Home పుస్త‌క స‌మీక్ష‌ లేడిస్‌ స్పెషల్‌ నవల

లేడిస్‌ స్పెషల్‌ నవల

by Devendra

‘‘స్త్రీలు సంపాదించినంత మాత్రాన ఆర్థిక స్వాతంత్య్రం వచ్చినట్టుకాదు. తను సంపాదించే డబ్బుమీద పూర్తి అధికారం, దానిని ఖర్చుపెట్టే నిర్ణయాధికారం ఉన్నప్పుడే నిజమైన ఆర్థిక స్వాతంత్య్రం వచ్చినట్లు లెక్క’’ అంటారు. సీనియర్‌ రచయిత్రి పరిమళా సోమేశ్వర్‌గారు.

‘లేడిస్‌ స్పెషల్‌’ నవల 1996 నుండి 2000 సం॥ వరకు వార్తాదినపత్రికలో ధారావాహికంగా ప్రచురింపబడిరది. ఆ తర్వాత జయంతి ప్రచురణల వారు 2018 పుస్తకరూపంలోకి తీసుకువచ్చారు.

నవలలో తుంగభద్ర రైలు ప్రొద్దున సికింద్రాబాద్‌నుండి బయలుదేరి మహబూబ్‌నగర్‌ వరకు ప్రయాణంచేసే క్రమంలో ఆయా స్టేషన్‌లలో ఆగితే ఉద్యోగం చేసే మహిళలలు రైలు ఎక్కి వారి గమ్యాలలో దిగిపోతూ ఉంటారు. మళ్ళీ తిరుగు ప్రయాణంలో రైలు ఎక్కి వారి ఇంటికి చేరుకుంటారు. నవలలో మహిళా ఉద్యోగస్థుల కోసం ప్రత్యేకంగా లేడీస్‌ కంపార్ట్‌మెంట్‌ కేటాయించబడిరది. ఒకవైపు ప్రయాణం కొనసాగుతుంది. మరొకవైపు రైలుడబ్బాలో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న మహిళల ఆరాటాలు, పోరాటాలు ఒక స్నేహపూర్వక వాతావరణంలో ఆవిష్కరింపబడుతూ ఉంటాయి. దాదాపు ఒక నలభై పాత్రలు ప్రవేశిస్తూ, నిష్క్రమిస్తూ వారి వారి సమస్యలను జీవనకావ్యంలా పాఠకుడి మనసులో అలజడిని రేపుతాయి.

ఆధునికయుగంలో చదువుకునే మహిళల సంఖ్య పెరిగింది. ఉద్యోగాలు చేసేవారి సంఖ్యకూడా పెరుగుతూ వస్తుంది. ఈనాడు మహిళలు ఆర్థిక స్వావలంభన దిశగా ప్రయాణిస్తున్నారు. నవలలో కూరలమ్ముకునే మహిళ దగ్గర్నుండి టీచర్లు, లెక్చరర్లు, లాయర్లు, డాక్టర్లు, క్లర్కులు ఇట్లా అన్నిరంగాలలో ఉన్న మహిళలు ఏవిధంగా కుటుంబాన్ని, ఉద్యోగాన్ని సమన్వయపరుచుకుంటూ ప్రగతివైపు అడుగులు వేస్తున్నారనే అంశం ఇతివృత్తంగా స్వీకరించబడిరది. ఈ మహిళా పాత్రలన్నీ కూడా దిగువ మధ్యతరగతికి  చెందినవి.

ఆడవారు ఉద్యోగాలు చేస్తే కుటుంబం అభివృద్ధి చెందుతుందనే ఉద్ధేశ్యంతో ప్రోత్సహిస్తున్న పురుష పాత్రలే నవలలో సందర్భానుసారంగా ప్రస్తావించబడ్డాయి. కాని మహిళలు ఒక హక్కులాగా ‘ఉద్యోగధర్మం స్త్రీ లక్షణం’ అని సమాజంలో సగభాగంగా స్త్రీలు తమకాళ్ళమీద తాము నిలబడడానికి ఇంకా చాలాకాలం పడుతుంది. ముందు సంపూర్ణ అక్షరాస్యత సాధించినట్లయితే రానురాను స్త్రీలందరు ఆర్థిక స్వావలంబన దిశగా విజయం సాధించగలుగుతారు.

