023] దీనికి కంటిన్యుటీ గా నేనే మి అంటున్నా నంటే…same way Ms Sudha had offered the taste of local feminism that was brewed in the native culture with women exploitation as a crucial determinant or central theme of her poetry. The book is so rooted in the soul and soil and embellished in her nostalagia. అలాగున ఈమె ఒక local/ vocal feminist లకు గుత్తేదారని అనుమానం లేకుండా నేను ఈమెకు నామకరణం చేస్తున్నాను.
ఎందుకు ఇలాంటి కవిత్వం వ్రాయడం?
దుఃఖ భాజనమైన ఆత్మాశ్రయ కవిత్వం రచించినప్పుడు, పఠితలు ఋజువులు అడుగుతారు. ఎద్దు పుండు కాకికి రుచి మరి. కవి/కవయిత్రి ఏ సాక్ష్యం చూపించి, తన తరగని బాధను, చల్లారని తగువును, తెగని దోపిడీని, ఎలా తన తలపులలోకి తెచ్చుకుందో…, తమకు చూపించందే వల్ల కాదంటారు, లేదంటే నమ్మడానికి తిరస్కరిస్తారు! అప్పుడు కవి/కవయిత్రి తమ అనుభవం యొక్క పెనుగులాటను పునరావలోకనం చేసుకుని అనుకరణ (mimetic reflection) ద్వారా ఒక ప్రతిబింబాన్ని తిరగరాశి, చెక్కి, పఠితల ముందు ఉంచవలసిన అగత్యం ఏర్పడుతుంది. సుధకూ అదే జరిగింది. కానీ ఇలా చేయడం వల్ల కవయిత్రికి బాధోపశమనం కలుగుతుందట. దీనినే గౌతమ్ కర్మాకర్ ఇంకా జీనత్ ఖాన్ తమ వ్యాసంలో ఇలా తెలియజేశారు.
“Cognitive psychology and literary works operate in the same way. The process of ‘tell a story’ initiates mechanisms that re-create our consciousness and bring about the pedagogy of healing. Thus narratives of trauma are a process of retelling subjective experiences. [ ibid, pg 6]అందుకు, ఆమె ఈ కవిత్వాన్ని రాయడానికి పూనుకుంది. అయితే అలా రాసినప్పుడు ఏ పరిధులలో లోబడి రాసింది ? ఆమె న్యాయం చేయగలిగిందా..?? అన్నది మున్ముందు పేరాలలో చూద్దాం.
స్థితిస్థాపకత
సుధామురళి స్వతహాగా చాలా సున్నిత మనస్క. ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె మనస్విని ని అర్థం చేసుకోవాలని ప్రయత్నించినప్పుడు ఒక్క విషయం ప్రస్ఫుటమైంది…,తన చిన్నతనంలో లేమితో జరిపిన పోరాటం. ఆమె హృదయం పై అదొక ఒక చెరగని ముద్ర వేసింది. ఇంకొక రకంగా, అది ఎంతో ఆత్మస్థైర్యాన్నీ ఇచ్చింది.కానీ సుధ తను సమాజంతో సలిపిన పోరులోని ఒక్కొక్క గాయాన్ని పూడ్చకుండా పచ్చిగా ఉంచుకొని, తను ఒక తడి ఆరని వాక్యమై, తనలాంటి సోదరీమణులకు కొంతైనా వెచ్చదనాన్ని పంచాలన్న ప్రయత్నంలోనే ఈ సంపుటిని వెలువరించడం జరిగింది. ఆమె ఈ కర్తవ్యం చాలా ఎఫీషియెంట్ గా నిర్వహించుకోగలిగింది. ఏదో మెత్తని అలజడి దేహంలోపల కంపిస్తోంది, కనిపించే తోలుమందపు చర్మం మాత్రం మన్ను తిన్న పాము లెక్క కదలక ఉంది , ఇంకెంత ఒరుచుకుపోను.., ఇంకెంత లోతుకు ముడుచుకుపోను, తవ్వే కొద్ది కన్నీటి చెలమలే ఊరుతుంటే, ఇంకే జ్ఞాపకాల ఇసుకమేటలు పోగేయను (పేజీ 49) అంటూ కన్నీటితో కబురు చెప్పింది. సీనియర్ కవయిత్రి శీలా సుభద్రా దేవి గారు ‘యుద్ధమొక గాయం’ కవిత లో ” అందుకే శవాలు కాలుతున్న వాసనలో, ఏ దేశపు ఆచూకీ తెలియద “ని విషాదంగా వివరిస్తే…,సుధామురళి బహుశా ” మనసులు కాలిన వాసనలో ఏ దేహపు ఆనవాలూ దొరకదని, అందుకే దారి పొడుగునా ఖనన మైపోయిన మనసు వాసన “ని విచారించింది. రెండూ యుద్ధాలే! అందుకనే, మడి కట్టుకున్న నా దేహం, అనేకానేక రంపాల మధ్య చిక్కుకుపోయే సజీవశీలకు తార్కాణం , ఎవరికి ఏం తెలుసు, నా లోపల ఎన్ని సుళ్ళు మౌనముద్రలు వేస్తున్నాయో, నా వేదనాభాగాలు ఎన్ని తునాతునకలై లోలోపలే విరుచుకుపడుతున్నాయో (పేజి 21) అని దీనత్వంతో అంటూనే, ఆ గళాలకు తెలియదు ఈ కలాలు ఎప్పటికీ మూగబోవని, ఆశయాలని సిరాగా నింపుకున్న కలాలని, కొమ్ములు కావు, వాటికి ఉన్నది చెడును చెండాడే శూరత్వపు పాళీలని, వెనకడుగు వేయని సబలత్వ(పు) పాదాల ని, అథారిటేటివ్ గానూ అనగలిగింది. అంటే she could very well maintained the elasticity స్థితిస్థాపకత.
