పుట్టిన ఊరు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేములవాడ అయినా, రచయిత్రి డా.నమిలకొండ సునీత గారు వృత్తి రీత్యా ప్రభుత్వ తెలుగు పండితురాలుగా కామారెడ్దిలో పనిచేస్తూ, స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. భార్యా భర్తలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. డా.సునీత ఎంఎ,(తెలుగు) పండిత శిక్షణ పూర్తి చేసి, తెలుగు పండితురాలుగా పనిచేస్తున్నారు. ఎంఫిల్ చేసిన తదుపరి, 2018లో వరంగల్ జిల్లా పత్రికలు-నాడు నేడు, సాహిత్య సేవ అనే అంశంపై పిహెచ్ డి చేసి, ఒక గ్రంథంగా విడుదల చేశారు. 350 పేజీలున్న ఈ గ్రంథంలో తెలుగు పత్రికల తీరు తెన్నుల గూర్చి, సమాచార సేకరణ చేసి, దీర్ఘంగా, వరంగల్ జిల్లా పత్రికల చరిత్రను, జర్నలిస్టులు, సంపాదకుల వివరాలను, పత్రికల సాహిత్య సేవలను ఆసక్తి కరంగా చర్చించి, పత్రికల పై పరిశోధన చేసే వారికి ఒక ఉపయుక్తమైన గ్రంథంగా తీర్చి దిద్దారు. తెలుగు సామాజిక లోకానికి, ముఖ్యంగా తెలంగాణా ప్రాత్రికేయరంగానికి ఇది ఒక అపూర్వ కానుకగా పరిశోధించి ఇచ్చారనే చెప్పాలి. 2017 లో తెలుగు రీడర్ గా రిటైర్డయిన డా.అన్నదానం వేంకట సుబ్రహ్మణ్య పర్యవేక్షణలో ఉస్మానియా తెలుగు శాఖ నుండి పిహెచ్ డి పట్టాన్ని పొందారు. రచయిత్రి తెలుగు సాహిత్యంలో పరిశోధక రచయిత్రి కావడం వల్ల, ఇందులోని పరిశోధక వివరాలు, విశ్లేషణలు మేలిమి బంగారంలా కనబడతాయి. నేటి సమాజంలో ప్రజాస్వామ్య మనుగడకు ఉపకరించే పత్రికలకు ప్రతిష్టాపన శక్తి ఉంది. విలువలను ప్రతిష్టించగలుగుతాయి. ప్రజాస్వామ్య సౌధానికి నాలుగు స్తంభాలలో ఒకటైన పత్రికల పాత్ర సమాజంలో ఎంతో గొప్పది. కేవలం సెన్సేషన్ కోసం, సంఘర్షణ కోసం కాకుండా. సంస్కరణ కోసం పత్రికలు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలిచి, ఒక నిర్మాణాత్మకమైన పాత్రను పోషించాయని గైడ్ చెబుతూ, ఇందులకు రచయిత్రి చేసిన కృషిని ముందు మాటలు రాసిన సాహితీ ప్రముఖులు అభినందించారు. గోరాశాస్త్రి, మాడపాటి హన్మంతరావు, సురవరం, నార్ల, పొత్తూరి, ఎంవి.ఆర్. శాస్త్రి, ఎబికె.ప్రసాద్, దేవులపల్లి అమర్ వంటి ప్రముఖులు పత్రికా రంగంపై వివిధ కోణాల్లో రచనలు చేశారు. ఒక జిల్లా పత్రికారంగంపై పరిధిని ఎంచుకొని సిద్దాంత పరిశోధన చేయడం అరుదైన పనేయని రచయిత్రిని అభినందించక తప్పదు.
పేరుకు వరంగల్ జిల్లా పత్రికల అంశమైనా, ఇందులో తెలుగు పత్రికల చరిత్ర తీరును, సాహిత్య సేవలను చక్కగా విశ్లేషించారు. పాత్రికేయ, సాహితీ పెద్దలైన ముఖ్యుల సహాయ సహకారాలను తీసుకొని పరిశోధించి, ఈ గ్రంథాన్ని ఆసక్తి కరంగా మలిచారు. వీరు గత ఆరేడేళ్ళ నుండి వివిధ పత్రికలకు పరిశోధక సాహిత్య వ్యాసాలు రాస్తున్నారు. వివిధ మ్యాగజైన్ లలో కూడా వీరి పరిశోధక వ్యాసాలు కనిపిస్తుంటాయి. మొదట ప్రభాత కిరణాలు సాహిత్య వ్యాసాల సంచిక తర్వాత, వీరి పిహెచ్ డి గ్రంథం వెలువడింది. దీన్ని అయిదు అధ్యాయాలుగా విభజించి, రచయత్రి తన పరిశోధనను ప్రారంభించారు. రచయిత్రి వివరించిన ప్రస్తావన, ఉపసంహారాలు రెండింటిని కలిపి కూడా ఒక అధ్యాయంగా పరిగణించవచ్చును. విభజించిన అంశాలు. అవి 1.పత్రికలు-స్వరూప స్వభావాలు 2. సంపాదకీయాలు-పరిశీలన 3.పత్రికలు, భాషా సాహిత్యం 4.సంస్కృతి, పత్రికల స్థితి గతులు నాడు. నేడు 5.పాత్రికేయుల జీవన రేఖలు. ఇవి అయిదు భాగాలుగా విభజించి విశ్లేషణ గావించారు.
