‘ఉదయనగరమందు ఉన్నట్టి నా మీద
అంతులేని ప్రేమ ఆవహింప
ప్రక్కనుండి లేవ బ్రాహ్మీముహూర్తాన
పాటపాడు పికమ వందనమ్ము’- 1
బ్రాహ్మీముహూర్తపు అవసరం ఎవరికి ఉంటుంది? నిత్య కర్మానుష్ఠాన నియతి గలిగినవారికే. చెన్నప్పగారు ఆ వేళకు తనను లేపడానికి పాటపాడే పక్షికి వందనం చెబుతున్నారు. ఉండేది ఉదయనగరం. ఉషఃకాలమే లేచే ఆధునిక ఋషిసత్తముడైన ఆచార్య మసన చెన్నప్పగారిని మేల్కొల్పడానికో లేక తనను బోలిన వారితో ముచ్చట్లు పెట్టాలనిపించో కోకిల రూపంలో ఆదికవి అవతరించాడనిపిస్తుంది. పద్యప్రవాహంలో మునకలేస్తుంటే.
ఎక్కడా ధార ఆగని పద్యపరంపర.
‘జీవితమును తెలిసి కన్నంత విన్నంత తెలియవచ్చినంత’ అన్నట్లు కోకిలతో ముచ్చట్లు బహురమ్యం. తనను మురిపించడానికి, వెతలు మరిపించడానికి, దారిచూపించడానికి వచ్చిన కోకిలతో ఆత్మానాత్మ విచికిత్స అద్భుతమైన సరళ సుందరమైన ఆటవెలదుల రూపంలో సాక్షాత్కరిస్తుంది.
ఎంతో సహృదయులైన వారే ఎదుటివారి లోపాలను కాకుండా వారి ప్రతిభాపాటవాలను ప్రస్తుతిస్తారు.
కోకిలమ్మ తాను నల్లనిదనే న్యూనతాభావం కలిగి ఉందేమోనని,
“నల్లనైన రూపు నాకిచ్చెనని నీవు
బాధపడకు తల్లి భావమందు
దేవుడిచ్చె నీకు దివ్యమౌ గానమ్ము- అంటారు చెన్నప్పగారు.
అంతేగాక ఏకంగా ఆ నల్లనయ్యనే తెచ్చి ఇలా ఓదారుస్తారు.
“నల్లనయ్యననుచు నంద కిశోరుడు
బాధపడగలేదు భావమందు
గానవిద్యలోన గంధర్వుడాతడు”- అని.
అంతేనా, కోకిల గొప్పతనాన్ని చాటి చెప్పే అనేక సాహిత్య విషయాలను వివరిస్తారు. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ‘కోకిలమ్మ పెళ్లి’ని ప్రస్తావిస్తారు. జాషువా వంటి కవి కోకిలలను స్మరిస్తారు.
బాల రసాలకిసలయాలు మెసవుతూ కంటికి కనిపించకుండానే కమనీయగాన సుధారసాన్ని ఆస్వాదింపజేసే నల్లపిట్టను మనసారా ఆహ్వానిస్తూ కమ్మని కబురుల విందులు చేస్తారు కవి. ఆటవెలదులతో ఆటలాడుకున్నట్టుగా ఒక్కో పద్యం హృద్యం, అనవద్యం.