విభిన్న పార్శ్వాలు
మొత్తం కవిత్వమంతా గదులు గదులుగా, లింగ వివక్షత, స్త్రీల అణచివేత, పురుషుల పోలీసింగ్, కట్టుబాట్ల కరకు శిక్షలు, క్రూరమైన మగ జీవి ఉదాసీనత, స్త్రీ దేహం అన్న కాల్తున్న కంకర రాళ్లతో కవయిత్రి కట్టడానికి ఉపక్రమించి, పొరలు పొరలుగా మధ్యన స్త్రీలు పొగిలిపొగిలి ఏడ్చిన ఏడ్పుల తడిని, తన దేహం ద్వారా జరిగే సామాజిక, ఋతు యాతనను కలిపి అతికించి ముద్దగా కుదుర్చుకుంది. కాకపోతే, కొన్నిచోట్ల ఆమె వస్త్వాశ్రయం తీవ్రమై తీరాలు దాటి, మరీ తీవ్రమైన ఆత్మాశ్రయానికి లోనై, నిరాశకు తన స్వదేహం పైన తానే నిందా దృక్కులు కక్కే స్థితికి చేరి గడ్డకట్టి, గూడు కట్టుకున్న దుఃఖంతో గుటక కూడా మింగలేకపోయింది. ఇలా ఆబ్జెక్టివిటీ నుంచి సబ్జెక్టివిటీకి జారిపడేలా బురిడీ కొట్టించడం లేతగా కవిత్వం రాస్తున్న కొత్త గొంతుకలందరికీ ఉన్నటువంటి పాటే! రాసి, రాసి తమ జాగ్రఫీని, జానర్‌ను గట్టిపరుచుకోవాల్సిన అవసరం నాలాగే ప్రారంభ దశలో ఉన్న అందరికీ ఏర్పడే ఒక అనివార్యమైన శిక్షే.. పరీక్షే! ఆమెను ఒక్కదానినే మనం ఆక్షేపించడానికి లేదు. అయినప్పటికీ, కవయిత్రి గొప్పతనం ఎక్కడంటే (బహుశా లెక్కల టీచర్ కనుక) తమ ఆత్మాశ్రయపు ట్రౌమాని తను సృష్టించిన భాషతో అంటగడుతూనే, కవిసమయం ఉష్ట్రపక్షి తంతు కారాదు గనుక, ఆమె తన నేను ను సమిష్టి వాచకంగా మలచడంలో సఫలీకృతమైంది. సంపుటి ప్రారంభంలో, బ్రతుకింతే… అని దీనాతి దీనంగా విలిపించి, సంపుటి చివరకు వచ్చేసరికి సమాజాన్నే డినౌన్స్ చేసి ధిక్కరించే స్థాయికి ఎదిగి, ( సిద్ధార్థ) , డియర్స్ అండ్ ఎనిమీస్ లో ” *క్షణం క్షణం మారడం నా నైజం, మరణం రణం ఏదైనా నాకు లేదు నిస్తేజం, కాలాన్ని శాసిస్తూ కవి కాలాన్ని జూలు విదిలిస్తూ సాగడం నా చిద్విలాసం (పేజీ 200) ” అని హుంకరించి, మత పెద్దలారా మీరు తవ్వుకున్న గోతిలో మీరే దూకండి! ఈ జాతి చరిత్ర, నా అవిశ్రాంత యాత్ర, ఏ శత్రువు లేనట్టి అజాతశత్రు దళాలను వేసుకున్నది తిరుగుతున్నది (పేజీ 164) అని ధిక్కరించి, “జాగో మహిళా జాగో, మన దిగంబర ఊరేగింపు మనకు మేలుకొలుపు, జరిగిన వస్త్రాపహరణ ఇంటింటి పాంచాలుల శపథానికి ఒక పూనిక, దుష్ట దైత్య పాలనకు తుది హెచ్చరిక”ని గర్జించింది. ఇది ఈ కవయిత్రికి ఒక చాలా, చాలా పెద్ద ప్లస్ పాయింట్. ఆమె ప్రస్థానం అణచివేయబడ్డ అబల స్వరం నుంచీ తిరగబడ్డ ఒక ఆడపులి గర్జనైంది. ఈ పరిణామం ఎంతో హర్షనీయం.
