Home పుస్త‌క స‌మీక్ష‌ స్వర్ణకమలాలు కథాసంపుటి – వస్తురూప వైవిధ్యం

స్వర్ణకమలాలు కథాసంపుటి – వస్తురూప వైవిధ్యం

by Devendra

రచయిత్రి పరిచయం:

అర్థశతాబ్దంపాటు నిరంతసాహితీ సృజన చేసిన ఇల్లిందల సరస్వతీదేవి తెలుగుకథాసాహిత్యానికి ఒకస్వర్ణకమలం‘. తన 35 ఏట రచనను ప్రారంభించినప్పటికి రెండువందలకు పైగా కథలు, పదమూడు నవలలు, పెద్దకథలు, పిల్లలకథలు, పతిక్రల్లో వ్యాసాలు ఇట్లా బహుముఖీనమైన కృషిచేసిన సాహిత్యమహిళాశిరోమణి. స్వర్ణకమలాలు కథాసంపుటికి కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు రావడమన్నది సరస్వతీదేవి రచనా ప్రతిభకు వచ్చిన గుర్తింపు. అంతేకాకుండా సాహిత్యం, సంఘసేవ రెండుకండ్లుగా భావించి ఒక బాధ్యతాయుతమైన స్థానంలో నిలిచిన విదుషీమణి.

ఇల్లిందల సరస్వతిదేవిగారు 1918లో పశ్చిమగోదావరి జిల్లా సరసాపురంలో ఒక సంప్రదాయ కుటుంబంలో పుట్టారు. తండ్రి కామరాజు వెంకటప్పయ్య ఉద్యోగరిత్యా అనేక

ఊర్లు తిరగవలసివచ్చింది. తల్లి బాల్యంలో మరణించడవల్ల సరస్వతీదేవి తన పెద్దతల్లి ఆలనపాలనలో పెరగవలసి వచ్చింది. వీరిది కుటుంబం విద్యావంతుల కుటుంబం. అదే బాటలో నడిచిన సరస్వతిదేవి ఎంతో ఆసక్తితో చదువుకున్నారు. రోజుల్లో ఆడపిల్లలకు చిన్నవయసులో పెండ్లిళ్లు చేసేవారు. చదువుకుంటున్న వయసులోనే సరస్వతీదేవి వివాహం జరిగింది.

సరస్వతీదేవి గారి మెట్టినిల్లు తెలంగాణ ప్రాంతం. భర్త ఇల్లిందల సీతారామారావు ఉస్మానియా విశ్వవిద్యాలయ రసాయన విభాగంలో రీడర్ గా పనిచేశారు. భార్యగా, తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే సరస్వతీదేవి చదవడం మానలేదు. శ్రీకృష్ణదేవరాయ భాషానిలయం నుండి అనేక గ్రంథాలను, పత్రికలను తెప్పించుకొని చదివేవారు. ఆమె పఠనాశక్తిని గమనించిన భర్తకూడా అందుకు ప్రోత్సహించారు. ఆమె నిరంతర అధ్యయనం తరువాతి రోజుల్లో ఒక సాహితీమూర్తిగా ఎదగడానికి బలమైన పునాది అని చెప్పవచ్చు.

1982లో కేంద్రసాహిత్య అకాడమీ అవార్డును గెలుచుకున్న స్వర్ణకమలాలు కథాసంపుటి 1981లో ప్రచురించబడింది. అంతకుముందు వెలువరించిన ‘పండుగ బహుమానం’, ‘అక్కరకు వచ్చిన చుట్టము’, ‘ముత్యాల మనసు’ అనే మూడు కథాసంపుటలలోని నలభైరెండు కథలకు అధనంగా యాభైఎనిమిది కథలను చేర్చి వందకథలతో, పదకొండువందల ఏడు పేజీలతో ‘స్వర్ణకమలాలు’ కథాసంపుటి వెలువరించి కథాసాహిత్యంలో చెరగని ముద్రను వేశారు. రచయిత్రి వెలువరించిన తరువాతి కథాసంపుటి ‘తులసీ దళాలు’ నూట ఎనిమిది కథలతో ప్రచురించబడింది. వీరు రాసిన కథలన్ని ఆండియా రేడియోలో, భారతి, శోభ, స్రవంతి, ఆంధ్రభూమి, వనిత, యువ, ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక, అనామిక పత్రికలలో ప్రచురించబడ్డాయి.

స్వర్ణకమలాలు- వస్తువైవిధ్యం:

‘నిగూఢభీజ స్థితినుండి వెలికి వచ్చిన విషయాంకురం కథావస్తువు’ అన్నారు పోరంకి దక్షిణామూర్తి. నిత్యం మనం చూసే సంఘటనలు, పొందే అనుభూతులు, జరిగేవింతలు, సామాజిక అంశాలు, రాజకీయ పరిణామాలు, నాగరికపు హంగులు రచయిత దృష్టిలో పడగానే కథావస్తువులుగా మారుతాయి. జీవితాన్ని, సమాజాన్ని నిశితంగా పరిశీలించి ఆకట్టుకునే శైలిలో, అనుభూతి ఐక్యతతో ఇల్లిందల సరస్వతిదేవి కథలను రాసి జీవితకళాఖండాలుగా మలిచారని చెప్పవచ్చు.

కుటుంబ వ్యవస్థ:

వ్యక్తి, కుటుంబం, సమాజం పరస్పర సహాయసహకారాలతో కాలమనుగడ సాగుతుంది. భారతీయ వ్యవస్థలో కుటుంబం అత్యంత కీలకమైనది. వ్యక్తి యొక్క జీవనవిధానం, సంస్కృతి, ప్రేమ ఆప్యాతలు, బంధాలు ఇవ్వన్ని కుటుంబంవలనే సాధ్యమౌతాయి. రచయిత్రి కలంపట్టేనాటికి ఉమ్మడి కుటుంబవ్యవస్థ ఉండేది. రానురాను సమాజంలో చిన్నకుటుంబాలు పెరుగుతూవచ్చాయి. ఇల్లిందల సరస్వతిదేవి ఎక్కువగా ఉమ్మడి కుటుంబాలలో మంచిచెడులను కథావస్తువులుగా స్వీకరించారు. ఆర్థికోణంతో చూసినప్పుడు ధనిక, మధ్యతరగతి, పేదకుటుంబాలుగా విభజించిచూడవచ్చు. సరస్వతీదేవి కథలు కుటుంబజీవన తాత్త్వికతను చెప్తూనే ధనిక, పేదవర్గాల మధ్య ఉన్న ఆర్థి సంబంధాలను కూడా తెలియజేస్తాయి. ‘బలియసీ కేవలమీశ్వరాజ్ఞ’, ‘కొండమల్లెలు’, ‘పండుగచీర’, ‘పితృహృదయం’, ‘అసమర్ధుడు’, ‘బహుమానం’, ‘సహోదరులు’, ‘ముత్యాల మనసు’, ‘తండ్రిపోలిక’, ‘వేమూరివారి కోడలు’, ‘అడ్డుతెరలు’, ఎదిగిన కొడుకు’, ‘

తల్లి మనసుమొదలైన కథల్లో వివిధ బంధాల, అనుబంధాల గాఢతలు, చేదు అనుభవాలు చిత్రించబడ్డాయి.

