Home ఇంట‌ర్వ్యూలు వర్తమాన కవులలో అధ్యయనం తక్కువైంది- రాయడం ఎక్కువైంది- కందాళై రాఘవాచార్య

వర్తమాన కవులలో అధ్యయనం తక్కువైంది- రాయడం ఎక్కువైంది- కందాళై రాఘవాచార్య

by Naresh Chary

1. కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి సర్
జ :  మా తాత ముత్తాతలు కరీంనగరం జిల్లా మెట్ పల్లి దగ్గరి బండలింగపురం సంస్థానం గ్రామంలో ఉండేవారు. మా తాత పేరు కందాళై రాఘవాచార్య .వారూ సాహిత్యంలో ఎక్కువ పద్యాలు రాసే వారు. అప్పటి దొరగారు కవులను పండితులను గౌరవించేవారు. శతావధాని కృష్ణమాచార్యులు ఇక్కడ ఆస్థాన కవిగా ఉండేవారు.పృథ్వీరాజ్ కపూరు సత్య సాయిబాబ లాంటి వారు ఇక్కడికి వేసవిలో వచ్చి ఉండేవారు. మా నాన్న కందాళై గుండాచార్యులు పౌరోహిత్యం చేసేవారు. ఇక్కడ రెండవ తరగతి  వరకు చదివాను. 1958 లో ఒక ఆలయంలో పూజారిగా స్థిరపడి ఉండటానికి నిజామాబాద్ వచ్చాము.మా అమ్మమ్మ ఊరు కోరుట్ల దగ్గరి అయిలాపురం గ్రామం. తాత గారు దప్పూరి శ్రీనివాసాచార్యులు వేమన సుమతి రామకుమారి శతకాలను ఉదయం లేపి వల్లె వేయించేవారు. ఈ పద్య పారాయణం  నాలో కవిత్వానికి బలమైన బీజమై ఉంటుంది .మేము నల్గురు అన్నదమ్ములం. ఒక చెల్లె

2. మీ బాల్యం,విద్యాభ్యాసం గురించి చెబుతారా?
జ. బండ లింగాపురంలో 2 వ తరగతి. తరువాత నిజామాబాద్ లోనే డిగ్రీ వరకూ విద్యాభ్యాసం. యం. ఎ .తెలుగు ప్రయివేట్ గా అంటే ఎక్స్టర్నల్ ఎక్జామ్స్ ఉస్మానియా లో రాసి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడనయ్యాను.

3. మీ ఉద్యోగ జీవితం గురించి చెప్పండి
జ. 1985 సెప్టెంబర్ లో నేను డి.యస్. సి  రాసి అప్పటి స్పెషల్ టీచర్ గా ఉద్యోగం సంపాయించాను.యన్. టి రామారావు అప్పటి ముఖ్యమంత్రి. మొదట వజ్జపల్లి అనే చిన్న తండా లో పనిచేసాను. అక్కడి ప్రజల విద్యార్థుల అభిమానం సంపాదించాను. అప్పటి విద్యార్థులు కొందరు మిలిటరీలో ఉన్నారు.హైదరాబాద్ వచ్చినపుడు కలుస్తారు. అక్కడి నుండి నిజామాబాద్ లోని తారకరామ నగర్.రెంజల్ మండలంలోని రెంజల్  , కళ్యాపుర్. తరువాత చివరకు నిజామాబాద్ లోని మోపాల్ గ్రామంలో పనిచేసాను. మొత్తం ఐదు పాఠశాలలో ఉద్యోగం చేసాను. 2010 లో పదవీ విరమణ చేసాకా మా మిత్రుడి ప్రయివేట్ పాఠశాల జగన్నాథ ఉన్నత పాఠశాల చందూరులో ప్రధానోపాధ్యాయులుగా పని చేసాను. ప్రతి పాఠశాలలో పిల్లలతో బాలగేయాలు  పద్య రచన రచింపజేయటం చేసాను. కొందరు కవులుగా కవయిత్రులుగా అవతరించారు. ఇదొక గొప్ప తృప్తి.గ్రామ,మండల,జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందుకున్నాను.

4. మీరు సాహిత్యం వైపు మళ్ళడానికి గల కారణం ఏమిటి ?

