Home ఇంట‌ర్వ్యూలు పెన్నా శివరామకృష్ణ తో మాడిశెట్టి గోపాల్ ముఖాముఖి !!

పెన్నా శివరామకృష్ణ తో మాడిశెట్టి గోపాల్ ముఖాముఖి !!

by madishetti gopal

తెలుగు భాష, సాహిత్య రంగాలలో విశేషకృషి చేసిన సాహితీవేత్తలకు 2015 నుంచి ఏటా ప్రభుత్వం ప్రదానం చేస్తున్న కాళోజీ పురస్కారం 2021 సంవత్సరానికి గాను పెన్నా శివరామకృష్ణ గారికి కాళోజీ జయంతి రోజున హైదరాబాదులోని రవీంద్ర భారతిలో 1,01,116 నగదు, శాలువా, జ్జాపిక తో అందజేశారు. నల్లగొండ జిల్లాకు చెందిన పెన్నా శివరామకృష్ణ అధ్యాపకుడిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఆయన అలల పడవల మీద, నిశ్శబ్దం నా మాతృక వంటి కవితా సంకలనాలను వెలువరించారు. గజల్ ప్రక్రియలో ఆయన విశేషమైన కృషి చేశారు.
సాహిత్య విమర్శలోనూ తనదైన ముద్ర వేశారు.నిత్య సాహిత్య కృషీవలుడిగా సంపుటాలు, సంకలనాలు ఎన్నో వెలువరించారు. 11 కవిత్వ సంకలనాలు, 8 సాహిత్య విమర్శ సంపుటాలు, పదుల సంఖ్యలో ఇతర రచనల సంపుటాలు వెలువరించారు. కవిత్వం, సాహిత్య విమర్శ, వచనం.. ఏది రాసినా అది సామాజిక ప్రయోజనం కోసం రాశారు. పలు సాహిత్య విమర్శనా గ్రంధాలను వెలువరించారు. మానవీయతను తన కలం లోకి ఒంపుకొని మానవీయ పరిమళాలను వెదజల్లుతున్న శివరామకృష్ణ ప్రస్తుతం హైదరాబాదులో నివాసం ఉంటున్నారు. ఆయనతో మాడిశెట్టి గోపాల్ జరిపిన ముఖాముఖి.

మీ బాల్యం, విద్యాభ్యాసం గురించి తెలపండి?

నల్లగొండకు సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలోని దుగునవల్లి గ్రామం మా సొంత ఊరు. ఒకటి నుంఛి నాలుగవ తరగతి వరకు అక్కడే చదువుకున్నా. ఐదు నుంచి పదవ తరగతి వరకు, మాఊరికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని కట్టంగూరులో. డి, ఓ. యల్. రెండేళ్ళు, బి. ఓ. యల్. మూడేళ్ళు, నల్లగొండలోని మా చిన తాతగారు మేడిపల్లి రాధాకృష్ణమూర్తి గారి ఇంట్లో ఉండి, గీతా విజ్ఞానాంధ్ర కళాశాలలో చదువుకున్నా. యం. ఏ. (తెలు

గు), యం. ఫిల్., పిహెచ్. డి. లు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదులో. శేషీంద్రశర్మ గారి “నా దేశం నా ప్రజలు” కావ్యం మీద యం. ఫిల్., “శేషేంద్ర కవిత్వానుశీలనం” అనే అంశం మీద పిహెచ్. డి. పూర్తి చేశా. “శేషేంద్ర కవిత్వానుశీలనం” అనే పుస్తకాన్ని 1993 లో ప్రచురించాను.

కవిత్వం, విమర్శ, గజల్స్ …..వీటిలో మీరు బాగా ఇష్టపడే ప్రక్రియ ఏది?

