ఆరవ భాగం
అపర్ణ తను పుట్టి పెరిగిన ఇంటికి వచ్చి తన బాల్యం గుర్తు చేసుకుంటుంది.ఆ మధుర జ్ఞాపకాలతో మురిసి పోతుంది. సుధ పిలుపుతో ఊహల నుండి బయట పడి పడుకుంటుంది
ఇక మిగతా భాగం చూద్దాం!
తెల్లవారి తొందరగా లేచి ఇంట్లో పనులన్నీ చేసుకుని తయారైంది సుధ. అపర్ణ మాత్రం అలాగే పడుకొని ఉంది.
” అప్పూ! లేవ్వవే! మీ ఫ్రెండు ఇంటికి వెళ్ళాలి కదా! నేను లేచి తయారయ్యాను కూడా” అని లేపింది సుధ.
” అత్తా! అప్పుడే లేచావా!నేను కూడా లేచి తయారవుతాను. అయ్యో! నేను బట్టలేమీ తెచ్చుకోలేదు. నేను స్నానం అక్కడికి వెళ్లాకే చేస్తానులే” అన్నది అపర్ణ.
” ఈ పాచి ముఖంతో అక్కడికి వెళ్తావా? నా చీర ఏదైనా కట్టుకో! కొత్త చీరలు కూడా ఉన్నాయి. బ్లౌజులు నావి సరిపోతాయిలే !లేచి తొందరగా స్నానం చేయి” అన్నది సుధ.
” అదిగో అక్కడ కొత్త బ్రష్ పెట్టాను తీసుకో! బ్రష్ చేసుకుని స్నానం చేసి రా! ఈ ఇంటి బాత్రూం లో గీజర్ పెట్టడానికి లేదు. కాబట్టి స్టవ్ మీద వేడి నీళ్లు పెట్టి ఉంచాను బకెట్లో పోసుకొని స్నానం చేసేయ్” అని చెప్పింది సుధ.
అలా బ్రష్ తీసుకొని పెరట్లోకి వెళ్లిన అపర్ణకి ఆ పెరడంతా ఎంతో ఆహ్లాదంగా కనిపించింది. తన చిన్నప్పుడు ఆ మొక్కల మధ్య ఆడుకునేది. కాంపౌండ్ వాల్ చుట్టూ అన్ని గులాబీ చెట్లు ఉండేవి. మధ్యలో మల్లెపందిరి, మరోపక్క బొండు మల్లె చెట్టు ఇంకా ముందుకు చేమంతి పూల పొదలు, దవనంపాదు మరోవైపు వంకాయ బెండకాయ టమాట ఇలా అన్నీ కూరగాయ చెట్లు ఎంత బాగుండేది.ఇప్పుడు కూడా సుధ త్త బాగానే మెయింటైన్ చేస్తుంది. ఇలా ఒక్కసారి తనకు తాను పసిపిల్లల మారినట్లు అనిపించింది అపర్ణకి.
కొబ్బరి చెట్టు మొదట్లో కూర్చొని బ్రష్ చేసుకుంటుంటే, అక్కడే పని చేస్తున్న ఒక ఆడ మనిషి ప్రశ్నార్థకంగా అపర్ణ వైపు చూసింది.
అపర్ణ కూడా ఆమెను ’ఎప్పుడో చూసినట్లు ఉంది. కానీ పేరు గుర్తు రావడం లేదు’ అనుకుంది.
బయటకు వచ్చిన సుధ
” ఈమె అప్పుడు మన ఇంట్లో పనిచేసే బాలవ్వ మనవరాలు. పరిస్థితులు బాగా లేక ఇక్కడ అన్నల దగ్గరికి వచ్చి ఉంటుంది. చిన్నప్పుడు అంతా మన ఇంట్లోనే ఆడుకునేది కదా! అందుకే మన ఇంట్లో పని చేస్తానని వచ్చింది.గుర్తుందా? ఆమె పేరు అంజి. ఇంచుమించు నీ వయసే ఉంటుందేమో” అన్నది సుధ.
