Home పుస్త‌క స‌మీక్ష‌ తెలంగాణ తేజోరూపం

తెలంగాణ తేజోరూపం

by vanaparti padma

నిర్థిష్ఠ లక్ష్యంగా సాహిత్యపు విలువలతో నిరంతర కవిగా మృత్యుపర్యంతం తెలుగు కవితా ప్రపంచంలో వెలుగొందిన అగ్రగణ్యులు సి.నా.రె గారు.  గేయం పద్యం, సంగీత రూపకం, కథాకావ్యం, కావ్యేతీహాసం, వచనకవిత్వం, గజల్‌, పాట నాటిక, వ్యాసం, పరిశోధన, సంభాషణా రచన, విద్యబోధన, వ్యాఖ్యానం, ఉపన్యాసం వంటి అనేక ప్రక్రియలలో ఆరితేరిన సాహిత్య ధీరుడు. తెలుగు సాహిత్యంపై తనదైన ముద్రను మిగిల్చి వెళ్లిన మానవీయకవి సి.నారాయణ రెడ్డి గారు.  మేరు శిఖరం లాంటి సినారె జన్మదినం సందర్భంగా తిరునగరి శ్రీనివాస్‌ గారి సంపాదకత్వంలో ‘‘కవితా విశ్వంభరుడు’’ అనే కవితా సంకలనం వెలువడించారు.  ఇందులో 71 మంది కవుల కవితా నీరాజనాల సమహారంగా తరతరాలకు ఆదర్శంగా అక్షర పుష్పాల పరిమళంగా నిలుస్తుంది. తిరునగరి శ్రీనివాస్‌ గారు కవి, రచయిత, మరియు జర్నలిస్టు కావడంతో పాటు నారాయణ రెడ్డి గారికి ఆప్తుడు కూడా అతి సమీపంగా ఉండి వారి రచనశైలిని కొంత ఆకళింపు చేసుకున్నారు.  కాబట్టి సి.నా.రె. కవిత్వం, గజళ్ళు, పాటలపై వచ్చిన రచన పై కూడ తనదైన శైలిలో విశ్లేషణ చేస్తూ ‘‘జ్ఞానవీచికలు’’ సాహిత్య విమర్శా వ్యాసాలు అనే పుస్తకం కూడా సి.నా.రె జన్మదినం సందర్భంగా ఆవిష్కరించి, గురుభక్తిని చాటుకున్నారు.  ‘‘కవితా విశ్వంభరుడు’’ కవితా సంకలనం, మరియు ‘‘జ్ఞానవిచీకలు’’ వ్యాససంపుటి రెండు పుస్తకములు కూడా నేటి తరానికి, మరో తరానికి అధ్యయనం, పరిశోధనకు ఉపయుక్తంగా వుంటాయనేది అక్షర సత్యం.  ‘‘విశ్వంభరుడు’’ అక్షరాలతో నిరాజనం పట్టిన కవుల అక్షర లక్షల అణిముత్యాల వంటి కవితలను విశ్లేషించుకుందాం…

అక్షరనాదాల్ని పలికించిన విజ్ఞాని / గుండెనిండా విశ్వంభరా తత్వంతో / ఎన్నో అనుభూతుల క్షేత్ర బంధం / అలలెత్తిన మానవత్వం / ‘యశస్వి’ సి.నా.రె. అంటూ వారి జీవితపు సాహితి ప్రస్తావాన్ని వివరించారు.  ‘‘చిత్రం… హాయి భళారే విచిత్రం’’గా మదిలో మీ జ్ఞాపకాలు నింపి / కానరాని లోకానికి ఎలా వెళ్లారు / ‘‘విశ్వంభర’’ తో జ్ఞానపీఠాన్ని అదిరోహించి మీరు ఇంద్రుడి పీఠాన్ని అధిరోహించటానికి వెళ్లారా / అంటు మదినిండ అక్షరాలు నింపిన జ్ఞాపకాలతో జీవిస్తాము అంటూ మనోవేధనను వ్యక్తం చేశారు.

