Home పుస్త‌క స‌మీక్ష‌ “కాలం నది ఒడ్డున”

“కాలం నది ఒడ్డున”

by Jyothi Muvvala
పుస్తకం పేరు : “కాలం నది ఒడ్డున”
కవి :  కళారత్న బిక్కికృష్ణ గారు
సమీక్షకురాలు : జ్యోతి మువ్వల
కాలం అనేది ఒక మహానది. ఎందరో జీవితాలను చూసిన జీవనది. అది ఎవరి కోసం ఆగదు. ఎంతటి ఘనులైన కాలం కాటుకు బలికాక తప్పదు. కాలగర్భంలో కలవక మానదు. మరి కాలం నది ఒడ్డున ఏముంటుంది? జీవితమనే చదరంగంలో ఎత్తుపల్లాలు, కష్టసుఖాలు కావలి కుండలై నడిపిస్తూ ఉంటాయి. కాలం అనే నది ప్రవాహంలో ఈదుకుంటూ పోవాల్సిందే మరి… అది ఏ తీరాన పడేస్తుందో వేచి చూడాల్సిందే. మృత్యుగాలి వీచిందా కాలం నదిలో దేహాం కొట్టుకు పోవాల్సిందే…
కాలం నది ఒడ్డున అనే పేరులో ఎంత నిగూఢ అర్ధం దాగివుందో… ఈ కవితా సంకలనంలోని కవితలలో కూడా అంతే నిగూఢ అర్థాలను ఇమిడ్చి కవిగారు మనకు అందించారు. కాలం నది ఒడ్డున ఓ పచ్చని చెట్టు వలె పల్లవిస్తూ నిటారుగా తలెత్తుకొని నిలబడాలని పరుల కోసం పుష్పించి ఫలించిన పండై రాలిపోవాలి అంటూ సందేశం ఇచ్చారు బిక్కికృష్ణ గారు.
ఇక కవి గారి గురించి చెప్పుకోవాలి అంటే…ఉక్కు లాంటి మనిషి, నవనీత హృదయుడు, సుప్రసిద్ధ కవి, సాహితీ విమర్శకులు, యువకవులను ప్రోత్సహిస్తూ  ప్రతిభావంతులైన కవులను వెలుగులోకి తెస్తున్న నిస్వార్థ సాహిత్య సేవకులు. కవిత్వం డిక్షన్ సృష్టికర్త,  ఈ దశాబ్దపు మహాకవిగా పేరుగాంచిన గొప్ప విమర్శకులు, సాహితీ సమీక్షకులు. కవిత్వం- డిక్షన్ అనే పుస్తకం ద్వారా కవితా నిర్మాణ పద్ధతులను కవిత్వపు భాషను తెలియజేసినా గొప్ప సహృదయం గలిగిన కవి.

బిక్కి కృష్ణ గారి కవిత్వం కూడా జీవనది లాంటిదే. ఎందరో యువకవులకు కవితా దాహం తీరుస్తుంది.
ఈ కవితా సంకలనంలో ప్రతి కవితా అంతర్వాహినిగా ప్రతి పదం గమనంలో ప్రవహిస్తుంది అని చెప్పటంలో అతిశయోక్తి లేదు. కవితలే కాకుండా గజల్, పాటలు కథలు, ఇలా వివిధ ప్రక్రియలలో తనదైన ముద్ర వేసిన సవ్యసాచి, బహుముఖప్రజ్ఞాశాలి మన బిక్కికృష్ణ గారు.
ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వంతో అందరివారయ్యారు. ప్రతి కవితలో ఆయన వ్యక్తిత్వం ఆలోచనా తీరు ప్రసుపుట్టిస్తాయి. ఈ కాలం నది ఒడ్డున అనే కావ్యం నుంచి కొన్ని కవితలను పరిశీలిద్దాం.
*వాడితో చెప్పండి*…
వాన చినుకుల్ని మనపై చల్లిన ఆకాశంపై
ప్రేమతో మల్లెమొగ్గలను విసరాలని
పంట పొలాలకు నీరందించిన చెరువులపై
గంగమ్మ తల్లి గుడి కట్టి పూజించాలని”
ఎంత చక్కటి భావం. ఆకాశం మనకు వర్షం అందిస్తే తిరిగి ప్రేమగా మల్లెమొగ్గలను విసిరి నీరందించిన చెరువులపై గంగమ్మ తల్లి గుడి కట్టి పూజించే రైతు యొక్క సున్నిత మనస్తత్వాన్ని వారి ఔదార్యాన్ని తెలుపుతూ రాసిన కవిత.