ప్రాత్రికేయ దిగ్గజం కీ.శే. పొత్తూరి వెంకటేశ్వర్ రావు, ప్రముఖ విప్లవ రచయిత వరవరరావు, సీనియర్ సాహితీవేత్త డా.టి.రంగస్వామి, గైడ్ సుబ్రమణ్యం తదితరులు ముందుమాటలు రాసి, భావి తరాలకు మేలు చేసే ఆకర సిద్దాంత గ్రంథమని, రచయిత్రిని అభినందించారు. ఈ పుస్తకంలోని భాష సరళంగా ఉంది. తీసుకొన్న వివిధా అంశాల విశ్లేషణలు, వివిధ కోణాల్లో ప్రామాణికంగా నిలిచాయి. పేరుకు వరంగల్ జిల్లా చరిత్రయినా, తెలుగు పత్రికల పరిశోధనలో సముచిత సిద్దాంత గ్రంథంగా నిలబడుతుందని అభివర్ణించారు. అన్ని జిల్లాల సాహిత్యంతో పాటుగా, రాజకీయ, సాంఘీక విషయాలపై పరిశోధనలు జరగాల్సి ఉందని, ఇలాంటివి తెలుగు పత్రికా సాహితీ రంగానికి వన్నె తెస్తుందని శ్లాఘించారు. దాదాపు వంద ఏళ్ళ కిందటి నుండి స్మృతి పథం నుండి పోతున్న పత్రికలను రచయిత్రి ప్రామాణీకంగా పరిశోధన చేయడం అభినందించ తగిన విషయమని అన్నారు. ఇలాంటి పరిశోధనలు ఇంతవరకు కోస్తా, రాయలసీమల్లో జరుగలేదని సంపాదక దిగ్గజం స్వర్గీయ పొత్తూరి వెంకటేశ్వరరావు గారు అన్నారు. వరంగల్ జిల్లా సీనియర్ పాత్రికేయులు కీ.శే. వి.ఎల్. నర్సింహారావుతో సహా మండువ రవీందర్, నమిలకొండ బాలకిషన్ రావు, గుముడవెళ్ళి మనోహర్ రావు, డా.టి.రంగస్వామి ప్రభృతులు రచయిత్రి డా. సునీతకు క్షేత్ర పరిశోధనలో తమ వంతు సహకారాన్ని అందించారు.
ఈ పుస్తకం పై రచయిత్రి నమిలకొండ సునీత తన అభిప్రాయం రాస్తూ, తన గ్రంథ రచనలో వరంగల్ జిల్లా పత్రికలే కాక, వివిధ పత్రికల యాజమాన్యం, సంఫాదకులు, విలేకరులు, రచయితలు, మొదలగు వారు అనేక అంశాలలో చేసిన పత్రికా సేవను పరిశోధనా దృష్టితో పరిశీలించి రికార్డు చేసినట్లు తెలిపారు. జూట్ అంటే జనపనార మిల్లుల యాజమాన్యాల వారి పత్రికలకన్నా, కార్పోరేట్ సెక్టర్, కాషాయ దళారీల స్వార్థ ప్రయోజనాల కోసం పత్రిక తీరులు మారుతున్నావి. ఇవ్వన్నిటికి మినహాయింపుగా ఉమ్మడి జిల్లా వరంగల్ నాటి పత్రికలు ఎంతగానో సామాజిక, సాహిత్య సేవ చేసాయని, డా. వరవరరావు ముందుమాటలో అన్నారు. సునీత గారి పరిశోధనలో తన రెండు దశాబ్దాల సృజన పత్రిక గూర్చి చక్కగా రాశారని, పత్రికల్లోని వివిధ అంశాలపై వింగడించి విశ్లేషణలు చేసి, వ్యాఖ్యానించడం అభినందనీయమని డా. వరవర అన్నారు. గుత్తాదారుల పరిశ్రమగా నడుస్తున్న ఈ కాలపు పత్రికలను కాదని, స్థానీయత వైపు మొగ్గి పరిశోధన చేయడంతో రచయిత్రి సంకల్ప కృషిని అభినందించి తీరాలని అన్నారు. డా.సునీత శత వసంతాల జిల్లా పత్రికారంగాన్ని సమీక్షించారని, పత్రికల అగచాట్లు,సాదక బాధకాలు, తీరు తెన్నులు, రాజకీయ, సినిమా పత్రికల గూర్చి ఇందులో చర్చించడం అభినందించదగిన విషయమని ప్రముఖ సాహితీవేత్త డా.టి.రంగస్వామి గారు తన ముందు మాటలో అన్నారు. వరంగల్ సాహిత్య చరిత్ర పరిశోధనకు ఇది ఒక విలువైన ఆకర గ్రంథమని అన్నారు. ఒక గృహిణీగా, రచయిత్రిగా, ఉద్యోగినిగా మూడు పాత్రల్లో ఉంటూనే, విభిన్నంగా పత్రికలపై సిద్దాంత పరిశోధన చేయడానికి సాహసించడం అభినందనీయమని అన్నారు.
ఇహ పరిశోధన పుస్తకంలోకి వెడితే, కత్తికంటే కలం గొప్పది, వార్తయందు జగము వర్ధిల్లు చున్నది. వరంగల్ జిల్లా పత్రికల్లో జనధర్మ, వరంగల్ వాణి, పాములపర్తి సదాశివరావు నిర్వహించిన కాకతీయ, ఒద్దిరాజు సోదరుల తెలుగు పత్రిక, డా.పెండ్యాల వరవరరావు గారి సృజన పత్రిక, దేవులపల్లి రామానుజారావు వారి శోభ తదితరుల అమూల్యమైన సాహితీ పత్రికా రంగ సేవలు ఇందులో కనిపిస్తాయి. పివి, కాళోజీల పాత్ర కనిపిస్తుంది. తెలంగాణా సాయుధ రైతాంగ పోరాట వ్యధలు, స్వాతంత్రోద్యమ కాలం నాటి సమాచారం, విప్లవ భావాల తీరు తెన్నులు చర్చకు వస్తాయి. ఈ పరిశోధక గ్రంథ రచనలో తనకు సహకరించిన డా.టి.రంగస్వామి దంపతులు, విఎల్. నరసింహారావుల సేవలు అమూల్యమని రచయిత్రి ధన్యవాదాలు చెప్పుకున్నారు.
ఈ సిద్దాంత పుస్తకంలో 16 పీజీల రచయిత్రి ప్రస్తావన అర్దవంతమైనది. ఇందులో రచయిత్రి పత్రికల సాహిత్య, సమాచార విశ్లేషణ పనస తొనకలు ఒలిచి పెట్టినట్లుగా ఉంది. స్వాతంత్ర్యం తర్వాత సర్వతోముఖాభివృద్ధికి కృషి చేసిన కాకతీయ వార పత్రిక నిర్వహణపై పాములపర్తి సదాశివరావు, పివి సారథ్యం వహించారు. ఇందులో పివి రాసిన వ్యాసాలు, కథలు, వివిధ రచనలు మారు పేర్లతో చోటు చేసుకున్నాయి. సదాశివరావు రచనలు తాత్విక, సాహిత్య కళారంగాలకు వన్నె తెచ్చాయి. భండారు చంద్రమౌళీశ్వరరావు ప్రగతి, రాజరాజ నరేంద్ర, చిత్ర విచిత్ర, ఎం.ఎస్.ఆచార్య జనధర్మ, వరంగల్ వాణీ, దేవులపల్లి రామానుజారావు వారి శోభ, పెండ్యాల వరవరరావు సృజన, జాతీయ సాహిత్య పరిషత్ వారి ఆధ్వర్యంలో వెలువడిన సాధన, నమిలకొండ బాకి వారి ప్రసారిక పత్రికలు జిల్లాలో నూతన దశ-దిశలను ఆవిష్కరించాయి. ఇలా రచయిత్రి మనోగతంలో అనేక విషయాలు పత్రికా రంగం, సాహితీ సేవలను గూర్చి సంతృప్తిగా చర్చించారు.
