Home పుస్త‌క స‌మీక్ష‌ శతక సాహిత్యంలో… ఓ కొత్త ఒరవడికి శ్రీకారం!

శతక సాహిత్యంలో… ఓ కొత్త ఒరవడికి శ్రీకారం!

by Senathipathi Dasyam

<—-Burra Venkatesham(I.A.S.)

 

మకుటధారియై తెలుగు సాహిత్యంలోకి.. శతకం ఎప్పుడు వచ్చిందో సాహితీవేత్తలకు తెలుసు.. అప్పటి నుండి ఇప్పటివరకు మెరుగులు దిద్దుకుంటూ వస్తూనే ఉంది. మకుటం తలపై ఉంటుంది. కాని శతకంలో సర్వసాధారణంగా క్రిందనే ఉంటుంది. క్రింద ఉండేవి పాదాలు.. శతకం నిండా పాదాలే ఉంటాయి.. అందులో క్రింది పాదం కాని, ఆ పాదంలో కొంత భాగం కాని మకుటంగా ఉంటుంది. శతకంలో జీవితమ్ ఆవిష్కరింప బడుతుంది. ఎందరో మహానుభావులు తమ జీవితానుభవాన్ని రంగరించి.. శతకాలను మనకు అందించారు. జీవన సత్యాలను అద్భుతమైన రీతిలో ఛందోబద్ధంగా పద్యాలను రూపుదిద్దిన వారున్నారు. ఛందస్సనే సంకెళ్లలో బంధించబడటం వల్ల… నేటి ఆధునిక ప్రపంచానికి తగిన విధంగా శతకాలు రావడం లేదు.. నేటి తరానికి ముఖ్యంగా యువతీ యువకులకు సులభంగా పద్యాల్లోని సారం.. సందేశం అర్థమయ్యే రీతిలో.. ఛందస్సును కాస్త ప్రక్కన పెట్టి… నిఘంటువు సహాయం లేకుండా.. చదవగానే మనసుకు హత్తుకునేలా శతకాలు రావలసి ఉంది.

ఈ క్రమంలోనే… సీనియర్ ఐఏఎస్ అధికారి.. సాహిత్యమంటే మక్కువ చూపే తెలుగు భాషా ప్రేమికులు శ్రీ బుర్రా వెంకటేశం గారు తమ అంతరంగంలో గుట్టుగా, గుట్టగా గూడుకట్టుకున్న భావాలను.. జీవన సత్యాలను.. అక్షరబద్ధం చేస్తూ “జీవన ధన్య శతకం” పేరుతో ఓ గ్రంథాన్ని వెలుగులోకి తేవడం ఆహ్వానింపదగింది.. ఛందస్సుతో పని లేకుండా.. సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో ఈ శతకంలో వెంటేశంగారు పద్యాలను పొందుపరిచారు. సదా పరిపాలనలో క్షణం తీరిక లేకుండా ఉండే ఆయన.. లోకహితం కోసం.. సామాజిక చైతన్యం కోసం.. జన జాగృతికై.. తమ జీవితానుభవాలను ఏర్చి కూర్చి చక్కని పదబంధాలతో పద్యాలను అల్లడం ప్రశంసనీయం.. సార్వజనీన అంశాలకు పెద్దపీట వేస్తూ.. ఓ దార్శనికునిగా ఇప్పటి తరానికే కాదు.. రాబోయే తరాలకు సైతం.. మార్గదర్శకంగా ఉండేందుకు వీలుగా.. తమ లోక పరిశీలనను జోడించి.. మేధస్సును మేళవించి ఇందలి పద్యాలకు జీవం పోశారు. యువతీ యువకులకే కాక అన్ని వయసుల వారికి ఉపయుక్తంగా ఉండేలా తీర్చిదిద్దారు.