 అదే కవితలో…
“పల్లె తల్లి శిగపై పొడుచుకొచ్చిన పొద్దుపొడుపు నేనని
విద్యార్థుల మెదళ్ళలో గూడుకట్టుకున్న అజ్ఞానపు క్యాన్సర్ను
పదునైన అక్షరాలతో శస్త్ర చికిత్స చేసిన డాక్టర్ని నేనని
మొక్కగా చెట్టుగా మహావృక్షంగా జ్ఞానవృక్షంగా బాధల గాధల్లో బోధివృక్షంగా ఎదిగిన రైతుబిడ్డ నేనని
కొడవలితో ఆకాశంలో ఉన్న సూర్యుడి గొంతు కోయాలని ప్రయత్నిస్తే
ఒక్క కిరణం దారం చాలు పది మందిలో వాణ్ణి ఉరేసి చంపడానికి” అని ఘాటుగా ముగించారు.
ఆకలితో అలమటించే కరువు ప్రాంతాల్లోని ప్రజల ఆర్తనాదాలను దగ్గరినుంచి చూసిన కవి! వారి జీవన శైలి ఆత్మాభిమానలను కడుపుమంటలను, రైతుల కష్టాలను ఆకలికేకలకు  ఈ కవితని నిలువెత్తు సాక్ష్యంగా మలిచారు. రైతులు ఎంత సున్నిత మనస్కులో అవసరమైతే తిరగబడి పోరాడే వీరులు ఈ రైతు బిడ్డలు… జ్ఞాన వృక్షంగా బాధలా  గాథల్లో బోధివృక్షంగా ఎదిగిన రైతుబిడ్డనని తెలుపుతూ ప్రతి పాదం నేపథ్యంలో తీవ్రమైన భావావేశంతో పదునైన ప్రశ్నలను సంధించారు.
ఈ కవితకు 2014 రజనీ కుందుర్తి అత్యుత్తమ అవార్డు కూడా లభించింది.
*ప్రజలే కళ్ళు… కవితల ఆనవాళ్లు*
చెట్టంత మనిషి ఏమైనట్టు?
ప్రకృతితల్లి ఒడిలో ఎదిగిన చెట్టుకు
చెట్టుతో పాటు దాన్ని తోబుట్టువుల ఎదిగిన మనిషికి
ఎవడి దిష్టి దోషం తగిలిందో కానీ
దారం తెగిన గాలిపటాల్లా
తమ ఆధారాలు, అస్తిత్వాలు కోల్పోయారు.
చెట్టులోని పువ్వులు పెనుగాలికి రాలినట్టు
మనిషిలోని సున్నితత్వాన్ని ఎవరో నలిపేసారు.
మనిషిని చెట్టుతో పోలుస్తూ చెట్టంత మనిషి ఏమైనట్టు? అంటూ అడిగిన ప్రశ్న… మనందరినీ ఆత్మపరిశీలనలోనికి నెట్టేస్తుంది. పువ్వు లాంటి సున్నిత మనస్తత్వాలు గాలికి రాలి పోయినట్టు మనిషిలోని మానవత్వం సున్నితత్వాన్ని కూడా ఎవరో నలిపేసారా? ఎందుకు మీ ఆధారాలను అస్తిత్వాలను కోల్పోయారు అని ప్రశ్నిస్తున్నారు కవిగారు.
*కర్షక కవి రాసిన పొలం కావ్యం*…
చినుకుల పసికూనలని కనలేక నొప్పితో మబ్బుల ఆకాశం తెరచాటున మూలుగుతున్న గర్భవతి
గుడ్డి మేఘాన్ని ప్రసవించేలా చెయ్యమని గాలి మంత్రసాని
చెట్టు పైనుండి గాలిపటంలా ఎగరేసిన బాలుడు నీవు!”
అంటూ రైతు గొప్పతనాన్ని అభివర్ణిస్తూ అవినీతికి అమ్ముడుపోయిన నాయకులు ఉన్నచోట పొలానికే కాదు
దేశానికి కూడా కంచ వేసినా ప్రయోజనం లేదు అంటూ తెలిపిన గొప్ప కవిత ఇది.ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే కవి పోలిక వినూత్నంగా అరుదైన పదవిన్యాసం బావాభివ్యక్తి అనుభూతి తనదైన శైలిలో అద్భుతంగా ప్రచలితమౌతున్నాయి.
అదే విధంగా మరో కవితను చూస్తే…
*అక్షరాల చనుబాలు*
“ఆత్మహత్యలు చేసుకుని చనిపోవడం ఏంటి?
అసలు మనిషి ఎందుకు చచ్చిపోవాలి?