తెలుగు సాహిత్య చరిత్రలో సాహిత్య సాంప్రదాయం వేయ్యేళ్ళు కొనసాగిన సీమ అంటూ వరంగల్ ప్రాచీన చరిత్రను ప్రస్తావించారు. వరంగల్. ప్రాచీన ఆదిమానవుడి కాలం నుండి శాతవాహన, ఇక్ష్వాకు, రాష్ట్రకూట, చాళుక్య, కాకతీయ, పద్మనాయక, బహుమని, విజయనగర, గజపతి, కుతుబ్ షాహి, ఆసఫ్ జాహి సామ్రాజ్యం కొనసాగింది. ఇక్కడ ఎంతో అమూల్యమైన చరిత్ర దాగి ఉంది. కాకతీయ సామ్రాజ్యం ఒక వైపు పాల్కురికి వీరశైవం, భగవద్రామానుజుని శ్రీ వైష్ణవం, మరో వైపు మహాకవి పోతనామాత్యుని భాగవత సాంప్రదాయం మధ్య సమతౌల్యతను చేస్తూ, తన పత్రికా పరిశోధనా సాహితీ వ్యాసంగం కొన సాగినట్లు రచయిత్రి చెప్పుకున్నారు. ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆ కాలంలో నుండి ఇటీవలి కాలం వరకు 175 పత్రికలు వెలువడ్దాయంటే ఈ జిల్లా పత్రికా రంగ చరిత్ర ఘనమైనది, విస్తృతమైందని చెప్పక తప్పదు . దాశరథి, కాళోజీ, పివి, పాములపర్తి, ఎంఎస్ ఆచార్య వంటి ప్రముఖులు సాహిత్య పత్రికా రంగ సేవలో చిరస్థాయిగా నిలిచిపోయారు.
మొదటి అధ్యాయంలో పత్రికా రంగ స్వరూప స్వభావాల్లో, 1920 నుండి తెలంగాణాలో పత్రికా రంగానికి మైలురాయిగా నిలిచింది. ఇక్కడ నిజాం, బ్రిటిష్ పాలకుల అనుమతులు తీసుకోవాలి. మత ఘర్షణల గూర్చి, ప్రభుత్వ ఉద్యోగులపై ఎలాంటి వ్యతిరేక రాతలు, విమర్శలు రాయరాదు. ఇలా అనేక ఆంక్షలు ఎదుర్కొని పత్రికల ప్రారంభానికి పాలకులు సూక్ష్మ పరిశీలన చేసి, అనుమతులు ఇచ్చేవారు. అధికార భాష ఉర్దూ కావడం వల్ల, ఉర్దూ పత్రికలతో పాటు, తెలుగు, ఆంగ్లం తదితర భాషల్లో పత్రికలు ఆ కాలంలో వస్తూండేవి. దిన,వార,పక్ష, మాస పత్రికలు వస్తుండేవి. 1922లో తెలుగులో నల్లగొండ జిల్లా నీలగిరి, వరంగల్ జిల్లా వద్దిరాజు సోదరుల వారి తెనుగు పత్రికలు సాంకేతిక పరిజ్నానం అంతగా లేకున్న, వాటిని అధిగమించి ఎంతో సాహిత్య సేవ చేశాయి. హైదరాబాద్ సురవరం వారి సంపాదకత్వంలో (1926-47) గోలకొండ పత్రిక, 1947 నాటి షోయబుల్లాఖాన్ వారి ఉర్దూ రయ్యత్, ఇమ్రోజ్ లాంటి పత్రికలు ఎంతో సాహిత్య సేవ చేశాయి. హైద్రాబాద్ గోలకొండ కవుల సంచిక ద్వారా ఎంతోమంది కవులు వెలుగులోకి వచ్చారు.
వరంగల్ జిల్లాలో 175 పత్రికలు నడిచాయి. ఇందులో గోడ. లిఖిత, సైక్లోస్టైల్ పత్రికలు చేరాయి. ఎప్పుడైతే, 1980-90 దశకాలలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి పత్రికలు పెద్ద పెట్టుబడులతో సొంత ప్రింటింగ్ ప్రెస్ లతో వచ్చి, జిల్లా స్థాయి ఎడిషన్లు ప్రారంభించాక ఆయా జిల్లాలలో ఉన్న చిన్న పాటి పత్రికలకి పోటీలో నిలువలేక పోయాయి. వరంగల్ జిల్లాలో గ్రంథాలయోద్యమంలో పత్రికల పాత్ర, గొప్పది. సాంకేతికలు అంతగా లేని కాలంలొ, ఆ కాలం నాటి పత్రికల ప్రతులు దొరకలేదు. కొన్ని మాత్రమే లభ్యం. ఈ ప్రతులను భద్ర పరిచే అంశంలో కొంత శ్రద్ద వహించకపోవడాన్ని రచయిత్రి చివరన ఎత్తి చూపారు. వైశ్యకల్ప వంటి ఒకటి రెండు పత్రికలను మహిళా సంఫాదకులు నడిపారు. స్వాతంత్ర్యానికి పూర్వం పత్రికలు జాతిహితమనే పరమధర్మాన్ని ఎంచుకొని నడిపారు. స్వాతంత్ర్యం తదుపరి పత్రికా నిర్వహణలో భారీ పెట్టుబడుల రాకతో ఒక వాణీజ్య కలాపంగా మారింది. పత్రికల దశ దిశ మారింది. వరంగల్ జిల్లా పత్రికారంగ చరిత్ర ఇంధ్ర ధనస్సు లాగా అన్ని తత్వాలను, ఇజాలను, నూతన చైతన్యాలను, జాతీయ సంస్కృతులను, ఇముడ్చుకొని ముందుకు సాగింది. జాతీయ పత్రికా రంగానికి ఆద్యుడిగా రాజరాంమోహన్ రాయ్ అయితే, వరంగల్ పత్రికా రంగానికి ఒద్దిరాజు సోదరులు ఆద్యులుగా నిలిచారు. స్వాతంత్రోద్యమం, ఆంధ్రోద్యమం, గ్రంథాలయోద్యమం, నిజాం విముక్తి ఉద్యమం, విప్లవోద్యమం, సామాజిక ఉద్యమం, తెలంగాణా