స్వర్ణకమలాలు కథాసంపుటిలో మొదటికథ కొండమల్లెలు. ఈ కథ డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు పాఠంగా కూడా ఉంది. ఇందులో శివనాథం, గురవడు రెండు ప్రధాన పాత్రలు. “శివనాథం తక్కువ జీతాల తెగలోవాడు. కలిగిన దాంట్లోనే జీవితానికి కావలసిన నాలుగు అమర్చుకోవాలనుకుంటాడు. అతడికేదయినా లేదు, చాలదనుకోవటానికే అసహ్యము. శకుంతల దీనికి సరిగ్గా వ్యతిరేకము” భార్యకోరికలు తీర్చే ఆర్థికస్తోమత అతడికి లేదు. అందుకని అతడి జీవితాన్ని ఏదో ఒక అసంతృప్తి వెంటాడుతుంది. అందుకని శివనాథం ఆఫీసునుండి గంటముందు బయలుదేరి ఏటిగట్టువెళ్ళి ఇసుక తిన్నెల్లో పడుకొని ఆకాశాన్ని చూస్తూ ఆ నీటి ప్రవాహచప్పుడును వింటూ ఏకాంతంగా కూనిరాగాలు పాడుకొని రావటం అలవాటుగా మార్చుకున్నాడు. శివనాథం, శకుంతల మధ్యతరగతి కుటుంబానికి చెందిన భార్యభర్తలు. ఈ కథలో రచయిత్రి సమాంతరంగా గురువడు, పోచాలు పాత్రలను చిత్రించి కుటుంబంలో భార్యభర్తల మధ్య ఉండవలసిన సర్దుబాటును తెలియజేశారు. గురువడు, పోచాలు కూలీనాలీ చేసుకొని బతికే పేదకుటుంబం. జీవిత ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికి, గురువడు ఒకానొక సందర్భంలో అస్వస్థతకు గురైన సందర్భంలో భార్య పోచాలు కూలీపనికి వెళ్ళిసంసారం నెట్టుకొస్తుంది. కానీ భార్యభర్తల మధ్య అనురాగం తగ్గలేదన్న విషయాన్ని సాక్షీభూతంగా గురువడు, పోచాలు పాత్రలు ప్రవర్తిస్తాయి. శివనాథం జీవితంలోని అసంతృప్తిని పోగొట్టుకోవడానికి, గురువడి జంటను చూసి ఆనందపడతాడు. రచయిత్రి పాఠకుడిని ఒక సద్భావనవైపు తీసుకెళ్ళడానికి ఈ పాత్రలు ఎంతగానో తోడ్పడుతాయి. దంపతులు ఎలా ఉండాలి. ఎలా ఉండకూడదో అన్న విషయాన్ని స్పురణకు తెస్తాయి. ఈ కథలో మధ్యతరగతి, పేద ప్రాతినిధ్య పాత్రలను చూపిస్తూ డబ్బుకంటే ప్రేమగొప్పదన్న జీవనతాత్త్వికతను చిత్రించి సఫలీకృతులయ్యారు రచయిత్రి.

1958లో ‘భారతి’ పత్రికలో అచ్చయిన కథ ‘బలీయసీ కేవలమీశ్వరాజ్ఞ’. అప్పటికి ఆంధ్రప్రదేశ్ ఏర్పడి రెండు సంవత్సరాలైంది. తెలంగాణ ప్రాంతంలో జమీందారి వ్యవస్థ మూలాలు బలంగా ఉండటంతో ధనిక, పేదవర్గాలు మాత్రమే ఉన్నాయి. మధ్యతరగతి చాలా ఆలస్యంగా ఏర్పడింది. ధనికవర్గానికి చెందిన జమీందారిణి కథలోని ప్రధాన పాత్ర. ఆర్థిక సంబంధ విషయాలలో ఏ లోటు లేదు. ఇంటినిండా పనివాళ్ళు కాబట్టి హోదాలో జీవిస్తున్న జమీందారిణికి ప్రేమానురాగాల విలువ పెద్దగా తెలియకుండానే జీవితం గడిచిపోయింది. యజమాని అయిన భర్తకు బాగాలేక ఎండాకాలం శీతల ప్రదేశాలకు వెళ్ళే ప్రయాణం ఆగిపోయింది. ఇల్లుచల్లగా ఉండటానికి భవనం చుట్టుతడకలు వేయించే పనిలో భాగంగా పరిచయమైన దంపతుల పాత్రలు చెల్లమ్మ, రామయ్యలు. ఇద్దరు కలిసిమెలసి పనిని ఎంతో ఇష్టంగా చేస్తుంటారు. జమీందారిణికి వాళ్ళను చూసినప్పుడు భార్యభర్తలకు ఇంతగా మాట్లాడుకునే విషయాలు ఏముంటాయి అనిపించేది. ఒకసారి వారిని గద్దించింది కూడా. ఒక రోజు అనుకోకుండా పనిచేస్తున్న క్రమంలో రామయ్య ఎక్కిన నిచ్చెన విరిగిపోయినందువల్ల అతడు కిందపడిపోతాడు. కాళ్ళు విరిగిపోతాయి. ఆ సందర్భంలో చెల్లమ్మ అన్న మాటలు జమీందారిలో మార్పును తీసుకొస్తాయి. “అమ్మా మారుమనువు ఎవరికి కావాలి తల్లీ! మా మామ మనసిచ్చి మనసును ఆకర్షించుకున్నాడు. ఒక పొల్లుమాట, ఒక కలుబొట్టు ఎరుగడు. ఒకరి జోలికి పోడు” అన్న చెల్లమ్మ మాటలు జమీందారిణిని ఎంతో ఆలోచింపజేశాయి. తను ఎప్పుడు కూడా భర్త దగ్గర ఒక పరిధిని విధించుకొని జీవించిందే తప్ప రామయ్య, చల్లమ్మల మధ్య ఉన్న అనురాగం తను అనుభూతి చెందలేదనిపించింది. వెంటనే భర్తగదికి వెళ్ళింది జమీందారిణి. ఎప్పుడు తన గదివైపు రాని భార్య, వచ్చేసరికి ఆ జమీందారు ఆనందానికి అవధులులేవు. పక్షవాతంతో బాధపడుతున్న భర్తకు పనివాళ్ళ చేత కాకుండా తనే సేవలు జేయడానికి పూనుకుంటుంది. రచయిత్రి ఈ కథలో దంపతుల మధ్య ఉండవలసినవి ప్రేమానురాగాలు తప్ప మరేమికాదన్న జీవన సత్యాన్ని చెప్పారు.

‘పితృహృదయము” కథలో కూతురు పుట్టిన తర్వాత వెంకట్రామయ్య భార్య చనిపోయింది. మూడు నెలలపాపను పెంచి పెద్దచేసి, చదువుచెప్పించి, పెళ్ళిచేసి బాధ్యతను నిర్వర్తించిన తర్వాత మళ్ళీ పెళ్ళిచేసుకుంటాడు వెంకట్రామయ్య. అప్పటినుండి కూతురు ఇంటికివచ్చే పరిస్థితులు లేవు. వీలున్నప్పుడు తండ్రీ కూతురు దగ్గరికి వెళ్ళివస్తూ ఆమె బాగోగులు చూస్తుంటాడు. కూతురుకు చెప్పరాని కష్టం వచ్చినప్పుడు కూడా తండ్రి ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండదు. ఈ కథలో తండ్రిపట్ల కూతురికి, కూతురుపట్ల తండ్రికి ఉండే అనురాగం బాధ్యతాయుతమైనది. ఉన్నతమైనది కూడా.