శబ్దసౌందర్యాలు సైనిక కవాతులై సాగేవి / పొద్దును పాట చేసి / భూగోళమంతా భూపాలరాగమైన వెన్నెలపాట / సర్వసామాన్యుడు / బహుముఖీన ప్రతిభా ప్రభాతుడు అంటు ‘‘వనపట్ల సుబ్బయ్య’’ వెన్నెల పాటగా కవిత్వీకరించారు.  ‘‘ఆయన ఈ అనంతమైన / సాహిత్య వెలిగే జ్యోతి / ఆసాంఘిక శక్తులపై ఉరిమిన ‘‘మహద్యుతి’’ అంటారు మౌనశ్రీ మల్లిక్‌.  మలి జ్ఞానపీఠ విశ్వంభరుడా ‘‘మాకు దూరమై మీ… పెన్నుమూ ‘‘సి.నా.రె’’! అంటూ తను లేడనే నిజాన్ని జీర్ణించుకోలేని డా॥ అమ్మిన శ్రీనివాసరాజు గారి వ్యధ నే మూడక్షరాలు.  ‘‘పద్మభూషణంతో, జ్ఞానపీఠంలో నింగికెగసినారె నిత్యమయినారె / ధృవతారగా నిలిచిపోయినారె అంటు డా॥ రామకృష్ణమూర్తి గారు సి.నా.రె. ను చిరంజీవిగా చేశారు.  ‘వగలరాణివినీవే’ నంటూ అక్షరాన్ని వంపులు త్రిప్పిన సముద్రుడు / ‘మబ్బులో ఏముందని’ అంటునే ఆ చోటికే తరలిపోయిన తపస్వి / ‘‘అభినందన మందరామాలలు’’ ఎన్ని వేసిన సరిపోవు అంటు ‘‘పాటల రారాజు’’గా మల్చినారు.  యలమర్తి అనూరాధ ‘‘కృష్ణవేణి నడకలా… సాగించిన సృజనకారుడు!’’ / తెలుగు పదాలను కర్పూరం / వసంత రాయలకు కావ్యమల్లిన / కవి శిఖమణి సి.నా.రె. అంటారు.  ‘‘కిలపర్తి దాలినాయుడు’’

‘‘గలగలపారే జలపాతమై / ధీర, గంభీర వీరతలతో / సాహితీ సీమను అలరింప చేసిన మహకవి, మహోన్నత కవికి వందనం చేశారు.  ‘‘కవిసార్వబౌముడు’’ అనే శీర్షిక ద్వారా శనిగరపు రాజమోహన్‌ ‘‘పేదలకన్నీటిలో తడిసిన కష్టం / పెద్దల పెదాలతో పలికిన జీవిత సత్యం ఆయన కవిత్వం’’ అంటూ సి.నా.రె. పదాల అల్లికను చెప్పారు.  డా. గంజి భాగ్యలక్ష్మి, ‘‘అతడొక సాహితి యుద్దనౌక / ఎడారిలో సైతం పయనించే శక్తి / సాహితి లోకానికే ఆయనొక స్ఫూర్తి’’ అంటారు టి.వి. అశోక్‌ కుమార్‌.  ‘‘తెలంగాణ అక్షరకీర్తి, కిరీటం, కవితా తపస్వినిత్య ప్రగతిశీలి, అభ్యుదయవాది, మానవతామూర్తి, కవితా జాతిరత్నం’’ అంటూ సి.నా.రె. గారి కీర్తిని అక్షర శిఖరాల్లో నిల్పినారు ఎల్గటి తిరుపతిరెడ్డి. ‘‘అభినందన మందార విశ్వంభర సాహితి సారంగధర సినారె… దివికేగిన గేయతార తెలుగు కావ్యధార అజరామర సినారె… అంటూ కవి ఎపుడు అమరుడె అన్నట్లు గుమ్మడి రామలక్ష్మి తన కలం ద్వారా వెల్లడిరచారు.  ‘‘సాహిత్య సమరంలో గెలిచి నిలిచిన అక్షర తపస్వి / విశ్వజనీనతకు నిదర్శనం / మన తెలుగు వెలుగుల తేజం సి.నా.రె అంటూ సాహిత్య జగత్తులో అక్షరాలను నక్షత్రాలుగా మల్చిన తేజో రూపం సి.నా.రె వారు ప్రతిభకు పట్టంకట్టారు వనపర్తి పద్మావతి.  మాతృభాష సినారె / మధుర కవిత సినారె / మహిలోపల వెలిసినట్టి / మహాకవి సినారె అని ‘‘మణిపూసలు’’ గా మల్చారు వడిచర్ల సత్యం.  సినీ జగత్తు నీ పాటకు దాసోహం అంది, కర్పూర వసంత రాయల్ని పలకరించినా, నాగార్జున సాగరాన్ని తాకిని నీ మాటల ప్రతిధ్వని మనసును తాకుతుంది.  మహాకవి ప్రణామం అంటాడు కందుల శివకృష్ణ సాహిత్యపు బాటసారి… శీర్షికతో.

