Home పుస్త‌క స‌మీక్ష‌ “స్థితస్యగతిః చింతనయా”

“స్థితస్యగతిః చింతనయా”

by Kura Chidambaram

అవును! ఎంతటి చింతనీయమైన ‘దుర్గతి’ ఇది!

భూమి, నీరు, వెలుగు, సమీరాకాశాలను కేవలం తన కడకంటి చూపుతో, 4 అంగుళాల అరచేతిలో ఇమిడపోయిన ‘రిమోట్’ ఒకచోట వ్రేలి కొస నొక్కుతో శాసించగల్గిన మానవుడికేనా – ఈ చింతనీయ గతి!

త్రివిక్రముడులా అపరపరాక్రమంతో ఒక కాలు భూమిపై నుంచి, మరోకాలు చంద్రమండలాన్ని తాకి విర్రవీగిన మానవుడికేనా – త్వరలో అంగారక సదృశ గ్రహాన్ని ఆవాసంగా మార్చుకోబతోన్న మానవుడికేనా ఈ దుస్థితి!

‘సర్వాంతర్యామి’ అనే వాడెవడో, ఎక్కడో లేడని, భూలోకంతో సహా 14 భువనాలు తనవేనని, తనే సర్వవ్యాపి, సర్వంతర్యామి, సర్వంతనేనంటూ విర్ర వీగుతూ తనే మాన్యుడనీ మరెవరినీ కొలువొద్దని విర్రవీగుతోన్న అసురసంధ్యవేళ పుచ్చిపోయిన మొగురం (స్థంభం)లోంచి, అటు మనిషి కాక ఇటు జంతువుకాని ప్రాణి ఉద్భవించి తన ఇనపగోళ్ళతో గర్వాంధుడు మదాంధుడు అయిన హిరణ్యకశిపుడిని సంహరించినట్లు, అటు సురల్నీ ఇటు అసురుల్నీ, తన ఉనికి, స్థితి, చింతనకు తెచ్చినట్లు –

ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఊహించను కూడా వీలుకాని ‘ఊహాన్’ నగరంలో, బొగ్గురామిత్రవ్వే చీకటి గనుల్లో, అటు జంతువుకాక ఇటు పక్షీ కాక, నోరు, విసర్జక అవయవం ఒక్కటే అయి, పరమ రోత కలిగించే గబ్బిలం కడుపులో పుట్టి, మానవ హిరణ్యకశిపుల్ని నిర్దయగా, నిర్దాక్షిణ్యంగా అన్ని జాగ్రత్తలకు అతీతంగా, పేద ధనిక ఆడ, మగ, ఇక్కడ అక్కడ, అనే తేడా చూపకుండా ఈ మానవ హిరణ్యాక్షులను తన వాడిగోళ్లతో, కళ్లకు కనిపించక, దును మాడటం ఏమిటి?

అంతటి అసమాన పరాక్రమశాలి, అతులితబలుడు అస్త్ర, శస్త్ర సంపన్నుడూ అయిన మానవుడు ఈ కంటికి కనిపించని శ్రతువు ఖడ్గ ప్రహారాలకు బెంబేలెత్తి, కకావికలై ‘తాను శాసిస్తున్నాను’ అనుకున్నా ఉచితంగా ప్రకృతిలో అనాయాసంగా, ఆయాచితంగా దొరికే వాయువు; ప్రాణవాయువు, ప్రాణాధార సమీరాన్ని లీటర్ల చొప్పున లక్షలు వెచ్చించి కొనుక్కోవటం ఏమిటి? ఇంతా చేసినా, లక్షలు ధారపోసినా, ప్రాణాలు దక్కక విలవిలలాడటం ఏమిటి?

ఇంత చేసినా, బ్రహ్మ కలంపోటుతో కసువుగా మారి అసువులు బాస్తే – పూడ్చటానికో, కాల్చటానికో ఆలుబిడ్డలకు దూరమై ‘అనాధ’ చావు చస్తే, ఎవరూ భయంతో రాకపోతే, మ్యునిసిపాలిటీ వాడి కుక్కల బండే, వైకుంఠరథమై ప్రయాణం కట్టటం ఏమిటి? విలయం కాకపోతే, ఇది ఏమిటి?

సర్వాంతర్యామి మానవాతీత శక్తి మహాదేవుడు – ఎవరూ లేరని అన్నీ తానేనంటు, అన్ని వనరుల్ని అప్పనంగా అనుభవించాల్సింది తానేనని విర్రవీగిన ఈ మానవ హిరణ్యాక్షుడిని కరోనా – అవును- కరోనా ఎక్కడి నుండి ఎక్కడకు దిగజార్చింది!

ఇలాంటి గతిలో, దుర్గతిలో నరజాతి సమస్తం విలవిల్లాడుతోంటే – చీకటి కుహరంలోకి త్రోయబడి చివరకు గాలి కూడా ఆడని గతిలో, 68 కళలు సాహిత్య సౌరభాలు గానసభలు, కళారంగ భారతిలు ఎవరడిగేను? ఎవరికి గుర్తు వచ్చేను?! సన్మాన పంచాంగాలు కాదు: ప్రాణాంగ దక్కితే చాలు; గండం గడిస్తే చాలు; బలుసాకు తినగలిగే స్థితిలో ఉన్నా చాలు.

మనల్ని ఈ కష్టకాలంలోంచి పైకి చేదుకునే ప్లహ్లాదుడు – అదుగో వస్తున్నాడు. సూది మొనయై మన భుజకండాల్లోకి, సున్నితంగా దిగబడి మనలో ఎదురిచే అస్త్రశ్రస్తాలను నింపటానికి వస్తున్నాడు. చిక్కగా క్రమ్ముకుని మసకేసిన మబ్బులు ప్రపంచాన్ని చెదరగొడుతూ చెదిరిన మబ్బు పూలదండ ఆయన గళహారంగా ప్రకాశిస్తోంటే , మనల్ని ఆదుకోవటానికి, చేదుకోవటానికి వాక్సీనై వస్తున్నాడు.

మనల్ని ఈ సమస్య వలయంలోంచి పైకి లాక్కుని అలిసిన మన ‘పాల’ బంధువుల్ని తుడిచి స్వాంతన చేకూర్చుతాడు. సకల కళాభారతిని గంధర్వగాన సభల్ని మళ్ళీ వింటాము. చింతవద్దు. తొందరవద్దు.

(బుర్రా లక్ష్మీనారాయణగారి మబ్బుదండ (పాలపిట్ట మే 21) చదివాక.

 

You may also like

Leave a Comment