గాఢమైన తాత్త్విక అభివ్యక్తికి చిరునామాగా భాసిల్లుతున్న కవి మునిమడుగుల రాజారావు గారు గత రెండు దశాబ్దాలకు పైగా కవిత్వ సృజన చేస్తూ.. తెలుగు పాఠక లోకానికి చేరువైనారు. తాత్విక చింతనతో సాహితీ యానం చేస్తున్న ఆయన ‘అనాగరిక గేయం’, ‘దుఃఖనది’ పేర్లతో గ్రంథాలను వెలువరించి.. అందరి దృష్టినాకర్షించారు. తాత్విక తిలకాన్ని అద్దుతూ “నేను ఎవరు?” దీర్ఘ కవితను రూపుదిద్దిన ఆయన… ప్రతి రచనలో మానవుని అస్తిత్వ పరివేదనను అక్షరాల్లో నిక్షిప్తం చేసిన అనుభవం ఆయనకు ఉంది. కవిత్వంలో వర్తమాన జీవితంలోని సత్యాలను ఆవిష్కరించడానికి ఆయన చేసిన కృషి అభినందనీయం. శ్రమకి.. మనిషి దుఃఖానికి ఉన్న సంబంధాన్ని తాత్త్విక కోణంలో కవిత్వ సృజన చేయడంలో ఆయన సిద్ధహస్తులు. కవి మునిమడుగుల గారి కవిత్వంలో బహుళత్వాల్ని అడుగడుగున చూస్తాం.. అలతి అలతి పదాలతో అద్భుతమైన తాత్వికతతో ఆయన జ్ఞాపకాలను విలక్షణమైన అభివ్యక్తితో కవిత్వంలో నిక్షిప్తం చేయడం ప్రశంసనీయం.
‘అనాగరిక గేయం’, ‘దుఃఖ నది’, ‘నేను ఎవరు?’ గ్రంథాలతో పాటు మునిమడుగుల గారు ‘సత్యం వైపు పయనం’, ‘సత్యమంటే ఏమిటి?” తాత్త్విక వ్యాసాల సంపుటిని ప్రచురించారు. గత రెండు దశాబ్దాలకు పైగా ఆయన రాస్తున్న కవిత్వాన్ని సమగ్ర దర్శనం చేసేందుకు “మునిమడుగుల రాజారావు సమగ్ర కవిత్వం” పేరుతో పాలపిట్ట పబ్లికేషన్స్ ద్వారా ఓ గ్రంథం వెలువరించారు. ఈ గ్రంథంలో రాజారావు గారి కవిత్వాన్ని సమగ్రంగా వీక్షించగలం.. సామాజిక సంక్లిష్టతలకీ, జీవన సంవేదనలకీ గల మూలాలను ఆవిష్కరించేందుకు ఆయన కవిత్వాన్ని పండించిన తీరు ఈ గ్రంథం ద్వారా గ్రహించగలం.. ప్రతీ కవితలోనూ ఆయన తాత్విక కవితాధారను గమనించగలం.
“పాదముద్రలు” శీర్షికతో రాసిన కవితలో… ఎక్కడినుంచో వస్తోన్న / పాదాల పయనంలో / కుండల కొద్దీ నింపుకు
న్న / సామాజిక దుఃఖమంతా ఘనీభవించాక / ఇప్పుడు కన్నీటి బొట్లు / రాలడానికి నిరాకరిస్తున్నాయనీ.. కారణం.. / కన్నీళ్ల వర్షానికి | వసంతం వచ్చి | చిగురించిన చెట్టు కదా / జీవితమని.. జీవితాన్ని / తాత్త్విక కోణంలో అద్భుతంగా ఆవిష్కరించారు.
మరో కవితలో.. అసమాన శాసన విషపు కోరల్లో చిక్కి / విలవిలలాడిన పాదాలు.. | తలల ముందర నడవలేక.. / కాళ్లని చేతుల్ల పెట్టుకుని నడిచెల్లిన పాదాలు / బ్రతుక్కి అర్థమేంటో తెలీక అంటూ / రాసిన పంక్తులు ఆయన కలం బలాన్ని సూచించేలా కొలువుదీరాయి.