జీవితంలో ఎన్ని సార్లుయినా చచ్చిబతకాలిగాని
నాలుగు కూనలను బతికించడం కోసం
ఇళ్లల్లో దూరి పాల ప్యాకెట్లు ఎత్తుకొచ్చి
కూనల ఆకలి తీరుస్తున్న మా ఇంటి ముందున్న
రౌడీ ఆడ పిల్లిని చూసి ఉంటే….ఆ తల్లి
భర్త చనిపోయాడని భయపడి పాలిచ్చి పెంచిన పిల్లలను
విషమిచ్చి చంపేది కాదు.”
ఈ కవిత చదివినప్పుడు మనసు ఎంతో ఆర్ద్రమైపోయింది. జీవితంలో అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు ధైర్యం కోల్పోకుండా దృఢ సంకల్పంతో నిలబడితే సాధించలేనిది ఏదీ లేదు అని తెలియజేయడానికి కవి తీసుకున్న కవితా వస్తువు “పిల్లి”
 తన పిల్లలను పెంచుకోవడం కోసం పిల్లి ఎంత తపన పడుతుందో… అది చూసి ఉంటే నువ్వు నీ బిడ్డలను చంపుకోవమ్మ అని కవి చెప్పిన విధానం అద్భుతంగా ఉంది.
*ఆకాశమే హద్దుగా*…
స్వేచ్ఛగా తిరిగే మరుపేగు దారాలను పుటుక్కున తెంపేసి ఎక్కడ ఏ కలల ప్రపంచంలో వాలిపోతారోనని మా భయం
ఎగసిపడే యవ్వన కెరటాలు మీరు
మీ ప్రేమ సాగరాల పూల పడవలలో విహరిస్తుంటారు.
ఏ సమస్యల సుడిగుండాలలో మునిగిపోతారోనని మా భయం!
మా మా ఎదలపై నిదురించిన ప్రేమపావురాలు మీరు
ఏ కలల కీకారణ్యంలో తప్పిపోయి ఎక్కడ కలవరపడి పోతారోనని మా భయం!”
ప్రేమగా కళ్ళల్లో పెట్టుకుని పెంచుకున్న బిడ్డలు… ప్రేమ అనే వలలో చిక్కుకొని ఆ మాయలో తల్లిదండ్రులను కూడా వదులుకొని పేగు బంధాన్ని తెంపుకొని వెళ్ళిపోతారేమోనని  ప్రస్తుతం సమాజంలోని జరుగుతున్న తీరుతెన్నులను చూసి తల్లిదండ్రుల భయాన్ని కవిత రూపంలో చక్కగా చిత్రించారు కవిగారు.
*మనసులను శుభ్రపరుద్దాం*…”
“ఇప్పుడు కొత్తగా చెప్పేదేముంది?
కొత్తగా రాసేదేముంది?
వాడు నీ దేశపు కంప్యూటర్లో అవినీతి వైరస్గా చేరిపోయాక
ప్రభుత్వ ఫైళ్ళలో అధికార సంతకం ఫంగస్గా మిగిలిపోయాక
ప్రపంచ బ్యాంకు కలేబరలలో ప్రజల గొర్రెల తలలు అప్పుడే తెగబడ్డాయి
ఇప్పుడు చందమామ స్విస్ బ్యాంకులో బ్లాక్ మనీ కుందేలును దాచిన అవకాశవాదులంతా…
ఎటొచ్చి ఈ భూమిపై ఉన్న వాళ్లకు భుక్తి గడవని వాళ్లకు
భూమి పుత్రులకే బాధల భూకంపాలనీ…”
ఈ కవితలో కవిగారు  సాంకేతిక యుగంలోని నవ్యతను సంకేతిక పరంగా కవితా వస్తువుగా మలచి వ్యంగ్యంగా చెప్పినా వాస్తవాలకు అద్దంపట్టేలా చెప్పారు. ఏ రోజైతే ప్రభుత్వాలు అమ్ముడుపోయాయో  అభివృద్ధి పేరిట దేశాన్ని విదేశాలలో అమ్మేశారో అప్పుడే దేశ సంపద అంతా తరలిపోయింది. అందని చందమామలోని కుందేలుగా పరాయి దేశంలో చేరిపోయింది. చందమామలో కుందేలు ఉందనుకుంటే ఉందని లేదనుకుంటే లేదని కనిపించని నిజాలను స్కామ్ ముసుగులో దోచేసిన ప్రభుత్వాల తీరును ఎండగడుతూ బలైపోయిన రైతులు, సాధారణ ఉద్యోగుల కష్టాలన్నీ వివరించారు.
*గుమ్మడికాయల దొంగ*…
ఈ కవితలో వాడు పైకి మేధావి ముసుగు ధరించి పెద్ద మనిషిగా కనిపిస్తుంటాడు.
కానీ… వాడి మనసుపుటల్లో అసూయ సర్పం ఆకారణ
ద్వేషంతో బుసలు కొడుతూనే ఉంటుంది.