‘‘తెలుగు భాషా దురంధురుడు / సాహితి విశ్వంభరుడు / మీగజల్స్‌ అద్భుతాలు భళారే / మిమ్మల్ని ఎప్పటికి మరువలేరే సినారె అందుకోండి మా జోహారే అని అద్దేపల్లి జ్యోతి సినారె గారికి ‘పరిపూర్ణుడు’ అంటు జోహార్లు అర్పించారు.  ‘‘సినిరంగాన్ని ఉర్రూతలూగించి మెరిసిన వెండి తెరధృవతార / వివిధ రంగాల్లో ప్రతిభను చూపి చెరగని ముద్ర వేసిన గురువుకు నా కవితా సుమాంజలి అని డా. చీదెళ్ల సీతాలక్ష్మి అక్షరసుమాలు అర్పించారు.  ‘‘ఓ పద్మశ్రీ… నీకలం పగలే వెన్నెలను, వెన్నెలలోని చల్లదనాన్నే కాక సాగర ఘషను వినిపించింది’’ అని విశ్వకవికి వందనం… అంటారు లింగాల రజని. ‘‘ఆ కలం నడక అమృత వర్షం / ఆ గళం సాహితీ పరవశం / ఆ  స్నేహం పుస్తకాల పరిమళం’’ ‘‘మీ బాటలోనే’’ మేము అంటారు ఉండ్రాళ్ళ రాజేశం. ‘‘చిరంజీవిగా చరితార్థులు సినారె / తెలుగు సాహిత్యాంబరంలో / శోభాయ మానంగా వెలిగె స్మరణీయ నారాయణ ధృవతారమీరె’’ ధృవతారగా వెలుగొంది సాహితి లోకానికి వెలుగులు పంచాలనే ఆశ మనోహర్‌ రెడ్డి గంటా.  మరెందరో కవులు, కవయిత్రులు, వ్యధతోను, గౌరవంతోను, ఆవేధనతోను ఓ మహామేరు పర్వతమే సాహితిలోకాన్ని విడిచింది అని తెల్సినప్పటికి కవుల కలంగళం ఎప్పటికి సినారెగార్ని తమవెంట ఉన్నట్లుగానే భావిస్తున్నారు.  సినారె గారు మన మధ్య లేకపోవచ్చు కాని వారు రాసిన కవిత్వం సిని గేయాలు, గజళ్ళు, అన్ని కూడా సాహితి వినిలాకాశంలో ఉన్నంత వరకు సినారె అజరామరుడు.  చిరంజీవి అంటు నీరాజానాలు అర్పిస్తు విశ్వంభరుడుని విశ్వవ్యాప్తం చేశారు.

తిరునగరి శ్రీనివాస్‌ కలం నుండి జాలువారిన మరో పుస్తకము ‘‘జ్ఞాన వీచిక’’ సాహిత్య విమర్శా వ్యాసాలు ఇందులో 25 వ్యాసాలు ఉన్నాయి.  సాహిత్యాన్ని మలుపులు తిప్పిన ప్రయెగశీలి సినారె గారు.  ‘‘వాక్కుకు వయస్సు లేదని’’ ప్రవచించిన సాహిత్యాన్వేషి, ‘నవ్వనిపువ్వు’ మొదలుకొని, ‘‘నా రణం మరణంపైనే’’ వరకు 86 గ్రంథాలను రాసిన నిలువెత్తు తెలుగు సాహిత్య సాక్ష్యం.  అనుభూతి కేంద్రం ఆయన కవిత్వం.  విభిన్నసాహిత్య తాత్విక కోణాలను శోధించిన సమగ్ర పరిశోధన సినారె రచనలు అలాంటి రచనల పై సాహిత్య విమర్శా వ్యాసాలను అక్షరాలక్షలను ప్రోది చేసి భావితరాలు సులభ శైలిలో తన కలం ద్వారా ‘జ్ఞానవీచిక’ అందించారు రచయిత శ్రీనివాస్‌.