– “పండుగచీరె” కథలో రాజ్యలక్ష్మి మధ్యతరగతికి చెందిన ఇల్లాలు. భర్త భావనారాయణ కలెక్టరు ఆఫీసులో గుమస్తా. పల్లెటూరి నుండి పట్నంకు వచ్చిన రాజ్యలక్ష్మికి ఎన్నో సరదాలు, మరెన్నో కోరికలు ఉంటాయి. వాటిని తీర్చే ఆర్థికశక్తి భర్తకు లేదు. దీపావళికి కొత్త చీర కట్టుకోవాలని సరదా పడుతుంది రాజ్యలక్ష్మి. భర్త అప్పుచేసి మరి

భార్యకు చీరకొని తెస్తాడు. ఈ కథలో మధ్యతరగతి దంపతుల సాధక బాధకాలను రచయిత్రి చక్కగా విశ్లేషించారు. కథలో రాజ్యలక్ష్మి పెద్దగా చదువుకోలేదు. కాబట్టి ఉద్యోగము చేయలేదు. భర్తపై ఆధారపడి జీవించే స్త్రీ పాత్ర ఆనాటి సామాజిక పరిస్థితులను తెలియజేస్తుంది.

“అసమర్థుడు” కథలో రంగారావు ఇంటి పెద్దకొడుకు. తండ్రి చెప్పినట్టుగానే కుటుంబంలోని పిల్లందరు నడుచుకున్నారు, అభివృద్ధి చెందారు కాని పెద్దకొడుకు రంగారావుకు మాత్రం తండ్రి చెప్పినట్టు వినడం ఏ మాత్రం ఇష్టం లేదు. ఇంటర్ చదివి ఏ ఉద్యోగాన్ని సంపాదించలేకపోయాడు. దానితో తండ్రికి పెద్దకొడకంటే చిన్నచూపు. కాని రంగారావుకు తనమీద తనకు నమ్మకముంది. భార్యకూడా అతన్ని పూర్తిగా నమ్మింది. వ్యాపారం చేయాలని,

ఏమిచేస్తే బాగుంటుందని కొంత ఆలోచించుకునే లోపల ఇంట్లో ఎన్నో అవమానాలు ఎదురవుతాయి. భార్య నగలను తీసుకొని వెళ్ళి మహానగరం ముంబాయిలో పెట్టుబడి పెట్టి, విజయంసాధించి, భార్య పిల్లలతో ఆనందంగా జీవితం గడుపుతుంటాడు. అతడు తండ్రిముందు అసమర్థుడు కాదని నిరూపించుకుంటాడు.

‘సలహా’ కథలో లక్ష్మీకాంతరావు, రాజ్యం భార్యభర్తలు. వీరిద్దరికి శ్రేయోభిలాషి, బంధువు నరసింహారావు ఉ ంటాడు. పెండ్లి తర్వాత చాలా అన్యోన్యమైన జంటగా పేరుతెచ్చుకున్న రాజ్యం దంపతులు, కొన్ని కుటుంబ నిర్ణయాలు తీసుకోవడంలో వారిద్దరి మధ్య దూరం పెరుగుతుంది. ఆ సమయంలో ఒకరు ఇల్లు కొనాలని, మరొకరు కారు కొనాలని పంథం పట్టి కూర్చుంటారు. ఆ సందర్భంలో వీరిద్దరి మంచిని కోరే నరసింహారావు పాత్ర యుక్తిని ప్రదర్శించి, తగిన సలహాలను ఇచ్చి భార్యభర్తల మధ్య ఉన్న సమస్యను పరిష్కరిస్తాడు.

‘వేమూరివారి కోడళ్ళు’, ‘సహోదరులు’ ఈ రెండు కథల గ్రామీణ వాతావరణంలో కుటుంబసంబంధాలను తెలియజేసినకథలు. చిన్నప్పుడు కలిసి పెరిగిన అన్నదమ్ములు పెరిగి పెద్దగై ఎవరి సంసారాలు వారికి అయ్యాక పాలొళ్లుగా మారిపోతారు. సహోదరులు కథలో రచయిత్రి ఒక సంఘటనను సృష్టించి అన్నదమ్ముల మధ్య ఉండాల్సింది పగలు, ప్రతీకాలు కాదు, ప్రేమా ఆప్యాయతలు అని సందేశం ఇచ్చారు. అట్లాగే ‘వేమూరి వారికోడలు’ కథలో ఉన్నత కుటుంబాల్లో కోడళ్ళ మధ్య ఉండే పోటీతత్వం, రాగద్వేషాలు, ఈర్ష్య అసూయలు అన్నింటిని కళ్ళకు కట్టినట్లుగా చిత్రించారు. ఈ కథ చదివితే ఆడవాళ్ళ మధ్య ఉండాల్సింది అసూయకాదు ఐకమత్యం ఉండాలని బోధపడుతుంది.

ఇట్లా ఇల్లిందల సరస్వతీదేవి రాసిన చాలాకథలు కుటుంబవ్యవస్థను గురించి అనేకకోణాలను ఆవిష్కరించాయి. ‘ఆకరివాడు’ కథలో చిన్నవాళ్ళుగా పుట్టడడం వల్ల జీవితంలో జరిగే లోటుపాట్లు తెలియజేశారు. డైరీకథలో కూతురి ప్రేమను, ఆమె చిలిపి చేష్టలను తండ్రి అర్థంచేసుకోలేని సందర్భాలను చిత్రించారు. సామాజిక సమస్యలు:

వ్యవస్థలో ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం, పేదరికం, అంటరానితనం, స్త్రీల సమస్యలు, మూఢవిశ్వాసాలు, నమ్మకాలు, వైవాహిక జీవిత సమస్యలు, వృత్తిపరమైన కష్టాలు వస్తువులుగా ఇల్లిందల సరస్వతి అనేక సామాజిక కోణాలను చిత్రించారు.

1968 లో రాసిన ముత్యాలమనసు, స్వర్ణకమలాలు ఈ రెండుకథలు సమాజంలో ఉన్న వర్గ తారతమ్యాన్ని చిత్రించిన కథలు. ధనికులకు పేదవారు కూలీలుగా సేవచేయడం ఇప్పటికీ జరుగుతుంది. ఇట్లాంటి సంఘటనలు ఆర్థిక అసమానతలకు ఉదాహరణలు. ‘ముత్యాలమనసు’ కథలో ముత్యాలు ఆరుసంవత్సరాల పసిబాలుడు. బాలుడి తల్లిదండ్రులు బతుకుదెరువుకోసం ఉన్న ఊరు వదిలి మరొక ఊరుకు వలసవెళ్ళిన పరిస్థితి. ఒక ధనవంతుల దగ్గర పనికి కుదురుతారు. యజమాని ఇంట్లో ముత్యాలుతల్లి వెంకటి ధనవంతుల కొడుకును ఎత్తుకోవాలి. తండ్రి తోటపని చూసుకోవాలి. వీరుండటానికి మేడపక్కన చిన్న ఇరుగుగదిని కేటాయించారు.