“అణచివేతకు అనేక రూపాలు” శీర్షికతో రాసిన కవితలో.. అణచివేతకు గల అనేక రూపాలను ఏకరువు పెట్టారు. కనురెప్పల ప్రకంపనాలకు శబ్దాలు ప్రసవించవని.. రాజ్యమేలే వెలుతురులో నక్షత్రాలు ప్రకాశించవని చక్కని ముగింపునిచ్చారు.
“శిల్పి తాకని రాయి కూడా శిల్పమే”
కవితలో.. కవి రాజారావు గారు చక్కని భావుకతను ప్రదర్శించారు. నువ్వులో నూనె వుందనీ.! పువ్వులో మకరందముందనీ.. పాలలో నెయ్యి వుందనీ.. వాటిని పిండుకుని గ్రోలిన మనిషి.. శిల్పి తాకని రాయి కూడా ఒక శిల్పమే అన్న ‘ఎరుక’ లేక మహా నిశ్శబ్ద అడుగు పొరల కింద అజేయమైన దాని అంతః సౌందర్య స్పృహ లేక.. గొంగళి పురుగును అనాకారి అన్నాడని వ్యాఖ్యానించడంలో కవి ఔచిత్యాన్ని ప్రశంసించి తీరుతాం.
కాలమంటే / నిన్న నుంచి రేపటికి / జీవిత సాగిన దూరమని తేల్చి చెబుతూ..
వర్తమానం.. కాలం నడిచే భూమిక’ కవితను రాశారు. కాలమంటే ఏమిటో విభిన్న కోణాల్లో కవి చిత్రించిన తీరు బాగుంది.
‘దుఃఖ నది’ కవితలో కవి యొక్క తాత్త్వికత ఆద్యంతం కానవస్తుంది. ఈ భూమ్మీద మనిషి పుట్టకముందే మరణం పుట్టిందని విడమరిచి చెప్పారు. కాలాన్ని మూడు ముక్కలుగా నరికి.. గత కాలపు దారాలకు వేలాడుతూ.. క్షణక్షణం మరణించనందుకే.. మనసు మరుక్షణం నూతనంగా జన్మించనందుకే.. మానవజాతి అంత క్షేత్రంలో దుఃఖపు ఊట బయలు దేరిందనీ.. ఆపై నదిలా నడక కొనసాగిందని మంచి సందేశాన్నందించారు.
‘నాగలి శవమైంది’ కవితను ఆరంగా తీర్చిదిద్దారు.
‘చివరి ఆత్మీయుడు’ కవితలో కాటికాపరిని ఉన్నతంగా ఆవిష్కరించారు. అనురాగ బంధపు వలలు.. ఒంటరిగా స్మశానంలో.. చివరి ఆత్మీయుడైన కాటికాపరి సేవలను ప్రస్తావించిన తీరు బాగుంది.
‘ప్రసవించని ఒక పురిటి నొప్పుల కల’ కవిత అర్థవంతంగా మలచబడింది.
నాగలితో / పొలాలను దువ్వీ దువ్వీ / పుండు పుండైన / ఎద్దుల కాలి డెక్కల సాక్షిగా… అంటూ పొట్టకొచ్చిన పొలంను అక్షరాల్లో బంధించారు. కోతకొచ్చిన పొలమంతా తెల్లదోమ కాటుకు తెల్ల బోయింది.. మట్టిని నమ్ముకున్నందుకు కాదు.. నమ్మించి వంచించే మనిషిని నమ్ముకున్నందుకు అంటూ.. నర్మగర్భంగా నకిలీ మందులు అమ్మే వ్యాపారులను ఎండగట్టారు. పశువుల కన్నీళ్ల సాక్షిగా.. శ్రమ జీవుల నాలుగు కాళ్ల సాక్షిగా.. కవి ఆర్ద్రమైన భావాలతో ఈ కవితను రాశారు.
