‘‘యత్ర నార్యన్తు పూజ్యంతే` రమంతే తత్ర దేవతా:!
యత్రైతాస్తు స పూజ్యంతే ` సర్వాస్తత్రాఫలా:క్రియా: !!
శోచంతి జామయోయత్ర -వినశ్యత్యాశు తత్కులం!
నశోచంతితు యత్రైతా: `వర్ధతే తద్ధి సర్వదా !!
తస్మాదేతా సదా పూజ్యా: `భూషణాచ్ఛాదనాశనై : !!’’
మహిళలు గౌరవం పొందే స్థలంలో దేవతలు ఆనందంతో నిలుస్తారు. స్త్రీలను అగౌరవపరిచే వారికి ఏ పనులలోనూ మంచి ఫలితాలు లభించవు. ఏ స్త్రీలు వంశంలో దు:ఖిస్తూ ఉంటారో ఆ వంశం నాశనమైపోతుంది. నిజానికి వారి సంతోషమే వంశోన్నతికి మూలం. ఎపుడూ వారికి అన్నం, వస్త్రం తదితర సామగ్రీ ఉండే విధంగా వ్యవహరించాలి అనేది శాస్త్రం. వాస్తవం కూడా.
అనాది నుండి అత్యాధునికం వరకు మహిళ తమవంతు బాధ్యతను నిర్వహిస్తూ తన ఉనికి పతాక స్తాయిలో వినువీధుల్లో విస్తరిస్తూనే ఉంది. ఇది నిజం. నిజానికి ఆదిలో స్త్రీలకు ఉన్న ప్రాధాన్యత రాను రాను తగ్గుతూనే వస్తుందని మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే అప్పట్లో మహిళ కి ఇన్ని పరిమితులు విధించి ఉన్నట్లయితే కులాలకతీతంగా ఒక రaాన్సీ లక్ష్మీబాయి, సమ్మక్క సారక్కలు, జ్యోతీరాయ్పూలే, మొల్ల, చాకలి ఐలమ్మ వంటి వారు ఉండేవారే కారు. ఆ కాలంలో మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన దాఖలాలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. రాను రాను ఎప్పుడైతే పితృస్వామ్యవ్యవస్థ అహంతో ముందువరసలోకి వచ్చిందో అపుడే స్త్రీల అణచివేత ప్రారంభమైంది. కన్యాశుల్కం ఇచ్చిన రోజులనుంచి నేడు వరకట్నం ఇస్తున్న నేటి రోజుల వరకు మహిళ ఆర్థికంగా సమానత్వం సాధించినా కూడా ఇంకా ఇంకా అణచివేత సాగుతూనే ఉంది. వీటిని ఎలా అధిగమించడం? అమ్ముడుపోతున్న చట్టాలను ఎదిరించి గెలిచే ధైర్యమూ ఎవరికీ లేదు. మరి ఆడపిల్లను ఎలా పెంచడం? కాపాడటం ఎలా? అంతరిక్షానికి ఎగురుతున్నా కూడా ఇంకా అణగారిన కథలే వినిపిస్తున్నాయంటే లోపం ఎక్కడుంది? అసలు ఆడపిల్ల సమాజంలో బతకగలదా? తనకు తానే ధైర్యంగా ఈ సమస్యలను ఎదుర్కోగలదా? వంటి అనేక పశ్నలకు సమాధానంగా వెలువడిన ‘‘భారతీయ మహిళ’’ అమూల్యమైన గ్రంథాన్ని రూపొందించిన ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారములు.
ఈ గ్రంథంలో వేదాలలో మహిళలు, పురాణాల్లో మహిళలు, భాగవతంలో మహిళలు, రామాయణంలో మహిళలు, మహాభారతంలో మహిళలు, దేశ చరిత్రలో మహిళలు, ఆధునిక కాలంలో మహిళలు , పూజ్యశ్రీ గురూజీ చెప్పిన మహిళల భాగస్వామ్యం వంటి అతి విలువైన అంశాలు ప్రస్తావనలోకి వచ్చాయి.