ఒక రోజు ముత్యాల తల్లితోపాటు మేడలోకి వెళ్ళాడు. ఆ మేడలోని వస్తువులను చూసి ఆశ్చర్యపోతాడు. ఆటవస్తువులను చూసి అతడికెందుకులేవని చిన్నబుచ్చుకుంటాడు. ఊరు వదిలి వలస వచ్చినప్పటినుండి ముత్యాలు మనసు మనసులో లేదు. ఊళ్లో తల్లిదండ్రి పనికిపోయినా ఆడుకోవడానికి స్నేహితులుండేవారు. తల్లిదండ్రి పనికిపోతే ఇక్కడ చీకటిగదిలో ఒక్కడే ఉండాల్సిన పరిస్థితి. రోజు ముత్యాలు లేచే సమయానికే తల్లిదండ్రి ఇద్దరు ఉండరు. ముత్యాలు నిద్రలేచి బయటికి వచ్చిచూశాడు. “మేడమీద వరండాలో తల్లిబాబును ఎత్తుకొని బిస్కట్లు తినిపిస్తూ బొమ్మలు చూపిస్తూ తిరుగుతుంది. అది చూసిన ముత్యాలు ఆత్రముతో “అమ్మా! అమ్మా!” అని కేక పెట్టాడు. వెంకటి ఇటువైపు చూడనన్న చూడలేదు. బాబు చేతిలో ఉన్న బిస్కట్టుముక్కచూడగానే ముత్యాలుకు తాను తిన్న కారపుమెతుకులు జ్ఞాపకము వచ్చాయి. ఆ పనిహృదయం ఆ వాతావరణాన్ని తట్టుకోలేకపోయింది. జ్వరం వచ్చింది. అయినా తల్లి తనదగ్గర లేదు. బాబుదగ్గరే ఉంది. ఏడ్చినా లాభం లేదు. ఆ చిన్ని హృదయంలో ఎన్నో ప్రశ్నలు అమ్మబాబును ఎత్తుకుంటుంది. తనను నిర్లక్ష్యం చేస్తుంది. అందుకే ఆ ఊరు నచ్చలేదు ముత్యాలుకు. తిరిగి పెద్దమ్మ ఊరుకు వెళ్ళాలని బయలుదేరాడు. జ్వరం తీవ్రంగా ఉండటంవల్ల కండ్లు చీకట్లు కమ్ముతున్నాయి. కాళ్ళు తడబడిపోయాయి. రోడ్డు పక్కన తూములో జారిపడ్డాడు. ఈ కథలో పసిబాలుడి పాత్ర యొక్క కంఠస్వరం పాఠకులను ఆలోచింపజేస్తుంది. ముత్యాలు ఏం తప్పుచేశాడన్న ప్రశ్న ఉదయిస్తుంది. బతకటం అనే ఇరుసు చుట్టు ఉన్న అవసరాలు, కార్యచరణ సంబంధాలను విశ్లేషిస్తూ కరుణరస భరితంగా ఈ కథ సాగుతుంది.

“స్వర్ణకమలాలు” కథలో ఏడుకొండల పాత్ర ధైర్యసాహసాలు ప్రదర్శించింది. మునసబు రంగారావు వినాయకచవితికి తామరపూలు కోసుకురమ్మని ఏడుకొండలుకు చెప్తాడు. ఏడుకొండలు ఏ పనిచెప్పిన పక్కాగా చేత్తడు. అతడికి యుక్తవయసు కావడంతో కండలు తేలి నవయవ్వన కాంతితో శోభిల్లుతుంటాడు. మునసబు గారి పెద్దకూతురు ఐదేండ్ల కొడుకునెత్తుకొని పుట్టింటికి వచ్చింది. మనవడు తాత ఇంట్లో తొలిసారిగా పూజచేస్తున్నాడు. అందుకని మునసబు పత్రి, పూలు తెమ్మని తనకింద పనిచేస్తున్న వారికి చెప్పి పంపాడు. కలువపూలను తెమ్మని ఏడుకొండలుకు చెప్పాడు.

ఏడుకొండలు అర్ధరాత్రి సమయానికే చెఱువుగట్టుకు ప్రయాణమయ్యాడు. వినాయకచవితి కాబట్టి ఊరువాళ్ళందరు పూలకోసం వస్తారని ఆలస్యం కాకుండా ముందుగానే చెరువు గట్టుకు చేరుకున్నాడు. కళ్ళు మూతలు పడుతున్నప్పటికి మధ్యమధ్యలో ఉలికిపాటుతో లేచి చూస్తున్నాడు. వర్షం ప్రారంభమయ్యింది. అయినా ఆ వర్షంలో కూడా తడుస్తూ చెఱువులోని తామర మొగ్గలు ఎప్పుడు విచ్చుకుంటాయోనని ఎదురుచూస్తున్నాడు. పూలను తీసుకెళ్తే అమ్మగారు పెట్టే భోజనం సంగతి గుర్తొచ్చి, మునసబు ఇచ్చిన దావతిని జోలెగా నడుముకు కట్టుకొని చెఱువులోకి దిగాడు. చెఱువులోని జల్లలు కాళ్ళకు పట్టుకున్నాయి. అడుగులో ఉన్ననాచు అడుగు తీసి అడుగు వెయ్యనియ్యటం లేదు. అయినప్పటికి చేతికందిన కలువలను కోసుకొని గట్టుమీద పెడుతున్నాడు. ఎంత కష్టమైనా కలువలను కోస్తుపోతున్నాడు. పదిచొప్పున లెక్కపెడితే వందకలువలయ్యాయి. తెల్లవారింది. సూర్యరశ్మికి విచ్చుకున్న తామరలు బంగారు పువ్వుల్లా కనిపిస్తున్నాయి. ఆ పూలను చూసి పరవశుడై తనెందుకు వినాయకుడి పూజచెయ్యొద్దు అన్న ప్రశ్న ఏడుకొండలు మనసులో ఉదయించింది. మట్టిలో వినాయకుడి బొమ్మను గీశాడు. గీసిన బొమ్మచుట్టు పూలన్నిటిని పేర్చాడు. అయ్యే తనకు మంత్రాలు రావు కదా! మరిఎట్లా, అయినప్పటికి పూజచేయాలనే సంకల్పంతో అక్కడే ఉండిపోయాడు. ఉదయం ఎనిమిదయినా ఏడుకొండలు రాకపోయేసరికి మునసబు వెంకటేశు, మల్లేశులను పంపించి తీసుకురమ్మన్నాడు. ఏడుకొండలు వీళ్ళను చూడగానే నీళ్లలో మునిగి రమ్మని చెప్పి తనలాగా పూజచేయమన్నాడు. వెంకటేషు ఏడుకొండలును అనుసరించాడు. మల్లేషు తిరిగి మునసబు, దగ్గరికి వెళ్లాడు. ఈ కథలో తాత్త్వికకోణం కష్టం ఎవరిది, ఫలితం ఎవరిది అనే ప్రశ్నకు అద్దం పడుతుంది. కథలోని వాతావరణం పండుగ, చెఱువుగట్లు, కలువపూలు పాఠకుడికి గొప్ప అనుభూతిని కలిగిస్తాయి. ఏడుకొండలు పాత్రలో తలెత్తిన స్వతంత్ర్య భావనలు వ్యవస్థ చైతన్యానికి ఉదాహరణలుగా నిలిచాయి. అట్లాగే మల్లేషులోని భయం వెనకడుగు వేసే తత్త్వాన్ని తెలియజేస్తుంది. కథ మొత్తానికి ఆలోచింపజేస్తుంది.

