అభిసారిక

by K. Madhuri

అమ్మ డైరీలో కొన్ని పేజీలు నవల రచయిత రవిమంత్రి గారు..
పేరు లో మంత్రి ఉన్నా, రచయితగా రారాజు స్థానాన్ని చేరుకున్నారు ఈ రచన తో..
అమ్మ డైరీలో కొన్ని పేజీలు మీ నవలకు మనస్ఫూర్తిగా
అభినందనలు..శుభాకాంక్షలు..

ఈ పుస్తకం చదవడం కోసం ఎన్నిరోజులుగా వేచి ఉన్నానో,.. చదివాక అనిపించింది వర్త్ వర్మ వర్త్ (వర్త్ ఫర్ వెయిటింగ్) .
నాకో సంగతి చెప్పు.. అసలు ఎవరైనా నీకు ఉత్తరం రాశారా? పోనీ నువ్వెప్పుడైనా రాశావా? (అంటే ఏం చెప్తాం అండి రాసుంటే బాగుండేది అనుకోవడం తప్ప.) అని మొదలు పెడుతూ ఉత్తరాలు రాద్దాం అన్న ఆలోచనలకి బీజం వేశారు.
నీకు ఉత్తరాలు చదివే అలవాటుందో లేదో తెలియకుండానే రాస్తున్నాను అంటూ తెలియకుండానే పుస్తకoమొత్తం చదివేలా చేశారు..
కథ పుట్టుక- సాధారణంగా కథలు చెప్పడం బాగా తెలిసిన రవి మంత్రి గారు అమ్మ కథని చెప్పాలి అనుకోవడం దగ్గర, అమ్మకి కూడా ప్రేమకథ ఉంటుందనుకోవడం దగ్గర ఈ ప్రయాణం మొదలై ఉండొచ్చు అని సందేహంగానే కథ సందర్భాన్ని తెలియజేశారు.
కథలోని పాత్రల పరిచయం- ఈ కథలో ప్రధాన పాత్రలు నాలుగు. వాటిని నడిపించే పాత్రలు మరో మూడు.
1) సారిక- మన కథానాయిక. కార్పోరేట్ స్కూల్ ప్రిన్సిపాల్. టీనేజర్ నుంచి అమ్మ వరకు ప్రయాణం లో వయసుతో పాటు వచ్చే మార్పులకి తగ్గట్టు ప్రవర్తిస్తూ,ఒక దశ తర్వాత భావాల్ని నియంత్రించుకోవడం నేర్చుకొని పరిస్థితులని తన అదుపులోకి తెచ్చుకోగలిగే పాత్ర.
పాఠకులు తను నవ్వితే నవ్వి, ఏడిస్తే ఆమెతో పాటే ఏడ్చారు అంటే అతిశయోక్తి కాదు.
2) అభిరామ్- కథానాయకుడు. తనకు బాధ కలిగినా ఇతరులను బాధ పెట్టని మంచి మనసున్న పాత్ర. రామ్ లా ప్రేమించడం చాలా కష్టం.
3) నందగోపాల్- సారిక భర్త. సౌమ్యుడు. ఇతనిలా మనుషులని స్వీకరించటం చాలా కష్టం.
రామ్, నందు ఈ రెండు పాత్రల్నీ పోలిన మనుషుల్ని చాలా అరుదుగా చూస్తాం.
4) వర్థనమ్మ- సారిక తల్లి. ఈవిడ ప్రతీ ఆడపిల్ల తల్లికీ ప్రతినిధి లా అనిపిస్తారు.
5) సుచిత్ర- రామ్ భార్య. గతాలు, భవిష్యత్తులు అనే ఉచ్చులో చిక్కుకోకుండా ఆ రోజుని మాత్రమే ఆస్వాదించే మనస్తత్వం.
6) గీత,జిత్తు- నేటి సమాజంలో విభిన్న మనస్తత్వాలు గల పిల్లలకు ప్రతిరూపాలు.