తెలంగాణ ప్రభుత్వం ద్వారా 2017లో నిర్వహింపబడిన ప్రపంచ తెలుగు మహా సభల సందర్భంగా క్రియాశీలకంగా నిర్వహణ బాధ్యతలను నిర్వర్తించిన ఆయనకు స్వయంగా తెలుగులో ఆంగ్లంలో గ్రంథాలను వెలువరించిన అనుభవమూ ఉంది. “సెల్ఫీ ఆఫ్ సక్సెస్” అను విజయం మరియు విజేతల గాథల పుస్తకం… అందరి మన్ననలు పొందింది. ఆ పుస్తకాన్నే “గెలుపు పిలుపు”పేరుతో తెలుగులోకి తీసుకొచ్చారు. ఈ గ్రంథం తెలుగులో.. ఆంగ్లంలోనూ బహుళ ప్రాచుర్యాన్ని పొందటం విశేషం.. తెలుగు భాష పట్ల అమిత ఆసక్తిని చూపే కవి వెంకటేశం గారు సహజమైన రీతిలో “జీవన ధన్య” శతకాన్ని వెలుగులోకి తెచ్చారు. “సత్యమిదే తెలుసుకో మిత్రమా” మకుటంతో తమ రచనను కొనసాగించారు. నాలుగు పాదాల్లో.. మొదటి రెండు పాదాల్లో కవిగా తాము చెప్పదలచుకొన్న విషయాన్ని చెప్పుతూ.. మూడవ పాదంలో నిర్దేశిత లక్ష్యాన్ని సూటిగా ప్రకటించే ప్రయత్నం చేయడం ప్రశంసనీయం. ఛందస్సు లేకుండానే సహజ శతకానికి తెర లేపారు.

శతక సాహిత్యంలో ఓ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. కవి వెంకటేశం గారి మనోఫలకంపై ఎప్పటి నుండో నర్తిస్తున్న ఆ జీవన సత్యాలను ఇందలి పద్యాల్లో నిక్షిప్తం చేశారు. ‘సత్యమిదే తెలుసుకో మిత్రమా’ అనే మకుటంతో…

ఈ శతకంలో నాలుగు భాగాలుగా వివిధ అంశాలపై దృష్టి సారిస్తూ పద్యరచన చేయడం విశేషం..

మొదటి భాగంలో జీవన సత్యాలను.. ఆవిష్కరించారు. రెండో భాగంలో “గెలుపు/ ఆత్మవిశ్వాసం”వంటి అంశాలకు చోటు కల్పించారు. మూడో భాగంలో “జీవన బంధాలు.. జీవన దశలను”, నాల్గో భాగంలో “తాత్విక చింతన దైవ చింతన” వంటి అంశాలను పద్యాల్లో నిక్షిప్తం చేశారు. కవి వెంకటేశం గారి పద్యాల్లో ఆయన ఉత్తమ వ్యక్తిత్వం.. సామాజిక చింతనం.. సున్నిత మనస్తత్వం అడుగడుగున మనకు కానవస్తాయి. నాలుగు భాగాలుగా రూపుదిద్దుకున్న ఈ శతకం మరో విశేషమేమిటంటే… ప్రతి భాగం చివరన ప్రతి పద్యంలోని ఆణిముత్యాల్లాంటి నిర్దేశిత లక్ష్యాలను పొందుపరిచి శతకానికి మరింత శోభను కలిగించారు.

అంతేగాక ప్రతి భాగం చివరన “మీ మదిలోని మీ మాట” శీర్షికను పొందుపరిచి.. పాఠకులు శతక పద్యాలను మరింత ఆసక్తిగా చదవడం కోసం.. చదివిన పద్యాల్లోని సారాన్ని మరొక్కసారి మననం చేసుకుని స్వీయ స్పందనకు అవకాశం కల్పించడం ఓ కొత్త ప్రయోగం.. ‘సత్యమిదే తెలుసుకో మిత్రమా!’ మకుటుంతో సాగే ఇందలి పద్యాలను పరిశీలిద్దాం.

“జీవన సత్యాలు” విభాగంలో కవి యొక్క ఉత్తమ సంస్కారాన్ని వీక్షించగలం.. సామాజిక చైతన్యం కోసం ఆయన పడే ఆరాటాన్ని చూడగలం.. యువతీ యువకులకే కాదు అందరికీ ఉపయుక్తంగా ఉండే విధంగా పద్యాలకు జీవం పోశారు.