అన్ని ప్రక్రియలనూ అభిమానిస్తాను. కవిత్వంలోనైనా, విమర్శలోనైనా, తిరిగి చూసుకున్నప్పుడు, “నేనే మొదటిసారి చెప్పాను” అనిపించిన, “ఇది నేను మాత్రమే చెప్పగలిగినది” అనిపించిన ప్రతి వాక్యమూ నాకు ఇష్టమే.

విమర్శలో మీ ప్రత్యేక దృష్టికోణం ఏమిటి?

కొన్ని మంచి కవితలు, నాకు గొప్ప అనుభూతినో, కొత్త ఆలోచననో, నూతన చైతన్యాన్నో కలిగించినప్పుడో, వాటికి కారణాలను నాలో నేను ఆలోచించుకుంటూ, నా అభిప్రాయాలను తోటి సాహిత్యాభిమానులతో పంచుకోవడం కోసమే రాశాను. ఇలాంటివి రాసేటప్పుడు (రాసిన తర్వాత) నేనేదో సాహిత్యవిమర్శ రాస్తున్నాను అనే భావం నాకు లేదు. నేను చేసినది ఎక్కువగా కవిత్వ శిల్పవిశ్లేషణమే. విమర్శ పరిభాషలో “శిల్పానుశీలన విమర్శ” అనవచ్చునేమో!

గజల్ ప్రక్రియ గురించి వివరిస్తారా?

అరబ్బీ, పారసీ రెండు భాషలలోను ఆరంభమై, వికసించిన కవిత్వ ప్రక్రియ గజల్. కొన్ని అరబ్బీ, కొన్ని పారసీ సంప్రదాయాలు సమ్మిళితమై, పదవ శతాబ్ది ప్రాంతానికి గజల్ ఒక స్థిర రూపాన్ని సంతరించుకున్నది. ఇరాన్ సంస్కృతిలో భాగంగా, గజల్, రుబాయీలు  భారతదేశంలో ప్రవేశించాయి.  పారసీ ద్వారా ఉర్దూలోకి, ఉర్దూ నుంచి ఇతర భారతీయ భాషలలోకి ఈ ప్రక్రియలు వ్యాపించాయి. గజల్ లోని షేర్లను మొదటిసారిగా తెలుగులోకి అనువదించినవారు, గజల్, రుబాయీలను తెలుగులో తొలుత రాసినవారు దాశరథి గారు. తెలుగులో గజల్ కు వ్యాప్తి కలిగించిన వారు సి. నా. రె. గారు.  గజల్ అంటే ప్రియురాలితో సంభాషణ. గజల్ లోని ప్రేమించబడే వనిత లేదా ప్రియురాలు కఠిన హృదయ, శాశ్వత అప్రాప్య. ప్రియుడు లేదా ప్రేమించిన వ్యక్తి, ప్రియురాలితో పరోక్షంగా, ఏకపక్షంగా జరిపే సంభాషణే గజల్. ఇతర వస్తువులతో గజల్  రాసిన వారు కూడ ఉన్నారు. ఈ రెండూ చమత్కార ప్రధానమైన ప్రక్రియలు. శబ్దాలంకృతి, అర్థాలంకృతి పరస్పర పోషకంగా ఏకత్ర సమ్మిళితమై ఉండాలన్నది ఈ ప్రక్రియలలోని ప్రధాన నియమం. వస్తు, రూపాల పరంగా, అన్ని ప్రక్రియలకు ఉన్నట్లే, ఈ రెండు ప్రక్రియలకు కూడ కొన్ని ప్రత్యేకతలు, పరిమితులు ఉన్నాయి. అన్ని ప్రక్రియలలోనూ ఎప్పుడూ నాసిరకమైన రచనలు అధికంగా, ఉత్తమ రచనలు స్వల్పంగా వస్తూ ఉంటాయి. ఈ రెండు ప్రక్రియలలోనూ అదే జరుగుతున్నది.

ఇప్పటి వరకు ఎన్ని కవితాసంపుటులు ప్రచురించారు? మీకు నచ్చిన కవితాసంపుటి ఏది?