భారతీయ మహిళ` మాతృశక్తి లో ఆత్మకు స్త్రీ అనీ, పురుషుడనీ, మృగమనీయ పక్షి అయనీ పాము అనీ భేదం లేదు. అందరిలోనూ అంతటా ఉన్న ఆత్మ ఒక్కటే. సంసారంలో ఎవరి విధి వారు నిర్వర్తిస్తారు. పరస్పరం సహకరించుకుంటూ, ఇచ్చిపుచ్చుకుంటూ జీవిస్తారు. వర్గపోరాటమే జీవితమనుకుంటే అదే చరిత్ర అనుకుంటే కలిసి బతికే వ్యవస్థ ఏర్పడి కాదు ఆత్మీయత , అనురాగం సర్వ ప్రాణుల మధ్య ఎప్పటికీ ఉంటాయి. ఈ సువిశాల భావాలు, ఆచారాల కారణంగా, మహిళను భార్యగా, అక్కగా, చెల్లెలిగా గౌరవించబడుతున్న కారణంగానూ, జీవితంలో పురుషుడు స్త్రీనే అనుసరించి నడుస్తాడని చెప్పడం జరిగింది.
ఋగ్వేదంలోని అనేక మంత్రాల్ని మహిళలే దర్శించినట్లు అంతర్గత సాక్ష్యాలున్నాయని అంటారు. ‘‘గార్గి, రోమశ, ఘోషా, విశ్వాపర, ఆత్రేయ, లోపాముద్ర, వసుక్రపత్ని, ఇంద్రాణి, అపాల, శ్రద్ధ, కామాయని, వైవస్వతి, యామిపైలమి, సూర్య, స్వస్తి, శిఖండిని, ఊర్వశి, శచి, దేవరని, ఇంద్రమాత, సర్వరాజ్ఞి, వాక్, గోధ.. తదితరుల పేర్లు ఉన్నాయి. వీరందరూ దార్శనికులైన మేధావినులు. విద్య, వైద్యం, వ్యవసాయం, సాహిత్యం, కళలు వంటి వివిధ వృత్తులు, రాజనీతి తదితర రంగాలలో ప్రతిభావంతులుగా వెలిగారు. మహిళావికాసం సమగ్రంగా జరిగిన కాలమది. ఆ కాలంలోని కొంతమంది మహిళామణులను గురించి తెలుసుకోవాలంటే ముందుగా
బ్రహ్మవాదిని గార్గి గురించి: మహావేదాంతి రాజఋష జనకుడు మిథిలను పరిపాలిస్తున్న రోజుల్లో సీత తండ్రి జనకుడు కాడు. రామాయణ కాలం కన్నా ఎంత ముందున్నవాడు. ఈ రాజవేదాంతి ఆస్థానంలో గార్గి అనే బ్రహ్మవాదిని ఉండేది. యాజ్ఞవల్క్య అనే ఋషి ఉండేవాడు. వీరిరువురికి బ్రహ్మతత్త్వ వివేచనార్థం సభ జరుగుతున్నప్పుడు ఆకాశం, నేల, నీరు వంటి పంచభూతాల పట్ల వాదోపవాదాలు జరిగింది. చివరికి యాజ్ఞవల్క్యుని బ్రహ్మజ్ఞానిగా గార్గి గుర్తించింది. అంటే అతను బ్రహ్మజ్ఞాని అని గుర్తించిన మహామేధావి గార్గి అన్నమాట. అందుకే ఈమె బ్రహ్మవాది అయింది.
