Home పుస్త‌క స‌మీక్ష‌ పడమటి గాలుల్లో తెలుగు పరిమళాలు

పడమటి గాలుల్లో తెలుగు పరిమళాలు

భాష పుట్టుకకు ప్రాంతముంటుంది కానీ దాని పరిమళాలు నిండిన గాలులు ఏ ప్రాంతంలో వీస్తాయో ఎవరూ చెప్పలేము…

భాష వైభవం సాహిత్యంలోనే కనిపిస్తుంది…

భాష మనుగడ సాహిత్యంతోనే ముడిపడి ఉంటుంది…

సరిహద్దులు దాటి స్వేచ్ఛగా విహరించేదే కదా సాహిత్యమంటే…

కమ్మనైన అమ్మభాషకు కవుల కలాలే కప్పురపు హారతులు…

కాదంటారా…!?

అనేక ప్రక్రియల్లో తనదైన ప్రత్యేక శైలితో పడమటి గాలుల్లో తెలుగు పరిమళాలను నింపుతున్న కవి , రచయిత శ్రీధర్ బిల్లా…వీరి స్వస్థలం వరంగల్ జిల్లాలోని మల్లక్కపల్లి గ్రామం. ప్రస్తుతం ఉంటున్నది కాలిఫోర్నియా(అమెరికా). దాదాపు పది సంవత్సరాలుగా సాఫ్ట్వేర్  ఇంజనీర్ గా అమెరికాలోనే ఉంటున్న శ్రీధర్ కు తెలుగుభాషన్నా , భారతీయ సంప్రదాయమన్నా ఎంతో అభిమానం. తన చుట్టూ సమాజంలో జరుగుతున్న అనేక సంఘటనలను , తన బాల్యాన్ని , తన వృత్తిని ఇలా అనేక అంశాలను వస్తువులుగా తీసుకుని వాటిని వివిధ ప్రక్రియలలో అక్షరీకరించారు.

ఒక్కో ప్రక్రియకు ఒక్కో పుస్తకాన్ని విడిగా వేసుకుంటున్న ఈ రోజుల్లో అన్ని ప్రక్రియలను కలిపి ఒకే సంపుటిగా తీసుకు రావడం కాస్త సాహసమనే అంటాను…ఏదైనా కవిత్వమే కదా అంటారు శ్రీధర్…

కవి మనసుకు ప్రతిబింబమే అతని సాహిత్యం…బహుశా అందుకే తన ఈ సంపుటికి “ప్రతిబింబం” అని పేరు పెట్టారని అనుకుంటాను.

ఇందులో వచన కవిత్వం, నానీలు, రుబాయీలు, పద్య ఖండికలు ఉన్నాయి.

వచన కవిత్వం ఎక్కువగా దీర్ఘ కవితలుగా ఉన్నాయి. అందుకే తీసుకున్న ప్రతి వస్తువుకు పూర్తి న్యాయం చేశారనిపిస్తుంది.

ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాలలో జరుగుతున్న బాల్య వివాహాల గురించి ”ఒంటరీ బందీ” అనే కవితలో హృద్యంగా తెలియజేశారు. ఇది తన బాల్యంలో జరిగిన ఓ సంఘటన…తన సోదరిలాంటి బాల్య మిత్రురాలికి జరిగిన బాల్య వివాహం గురించి ఆవేదనతో రాసుకున్న అక్షర నివాళి ఇది…

// హృదయాంతరాళం ప్రళయ ఘోష చేస్తున్న,

అధరం దాటని మూగ ఆర్తనాదం తాను! మౌన శిఖరం తాను!

గర్భమంతా మంచుకాసారం నిండియున్నా ,

మంచుగప్పి మలయమారుతం వీస్తున్న మహాగ్ని పర్వతం తాను! // అంటూ ఆవేదనతో రాశారు…

//పెంచిన తల్లివి గావు!   తండ్రివీ గావు!

తోడబుట్టిన దానవు కావు! కానీ, తోడై నిల్చిన దానవు!// అంటూ ”ఎర్ర బర్రె” కవితలో తన బాల్యంలోని ఆత్మబంధువైన ఎర్ర బర్రెను ఆత్మీయంగా తలచుకొన్నారు.

అకాల వర్షాల వల్ల రైతు ఆశలు ఎలా కొట్టుకు పోతాయో “చినుకుల మాటున” కవితలో మన కళ్ళ ముందుంచారు.