మూడు వచనకవితా సంపుటులు, మూడు హైకూ సంపుటులు, రెండు గజళ్ళ సంపుటులు, ఒక రుబాయీ సంపుటి ప్రచురించాను. నా లౌకిక జీవితానుభవాలకు, విషాదానందానుభూతులకు, సంఘర్షణలకు, వేదనలకు సంబంధించిన కొన్ని పార్శ్వాలు “దీపఖడ్గం”లో ప్రతి ఫలించాయి; నా మానసిక స్థితిగతులలోని మరికొన్ని పార్శ్వాలు, వివిధ దశలలో “సల్లాపం”, “శిశిరవల్లకి” అనే గజళ్ళ సంపుటులలో, “అశ్రుధార” అనే రుబాయీ సంపుటిలో, (రాబోయే) “పెన్నాసరాలు”లో వ్యక్తమైనాయి. ఇవన్నీ నాకు ఇష్టమైనవే.

మీరు సాహిత్యేతర రచనలు కూడ ఎక్కువగానే రాశారు కదా! అవి ఎందుకు రాయాల్సివచ్చింది?

వివిధ సందర్భాలలో, వివిధ అవసరాల రీత్యా (ఆసక్తులలోని వైవిధ్యాన్ని అనుసరించి) సాహిత్యేతర రచనలను, కవులు, రచయితలు కూడ చదువుతూనే ఉంటారు. అటువంటప్పుడు సాహిత్యేతర పుస్తకాలను రాస్తే తప్పేమిటి? నా సాహిత్యేతర రచనలలో కొన్ని సమాచార ప్రధానమైనవి. విలువైన సమాచారాన్ని ఒకచోటికి చేర్చడంలోను నాకు ఆనందమే కలిగింది. సఫల, విఫల ప్రేమలు, ఎడబాటు, ముద్దు మానవజీవితంలో ఉన్నవే కదా! అవేమీ రచనలకు నిషిద్ధ వస్తువులు కావు కదా! ఎవరో, ఎదో అనుకుంటారని జంకకుండా, నా ఆసక్తులను తృప్తిపరచుకోవడం కోసమే కొన్ని సాహిత్యేతర పుస్తకాలను రూపొందించాను. అవేమీ మనుషులను చెడు దారి పట్టించేవి కావు, సమాజానికి హాని చేసేవి కావు.

మీ సంపాదకత్వంలో వైవిధ్యభరితమైన పుస్తకాలు వచ్చాయి కదా! వాటి గురించి చెప్పండి?

నేను సహసంపాదకత్వం వహించిన చాల సందర్భాలలో, నేనే ఎక్కువ బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది. దీనిని నేను సద్వినియోగం చేసికొన్నాను. వ్యక్తిగత రాగ ద్వేషాలకు అతీతంగా, నా దృష్టిలోని మంచి కవితలను ఎక్కువమంది సాహిత్యాభిమానుల వద్దకు చేర్చడానికి ప్రయత్నించాను. ఇందుకు సహకరించిన సహసంపాదకులకు అందరికీ కృతజ్ఞుడిని.

శివారెడ్డి గారికి సంబంధించిన మూడు పుస్తకాలకు సంపాదకత్వం వహించారు కదా! శివారెడ్డి గారి గురించి, మీరు సహసంపాదకత్వం వహించిన పుస్తకాల గురించి చెప్పండి?