” ఆ! గుర్తొచ్చింది. ఒకరోజు బంతిపూలు కోసిందని ఆమె వెనకాల పరిగెత్తుకొని వెళ్లి వాళ్ళ ఇంట్లోకి వెళ్లిపోయాను కొడతానని,అప్పుడు వాళ్ళ అమ్మ భయపడి పోయి, ఈమెను తీసుకెళ్లి వాళ్ళ దేవుడి గదిలో దాచి పెట్టింది. నేను దేవుడి గదిలోకి కూడా వెళ్లి కొడతానని చెప్పాను. కానీ అలా “దేవుడు గదిలోకి వెళ్ళకూడదమ్మా”! అని ఆమె భయం చెప్పింది. అప్పుడు ఇంక మాట్లాడకుండా వచ్చేసాను. నేను ఎన్నో రోజులుగా నీళ్లు పోసి పెంచిన బంతిపూలన్నీ కోసేసింది. నాకు ఎంత కోపం రావాలి అసలు? అంజి నీకు గుర్తున్నానా నేను” అని అడిగింది నవ్వుతూ..
” ఓ అప్పమ్మనా! నాకెందుకు యాది లేదు. మస్తు యాది ఉంది. నాతోని ఎంత మంచిగా ఉండేదానో, కోపం వస్తే అంత భయం చూపే దానివి. వామ్మో నన్ను కొట్టనీకి ఉరుక్కుంట వచ్చినవు” అన్నది అంజి..
కాసేపు ముగ్గురు నవ్వుకున్నారు..
“నువ్వు కలుస్తావని అనుకోలేదు అంజి! నేను నీకోసం ఏమి తీసుకొని రాలేదు” అని లోపలికి వెళ్లి హ్యాండ్ బ్యాగ్ లో నుంచి ఒక ఐదు వందలు రూపాయల నోటు తీసుకుని వచ్చి అంజి చేతిలో పెట్టింది.
అంజి సంతోషంగా తీసుకొని “నీ ఫోన్ నెంబర్ ఇయ్యమ్మ! అప్పుడప్పుడు మాట్లాడతా” అన్నది అంజి.
తన ఫోన్ నెంబర్ రాసి ఇచ్చింది అంజికి. తర్వాత స్నానం చేయడం కోసం బకెట్ లోపలికి తీసుకుని వెళుతుంటే, అంజి వచ్చి నేను పెడతానమ్మా! అని బకెట్ లోపల పెట్టి అందులో వేడి నీళ్లు చల్ల నీళ్లు కలిపేసి “ఇంకా తానం చేయమ్మా” అన్నది.
అపర్ణ స్నానం చేసుకొని సుధ ఇచ్చిన పట్టు చీర కట్టుకుంది. అందులో తనకు సరిపోయిన బ్లౌజ్ వేసుకుని అద్దంలో చూసుకుంది.
“అత్తా! నాకు బాగా సరిపోయింది నీ బ్లౌజ్” అని చెప్పింది అపర్ణ.
ఇంతలో బయట కార్ చప్పుడు వినబడింది. కారు దిగి డ్రైవర్ లోపలికి వచ్చి “వసంతమ్మ మిమ్మల్ని తొందరగా రమ్మన్నది” అని చెప్పాడు.
ఇద్దరూ ఇంటికి తాళం వేసి కార్ ఎక్కి కూర్చున్నారు. చీకట్లో గమనించలేదు కానీ ఊరంతా మారిపోయింది. ఆ పక్కన వరుసగా ఇళ్ళు ఉండేవి. అందులో తన స్నేహితులు ఉండేవాళ్లుm ఇటుపక్కన ఒక కిరాణా షాపు ఉండేది. సమయంగాని సమయంలో వాళ్ళ తలుపు దబా దబాదితే ఒకసారి ఆ దుకాణం ఓనరు గట్టిగా బుగ్గ గిల్లింది. అది గుర్తొచ్చి నవ్వుకుంది.