పుచ్చుకొనడం కోసం పోటీ ఏంటి? ఇవ్వటంలో ఉండాలి కాని? అంటూ పుచ్చుకొనటం దైన్యం.. ఇవ్వటం ధన్యమని మొదటి పద్యంలోనే తేల్చి చెప్పారు. ఇంకా ఇందలి పద్యాల్లో…

లొంగుబాటు లేని ధైర్యం కొరత లేని ధనం వంటిదని… నగుబాటు లేని జీవితం ధన్యమని హితవు పలికారు. శాశ్వత సుఖం ఎంతో ధన్యమైనదని తెలియజెప్పారు.

ఎన్నో భాషలు తెలిసిన పండితుడైనా ఇంటి ఇల్లాలు కంటి భాష చదువలేడని.. లిపి లేని కంటి భాష చదువగల నేర్పు ధన్యమని నిగూఢంగా… బలంగా కవి వెంకటేశం గారు తమ భావ ప్రకటన చేయడంలో సఫలీకృతులైనారు.

రాశి-వాసిల జ్ఞానం ధన్యమని.. పదవికున్న విలువ పద్ధతికి లేదు.. వెదికి మరీ వచ్చి గౌరవిస్తారు పదవిలో.. అయితే.. గౌరవం ఉందని గర్వం పెరగకుంటేనే ధన్యమని విడమరిచి చెప్పారు. విలువలు శాశ్వతమని.. వేషభూషణాలు అశాశ్వతమనే విచక్షణ ధన్యమంటూ మరో పద్యాన్ని రాశారు. చకచక మారే పడతి అంతరంగం మధురిమ ధన్యమంటూ రాసిన పద్యంలో పడతి అంతరంగం సాంతం ఎరుగుట అసాధ్యమని నొక్కి వక్కాణించారు.

ఇంకో పద్యం ద్వారా అందరి నవ్వులో నీ భాగముండాలని హితవు పలికారు. ఎదుగుతూ ఒదుగుతూ గెలుచుటయే ధన్యమనే జీవన సత్యాన్ని మరో పద్యం ద్వారా తెలియజెప్పారు.

ఇలా జీవన సత్యాలను అలతి అలతి పదాలతో మొదటి విభాగంలో సందేశాత్మకంగా ఆవిష్కరించారు.

“గెలుపు | ఆత్మవిశ్వాసం” శీర్షికతో రెండో భాగాన్ని తీర్చిదిద్దారు.

ఓ పద్యంలో…

శక్తివంతమైన సంతకం ఏది?

పెద్ద పదవిదా? గొప్ప పనిదా? లాభాలు తెచ్చేదా?

చరిత్ర సృష్టించేదా? అని ప్రశ్నించుకుంటూ.. కవి వెంకటేశం గారు.. గెలుపు ఫలాల పంపకం చేసే సంతకం ధన్యమని తేల్చి చెప్పారు.

నీలోనే నేనున్నానని పిలుస్తుంది గెలుపు… ఆ పిలుపు వైపు మలుపు నీ చూపు.. ఆ దిశగా పయనించే జీవితం ధన్యమని హితవు పలికారు.

ఇంకొక పద్యంలో మలుపు లేని దారి ఉండదని.. వియోగం లేని సహయోగం లేదని గెలుపు ఓటముల సంయోగ జీవనం ధన్యమని అభిప్రాయపడ్డారు.

యువతీ యువకులకు చక్కని మార్గదర్శనం చేస్తూ ఈ విభాగంలో పొందుపరచబడిన పద్యాలు ప్రేరణ దాయకంగా కొలువుదీరాయి.

భయం.. నీలోని బలహీనత.. అభయం నీవు ప్రకటించే బలమని సూచించిన తీరు బాగుంది.

