కవయిత్రి, రచయిత్రి, సాహితీ సౌజన్యమూర్తి, గుడి మరియు బడిని నిర్మించి సామాజిక సేవలో ముందున్న మహిళామణిదీపం, అంతకు మించిన గొప్ప మానవతామూర్తి. డా. అమృతలత గారు బహుముఖ రంగాలలో మరియు అనేక సాహితీ ప్రక్రియల్లో ప్రవేశం ఉన్న వీరు కవిత్వం, నవల, నాటిక, కథలు రాశారు.
‘‘స్పందన’’ కథా సంపుటిని 2017లో వెలువరించారు. ఇందులో ఉన్న కథలు 1969 నుండి 2016 వరు సుదీర్ఘకాలంపాటు 47 సం॥లలో రాసినవి. వివిధ జీవనదశల్లో సాగిన ఈ కథలు ఆణిముత్యాలు. రచయిత్రి తన దృష్టికి వచ్చిన అనుభవాలను, అనుభూతులను సమస్యలను, సంఘర్షణలను ఎంతో సహజంగా చిత్రించారు. బాల్యదశ నుండి వృద్దాప్యదశ వరకు సాగే పాత్రలు స్నేహ పరిమళాలను పూయిస్తూ ముందుకు సాగుతాయి. ఈ కథలన్ని కూడా ఆయా పత్రికల్లో అచ్చయిపాఠకుల మన్ననలను పొందిన కథలు.
స్త్రీ పాత్రల విషయానికి వచ్చినప్పుడు మహిళల చుట్టు ఉండే సున్నితమైన అంశాలు మృధుమధురమైన కథన పద్ధతిలో, విలక్షణమైన వస్తువైవిధ్యంతో నడుచుకుంటాయి. ప్రేమలు, పెండ్లిళ్ళు, రిజర్వేషన్లు, సమాజంలో ఉండే స్వార్థపూరితమైన అంశాలు ఇట్లా అనేక సీరియస్ అంశాలు కూడా చర్చకువచ్చాయి.
‘‘కాలం వెక్కిరించింది’’, ‘‘మనసు ఎదగని మనుషులు’’, ‘‘కన్నీళ్ళతో కాలక్షేపం’’, ‘‘అన్రెస్ట్’’ కథలు కాలేజీ వాతావరణ నేపథ్యంలో నడిచిన కథలు. ‘‘కాలం వెక్కిరించింది’’ కథలో విజయ, రజితలు యుక్తవయస్సులో ఉండి కాలేజీకి వెళ్తున్న పాత్రలు. ఆ వయస్సులో ప్రేమలు, ఆకర్షణలు సర్వసాధారణం. రజిత ప్రకాష్‌లు ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటారు. కానీ, కాలం, పరిస్థితులు వారిని వేరుచేస్తాయి. విజయను తోటిస్నేహితుడు రవి ప్రేమిస్తాడు. వీరి విషయంలో ప్రేమ వన్‌సైడ్‌గా ఉంటుంది. రవి విజయను ఇష్టపడతాడు కాని విజయ రవిని ప్రేమించదు. కాలగమనంలో విజయకు ప్రకాష్ పెండ్లి అవుతుంది. మనసులు కలువని పెండ్లి వారిద్దరిని ఒకటిచేయలేకపోయింది. కథాముగింపులో ఉత్తరం ద్వారా విజయ అసలు విషయం తెలుసుకుంటుంది.
రవి, ప్రకాష్, రజిత పాత్రలు చనిపోవడంతో పాఠకులకు అయ్యో! అనిపిస్తుంది. రచయిత్రి బి.ఎ.లో ఉన్నప్పుడు రాశారు కాని విద్యార్థుల కళల ప్రపంచం చుట్టూ ఉన్న యదార్థం వస్తువుగా స్వీకరించారు.