శ్రేయోమార్గంలో మైత్రేయి యజ్ఞవల్కుని భార్య. వీరికొక ఆశ్రమమున్నది. పోషణ నిమిత్తుం ఆశ్రమ భూములున్నాయి. గోవులున్నాయి. ఫలధాన్య సమృద్ధి వున్నది. ఆయన ఆశ్రమం విడిచి వెళ్ళి కొన్నాళ్ళపాటు తపస్సు చేసి దేశ పర్యాటన చేసి రావాలనుకుని మరో భార్య అయిన కాత్యాయనికి మొదటి భార్య మైత్రేయికి ఆస్థి విభజన చేసి రక్షించుకోవలసినదిగా తెలిపి మైత్రేయితో ఈ విషయం ప్రస్తావించాడట. కానీ మైత్రేయి ఈ భూమి వల్ల నేను అమృతత్త్వం పొందుతానా? అని అడిగిందట. అందుకు ఎప్పటికీ పొందలేవు. సంపదలున్నవారు అమృతత్త్వాన్ని పొందలేరు అంటే అమరత్వం పొందని ఈ ఆస్తి వలన, సంపద వలన నాకేం ప్రయోజనం ఉంది అని తిరస్కరించిందట. అయితే ఆత్మ బ్రహ్మ ఒక్కరే! ధ్యానం చేయాలి. ఆత్మను తెలుసుకోవాలి, ఇంద్రియాలను తాడిరచి ఆత్మను శోధించి ఈ పంచభూతాత్మక ప్రపంచం కంటే ఆత్మ ఎలా భిన్నమైనదో భార్యకు యజ్ఞవల్కుడు వివరించాడట. పృథ్వి జలము, అగ్ని , వాయువు, ఆదిత్యుడు, దిశలు, విద్యుత్తు, మేఘం, ఆకాశం తదితర వివరాలు చెప్పి ధర్మమే సర్వప్రాణులకు ప్రీతియని మైత్రేయి తెలుసుకున్నది.. కానీ రెండవ భార్య మాత్రం ఆస్తివైపే దృష్టిని సారించి కఠోపనిషత్తులోని శ్రేయస్సును, ప్రేయస్సును స్వీకరించింది. ఇపుడు కాత్యాయని సంసారాన్ని నడుపుతోంది. మైత్రేయి మోక్ష పథంలో ఉంది. యాజ్ఞవల్క్యుడు తపస్సులో ఉన్నాడు ముగ్గురిలో ఒకరు ప్రేయస్సుకు ప్రతీక, మైత్రేయి శ్రేయస్సుకు ప్రతీక, యాజ్ఞవల్క్యుడు తపస్సుకు ప్రతీక అనచ్చు. ఇలా సుజ్ఞాని సులభ జనక మహారాజుతో సులభ వేదాంత గోష్టి చేసిన అంశం భారతంలో సూచించబడిరది. వేదాల్లో వందల కొలది మహిళలు పృథ్వి, ఇల, సరస్వతి, భారతి, సినీవాలి, రాఖ, సూనృత, పురంధ్రి, ధిషణ, అనుమతి, తిఱిని, ఇంద్రాణి, ఉషస్సు, రాత్రి, శ్రద్ధ, అనుమతి, అరామతి, దంపతి, అరణ్యాని, వరుణాని వంటి వారంతా మహిళా రూపంలోని దేవతలే అనవచ్చు. ఇలా మహిళల పేర్లు ఎన్నో ఒక్క ఋగ్వేదంలోనే ఉన్నాయి. వీటన్నిటిమీద ప్రత్యేకాధ్యయనం చేయాల్సిందే అంటారు రచయిత.
మాతృశక్తి దివ్యత్వాన్ని తీసుకుంటే ఆదిశక్తి మహామాయగా అవతరించింది. ఈ తల్లికి మహాకాళి అని పేరు. మొదటి అవతారంలో ఈ అమ్మవారు మధుకైటభులనే రాక్షసులను సంహరించారు.
రెండవ అవతారం మహిషాసురమర్థిని. సింహవాహనjైున ఈ తల్లికి ‘మహాలక్ష్మి’ అనే పేరుంది. ఈ తల్లి మహిషముఖుడైన అసురుడిని సంహరించింది. మూడవ అవతారం అయిన మహాసరస్వతి రక్తబీజుడ్ని సంహరించింది. నాల్గవ అవతారంలో యోగమాయగా జన్మించి కంసుడ్ని భయపెట్టి అదృశ్యమైపోయింది. ఐదవ అవతారంలో అమ్మవారు దంతాలనే ఉపయోగించడం వల్ల రక్తదంతిగా పేరును సంపాదించుకుంది. లోకంలో కరువు కాటకాలు ఎక్కువై పోవడంతో తల్లి అంతటా శాకాలు సృష్టించి కరువును తొలగించింది. అందుకే ఈ తల్లిని శాకాంబరిగా పిలుస్తారు. ఏడవ అవతారంలో దుర్గుడునే రాక్షసుడ్ని సంహరించినందువలనే దుర్గాంబగా పేరు వచ్చింది. ఎనిమిదవ అవతారంలో తల్లి మాతంగుని ఇంట పుట్టి మాతంగిగా పిలవబడిరది. తొమ్మిదవ వతారంలో రాక్షస సంహారం నిమిత్తం అమ్మవారు భ్రమరాలను సృష్టించి విజయం సాధించింది. అందువల్లే ఈ అవతారానికి భ్రామరి అనే పేరు వచ్చింది. ఇలా భిన్న రూపాలతో వర్ణితమైన పురాణాది ప్రక్రియలను ఆధారంగా గ్రహించి రేఖామాత్రంగా మనకు దర్శనమిస్తున్నాయి.