చుట్టాలు ఎవరు వచ్చినా, ఐదు పైసలు పది పైసలు ఇస్తే, వెళ్లి పిప్పర్మెంట్లు కొనుక్కునేది గుర్తుకొచ్చింది. ఒక్కొక్కసారి డబ్బులు ఎక్కువగా లేకుంటే దాన్నే కాకెంగిలి చేసు పంచుకునేవాళ్లు. ఆ ముందుకు వెళితే చెరువు. ఎప్పుడు చెరువు నిండిన ఆ మత్తడి మీద నుండి స్నేహితురాలు సువర్ణతో అటు ఇటుగా నడిచేది. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ ఎంత తిట్టేదో .”అలా మత్తడి పైనుండి నడవకూడదు. జలదేవతకి కోపం వస్తుంది” అని చెప్పేది. ఇలా అవన్నీ గుర్తు చేసుకుంటూ సుధతో చెప్తూ బయలుదేరింది.
ఇంకా ముందుకు వెళుతుంటే గాజుల షాప్ కనిపించింది. అది మూసివేసి ఉంది. కానీ ఆ గాజుల షాపు చరిత్ర గుర్తొచ్చింది. ఊళ్లో రెండు షాపులు మాత్రమే ఉండేవి. ఒకటి గాజుల లింగయ్య ఒకటి గాజుల రాజయ్య .ఇద్దరూ అన్నదమ్ములు. రాజయ్య షాపు చాలా దూరంగా ఉండేది. లింగయ్య షాపు దగ్గరలో ఉండేది. కానీ ఎప్పుడు రాజయ్య షాపు మూసి ఉండేది. ఆయన దగ్గర ఎక్కువ డిజైన్స్ ఉండేవి. లింగయ్య షాపులో తక్కువ డిజైన్స్ ఉండేది. అతను ఇల్లు షాపు ఒకచోటే ఉండేది అపర్ణ తల్లి గాజులు వేసుకోవాలంటే వెళ్లి..
” లింగయ్య తాతా! అమ్మ రమ్మంటుంది గాజులు వేసుకోవాలట” అని పిలవగానే పెద్ద గాజుల పెట్టే భుజానికి తగిలించుకొని ఇంటికి వచ్చేవాడు.
అమ్మ పెద్ద చాపపరిచి అతని కూర్చోమనేది. ఆయన దగ్గర ఉన్న గాజుల పొట్లాలు అన్ని తీసి బయట పెట్టేవాడు.
” ఏమి కావాలి బిడ్డ! నీ ఇష్టం ఉన్న గాజులు చూసుకో ! మంచిగా చూసుకో” అంటుండే లింగయ్య తాత.
అటు ఇటు చూసి అమ్మ రెండు రంగుల గాజులు సెలెక్ట్ చేసుకుని, ఈ గాజులు బాగున్నాయి వేయమని అడిగేది.
చేతి నుండి పాత గాజులు తీయాలంటే పెద్ద ప్రహసనమే. చాలా చిన్న సైజు వేసుకునే వాళ్ళు. దానిని కష్టపడి నొప్పి తెలియకుండా ఏదో ముచ్చట పెడుతూ గాజులన్నీ తీసేవాడు లింగయ్య తాత. అందులో సెంటిమెంటు పాత గాజులు రెండు చేతులకి ఒక్కొక్కటి ఉంచుకొని, మిగతావి తీసేయమనేది అమ్మ. ఆ తర్వాత కొత్త గాజులను మెల్లగా చేయి నొక్కుతూ మాట్లాడుతూ వేసేవాడు. ఆ రంగు రంగుల గాజులను చూసుకొని మురిసిపోయి గాజులకు దండం పెట్టుకునేది అమ్మ..