“ప్రేమ కరువై బీడు” కవితను ప్రేమికుల ఆత్మహత్యలకు చలించి రాశారు.
ఎన్ని మార్లయినా సరే! | గాయాలకు గేయాలకు | దుఃఖమే | చివరి చరణమంటూ ‘దుఃఖ తీరాలు’ శీర్షికతో రాసిన కవితలో నవ్వులన్నీ ఆత్మల మెరుపులైనాక.. దుఃఖమొకటే వెచ్చని ఊపిరితో సేదదీర్చే తల్లిడొక్క అని వ్యాఖ్యానించారు.
కవితకే అనర్హం అని శ్రీశ్రీ గారన్నట్లు.. కవి రాజారావు గారు “ఆదిలాబాద్ రంజన్లు” శీర్షికతో మరో కవితను ఇందులో పొందుపరిచారు. ఎదులాపురంలోని ఎద్దుల్లా కష్టించే మట్టి జీవాల స్పర్శతో రూపుదిద్దుకునే రంజన్ల వెనుక ఉన్న శ్రమైక సౌందర్యాన్ని ఈ కవితలో ఆవిష్కరించారు.
అలికిడి లేని పరమాద్భుత ప్రకంపనాలతో / మూసుకుపోయిన అంతర్లోకాలకు / దారులు తెరిచే / నిశ్శబ్ద ప్రపంచంగా.. స్మశానాన్ని అభివర్ణిస్తూ మరో కవితను రాశారు.
‘నులక మంచం’ కవితలో చుట్టాల చూపులకు… మమతల మర్యాదలిచ్చీ | అనుబంధాల ఆత్మలను కలిపినవి / నులక మంచాలేనని తేల్చి చెప్పారు. ఎక్కడినుంచో వచ్చిన సింగిల్ కాట్, డబుల్ కాట్లకు కాల్లు విరిగిన నులక మంచం మూలన మూలుగుతున్నదని వాపోయారు.
కర్తవ్య పిడుగు చప్పుడు ఉలికిపడి లేచి.. నిద్ర దుప్పటిని నిలువునా తన్నేసి.. వేగుచుక్క కన్నా వేగంగా లేస్తాడంటూ “పాలవాడు” కవితలో పాలవాడిని ఉన్నతంగా దృశ్యమానం చేశారు.
“పొయిల కట్టెలు” కవితలో నెత్తిమీద బతుకు బరువును .. కాళ్ళతో జోక్కుంటూ.. పరుగులాంటి నడకతో.. ఆ పూట తిండి గింజల కోసం తిప్పలుపడే పొయిల కట్టెల మోపును నెత్తిన పెట్టుకుని అమ్మకానికి బయలుదేరే బడుగు జీవుల కష్టాలను ఆర్బంగా అక్షరాల్లో నిక్షిప్తం చేశారు. సన్నగిల్లిన సుట్ట పేల్క అశక్తతతకు బరువును మోయలేక.. వాళ్లు బేరంలో ఓడిపోతారని కవి తమ ఆవేదనను వ్యక్తపరిచారు.
“అస్థిపంజరం ఆగని నవ్వు” కవితలో మనిషి నైజంకు అద్దం పట్టారు.
మనిషికి భ్రమలో జీవించడం గొప్ప హాయి అని వ్యాఖ్యానించారు. మనిషి తన జీవితమంతా ఏడుస్తాడు. లోపల అస్థిపంజరం పగలబడి నవ్వుతూ ఉంటుందని వివరించారు. ముగింపులో పెదాలు విచ్చుకుంటే నవ్వైంది.. పెదాలు రాలిపోతే భయమైంది అంటూ తాత్వికతతో కూడిన జీవన సత్యాన్ని ఆవిష్కరించారు.