జ : అనేక ప్రేరణలు. చిన్ననాడు మా తాత గారు పద్యాలు వల్లె వేయించడం మొదటి కారణం. మాకు పెద్ద దేవాలయం ఉండేది. బ్రహ్మోత్సవాలకు కవులు పండితులు హరికథలు చెప్పేవారు వేంచేసేవారు. వారికి సేవ చేసే భాగ్యం నాకు కలిగింది.ఆలయంలో అవధానాలు జరిగేవి.కవిసమ్మేళనాలు జరిగేవి. ఆ రకంగా పద్య రచన అభ్యాసం అయింది.
కొన్ని ఆట వెలదులు
ఆవె : చారు లేక బుక్క చక్కగా జారదు
చారులోని కిటుకు చార్యు లెరుగు
చారు లోన ముక్క చాల చాల కమ్మ
కిడ్ని రోగమునకు కిటుకు చారు

ఆ వె – పప్పు లేక కూడు పసందు కాదురా
పప్పులోన బలము పట్టి ఉండు
పప్పు ఆన్నమన్న పరిణయాల పంట
పూట పూట పప్పు పాట పాడు

ఇదంతా పెద్దల వలన నా ఆసక్తిగాకవితా సాధన. ఇంకాసామాజంలోని రుగ్మతలను ఉపన్యాసల వలె పెద్దగా కాకుండా
కవిత్వం ద్వారా క్లుప్తంగా చెప్పవచ్చు. సాహిత్యంలో స్థిరత్వం కలగడానికి ఆశయంగా ఇది గొప్ప ప్రేరణ

కందాళై రాఘవచార్యగారితో నరేశ్ చారి

5. మీ సాహితీ ప్రయాణం గురించి చెప్పండి.
జ. సాహితీ ప్రయాణం 12 – 01 – 1969 సంక్రాంతి పండగ నుండి ఇప్పటి వరకు అంటే 55 సంవత్సరాలుగా నా సాహితీ ప్రయాణం.ఇందూరు భారతి సాహితీ సంస్థ నా మాతృ సంస్థ. ఈ సంస్థ వారోత్సవాలు చేసినప్పుడు సుప్రసిద్ద కవులు రచయితలు వచ్చేవారు.వారికి భోజనాల ఏర్పాటు సకల సదుపాయాలు కల్పించడం వారు చెపుతున్న సాహితీ ముచ్చట్లు– వారి సాహితీ ప్రయాణం వినడంనా సాహితీ ప్రయాణానికి ప్రేరణ.
వచ్చిన కవులు వానమామలై — దాశరథి –ఆరుధ్ర –శేషేంద్ర –సినారె –నార్ల చిరంజీవి దాశరథి రంగాచార్య –అజంతా — జ్వాలాముఖి– నిఖిలేశ్వర్ –నగ్నముని –శివారెడ్డి మామిడిపూడి రంగయ్య —కొత్తపల్లి వీరభద్ర రావు — పోరంకి దక్షిణా మూర్తి –ముదిగొండ వీరభద్రయ్య — అంపశయ్య నవీన్– ముప్పాళ రంగనాయకమ్మ –నాయని కృష్ణ కుమారి — యశోదా రెడ్డి –ఆనందరామం ,పరిమళా సోమేశ్వర్ –వాసిరెడ్డి సీతాదేవి మాదిరెడ్డి  సులోచన,నందిని సిధారెడ్డి ఇంకా ఎందరెందరో. వీరి ప్రసంగాల వలన కవితా శైలి ఎలా ఉండాలి బహుముఖ కోణంలో అవగతం అయింది. ఇంకా నేను నాకన్నా చిన్నవారైన యువత నుండి ఎన్నో కవిత్వం మెరుపులు అలవరుచుకుంటున్నాను. ఇంకా నా సాహితీ ప్రయాణం వైవిధ్యంగా సాగుతునే ఉంటుంది.

6. మీ రచనల గురించి చెప్పండి
జ. 1969 నుండి ఇప్పటి వరకూ రోజుకొక కవిత రాయడం నా నియమం. నిష్ఠ. ప్రతి సంవత్సరం కొత్త డైరీ కొని అందులో కవిత్వం రాయడం నాకు మొదటి నుండి అభ్యాసం. కొన్న వేల కవితలు రాసాను. రాస్తున్నాను.
1 అధ్యయనం
2 కవిత్వం నిరంతరంగా రాయడం
3 కవితలు పత్రికలకు ప్రచురణార్థమై పంపడం.
ఈ మూడు మెట్లు నా కవితా శబలతకు కారణం.
భారతి,ఆంధ్ర పత్రిక దిన వారపత్రికలు -ఆంధ్ర ప్రభ దిన వార పత్రికలు – ఆంధ్ర జ్యోతి దిన వార పత్రికలు. -కృష్ణా పత్రిక ‐ ఈనాడు – సాక్షి – నవ తెలంగాణ దిన పత్రిక- మన తెలంగాణ దిన పత్రిక- ప్రజాపక్షం – సూర్య దినపత్రిక జ్యోతి మాస పత్రిక నేటి నిజం, తంగేడు, నమస్తే తెలంగాణ దిన పత్రిక ఇంకా ఎన్నో పత్రికలలో నా కవితలు ప్రచురితమయ్యాయి.సంస్థలూ కూడా నా కవితలను ప్రచురించాయి.నా అనేక కవితలు ఆంగ్లంలో హిందీలో కన్నడంలో అనువాదాలుగా ప్రసిద్ధి అయినాయి. నా కవిత్వం గురించికేంద్ర విశ్వ విద్యాలయం తెలుగు ప్రోఫెసర్ డా.ముదిగొండ వీరభద్రయ్య గారు గ్రంథంగా వెలువరించారు.ఇంతవరకూ రచించిన అనేక కవితలను 2018 లో “ఏకధార” కవిత సంపుటిగా వెలువరించాను. దీనికి ముందుమాట ప్రప్రథమ తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు ప్రసిద్ధ కవి నంది అవార్డు గ్రహీత డా.నందిని సిధారెడ్డి రాసారు. 500 సంవత్సరాల పూర్వం ఎన్కిరాల గ్రామ ఆలయ చరిత్ర రాసాను.