రెక్కలొచ్చిన పిల్లలు సుదూర తీరాలకు ఎగిరెళ్ళిపోతే…రెక్కలుడిగిన ముసలి ప్రాణం ఎంత తల్లడిల్లి పోతుందో ”ముసలోడు” కవితలో ఇలా రాశారు…

//ఏ జ్ఞాపకం హఠాత్తుగా ఏ కలవరాన్ని మోసుకొచ్చిందో

పక్కనున్న మంచాన్ని ఒక్కసారి తడిమి చూశాడు

ముసల్ది మరణించిందని ఓ క్షణం పాటు మరచాడేమో

ఖాళీ మంచం వేళాకోళమాడుతూ వెక్కిరించింది//

//తాను విలపిస్తూ చితికి శిధిలమై పోతుంటే

ఆ విలాప శిధిలాలతో పేరుస్తున్న విలాస సౌధాలు

కళకళలాడుతున్నాయి//అంటూ వేశ్యల జీవితాలలోని ఆక్రందనలను ”ఆక్రందన” కవితలో అక్షరీకరించిన తీరు కవికి సమాజం పట్ల ఉన్న బాధ్యతను మనకు తెలియజేస్తుంది.

//అందమైన ఒకనాటి ఆంధ్రదేశానికి

జాతీయ భాషను నేను

జాతీయ భాషగా వేరొకటి రుద్దగా

‘ప్రాంతీయ భాషనయ్యాను’ నేడు!//

అంటూ ”తెలుగు అనే నేను” కవితలో నేడు తెలుగు భాష ఎదుర్కొంటున్న అనేక సమస్యలను తెలియజేస్తూ విదేశాలలో మన భాష ఎంత గొప్పగా వెలుగొందుతోందో

//ప్రాంతీయ భాషగా

భారతావనిలో భారంగా బతుకీడుస్తున్నా,

ప్రవాస సంఘాల కృషితో

ప్రపంచ భాషగా గుర్తింపు పొందుతున్నా!// అంటూ ఈవిధంగా తెలియజేశారు. ఇలా వేటికవే ప్రత్యేకతను సంతరించుకున్న వచన కవితలు 38 శీర్షికలతో ఉన్నాయి.

ఈ కవికి అంత్యానుప్రాసలు బాగా ఇష్టమనుకుంటాను. అందుకే అతని కలం ప్రాసలను అందంగా జాలువార్చింది.

ఇంక నానీలు , రుబాయీలు, పద్య ఖండికలు కూడా ఈ సంపుటిలో ఉన్నాయి.

శ్రీధర్ రాసిన కొన్ని నానీలను చూద్దాం…

//నాలుగు మెతుకులు

ఆకలి మంటల్లో

బాలల హక్కులు

కాలిపోయాయి//

//ఆటలాడి

రాటుతేలాల్సిన దేహం

రాళ్ళు కొడుతూ

రాటుదేలుతోంది!// అంటూ ‘బాల కార్మికులు’ అనే శీర్షికలో సందేశాత్మక నానీలను రాశారు. ఇంతే కాకుండా మామగారు , కొడుకులు, బడి , చెత్తకుండీ, పందెం కోడి , రోడ్డు గుంత అనే శీర్షికలతో కూడా నానీలు ఉన్నాయి.

ఇంకా ఈ సంపుటిలో “అన్వేషణ”, “దిన దినం” శీర్షికలతో రుబాయీలు కూడా ఉన్నాయి…

చివరగా 14 శీర్షికలతో పద్యఖండికలు కూడా ఉన్నాయి.

తే.గీ. నీదు ఇంటిలోన, కటిక పేదరికపు

కాళరాత్రుల చీకట్లు కప్పియుండె!

నీవు జెక్కిన శిల్పము, దేవళమున

దీపములలో వెలుగుచుండె, తేజమలర!

అంటూ రాసిన ఈ తేటగీతి “శిల్పి” అను శీర్షికలోనిది.

పద్యఖండికలోని పద్యాలన్నీ సులభ శైలితో పాఠకులకు సులభంగా అర్ధమయ్యే విధంగా ఉన్నాయి.

ఇందులోని సాహిత్యం చదువుతుంటే ఈ కవికి సామాజిక బాధ్యతే కాకుండా భాషాభిమానం కూడా చాలా ఉందని మనకు తెలుస్తుంది.

ప్రచురింపబడిన మొదటి పుస్తకం ఇదే అయినా మరెన్నో గ్రంథాలను త్వరలో ఆవిష్కరించాలని కోరుకుంటూ…

“ప్రతిబింబం” రచయిత  శ్రీధర్ గారికి ఆత్మీయ అభినందనలు తెలియజేస్తున్నాను.

 

You may also like

1 comment

శాంతి కృష్ణ August 26, 2021 - 3:13 am

ధన్యవాదాలు మయూఖ పత్రిక యాజమాన్యంకు….💐

Reply

Leave a Comment