“నీరెండ సౌందర్యం” కవితలో పల్లెతనాన్ని.. పల్లె జీవన సంస్కృతిని ప్రస్తావించిన తీరు బాగుంది. ప్రపంచీకరణ నేపథ్యంలో పల్లెలు చిల్లంకల్లం అవుతున్న తీరుతెన్నులను తెలియజెబుతూ ముగింపులో.. పల్లె నాగరికతలను తరాలుగా మోసి మోసి.. నొనలు విరిగి కమ్ములూడి పల్లె సంస్కృతికి ప్రతీకగా మిగిలిన “కచ్చులం..” నీరెండలో పరమాద్భుత ప్రకటన అంటూ నర్మగర్భంగా నీరెండ ప్రాశస్త్యాన్ని వివరించారు.
“అమ్మ స్పర్శ కోసం…” కవితలో పదబంధాల కూర్పు చాలా బాగుంది. అనారోగ్యానికి గురైనప్పుడు.. తమ ఊరెళ్లడం.. అమ చేతి స్పర్శ ఓ దివ్య ఔషధంలా పనిచేయడం.. మళ్లీ మామూలు మనిషినైపోవడం అంటూ రాసిన పంక్తులు.. బాగున్నాయి.. పల్లె పట్ల.. పల్లె అందాల పట్ల.. ఉన్న మక్కువ.. మరియు అమ్మ పట్ల ఉన్న ప్రేమాభిమానాలను కవి ఈ కవితలో చక్కగా ప్రస్తావించారు.
“బంగారు బాల్యం” కవితలో కవి చిన్నప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.
“కవిత బిడ్డకు బారసాల” కవితలో.. పుస్తకావిష్కరణ శుభకార్యాన్ని ‘కవిత’ బిడ్డకు బారసాలగా అభివర్ణించారు. కవి రాజారావు గారు వృత్తిరీత్యా బీమా సంస్థలో ఉద్యోగి.. కనుక వృత్తి పట్ల గౌరవంతో “బీమా దీపం’ కవితను రాసి మెప్పించారు.
ఇంకా ఈ గ్రంథంలో “పిచ్చుక గూళ్లు”, “వలలోని పక్షులు”, “గుడిసె” కన్నీళ్లు, “చెట్లే నయం”, “చినుకు విత్తనాలు” కవితలు ఆలోచనాత్మకంగా తీర్చి దిద్దబడినాయి. “నా తలకాయ నాది కాదు”, “బతుక్కి అర్థం?”, “మానవతా చిరునామా” వంటి కవితలు గ్రంథానికి నిండుదనాన్ని కూర్చాయి.
“నేను ఎవరు?” దీర్ఘకవితలో పరిపూర్ణంగా జీవించడానికి వీలుగా.. తనపై తనకు స్పష్టతను యివ్వడానికి మానవీయ విలువలు కాపాడటానికి మనిషిగా ఎప్పుడో ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుని.. హృదయ సంస్కారం చేసుకోవాలన్న గొప్ప సందేశాన్నిస్తూ కవి రాజారావు గారు తమ తాత్త్విక భావధారకు చోటు కల్పించారు. ‘ఎరుక’తో సముద్రంలోంచి సముద్రంలోకి” సత్యాన్వేషణకై చేసే ప్రయత్నం ఈ దీర్ఘ కావ్య లక్ష్యంగా మనకు కనబడుతుంది. అద్భుతమైన అభివ్యక్తితో… విలక్షణమైన చతురతతో.. చక్కని భావుకతతో ప్రతీ పంక్తిని కవితామయం చేశారు. లోతైన భావాలతో, తాత్త్విక చింతనతో ఈ దీర్ఘ కవితకు జీవంపోశారు. ఈ కవితలో జీవం ఉంది.. జీవితముంది. వర్ణనలు.. ఉపమానాలు.. పోలికలు.. సందర్భోచితంగా.. ఔచిత్యవంతంగా ప్రయోగించడంలో కవి సఫలీకృతు లైనారు. లోలోపలి ప్రేమ జగత్తును తట్టి లేపి.. లోలోపలి ఆత్మకు దారుల్ని చూపేలా కవితా రచనను కొనసాగించారు. ఉద్వేగ వైరుధ్యాలన్నీ దుఃఖ పునాదికి ధాతువులేనని తేల్చి చెప్పారు. చేజారిన ప్రతీది మళ్లీ చేతికి అదే రూపేణ ఇవ్వలేమనీ.. బంధాలన్నీ జ్ఞాపకాలేననీ.. అవి మనసు పరుపుపై కుంభకర్ణునిలా కునుకులేస్తుంటాయని పేర్కొన్నారు. ఆలోచనలు అంతా ఒక మనసు పెట్టేననీ.. అది గతం ఉత్పత్తి చేసిన తీయని జ్ఞాపకాల తేనె తుట్టె అని అభివర్ణించడం బాగుంది.