7. సాహిత్యంలో మిమ్మల్ని ప్రభావితం చేసిన కవులు ఎవరు?
జ. సాహిత్యంలో నన్ను ప్రభావితంచేసిన వారు :ముందుగా మా తాతగారు విద్వాన్ దప్పూరి శ్రీనివాసాచార్యుల వారు– తరువాత సినారె ‐-దాశరథి– — శేషేంద్ర — అజంతా .ఈ ముగ్గురిది మూడు రకాల వైవిధ్య శైలి .వస్తువు ఎంపిక– కవిత్వం నడక ఎవరినైనా ప్రభావితం చేస్తాయి.

8. సీనియర్ కవులతోగల మీ సాన్నిహిత్యం గురించి చెప్పండి
జ. సీనియర్ కవులతో గల సాన్నిహిత్యం: ఆదివారం — ఇంకా సెలవు దినాలలో ఖైరతాబాద్ లో గల శివారెడ్డి గారి ఇంటికి– శేషేంద్ర శర్మ జ్ఙాన్ బాగ్ ప్యాలెస్ కు – చిక్కడపల్లి అశోక్ నగర్ లో ఉండే సినారె ఇంటికి– రేడియో స్టేషన్ లో ఉండే రావూరి భరద్వాజ గారి ఇంటికి — కుందుర్తి గారి ఇంటికి వెళ్లి కొన్నిగంటలు వారి సాహిత్య సంభాషణలు వినే వాళ్లం. ముఖ్యమైన సంగతులు నోట్ చేసుకునే వాళ్లం .వెంట సైబ, సలంద్ర, చందన్ ఉండేవారు. చివరికి అబిడ్స్ లో పుట్ పాత్ పై అమ్మే పాత పుస్తకాలు కొనుక్కుని రైలెక్కి నిజామాబాద్ వెళ్లేవారం. ఈ మాన్య కవులంతా నిజామాబాద్ సభలకు వచ్చినపుడు వారికి ఏ అసౌకర్య కలగకుండా చూసుకునే వాళ్లం.

రాఘవచార్య రచనలు

9. మీరు కవితా ప్రక్రియేనా? ఇంకా ఏమైనా ప్రక్రియలను స్పృశించారా?
జ. : కవితా ప్రక్రియే కాకుండా పద్యాలు వ్యాసాలు సమీక్షలు కథలూ రాసాను. నాతోటి కవుల కవితా సంపుటాలకు సమీక్షలు రాసాను. 10 కథలు ప్రచురింపబడ్డాయి. మిమిక్రీ లోనూ సాధన చాలా చేసాను. “జి ఛానల్ “వారు 3 ఎపిసోడులు టివి లో ప్రసారం చేసారు.షూటింగ్ సారథి స్టూడియో లో జరిగింది. యూట్యూబులో నా మిమిక్రీ అంశాలు ఉన్నాయి.వరంగల్ లో మిమిక్రీ సామ్రాట్ నేరెళ్ల వేణుమాధవ్ తో సన్మానం అందుకున్నాను. ఇంకా రాజాయోగాలో 12 సంవత్సరాలుసాధన చేసి సంపూర్ణం చేసుకున్నాను. సాప్ట్ వేర్ ఇంజనీర్లు చాలా మంది నా వద్ద శిక్షణ తీసుకుంటున్నారు. యోగ సంబంధమైన మూడు పుస్తకాలు అభిమానులు ప్రచురించారు. 1 సద్గురు దర్శనం ( మా యోగాచార్యుని జీవిత చరిత్ర) 2 గురుకృప (యోగ తత్త్వ గీతాలు) 3 విశ్వ ధ్యానం ( నా పన్నెండు సంవత్సరాల సాధనా అనుభవాలు) . ఇంకా చిత్ర లేఖనంలోనూ సాధన చేసాను. మనిషిని చూసి చిత్రించగలను. గానం కూడా ప్రాణం. నిజామాబాద్ సంగీత కళాశాలలో సంగీతం అభ్యసించాను.