వివాహ వ్యవస్థలో వరకట్న సమస్య ఆనాడు, ఈనాడు ఆడపిల్లల తల్లిదండ్రులకు మోయలేని భారంగానే ఉంది. ‘ఆదర్శాలు- అనుభవాలు’ కథలో కథానాయకుడు కట్నానికి వ్యతిరేకి. తన అభిప్రాయాన్ని ఆడపిల్లల తల్లిదండ్రులకు చెప్తే వారు మెచ్చుకోకపోగా వరుడికి ఏదైనా లోపం ఉందని అనుమానిస్తారు. కథలో పుంజరి పాత్రను అతడి ఆదర్శాన్ని అర్థంచేసుకోవడానికి కొంతసమయం పడుతుంది. అట్లాగే కులాంతర వివాహం చేసుకున్న ఆడపిల్ల మాణిక్యమ్మ చేదు అనుభవాన్ని చెప్పిన కథ “కథ వెనుక దాగిన నిజం”. పెళ్ళైన మరుసటి రోజే భర్త నిజస్వరూపం తెలుసుకున్న మాణిక్యమ్మ తప్పనిసరి పరిస్థితుల్లో కాపురం చేస్తుంది. ఇద్దరు పిల్లలకు తల్లి అయింది. ఆమెకు ఇష్టంలేని పనులన్నీ చేయించి, పైశాచికానందం పొందేవాడు ఆమెభర్త. అయినప్పటికి మాణిక్యమ్మ ఆమె తల్లిదండ్రుల దగ్గర చులకన కావద్దని అహర్నిశలు కష్టపడింది. ఆమె శాఖాహారి అయినా భర్తకు మాత్రం మాంసాహారం వండిపెట్టేది. అతడు పెట్టే చిత్రహింసలను భరించేది. ఆ మనోవ్యధలన్నిటిని తట్టుకోలేక అనారోగ్యం పాలవుతుంది. ఆమె చనిపోతే పిల్లలను ఎవరు చూస్తారనే బెంగతో ఆమెచివరి క్షణాలు యుగాల్లాగా గడుస్తాయి. వైద్యంచేసే డాక్టరు పిల్లలను సురక్షితమైన చోటికి చేర్చడం ద్వారా కథ ముగుస్తుంది.

మధ్యతరగతి కుటుంబాల్లో వివాహం ఒక జటిలసమస్య. ఉత్తముడైన వరుడు దొరకాలంటే ముందునుండే తల్లిదండ్రులు వరుడికోసం ఒక కంట కనిపెడుతూనే ఉంటారు. ‘శలభాలు’ కథలో ఆడపిల్లల తల్లి మీనాక్షమ్మ రామశర్మ అనే యువకుడికోసం వల విసురుతుంది. తన కూతురు అందానికి అతను మైమరిచి కట్నం లేకుండా వాళ్ళలో ఒకరిని పెళ్ళిచేసుకుంటాడని ఆశపడుతుంది. రెండు కుటుంబాలు ఒక ఉద్యోగస్తుడికి వల విసిరి భంగపాటుపడటం కథా ఇతివృత్తంగా సాగింది. ముగింపులో ఈ రెండు కుటుంబాలు ఆ యువకుడికి వివాహం అయ్యిందన్న విషయం తెలుసుకొని నోరువెల్లబెడతారు. ఇల్లిందల సరస్వతిదేవిగారు చాలా కథల్లో వివాహబంధంకు సంబంధించిన అనేకకోణాలను ఆవిష్కరించారు.

వృత్తిపరమైన చిత్రణ:

సమాజం అంటేనే విస్తృతమైన కాన్వాసు. అందులో వృత్తి, ఉద్యోగం, వ్యాపారం మొదలైన జీవనసంబంధ వ్యాపకాలు అనేకం ఉంటాయి. ఇల్లిందల సరస్వతిదేవిగారి చాలా కథల్లో వైద్యవృత్తిని తెలియజేసే ఇతివృత్తాలు స్వీకరించారు. తర్వాత లాయరు వృత్తిని కథానేపథ్యంగా, పాత్రలుగా స్వీకరించారు. గ్రామాల్లో ఉండే బెస్తవారు, బెల్లంకట్టువారు, మేథరివాళ్ళు, మెహర్తానీవారు ఇట్లా వారి వృత్తుల్లో ఉండే సాధకబాధకాలను విశ్లేషించారు. అట్లాగే చదువుకొని సమాజంలోని సేవలు అందించే అధ్యాపకవృత్తి, దేశానికి సేవచేసే సైనికులు, రచయితగా పేరు ప్రఖ్యాతలు సంపాదించే రచనా వృత్తి ఇట్లా రచయిత్రి దృష్టికి వచ్చిన ప్రతి అంశం కథగా రూపుదిద్దుకొని శిల్పనైపుణ్యంతో చదివించే గుణాన్ని కలిగివుందని చెప్పవచ్చు.

“చేపకన్ను మిలమిలా – బాలయ్యకన్ను తెలతెల” కథ ప్రాణాలకు తెగించి బెస్తవారు ఏటికి ఎదురెల్లి చేపలు పట్టడం, అయినా వారి జీవితాల్లో తొంగిచూసే పేదరికం, భార్యభర్తల అనురాగం, మనస్పర్థలు, సర్దుబాటు అన్నిటిని కలిపిన కథాకథనంతో ఆసక్తికరంగా, మలుపులు తిరుగుతూ రసాస్వాదనను కలిగిస్తుంది. “బల్లకట్టు భద్రయ్య” కథ నదీతీరప్రాంతాల్లో ఏరుదాటడానికి బల్లకట్టునడిపే భద్రయ్య జీవితాన్ని చిత్రించింది. రోజంతా ప్రయాణికులతో గడిపే భద్రయ్యకు వారి జీవితాల్లోని సంఘర్షణలను అర్థంచేసుకునే అనుభవం ఏర్పడుతుంది. తన వృత్తిద్వారా ఆర్థిక ఆధారంతోపాటు లోకానిన చదువుతాడు. తద్వారా తన జీవితంలో ఆనందాన్ని వెతుక్కుంటాడు. “మెహరానికథలో శాంతి అందం, విద్యానాగరికత కలిగిన అమ్మాయి. అమె కులం తెలియకముందు శాంతిని మెచ్చుకున్న వాళ్ళే, మెహర కులం అని తెలువగానే వారి ముఖాల్లో రంగులు మారాయి. ఏదో వికారం వారి మనసుల్లో బయలుదేరి ముఖాల్లోకి చొచ్చుకువచ్చింది. మురళీకృష్ణ ఆమెను ప్రేమించినా పెళ్ళిచేసుకోవడానికి సాహసించలేడు. కారణం రోతపుట్టించే ఆమెవృత్తి. కాని శాంతిలోని ఏకాగ్రత, సంస్కారం గమనించిన తెలుగు లెచ్చరర్ ముకుందం ఆమెను పెండ్లి చేసుకుంటాడు. ఒకరు వృత్తికి, మరొకరు ప్రవృత్తికి ప్రాధాన్యతనిచ్చే వైరుధ్యంతో కథసాగడం పాఠకులకు ఆసక్తిని కలిగిస్తుంది. “బలీయసీ కేవలమీశ్వరాజ్ఞా” కథలో మేథర్ల వృత్తి ప్రస్తావన ఉంది.

“ఊహకందని నిజాలు”, “నాగరికము”, “చీకటిలో చెదరనిమనిషి”, “బంధవిముక్తి”, “అడ్డుతెరలు”, “బతికిచచ్చినవాళ్లు”, “ఈ చీకటి వీడదేమి”, “అక్కరకు వచ్చిన చుట్టము”, “దగాపడ్డ డాక్టరమ్మా”, “ప్రియాగమనం”, “ట్రూత్ సీరం చెప్పినకథ’, ‘పరిగెత్తే బొమ్మ”, “తీపిలో చేదు”, “పునర్లబ్దము” కథల్లో వైద్యవృత్తి సంబంధ వాతావరణం ఉంది. పాత్రగానో, నేపథ్యంగానో సంఘటనగాని, వ్యాధి సోకినపుడో ఇలా ఏదోఒక సందర్భంలో వైద్యవృత్తి ప్రస్తావించబడింది.

