Home పుస్త‌క స‌మీక్ష‌ డా. భీంపల్లి శ్రీకాంత్ గారి ప్రక్రియ “మొగ్గలు “

డా. భీంపల్లి శ్రీకాంత్ గారి ప్రక్రియ “మొగ్గలు “

by Uma devi

ప్రాచీనకాలం నుండీ వ్యక్తి వికాసానికి సాహిత్యం ఉపయోగం ఉందని గ్రహించిన పండితులు అట్టి సాహిత్యం కూడా వివిధ దేశకాల పరిస్థితులను బట్టి, వ్యక్తి పరమైన లింగబేధాలు, వయో పరిమితిని బట్టి వివిధ వర్గాలుగా విభజన చేశారు. మాటలు రాని వయసునుండీ, ఒకే అక్షరం పలికే రోజులవరకూ ఎదిగాక, శిశువుకి ఇంట్లో ఉన్న పెద్దలు, తల్లి చిన్ని చిన్ని పదాలు, వాక్యాలు సమాధానం ఇవన్నీ ఇంట్లోనే వారి ఆలనా పాలనా లోనే నేర్పించడం గొప్ప విషయం. ఇంకా ఇతిహాస, పురాణగ్రంథాలలోని చిన్ని పద్యాలను సూక్తులను శిశువులకి పదేపదే వల్లిoచడం ద్వారాను, పూజ లో పక్కన కూర్చొని వినేలాగాను బాలలకి సాహిత్యం అంటే కొంత రుచి చూపారు. ఉదా… ఓ బొజ్జ గణపయ్య… చేత వెన్న ముద్ద, ఏనుగమ్మా ఏనుగు వంటివి. అలాగే అక్షరాలు నేర్చుకున్న తర్వాత సుమతి, వేమన శతకాలు బట్టీ వేయించినందు వల్ల, ఆ వయసులో వాళ్ళ కి అర్ధం కాకున్నా, కొన్నేళ్ల తర్వాత వాటి సారాంశం మనసులో నిలబడే ఉండడం జరిగింది.నేటి బాలల గురించి కవుల భావనలు మొగ్గలు రూపంలో శ్రీ కాంత్ గారు వ్రాయించి సంకలనం వేశారు. ఇతర ప్రక్రియలైన కైతికాలు, ఇష్టపదులు,సమ్మోహనం,తేనియలు వంటి వాటిలో ఇలాంటి ప్రయత్నం జరిగితే బాగుంటుంది. బాలల కోసం ప్రత్యేక సాహిత్యం ఉండాలి. అది వాళ్ళ సహజత్వాన్ని అవతల పెట్టకుండా రూపుదిద్దుకోవాలి. మళ్ళీ పిల్లలకోసం వ్రాసే సాహిత్యం, పిల్లలగురించి పెద్దలు వ్రాసింది అనే రెండు విభాగాల్లో పిల్లలగురించి పెద్దలు వ్రాసిన ఈ బాలల మొగ్గలు ఒక ప్రయత్నం.

కోట్లాది బాలలతో కొలువుదీరిన నవభారతంలో బాలల మనో వికాసానికి, విద్యావకాశాలకు జరుగుతున్న కృషిలో ఉపాధ్యాయపాత్ర కీలకమైనది. అదే విధంగా వారి  చైతన్యమూ భావ వ్యక్తీరణకోసమే కొంత కవిత్వం కూడా అవసరం. భాషని అభివృద్ధి చేస్తూనే ఆహ్లాదం కలిగించే కవిత్వం గా బాలల మొగ్గలు సంకలనం డా. భీం పల్లి శ్రీకాంత్ గారి సంకల్పంగా వెలువడి అమితాదరణ పొందినది. ఈ పుస్తకం లో సీనియర్,  వర్ధమాన కవులకలంలో రూపొందిన మొగ్గలు వివిధ భావనావర్ణాలతో కవనవనంలో  విరిశాయి. నేటి నిజం పత్రిక సంపాదకులు శ్రీ బైసదేవదాసు గారు ఈ బాలల మొగ్గలను తమ పత్రిక లో ప్రచురించి ప్రోత్సహించడంతో బాటూ, బాల్యం గురించి, నేటి బాలల దుస్థితి గురించి చక్కని ముందు మాటలపరిమళం అందించి పుస్తకానికి మరింత వన్నె తెచ్చారు. డా. శ్రీకాంత్ గారి సంకల్పo నెరవేరింది. బాలల భవిష్యత్ పసిడిదారుల్లో సాగాలనే వారి కోరిక అభినందనీయం. 
శ్రీకాంత్

విరిసిన బాల్యం మొగ్గలు

“కల్మషంలేని కర్మయోగులవుతూనే
స్వార్ధమసలేలేని సాధుజీవులు వాళ్ళు !
స్వచ్ఛమనసు కలిగినవారు బాలలు !”
సిద్ధాంతపు ప్రభాకరాచార్యులు గారి మొదటి మొగ్గలోనే పిల్లల స్వభావం ఆవిష్కరణ చేశారు.

” నీటిచుక్క ముత్యపుచిప్పలో పడినట్లు
బాలలు మంచిపెంపకంలో పెరగాలి
కల్మషంలేనివారు ఎప్పటికీ బాలలే ! “
ఆర్. చెన్నయ్య, పాలమూరు .. గారి భావన అక్షరసత్యమే !పెద్దల్లోనూ చిన్నపిల్లలతత్వం సమాజహితం !