10. వివిధ సాహితీ సంస్థలతో గల మీ అనుబంధం గురించి చెప్పండి

జ: నిజామాబాద్ లో మా మాతృ సంస్థ “ఇందూరు భారతి సాహితీ సమాఖ్య.” ఇంకా తెలుగు రచయితల సంఘం. ప్రజాశక్తి. హరిదా రచయితల సంఘ.సాగర్ కళా మందిర్ .అన్ని సంస్థలు కలిపి ఇందూరు సాహితీ సమాఖ్య ఏర్పాటు చేసాం. ఈ సంస్థ సుప్రసిద్ద కవులను ఆహ్వానించింది. ఏ సంస్థ కార్యక్రమాలు చేసిన అందరం కలుసుకునే వాళ్లం. మేము ప్రతి పున్నమకు కవుల ఇండ్లలోనూ సమావేశాలు జరిపేవాళ్లం. భోజనాలు ఆ కవి ఇంట్లోనే. రాత్రి 10 దాటేది. ఇంకా వేముల వాడ కామారెడ్డి మెదక్ మంజీర రచయితల సభలకూ వెళ్లేవాన్ని. కడప తిరుపతి సాహితీ సంస్థలకార్యక్రమాలకు వెళ్లేవాళ్లం. ప్రతి సాహితీ సంస్థ కవిత్వానికి స్పూర్తి దాయకమే.

11. మిమ్మల్ని వరించిన అవార్డుల గురించి చెప్పండి
జ. 1- జి ఛానల్ మిమిక్రీ పురస్కారం
2007 .హైదరాబాద్ సారథి స్టూడియో
2  కుందుర్తి పురస్కారం 2011
త్యాగరాజ గాన సభ హైదరాబాద్
3. దాశరథి పురస్కారం– హరిదా రచయితల సంఘం. నిజామాబాద్
4  ఇందూరు అపురూప అవార్డు
      2017 నిజామాబాద్
 5″కవిదిగ్గజం ” తెలుగు వెలుగు
     సాహితీ సంస్థ నిజామాబాద్
6 . సాహితీ రత్న “
శ్రీ విద్యా గణపతి సాహిత్య కళాపీఠం నిజామాబాదు వారు

12. అప్పటికి ఇప్పటికీ తెలుగు  కవిత్వంలో వచ్చిన మార్పు ఏమిటని మీరనుకుంటున్నారు.

జ. అప్పుడు కవిత్వంలో ఇన్ని వాదనలు ఉండేవి కావు. విప్లన దిగంబర కవిత్వంగా రాణించింది. ఇప్పుడు స్తీ వాద కవిత్వం దళిత వాద కవిత్వం మైనారిటి కవిత్వాలు ధ్వనిస్తున్నాయి. గుర్తింపు లభించనపుడు ఇలాంటి వాదనలు సామాజికంగా అవసరమే. కవిత్వంలో వైవిధ్యం ప్రత్యక్షమౌతుంది.

13. వర్తమాన కవులకు మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏమిటి?.
జ. వర్తమాన కవులలో అధ్యయనం తక్కువైంది. రాయడం ఎక్కువైంది. ఈ ప్రయత్నం మంచిదే. కాని అధ్యయనం వలన మన కవిత్వంలో వైవిధ్యం శిల్పం వ్యంగ్యం ఇంకా ఎన్నో తీరులుగాపరిపూర్ణత సంతరించుకుంటుంది రాసిన కవిత్వం పత్రికలకు పంపటం మధ్య మధ్యలో  పుస్తకంగా ప్రచురించడం సామాజిక అవసరం. మన కవిత్వం ఉనికి శాశ్వతంగా నిలిచి రాబోయే తరాలకు అందుతుంది. కొత్త తరం అంటే 18 సంవత్సరాల యువతి యువకులు ఇపుడు కవిత్వం రాస్తున్నారు. మా విల్లాలో పదుగురు కవిత్వం రాస్తున్నారు. ఇంకో విశేషం. 4 వ తరగతి చదివే మా పెద్ద మనుమడు లక్మణుడు వాళ్ల అమ్మ గురించి కవిత్వం రాసాడు.

మయుఖ పత్రిక సంపాదకురాలు డా.కొండపల్లి నీహారిణి మార్గదర్శకత్వంలో మీరు నా కవితా కృషి గురించి సాగించిన ముఖాముఖి సంభాషణ లోకానికిఅందించటం చాలా ఆనందం. మయూఖకు శనార్తులుమీకు ధన్యవాదాలు.

      

You may also like

Leave a Comment