పురుడు పోసుకున్నదాదిగా పురుషోత్తమ స్థాయిదాకా తన దైనందిన జీవన విశిష్ట చర్యల విశేషాలను ఆది కవి రూపంలో అరుదెంచిన అతిథి కోయిలకు వినమ్రంగా విన్నవించుకుంటారు. ఆశ్రమ ధర్మాలలోని బ్రహ్మచర్య, గార్హహత్య సాఫల్యాలను వివరిస్తూ వానప్రస్థాశ్రమానురక్తిని చెప్పడంతో కోకిల కావ్యం సుసంపన్నమయింది. చెప్పేవన్నీ లౌకికమైన విషయాలే అయినా అలౌకికానందంవైపు దృష్టిని సారింపజేయడం ఈయన కవితా మర్మం. నేలవిడచిన సాము ఉండదు ఎక్కడా. తన బ్రహ్మచర్యాశ్రమం విశిష్టమైంది. గార్హపత్యం విలక్షణమైంది. కర్కశ హృదయుడైన నిషాదుడికి కర్మఫలవిశేషం వల్ల సప్తర్షులు ఎదురై జీవిత గమనాన్నే మార్చివేసినట్టుగా, మామూలు మగ్గం నేసే కుటుంబంలో జన్మంచిన మసన చెన్నప్పగారి పూర్వజన్మ పుణ్యవిశేషం చేత గురువులే శిష్యుణ్ణి వెదికి పట్టుకుని ఒకరు సంస్కృతం నేర్పిస్తే, మరొకరు షడ్దర్షనాలను బోధించారు. పలువురు గురువుల నుండి పలు విషయాలను గ్రహించి తనను తాను దిద్ది తీర్చుకున్న అధునాతన ఋషి చెన్నప్ప. అందుకే వాల్మీకి కోకిల రూపంలో ఆయన గుమ్మం ముందు గుబుర్లలో దాగి కబుర్లకై చేరాడు.
ఇందులోని ప్రతిపద్యమూ సరళమైన భాషలో సహజసుందరంగా ఉండి ఆ పాత మధురానుభూతినందిస్తుంది. పుస్తకమంతా చదివిన తరువాత ఆలోచనామృతం ప్రసాదిస్తుంది. ఇది కావ్య విశేషం. ఈ కోకిల కావ్యం మసన చెన్నప్పగారి సకలోహసనాథమని కూడా అనవచ్చు. పద్యం అత్యంతాధునిక శైలిలో ఉండి చదువరులకు ఆనందానుభూతుల్ని కలుగజేస్తుంది.
స్ఠాలీపులాక న్యాయంగా కొన్ని పద్యాలను ఉట్టంకించడం ధర్మం. అలాగని ఆ పద్యాలు మాత్రమే విశిష్టమని చెప్ప వీలు లేదు. మూడు వందల పద్యాలూ ముచ్చటైన రత్న సమాలు.
“రామకథను రాసి రంజిల్ల జేసిన
ఆదికవిని గూర్చి అవనిలోన
పోల్చుచుందురమ్మ పొందుగ నీ తోడ
పణ్య మేమి చేసి పుట్టినావొ” – 25
“నీవు శాస్త్ర విద్య నేర్చిన యట్టుల
కానబడదు బ్రహ్మ కరుణదప్ప” – 32
“కెంపుగంటి నిన్ను గెలువంగలేవమ్మ
పక్షులేవి ఈ ప్రపంచమందు” – 73
“కంటి రెప్పలందు కన్నీరు దాగుండు
తరణి మబ్బులందు దాగుకొనును
చెలమ ఇసుకలందు తలదాచుకొని యుండు
నీవు కొమ్మలందు నిలుతువమ్మ” – 79
అంటూ కోకిలను ప్రస్తుతిస్తూనే,
“నీకు తెలియదేమో నేనార్షకవినమ్మ
ఉపనిషత్తులన్న ఉత్సహింతు” – 132
“అమ్మ నీదు రాక ఔచితీవంతము
కూజితమ్ము వట్టి కూతగాదు
ఆశ్రమమ్ము జేరి ఆత్మలో పరమాత్మ
బడయుమనెడి ‘దివ్యవాణి’ తల్లి!” – 158
అనటం భగవంతుని సందేశాలను అందుకునే నేర్పును సూచిస్తుంది.
“నీదు కూజితమ్ము నిజముగా నాకింత
సుఖము గూర్చునంచు చూడలేదు
ఏది యెపుడు సంభవించిన నయ్యది
అచ్యుతుని అనుగ్రహంబె తల్లి! – 177
అన్న పద్యంపై దానికి పూరకం.
