Home పుస్త‌క స‌మీక్ష‌ “వేద…అక్షరయోధ”

“వేద…అక్షరయోధ”

by Chitti Sidda Lalita

“వేద”….ఈ పదంలోనే ఒక వైబ్రేషన్ వుంది.వేదాలు ఎంత ప్రాముఖ్యమైనవో వేదమంత్రాలు ఎంత పవిత్రమైనవో మనకు తెలుసు. తన నవలకు వేద అనే శీర్షికను ఎంచుకుని నవలా నాయికకు వేద అనే నామకరణం చేసి తన సాహితీ ప్రతిభను చాటుకున్నారు అనూశ్రీ.

అలాగే వేద అనే ఈ శీర్షిక ద్వారా నవలకు ఎంతో పవిత్రతను, గౌరవాన్ని ఆపాదించారు. నా దృష్టిలో విధివంచితలై ఆవేదనతో కన్నీరు కార్చే ప్రతి స్త్రీ జీవితం ఒక వేదమే..

తపస్వి మనోహరం వారు డిజైన్ చేసిన అందమైన ఆకట్టుకునే ముఖచిత్రం ఈ వేదకు మరింత సొగసును తీసుకొచ్చింది. లబ్ధప్రతిష్టులైన రచయితలు యండమూరి, మన్నెం శారద గారి అభినందనలతో, ఆశీస్సులతో ఈ నవలకు మరింత నిండుదనం సమకూరింది.
ఇంతకీ ఏముంది ఈ నవలలో…? ఇది కమర్షియల్ నవలా..!?
ఎవరినో మెప్పించడానికి, సాహితీ శిఖారాగ్రాన కూర్చోడానికి లేకపోతే అమ్మి సొమ్ము చేసుకోవడానికో రచయిత్రి ఈ నవలను రాయలేదు.
మన దేశంలో స్త్రీలు పడే బాధలు, అనుభవించే వేదన, పురుషపుంగవుల అణచివేతలతో స్త్రీ అబలగా నిలిచి అల్లాడే వైనం,ఈ సమాజపు పోకడ, ఆడపిల్లకు ఇంట్లో వ్యతిరేకతలు, ఆత్మహత్యలకు పాల్పడడం, కాదని పిల్లలకోసం ప్రాణం నిలుపుకుని జీవించడం లాంటి సగటు భారతీయ స్త్రీ అనుభవించే వ్యథతో రూపుదిద్దుకున్న ఒక అక్షర శిల్పం ఈ వేద.

ఈ వేద అనూశ్రీ గౌరోజు ఆప్యాయంగా చెక్కిన ఒక శిల్పం.
ఇదో జీవన వేదం. ఆరవ వేదం. పురుషహంకారపు కోరల్లో చిక్కుకుని బతకలేక చావలేక విలవిల్లాడుతున్న ఎందరో స్త్రీ మూర్తుల వ్యథలకు అక్షర రూపం ఇది.

ఈ సమాజం భర్త తోడు లేనిదే స్త్రీకి మనుగడ లేదు, ఒంటరి స్త్రీలకు గౌరవం లేదు అని భయపెడుతుంది. అందుకే ఎంతోమంది స్త్రీలు బాధలు భరించలేక, వేధింపులకు తాళలేక, చిత్రహింసలను తట్టుకోలేక వంటింట్లో కిరోసిన్ కు ఆహుతి అయ్యారు. ఉరి వేసుకుని అశువులు బాసారు. గోదాట్లో దూకి బలవన్మరణం పాలయ్యారు. మరి ఈ సమాజం ఆమెకు ఆలంబనగా నిలవకపోగా ఆమె బాధలు, వేదనలు, కష్టాలు, కన్నీళ్ళను ఇంత కళ్ళేసుకుని చూస్తూనే వుంటుంది. ఆమెను హేళన చేస్తుంది. వెంటాడుతుంది. నాలుగురాళ్ళను విసిరి గాయపరుస్తుంది.

