31.07.22 ఆదివారం గోదావరిఖనిలో..
అనూశ్రీ గౌరోజు గారి దోసిట్లో చందమామ కవితా సంపుటి ఆవిష్కరింపబడినది.
ఆ వేదికపై దోసిట్లో చందమామను పరిచయం చేసే అవకాశం నాకు లభించింది.
వేదికపై సుద్దాల అశోక్ తేజ గారు, మౌనశ్రీ మల్లిక్ గారు, ఎం.ఎల్.ఏ. కోరుకంటి చందర్ గారు, దాస్యం లక్ష్మయ్య గారు, జెవి రాజు గారు, శ్రీనివాస్ గారు, ముక్కెర సంపత్ గారు, వైరాగ్యం ప్రభాకర్ గారు, నాగా నూగూరి గారు, ఉషామధు వెగ్గలం గారు, వకుళవాసు గారు వున్నారు..💐
శ్రీ శ్రీ కళావేదిక మహిళా అధ్యక్షురాలిగా స్త్రీల తరపున గళాన్ని వినిపించడం సంతోషాన్ని కలిగించే విషయం.
* *
తెలంగాణా కోటి రతనాల వీణ అన్న దాశరథి కృష్ణమాచార్యులు గారు, సి. నారాయణ రెడ్డి గారు, కాళోజీ లాంటి మహామహులు జన్మించిన పోరుగడ్డ..
గోదావరి ప్రవహిఒచే పుణ్యభూమి తెలంగాణా.
స్త్రీగా.. శ్రీ పదాల రూపకర్తగా.. అడ్మిన్ గా గ్రూపును నిర్వహిస్తూ సాహిత్యాన్ని ప్రోత్సహిస్తున్న అనుశ్రీ సాహిత్యాభిలాష అభినందనీయం.
ఒక స్త్రీగా ఆమె సంకల్పం ఉన్నతమైనది.
పరాక్రమ శాలిని రుద్రమ దేవి పుట్టిన ఈ గడ్డలో ప్రతి స్త్రీ రుద్రమ దేవే. తుచ్చమైన ంలేచ్చులను తరిమి కొట్టిన పౌరుషాగ్ని రుద్రమ స్ఫూర్తిని, గుణ గణాలను పుణికి పుచ్చుకున్నదే ప్రతి మహిళ.
ఆ రుద్రమకు వారసురాలిగా ఎన్నో అడ్డంకులను ధాటీగా ఎదుర్కుంటూ.. ముందుకు దూసుకుపోతూ, కవిత్వంతో ఘన కీర్తిని పొందిన అనూశ్రీ గారికి ప్రశంసలు.
వారి కలం నుండి వెలువడిన దోసిట్లో చందమామ.. ఏమంటోందో ఇప్పుడు చూద్దాం.
💐💐💐💐💐
శ్రీ పదాలు ప్రథాన అడ్మిన్ జె.వి. రాజు గారి సౌజన్యంతో రూపుదిద్దుకున్న ఈ దోసిట్లో చందమామ..
140 పేజీలలో 90 కవితల కౌముదీ కిరణాలతో అలరిస్తోంది.
ప్రముఖ రచయిత మౌనశ్రీ మల్లిక్ గారి అనుశ్రీ అనురాగ లిపి అనే ముందు మాటలతో..
ప్రముఖ కవయిత్రి మాతృ సమానురాలు మెరాజ్ ఫాతిమా గారి అనుశ్రీ అక్షర సోయగం అనే ఆశీస్సులతో..
అనూశ్రీ కి ఎదగడమే కాదు ఒదగడం తెలుసు అన్న కవి సాయంత్రం గ్రూపు అడ్మిన్ ముక్కెర సంపత్ కుమార్ గారి మాటలతో,
ప్రథాన అడ్మిన్ జె.వి రాజు గారి భావ సౌరభాలతో మొదలైన ఈ చందమామ లలితమైన పద ఝరులతో ఆకట్టుకుంటోంది.
🌿🌿🌿
కవయిత్రి అనుశ్రీ గౌరోజు గారి
దోసిట్లో చందమామ…
~~•••••~~💐
చందమామ ఆకాశంలో వుంటుందనుకున్నాను.. కానీ మన కవయిత్రి అనూశ్రీ ఆ చందమామను మన దోసిట్లోకి తెచ్చింది.
ఈ ప్రేమ కవిత్వాన్ని చదువుతుంటే తెల్ల చీర కట్టుకుని తలనిండా మల్లె పూలు పెట్టుకుని పండు వెన్నెల్లో ఇంటి ముందరి తోటలో హాయిగా విహరిస్తున్నట్లు అనిపించింది.