“గుండెరావు నాకు గురువయ్యె తొలినాళ్ల
గోపదేవుడయ్యె గురువు పిదప” -62
అని సప్తర్షులు, సనకసనందనాదులవలె హర్కారే గోపదేవాదులను స్మరిస్తారు. గురువుల కృపవల్ల బ్రహ్మచర్యం సంపన్నమైతే మనసెరిగిన సతి ప్రమీల తన జీవిత భాగస్వామిగా గార్హపత్య జీవితాన్ని పుత్రపౌత్రాభివృద్ధి గావించి పునిస్త్రీగా వెళ్ళిపోయారు. వారికి స్మృతి చిహ్నంగా కృతి నొసంగి ధన్యులైనారు. ఈ విషయాలన్నిటినీ ఆత్మాశ్రయరీతిలో కోకిలకు చెప్పుకుంటారు కవి.
వ్యాసవిస్తర భీతివల్ల ఉదాహరించలేకపోయినా చదువరులు ఆ చవులన్నీ గ్రోలవచ్చు. దాదాపు రెండు వందల పద్యాల దాకా తమ జీవితంలో తారసపడ్డవారిని, గానకళా శ్రేష్ఠులను సాహితీ స్రష్టలను, కారుణ్యమూర్తులను తలచుకొంటూ నిత్య నివేదనలు సమర్పిస్తారు కెంపుగంటికి, తలిరుదిండికి తమ తదుపరి గమ్యమైన వానప్రస్థ విశేషాలను తెలుపుతూ, వానప్రస్థాశ్రమ దిశానిర్దేశనానికి ‘దివ్యవాణి’ రూపంగా పికరాణి వచ్చిందని భావించడంతో కవి కావ్యరచనా సంభావ్యత పరిపుష్టమవుతుంది.
కావ్యారంభం లౌకికంతో మొదలుపెట్టి చివరికి చేరేసరికి తాను దర్శించిన అనేక పార లౌకిక విషయాలను అక్షరీకరించి ఆలోచనామృతంగా అందిస్తారు పాఠకులకు ఆధ్యాత్మికవేత్త, ఆర్షకవి మసన చెన్నప్పగారు.
చివరి పద్యంలో ఇలా అంటారు :
“అశ్వమై వెలుంగు విశ్వమ్ము చూడంగ
ఎక్కి తిరుగువారమెంతో సేపు
నిజము దెలియ బ్రహ్మ నిష్ఠులకదియెప్డు
‘హయము’ విడువదగినదమ్మ పికమ!” – 306
ఆచార్య మసన చెన్నప్పగారితో నాకు ఇటీవలనే పరిచయమేర్పడినా అది జన్మజన్మాల బంధమనిపించింది. వారి సౌమనస్యం అనుభవైక వేద్యం. ఈ కావ్యానికి ముందుమాట రాయమని వారాదేశించటం నా అదృష్టం తప్ప అర్హతవల్ల కాదని నాకు తెలుసు. నన్ను ఈ కావ్యానికి ముందుమాట రాయమని చెన్నప్పగారడిగినప్పుడు విస్మయుణ్ణయ్యాను. ఎందుకంటే వారి వేదోపనిషత్తులను మథించిన పాండిత్యం ముందు నా శ్రుత పాండిత్యం గరికపోచకు సరిగాదు. కానీ వారికి నాపై ఇంతటి అవ్యాజమైన అభిమానం ఏర్పడటం దైవ సంకల్పం. బహుశః వారిని నా పుస్తకాల శీర్షికలు గొంత్తెత్తిన కోయిల, మహెఫిల్లో కోయిల, శార్వరిలో కోయిల, ఎలకోయిల పాట ఆకర్షించి ఉంటాయనుకంటాను.
ఏది ఏమైనా ‘కోకిల’ పేరుతో ఆచార్య మసన చెన్నప్పగారు వెలువరిస్తున్న ఈ పద్యకావ్యం ఒక కొత్త లోకానికి నాంది అనిపిస్తుంది. వారి జీవితానుభవాలు, చేరుకున్న గమ్యాలు, చేర్చిన మహానుభావులు ఇలా ఆచార్య మసన చెన్నప్పగారి సాకల్య సాఫల్య జీవన చిత్రణ ఈ పద్యకృతి ‘కోకిల’ అనడంలో సందేహం లేదు. వారికి అభినందనలు మరియు కృతజ్ఞతలు.