ఇలా రెండో విభాగంలోని పద్యాల ద్వారా నిరంతర శ్రమతో.. మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ఆశావహ దృక్పథంతో ముందుకు సాగి గెలుపు సాధించాలని సూచించారు.

ధనమే జీవనం కాదని.. జీవితంలో భాగమని, ప్రేమ లేని ధనం విలువ శూన్యమని విడమరిచి చెబుతూ.. మూడో విభాగంలో “జీవన సంబంధాలు జీవన దశలు” శీర్షికతో పద్యాలను రాసి బంధుమిత్రులతో సంబంధ బాంధవ్యాలు ఎలా పదిల పరుచుకోవాలో వివరించారు.

తల్లిదండ్రుల పట్ల.. స్నేహితుల పట్ల ప్రేమానురాగాలతో వ్యవహరించాలన్న అర్థం ధ్వనించేలా.. ఇందలి పద్యాలకు జీవం పోశారు. మలి సంధ్యలో ధనం ముఖ్యం కాదని.. స్థిరపడిన సంతానం.., బాధించని అనారోగ్యం.. మనస్సుకిష్టమైన పని ధన్యమని అభిప్రాయపడ్డారు.

జీవన దశల్లోని అనుభూతులను అనుభవాలను అక్షరాల్లో నిక్షిప్తం చేస్తూ.. పసితనమున తప్పటడుగులు అద్భుతమని.. పడుచుతనమున జీవన యానపు తడబాటులు.. ముసలితనమున స్థిరచిత్తం.. నిశ్చలత్వం ధన్యమని సూచించారు. మాతృత్వపు మధురిమలో బాల్యం.. రూపసుల మోహంలో యౌవనం.. కాసుల వేటలో మిగతా జీవితం.. అంటూ జీవన సరిగమలను మరో పద్యంలో ఆవిష్కరించిన తీరు బాగుంది. ఇంకా ఈ మూడో విభాగంలో పసిపాపల నవ్వుల పువ్వులను, జవనుల చిరునవ్వులను – మలి వయసులోని బోసి నవ్వులను వివరిస్తూ.. కోపతాపాలను కరిగించుట శ్రేయస్కరమని తెలిపారు.

గడచిన గతం బాల్యం….

నేటి జీవన సౌధ పునాది కూడా బాల్యమని..

రేపటి మలిసంధ్య జ్ఞాపకం బాల్యం అదే ధన్యమని విడమరిచి వివరించారు.

కవి వెంకటేశం గారు ఇంకా ఈ విభాగంలో ప్రాణమున్నంతవరకు తరగని మాతృప్రేమను.. ఊపిరున్నంత వరకు సరిహద్దులో దేశ ప్రేమను ప్రస్తావిస్తూ ప్రేమ స్వరూపాలు ఎన్నైనా, ప్రేమ శాశ్వతం ధన్యమని తెలియ జెప్పారు. ఇలా జీవన యానంలోని వివిధ దశలను కవి తమ అనుభవాలను జోడించి జీవన సత్యాలను ఆవిష్కరించి స్ఫూర్తిని నింపేలా మూడో విభాగంలో పద్యాలకు జీవం పోశారు.

ఇక చివరి నాలుగో విభాగంలో “తాత్విక చింతన / దైవ చింతన” శీర్షికతో పద్యాలను పొందుపరిచి.. ఆనందం మన సహజ స్వభావమని.. దుఃఖం మనం తెచ్చి పెట్టుకున్న అనుభవమని..  కలిమి లేముల విచక్షణ మరిస్తే ధన్యమని అభిప్రాయపడ్డారు.

నదీ ప్రవాహంలా.. సాగే జీవన పయనమే ధన్యమని.. మరో పద్యంలో పేర్కొన్నారు.

కాలం – జ్ఞాపకాన్ని ఇచ్చిందా? జ్ఞాపకం కాలాన్నీ గుర్తుకు తెచ్చిందా? అంటూ ప్రశ్నించుకుంటూనే కవి కాలం కొన్ని జ్ఞాపకాలను దాచేస్తుందని….. జ్ఞాపకం కొంతసేపు కాలాన్ని బంధించేస్తుంది… అదే జీవన ధన్యమని పేర్కొన్నారు.