అనుశ్రీ గౌరోజు

ఎందుకలా..?
ఎందుకింత వివక్ష..?
మిలియన్ డాలర్ల ప్రశ్న.
సమాధానం సమాజం చెప్పదు.
మనమే చెప్పాలి.
ఎందుకంటే సమాజమంటే ఎవరోకాదు. మనమే.
ఇదెంతో శోచనీయం.
మూడువందల పేజీల ఈ నవలను మూడు భాగాలుగా విభజించవచ్చు.
ఒకటి వేద పెళ్ళికి ముందు స్నేహితులతో గడిపిన కాలం.
ఇక్కడ తేజ, స్నేహ, స్వాతి, మురళి అనేవాళ్ళను ప్రాముఖ్యంగా చెప్పుకోవాలి. అరమరికలు లేని వీరి స్నేహం అబ్బురపరుస్తుంది.
కష్టసుఖాలు పంచుకుని తోడ్పాటును అందించుకుంటారు.
నవల చదువుతుంటే అందులో లీనమయిపోతాం. అరె ఇలాంటి ఫ్రెండ్స్ మనకుంటే ఎంత బావుండు అనిపిస్తుంది. ఈ ప్రథమ భాగంలో రచయిత్రి స్నేహానికి వేసిన పీట సమున్నతమైనది. స్నేహబంధానికి వున్న విలువను, ప్రాధాన్యతను రచయిత్రి చక్కగా అక్షరీకరించారు. నవలలో ఎక్కడా మనకు అసభ్యత, అనైతికత కనిపించదు. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవల్సింది నాకు నచ్చింది ఏమిటంటే.. దగ్గరే వున్న మిత్రులకు కూడా ఉత్తరాలు రాయడం. వేదకు వున్న మంచి అలవాటు ఇది. మాటల్లో చెప్పలేని భావాలు అక్షరాలతో చెప్పచ్చు అంటుంది.ఈ విధంగా రాయడం.. భావాలను కాగితంతో పంచుకోవడం అనే అలవాటు బాగుంది కదా..!
ఇక రెండవ భాగానికి వస్తే…
పెళ్ళి తరువాత జీవితాలు అందరివీ ఒకేలా వుండవు.
ఒడిదుడుకులు, కష్టాలు,కన్నీళ్ళు జీవితంతో పెనవేసుకుని వుంటాయి. కానీ అవి శృతి మించకూడదు. గతి తప్పకూడదు. ఎవరినీ బలి తీసుకోకూడదు.
దానికీ ఒక లిమిట్ వుంటుంది. కానీ దురదృష్టవశాత్తూ ఎంతో ప్రతిభకల వేద జీవితం భరించలేక ఆత్మహత్యా ప్రయత్నం చేసే దాకా వస్తుంది. ఇక్కడ తేజ, స్వాతి పాత్రలు బాధ్యతాయుతమైన స్నేహానికి చిరునామాగా చెప్పచ్చు. స్నేహమంటే ఆషామాషీ వ్యవహారం కాదు అది ఒక బాధ్యత అని గుర్తెరిగినవాడు తేజ. అలాగే అతడి చెల్లెలు స్నేహ.చెలిమికి ప్రాణమిచ్చే నీటి చెలమ. అన్నకు ప్రియమైన చెల్లిగా వేదకు ప్రాణ మిత్రురాలిగా మంచి సపోర్ట్ ఇస్తుంది స్నేహ. కానీ స్నేహ అర్థాంతరంగా లోకాన్ని వీడడం మనల్ని కంటతడి పెట్టిస్తుంది.
స్త్రీ కుమిలిపోతూ, కృంగిపోతూ, కన్నీళ్ళు కారుస్తూ జీవచ్ఛవంలా ఎన్నాళ్ళు జీవిస్తుంది..? ఏ ఆశతో జీవిస్తుంది..?
రకరకాల మగాళ్ళు. మృగాళ్ళు. శాడిస్టులు. సైకోలు. వీళ్ళ టార్గెట్ స్త్రీ.
ఆమెని బాధించడం.. వేధించడం, హింసించడమే వీరి లక్ష్యం.
స్త్రీలే తిరగబడి వీరికి తగిన బుద్ది చెప్పాలి. ప్రతి స్త్రీ శక్తిని కూడగట్టుకుని నరకాసురుని వధించిన సత్యభామ కావాలి.
ఇంతకీ ఈ వేద నవల అందించే సందేశం ఏమిటంటే..
రచయిత్రి అనుశ్రీ అయినా నేనయినా కోరుకునేది ఒక్కటే.
ఈ వేద మన చుట్టూ జరిగే సంఘటనల సమాహారం.
వేదలాంటి స్త్రీలు మన చుట్టుపక్కలే వుండచ్చు.
అమ్మల్లారా.. అక్కల్లారా.. చెల్లెళ్ళారా.. మిమ్మల్ని అర్థించేది ఒక్కటే.
ఒంటరి స్త్రీలను కాకుల్లా పొడవకండి. మగాడికి వత్తాసు పలకుతూ గుసగుసలతో, సూటిపోటి మాటలతో నొప్పించకండి. స్త్రీకి స్త్రీయే శత్రువు అనే మాటను మనం చరిత్రలోనుండి తీసేద్దాం. సాటి స్త్రీకి చేతనయిన సహాయం చేద్దాం. వారికి ఆసరా ఇచ్చి కన్నీళ్ళు తుడుద్దాం. అది చేతకాకపోతే మనపని మనం చూసుకుందాం. అంతే తప్ప ఆమెను పరిహసిస్తూ కుళ్ళబొడిచి పాపం మూట కట్టుకోవద్దు.అయినా గట్టునున్నవారికేం తెలుస్తుంది గుండెకోత..? మునిగితే కదా తెలిసేది బతుకు రోత.