1970 లో రాసిన కథ ‘‘ఆశయాలుఆదర్శాలు’’ మంజుల, వినీల, షీలా పాత్రలు విశ్వవిద్యాలయంలో చదువుకుంటూ, హాస్టల్లో ఉండి చదువుకుంటున్న యువతులు. ఉడుకురక్తంతో ఉన్న వీరు ఆదర్శాల గురించి చర్చించడమే కాదు, ఆచరించాలనే ఉత్సాహం కలిగినవారు. వరకట్న సమస్యను నిర్మూలించాలనే ఉద్ధేశ్యంతో వారి నిజజీవితంలో అక్షరాల పాటిస్తారు. ఇతరులకు సహాయం చేయాలనే సంకల్పం ఉన్నపాత్రలు. కన్నీళ్ళతో కాలక్షేపం కథలో వజ్రమాల, స్పందన కథలో ‘అరుణ’, ఆమె నవ్వు కథలో సుజాత, ‘నా సరి నీవని
నేసరి నేనని’ కథలో సత్య పాత్రలు దాంపత్యజీవితంలో ఉండే కష్టసుఖాలను ఆత్మస్థైర్యంతో ఎదుర్కొన్న పాత్రలు.
వజ్రమాల చాలా అందమైన అమ్మాయి. తెలివైన అమ్మాయికూడా. బి.ఎస్సీ. చదువుతున్న సమయంలోనే ఆమె తండ్రి, ఎక్కువ కట్నం ఇచ్చుకోలేని నెపంతో నల్లటిరూపం కలిగిన ఒక మోస్తారు ధనవంతుడికి ఇచ్చిపెండ్లి చేస్తాడు. ఆడపిల్ల జీవితం పెండ్లికి ముందు, పెండ్లి తరువాత అనే రెండు విభిన్న పార్శ్వాలుగా ఉంటుంది. కొన్ని బొమ్మా బొరుసులో మారిపోతుంది. పెండ్లి తర్వాత వజ్రమాల జీవితం కూడా నరకప్రాయం అవుతుంది. ఎంతటి ఆత్మస్థైర్యాన్ని ప్రదర్శించిన సమస్యలోంచి బయటపడలేకపోతుంది. కథా ముగింపులో వజ్రమాల నిండుజీవితం ఆత్మహత్యకు బలికావలసి వస్తుంది.
స్పందన కథలో రెండు జంటలు ఒకే కుటుంబానికి చెందినవి. అర్థం చేసుకునే ప్రేమ, అవగాహనాలోపం ఉన్న ప్రేమలు ఎలా ఉంటాయో సమాంతరంగా చిత్రించిన కథ ఇది. ఒక జంట రవి, మాధవి దాంపత్య జీవితానికి ఇంద్రధనుస్సు రంగులను అద్దగలుగుతారు. మరొక జంట శ్రీనివాస్, అరుణలు ఒకరినొకరు అర్థం చేసుకోరు. ముఖ్యంగా అరుణ సున్నిత మనస్తత్వాన్ని భర్త శ్రీనివాస్ అర్థంచేసుకోలేని స్థితిలో ఉంటాడు. దాంతో అరుణ జీవితం మోడుబారిన చెట్టును తలపిస్తుంది. ఈ కథలో దాంపత్య జీవితం ఎలా ఉండాలి! ఎలా ఉండకూడదు! అన్న సందేహం పాఠకులకు బోధపడుతుంది.
ఆమె నవ్వు కథలో సుజాత పాత్ర వైవాహిక జీవితం ఎవరికి చెప్పుకోలేని సమస్యను అనుభవిస్తుంది. సమాజంలో అక్కడక్కడ ఇట్లాంటి సంఘటనలను చూస్తూనే ఉంటాము. కథంతా నాటకీయ పద్ధతిలో సాగుతూ ఉత్తరంతో ముగుస్తుంది.