ముచ్చట పడి చిన్న సీసం గాజులు పిల్లలకందరికీ వేయించేది అపర్ణ తల్లి. అపర్ణకు కూడా ఇలాంటి గాజులు అంటే ఎంతో ఇష్టం చేతినిండా వేసుకునేది.
ఇలా అన్ని జ్ఞాపకం చేసుకుంటూ వెళ్ళసాగింది అపర్ణ. ఆ గాజుల షాపు దాటగానే వీళ్ళు వెళ్లే స్కూల్ గుర్తొచ్చింది. నాలుగేళ్ల వయసులో ఇంట్లో ఊరికే అల్లరి చేస్తారని, అపర్ణ తల్లి ఇంటి పక్కన వైష్ణవుల ఇంటికి స్కూలుకి పంపించేది.
ఆ స్కూల్లో ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకుని నవ్వుకుంది అపర్ణ.
అపర్ణ పెదవులు అప్రయత్నంగా విచ్చుకున్నాయి.
ఒక్కసారి ఆ స్కూలు తాలూకు జ్ఞాపకాలను తలుచుకుంది..
గవర్నమెంట్ స్కూల్లో చిన్న పిల్లల్ని జాయిన్ చేసుకునే వాళ్ళు కాదు. అందుకని ఇలా చిన్నచిన్న బళ్ళల్లోకి పిల్లల్ని పంపించేవారు. బడికి వెళ్లే లోపల ఓనమాలు, ఒంట్లు నేర్చుకుంటారని పెద్ద వాళ్ళ కోరిక.
అలా అపర్ణ తల్లి పిల్లలందరినీ దగ్గర్లో ఉన్న వైష్ణవుల ఇంటికి చదువుకోవడానికి పంపించేది.
అదొక చిన్న ఇల్లు. ముందర చిన్న వసారా. పక్కన ఒక చిన్న హాలు, ఒక వంటిల్లు. అందులో ఒక ఉయ్యాల ఉండేది. కొబ్బరి తాడు కట్టి కూర్చోవడానికి గోనెసంచితో జోలెలాగా తయారు చేసేవాళ్ళు.
ఇక ఇల్లంతా మట్టి నేల. కాబట్టి స్కూలుకు వచ్చేటప్పుడు ఒక గోనెసంచి తెచ్చుకోవాలి. అది వేసుకొని కూర్చోవాలి. ఆ తర్వాత వెళ్ళేటప్పుడు కొంతమంది తీసుకెళ్లేవాళ్లు. కానీ కొంతమంది అక్కడే ఉన్న గోడమీద మడత పెట్టి పెట్టుకునేవాళ్ళు.
అపర్ణ అన్న అప్పటికే పెద్ద బడిలో చదువుకుంటున్నాడు. సుధ కూడా హై స్కూల్ లోనే ఉంది. ఇక అపర్ణ అక్కా,చెల్లె తమ్ముడు తో కలిసి స్కూల్ కి వచ్చేది.
అపర్ణకు విపరీతమైన భయం ఉండేది. టీచర్ ని ఏది అడగాలన్న వాళ్ళ అక్కనే అడగాలి.
” టీచర్! టీచర్! మా చెల్లె మంచినీళ్లు తాగి వస్తుందట. ఇంటికి పంపిస్తారా! టీచర్ మా చెల్లి ఒంటేలు వెళ్లాలట పంపిస్తారా” ఇలా అన్నిటికీ అపర్ణ అక్కనే అడగాల్సి వచ్చేది. ఒక్కొక్క రోజు వాళ్ళ అక్కకి చిరాకు వచ్చి “నువ్వే అడుక్కో పో! ఎన్నిసార్లు నేను అడగాలి” అని తిట్టేది.