1931 జులై 29 నుండి 12 జూన్‌ 2017 వరకు నిర్ఠిష్ట లక్ష్యంతో సాహిత్యపున విలువలతో ‘‘నిరంతరకవి’’గా తెలుగు కవితా ప్రపంచంలో వెలుగొందిన అగ్రగణ్యులు కవిత్వమే చిరునామా, శ్వాసగా మార్చుకున్న నిరంతర బాటసారి సాహితీ ఉన్నత శిఖరం సినారె.  ‘వాక్కుకు వయస్సు’ లేదన్న సాహిత్యాన్వేషి, ‘నవ్వని పువ్వు’ మొదలుకొని ‘‘నా రణం మరణం పైనే’’ అంటూ 86 గ్రంథాలను రచన చేసి మధుర కవితాక్షర జలపాతాలను పొంగించారు.  ‘‘నడక నా తల్లి పరుగు నా తండ్రి సమత నా భాష’’ అన్న కవితా వారి ప్రతిభా సమ్మేళనానికి నిదర్శనం.  ‘‘చిన్న నాటి మురిపెం ఇప్పటికి నా గుండె గూటిలో పదిలంగా ఉంది’’ అంటూ హృదయ నేత్రాలలో దివ్యత్వంగా బాల్యాన్ని దాచుకున్నారు.  చైతన్యం రంగరించుకున్న రవి లాంటి కవి సినారె తెలుగు భాష ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన సాహితీ చైతన్య దీపం.

సాహిత్య ప్రపంచంలో ఓ అపూర్వ ప్రయోగంగా నిలిచింది.  ‘ప్ర’ పంచపదులు, భావపరిణతికి, చందోవైవిద్యానికి పరాకాష్టగా నిలిచి వెలిగింది ఈ కావ్యం.  ‘ప్ర’పంచపదులు అన్న కూర్పులో అనేక అర్థాలున్నాయి.  ‘ప్రపంచించి’ చెప్పడం అంటే ‘విస్తరించి చెప్పడం’ అని అర్థం.  ‘ప్రపంచ’ అని కలుపుకుంటే లోకతత్వాన్ని బట్టి చెప్పిన పదాలని తెలుస్తుంది.  మానవ సమాజ పరిణామతత్వానికి సినారె అందించిన నిరంతర మూల్యాంకన ఫలితమే ‘‘ప్ర’’పంచపదులన్నది అక్షరాక్షర సత్యం, మానవ సమాజాన్ని విశ్లేషించిన సినారె మహత్తర హృదయావిష్కరణే ‘ప్ర’పంచ పదులు అంటూ విశ్లేషించారు  రచయిత.