వెన్నెల్లో గోదారి తిన్నెల్లో కూర్చుని ప్రియునితో సంభాషిస్తున్నట్లు అనిపించి అంతటి హాయి మృదువుగా మదిలోకి ప్రవహించింది.
అనూశ్రీ గారి హృదయం ఎంతటి నవనీతమో, మధురమో, సున్నితమో, భావరాగ తరంగమో ఈ దోసిట్లో చందమామను చదివితే మనకు అర్థమవుతుంది.
ఇది కమర్షియల్ కవిత్వం కాదు. పాఠకులనో.. ఎవరినో ఆకట్టుకునే ప్రక్రియా కాదు.
ఇది అనూశ్రీ గారి హృదయ స్పందన. భావాల సమాహారం. ఇదొక అపురూపమైన ప్రేమ కావ్యం. అనూశ్రీ గారు తమ హృదయాన్ని ఇందులోకి ప్రేమగా ఒంపేసారు. ప్రతి అక్షరాన్ని ప్రేమతో పద్ధతిగా అమర్చారు.
ఇందులోని ఒక్కో వాక్యం వీణా తంత్రుల వలె మదిని మీటుతుంటే చదివే పాఠకులు ఆమె భావ ప్రకంపనలకు ఆశ్చర్య చకితులై పోవాల్సిందే.
అవని నుండి ఆకాశందాకా మదిలోని గోడలన్నీ మారుమ్రోగే స్వరం ఇది.
గోదావరి అలల గలగలలు ఆమె తమ పదాలలో ఒంపుకున్నారు అనుకుంటాను. అందుకే ఆ పదాల హోరు జోరు మాటల్లో వర్ణింప శక్యం కానిది.
*
గుండె సడి అనే కవితలో ఆమె
కన్నీటికి చెప్పిన నిర్వచనం అబ్బుర పరిచింది.
కళ్ళవెంట జారే కన్నీళ్ళు
బాధకు ఆనవాళ్ళే కాదు
ప్రేమకు సైతం చిరునామాలు..
నేనింతవరకూ కన్నీళ్ళు బాధకు సాదృశాలు అనుకున్నాను. కానీ ఇది చదివాక కాసేపు ఆలోచనలోకి ప్రయాణించాను.
నిజమే ఎంత ప్రేముంటే కన్నీరు బయటికి వస్తుంది..
ప్రేమే లేకపోతే బాధనేది లేదు కదా… అనిపించింది.
ఒకే మూసలో.. ఒకే ధోరణిలో, ఒకే కోణంలో, ఎవరినో అనుసరించి ఆ పంథాలో ఆవిష్కరించేది కవిత్వం కాదు. అది కాపీ అవుతుంది.
సరి కొత్త భావాలు.. అర్థాలు.. జవాబులు.. నిర్వచనాలు చెప్పేదే కవిత్వం.
అలాంటి ఒరవడితో నిండిన కవిత్వమే అనూశ్రీ గౌరోజు గారి దోసిట్లో ఒదిగిన చందమామ.
*
నీ వల్ల కలిగిన దు:ఖమంటేనే అది కొండంత ఆవేదన
అది తోడిపోసేందుకు
నేను అనంతమైన నదినై ప్రవహించాల్సిందేగా..
నదులన్నీ సంద్రాన్ని చేరడం అందులో కలిసిపోవడం మనకు తెలుసు. అది సహజం కూడా..
కానీ ఆశ్చర్యంగా కొత్త విషయాన్ని ఇక్కడ చదివాను.
కొండంత ఆవేదనను తోడిపొయ్యడానికి నదినై బయటికి ప్రవహిస్తా అనడం కొత్తగా వుంది.
భావాలను తలక్రిందులు చేసి వింతైన కొత్త అర్థాలను సృష్టించడం ఈ కవయిత్రికే చెల్లింది.
హేట్సాఫ్ అనుశ్రీ…
నిను చేరు వేళ కవిత అద్భుతమైన ప్రేమకు ప్రతీక. సాగర సంగమం ప్రతి నదికీ అనివార్యం.
నదిని స్త్రీతో సంద్రాన్ని పురుషునితో పోల్చి చెప్పడం అనంతమైన భావం.
ఈ కవిత నేను రాసిన మది నదిలో… కవితల సంపుటిని గుర్తుకు తెచ్చింది.
ప్రతి స్త్రీ ఇలాగే ఆలోచిస్తుందేమో..
నదిలా సాగాలని.. ఎత్తుపల్లాలను అధిగమిస్తూ, మలుపులను తిరుగుతూ.. సుధీర్ఘ ప్రయాణం తరువాత ప్రియుని పరిష్వంగంలో అలసటను తీర్చుకుని ఇన్నాళ్ళ ఎడబాటును మరిచిపోవాలని….