ఇక టీచరు స్కూల్ కి వెళ్ళగానే పలకల మీద వాళ్లకు వచ్చినవి రాయమనేది. ఆ తర్వాత పలక మీద అక్షరాలు పెట్టించి దిద్ద మని చెప్పేది. ఎంత బాగా దిద్దితే అంత మంచిది అని చెప్పేది. కానీ పిల్లలకు ఓపిక ఉంటుందా! బలపం అడ్డంగా పెట్టి అక్షరాలు లావు అయ్యేలా చేసి, ఆ తర్వాత దిక్కులు చూస్తూ కూర్చునేవాళ్లు.లేదా అల్లరి చేసే వారు.టీచర్ మడికట్టుకొని వంటింట్లో వంట చేసేది. మధ్య మధ్యలో బయటకు వచ్చి తిట్టేది. ఆ తర్వాత ఇసుక రాళ్ళ బియ్యాన్ని పలకల మీద పోసి, రాళ్ళను వేరుచెయ్యమనేది. రోజంతా చదువుకునేది ఏముంటుందని! పిల్లలకు కూడా కాలక్షేపం ఉంటుందని అలా బియ్యం ఏరించేది. పిల్లలకు భలే సరదాగా ఉండేది.
ఆ స్కూల్లో ప్రమీల అని ఒక అమ్మాయి ఉండేది. అసలు ఈ రోజుల్లో ఎంబీఏ చేసే వాళ్ళు కూడా పనికిరారేమో! అప్పట్లో అందరికీ చింత చెట్లు ఉండేవి .ఇళ్లల్లో బోలెడు చింతపండు, చింతకాయ. ఈ అమ్మాయి ఒక బాక్స్ లో చింతపండు తీసుకొని వచ్చేది.
టీచర్ లోపలికి వెళ్ళగానే, తాను చింతపండు చప్పరిస్తూ…
” కావాలా? చాలా బాగుంది తింటారా?” అంటూ వూరించేది.
చింతకాయలో చింతపండునో చూపిస్తే పిల్లలకు సహజంగా తినాలని అనిపిస్తుంది. అందరూ “నాకు కావాలి నాకు కావాలి” అని ఆ అమ్మాయి చుట్టూ చేరే వాళ్ళు.
అప్పుడు ఓ ఫిట్టింగ్ పెట్టేది. మీ దగ్గర ఉన్న బలపాలు ఇస్తే నేను చింతపండు ఇస్తా అని చెప్పేది.
చేసేదేమీ లేక అందరూ వాళ్ళ దగ్గర ఉన్న బలపాలు ఇచ్చేవాళ్ళు.బలపం సైజును బట్టి చింతపండు ముక్క చేతిలో పెట్టేది.
ఇలా ఈ తంతు కొన్నాళ్లుగా జరుగుతుంది.
ఒకరోజు ఇంట్లో పిల్లలు రోజు బలపాలు కొనడం చూసి అపర్ణ తల్లి అడిగింది..
” ఏంటి ఈ మధ్య రోజు కొత్త బలపాలు తీసుకెళ్తున్నారు? అంతకుముందు నాలుగైదు రోజులు రాసుకునే వాళ్ళు కదా! తింటున్నారా బలపాలను”? అని గట్టిగా అడిగింది.
పిల్లలు ఎవరూ ఏమీ చెప్పలేక నీళ్లు నములుతున్నారు.
అప్పుడు అపర్ణ ధైర్యం తెచ్చుకొని..
” అమ్మా! మరీ మరీ… ప్రమీల రోజు చింతపండు తీసుకొని వచ్చి, బలపాలు తీసుకొని మాకు చింతపండు ఇస్తుంది. అందుకని రోజు బలపాలు అయిపోతున్నాయి” అని చెప్పింది నసుగుతు..
” ఏంటి! ప్రమీల బలపాలకు చింతపండు అమ్ముతుందా? మీరు కొంటున్నారా? అసలు ఏమైనా బుద్ధి ఉందా మీకు…
ఇలా రండి! అంటూ ముగ్గురిని తీసుకెళ్లి ఇంట్లో ఉన్న ఘర్షఅర్ర లోకి తొంగి చూడమని చెప్పింది..