ఉద్యమం వంటి పలు ప్రజాస్వామిక ఉద్యమాలకు జిల్లా పత్రికలు బాసటగా నిలిచాయి. పత్రికా నిర్వహణ సమస్యలను ఎదుర్కొవడంలో అపసోపలు పడ్దా, దుష్ట శక్తులు, పాలకుల నియంత్రణలతో పలు సమస్యలు ఉన్నా, పత్రికల నిర్వహణ కొనసాగింది. నిష్పక్షక రిఫోర్టింగ్, ప్రజాస్వామ్య బాధ్యతలను ఎరిగి పత్రికలు, చిన్నపత్రికలు నడిచాయి. న్యూస్ ప్రింట్ కొరత, ప్రింటింగ్ కాస్ట్ పెరగడం, కార్మికులతో ఇబ్బందులు, వేతనాల సమస్యలు, అర్ధబలం, పాలకుల సహకారం లేక పత్రికల నిర్వహణ భారంగా ఉండేది. ఉదాహరణకు ఒద్దిరాజు సోదరుల తెనుగు పత్రికల విశేషాలను ప్రముఖంగా చర్చించారు. శైవపత్రికలు రెండు నడిచాయి. పిల్లల మాస పత్రిక పూలతోటతో పాటు, మానుకోట , సుకృతి, జ్నానోదయ వంటి లిఖిత పత్రికలు, సినిమా నేపథ్యంలో చిత్రవిచిత్ర అనే పత్రిక తదితర పత్రికలకు జిల్లా కేంద్రంగా నిలిచింది. ఒరుగల్లు, జర్మల్ ఆఫ్ ఇంగ్లీష్ స్టడీస్, ఫాతిమావాణీ, తెలంగాణా లీడర్, తాకీద్ వంటి ఆంగ్ల పత్రికలు కూడా వచ్చాయి. దయాళ్, నయ్యత్, కాకతీయ స్టార్, పరివార్, షరారే, ఉర్దూ హమారజహాన్ వంటి ఉర్దూ పత్రికలు వచ్చాయి. తెలుగు పత్రికలు 156 వరకు నడిచాయని రచయిత్రి ఒక జాబితాను పుస్తకంలో ఇచ్చారు. దళిత దర్బార్, దీపిక, పెన్ కౌంటర్,పల్లె జీవితం, ధర్మభూమి, సమస్య, విరాట్, మేడారం, ప్రజాయుగం, ప్రజలు, కాకతీయ టైమ్స్, తెలంగాణా రౌండప్, సిటీ టైమ్స్, పద్మమిత్ర, సచివాలయం, చురకలు వంటి విభిన్నాంశాల పత్రికలను ఈ పత్రికల జాబితాలో చేర్చారు.
సంపాదకీయాలు-పరిశీలన అనే రెండవ భాగంలో రచయిత్రి తెనుగు, ఆంధ్రాభ్యుదయం, దేవులపల్లి రామానుజారావు గారి శోభ, పాములపర్తి సదాశివరావుగారి కాకతీయ వార పత్రిక, ఎం.ఎస్. ఆచార్య గారి జనధర్మ, తదుపరి అనుబంధంగా వెలువడిన వరంగల్ వాణీ దినపత్రిక, దివ్వెల హనుమంతరావు గారి ప్రజామిత్ర,, సాధన, కాళోజీ, పెండ్యాల వరవరరావుగారి నలుగురు సాహితీ మిత్రుల ఆధ్వర్యంలో వచ్చిన సృజనతో పాటు, ఆరోగ్య సాధనం, ఏకశిల దినపత్రిక, నమిలకొండ బాలకిషన్ రావు గారి ప్రసారిక, అగ్రగామి, మానుకోట, ప్రజాతరంగం, ఆరోగ్యనిధి, సిరాశాసనం మొదలగు 19 పత్రికల సంపాదకీయాలను, నాటి కాలపు పరిణామాలను, వాతావరణాలను, సంపాదకీయాల విలువలను, నిష్పాక్షికతలను రచయిత్రి తన కున్న ముడి సమాచారంతో అధ్భుతంగా విశ్లేషించారు. శాస్త్రీయత నూటికి నూరు పాళ్ళుగా కనబడుతుంది. తెలంగాణా భాష, యాస, చమత్కారంగా, సరళంగా ప్రజాభిప్రాయాల్ని ప్రతిబింబించే విధంగా సంపాదకీయాలు ఉండేవని రాశారు.
తెలుగు పత్రికల్లో సురవరం వారి గోల్కొండ పత్రికల సంపాదకీయాల తర్వాత, ఇక్కడి పత్రికలు అలరించాయి. వద్దిరాజు సోదరుల తెనుగు పత్రిక సంపాదకీయాల్లో ఇతర పత్రికల విషయాలు చర్చకు వస్తుండేవి. ఆ కాలపు రోజుల్లో ఇతర ప్రాంతాల నుండి వెలువడే పత్రికలు ఎలా చేరి యుంటాయన్న విషయమై రచయిత్రి సందేహం వెలిబుచ్చుతారు. అంటే ఆ కాలంలోనే పత్రికల పరిశీలన కూడ విస్తృత ప్రాతిపదికన ఉండేదన్న విషయం మనకు స్పస్టమవుతుంది. సమకాలీన రాజకీయ అంశాలపై కాకుండా, దేశవిదేశాల అంశాలు, ఇతర అనేక విషయాలపై వ్యాసాలు, సంపాదకీయాలు రాశారు. శాసన సభ అలక, స్త్రీ విద్య, అంతర్ రాష్ట్ర సంబంధాలు, పాలకులు-పాలితులు, రాజ్యాంగ శ్రద్ద, సంఘం, వార్షికోత్సవములు, గ్రామ కరణముల సంఘం, పండిత సభ-ఆంగ్లేయుల హెచ్చరిక, మహాత్ముడు నాయకుడు కాడు, ఆలిఘర్ విశ్వవిద్యాలయము, టప్సా,ఉపాయములు, ఉత్తర ఆర్కాట్ లో గల అగ్ని సమస్తానం వంటి అంశాలపై రాసిన వ్యాసాలు, సంపాదకీయాలు అలరించే విధంగా ఉండేవి. నిజాం నాటి ఆంధ్ర జనసంఘం మన అక్కర అనే అంశంపై రాయబడిన సంపాదకీయం ఇది ప్రజల ఆశాజ్యోతిగా నిలిచింది.