‘‘ఒళ్ళంతా కన్నీళ్ళయిన జీవితం’’ పట్ల కనబరిచిన ఆర్తినారాయణ రెడ్డి కవితా వ్యక్తిత్వాన్ని కళ్ళకు కట్టినట్లు చూపారు.  40సం॥ సినారె కవితా కృషికి సంకేతంగా ‘ది బెస్ట్‌’ అనే ఉద్దేశ్యంతో కాకుండ ‘ఆల్‌ ఆర్‌ ది బెస్ట్‌’ అనుకున్న కవితలను ఎంపిక చేసి ‘నిరంతరం’ను ప్రచురించారు.  ‘‘తరం మారుతుంది ` ఆ స్వరం మారుతున్నది / వందేమాతరం గీతం వరుస మారుతున్నది’’ అనే కవితలో అభివృద్ధి వైపుగా కనబరుస్తున్న నిర్లిప్తత, నిర్లాక్ష్యాన్ని ఎండగడుతూ చిదిమి వేసినా వదలని చీడ అంటుకుని ముసి, ముసినవ్వుల మాటున విషం మరుగుతున్నదని వేదన చెందారు.  ‘‘కాలం ఇసుకలో దిగబడ్డ కాళ్ళను పెరుక్కుంటూ వేళ్ళమీద నడుస్తున్న మాతృభారతిని ‘జాగ్రత్త  సుమా అంటూ ముందు జాగ్రత్త చెప్పారు.  ‘‘ఆకలేస్తే వీధి దోసిలి / ఆగ్రహిసై వీధి పిడికిలి’ అంటూ నిన్ను నిన్నుగా నిలిపి భుజం తట్టే మహాభోధి వీధి’ అంటారు.  శబ్దశక్తితో కూడిన హృదయ స్పందనలకు చైతన్యాన్ని రంగరించి నిరంతరం కవిత్వాన్ని అజేయంగా, ఆప్రతిహతంగా సినారె గారు ఆవిష్కరించారు.

ప్రౌడ నిర్భరవయః పరిపాకంలో ప్రచురించిన కవితాసంపుటి ‘వ్యక్తిత్వం’ 69వ జన్మదినంన వెలుబడిన ఈకృతిలోని కవితల్లో సినారె క్రాంత దర్శిత్వం ప్రస్ఫుటించడం ప్రత్యేక విశేషం, అత్యాధునికుడుగా సృజన చేసిన ప్రతిభాశాలి ‘వ్యక్తిత్వం’ సంపుటిలోని ప్రతికవితా నవనవో న్మేషమైందె అనడంలో సందేహం లేదు.  ‘‘గుండెకు నిప్పంటుకుంది అర్పడానికి నా దగ్గం కన్నీళ్ళు లేవు’’ అనే పంక్తుల్లో సమాజంలో ఒక గుండె బాధతో రగులుతున్నపుడు సానుభూతీదయాచూపలేని కఠినాత్ములను మెత్తగా మందలించిన తీరు బాగుంది అంటారు వ్యాసకర్త శ్రీనివాస్‌.

సినారె వెలువరించిన అత్యాధునిక, ఆలోచనాత్మక కవితా సంపుటి ‘‘కవితావ్యక్తిత్వం’’ వర్తమాన పరిస్థితుల మధ్య సినారె ఎగురవేసిన మానవీయపతాకం ‘వ్యక్తిత్వం’

‘‘ప్రకృతిలోని చలనశీలానికి పరిణామం మనిషి / జగతిలోని భ్రమణ గుణానికి ప్రతిరూపం మనిషి అనే మానవతా వాదాన్ని మకుటాయమానం చేసుకున్నారు.  ఐదు ప్రకరణాల సమగ్రకావ్యం 1980లో ‘‘విశ్వంభర’’గా మానవ  పురోగమనశీలితకు నడకలు నేర్పిన కావ్యంగా ప్రచురితమై జ్ఞానపీఠపై నిలిచింది సినారె గారి రచనాశిల్పం.  మానవత్తత్వం, అలంకార ఔచిత్యం కల్పనం, శబ్ధ, ఉదాత్తభావమై సమనిష్పత్తిలో కలిసి హృదjైుక, వేద్యమైన ప్రతికాత్మక కావ్యం ‘విశ్వంభర’ జ్ఞాన బీజమే విశ్వంభరాభ్రమణానికి శాశ్వతచైతన్య తేజమై నిలిచింది.  నాయకుడైన మానవునికి విశాల విశ్వంభరనే జీవన రంగస్థలంగా మలిచి చూపిన మహాకావ్యమైంది ‘‘విశ్వంభర’’