భావజాలం- వస్తుజాలం- భాషా కోలాహలం
ఇక వస్తుజాలం, భావజాలం, భాష వంటి గురించి కాస్త విపులంగా చర్చిద్దాం అంటే, తెలుగులోనే స్త్రీవాద కవిత్వం ఒక పూర్తి రూపానికి రాలేదని కొండేపూడి నిర్మల గారి వాదన. ఇది నిజం కూడాను! ఒక ఇంటర్వ్యూలో జయప్రభ గారన్నట్టు ఇవాళ్టి భాషంతా పురుషానుభవాల వ్యక్తీకరణం కోసం తయారైనది. ఈ భాషలో, స్త్రీల అనుభవ వ్యక్తీకరణ సాధ్యం కాదు. కనుక, కొన్ని చోట్ల వైరుధ్యాలనిపించే వాక్యాలు దొరలడం (ఇటువంటి కవిత్వంలో) సహజం. ఎందుకంటే తుప్పు పట్టిన పడిగట్టు పదాల నుంచి, నూతన దృక్కోణాలను ఆవిష్కరించడం సాధ్యం కాదుట. [ పేజి 24, స్త్రీ వాద వివాదాలు, సం. డా॥ ఎస్వీ సత్యనారాయణ ] దీన్ని మరి కాస్త విపులంగా సోదాహరణంగా వివరించే ప్రయత్నం చేస్తాను. కవయిత్రి ఓల్గా, తమ అభిప్రాయంగా “ఋతుధర్మం ఆడపిల్లల జీవితాలలో ఎంత కల్లోలాన్ని రేపుతుందో అర్ధమైన వాళ్లకు దాని చుట్టూ ఉన్న భావజాలాన్ని బద్దలు కొట్టాలనిపిస్తుందంటా”రు ఇది అక్షర సత్యం. అంతవరకూ, కలిసిమెలిసి ఆడుకుంటున్న ఆడపిల్ల ఒక్కసారిగా తనకు శారీరకంగా జరుగుతున్న హార్మోన్ల ఇన్ఫ్లుయెన్స్ కి సమాజంతో, శరీరంతో, తన సహచరులతో ఎంతో యుద్ధం చేయాల్సి ఉంటుంది. మన కవయిత్రి ఈ భావనలతోనే ఈ సంపుటిలో బహుఇష్టం అనే కవితను రాసుకొచ్చింది. నిజం చెప్పద్దూ, ఈ కవిత చదవగానే నేను ముందర తొట్రుబడ్డాను. ” ఒక తాత్కాలిక శారీరక వైకల్యానికి కవయిత్రి ఇంత repulsive గా రియాక్ట్ అవవలసిన అవసరం ఉన్నదా..??”అని. 1990 దశకంలో ఈ విషయాలపై పుంఖానుపుంఖాలుగా తెలుగు సాహితీ మూర్తులు, ఆంధ్రజ్యోతి,ప్రభ, ఉదయం, ప్రజాశక్తి పత్రికల్లో ఒక్కళ్ళనొక్కళ్ళు, ఎన్నో వ్యాసాలు వ్రాసి, కౌంటర్- కౌంటర్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ తో చీల్చి చెండాడుకున్నారు. ఇవన్నీ పుస్తక రూపంలో కూడా వచ్చాయి[ స్త్రీ వాద వివాదాలు, సం. డా॥ ఎస్వీ సత్యనారాయణ]. అందులో లేబర్ రూమ్ కవితపై జరిగిన దుమారాన్ని, కాళ్ గర్ల్స్ మోనోలాగ్ పై వచ్చిన కాంట్రావర్సీ ని కన్నార్పక చదివాను. అప్పుడర్థమైంది…., “నా మటుకు నేను, ఫ్లష్ అండ్ బ్లడ్ తో మమేకం కానంతవరకూ, ఆ అవస్థను అనుభూతించనంతవరకూ, అటువంటి కవిత్వం పట్ల సానుకూల స్పందన చేయలేనేమోన”ని, అటువంటి కవిత్వాన్ని రాయలేననీ కూడా అనిపించింది! అందుకేనేమో, సుధామురళి తన కవితలో, “నీ అతివృష్టి అనావృష్టి వరదల్లో, ఓ గడ్డిపరకలా నన్ను కొట్టుకుపోయేలా చేయక, ఓ మనిషిగా గౌరవించు, ఎక్కువ, తక్కువ తూకంలో నన్ను రాయిని చేయక, నా విలువను నాకే ఉంచు, నాలానే బ్రతికించు, నా బహిష్టును బహుఇష్టగా మార్చుకునేలా (పేజీ 27)” అనే వాదానికి మారు మాట్లాడకుండా తలవొగ్గాను.