‘‘సమాజంలో పురుషుడితో సమానంగా స్త్రీ పనిచేస్తూ .. ఇంట్లో తల్లిగా, భార్యగా విధులు నిర్వర్తిస్తూ … ద్విగుణీకృతమైన బాధ్యతలు చేపడుతున్నా క్రుంగిపోక, ఆర్థిక స్వాతంత్య్రం ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో కదిలిపోయే ఆ ఉద్యోగినులను రోజురోజు కన్నులపండుగగా తిలకిస్తుంటారు జనం’’. అన్న నవలలోని మాటలు మహిళా సాధికారతను తెలియజేస్తున్నాయి.

నవలలో సువర్చల మేడమ్‌, సరళటీచర్‌, పార్వతి, రాణి, వనజ, విమల, కమల, నిర్మల, జయ, కవిత, భార్గవి, వాణి, లక్ష్మి, కాంతం, రాజశ్రీ, సుబ్బలక్ష్మి, రాణి, సరస్వతి, కరుణ, రేణుక, అనసూయ, గౌరి, సరోజ, నిమ్మి, అమల, శమంతకమణి, విశాలాక్షి, సుందరి మొదలైన మహిళా ఉద్యోగునుల పాత్రలు వారిచుట్టు ఉన్న సమస్యలను, ఆనందాలను ఆవిష్కరిస్తారు.

పార్వతి పాత్ర ఆధునిక కాలంలో పుట్టి, పెరిగి, ఉద్యోగం చేస్తున్నప్పటికి ఆమె ఆలోచనలన్ని ప్రబంధకాలపు పరిధిలో ఉంటాయి. ఆమె వయస్సు యాభై ఏండ్లపైనే ఉంటుంది. తెలుగు లెక్చరర్‌గా మహబూబ్‌నగర్‌ ప్రభుత్వకళాశాలలో పనిచేస్తుంది. ప్రయాణం సమయంలో లలితసహస్రనామాలు వల్లెవేస్తూ ఉంటుంది. పార్వతి సనాతన ధర్మాన్ని ఇష్టపడ్డప్పటికి ఏమి అభ్యంతరం లేదుకాని, సమకాలీన సమాజంపట్ల ఆమెకు సదాభిప్రాయం లేదు. పార్వతి పాత్ర విద్యావంతురాలు, ఉద్యోగస్తురాలు కాని ఆమె సమాజ మార్పును స్వాగతించడానికి సిద్దంగా లేదు. సువర్చల మేడమ్‌ షాద్‌నగర్‌ స్కూల్‌లో షెడ్‌ మొస్ట్రెస్‌గా పనిచేస్తుంది. వయస్సు చేత, సంస్కారం చేత పెద్దరికంతో వ్యవహరిస్తుంది.