చిరకాలం స్మృతిపదంలో నిలిచే  మనోజ్ఞ కళాఖండాలుగా కథాకావ్యాలను మలిచాడు.  సి.నా.రె.  ‘‘జాతిరత్నం’’ ‘‘విశ్వనాథనాయుడు’’ కర్పూర వసంత రాయలు, ‘‘సప్నభంగం’’ ‘‘నాగార్జున సాగరం’’ లాంటి రచనా వైచిత్రిని అనుభూతుల దృశ్య పరంపరలను కళ్ళముందు నిలుపుతాయి.  ఉదయం నా హృదయం మధునం, విశ్వగీతి, భూమిక, సమదర్శనం, మావూరు మాట్లాడిరది, ముఖాముఖి సమీక్షణం, రామప్ప, గాంధీయం, మీరాబాయి, శిఖరాలు, లోయలు, ముత్యాలకోకిల, మందార మకరందాలు, మట్టిమనిషి, ఆకాశం, నిరంతరం, విశ్వంభర వంటి కావ్యాలలో అనవరతంగా పరిజ్ఞాణంతో సాగిన సినారె రచనా ప్రయాణపు మలుపులు, మార్పులు, వారు ఇచ్చిన తీర్పులు పరిశోధనాత్మక విమర్శకు, విశ్లేషణలకు ద్వారాలు తెరిచాయి.  కవిత్వాన్ని గుబాళింపచేసే లక్షణాన్ని పుష్కలంగా కలిగిన కవి కావున కవిత్వమే సినారెకు శ్వాసగా మాతృభాషగా మారింది.

అంత్యప్రాస, పూర్వాంత్యప్రాస నియతితో ఫారసీ, ఊర్ధూకవితలోని రదీప్‌, ఖాసియా చందస్సులో ‘తెలుగు గజళ్లను’ సృజించి విస్తృతంగా ప్రాచుర్యంలోకి తీసుకవచ్చారు సినారె గజల్‌పల్లవి ‘మత్లా’చరణం ‘ముక్తా’ కవినామముద్ర ‘తఖల్లుస్‌’, నారాయణరెడ్డి గజళ్లలో తఖల్లుస్‌ ‘సినారె’’ తన సతీమణి సుశీలా నారాయణ రెడ్డి స్మృతిలో ప్రఖ్యాతమై విఖ్యాతిపొందిన తెలుగు గజళ్లనెన్నింటినో రచించి స్వరకల్పన చేసి స్వయంగా గానం చేశారు. ‘అమ్మ’ లాంటి వాళ్లమ్మాయి ‘గంగ’కు తన గజళ్లను అంకితమిచ్చారు.  35 గజల్‌ను ‘‘సినారె గజల్స్‌’’ పేరిట పుస్తకంగా వెలువరించారు.  అంతకు ముందే ‘తెలుగు గజల్‌లు’ కూడా ఆయన లేఖిని నుండి వచ్చాయి.  ‘మత్లా’ మొదులుకొని ‘మక్తా’ వరకు అన్ని పాదాల్లో మాత్రా సంఖ్యాసమత్వాన్ని పాటిస్తూ ‘కాఫియా’ స్వరూపంలో స్వేచ్ఛ తీసుకుంటు గజళ్లలో కూడా యతి నియతిని పాటిస్తూ సినారె గజల్స్‌కి పరిపూర్ణత తీసుకవచ్చారు.

ఆచార్య సినారె ప్రతినిత్యం నడకలో సహచరుల పలకరింతలకు బదులు పలుకుతూనే మనసులో పంక్తుల అట్లుకుంటూ చెప్పగా వెలుబడిన ‘ద్విపదులు’ ‘కలం సాక్షిగా’ పేరుతో 1995 సం॥లో ప్రచురించబడ్డాయి.  చతురస్ర, మిశ్రతిస్ర గతులలో సాగిన ఈ ద్విపదులు నడకలో జనించిన ముత్యాలుగా, మనసుకు అద్దం పట్టిన మౌలిక సత్యాలుగా అభివర్ణించారు. కత్తిరిస్తేనే మొక్కలు కొత్తగా చిగురు పెడతాయని చెప్పిన సినారె బీజం చిన్నదైనా దిక్కులను కాపాడె దిక్కయ్యే పచ్చని చెట్టుని ప్రసవిస్తుందని సూచించారు.  ‘కరగని జీవన నిధులు’’గా నారాయణ రెడ్డి ద్విపదులుగా భాసించాయి.  ‘‘ఊపిరిగాడ్పులు చెలరేగుతున్నాయి / ఉరికే రోజులతో చేయి కలిపి నా మనసు పరుగులు తీస్తున్నది / పరిసరాల ప్రశంసలతో… ముంచేస్తున్నవి.  అనే ఉరికే రోజులు ` సినారె చివరి ప్రచురిత కవిత ‘‘మన తెలంగాణ’’ దిన పత్రిక ` కలం పేజీలు 12/6/2017 లో అచ్చు రూపంలో ఉంది.  ‘‘చెక్కనిదేశిల కడుపున శిల్పమెలా పుడుతుంది / మరగనిదే నీరు ఎలామబ్బు రూపుకడుతుంది / నలగనిదే అడుగు ఎలానటన రక్తి కడుతుంది’’ అన్న సినారె మరణం సాహిత్య ప్రపంచానికి, సాంస్కృతిక వైభవానికి ఎంతో లోటును మిగిల్చింది.