ఏనుగంత వ్యక్తిత్వం ఉన్న వాడు ఎదురుపడితే
కవిత్వపు భాషలో మొరుగుతూంటాడు
పాపం వాడి తప్పేం లేదు శునకానికి జీతమిచ్చి
కనకపు సింహాసనం మీద కూర్చోబెట్టిన ప్రభుత్వాలదే!
నిజాలను మాట్లాడిన వాడు భుజాలు తడుముకుంటాడు
బహుశా గుమ్మడికాయల దొంగలంటే వీడినేమో!”
అంటూ మనిషి నైజాన్ని  బట్టబయలు చేశారు.అభ్యుదయ భావాలతో ప్రజ్వరిల్లుతూ నివురుగప్పిన నిజాలను నిర్భయంగా తన కవితలలో తెలియజేస్తున్నారు.
 కవి గారు రాసిన ప్రతి కవితలో  ఒక సందేశంతో పాటు మనిషి యొక్క చీకటి కోణాలకు తెర తీస్తూ వాస్తవాలకు ప్రతీకలుగా నిలుస్తాయి.
*బుల్లితెర భూతం*
“మీ హృదయాల్ని మీ ఇంట్లో మీ టివి భూతం
తన రిమోట్ కంట్రోల్తో ఛానల్ లైజ్ చేసేసింది
రంగుల మార్కెట్లో యాడ్స్ పొయ్యిపై
మీ మెదళ్ళను ఉడకబెట్టుకొని కొంచెం కొంచెం ఆరగిస్తోంది”
అంటూ బాధ్యత కలిగిన పౌరుడిగా సమాజిక స్పృహతో ప్రజలను మేల్కొల్పే కవిత ఇది. అదేవిధంగా కాలగర్భంలో మళ్లీ విత్తనమే మొలకెత్తు… ఆకాశమంత ప్రేమ ఆమె చిరునామా… మగువ మల్లెతీగ etc…ఇలా  అభ్యుదయ కవితలే కాక చక్కటి బావ వ్యక్తిత్వానికి నిదర్శనంగా కవితా వనంలో భావుకత్వపు కుసుమాల పరిమళాలు వెదజల్లుతూ ఆ ఆనంద అనుభూతులలోనికి
పాఠకులను తీసుకువెళ్లి రసజ్ఞుల హృదయాలను కొల్లగొడుతున్నారు. కవితా వస్తువు ఏదైనా ప్రతి వస్తువు కవితగా మలిచి రచనా నైపుణ్యంతో కోటి కాంతులతో నలుదిశలా విస్తరించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సంకలనంలో ప్రతి కవిత ఒక అద్భుతం. మొత్తం 77 కవితలు కలిగిన ఈ సంకలనం ఒక్కో కవిత ఒక్కో వాస్తవికతకు నిదర్శనంగా నిలిచి కాలం నది ఒడ్డున అనే కావ్యంగా మలచిబడింది అని చెప్పవచ్చును.
ఈ సంకలనానికి పలు ప్రముఖులు తమ అభిప్రాయాలను అందించారు. కలం యోధుడు బిక్కీ కృష్ణ గారు అని నానీల సృష్టికర్త ప్రముఖ కవి ఎన్. గోపి గారు అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. కవిత్వం రాసేటప్పుడు బిక్కి కృష్ణ గారు మూడో మనిషి అవుతారు  తనను తాను చీల్చుకొని లోకాన్ని చీల్చి చూస్తాడు. తన అందాలు, ఆవేదనలు, ఆక్రోశాలు, అనుభవాలు వర్ణనాత్మకంగా బయల్పడతాయి అని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కే. శివారెడ్డి గారు తెలియజేశారు. ఎగరేసిన మానవతా కవిత పతాక బిక్కీ కృష్ణ గారు ఆయన కవితలకు ముందు మాట అవసరం లేదు అని తేల్చి చెప్పేశారు నగ్నముని గారు.పల్లె సెగపై పొద్దుపొడుపు అని శిఖామణి గారు అభివర్ణించారు. మల్లెల నరసింహమూర్తి గారు, డాక్టర్ ప్రసాద్ మూర్తి గారు, బి.డి శ్యామల గారు, ఇలా చాలా మంది ప్రముఖులు  బిక్కి కృష్ణ గారి కవిత శైలిని, వ్యక్తిత్వాన్ని  కవితా నిర్మాణంలోని గొప్పతనాన్ని తమ అభిప్రాయాలలో పేర్కొన్నారు. ఈ మహాకవి మరెన్నో సంకలనాలను భవిష్యత్తులో మనకు అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
–జ్యోతి మువ్వల
బెంగళూరు.
9008083344

You may also like

Leave a Comment