విమల మండలస్థాయిలో ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే ప్రభుత్వోగిని. పై అధికారి పురుషుడని విమలభర్త ఆరోపణ ‘‘విమలభర్త వట్టి అనుమానం మనిషి. ఆమె ఎదురుగా ఓ మగాడు వస్తుంటే చాలు. విమల మైలపడినంతగా గింజుకునేవాడు. రోజూ ఆఫీసులో ఏం చేస్తుంటావు. మీ ఆఫీసులో మగ వాళ్ళెంతమంది? మీ ఆఫీసరు మంచివాడేనా? అందంగా ఉంటాడా? పెళ్ళయిందా? పెళ్ళాంతో సఖ్యంగా ఉంటాడా? అంటూ ప్రతిరోజు ప్రశ్నలతో వేధించుకుతినేవాడట’’,  విమల పరిస్థితి మనచుట్టు ఉన్న సమాజంలో చాలా మంది స్త్రీలకు ఎదురయ్యే సమస్య. తరతరాలుగా స్త్రీని భోగవస్తువుగా, ఇల్లాలిగా, అబలగా చూసిన పితృస్వామ్య వ్యవస్థ మెళ్ళమెళ్ళగా ఇంటినుండి బయటికి వచ్చిన స్త్రీకి పురుషులనుండి ఇంటినుండి అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఇక్కడ విమలకు భర్త ఆర్థిక స్వావలంభనకు అవకాశం కల్పించినట్టే కల్పించి ఆమెను అనేక కట్టుబాట్లకు గురిచేస్తుంటాడు. నమ్మకం లేని చోట స్త్రీ పడే అవస్థలన్నిటిని విమల పడుతుంది. చివరికి ఆమె భర్త భార్యను ట్రాన్స్‌ఫర్‌ చేయించడానికి పెద్ద ఎత్తుగడ వేయాల్సి వచ్చింది. పై అధికారి విమలను లైంగికంగా వేధించాడని పత్రికకు ఇవ్వడంతో విమల కన్నీరుమున్నీరవుతుంది.

భర్త ఈగో మరియు అనుమానికి, చేయని తప్పుకు విమల పరువును పణంగా పెట్టడమన్నది దారుణమైన విషయంగా ఒక రాజకీయ అంశంగా చూడవచ్చు. అందుకే రచయిత్రి స్త్రీల మౌలిక సమస్యలన్నిటికీ కారణం ` పురుషుడి దురహంకారమే. ఆ దురహంకారం ‘భర్త’ అనే స్థానంలోనే ఉంది. వివాహవ్యవస్థ స్త్రీకి బయటి ప్రపంచం నుండి రక్షణనిస్తుంది. కానీ, ఇంట్లో మాత్రం ఆమె బందియే! ఆమె తన శారీరక బలహీనతకు, మానసిక సౌకుమార్యానికి మాతృత్వప్రేమకు అన్ని రకాలుగా బందీగా మారినప్పుడే ఆమెను భార్య అంటారు’’ అంటే స్త్రీ తనను తాను బందీ చేసుకుంటే తప్ప కుటుంబం నిలబడలేదు. విమల విషయంలో సమాజం, ఉద్యోగం సమస్యకాదు. భర్త అనుమానం ఆమెను అశాంతికి, అభద్రతకు గురిచేశాయి. అందుకే విమల భర్తనుండి విడివడడానికి నిర్ణయం తీసుకోకతప్పలేదు.

నిర్మల భర్త ఫస్ట్‌ తారీకు రాగానే లెక్కచేసి మరి డబ్బులు తీసుకుంటాడు. డబ్బులు అడిగితే ‘‘ఇంటికి కావలసిన సరుకులన్నీ నేనే తెస్తాను, నీకు రైల్వేపాస్‌ కూడా నేనే కొనిస్తాను. టిఫిన్‌ బాక్స్‌ తీసుకెళ్తావ్‌ … ఇంకా నీకు డబ్బెందుకు?’’ అంటాడు.

నిర్మల ఉద్యోగం చేస్తుందిగాని ఆర్థిక స్వాతంత్య్రం నిర్ణయాధికారం సాధించలేకపోయింది. స్త్రీ డబ్బు సంపాదిస్తే సరిపోదు. తన సంపాదనను ఎలా ఖర్చుపెట్టాలో నిర్ణయించుకునే స్వాతంత్య్రం ఉండాలి. స్త్రీల విషయంలో ఒక సమస్య మరొక సమస్య రూపాంతరం చెందుతుందే తప్ప పూర్తిగా పరిష్కారం కావడం లేదు. దానికి ప్రధానకారణం కుటుంబం, మతం, సమాజం చుట్టు అల్లబడిన, రాజకీయ అంశాలు, పెత్తనం చెలాయించాలనే పురుషుడి మనస్తత్వం.