ఆ గది నిండా బోలెడు చింతపండు ఉంది..
” ఇదిగో ఈ చింతపండును ఎంత తింటారో అంత తినండి. బలపాలు ఇచ్చి చింతపండు కొనుక్కో నక్కర్లేదు. ఈ గదిలో కూర్చోబెట్టి తాళం వేస్తాను. ఈరోజు తినండి చింతపండు మొత్తం” అని గట్టిగా అరిచేసింది..
అప్పుడు అపర్ణ వాళ్లకి ఆశ్చర్యం వేసింది. “ఇంత చింతపండు ఇంట్లో ఉంది. మేము పిచ్చి వాళ్ళలాగా బలపాలు ఇచ్చి చింత పండు కొన్నాము. ఛీ ఆ ప్రమీల ఎంత మోసం చేసింది” అని తిట్టుకున్నారు..
తర్వాత అపర్ణ తల్లి స్కూలుకు వెళ్లి ఇలా జరిగింది అని చెప్తే, అప్పుడు ఆ టీచర్ ప్రమీలను బెదిరించింది కూడా…
ఇక మగ పిల్లలు బాగా అల్లరి చేసేవాళ్లు. వాళ్ళింట్లో టీచర్ గారి అబ్బాయి కూడా ఉండేవాడు. అతను జాబ్ కొరకు ప్రయత్నాలు చేస్తున్నాడు. మధ్య మధ్యలో అతను కూడా అజమాయిషీ చేసేవాడు..
మగ పిల్లలు అల్లరి చేస్తే కోదండం కూడా వేసేవాడు. లేదా బింగిళ్ళు తీయించడం అదేనండి గుంజీలు అంటారే! ఇలా ఆ బడిలో చదువుకున్న పిల్లలు ఎక్కువ జీవితం అంటే ఏంటో తెలుసుకునే వాళ్ళు. పిల్లలు అలాగే పనులు కూడా నేర్చుకునే వాళ్ళు…
టీచరు భోజనం చేసి మడి విడిచి బయటకు వచ్చి, “మీరు కూడా ఇంటికి పోయి తిని రండి” అని చెప్పి అక్కడే ఉన్న పీటబల్ల మీద పడుకునేది…
ఇంటికి వెళ్లిన పిల్లలు మెల్లగా ఆడుతూ.. పాడుతూ ఆలస్యంగానే స్కూలుకు చేరు కునేవారు..
ఇలా ఈ స్కూలు జీవితము ఒకసారి విసుగనిపించింది అపర్ణకు మరియు తన సహోదరులకు.
ఒకసారి వీళ్ళ వయసే ఉన్న ఒక చుట్టం చూపుగా వచ్చిన అబ్బాయి, వీళ్ళతో పాటు స్కూలుకు వచ్చేవాడు. అతనేం చేశాడంటే..
బడి అంటే మీకు విసుగు వస్తుంది కదా! నేను మిమ్మల్ని దాచి పెడతాను స్కూలుకు వెళ్లి మీరు ఊరికి వెళ్లారని చెప్తాను. అని చెప్పి ఒక ఇంటి ముందు దాచి పెట్టాడు.
కాసేపు కూర్చున్న పిల్లలకు..
“బడే బాగుంది.ఇక్కడ వద్దు,ఇంటికి పోదాం” అని ఇంటికి వెళ్ళారు.
తల్లి అడిగింది..
“అప్పుడే వచ్చారు”? అని..
“టీచర్ ఊరికి వెళ్ళిందమ్మా!” అని చెప్పారు.
అక్కడే ఉన్న వాళ్ళ అన్న..
“వీళ్లు అబద్ధం చెపుతున్నారు”అని అనుకుని బడికి వెళ్ళాడు.
“టీచర్ గారు మీరు ఊరికి వెళ్లారు అని మా తమ్ముడు చెల్లెలు చెప్పారు”అన్నాడు.