విప్లవకవిగా కొనసాగినా, మనిషి యొక్క సమస్త భౌతిక, ఆంతరిక పార్శ్వాలను స్పృశించిన కవి శివారెడ్డి. వస్తువైవిధ్యం ఎక్కువ. తాత్త్విక దృష్టి లేని వారు ఎవరూ గొప్ప కవి కాలేరు. శివారెడ్డి గారి కవిత్వమంతటా తాత్త్వికత ప్రధానంగా కనిపిస్తుంది. తన శైలిని తానే అనుకరించకుండా, ఎప్పటికప్పుడు తన శిలిని తానే మార్చుకుంటూ వచ్చారు. వారి వ్యక్తీకరణ రీతులు కాలానుగుణంగా పరిణతి చెందుతూ వచ్చాయి. కవి వ్యక్తిత్వం వలన (ముఖ్యంగా సమకాలంలో) అతని కవిత్వం కూడ సానుకూల, ప్రతికూల ప్రభావాలకు లోనవుతూ ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని కూడ శివారెడ్డి గారి కవిత్వాన్ని గమనించవలసి ఉంటుంది.

నాకు తెలిసినంత వరకు, ఆయన రాసినన్ని స్త్రీ ఇతివృత్త కవితలు మరెవరూ రాయలేదు. అవి కూడ వస్తు, వ్యక్తీకరణల పరంగా వైవిధ్యభరితమైనవి. అందుకే వారి స్త్రీ ఇతివృత్త కవితలను “ఆమె ఎవరైతే మాత్రం” (2009) అనే పేరుతో సంపుటిగా తెచ్చాము. నేను వారి కవిత్వం మీద విమర్శ పుస్తకం రాస్తున్నప్పుడు, వారి కవిత్వం మీద వచ్చిన విమర్శ వ్యాసాలను, సమీక్షలను చాల సేకరించాను. వాటితోపాటు ఆ తర్వాత వచ్చిన వాటిని కూడ సేకరించి “శివారెడ్డి కవిత్వం – విమర్శలు, విశ్లేషణలు” (2009) పుస్తకం తెచ్చాము. వారు ఇప్పటికి వందకు పైగా పుస్తకాలకు ముందుమాటలు రాశారు. 86 ముందుమాటలను సేకరించి “శివారెడ్డి పీఠికలు” (2013) అనే పుస్తకం తెచ్చాము. ఇది ఐదు వందల పేజీల గ్రంథం. ఈ మూడు పుస్తకాలను గుడిపాటి గారు నేను కలసి రూపొందించాము.

ఈమధ్యన వాట్సాప్ లాంటి సోషల్ మీడియాలో విస్తృతంగా కవిత్వం వస్తున్నది కదా దాని మీద మీ అభిప్రాయం ఏమిటి?

అచ్చు అయినది అంతా మంచి కవిత్వం కానట్లే, సోషల్ మీడియాలో లైకులను, ప్రశంసలను పొందేవి అన్నీ మంచి కవితలు కావు. తమ రచనలలోని గుణదోషాలను మమకార రహితంగా పరిశీలించుకునే శక్తి ప్రతి రచయితకు అవసరం. కవులలో అంతరాలు ఉన్నట్లే, చదువరులలోనూ స్థాయీ భేదాలు ఉంటాయి. ఎవరి ప్రశంసను, లేదా ఎవరి విమర్శను ప్రామాణికంగా తీసుకోవాలి అనేది నిర్ణయించుకునే వివేకం ఉండాలి. ఇలాంటివి  లేనప్పుడు, ఏ మీడియా అయినా పెద్దగా భేదం ఏదీ ఉండదు.

సోషల్ మీడియా ద్వారా ఎక్కువ మంది చదువరులకు, రచనలు వేగంగా చేరే అవకాశం ఉంటుంది. ఆ మేరకు అది ఉపయోగకరమే. వ్యసనంగా మార్చుకోకుండా దుర్వినియోగం చేయకుండా ఉండడం అవసరం.

తెలంగాణ బిడ్డగా పరంపరలో మీరు అనుభూతి చెందిన గొప్ప అంశాలు….?