ఎందుకంటే, ఈ ప్రక్రియను ఒక జుగుప్సాకర మైన క్రియగా పితృస్వామ్య సమాజం శాసనం చేసి, మతం, కులం ప్రాతిపదికతన దాన్ని ఏకంగా ఒక నేరమే చేసేస్తే, సమాజ శ్రేయస్సుకు కంకణం కట్టుకున్న మేకవన్నె పులులిదంతా, “మాతృత్వానికి మహత్తరమైన మొదటి మెట్టు, ఈ మహదావకాశం పొందిన నీదే, నీదే గొప్పతనం..ఒట్ట”ని, నువ్వే దేవతవని, మేడి పండును స్త్రీకి మాత్రమే తినిపించింది. ఈ విషయాన్ని సాగదీస్తున్నాననుకోకపోతే, కొంత పాశ్చాత్య ఆలోచనలు కూడా మనం ఇక్కడ అరువు తెచ్చుకోవాల్సిన అవసరం తప్పక ఉన్నది. మాతృత్వం మీద ఈ క్రింది వాక్యాలు చదవండి మీరే ఒప్పుకుంటారు. ఎందుకు సమానమైన బాధ్యత స్వీకరించకుండా స్త్రీ కి మాత్రం దీన్ని fair and just slavery గా మనం అంటగట్టాం అని పునరాలోచన చేయక మానం. “On conceiving motherhood shows us a way out of it via the question of affect. Although different societies have had different modes of sex/ affective production at different times, a cross cultural constant is involved in different modes of bourgeois patriarachial sex/ affective production. This is that women as mothers are placed in a structural bind by mother- centred, infant and small child care, a bind that ensures that mothers will give more than they get in the sex/ affective parenting triangle in which even lesbians and single parents are subjected. [ Pg 85 Breast Giver, Gayatri C Spivok, mahasweta devi, BREAST STORIES, Seagull Publications, 2018 ]

అందుచేతనే కవయిత్రి కరుకుగా, పురుషుడికి లింగ మార్పిడి జరిగి ఒక స్త్రీగా మారి, అదో ఇదో ఏదోలాంటి చూపులతో దేహాన్ని కోస్తూ చూస్తూ ఉండటమే అలవాటయిన ఆమె, హఠాత్తుగా దేవతలా చేసి పూజించడం మొదలెడితే…, తన మాటలతో తానే చచ్చి తిరిగి మనిషిగా జన్మించాలంటే…”ఆ మార్పిడి జరగాల్సిందేనని, సమాజానికి పట్టిన రాచపుండుకు శస్త్ర చికిత్స సూచిస్తుంది. ఓల్గా గారి మాటల్ని మరోసారి యథాతథంగా గనుక స్మరించుకుంటే…, “ఒకపక్క ఆడవాళ్ళ ఋతు ధర్మాలను అపవిత్రతలంటూ అసహ్యించుకుంటూ, వాళ్ళ పొట్టలను హేళన చేస్తూ, పురిటి గదులను నరక కూపాలుగా చేస్తూ, పురిటికంపు అంటూ ముక్కులు మూసుకుంటూ, స్త్రీలను మాతృమూర్తులుగా మారమంటే అది జరిగే పని కాదు. [ పేజి 36, స్త్రీ వాద వివాదాలు, సం. డా॥ ఎస్వీ సత్యనారాయణ]. బహుశా, ఈ అవగాహనతోనే నేటి లేబర్ రూమ్స్ లోకి ప్రసవ సమయంలో భర్తలు కంపల్సరీగా ఉండాలన్న నియమం కొన్ని ఆసుపత్రులు విధిస్తున్నాయి.