ఏ రంగమైనా సరే ఒక స్త్రీ ముందడుగు వేస్తే వెనక్కి లాగడానికి ఎన్ని ప్రయత్నాలో..ఎన్ని కుట్రలో..ఆమెను అణిచి వేయడానికి ఎన్ని కుయుక్తులో..స్త్రీకి స్వంత ఇంట్లోనే ప్రోత్సాహం లభించదు.
ఆడదానివి నీకెందుకు ఇంట్లో కూచో అంటారు.ఒక స్త్రీ విజయం సాధించాలంటే ఎంతో శ్రమించాలి. తపస్సు చేయాలి.తప్పదు.
మహిళం మనం శ్రమించుదాం. తపస్సు చేద్దాం. విజయాన్ని స్వంతం చేసుకుందాం.ప్రపంచానికి మన సత్తా చూపిద్దాం.
~~
ఈ నవలలో హృదయాన్ని పిండేసే మాటలు చాలా వున్నాయి.
కొన్ని చెప్పి ముగిస్తాను.

1.ఎవరు ఆదరించకపోయినా, కన్నతల్లి కాదన్నా..పుడమితల్లి మాత్రం కాదనదుగా.. అలసిన నన్ను తన ఒడిలో చేర్చుకుంటుందిగా అంటుంది వేద నిర్వేదంగా. ఎంతగా విరక్తి కలిగితే ఒక స్త్రీ ఆ మాట అంటుందో ఒకసారి ఆలోచించండి.

2.”ఆడపిల్లలు గుండెలో అగ్ని పర్వతాలు దాచుకుంటారు. పైకి సంతోషంగా వున్నట్లు నటిస్తారు “అంటాడు మురళి. “బాధను పౌడర్ గా నిరాశను కాటుకగా ఆవేదనంతా మేకప్ గా వేసుకుంటాను. నువ్వు ఓదార్చగలవా..? ఆడవాళ్ళని ఓదార్చాలంటే యుగాలు సరిపోవు మీ మగాళ్ళకి అంటుంది” స్వాతి.
ఈ స్వాతి ముక్కుసూటిగా మాట్లాడే పాత్ర. చాలా బాగుంది.

3. ఒక సందర్భంలో “ఈరోజును ఎంజాయ్ చెయ్యనీరా..రూపంలేని రేపటిలో విషాదాన్ని వెతుక్కుంటూ ఈ సమయాన్ని పాడుచెయ్యలేను” అంటాడు తేజ. నిజమే రేపనేది వుందో లేదో ఈ క్షణం నిజమైనది. అమూల్యమైనది. దాన్ని ఆస్వాదించాలి.