సారిక వాళ్ళ వెనక ఇంట్లో కి కొత్తగా వచ్చారు గీత మరియు గీత వాళ్ళ నాన్న. గీత పరిచయం తో కాలక్షేపం కోసం కొమ్మపై వాలిన పక్షి ఎగిరిపోతుందని తెలిసినా, బాగున్న ఆ క్షణాన్ని ఆస్వాదిస్తూ రేపటి గురించి తలుచుకోవటం మానేసింది సారిక. కొన్నిరోజుల్లోనే గీత సారిక కి, వాళ్ళ కొడుకు జిత్తు కి చాల దగ్గరైంది.
గీత సారిక అలవాట్లని, ప్రపంచాన్ని, ఆకారాన్ని కొంచెంకొంచెంగా మార్చేసింది. తనకి తననే కొత్తగా పరిచయం చేసింది.
ఒకరోజు గీత సారిక ని డిన్నర్ కి ఆహ్వానించింది. తన తండ్రి ని పరిచయం చేస్తానని చెప్పింది గీత.
మీ నాన్న పేరేంటి అని అడగగా, అభిరామ్ నాయుడు అని సమాధానమిచ్చింది గీత. రామ్ అంటే నువ్వు… అని సారికా అంటుండగానే,, అందుకొని అవును నేను గీతాంజలి అని చెప్పి వెళ్ళిపోయింది గీత.
రామ్ అంటే తనేనా ఇప్పుడెందుకు వచ్చాడు. కలవాలా వద్దా అని ఆలోచనలో పడింది సారిక..
ఇంతకీ రామ్ ఎవరంటే ?
సారిక ఇంజనీరింగ్ చదివే రోజుల్లో సీనియర్. ర్యాగింగ్ ద్వారా పరిచయం అయ్యి మెల్లమెల్లగా మాటలు కలిపే ప్రయత్నం చేశాడు. పరీక్ష సరిగ్గా రాయలేదన్న కోపం రామ్ మీద చూపిస్తూ అందరి ముందు తిట్టింది సారిక. సారి సారిక ఇంక నీ జోలికి రాను అంటూ మాయమయ్యాడు రామ్.
రామ్ ని తిట్టి తప్పు చేశావ్ చిన్నప్పుడు తెలిసిన అమ్మాయివి అని చనువుగా మాట్లాడాడు రామ్ అని రాజేష్ చెప్పగా, ఆరా తీసి తను అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చిన్నపుడు కలిసి ఆడుకున్న స్నేహితుడు అని, అప్పట్లో రామ్ కి సారిక అంటే చాలా ఇష్టం ఉండేదని వాళ్ళ మామ్మ ద్వారా తెలుసుకుంది.
వేసవి సెలవులు కావడం తో కలవడం కుదరక ఆకాశవాణి ద్వారా నీకై అభిసారికనై పాట తో సందేశం పంపింది.
సినిమాకి అని చెప్పి సారిక స్నేహితురాలు పద్మ. బీచ్ లో వేచి ఉన్న రామ్ కి సారిక ని కలిపించింది.
ఇంకేముంది ప్రేమ చిగురించి బీచ్ లు, సినిమాలు, షికార్లు తిరగడాలతో పెరిగిపోతూ ఉంది.
వర్ధనమ్మ వాళ్ళ అన్నయ్య తో ఆస్తి లో వాట కోసం పోరు పెట్టుకొని సాధించింది.
అన్న కూతురు పెళ్లి నిశ్చయం తో సింహాచలం లో కలిసిపోయారు ఇరు కుటుంబాలు. సారిక బావ నందు అందగాడు ,మంచి ఉద్యోగం అవ్వటం తో సారిక ఇష్టం తో పనిలేకుండా పెళ్ళిచూపులు కానిచ్చేశారు తల్లిదండ్రులు. మామయ్య వాళ్ళు వెళ్ళిపోగానే మదిలోని ప్రేమను బయట పెట్టింది సారిక. ఇంకేముంది సారికని నందుతో పెళ్లికి ఒప్పించటానికి ఇంట్లో రోజు యుద్ధవాతావరణమే సాగుతుంది.
ఇక లాభం లేదు అనుకొని వర్దనమ్మ రామ్ ని కలిసి మాట్లాడింది. సారిక తో పెళ్లికి ఒప్పుకోక పోవటానికి కారణం కులమేనా అని రామ్ ప్రశ్నించగా,
కులము ఒక్కటే కాదని. నందు తన అన్న కొడుకు రక్త సంబంధం, తెలిసినవాడు, మంచి ఉద్యోగం, నందు ని చేసుకుంటే సుఖపడుతుందని సారిక భవిష్యత్తు కి భరోసానిచ్చింది.
ఇక చేసేదేమీ లేక సారిక ఎంత వారిస్తున్నా వినకుండా, భరోసా లేని తన భవిష్యత్తుతో సారికని ముడిపెట్టలేక తను సుఖంగా ఉండాలని వాదించి గెలిచి, సారికను నందు తో పెళ్లికి ఒప్పించాడు రామ్.
సారిక నందుని పెళ్ళిచేసుకుని అమెరికా వెళ్ళింది. నందు చిన్నపుడు పూజిత అనే అమ్మాయిని ప్రేమించాడు. ఆమె వయస్సు ఎక్కువ అవ్వటం వల్ల వారి ప్రేమ ముందుకు సాగలేదు. సారిక – నందు ఇద్దరు గతాలను స్వాగతించి,
మెల్లగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ అలవాటు గా సాగిపోతున్నారు. పుట్టిన కొడుకు కి అభిరామ్, పూజిత లా పేర్లు కలిసేలా అభిజిత్ అని పేరు పెట్టారు.
బాబు పెద్దవాళ్ళ దగ్గర పెరిగితే బాగుంటుందని బెంగుళూరు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు నందు. భారత్ కి వచ్చే చివరి రోజు ఆఫీస్ లో సెండ్ ఆఫ్ పార్టీ కి వెళ్లి అగ్నిప్రమాదం లో చిక్కుకొని మరణించాడు.
తరువాత నందు కోరిక ప్రకారం సారిక జిత్తు ని తీసుకొని భారత్ కి వచ్చి డిగ్రీ పూర్తి చేసి ప్రస్తుతం ప్రిన్సిపాల్ గా ఉద్యోగం చేస్తూ జీవిస్తుంది.