‘‘సంకల్పం అచంచలంగా వుంటే / ఈదగలిగే చేతులకు సముద్రాలు లొంగిపోతాయి’’ అనే ధీమాను వ్యక్త పరుస్తూ 116 కవితలతో తన 86వ జన్మదినోత్సవ సందర్భాంగా సినారె గారు ‘‘నా రణం మరణం పైనే’’ అన్న కవితల సంపుటిని వినూత్న వస్తు వైవిద్యం, భావవైశిష్ట్యం, శిఖరస్థాయిలో అభివ్యక్తిని సంతరించుకున్న కవితలను ఈ సంపుటిలో చేర్చారు.  ‘‘తొలి ఊపిరి జననం, తుది ఊపిరి మరణం’’ అని తెలిసిన ప్రాణికి కరిగిపోయిన జీవనకాలంలో తాను మిగిల్చిన పునాదులే మరణానంతర సజీవత్వాన్ని ఆపాదిస్తాయని అ ంటారు.  మరణాన్ని జయించే దైర్యపు ధీరతనే జీవిత వృక్షాన్ని అక్షయంగా నిలుపుతుందన్న ఆశావాహ దృక్పథాన్ని నారాయణ రెడ్డి గారు వ్యక్తం చేశారు.  పరిపక్వఫలభరితమై తరుదశకు చేరుకుని అన్నీ తట్టుకుని నిలబడే మనుగడల జీవిత వృక్షాన్ని కాంక్షించారు.  వారి వారసులుగా మనం సాగుదాము అంటూ తిరునగరి శ్రీనివాస్‌ వారి వ్యాసాల ద్వారా తెలిపారు.  ఈ సాహిత్య విమర్శా వ్యాసాలు భావితరాలకు పరిశోధనకు నాందిపలుకుతాయని భావిస్తున్నాము.

‘‘చినుకును రమ్మని చిటికేశాను అది జల్లై వచ్చి కురిసిపోయింది చిగురును చేత్తో నిమిరి చూశాను అది నూరు రేకుల పువ్వై విచ్చుకుంది.  తారను ధగధగ వెలిగిపో అన్నాను, అది మధ్యాహ్న సూర్యబింబంలా ఉజ్వలించింది’’ అనే పంక్తుల్లో ప్రకృతిలో మనిషి మమెకమైతే సంపదలను ఇస్తుంది.  ఆదే ప్రకృతిని విధ్వంసం చేస్తే కల్లోలం సృష్టింస్తుంది.  వ్యక్తి నీతిగా, న్యాయంగా, నిస్వార్థంగా మానవతా దృష్టిలో తోటి వారిని ఆదుకోవాలనే సమన్యాయం వీరి రచనల్లో ఉన్నాయి.  ఓ మేరుపర్వతం లాంటి భావకుడు స్పర్శించిన అక్షర జ్ఞానం మనకిచ్చిన అక్షర వరాలుగా భావిస్తూ ఆదర్శవంతమైన, సాహితి విలువలతో కూడిన రచనలు చేయటానికి ఆదర్శనీయులు మన ఆచార్య సి.నారాయణ రెడ్డి అంటారు శ్రీనివాస్‌ తిరునగరి.

 

You may also like

Leave a Comment