కోకల సీతారామశర్మ సంపాదకత్వంలో వెలువడిన ఆంధ్రాభ్యుదయం సారస్వత చైతన్య సేవ చేసింది. తాళపత్రాల సేకరణ గూర్చి రాసింది. సాహితీ విలువలతో రాణీంచిందని రచయిత్రి రాశారు. రజాకార్ల పైశాచిక కృత్యాలపై శోభ పత్రికలో దేవులపల్లి వారు రాసిన సంపాదకీయం ప్రాముఖ్యత నొందింది. ఆధునిక ఆంధ్ర వాజ్మయ సౌధము అని పేరున చక్కటి సంపాదకీయం రాశారు. దేవులపల్లి వారి శోభ పత్రిక రెండు సంవత్సరాలు నడిచింది. కాకతీయ పత్రిక రాజకీయోద్యమం దిశగా సాగినప్పటికినీ, మార్టిస్ట్ ధోరణీలో ఉండి, సాహితీ కృషికై పరితపించింది. జనధర్మలో సంపాదకీయాలు సాహసోపేతంగా ఉండేవి. ఔషధాలతో కాక ఆపరేషన్లు అవసరమా అని సంపాదకులు ప్రశ్నించారు. తెలంగాణా పోరాటం, అభివృద్ధి సమస్యలను 1960-88 వరకు తన సంపాదకీయాల రూపంలో వెలుగులోనికి తెచ్చారు. విప్లవ పత్రికగా పేరు పడిన సృజన పత్రికలో సంపాదకీయాలు ప్రజాభిప్రాయానికి వేదికగా, బడుగు, అణగారిన వర్గాల వారి వాణిగా, పౌరహక్కులు, విప్లవ పోరాటాల ప్రస్తావనలతో నిండి ఉండేవి. సిరాశాసనం సంపాదకీయాలు కూడా అలాగే ఉండేవి. ప్రజల అభిప్రాయాల కు అనుగుణంగా నాటి పత్రికలు సంపాదకీయాలు అలరించాయని పరిశోధక రచయిత్రి పేర్కొన్నారు. చౌడవరపు విశ్వనాథం, భండారు చంద్రమౌళీశ్వరరావుల ఆద్వర్యంలో వెలువడిన ప్రగతి పత్రిక నిజాం ప్రభుత్వం పత్రికా స్వేచ్చపై ఆంక్షలు విధించినా తీవ్రమైన భావజాలంతో లెక్కచేయక వారపత్రికగా నడించింది.
మూడవ అధ్యాయంలో పత్రికలు-భాషా, సాహిత్యం, సంస్కృతి అనే అంశంపై చర్చించారు. ఇందులకు తెనుగు పత్రిక, శోభ, సృజన, ఓరుగల్లు, ఆర్షధర్మం, ప్రజాతరంగం,కాకతీయ మొదలగు పత్రికల తీరును సమీక్షించారు. ఇందులోనే పత్రికలు-సాహిత్య సేవ అనే అంశం తీసుకొని చర్చించారు. తెనుగు, ఆంధ్రాభ్యుదయం, శోభ, జనధర్మ, కాకతీయ, ప్రజామిత్ర, అదృష్టం, కాకతీయ పక్షపత్రిక, ఆరోగ్య సాధనం, వరంగల్ వాణీ, అగ్రగామి, ప్రసారిక, శక్తి బిందు, నవోదయం, వైశ్యకల్ప, ప్రజాతరంగం, ఆయుధం, సిరాతరంగం, తెనుగుతల్లి తదితర పత్రికల తీరును సమీక్షించారు. భాషా సాహిత్యాల పరిరక్షణలో వరంగల్ పత్రికలు ఒక వేదికగా నిలిచాయని, తొలుత గ్రాంధికంలో ఉన్నా, తదుపరి వ్యావహారిక భాషకు పట్టం కట్టారని, నూతన పదబంధాల రూపకల్పనకు కృషి చేశాయి.
ఉర్దూ రాజ భాషగా ఉన్నా, ఆ నాటి పత్రికలు తెలుగు భాషా చైతన్యానికి తమ వంతుగా కృషి చేశయి. వద్దిరాజు సోదరుల పత్రిక పేరే తెనుగు. ఇది 1922లో ప్రారంభమైంది. తెలుగు భాషా చైతన్యానికి ఈ పత్రిక పూనుకొంది. ప్రముఖ పరిశోధక రచయిత గుమ్మనగారి బాల శ్రీనివాసమూర్తి వద్దిరాజు సోదరుల భాషాభిమానం గూర్చి చేసిన అంశాలతో చక్కటి పరిశోధక రచయిత్రి చర్చ చేశారు. కొత్తరచయితల వ్యాసాలు, సాహితీ విశేషాలు, గ్రంథ పరిచయాలు, సమీక్షలు, నాటక సమీక్షలు కూడా వస్తుండేవి. సమగ్ర భాషా దృక్పథం, భాషా పటుత్వం తొణీకిసలాడింది. మరుగుపడి అనాదరణకు గురైన వివిధ పుస్తకాల వివరాలు సేకరించి రాయటంలో కోకల సీతారామశర్మ సంపాదకత్వలో వెలువడిన ఆంధ్రాభ్యుదయం మాస పత్రిక కృషి అపారం. ఉర్దూ తెలుగు వంటి సంకర భాషా వ్యాప్తి నిరోధానికి ఈ పత్రిక కృషి చేసింది. ముదిగొండ బుచ్చిలింగయ్య శాస్త్రి స్వీయ మార్గం, ప్రహసనాలపై రాసిన కామరుషి మృత్యుంజయశర్మ ప్రహసనాలు వ్యాసాన్ని ఈ పత్రిక ప్రచురించింది. పరిశోధకులకు శోభ పత్రిక తగిన ప్రోత్సాహం ఇచ్చింది. 1950 ఫిబ్రవరి, 4,5,6 తేదీలలో తూప్రాన్ లో జరిగిన ఆంధ్రసారస్వత పరిషత్ వారి సభల ప్రత్యేక సంచికను వెలువరించి, సాహిత్యాభిమానాన్ని చాటుకొంది.