నది నాకిష్టమైనది. నన్ను నేను నదితో పోల్చుకుంటూ వుంటాను.
నది స్త్రీలాగే ఎన్నో సంస్కృతులను సృష్టించింది. నదీ తీరాలు నాగరికతకు ఆలవాలాలు.
స్త్రీ ని నదితో పోల్చడం ఈ కవితను ఉన్నతమైన శ్రేణిలో నిలబెట్టింది అనడం సముచితం.
అంతేకాదు.. ప్రేమనే కాదు, ఎడబాటును, ఎదకోతను కూడా అనూశ్రీ గారు అద్భుతంగా వ్యక్తీకరించారు. హృద్యంఫా ఆవిష్కరించారు.
అన్ని భావాలను ఒడిసిపట్టి అక్షరాల్లో నింపి చందమామగా మలచి మన దోసిట్లోకి చేర్చారు.
ఈ కవితా సంపుటికి ఈ పేరు సరిగ్గా అమరింది. కవిత్వానికి తగిన శీర్షిక ఇది.
**
ఇందులో ల్ని నలుపురంగు అనే కవిత ప్రేమిక హృదయాన్ని కొత్తగా ఆవిష్కరిస్తోంది.
నాలోకి నేను ప్రవహిస్తూ నిన్ను అన్వేషించాలంటే చిక్కటి చీకటి రాత్రి కావాలి అనే అర్థింపు సమంజసంగా వుందనిపిస్తోంది.
ప్రేమలోని లోతులను, గాఢతను, తీవ్రతను, ఒత్తిడిని, మధురిమను కవయిత్రి కలం ఆర్తిగా పొదివి పట్టుకుంది. అన్నిరంగుల్లో అక్షరమై ప్రవహించింది.
*
మరో కవిత ఆనంద తీరం..
చదువుతుంటే చిరునవ్వును పెదవులపై నిలిపింది..
ఆనందాల తీరం నీవే
సమస్యల ఉప్పెనవూ నీవే..
నిన్ను దాటలేని అలను నేను అంటూ..
ప్రేమించిన స్త్రీ హృదయ సంఘర్షణను చక్కగా అక్షరీకరించారు.
కవయిత్రి ప్రతిభకు తార్కాణం ఈ ఆనంద తీరం.
**
నీ చేరువ అనే కవిత అవ్యక్తానుభూతికి లోను చేస్తుంది.
ప్రేమ తరంగాలను ఒడుపుగా హృదయంలోకి ఒలికిస్తుంది.
త్వమేవాహం, ప్రయాణం..మాధుర్యాలు.. మౌనరాగాలు..ఆశల నిచ్చెన.. అనివార్యం మదిని కలవరపెట్టే కవితలు.
కొన్ని గిలిగింతలు, కొన్ని కలవరింతలు, మరి కొన్ని కేరింతలు, పులకరింతలు కలగలిసి అనూశ్రీ కవిత్వం పురుడు పోసుకుంది.
కవిత్వం రాయాలంటే ప్రసవవేదన పడతారు కవులు అంటారు. కానీ ఈ దోసిట్లో చందమామలో ఆ లక్షణాలు ఎక్కడా కనిపించవు.
అలవోకగా అంతర్లీనంగా మది గదిలో దాగిన భావాలను కలంలోకి ఒంపినట్లు కనబడుతుంది.
అనూశ్రీ అక్షరం అలరిస్తుంది. కవిత్వం ఆసాంతం ఆకట్టుకుంటుంది. చదివాక మదిని మైమరిపిస్తుంది. అవ్యక్తానుభూతికి లోనయ్యేలా చేస్తుంది.
ఉప్పొంగే నదిలాంటి ఆ ఒరవడి ఒక్కుదుటున చదివింపజేస్తుంది.
ముఖ్యంగా ఆకట్టుకునే కవిత్వం వెలువడాలంటే ఆత్మ సౌందర్యం ముఖ్యం.
నిష్కల్మషమైన హృదయం అవసరం.
ప్రేమించే మనసుకే అది సాధ్యం.
ఈ లక్షణాలన్నీ పుష్కలంగా వున్న కవయిత్రి అనూశ్రీ గౌరోజు గారు.
వారు మరిన్ని సంపుటాలను వెలువరించాలని, వారి ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు నెరవేరాలని, మరెందరికో స్ఫూర్తిదాయకమై, ప్రేరణ కలిగిస్తూ సాహితీ శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నాను.
ధన్యవాదములు.