“అవునా మీరంతా ఊరికి వెళ్లారని మీ చుట్టాలబ్బాయి వచ్చి చెప్పి వెళ్ళాడు”అల్లరి పంతులమ్మ.
ఇంటికి వచ్చి అతను వీళ్లను బాగా తిట్టాడు.
అలా స్కూల్ జ్ఞాపకాలలో తేలిపోయిన అపర్ణ సుధ పలకరించే వరకు ఈ లోకంలోకి రాలేదు.
సుధా, అపర్ణ వసంత ఇంటికి చేరుకున్నారు.
పెళ్లి ఇల్లంతా సందడి సందడిగా ఉంది. ఆరోజు సాయంత్రమే ఫంక్షన్ హాల్ కు చేరుకోవాలి.
రెండవ రోజు కూడా దగ్గర బంధువులందరూ, వసంత కూతుర్ని పెళ్లి కూతురుగా చేశారు. మేనత్తలు ,చిన్నమ్మలు బాబాయిలు, పెద్దనాన్నలు ఇలా దగ్గర బంధువులందరూ పెళ్లికూతుర్ని చేసి వాళ్లకు తోచినది కట్నంగా ఇవ్వడం ఆనవాయితీ.
సుధా అపర్ణ లోపలికి అడుగుపెట్టగానే, వీళ్ళని చూసిన వసంత…
” సుధత్తా! బాగున్నారా? ఎన్నోసార్లు మీ ఇంటికి రావాలనుకున్నాను. ఏవో పనుల వల్ల కుదరలేదు. చిన్నప్పుడు అపర్ణ తో పాటు నాకు కూడా జడలు వేసే దానివి. స్కూల్లో అయితే అందరూ నిన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకునే వాళ్ళు. ఆ రోజుల్లోనే ఎంతో ధైర్యంగా ఉండే దానివని మా ఇంట్లో కూడా అందరూ మెచ్చుకునేవారు” అంటూ సుధను గట్టిగా కౌగిలించుకుంది వసంత.
” ఏంటే నన్ను పలకరించడం లేదు? అత్తను చూడగానే నన్ను మర్చిపోయావా” అన్నది అపర్ణ నవ్వుతూ..
” నీ మొహం! నిన్ను స్పెషల్గా పలకరించాలా? వెళ్లి అలేఖ్యకు పెళ్లిబొట్టు పెట్టి ,చీర సరి చేయి అక్కడ పర్ఫెక్ట్ గా తయారు చేసే వాళ్ళు ఎవరూ లేక బిక్క ముఖం వేసింది. వెళ్ళు తొందరగా” అన్నది వసంత అపర్ణ చూస్తూ..
” ఇలా చెప్పావు బాగుంది. వెళ్తున్న మా బంగారు తల్లిని నేను తయారు చేయకుంటే ఇంకెవరు తయారు చేస్తారు” అంటూ లోపలికి వెళ్ళింది అపర్ణ..
అప్పటికే చీర కట్టుకొని అద్దం ముందు కూర్చుంది అలేఖ్య…
” అత్తా! వచ్చారా నాకు చీర సరిగా కుదరడం లేదు. మామూలు చీరయితే పరవాలేదు కట్టుకుంటాను. పట్టుచీర కదా కుర్చీలు సరిగ్గా రావడం లేదు. కొంచెం మీరు సరి చేస్తారా”? అని అడిగింది అలేఖ్య అపర్ణను చూస్తూ..
” అందుకే వచ్చాను రా! నేను తయారు చేస్తాను కదా! నువ్వు ఇలా రా” అంటూ చీరను సరిచేసి, చక్కగా పూలజడవేసి, పెళ్లి బొట్టు పెట్టి, బుగ్గన చుక్క కళ్ళకు కాటుక, కాళ్లకు పారాణి తీర్చిదిద్దింది .
” నా దృష్టి తగిలేలా ఉంది నీకు” అంటూ అలేఖ్యను దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకుంది..