కాకతీయ పత్రిక సంపాదకులు పాములపర్తి సదాశివరావు గారు, సందేశం కమ్యూనిస్ట్ పత్రికకు ఎడిటర్ గా ఉంటూ బౌద్దం, శంకరాద్వైతం వంటి ప్రత్యేక సంచికలను వెలువరించారు. వరంగల్ వాణీ ఎడిటర్ ఎం.ఎస్. ఆచార్య గారు ముఖ్యమంత్రి జలగం వెంగళరావు సిఎం హోదాలో వరంగల్ కు వచ్చినపుడు ప్రత్యేక సంచికను తీశారు. పివి, కాళోజీ, పల్లా, రామకోటాచార్య, డా.టిఎస్.మూర్తి తదితరుల ప్రత్యేక సాహితీ సంచికలను, కవితా సంకలనాల వంటి గ్రంథాలను ప్రచురించింది. సాధన మాస పత్రికా సంపాదకులు దివ్వెల హన్మంతరావుగారు జాగృతి ఎడిటర్ గా, వరంగల్ పోతన విజ్నాన పీఠం వ్యవస్థాపనలో పాలు పంచుకున్నారు. కృష్ణావతారం అనే మున్షీ రాసిన ఆంగ్ల గ్రంథాన్ని ఏడు సంపుటాలుగా తెలుగులోకి అనువదించి, అచ్చులోకి తెచ్చారు. ప్రగతి పత్రికలో మహాకవి దాశరథి గారి రచనలు విరివిగా వస్తుండేవి. భండారు చంద్రమౌళీశ్వరరావు గారు విశ్వేశ్వర, దుర్గా మహిళా సంస్కృతాంధ్ర కళాశాల, ఆయుర్వేద కళాశాల స్థాపనలో ముఖ్య పాత్రను పోషించారు. ఇలా సంఫాదకులు ఎన్నెన్నో సామాజిక ప్రయోజనాల పనులకు ఆ కాలంలో శ్రీకారం చుట్టారని రచయిత్రి తమ పరిశోధన ద్వారా ఆసక్తికరమైన విషయాలను తేట తెల్లం చేశారు. ఆంధ్రప్రభ ఉప సంఫాదకులుగా పనిచేసిన పిఎన్.స్వామి నవసమాజం పత్రికను కొద్దికాలం నడిపారు. వీరు జర్నలిస్టుల యూనియన్ కు నాయకునిగా రాణించారు. మాజీ మంత్రియైన స్వర్గీయ పివి.రంగారావు కాకతీయ పక్ష పత్రికను నెలకొల్పి, విఎల్. నరసింహారావు సారధ్యంలో కొంతకాలం నడిపి, పత్రికారంగానికి సేవలందించారు. పిఎన్.స్వామి గారు ఆనాటి రజాకార్లు, నైజాం పాలకుల దౌర్జన్యలపై కాకతీయ వార పత్రికకో సాహసోపేతంగా రిపోర్టింగ్ చేస్తుండేవారని, ఆ నాటి కలెక్టర్ సంపాదకులైన పాములపర్తి సదాశివరావును పిలిపించారని రచయిత్రి చెప్పుకొచ్చారు.
శాస్త్రీయ దృక్పథంతో భాష ఉండాలన్న ధ్యేయంతో సృజన పత్రిక పనిచేసింది. 1966లో ప్రారంభమైన ఈ త్రైమాసిక పత్రిక కాళోజీ మొదటి ఎడిటర్. తదుపరి వరవరరావుగారు. సాహితీ మిత్రులు నవీన్, తిరుపతయ్య, వేనరెడ్డిలతో కలిసి స్థాపించారు. గద్దర్, అల్లం రాజయ్య, నారాయణ, అల్లం వీరయ్య వంటి ప్రముఖుల రచనలను ఇందులో వచ్చేవి. శ్రీశ్రీ, బుచ్చిబాబు మొదలగు సాహితీ దిగ్ధంతుల ప్రత్యేక సంచికలను సృజన ప్రచురించింది. అంపశయ్య నవల కొంత భాగం దారావాహికంగా ఇందులోనే వచ్చింది. సాహిత్య సేవలో ఆనాటి పత్రికలు మహిళా రచయితల రచనలు వేసేవి. ఇక్కడి పత్రికలు సాహిత్యరంగాన్ని విస్మరించకుండా చక్కగా ప్రాధాన్యతలతో సృజిస్తూనే వ్యాసాలు రాస్తుండేవి. తెనుగు పత్రిక సాహిత్య సేవ అపూర్వం. ఇ.రాజయ్య, రత్నమ్మ లాంటి వారి కవిత్వాలు వచ్చాయి. ఆంగ్ల పద్యాల అనువాద రచనలు కూడా వచ్చేవి. ఆచార్య బిరుదురాజు రామరాజు, పిఎన్.శాస్త్రి, డా.పివి.రమణయ్య, కోదాటి రామక్రిష్ణారావు, ములుగు వీరభద్రశాస్త్రి, పింగళి లింబారెడ్డి, మసిపట్ల పట్టాభి రామకవి, తిరునగరి జీయర్ స్వామి వంటి వారల సాహిత్య, సామాజిక రచనలకు వేదికగా నాటి వరంగల్ పత్రికలు నిలిచాయి.
శోభ పత్రికలో దాశరధి అగ్నిధార, కాళోజీ నా గొడవ ప్రచురితమయ్యాయి. పొట్లపల్లి రామారావు, ఆదిరాజు వీరభద్రరావు, పల్లా దుర్గయ్య వంట్ఇ దిగ్దంతుల రచనలు వచ్చేవి. నాటి జనధర్మ పత్రిక వట్టికోట ఆళ్వార్ స్వామి వారి గంగు అసంపూర్ణ నవలను ధారావాహికంగా వేసింది. ప్రజామిత్ర పత్రికలో రామా చంద్రమౌళి, గట్టు రామిరెడ్డి నవలలు సీరియల్ గా వచ్చాయి. కాకతీయ పక్ష పత్రికలో విద్వాన్ విశ్వం, దిగంబర కవి కేశవరావు, సుప్రసన్న, పల్లా దుర్గయ్య, కాళోజీ, దాశరథి, అముముల కృష్ణమూర్తి తదితరుల పండితుల కవిత్వాలను ప్రచురిస్తుండేది. సృజనలో గ్రంథ సమీక్షలు, వ్యాసాలు, అనువాద రచనలు వస్తుండేవి. ఓరుగల్లు ఆంగ్ల పత్రికలో కథలు, కథానికలకు వేదికగా నిలిచాయి. దాశరథి, దివాకర్ల వెంకటావధాని గార్ల కవిత్వాలని వేశాయి. 1980లో ప్రారంభమైన ప్రసారిక పత్రికలో వచ్చే రచనలు, గ్రంధ సమీక్షలు, సాహిత్య విమర్శల గూర్చి విస్తృతంగా రచయిత్రి చర్చించారు. డా.టి.రంగస్వామి వంటి సాహితీ ప్రముఖులు ఈ పత్రికకు చేదోడు వాదోడుగా ఈ పత్రికకు అండగా నిలిచారు. ప్రతి సంవత్సరంలో ప్రసారైక రెండు ప్రత్యేక సంచికలను వెలువరించేవి. 2014లో కాళోజీ జన్మదిన, 2015లో వరంగల్ ఆకాశవాణి రజితోత్సవాల గూర్చి ప్రత్యేక సంచికలను వేశాయి. ఈ పత్రిక నాలుగు దశాబ్దాలైనా నేటికినీ కొనసాగుతుండడం ఒక ప్రత్యేకత.