ద్విగుణీకృతమైన దోపిడి
సంపుటి నిండా ముందుగానే చెప్పినట్టు, స్త్రీల సంబంధిత విషయాలే చోటు చేసుకున్నాయి. సాధారణంగా ఇటువంటి స్త్రీ చైతన్య కవిత్వం రాసే ప్రతీ వాళ్లు ప్రశ్నించే వాదాలు, చేసే సోదాలు ఈ కావ్యమంతా సుధామురళి తన కంఠశోష తో వెలువరించింది. ఈ వాదనకు ఉదాహరణగా సీనియర్ కవయిత్రి ఘంటశాల నిర్మల గారి కొన్ని కవితలను సుధా కవితలను కలిపి సారూప్యాన్ని నిలిపే ప్రయత్నం చేస్తాను. శరీర న్యాయం అనే కవితలో, ఘం. నిర్మల గారు, “మన దేహాన్ని పదిలంగా కాపాడుకోవాలి, దేహం మీద అధికారం, దేహంతో వ్యాపారం” అని నిరసిస్తే, సుధామురళి ఏకంగా, దేహం శరణం గచ్ఛామి అంటూ తన దేహాన్ని బయోలాజికల్ ఆస్పెక్ట్ నుంచి చూస్తూ, పూర్తిగా ద్వేషిస్తూ, ఛ అని చీత్కరించుకొని నిరసిస్తూ, నీరస పడుతూ…, ” ఘడియల్లో ప్రేమను చూచే కొలజాడి, దేహగర్భంలో పిండం ఎదగని బికారి,ఈ దేహం.., దేహమా నా దేహమా రణం శరణం గచ్ఛామి, నిత్యం మరణం సమర్పయామి ” అని సమాజం చేసిన అమానుష కృతకానికి దారుణంగా నిట్టూర్చింది. సంపుటి అంతా పురుషాధికారం నిండిన సమాజంపై దాని కామగ్రస్త చూపు పై నిరసనలు ధిక్కారాలు తెలియజేసిన కవయిత్రి, పాశ్చాత్య ప్రభావిత ప్రవర్ధిత విశృంఖలత్వాన్ని, unabashed sex that is detrimental to any society ని ప్రోత్సహించలేదు. నిజానికి, ఒకానొక కవితలో సగం ఆకాశానని నిట్టూర్చి, తేలిపోవాలన్న కవితలో మళ్లీ మూలాలకు జరిగి, సమాజ సంతులనకు ప్రకృతి పురుషులిరువురూ సమానమే కదా! అన్న అభిప్రాయాన్ని , అర్ధనారీశ్వర తత్వాన్ని అలవోకగా తెలియజేసింది. ” రెండు చేతులా కావలసినవి వండిపెట్టి, పస్తుని ప్రేమించే నేను గొప్పో.., చేతులారా సంపాదిస్తూ కూడా, నీకై ఏమీ మిగుల్చుకోని నువ్వు గొప్పో తేలిపోవాలంటుం “ది. కనుక కవయిత్రి కినుక, కోపం, వ్యగ్రతంతా..,”ఇరువురూ ఈ సమాజపు దోపిడీలో ఇరుక్కుపోయినా, అన్యాయంగా, హేతువు లేకుండా, అకారణంగా… స్త్రీని ఇంకా దోచడమే!” అని తేటతెల్లమవుతుంది. ” కార్మికులు దోపిడీకి గురవుతుంటే, స్త్రీలు ఆ దోపిడీతో పాటు పురుష పీడనకూ, దురహంకారానికీ కూడా అధికంగా గురవుతున్నారన్న వాదనను వినిపించడానికే ..” అని మనకు తెలుస్తుంది.