మనసంటే గతమేననీ.. అది అనేక అనుభవాల మూట అనీ… ఎన్నెన్నో జ్ఞాపకాల పూదోటగా వర్ణిస్తూ రాసిన పంక్తులు కవితలో చక్కగా ఒదిగిపోయాయి.
మనసంటే – మనిషి /మనిషంటే – మనసు/మనసే – నేను / (నేను ఎవరో తెలిసే దాకా)/కాని / ‘నేను’ అంటే అహం | అహంకారమంటే / మనసు ఉపరితల ఆకారమని.. మనసు కదే రూపొందించిన ఓ పెద్ద కారాగారమని తెలియజెప్పడంలో కవి రాజారావు గారి తాత్త్విక దృక్పథాన్ని అభినందించి తీరుతాం. “నేను ఎవరు?” ప్రశ్నకు.. “అంతిమ సత్యం” అని తేల్చి చెబుతూ.. ఈ కావ్యానికి ఆలోచనాత్మక ముగింపు నిచ్చారు. కవి రాజారావు గారి ఈ దీర్ఘకావ్యం ఓ కరదీపికలా పని చేస్తుంది. ఈ గ్రంథం చివరన అణచివేతకు అనేక రూపాలు శీర్షికన రాసిన కవితలన్నీ కవి యొక్క పరిశీలనా పటిమకు.. ఆయన ఉత్తమ వ్యక్తిత్వానికి… సున్నిత మనస్తత్వానికి అద్దం పట్టే విధంగా ఉన్నాయి.
జీవితమంటేనే కఠిన పార్శ్వాల్ని నిశ్శబ్దంగా మోస్తూ కొనసాగించాల్సిందన్న అర్థం ధ్వనించే విధంగా “పాత చెప్పులు కు(కొట్టువాడు” కవితను రూపుదిద్దారు. ఇంకా ఈ విభాగంలో “నిర్మల్ కోటలు”, “ఒక చెట్టు కథ”, “పాత సామాను కొంటాం”, “విధివంచితుడైన కండక్టర్”, “కదిలె” సెలయేరు, “లోపలి తలుపు తెరిచాక”, “రెండూ అయినప్పుడూ”, “పాములతోనే జీవితమైనప్పుడూ”, “బాలసంతోని పాట” వంటి శీర్షికలతో కవి రాజారావు గారు వస్తువైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ.. తమ సృజనాత్మక ప్రతిభను చాటుకున్నారు.
ఇలా రెండు దశాబ్దాలకు పైగా కవి రాజారావు గారు రాసిన కవిత్వంలోని ఆణిముత్యాలను ఒకే చోట లభ్యమయ్యేలా తాను రికార్డు చేసి “సమగ్ర కవిత్వం” రూపంలో పాఠక లోకానికి అందివ్వడం అభినందనీయం.
పేజీలు : 224, వెల: రూ.150/-
ప్రతులకు :
మునిమడుగుల రాజారావు
ఇ.నెం. 7-2-83/49/294,
ఇందిరానగర్, నిర్మల్ – 504106
9493430130
1 comment
సమీక్ష బాగుంది