“బతికిచచ్చినవాళ్ళు” కథలో సిరి, గంగ బాల్యంలో స్నేహితురాళ్ళు. చాలా రోజుల తర్వాత హాస్పిటల్ ప్రాంగణంలో కలుసుకుంటారు. రంగ డాక్టరు కాబట్టి కష్టాల్లో ఉన్న సిరికి ఆశ్రయమిచ్చి ఆదుకుంటుంది. స్నేహితురాలి పిల్లలను పెంచి పెద్దచేసి సహృదయతను చాటుకుంటుంది.

ఊహకందని నిజాలుకథ తల్లికొడుకుల సంభాషణతో మొదలౌతుంది. శివకామమ్మ కోడలు బిడ్డను ప్రసవించిన కారణంగా ఆసుపత్రిలో ఉంటుంది. రెండవసారి కూడా అమ్మాయే కావడంతో రంగారావు మరొక ఛాన్సు ఇచ్చి చూద్దామా అనే సందిగ్ధంలో ఉంటాడు. ఈ లోపల రంగారావు తల్లి శివాకామమ్మ నెలతప్పిన విషయం తెలసుకుంటాడు. రంగారావు సోదరసోదరీమణుల సంఖ్య పెరుగుతుండటంతో తనకు ఇద్దరు పిల్లలు చాలు అనే నిర్ణయానికి వస్తాడు. ఒకప్పుడు ఫ్యామిలి ప్లానింగ్ ఆపరేషన్లు ఉండేవికావు. ఈ అనుకోని సంఘటనకు కథాంతంలో తండ్రి కొడుకు మొఖాన్ని తల ఎత్తి చూడలేకపోతాడు. “అక్కరకు వచ్చిన చుట్టము” లో భర్త క్షయబారిన పడితే భార్య తనసొమ్ములను అమ్మి వ్యాధి నయం చేపించాలని పడరానిపాట్లు పడుతుంది. చివరికి భర్తను కోల్పోతుంది. “దగాపడ్డ డాక్టరమ్మ” కథలో వైద్యవృత్తికి పూర్తిగా అంకితమవ్వాలనే ఉద్దేశ్యంతో డాక్టర్ రాజేశ్వరి పెళ్ళికూడా చేసుకోలేదు. కాని అనుకోకుండా రామమోహనరావు పెళ్ళిచేసుకొమ్మని ప్రేమవల విసరగా కరిగిపోతుంది. చివరకు అతడు నేరస్థుడన్న విషయం తెలుసుకొని బాధపడుతుంది. “తీపిలో చేదు”, “పరిగెత్తే బొమ్మ” ఈ రెండు కథలో హాస్పిటల్ నేపథ్య వాతావరణంగా చిన్నపిల్లల మనస్తత్వాన్ని చిత్రించారు రచయిత్రి.

“మహోన్నతుడు”, ‘సప్తమభావము” కథల్లో జ్యోతిష్యవృత్తి ప్రస్తావన చిత్రించబడింది. సప్తభావములో వాసుదేవరావుగారి కుమారుడు వివేకానందుడికి వివాహము చేస్తే కాపురానికి రాకపూర్వమే ఒకరు, రెండు నెలలు కాపురంచేసి ఒకరు ఇద్దరు కోడళ్లు పోయినారు. మూడో పెండ్లి చేయడం అవసరమా! జాతకంలో సప్తమభావం చెడిందని తెలుసుకున్నాక వివాహ ప్రయత్నాన్ని విరమించుకుంటారు. కొడుకు ఉద్యోగరిత్యా తల్లిదండ్రులకు దూరంగా ఉండి, వారికి తెలియకుండా పెండ్లి చేసుకుని పిల్లలు పుట్టాక కన్నవారికి పరిచయం చేస్తాడు.

మహోన్నతుడుకథలో ధనవంతులు, రాజకీయ నాయకులు జ్యోతిష్యుడికి ఎంతవిలువనిస్తారో, అట్లాగే జడ్జిగా వృత్తిని కొనసాగిస్తూ సామాజిక హోదాలో గడిపే బ్రహ్మానందం తన కాలనీలో ఒక జ్యోతిష్యుడు ఉన్నసంగతిని తెలుసుకోలేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

శిల్ప సౌందర్యం:

కథ ఉత్తమమైన శిల్పంతో సజీవంగా రూపుదిద్దుకున్నప్పుడు పాఠకుని మనసులో కలకాలం నిలిచి ఉంటుంది. రచయితను బట్టి శిల్పం ప్రత్యేకతను సంతరించుకుంటుంది. వస్తువు, సంఘటన, సన్నివేశం, వర్ణన పాతచిత్రణ, సంఘర్షణ, కథనం, శీర్షిక, భాషాశైలి ప్రధానమైన కథానిక లక్షణాలుగా గుర్తించవచ్చు. వస్తువు ఏదైనా కథానిర్మాణంలో ఇల్లిందల సరస్వతీదేవిగారి కలం అందెవేసిన చెయ్యి. స్వర్ణకమలాలు కథాసంపుటిలో శిల్పవిన్యాసాన్ని ప్రదర్శించిన కథలు అనేకం ఉన్నాయి. అవన్నీ కూడా పాఠకుడి హృదయంపై చెఱగని ముద్రను వేసి అనుభూతిని కలిగిస్తాయి.

కొండమల్లెలు”, “పై మనిషి”, “ప్రణయలేఖలు”, “విచ్చినమబ్బులు”, “చిరునవ్వువెల ఎంత?” కథల్లోని వస్తువులు సమాజంలో మనకు తారసపడేవే. రచయిత్రి ప్రయోగించిన వస్తువిన్యాసనేర్పువల్ల కథలు గాఢానుభూతిని కలిగిస్తాయి. ‘పైమనిషికథలో భార్య ఉత్తరాలద్వారా విదేశాల్లో ఉన్న భర్తకు సమాచారాన్ని అందిస్తుంది. కథమొదటి నుండి చివరివరకు సస్సెతోను, అనుమానంతోను కొనసాగుతుంది. భార్యభర్తకు పంపే ఉత్తరాల సారాంశంలో అతిథి అంటే బంధువుగా అర్థం చేసుకుంటాడు భర్త. ఇంటికి వచ్చి చూస్తే గాని తన వంశాంకురం పుట్టాడన్న విషయాన్ని తెలుసుకోలేకపోతాడు. “విచ్చినమబ్బులుకథలో ఎత్తుగడతోనే ఇల్లు తగలబడిపోతుంటే శాంత ప్రాణాలకు తెగించి, మండుతున్న ఇంట్లోకి వెళ్ళి ఉత్తరాల పెట్టెను తెచ్చుకోవటం ద్వారా అనారోగ్యాన్ని తెచ్చుకుంటుంది. ఇట్లా కథను ప్రారంభించడం ద్వారా కథానికకు బలం చేకూరింది. పైగా రచయిత్రి తరువాతి కథను నడిపించడం సులవైంది. సంఘటనతో భర్తకు భార్యపై అనుమానం కలుగుతుంది. పెట్టెలోని ఉత్తరాల్లో ఏముందో తెలుసుకోవాలనే కుతూహలం అటు భర్తకు, ఇటుపాఠకులకు కలుగుతుంది. తర్వాత భర్త భార్య ఉత్తరాల్లో గమనించినప్రభూఅనే సంబోధన మరింత అనుమానానికి హేతువు అవుతుంది. వాస్తవంగాప్రభుశాంత స్నేహితురాలు. కథాముగింపులో స్నేహితుడి పాత్రను ప్రవేశపెట్టి శాంతభర్త అపోహను తొలగించింది రచయిత్రి.