‘నాసరి నీవని` నీసరి నేనని’ కథలో కథా ఎత్తుగడలోనే ఆడపిల్లగా పుట్టినందుకు మురిక్కాలువలో విడిచిపెట్టబడుతుంది. పెంచినతల్లి మాత్రం అల్లారుముద్దుగా పెంచుకుంటుంది. సత్యభామ అని పేరు పెట్టుకుంటుంది. ఆ దంపతులకు కొన్నిరోజులకు మగసంతానం పుడితే వరప్రసాద్ అని పేరు పెట్టుకుంటారు. ఆ తల్లి బిడ్డకొడుకు అనే వ్యత్యాసం పెంపకంలో చూపించదు. తల్లిపెంపకం ఆడా, మగా అనే తేడా లేకుండా సమానంగా పెంచాలనే సందేశాన్ని ఈ కథ అందిస్తుంది. కథలో సందర్భానుసారంగా ‘ఆడంగి పనులు’, ‘మగమహరాజు’, ‘సిగ్గుపడటం’, ‘ఇంటిపని’ ఇట్లా స్త్రీల చుట్టు తాడే మడికట్లు పదాలను ఎత్తి చూపిస్తాయి.
కాలని తెప్ప, స్వీట్ నాన్సెస్స్, అన్రెస్ట, నేనుసైతం, అంతుపట్టని ఆంతర్యాలు, ఆత్మీయస్పర్శ, చరిత్రను సృష్టిస్తా, టెంప్టేషన్ కథలు సామాజిక సమస్యలను విశ్లేషిస్తాయి. ఇందులోని పాత్రలు వర్గతారతమ్యాలను ఆర్థిక అవసరాల చుట్టూ అల్లబడిన భ్రమలను తేటతెల్లంచేస్తాయి.
టెంప్టేషన్, కాలని తెప్పకథల్లో స్త్రీ పాత్రలు వర్గతారతమ్యాలకు ప్రతీకలుగా కనిపిస్తారు. రంగి, ధనవంతుల ఇంట్లో పనిమనిషి, లచ్చి బిక్షగత్తె. విమల, విజయలు ధనికవర్గానికి చెందిన స్త్రీలు. అందరూ మనుషులే. మాతృత్వం అందరికి ఒకటే. కోరికలు అందరికి ఉంటాయి. కొందరికి మాత్రమే నెరవేరుతాయి అనే జీవన కఠోర వాస్తవాలను ఈ కథలు తెలియజేస్తాయి. ‘స్వీట్నాన్సెస్స్’ కథలో కుంతి, సీత పాత్రలు చిన్నప్పుడు కలిసి ఆడుకున్న బాల్యమిత్రులు ఇరవై ఐదేండ్ల తర్వాత అనుకోకుండా మళ్ళీ కలుసుకుంటారు. అప్పటికి వారిరువురి జీవితం ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అనే సామెతతో పోల్చవచ్చు. సీత ఒకప్పుడు గుమస్తా కూతురు. ఆ తర్వాత కృషిని నమ్ముకుంది. పట్టుదలతో శ్రమించింది. కలెక్టర్ కాగలిగింది. కుంతి యజమాని కూతురు. చిన్నప్పుడు చాలా గారాబంగా పెరిగింది. ధనంలో పుట్టిపెరిగిన కుంతికి కొన్ని సంవత్సరాల తర్వాత అనుకోని కారణాలవల్ల ధనంపోతుంది. హఠాత్తుగా చనిపోతాడు. చిన్న పాపను పెంచాల్సిన బాధ్యత తనపైపడుతుంది. ఉద్యోగం చేయడం అనివార్యమవుతుంది. అందుకని లెక్చరర్ ఇంటర్వ్యూకి బయలుదేరుతుంది. మార్గమధ్యంలో స్నేహితులు కలుసుకుంటారు. వారి ప్రస్తుత పరిస్థితిని ఒకరినొకరు తెలుసుకుంటారు.