నాల్గవ అధ్యాయంలో పత్రికల స్థితిగతులు-నాడు నేడు అనే అంశాన్ని తీసుకొని, పరిశోధక రచయిత్రి చర్చించారు. ఇది ఎనిమిది పేజీలలోనే రాసినా, అనేక విషయాలను ప్రస్తావించారు. ఈ అధ్యాయంలో రచయిత్రి చర్చ శాస్త్రీయంగా ఉంది. పత్రికలు బ్రిటిష్, నైజాం నిరంకుశ పాలనలో వారి వారి నిబంధనలకు అనుగుణంగా ప్రారంభించడం కష్టతరంగా ఉండేది. ఆనాటి సర్కార్ వారు, పత్రికలకు అంతగా స్వేచ్చ నివ్వడానికి అనుమతులు ఇచ్చేవి కావు. పత్రికా నిర్వహణ, ఖర్చులు, సర్క్యులేషన్ అన్నీ భారంగానే ఉండేవి. చాలా పత్రికలు పురుటిలోనే మూతపడ్డ వైనాన్ని రచయిత్రి మనముందు ఆవేదనతో ఉంచారు. నాటి పత్రికల దశను 1920-1970 వరకు, 1971-2020 వరకు రచయిత్రి విభజించారు. ఈ కాలాదులలో పత్రికా రంగంలో అనేకంగా వచ్చిన మార్పులను సంక్షిప్తంగా చర్చించారు. 1922 ఆగస్ట్ 22 న ఒద్దిరాజు సోదరులతో ఇనగుర్తి నుండి తెనుగు పత్రిక సొంత ప్రెస్ తో మొదలైంది. ఈ పత్రిక మిగతా జిల్లాలోని అన్ని పత్రికలకు మార్గదర్శిగా నిలిచింది. భాషా,సాహిత్య, సంపాదకీయ, సాంస్కృతిక విలువలకు ప్రాధాన్యత ఇస్తూ, మనుగడను సాగించింది. తదుపరి ఆంధ్రాభ్యుదయం, శోభ, శైవ ధార్మిక, మానుకోట, కాకతీయ వంటి పత్రికలు జిల్లా సమాచార రంగాన్ని సుసంపన్నం చేశాయి. జిల్లాలోని తొమ్మిది దశాబ్దాల పత్రికా రంగ నిర్వహణ తీరును, చరిత్రగా పరిశోధించి రికార్డు చేయడం చూస్తే, రచయిత్రి ఎంతో శ్రమకోర్చిన వైనం ప్రస్ఫుటమవుతుంది. ఒక సన్నివేశంలాగా, ఒక మహత్తర అధ్బుతంగా ఈ సిద్దాంత రచనలో కనిపిస్తాయి. నాటి కాలపు చిన్న పత్రికలపై పరిశోధన ఆశామాషీ కాదు. నాటి పత్రికల ప్రతులు, సంబందీకులు, ఆ కాలపు వివరాలు, సమస్యలు దొరకడం దుర్లభం. చాలా మంది వాళ్ళ వారసులు వాటిని నిల్వ చేయక పోవడం పట్ల రచయిత్రి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఆ నాటి కాలపు విషయాలు, ప్రత్యేక సంచికలు, గ్రంధస్త వివరాలను ముడిగా, అతి కష్టంగా సేకరించి, విశ్లేషించి రాయడం ఒక నైపుణ్యమే. ఈ కాలపు సాంకేతిక నైపుణ్యాలు నాటి కాలంలో లేవు. అయినా రచయిత్రి క్లిష్టతరమైన అంశాన్ని ఎన్నుకొని చేసిన పరిశోధన వందకు వందశాతం ఫల వంతమైందని చెప్పవచ్చును. తన సిద్దాంత రచన కోసం రచయిత్రి తాను పర్యటించిన అనుభవాలను అక్కడక్కడా రికార్డు చేశారు.