వసంత లోపలికి వచ్చి కూతురిని తీసుకొని దేవుడి గదిలోకి తీసుకెళ్లి హారతి ఇచ్చి బొట్టు పెట్టింది.
అందరూ భోజనాలు చేసి సాయంత్రం అయ్యాక అందరూ తయారయ్యారు. పెళ్లి మండపంకు అవసరమైన సామాగ్రిని అంతా ముందే పంపించారు.
చిన్న పట్టణమే కాబట్టి ఫంక్షన్ హాల్ కూడా పెద్ద దూరంగా లేదు.
ఫంక్షన్ హాల్ కి వెళ్ళిన తర్వాత కారు దిగి లోపలికి వెళ్లిన అపర్ణకి ఎంతో ఆశ్చర్యం అనిపించింది. ఈ కాలంలో ఉన్నట్టుగానే ఫంక్షన్ హాల్ ఉంటుంది అనుకుంది. కానీ చాలా సాంప్రదాయంగా, పాత పద్ధతిలో ఉంది ఫంక్షన్ హాల్. ఫంక్షన్ హాల్ అనడం కన్నా పెళ్లి పందిరి అంటే బాగుంటుందేమో! అనిపించింది.
ఓపెన్ ప్లేస్ లో చక్కగా పచ్చని ఆకు పందిళ్లు. అటు ఇటు బెదురు తడికలతో నిర్మించి దాని వైపున అంతా పూలు ఆకులతో అలంకరించారు.
వెనుక భాగంలో అన్ని గదులు ఉన్నాయి. అవి అందరికీ ఏర్పాటు చేసినవి..
ఇంకా పెళ్లి మంటపము తయారు కాలేదు. పెళ్లి తెల్లవారి ఉదయం కాబట్టి ఆ ఏర్పాట్లు చూస్తున్నారు పనివాళ్ళు…
ఇంట్లో ఏర్పాట్లు ఎలా ఉన్నాయో పెళ్లి పందిరిలో కూడా అలాగే ఉన్నాయి.
ఎదుర్కోళ్ల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు.
పెళ్ళివారికి ప్రత్యేకమైన కారుతో పాటు బస్సులు పంపించారు.
పెళ్లి వారికి ముందుగా విడిది ఏర్పాటు చేసి, వారు దిగగానే అక్కడికి వెళ్లి తయారు అయ్యి పెళ్లి మంటపానికి వచ్చేలాగా ఏర్పరిచారు.
మేళ తాళాలతో మగ పెళ్లి వారిని స్వాగతించారు ఆడపిల్ల వారు. అందరినీ ఆప్యాయంగా ఎదుర్కొని పెళ్ళికొడుకుకు పూలదండ వేసి వియ్యాలవారికి పుష్ప గుచ్చాలు అందించి చక్కని మేళతాళాలతో పెళ్లి మండపం వరకు పిల్లలంతా అందంగా నృత్యాలు చేస్తుంటే తీసుకొని వెళ్లారు. దాదాపు ఆ వేడుక గంటసేపు జరిగింది.
పందిట్లో కూర్చున్న తర్వాత ముందుగా ఆడ పిల్లవాళ్ళు వరపూజ చేసి పెళ్ళికొడుకుకు బట్టలు పెట్టి, వారి తరపు వారందరికీ తాంబూలాలిచ్చి వరుసైన వారందరూ రంగులు చల్లుకొని స్వీట్లు పంచుకున్నారు. తర్వాత మగ పెళ్లి వాళ్ళు కన్యా నిశ్చయం చేసి పట్టు బట్టలు నగలు బహుకరించి, అందరూ ఆడ పెళ్ళి వాళ్ళు ఇచ్చిన పానకం తాగి ఆసీనులయ్యారు.
అందరూ భోజనాలు చేసి పడుకున్నారు.
తెల్లవారి పెళ్ళిలో..
సశేషం

2 comments
https://shorturl.fm/4fdR1
https://shorturl.fm/BKa2d