1969 లో నల్లగొండకు సమీపంలోని కట్టంగూరులో ఐదవ తరగతి చదువుతున్న రోజులు. అప్పటి ఉద్యమంలోనే, తెలిసీ తెలియని వయసులో, రిలే నిరాహార దీక్షా శిబిరంలో ఒక రోజు నిరాహార దీక్ష చేశాను. విద్యార్థిగా, ఉద్యోగిగా వివిధ దశలలో ఆధిపత్య భావాలను, హేళనలను గమనించాను, అనుభవించాను. కనుక అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడడమే గొప్ప ఆనందం. రాష్ట్ర అవతరణ అనంతరం, అవహేళన చేసిన వారే మన భాషా సంస్కృతులను అనుకరించే పరిస్థితి ఏర్పడడం మరింత ఆనందం.

మంచి సాహిత్యం వెలువడాలి అంటే, బాధ్యత రచయితలపై ఉంటుందా? పాఠకులపై ఉంటుందా?

హృదయంలోని బరువును దించుకోడానికో, బాధ్యతగానో, విషాద,  ఆనందానుభూతులను పంచుకోడానికో, మానసిక సంఘర్షణలనుంచి వేదనల నుంచి కొంత సాంత్వన పొందడానికో, చైతన్యపరచడానికో, రాయకుండా ఉండలేకనో, రచయితలు (కవులు) రచనలు చేస్తారనుకుంటా. సమకాలంలోని సానుకూల ప్రతిస్పందనలు, రచయితలకు కొంత ఉత్సాహాన్ని కలిగిస్తాయన్నది వాస్తవం. కాని ఒక రచయిత ఒక వస్తువును సాహిత్యంగా (కవిత్వంగా) మార్చే ప్రక్రియలో పూర్తిగా నిమగ్నమైనప్పుడే ఉత్తమ రచన రూపొందుతుంది. ఆ స్థితిలో చదువరుల మీద దృష్టి ఉంటే నిమగ్నత భగ్నమవుతుంది. సమకాలికుల ప్రశంసలు మాత్రమే ఆశించే రచయిత ఎక్కువకాలం ఉత్తమ రచయితగా నిలువలేడని అనుకుంటాను. కనుక మంచి సాహిత్యం రావడానికి, చదువరుల కంటే రచయిత బాధ్యతే ఎక్కువ అని నా అభిప్రాయం. గతకాలపు మహా కవుల రచనలను నేటికీ చదువుతున్నాము కదా! ఆయా కవులు సమకాలిక చదువరుల మీదనే ఆధారపడితే, వారి రచనలు నేటి దాకా నిలిచి ఉండేవి కాదేమో?

సాహిత్యసృజన, సాహిత్య కార్యక్రమాల నిర్వహణ…ఈ రెండింటి పైన మీ అభిప్రాయం..?

సాహిత్యసృజన ఆంతరంగిక వ్యవహారం. ఎవరేమనుకున్నా అది ఒక కళ. కార్యక్రమాల నిర్వహణ కూడ కళే, కాని అది లౌకిక వ్యవహారం. కొంతమేరకు పరస్పరం ప్రభావితం చేసుకుంటూ ఉంటాయి. ఒకరికే రెండూ చేయగల సామర్థ్యం ఉంటే మంచిదే. చాల మంది సాహిత్య స్రష్టలకు కార్యక్రమ నిర్వహణ సామర్థ్యం ఉండదని నాకు అనిపిస్తుంది.

కాళోజీ పురస్కారం పొందిన సందర్భంగా మీ అనుభూతి / ప్రతిస్పందన…..?

నా కంటే వయసులో పెద్ద వాళ్ళు, సాహిత్యరంగంలో నా కంటే ఎక్కువ కృషి చేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు. అట్లా ఎంతో మంది ఉండగా కాళోజీ పురస్కారం నాకు రావడం ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది.

*******************

You may also like

1 comment

విలాసాగరం రవీందర్ November 10, 2021 - 12:37 am

సార్ సాహిత్య వ్యాసంగం చక్కగా వివరించినారు.

Reply

Leave a Comment