అయిదవ అధ్యాయంలో పాత్రికేయుల జీవన రేఖలు అనే అంశం తీసుకొని, 41 మంది పాత్రికేయుల విశేషాలను సంక్షిప్తంగా ఫోటోలతో పరిచయం చేశారు. ఈ అధ్యాయం ఈ పరిశోధక పుస్తకానికి గుండె కాయ లాంటిదని చెప్పవచ్చును. ఇందులో చాలా మంది సాహితీ మూర్తులు కావడం విశేషం. ఎందుకంటే ఈమె గారి టైటిల్ వరంగల్ జిల్లా పత్రికలు, నాడు, నేడు, సాహిత్య సేవ అనే అంశమే. ఏ అధ్యాయంలో చూసినా, పాత్రికేయ రంగ సమాచారంతో పాటు, ఆ నాటి సంపాదకులు, రచయితల సాహిత్య సేవ అనే అంశం అంతరార్ధంగా కనిపిస్తుంటుంది. సంపాదకుడు ఎలా ఉండాలో, పత్రిక ప్రారంభ చట్టాలు ఎలా ఉంటాయి అనే అంశాలపై రచయిత్రి చర్చించారు. పత్రికారంగంలో నేడు అనారోగ్య ధోరణులు వచ్చాయి. ఇప్పుడు యజమాని, సంపాదకుడు వేర్వేరుగా ఉన్నారని, ముందు అన్ని బాధ్యతలు సంపాదకుడే చూసుకొనే వారు. సంపాదకుడే వార్తలు, పత్రికా నిర్వహణకు, వివరాలకు బాధ్యత వహించేవారు. సమాజ శ్రేయస్సు, ధర్మాగ్రహంతో పనిచేసేవారు. వరంగల్ జిల్లా సంపాదకులు అనేక కష్ట నష్టాలకోర్చి పత్రికలను నడిపారు. తెనుగు పత్రిక నిర్వాహకులలో ఒకరైన ఒద్దిరాజు సీతారామచంద్రరావు గారిని సంపాదక పితామహుడిగా అభివర్ణించారు. ఎంఎస్. ఆచార్య, సృజన, ప్రసారిక సంపాదకీయాలు అచ్చులోకి వెలువడినాయి. ఒద్దిరాజు సోదరులు(తెనుగు పత్రిక), కోకల సీతారామ శర్మ, ముదిగొండ వీరేశలింగశాస్త్రి, కంభంపాటి అప్పన్నశాస్త్రి, చాగంటి భాస్కర లింగ శాస్త్రి, దేవులపల్లి రామానుజారావు(శోభ పత్రిక), బి.ఎన్.గుప్త (మానుకోట), పాములపర్తి సదాశివరావు, టి.రాజేశ్వరరావు,(ఓరుగల్లు పత్రిక), టి.లోకాచార్యులు(మానవధర్మ), ఎంఎస్.ఆచార్య(జనధర్మ), దివ్వెల హన్మంతరావు(ప్రజామిత్ర), భండారు సదాశివరావు(సాధన), టివైఎన్.చారి(దేవస్థానవాణీ), భండారు చంద్రమౌళీశ్వరరావు(ప్రగతి), పిఎన్.స్వామి(నవసమాజం), ఆచార్య కోవెల సంపత్కుమారాచార్యులు (సుకృతి లిఖిత పత్రిక), బొబ్బల ఇంద్రసేనారెడ్డి (గ్రామజ్యోతి గోడ పత్రిక), పివి.రంగారావు(కాకతీయ పక్షపత్రిక), చిలువేరు కృష్ణమూర్తి (ఆరోగ్య సాధనం), పెండ్యాల వరవరరావు (సృజన), నమిలకొండ బాలకిషన్ రావు(ప్రసారిక), గుండా ప్రకాశరావు(యువతరంగం), గుముడవెళ్ళి మనోఃహరరావు(ప్రజాతరంగం), సిబి.లక్ష్మి(మానుకోట), నవాబ్ (సిరా శాసనం), రవీంద్రశర్మ(ఆయుధం), పరకాల సతీష్ (తెలుగు తల్లి), అనిల్ కుమార్ గౌడ్ (కాకతీయ టైమ్స్) వంటి సంపాదకుల పరిచయాలు ఫోటోలతో నిండుగా కనిపిస్తాయి.
రచయిత్రి ఉపసంహార (ముగింపు) వ్యాసంలో జిల్లా పత్రికల చరిత్ర రంగ చరిత్రకు రాయడానికి చేసిన వస్తు సేకరణ, పడిన అష్ట కష్టాలను వివరించారు. సాంకేతికలు అంతగా లేని కాలం అది. సిడీలు, పెన్ డ్రైవ్ లు లేని కాలంలో పత్రికల ప్రతులు అంతగా లభించకున్నా, పరిశోధనను ఆపకుండా కొనసాగించారు. పత్రికలను పదిలపరిచే సాంకేతిక సౌకర్యం లేని కాలంలోని పత్రికలపై పరిశోధన చేశారు. దొరికిన కొన్ని ప్రతులతోనే, ముఖ్యుల సాయంతోనే విశ్వసనీయంగా పరిశోధనను సాగించారు. నిజాం విముక్తి పోరాటం, స్వాతంత్రోద్యమ ఫోరాటాల్లోను జిల్లాలో పత్రికలు నిర్వహించిన పాత్ర చిరస్మరణీయమైనది. మూలసూత్రమైన ప్రజాస్వామ్యాన్ని అనుసంధానం చేసుకొంటూ, శాంతి సాధనలో దైర్య సాహసాలతో నూతన సమాజ నిర్మాణానికి నాటి వరంగల్ జిల్లా పత్రికలు, వారి సాహిత్య సేవల కృషిని రచయిత్రి వేనోళ్ళ శ్లాఘించడం కనిపిస్తుంది.
తెలుగు సాహిత్య అకాడమి, తెలుగు విశ్వవిధ్యాలయం, తెలంగాణా సాహిత్య అకాడమి వంటి ప్రభుత్వ రంగ సంస్థలు చేయలేని పనిని తన భుజాన వేసుకొని, రచయిత్రి చేసిన కఠోర పరిశోధక పరిశ్రమను అభినందించక తప్పదు. తాను జర్నలిస్టు కాకున్నా, జర్నలిజం విలువలను వివరిస్తూ, పరిరక్షించేలా సాహిత్యాంశాలను అల్లుతూ విశ్లేషిస్తూ రాశారు. చివరన కొసమెరుపులు, పత్రికల జాబితాను, ఉపయుక్త గ్రంద్థ సూచిని ఇచ్చి, పాటకులకు తన పరిశోధనా పటిమను ఎరుక పరిచారు. ఉన్నత విద్యావంతురాలైన ఒక యువ స్త్రీ మూర్తి ఈ రకమైన తెలంగాణాలోని సాంస్కృతిక, సాహితీ కేంద్రమైన వరంగల్ ఉమ్మడి జిల్లా పత్రికారంగ చరిత్రపై పరిశోధన చేసి, సాఫల్య విజయం సాధించడం చూస్తే, ఆమె పరిశోధక తపస్సుకు సాహితీ వేత్తలు, పాటకులు జేజేలు పలకాల్సిందే. కాకతీయ తోరణంతో పుస్తక ముఖచిత్రం అలరించింది. తన బెటర్ హాప్ ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న అవుసీపురం ప్రభాకర శర్మ గారికి అక్షరాభివందనంగా ఈ పరిశోధక పుస్తకాన్నిఅంకితంగా సమర్పించుకున్నారు. పుస్తక ప్రచురణ: జనవరి, 2018. పేజీలు: 340. వెల:300 రూపాయలు.
1 comment
“వరంగల్ పత్రికారంగం సాహిత్యసేవ నాడు-నేడు” పుస్తకంపై సంకేపల్లి గారు చేసిన సమీక్ష సమగ్రంగాను, సమాచారము ఇచ్చేదిగా ఉంది. రచయిత్రికి, సమీక్షకుడికి అభినందనలు