ఇంకా సంపుటి నిండా సంఘటితమైన స్త్రీవాదపు సెంటిమెంట్ ను సుధామురళి శంఖం ఆపకుండా పూరిస్తూనే ఉంది. లింగ వివక్షత మీద ఈమె కవిత మనసును కలత పెడుతుంది. ” ఆడపిల్లా నిన్ను దాచుతాన” ని ఒక తల్లి తన బిడ్డను తానే దాచే దుస్థితికి మన కంట నీరు ఒలుకుతుంది. ఒక్క శాఖాచంక్రమణం చేస్తున్నా ననుకోకపోతే, ఈ ‘లింగ వివక్షత’ మీద, సంకెళ్ళతోనే జైలులో ఒక ఆడపిల్లకు జన్మనిచ్చే అమానుషమైనటువంటి క్రియ పట్ల, సుడాన్ కు చెందిన ఇథియోపియన్ కాందిశీకురాలైన మరియం ఇబ్రహీం యదార్ధ గాథ Shackled ( శృంఖలాబద్ధ )ను నేను గుర్తుకు తెచ్చుకోకుండా ఉండలేను. ఆ పుస్తకపు ప్రకాశకులు ప్రారంభంలోనే ఒక హెచ్చరిక ముద్రిస్తారు. “అది కలుగజేసే సంచలనానికి, భీతావహానికి భీరువులు కాకుండా మీరు ధీరువులైతేనే కొన్ని అధ్యాయాలు చదవండ”ని. కాకుంటే ఆ పుస్తకం లో అంతర్లీనంగా మతం ఒక ప్రగాఢమైన పునాదిని వేసుకుని, ప్రాణ ప్రతిష్ట చేసుకోవడం వల్ల అంత గొప్ప యదార్ధ గాథ కూడా, ప్రపంచ స్థాయిలో పోరాడి గెలిచిన ఒక అసహాయ స్త్రీ పోరాటానికి ప్రతీక గా నిలువ కుండా, కరదీపిక కాకుండా, వేరే జానర్లోకి మళ్లి పోయింది. ఆసక్తి గల మిత్రులు ఈ పుస్తకాన్ని చదవవచ్చు. లింగ వివక్షతోపాటు, వేశ్యలపై, గొడ్రాళ్లపై సంపుటిలో ఆలోచనాత్మక కవితలున్నాయి. ఆధునిక సమాజం స్త్రీ శరీరాన్ని ఒక ఉపాధేయ వస్తువుగా ఎలా మిగిల్చిందో, లాగిపెట్టి కొట్టిన లెంపకాయలా “న్యూడ్ థెరపీ” అన్న కవిత తెలియజేస్తుంది. ఇలాంటి భావననే ఘం. నిర్మల గారు తమ రంగుల చీకటి లో అంతే parallel thought తో వెలువరించారు. ఇంతటి అల్లకల్లోలం, ఆరని నిరాశలో అంకురించే ఆశావాదం అలరించే భావుకత కూడా మనల్నీ సంపుటిలో పలుకరిస్తాయి. “ఒక్కొక్క రేకు విడిపోయాక కూడా, పువ్వును సుగంధం అంటిపెట్టుకొని ఉంటుందేమో కానీ, మమత విరిగిపోయాక బ్రతుకు రెట్టింపు బరువు తగ్గుతుంది” అంటుందీమె ప్రేమలన్నీ ఒకేలా ఉండవు కవిత లో (పేజి182).
అక్వేరియం
సంపుటి మొత్తానికి నన్ను ఎంతో ఆకట్టుకున్న అక్వేరియం కవిత గురించి రెండు మాటలైనా వ్రాయకపోతే నాకు సంతృప్తి రాదు. ఈ కవితకూ , జెహ్రా నిఘా(Zehra Nigah) రాసిన స్టోరీ ఆఫ్ ఈవ్ లోని Justice న్యాయం కవితకు గొప్ప సారూప్యం ఉంటుంది. న్యాయం కవితలో తను చేయని నేరానికి, ఒక గుడ్డి పిల్ల అమాయకంగా జైలు గదిలో బందీ అయిపోతుంది. (ఈ నడుమనే ఈ కవితకు నేను స్వేచ్ఛానువాదం చేసి సిరికోన లో పంచాను.) కవయిత్రి కూడా ఈ అక్వేరియం అనబడే పారదర్శకమైన నాలుగు గాజు పలకల మధ్యన, ఎవరు, ఎప్పుడు, ఎలా కావాలంటే, అలా…, ఏ కోణం నుంచీ కావాలంటే ఆ కోణం నుంచీ రెప్పవాల్చకుండా తనను గమనిస్తూ ఉన్నా, నిస్సిగ్గుగా నిర్లజ్జగా పురుషాధిక్య సమాజపు కట్టడికి, ఆమె బ్రతుకంతా ఆ పలకల మధ్యనే ఉలుకూ-పలుకు లేకుండా బందీ గా పడి ఉండటం గ్రహించి నా గొంతు గద్గదమైంది. ఈమె చక్కటి కవనానికి ఇదొక మచ్చుతునక.
ముగింపు
స్త్రీవాద కవిత్వం విప్లవ కవిత్వంలో ఒక భాగమని ఎందరో ప్రముఖులు వాక్రుచ్చారు. “విప్లవం లాగే అది కూడా ముందుగా మనసులోనే పుడుతుంద”ని చలసాని ప్రసాద్ గారు ఒకచోట అన్నారు. చుట్టూ ఉన్న సమాజం, స్త్రీవాద దృక్పథం కలిగిన కవిత్వానికి, స్త్రీల అనుభవాల్ని మాత్రమే చిత్రించే కవిత్వానికి, అలాగే స్త్రీవాదమని కొందరు పురుషపుంగవులు చేస్తున్నటువంటి male voyeuristic attitudes కు తేడా తెలియకుండా ఉన్న ఈ రోజుల్లో, సుధామురళి లాంటి కొందరు స్త్రీలు కంకణం కట్టుకొని, “ఇది మా శరీరం, ఇదీ మా భావన, ఇదీ మా యాతన”ని వారి శారీరక స్పృహను సామాజిక స్పృహకు సకారాత్మకంగా సమాజంలో ఉపయోగించేలా తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంతో అభిలషీయణం.