” నిరంతరం అమ్మనీడలో మసలుతూనే
అనుభవమహోన్నతను చాటుతారు
బాలలు సత్యాన్వేషక పరిశోధకులు ! “
కపిలవాయి వెంకటేశ్వర్లు గారి కవితాభిప్రాయం సర్వజన మోదం

“బాలలు విరిసే సిరిమల్లెలవుతూనే
నింగిలో మెరిసే తారకలవుతారు
దేశభవితకు దిక్సూచి చిన్నారులు !”
విజయనగరం కవయిత్రి మానాప్రగడ సాహితీ వ్రాసిన మొగ్గలు బాలచైతన్య దృశ్యాలు చూపుతాయి.

” తెల్లకాగితమంటి తమ మనసుల్లో
గురువులు చెప్పిందే వేదంగా లిఖిస్తారు
నమ్మకపు వాకిట్లో రంగవల్లులు బాలలు ! “
అయిత అనిత, జగిత్యాల నుండి కవితాత్మకమైన మొగ్గలు మనసుని ఆకట్టుకుంటాయి.

సునీత బండారు గారి మొగ్గలు వాస్తవచిత్రాన్ని మనకు చూపుతున్నాయి.. మరి కర్తవ్య బోధననూ చేస్తూ…
” గలగలమని నవ్వాల్సిన చిన్నారులు
గల్లీ గల్లీనా చాకిరీలతో బ్రతుకీడుస్తున్నారు
బాల్యం రుచితెలియని దురదృష్టవంతులు బాలలు ! “

అలాగే, ఏడెల్లి రాములు గారూ,
” అమ్మ చంకన ఒదిగిన నెలవంకలౌతూనే
నల్లపలకలపై మెరిసే ఓంకారాలవుతారు
బాల్యానికి ఓం కారమే తొలి గురువు ! “
అని గంట కొట్టినట్టు చెప్పేసారు తమ మొగ్గలలో.

” బుడిబుడి అడుగులేసే బుజ్జాయిలు
ప్రపంచాన్ని పరికింపజేస్తారు
బాలలు ప్రగతికి రథచక్రాలు ! “
అంటారు టి. అంబుజ, పాలమూరు.

డా. భీంపల్లి అభిప్రాయం మొగ్గలుగా…
” పిల్లలు పరిమళాల్ని వెదజల్లే మొగ్గలవుతూనే
పువ్వుల్లా వికసించే మకరందాలవుతారు
పిల్లలు ఎన్నటికీ తడిఆరని గంధపుచెక్కలు ! “
అంటూ చిక్కని భావనలందించారు !

నెల్లూరు కవయిత్రి ఎం. వి. ఉమాదేవి భావనలో…,
“బాలల పొరబాట్లను ఓర్పుగా దిద్దుతూనే
భవితకు బంగారుబాటలు వేయాలి
బాల్యశిలకు కన్నవారే మంచిశిల్పులు !”
అంటూ మొగ్గలరూపునిచ్చారు.

” ఇసుకగూళ్ళు కట్టుకున్న బాల్యమే
నేడు మట్టిపాలు అవుతున్నది
కేరింతలతో అల్లరి చేసేది బాల్యం ! “
అంటారు సముద్రాల శ్రీదేవి ఆవేదన గా.

   " కల్మషం ఎరుగని మనసులతో 

కలకాలం నీతితో బ్రతుకుతారు
సహృదయం ప్రతిరూపం పిల్లలు ! “
అంటున్నారు యం. డి. సనా అర్షిన్, జోగులాంబ గద్వాల్ జిల్లా కవయిత్రి,విద్యార్థిని.

పగిడిపల్లి సురేందర్ పూసల వ్రాసిన మొగ్గలు,
” చిన్నచిన్న ఆలోచనలను మొలకెత్తించి
మహావృక్షంగా నిలిచే అవిశ్రాంత కలువలు
విజ్ఞాన సముపార్జనకి నిఘంటువు ముత్యాలు !”

ఇలా ఇంకా సత్యనీలిమ, బొమ్ము విమల, కమ్మరి శిరీష, బోల యాదయ్య, ఉప్పరి తిరుమలేష్, పులి జమున, డా. బాదేపల్లి వెంకటయ్య గౌడ్,రవి చంచల, గాండ్ల వీరమణి, రమాదేవి బాలబోయిన, అనుపటి హేమలత, బర్మ శశాంక్, తదితర కవులు మనోహరమైన మొగ్గలలో బాల్యం ఆవిష్కరణ చేసి అలరించారు. బాల సాహిత్యంలో మొగ్గలనూ ప్రవేశపెట్టిన డా భీంపల్లి గారికి అభినందనలు తెలుపుతూ, వారినుండి మరిన్ని మొగ్గలు సంకలనాలుగా రావాలని అభిలాషతో…

.. ఎం. వి. ఉమాదేవి. నెల్లూరు
3-5-2022
7842368534

ప్రతులకు
డా. భీంపల్లి శ్రీకాంత్
8- 5- 38, టీచర్స్ కాలనీ
మహబూబ్ నగర్ -509001
9032844017

You may also like

Leave a Comment