మరునాడు గీత ఆహ్వానాన్ని మన్నించి డిన్నర్ లో రామ్ ని కలిసి మాట్లాడింది.
మళ్ళీ కలపాలనే ఉద్దేశమే ఉంటే తనకి దూరంగా ఉండమని గీత ని హెచ్చరించింది.
రామ్ చిత్రను యిష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నాడు.
సారిక గురించి తెలుసుకొని, గతాన్ని స్వీకరించి, చిత్ర తన ప్రేమతో రామ్ ని మార్చేసింది. పుట్టిన పాప కి వారు ప్రేమించిన రోజులలో సారిక చెప్పినట్లు గీతాంజలి అని పేరు పెట్టారు. కొన్నాళ్ళకి చిత్ర కాన్సర్ తో మరణించింది. ఇదంతా చిత్ర డైరీ చదివి తెలుసుకుంది సారిక. తన అమ్మ డైరీ చదివిన గీత సారికని వాళ్ళ నాన్న తో కలిపే ప్రయత్నం చేసింది. రామ్ కి చేసిన అన్యాయానికి క్షమాపణ కోరుతూ నందు రాసిన లేఖ చదివి జిత్తు కూడా అదే ప్రయత్నం చేశాడు.
ఈ వయసు లో ఎవరు ఏం అనుకుంటారో అని అనిపించినా ఎప్పటికీ మనల్ని వేల కళ్ళు చూస్తాయి, వందల నోళ్ళు మాట్లాడతాయి. ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్తూ పోలేము కదా! అందరిని మెప్పించాలి అంటే ఎప్పటికీ మనం మనలా ఉండలేం. మనం ఎవరి కోసమో జీవించకూడదు అని మళ్ళీ మొదటి నుంచి కొత్త గా ప్రయాణం మొదలు పెట్టారు అభి- సారిక…
అమ్మకు కూడా ప్రేమకథ ఉంటుందనుకోవడం అతిశయోక్తి కాకపోయినా, చివరికి ఆ ప్రేమని కలిపి గెలిపించడం మాత్రం ఇండియా లో ఈ రోజుల్లో అమాయకత్వమే అవుతుంది అనిపించింది, కానీ నిజంగా జరిగితే బాగుండు అనేంత అందగా ఉంది..
మనసు లేని పెద్దలు విడదీసిన పిల్లల ప్రేమకథ ని పెద్దమనసు తో వారి పిల్లలు మళ్ళీ కలపడం .. ఇదే అన్నింటిలో ప్రత్యేకం.
పుస్తకం చదువుతున్నంత సేపు బయటి ప్రపంచాన్ని బహిష్కరించి, అభి – సారిక ల ప్రేమ ప్రపంచం.. నందు, చిత్ర, జిత్తు, గీతా లతో సంసారిక బంధం, త్యాగం, సర్దుబాటు, అర్థం చేసుకోవటం అన్ని.. వారితో పాటు నవ్వడం, వారి బాధలో వారితో పాటు ఏడ్వడం.. అన్ని చుట్టూ అల్లుకునేలా చేసిన
రచయిత మాటలు, భావాలు పాఠకులని సుతిమెత్తగా ఎప్పటికప్పుడు స్పృశిస్తూనే ఉన్నాయి.

ఈ కథని పాఠకుడు తన మనసులోని భావాలను తానే రాసుకుని చదువుతున్నట్లుగా భావిస్తాడు..
నవల మధ్యమధ్యలో షేక్స్పియర్, బుద్ధుడు, రోజ్ వైల్డర్, పింగళి…లను అలాఅలా పలకరిస్తూ.. మనుస్మృతి లోకి వెళ్ళిరావడం చాలాచాలా బాగుంది..
ఈ ప్రేమలు విడిపోవడాలు ప్రేమ వెతుక్కుంటూ రావడాలు,చాలా అరుదుగా జరిగే విషయాలు అనే ముగింపుతో..
అరుదుగా జరిగే విషయాన్ని కూడా ఆలోచనలోకి తెచ్చి, అద్భుతంగా వర్ణించే రవిమంత్రి లాంటి రచయిత కూడా మాకు అరుదే మరి!…
ధన్యవాదాలు..

You may also like

Leave a Comment