మరికొన్ని పద్యాల్లో.. భిన్నత్వంలో ఏకత్వం.. ఆద్యంతం లేని ప్రేమ… అంతుచిక్కని జీవన సంక్లిష్టత.. భ్రాంతి జీవన వైరుధ్యాలను కవి వెంకటేశం గారు తాత్త్వికతతో సందేశాత్మకంగా ఆవిష్కరించారు.

ఇంకా.. భావనా శక్తి విస్తరణ గురించి.. మనకు మనం చిత్రించే కళాఖండం గురించి.. కవి ప్రకటించిన భావాలు ప్రేరణదాయకంగా ఉన్నాయి.. ఇంకో పద్యం ద్వారా కావాలన్న కోరిక.. ఇంతేనా అన్న నిరాశ అంతా నాదే అన్నీ నాకే అన్న అత్యాశ.. పరులదీ తనకే అన్న దురాశ వదులుకోవాలని సూచించారు.

ఇంద్రియాలకతీతంగా మనోనేత్ర సందర్శన భాగ్యమని.. పరమాత్మ అలౌకిక సౌందర్యం ధన్యమని మరొక పద్యంలో వివరించిన తీరు బాగుంది. ప్రకృతి దైవ చింతన తుదకు శరణ్యం అనుటే ధన్యమని తేల్చి చెప్పారు.

ఇలా ఈ పుస్తకంలోని అనేక పంక్తులు ఉదహరించడానికి యోగ్యంగా ఉన్నాయి. ప్రతి పద్యం ఓ ఆణిముత్యంలా రూపుదిద్దుకుంది. జీవన సత్యాన్ని ప్రకటించేలా కొలువుదీరింది. కవి వెంకటేశం గారు ప్రకటించిన భావాలన్నీ గొప్ప సందేశాలను మోసుకొచ్చాయి. సామాజిక చైతన్యానికి మధుర గుళికలుగా ఉపయోగపడేలా ఉన్నాయి. ఈ సందర్భంగా కవి వెంకటేశం గారికి శుభాకాంక్షలు తెలియజేద్దాం.

– దాస్యం సేనాధిపతి

You may also like

2 comments

సమదర్శిని తెలుగు సాహిత్య పరిశోధన సంస్థ నిర్మల్ July 3, 2021 - 2:08 pm

జీవన ధన్య శతకం సమీక్ష చాలా బాగుంది, అలాగే పూర్తిస్థాయిలో పద్యం ఉటంకిస్తే ఇంకొంచెం అందంగా ఉండేది. శతకాన్ని ఒక సందర్బంలో గ్రంథము అని మరొక చోట పుస్తకం అని సమీక్షకులు వాడారు. ఏ సందర్భంగా వాడినను మూడు ఒకటే అర్థాన్ని కలుగ జేయవు. విభాగాల వివరణ సమంజసమనిపించింది. మనసులో మాటను దాచుకోకుండా చెప్పాను, కృతజ్ఞతతో మీ

డాక్టర్ ఎల్మల రంజీత్ కుమార్

Reply
సమదర్శిని తెలుగు సాహిత్య పరిశోధన సంస్థ నిర్మల్ July 3, 2021 - 2:19 pm

జీవన ధన్య శతకం సమీక్ష చాలా బాగుంది, అలాగే పూర్తిస్థాయిలో పద్యం ఉటంకిస్తే ఇంకొంచెం అందంగా ఉండేది. శతకాన్ని ఒక సందర్బంలో గ్రంథము అని మరొక చోట పుస్తకం అని సమీక్షకులు వాడారు. ఏ సందర్భంగా వాడినను మూడు ఒకటే అర్థాన్ని కలుగ జేయవు. విభాగాల వివరణ సమంజసమనిపించింది. మనసులో మాటను దాచుకోకుండా చెప్పాను, కృతజ్ఞతతో మీ

డాక్టర్ ఎల్మల రంజీత్ కుమార్

Reply

Leave a Comment