సుధామురళికి, సస్నేహపూర్వకంగా కొన్ని సలహాలను సూచించాలని భావిస్తున్నాను. భాష వాడకంలో నేను ముందే చెప్పినట్టు కొన్నిచోట్ల ఆవేశం ఆమె ఆశయాన్ని తీవ్రంగా ఆక్రమించి అభాసుపాలు చేసే ప్రమాదం ఉన్నది. అందుకు కాస్త సంయమనం పాటించాల్సి ఉంది. ఉదా., బహుఇస్టు లో స్త్రీ మూర్తి బాధను శిలను చెక్కినట్టుగా ఓపికగా చెక్కి చెక్కి, చివరికి … ఆ రక్తాన్ని కూడా తాగకు …అనడం, ఇంకొక కవితలో ఉన్మత్త శిశ్నాలను జన్మస్థానాలపై ఉసిగొల్పుతున్న వక్ర భాష్య దురంధరుల” నడం, రక్త ప్రవాహ ధారలతో అలసిపోతున్న ఆ ద్వారం జీవాన్ని దూర్చుకోలేని ఒకానొక జీవ రహిత గొట్టం (పేజీ 148, నిర్వాణ) లాంటి వాక్యాలు మరీ పేలవంగా, repulsive గా అన్పిస్తాయి. కవయిత్రికి తన గమ్యం పట్ల స్పష్టమైన దిశా నిర్దేశం ఉన్నది. అంతరాత్మ అటువైపు గానే ప్రబోధం చేస్తున్నది కనుకనే, తన ఆత్మ నిర్భర్ కవిత లో (పేజీ 165) ఆమె ఆశంసనం స్పష్టంగా తెలియజేయబడింది. ” ఏ అగోచరగోరీలోనో ఇరుక్కున్న నా దేహాన్ని, నా దాహాన్ని, వస పిట్టను చేసి ఊరి మీదకు వదలాలి ” , ” నేను, నేనుగా వినిపించి కనిపించాలి, నేనుగా మిగిలి మురిసిపోవాల “ని ఎంతో సాధికారికతతో, సత్తాతో అనగలిగిన కవయిత్రికి సంచలనాత్మకమైన, శ్లేష పూరితమైన అటువంటి పదబంధాల అవసరం సహేతుకంగా ఉందా..?, అన్నది ఒక ప్రశ్న.(ఈ నడుమనే జాతీయ గీతాన్నే అవమాన పరచేటట్టుగా.”…. జలధి తరంగా ” అన్న సంకలనమొకటి వెలువడిందని కొందరు మిత్రులు కబురు పంపారు. ఐనా, ఈ విషయం ఇక్కడ అప్రస్తుతం) ఎందుకంటే, ఈ కవితలో ఆమె “నేను” సమిష్టి వాచకం. విశ్వజనీయమైన స్త్రీకి ప్రతీక. కనుకనే వాళ్ళందరి కోసం ఆమెనే ..,నేనైనా నువ్వైనా, ఆ మజిలీ దాటవలసిందే, గుర్తులు మిమ్మల్ని కొన్ని తడి తడిగా ప్రతిష్టించవలసిందే అని కంటతడి కూడా పెడుతుంది (పేజీ 184), ” పురుషుడా..గో టు హెల్ ” అని అగ్ని వర్షమూ కురిపిస్తుంది.