రాధ ఉద్యోగం చేస్తున్న మహిళ. రైలు ప్రయాణంలో ఆ రోజు రాధతో పాటు ఆమె భర్త కూడా వచ్చాడు. ఎందుకంటే రాధకు ఎరియర్స్‌ యాభైవేలు వచ్చేవి ఉంటే ఆమె అంత డబ్బును ఎలా తెస్తుందో ఏమోనని రాధమీద నమ్మకం లేక ప్రయాణమయ్యాడు. రాధకు పాస్‌ ఉండటంతో టికెట్‌ కొనలేదు. భర్త కొనుక్కుంటాడనుకొని డైరెక్టుగా ట్రైనెక్కిసింది రాధ. నెక్ట్స్‌స్టాఫ్‌లో  రైలు ఆగగానే భర్త వచ్చి లేడిస్‌ కంపార్ట్‌మెంట్‌లో అందరిముందు రాధను చెంపదెబ్బ కొడతాడు. ఆమె చుట్టు ఉన్న మహిళలు అతన్ని  కొట్టి ఆడవాళ్ళ పరువు తీయవద్దని వార్నింగ్‌ ఇస్తారు. దానికి ఆమె భర్త ‘‘నా పెళ్ళాం నా ఇష్టం’’ అంటాడు. స్త్రీ భార్యగా ఉన్నంత మాత్రాన భర్త తాలుకు వస్తువుకాదు ఆమె ఒక మనిషి అన్న ఆలోచనా మార్పు పురుషుల్లో రావడం ఎంతైనా అవసరం. శమంతకమణికి రైలు ఆలస్యంగా ప్రయాణించడం వల్ల ఆఫీసుకు లేటవుతూ ఉంటుంది. కలెక్టరాఫీసులో ఉద్యోగం చేస్తు రోజు ఆలస్యంగా వచ్చి పబ్లిక్‌కు అసౌకర్యం కలిగిస్తుందని, హెడ్‌క్వార్టర్‌లో ఉండి ఉద్యోగాలు చేయాలి గాని, హైదరాబాదునుండి ఉద్యోగం చెయ్యడమెంటని ఎవరో కంప్లేంటు ఇస్తే శమంతకమణి లాంగ్‌లీవ్‌  పెట్టాల్సి వస్తుంది. ఒక స్త్రీ ఉద్యోగం చేసే చోట ఉండి, వారినికోసారి ఇంటికి వెళ్ళిరావడం అంటే సాధ్యపడదు. పురుషుడి విషయంలో అది సాధ్యమవుతుంది. కారణం కుటుంబం నడవాలంటే పొద్దస్తమానం స్త్రీ శక్తి, శ్రమ ధారపోయాల్సిందే.

లేడిస్‌ స్పెషల్‌ నవల మొత్తం ఆర్థికంగా నిలబడ్డ మహిళల సాధికారతను తెలియజేస్తూనే, మహిళలు ఉద్యోగాలు చేసే క్రమంలో ఇంటా, బయట తలెత్తుతున్న కొత్త సమస్యలను అనేక కోణాలల్లో విశ్లేషణ చేసి చూపించినది. దాదాపు 32 మహిళా పాత్రలు వారి వారి సమస్యలను పాఠకుల ముందుంచుతాయి. ముఖ్యంగా ఆర్థికంగా స్త్రీల చుట్టు ఉన్న సంకుచిత పరిధులు, అవి దాటి రాలేని పరిస్థితిని తేటతెల్లం చేస్తుంది లేడిస్‌ స్పెషల్‌ నవల.

Attachments area

You may also like

1 comment

కాటేపల్లి లక్ష్మీనరసింహ మూర్తి October 29, 2021 - 5:47 am

డా. దేవేంద్ర గారు ‘లేడీస్ స్పెషల్’ నవలలోని సామాజికాంశాలను చక్కగా వివరించారు. నవలను చదివినట్లే ఉంది. ఆ నవల రచయిత్రి పేరు ప్రత్యేకంగా తెలిపితే బాగుంటుంది. వారికి అభినందనలు.

Reply

Leave a Comment