‘అన్రెస్ట్’ కథలో అరుణమేడం, విమల, కిరణ్ మంజుల, ఉష, గీత, సునంద పాత్రలు మహిళా కళాశాలలో రిజర్వేషన్ గురించి విస్తృతమైన స్థాయిలో చర్చను లేవనెత్తుతారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ ఉండాలని కొంతమంది, వద్దని కొంతమంది ఎవరికోణంలో వాళ్ళు వాదిస్తుంటారు. అరుణమేడం వీరి చర్చలను శ్రద్దగా వింటుంది. ప్రజాస్వామ్యదేశం, సోషలిస్టు దేశం, ప్రెజిడెంట్ రూల్దేశంలలో ఏది ప్రజలను అభివృద్ధి చేస్తుంది. ప్రజలమధ్య అంతరాలను ఏ ప్రభుత్వం తగ్గించగులగుతుంది. అన్ని చర్చల్లో అరుణ మేడమ్ హత్య విద్యార్థి సంఘాలలో మార్పును తీసుకువస్తుంది. ‘సంఘటిత శక్తి’గా ఎదగాలని నిర్ణయించుకుంటారు.
నేను సైతం కథ రెండు వర్గాల ప్రజల జీవన విధానాన్ని అద్దంలో పెట్టిచూపింది. ఉత్తమపురుషలో సాగుతూ బాల్యంలో ఉన్న ధనవంతుల అమ్మాయి సంచార జీవితాన్ని గడుపుతూ ఉన్న బంజారాల బండిని పరిశీలనగా చూస్తుంది. ఆమె ఇంటిముందు ఆపి వారు వంటఏర్పాట్లు చేసుకుంటారు. అటెండర్‌కు చెప్పి వాళ్ళకు నీళ్ళు ఇప్పిస్తుంది. వారి పిల్లలను చూస్తే తనతోటి వయస్సు, తన చిన్నవారులా కన్పించారు. ఇంట్లో అమ్మ లేకపోవడంతో తను వేసుకొని బట్టలను వారికిచ్చి నేను సైతం సహాయం చేశాను అని మానవత్వాన్ని చాటుకుంటుంది. వర్షం బారినుండి కాపాడటానికి వారి అవుట్హౌజ్ ఇచ్చి అమ్మాయి వాళ్ళమ్మ మరింత మానవత్వాన్ని చాటుకుంటుంది. మనుషుల్లో దయ, జాలి, కరుణ ఎల్లప్పుడు ఉండాలనే సందేశాన్ని కథ అందిస్తుంది.
‘అంతుపట్టని ఆంతర్యాలు’ కథలో షేమ పాత్ర ద్వారా రచయిత్రి లౌకిక సమాజంలో ఉన్న ఆర్థిక అవసరాలను తెలియజేస్తుంది. ‘ఈ లోకంలో అంతుబట్టనిదంటూ ఉంటే అది మనిషి ఆంతర్యమేన’ని హేమ పాత్ర కథాముగింపులో అడవడంతో మనిషిలోని స్వార్థం, మోహం, కామం, జుగుప్సలతో నిండి వుంటుదన్న వైఖరి కథా సంఘటనల్లో తెలిసివస్తుంది.
ఇట్లా కథలన్ని కూడా సామాజిక, ఆర్థిక, అసమానతలపై వైవాహిక సమస్యలపై స్త్రీల ఆంతరంగిక మనోభావాలను సున్నితమైన శైలిలో వ్యక్తీకరిస్తాయి. విలక్షణమైన వస్తువును ప్రథమపురుష, ఉత్తపురుష, ఉత్తరాల కథనంతో కథను నడిపిస్తూ హాయిగా పాఠకులను చదివించగలిగే భావవ్యక్తీకరణలు ఈ స్పందన కథాసంపుటి సమాహారం.
స్పందన కథాసంపుటిలో స్త్రీ పాత్ర చిత్రణ
previous post