“చిరునవ్వు వెల ఎంత” కథలో అలివేలు భర్త శంకరం ఆత్మహత్య ప్రయత్నంతో కథ ప్రారంభమౌతుంది. సగటు మధ్యతరగతి వాతావరణంలో నడిచిన కథలో భార్య అలివేలు ఆశావాది. ఆ రోజుల్లో సంతానం అంటే నలుగురైదురికి తక్కువుండే వారు కాదు. ఒక రాత్రివేళ ఇంటికి వచ్చిన భర్త శంకరానికి వడ్డిస్తూ “ఈ నలుగురు పిల్లలు రేపు పుట్టబోయే బిడ్డతో ఐదుమంది వీళ్లంతా ఏం చదువుతారు? ఏం తింటారు” అని విచారిస్తుంది. అయినా మొండిధైర్యంతో ముఖంమీద చిరునవ్వును చిందిస్తూనే కష్టాల్లో సైతం ఆనందాన్ని వెతుక్కుంటుంది.

ప్రైవేటు స్కూల్ లో టీచర్ గా పనిచేస్తుంటుంది. కథలో ముందటిరోజు రాత్రి భర్త, నిద్రమాత్రలు మింగి చనిపోదామనుకున్నాడు. కారణం సంసార బరువు మోయలేకకాదు. శంకరం ప్యాకాట ఆడటం ద్వారా అప్పులపాలయ్యాడు. ఆ విషయం తెలుసుకున్న అలివేలు బ్యాంకులో లో ద్వారా డబ్బులు తెచ్చి తను ఉద్యోగానికి వెళ్తు భర్తకు డబ్బులిచ్చి వెళ్తామని అతడి ఆఫీసుకు వెళ్తుంది. శంకరం రాలేదని చెప్పడంతో తిరుగు ప్రయాణంలో హుస్సేన్‌సాగర్ వద్ద ఒక యువకుడు. నీళ్ళలో పడి ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్తను వినగానే మనసులో నిండుకున్న సంఘర్షణతో తన భర్తనే అనుకొని అలివేలు కూడా నీళ్ళలో పడిపోతుంది. ఎత్తుగడలో భర్త ఆత్మహత్యాయత్నం. ముగింపులో నిజంగానే భార్య ఆత్మహత్య చేసుకుంటుంది. హుస్సేన్‌సాగర్ దగ్గర పచార్లు చేస్తున్న శంకరం చనిపోయిన ఆడమనిషి ఎవరని వెళ్ళి చూసేసరికి తన భార్య అన్నసంగతి తెలుసుకొని నోరెవెల్లబెడతాడు. కథలో చివరసంఘటన అనుకోని మలుపుగా పాఠకులకు వేదనను మిగులుస్తుంది.

ప్రియాగమనం“, “పరుగెత్తే బొమ్మకథలు కథనం ద్వారా నడిపించబడ్డాయి. కథలు అల్లడంలో, పాత్రలు ప్రవేశపెట్టడంలో రచయిత్రి నేర్పు కనబడుతుంది. ప్రియాగమనం కథలో మంగళకు జబ్బుచేసి ఆసుపత్రికి వెళ్తుంది. డాక్టరు, మంగళ పాత్రల సంభాషణల్లో ఆమె భర్త పేరు, చేస్తున్న వృత్తి వివరాలు తెలుస్తాయి. పదిరోజుల తర్వాత మిలిటరీలోనుండి చంద్రకాంత్ నేరుగా వైద్యం చేయించుకోవాలని ఆసుపత్రికి వస్తాడు. సమయంలో

భార్యభర్తలిద్దరు ఒకే ఆసుపత్రిలో ఉంటారుకాని ఒకరువచ్చిన సంగతి ఇంకొకరికి తెలియదు. డాక్టరు తెలుసుకుని వారికి చెప్పడు. కథలో డాక్టరు నిర్వహించిన పాత్ర ఎంతో కీలకమైనదిగా, మానవత్వ పరిమళాలను వెదజల్లేదిగా ఉంటుంది. చివరికి చంద్రకాంత్ ప్రాణాలను కోల్పోతాడు. తను తెచ్చిన డబ్బు, నగలు భార్యకు అందజేయమని ముందే చెప్తాడు? రచయిత్రి కథలో కనీసం ముగింపులోనైనా భార్యభర్తలను కలిపితే బాగుండేది అనిపిస్తుంది. ముగింపు వేదనను కలిగిస్తుంది.

పరిగెత్తే బొమ్మకథలో ఎత్తుగడ సౌజన్య ఇంట్లో అడుగుపెడుతూనే టైనీఏడీ అంటూ హాల్లో ఇటు అటుచూసింది అంటు మొదలౌతుంది. సౌజన్యకు టైనీ తమ్ముడి కొడుకు, కొంతకాలంగా జ్వరంతో బాధపడుతున్నాడు. అందుకని స్కూలుకు కూడా వెళ్ళటం లేదు. సౌజన్య పిల్లల మనస్తత్వాన్ని బాగా అధ్యయనం చేసింది. లండన్వెళ్ళి డిప్లమా తెచ్చుకుంది. బొంబాయిలో టీచర్ గా పనిచేస్తుంది. కాబట్టి టైనీ జ్వరం ఎలా తగ్గించాలనే ఆలోచనలో పడింది సౌజన్య. తర్వాత కథంతా సౌజన్య టైనీ సంభాషణల్లో ముందుకు సాగుతుంది. కథలో సౌజన్య టైనీ మానసిక స్థితిని అర్థంచేసుకుంటుంది. ఎక్కడ పసిబాలుడి మనసు గాయపడ్డదో టైనీ మాటల ద్వారానే తెలుసుకుంటుంది. టైనీ పిల్లవాడు కాబట్టి ఒకచోట కూర్చోవటం నచ్చడం లేదు. నీరసంగా ఉన్నాడు కాబట్టి లేచి ఆడుకోలేడు. సౌజన్య పరిగెత్తే బొమ్మనుకొని తెచ్చింది. రెండు రోజులు ఆడి పక్కనపడేశాడు. ఆ తర్వాత పరిగెత్తే బొమ్మలను బోర్డుపైన గీసి చూపించసాగింది. ఆ తర్వాత పరిగెత్తే టైనీ బొమ్మ వేసింది. వెనుక మరొకబొమ్మ దించింది. అప్పుడు టైనీ “అవునత్తా నేనే, ఆ రమేష్ గాడు వెనుకబడ్డాడు వాడికంతే కావాలి. కిందపడ్డాడు కదూ” అంటూ చప్పట్లు కొడుతూ నవ్వటం మొదలు పెట్టాడు. ట్రైనీలో శారీరక బలహీనత కాళ్ళు చచ్చుబడిపోవటం అయితే సౌజన్య అతడిలోని తీరనికోరికను బొమ్మలువేయటం ద్వారా పరిగెత్తించింది. క్లిష్టమైన వస్తువును సంభాషణల ద్వారా సునాయాసంగా నడిపించగలిగింది రచయిత్రి.