కవయిత్రి తన భాషను, భావాలను మరింత పరిపుష్టం చేసుకుంటూ విస్తృతంగా విశ్వ సాహిత్యాన్ని, అందునా స్త్రీతత్వపు కేంద్ర బిందువుగా ఉన్న సాహిత్యాన్ని చదవవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. తను కూడా నాకు లాగే ఆరంభంలో ఉన్నటువంటి కవయిత్రి కనుక, వ్రాసే ప్రతీ వాక్యాన్ని ఒకటికి పది సార్లు సరిచూసుకొని, ఆవేశం అంతరార్ధాన్ని అణగదొక్కకుండా జాగ్రత్త పడాలి. మర్మరంగు, అన్యాయ చట్టాలు లాంటి పలుకు రాళ్లు కవితలు పొడచూపకుండా జాగ్రత్తపడాలి. దాదాపు తొమ్మిది కవితలకు ఆంగ్లంలో శీర్షికలు ఉన్నాయి. కొన్ని సంపూర్తిగా ఇంగ్లీషులోనే రాయడం కూడా జరిగింది. నేటి ఆధునిక కవిత్వపు కొలమానాలలో ఇది ఇమిడి పోవచ్చునేమో గానీ, భాషాపరంగా మనం ఎంతవరకు దీనిని స్వాగతించవచ్చు అనేది ఇంకొక ప్రశ్న? అలాగే, ఒట్టి ఆత్మాశ్రయం నుంచి ఎదిగి ఎదిగి, ఆంధ్ర దేశం దాటి, ఆల్ ఇండియా దాటి, అంతర్జాతీయ పీఠికకు ఎదిగి, స్త్రీ అంతర్వేదనను భూమ్యాకాశాల లో వ్యాపింపచేసేలా భావాలను విస్తృత పరుచుకోవాలి. అందుకు ఎంతో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉన్నది. పోరాటాలు జరుపుతున్న ఎందరో స్త్రీలు, గృహసీమలు విడిచి, గగనాన యుద్ధవిమానాలు సైతం నడుపుతూ అన్ని రంగాలలో పురుషులకు సరిసమానమని చూపుతున్నారు. సాహిత్యంలో కూడా ఈ మార్పు రావాలి. ఇంకా ఎక్కువగా జరగాలి. స్త్రీల సమస్యలను హైలైట్ చేస్తూ వాదవివాదాలు పక్కకు పెట్టి తెలుగులోనూ చక్కటి కవిత్వం రావాలి. నా ఉద్దేశంలో అందుకోసం అల్లిరాణి లా వేరే లోకాలు సృష్టించుకోవడం, మాకింకా కొన్ని శోకాలు కావాలి (పేజి115) అనడం సబబు కాదు. పోరాడాలి. ఘం నిర్మల గారు, తన నిర్వచనం లో ఢంకా బజాయించి చెప్పినట్లు.., ” మూలం మూసలో సమాజం ఒక సాగుడువల, దయా, తర్కము, సహానుభూతి లేని సంఘమే తరుముతుంది మనని విముఖత్వం వైపు, విప్లవం వైపు, విపరీత వాదాల వైపు, అవమాన క్రమ పరిమాణంలో నిలువెల్లా మెలేసి బాధలు దుఃఖాలు, మనసంతా సలేసి తిరుగుబాటుగా రూపెత్తాలి… యుద్ధం పడవకు తెరచాపనెత్తాలి..”, అదీ నేడు కావాల్సింది!
కొని చదవండి- చదివించండి
ఇంత చక్కటి ఆలోచనాత్మకమైన తడి ఆరని వాక్యమొకటి సంపుటిని కొని చదవండి, మరి కొందరితో చదివించండి. “పిడిఎఫ్ ఉందా, సాఫ్ట్ కాపీ ఉందా” అని అడగొద్దు?! తెలుగులో నిజాయితీగా నిక్కచ్చిగా వ్రాస్తున్న కవయిత్రులే తక్కువ శాతం. సామాజిక మాధ్యమాలలో, పండుగలు, పేరంటాళ్ళు, ప్రేమ కవిత్వాలు, విరహ గీతాలు రాసుకుంటూ కాలం వెళ్ల బుచ్చుతున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ. అందుకనే, సుధామురళి రాసినట్టుగానే.., ” నమ్ముకున్న సిద్ధాంతాలు కళ్ళకు గంతలు కట్టాయో, ఒకే కోణపు దాడులు నోట్లో గుడ్డలు కుక్కాయో..అతడు లేడని, అతడు రాడ న్న” మాటలు అబధ్ధం చేద్దాం, మన వంతు భుజం కాద్దాం.
చివరిగా ఒక చిన్న మాట. మ్యూజింగ్స్ లో చలం ఇలా అంటాడు. “చాలామంది ఆర్టిస్టులు తమ శక్తిని ఈ లోకపు రొదలో నశింపజేసుకొని త్వరలోనే ఆరిపోతారు. ఏదన్నా పైనుంచి చూసి, ఆ పైనే కళారూపాన కక్కేసే ఆర్టిస్టు కన్నా, అనుభవించిన దాన్ని లోపలికి తీసుకొని, దాన్ని రిపీట్ చేసి, దాని అందాన్ని రసం తీసి పలికేవాడు గొప్ప ఆర్టిస్ట్ [మ్యూజింగ్స్, పేజీ 237]” ఒక లెక్కలు టీచర్ అయిన కారణంగానో, తన సహజ సిద్ధ కవితాత్మకత కారణంగానో సుధామురళి ఈ విషయంలో నూటికి నూరు మార్కులు తెచ్చుకుందని చెప్పడంలో నేను ఏ మాత్రం సంశయించను.