4. అలాగే “మీనుండి ఏదైనా ఆశించి సహాయం చేస్తే అది వ్యాపారం అవుతుంది. అది నాకిష్టం లేదు” అంటాడు తేజ.
ఇతడు అందరినీ ఆపదలో ఆదుకునే ఆపద్భాంధవుడు. బాధ్యతలను బరువులను మోసే ఉదాత్తమైన పాత్ర అని చెప్పాలి.
“తల్లిదండ్రుల మాట విని.. భర్త నీడలో సుమంగళిగా రాలిపోయి
వంశోద్ధారనిగా బిరుదులు తెచ్చుకున్న కథలు ఇప్పటికే బోలెడు ఉన్నాయి కదా. నా కథను నేను కొత్తగా రాసుకోవాలనుకుంటున్నాను. గొప్పగా చెప్పుకోడానికి కాదు తృప్తిగా చదువుకోడానికి ” అంటుంది వేద..
నాకూ కొత్తగానే అనిపించింది..
ఈమధ్య నేను ఒక కవిత రాస్తే కొందరు అడిగారు. “కాలం మారింది. స్త్రీ బ్రతుకు మీరనుకున్నంత అధ్వానంగా లేదు!” అని
నేనన్నాను..
“ఎక్కడా మార్పు రాలేదు. గ్రామాల్లోకి వెళ్ళి చూడండి. స్త్రీల బ్రతుకులు ఎంత హీనంగా వున్నాయో..పెళ్ళి అనే పంజరంలో చిక్కి ఎంతగా రోదిస్తున్నాయో, మీరనుకున్నట్లు మారితే సంతోషమే అని చెప్పాను.
సాయంకాలం మందు షాపుల ముందు ఆరాటంగా క్యూలో నిల్చున్న మగాళ్ళను చూస్తే అర్థమవుతుంది మన కుటుంబాల పరిస్థితి. మగాళ్ళతో పాటూ స్త్రీలు కూడా బాధ్యతలు మరిచి బారులు తీరుతున్నారా..?
అయితే ఎంతమంది..?
మరి పురుషులే ఎందుకిలా..?
వీళ్ళను పాడుచేసేది సమాజమా, మన కుటుంబ వాతావరణమా..?
~~~
మూడో భాగం. నేను చెప్పను. నవల చదివి మీరు తెలుసుకోవాలి.
సున్నితమనస్కురాలయిన వేద, చిన్న బాధకే కదిలిపోయే ఆమె హృదయం
తరువాత ఎలా గట్టిపడింది..? పరిస్థితులను ఎదిరించి ధైర్యంగా ఎలా నిలవగలిగింది? ఆమెకు ప్రేరణ ఏమిటి..? ఆమెకు తోడు ఎవరు? ఆమెను ప్రపంచానికి పరిచయం చేసి వేదికపై నిలబెట్టే పెన్నిధి ఎవరో తెలుసుకోవాలంటే వేద నవలను మీరు చదవాల్సిందే.
ఈ వేదకు ప్రాణం పోసి రూపాన్నిచ్చి, ఆవిష్కరించిన రచయిత్రి అనూశ్రీ గౌరోజును **వేద అని **అక్షరయోధ అని పిలవాలనిపిస్తోంది.వేద నవలకి గిడుగు రామమూర్తి పురస్కారం లభించడం ఆనందదాయకం. ఎన్ని అడ్డంకులున్నా, అవరోధాలు ఎదురైనా.. వెనుదిరగక, నిరాశ చెందక తన కవిత్వంతో, సాహితీ సేవలతో ఈ ప్రాంతానికి కీర్తి తెస్తున్న అనూశ్రీ నిస్సందేహంగా అక్షరయోధే..
వేద నవలకు నన్ను సమీక్షకురాలిగా, అనిశెట్టి రజిత గారిని ఆవిష్కర్తగా, రమాదేవి గారిని స్వీకరణకర్తగా ఎన్నుకున్న అనూశ్రీ నిస్సంకోచంగా స్త్రీ పక్షపాతి. భవిష్యత్తులో స్త్రీవాద రచనలు చేసి మరిని పుస్తకాలను వెలువరించి స్త్రీ విముక్తికోసం పోరాడాలని ఆశిస్తూ.. అభినందిస్తున్నాను.
మరోసారి మీ అందరికీ నా నమస్సులు జైహింద్.

You may also like

Leave a Comment