ఇల్లిందల సరస్వతీదేవి గారు కథనశిల్పంలో ఉన్న పద్ధతలన్నిటిని ఉపయోగించలేదు. ఎక్కువగా ప్రథమపురుష కథనాన్ని వాడారు. కొన్ని సందర్భాలలో మధ్యమ పురుషతో కథలను ప్రారంభించారు. కొన్ని కథలు వర్తమానంలో ప్రారంభమై భూతకాలంలోనే నడిచి మళ్ళీ వర్తమానానికి వస్తుంటాయి. ‘డైరీకథలో మిలిటరీ డ్రలో ఉన్న దుర్గాప్రసాద్ తన కథను శాస్త్రిగారికి ఫ్లాష్ బ్యాక్ పద్ధతిలో చెబుతాడు. పాపడైరీలో వ్యక్తపరిచిన భావాలు తలుచుకొని కన్నీళ్ళు పెట్టుకుంటాడు. ‘కాగితంపూలు‘, ‘అసమర్థుడు‘, ‘అక్కరకు వచ్చిన చుట్టము‘, ‘రక్తపు చుక్కకు నీటిచుక్క‘, ‘మనసులోని ఇజం‘, ‘పాంథుడు‘, ‘గళ్ళలుంగీకథలు ఫ్లాష్ బ్యాక్ పద్ధతిలో నడిచాయి.

రచయిత్రి రాసిన కథల్లో ప్రణయలేఖలు, ‘పై మనిషి‘, ‘అసమర్థుడు‘, ‘అనాశ్వాసిత‘, ‘ చీకటి వీడదేమిమొదలైన ఉత్తరాల ప్రాధాన్యత కథనంతో నడిచాయి.

కథలో పాత్రచిత్రణ అనేది ప్రధానమైనది. కథానిక నిడివిలో తక్కువగా ఉండటంవల్ల తక్కువ పాత్రలతో కొద్ది సమయంలో పాఠకుడిపై ముద్రవేయాలంటే రచయితకు నేర్పుకావాలి. కథలో పాత్రచిత్రణలో జీవితకాలాన్నంత ప్రదర్శించడం సాధ్యం కాదు. ఆ పాత్ర ప్రవృత్తిని కొన్ని వర్ణనల ద్వార సూచించి, సన్నివేశాల ద్వారా విశ్లేషించడం సులభమౌతుంది. ఇల్లిందల సరస్వతీదేవిగారు చిత్రించిన కొన్ని పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు.

కొండమల్లెలుకథలో శివనాథం పాత్ర, ‘స్వర్ణకమలాలుకతలో ఏడుకొండలు, ‘పరుగెత్తే బొమ్మలో సౌజన్య, ‘కథ వెనుక దాగిన నిజంలో శారద, ‘శాంతించిన సముద్రంలో సావిత్రి, ‘అడ్డుతెరలుకథలో కాత్యాయిని, ‘పండుచీరలో రాజ్యలక్ష్మి పాత్రలు పాఠకుల మనసుపై చెఱగని ముద్రనువేస్తాయి.

ఎదిగిన కొడుకుకథలో రమణపాత్ర ఆదర్శవంతమైనది. అతడు దూరప్రాంతంలో చదువుకోవటంవల్ల మూడుసంవత్సరాలు ఇంటికి వెళ్ళటం కుదురలేదు. అవసరం ఉన్నప్పుడల్లా తండ్రి డబ్బు పంపిస్తుంటాడు. కాని చూడటానికి రాడు. కథలోని ఇతివృత్తం లోకంలో తారపడే అంశమే అయినప్పటికీ రమణ పాత్ర చిత్రణకు సమయస్ఫూర్తి, ధైర్యం, ఆలోచనా విధానం మేళవించిన పాత్రగా తీర్చిదిద్దటం రచయిత్రి గొప్పదనంగా చెప్పవచ్చు. రమణ తండ్రి ప్రభుత్వ ఉద్యోగస్తుడు. బదిలీల మూలంగా కుటుంబానికి దూరంగా ఉంటాడు. భార్యకు, పిల్లల చదువులకు కావలసిన డబ్బును పంపిస్తుంటాడు. ఒకసారి రమణకు తెలిసిన వ్యక్తి ద్వారా తన తండ్రి గురించి వింటాడు. “నీకు తెలిసిందా రమణా మీ నాన్న మీ అమ్మను పల్లెటూళ్ళో ఉంచి భరణం పంపిస్తున్నాడు. చదువు చదువు అంటూ నిన్ను ఇక్కడికి రానివ్వటం లేదు. కూతుర్లకు సంబంధాలు చూసి పెళ్ళి చేయాల్సిన వయసులోతానొక పాతికేళ్ళ పడుచును పెండ్లి చేసుకున్నాడుఅని చెప్పగానే రమణ తల్లి దగ్గరికి వెళ్ళి అసలు విషయం తెలుసుకుంటాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి అతడిని నిలదీస్తాడు. “నా తల్లికి పిచ్చిదన్న పేరు పడేస్తే గాని మీకు ముందడుగు పడలేదు కదూ? పల్లెటూర్లో మీరిచ్చే భరణం తింటూ నా తల్లి ఒంటరిగా నానా తంటాలు పడుతుంది. ఇవాల్టి నుంచీ నాకు తల్లి ఒక్కతే ఉందనుకుంటానుఅని తండ్రితో తెగదెంపులు చేసుకొని రమణ కుటుంబ బాధ్యతను మోయడానికి సిద్ధపడతాడు.

బతికి చచ్చినవాళ్ళుకథలో రంగపాత్ర గొప్ప మనసున్న మహిళ. ఫ్యామిలి ప్లానింగ్ యూనిట్లో పనిచేస్తున్న డాక్టర్, ఒక రోజు అనుకోకుండా తన బాల్యస్నేహితురాలు సిరి కనిపిస్తుంది. ఆమె కష్టాల్లో ఉందని తెలుసుకొని ఆశ్రయం ఇస్తుంది. సిరి పిల్లలకు చదువు చెప్పిస్తుంది. స్నేహితురాలి పూర్తి బాధ్యతను తను స్వీకరించి వారికి అండగా నిలబడుతుంది. ‘ప్రార్థించే పెదవులకన్నా సహాయంచేసే చేతులు మిన్నసామెతకు రంగపాత్ర ఉదాహరణగా నిలుస్తుంది. ‘మనసులోని ఇజంకథలో మహేంద్రపాత్ర విచిత్రమైన మనస్తత్వానికి చెందినదిగా ఉంటుంది. కథలో పాత్ర ప్రవర్తించిన తీరును చూసినపుడు మనిషి చెప్పేదొకటి, చేసేదొకటిగా ఉండకూడదన్న విషయం అవగతమౌతుంది. ఎదిగిన తరువాత గతాన్ని మరిచి ప్రవర్తించకూడదన్న మానవ విలువలను తెలియజేస్తుంది.

ఈ విధంగా ఇల్లిందల సరస్వతిదేవి కథలు వస్తుపరంగా విస్తృతిని, వైవిధ్యాన్ని కలిగివున్నాయి. శిల్పపరంగా చదివించే గుణాన్ని కలిగివున్నాయి. స్వర్ణకమలాలు కథా సంపుటిలో ఉన్న వందకథలు వస్తురూప శిల్పాన్ని ప్రదర్శించాయని చెప్పవచ్చు.

You may also like

Leave a Comment