పురాణాల్లో మనసావాచా కర్మణా శుచీ దేవి. శచీదేవి, వేదవేత్త వేదవతి, వరూధిని మన నాయనమ్మ, అరుంధతి మన అంతర్యామి, ఆత్మబంధువు అనసూయ, ప్రేమరస చైతన్యమూర్తి ఊర్వశి, సుస్థిర మానస సుకన్య, ఎల్లలు లేని ఎల్లమ్మ రేణుకమ్మ, సత్యసారమతి చంద్రమతి, సంపదల దేవి లక్ష్మీదేవి, పరాశక్తి పార్వతి, జ్ఞానజ్యోతి సరస్వతి వంటి దివ్యశక్తులున్న మహిళలెందరో పురాణాల్లో ఉన్నారు. మన జీవితాలు, ప్రవర్తనలు భారతీయ మహిళలకు ఆదర్శాలయి, ఆచరణ యోగ్యాలయ్యాయి.
ఇంద్రసేన, దేవసేనచ పులోమ, ఇల, అంగీరస, కావేరి, ఘృతాచి, జలంధర, తిలోత్తమ, మనోరమ, యమున, రాధ, లోపాముద్ర, శతరూప ఇలా మరో వందమంది పురాణ మహిళల ద్వారా సార్వకాలీన సత్యాల్ని అనుసరించవచ్చు. అయితే ఈ పురాణ మహిళలు ఏం చేసారు? అని ఆలోచిస్తే సత్యమే మాట్లాడుతారు. స్వేచ్చాభిప్రాయాలు ప్రకటిస్తారు. రాజీపడి జీవిస్తారు. ప్రేమను పంచి పెడతారు.అన్యాయాన్ని ఎదిరిస్తారు. పురుషునితో పాటు సమానంగా వ్యవహరిస్తారు. జన హితం కోసం దేశ హితం కోసం త్యాగాలు చేస్తారు. ఆత్మబంధువులై అందరినీ ఆదుకుంటారు. శక్తి పూత్కారం చేస్తారు. జ్ఞానజ్యోతిని వెలిగిస్తారు. అంతేనా? అంటే కాదు. మహిళాలోకానికి ఆదర్శవంతులై నిలిచారు. ఆధునిక మహిళా ప్రస్థానంలో ప్రాథేయాలంగా మహిళలంతా నిలిచారు. ఒక్కొక్కరి స్పర్శ ఒక్కొక్క పీఠికై నిలిచేలా చేసారు. నేడు దారులు వేరైనా గమ్యం ఒకటే అనిపించేలా ఆనవాళ్ళను ఉంచి మరీ కదిలారు.
భాగవతంలో ఆదితి మాత నేతృత్వం. వ్యతిరేక దిశలో దితి ప్రయాణం, దివ్య మార్గం చూపిన దేవహూతి, సహనశీలి ఆశావాది దేవకి, వాత్సల్యద యశోద, చంద్రునికో నూలుపోగు అంటున్న కుబ్జ, జగన్మోహిని యుక్తి, అరుచి సురుచి వినీతి సునీతి, తమస్సు చీల్చిన ఉషస్సు ఉష, జనగణనాయక రాధ, మహిళా చైతన్య ప్రతీక సత్యభామ, కృష్ణ చైతన్య స్రోతస్విని రుక్మిణి వంటి వారెందరో మహిళలు భారతీయ మహిళల జీవితాలతో పెనవేసుకుపోయారు. వీరిలో కొందరు భారతాది గ్రంథాల్లోనూ, అన్య పురాణాల్లోనూ వచ్చారు. కొందరిని మాత్రమే పరామర్శించే అవకాశం ఉంది. వీటి వివరణలు ఈ గ్రంథంలో చదవవచ్చు.
రామాయణంలో మహిళలు గమనిస్తే ఈ మహాకావ్యం నిండా మహిళల కథలే. మహితమైన దారిలో నడిచిన మండోదరి, రాజనీతి దురంధర మంథర, జైజైజై కైకామాతా దేవహిత కార్యనిర్మాత స్త్రీ జనాభ్యుదయతారా తార, అసురత్రాత, కైకసి కైసేత,, సత్య సౌందర్యమూర్తి సరమ, జనరంజన అంజన, కౌశల పూర్ణ కౌసల్య, ఫలిత పర్ణ శబరి, విషాగ్ని వృక్షం శూర్పణఖ, యోగిని ఊర్మిళ, పరమపునీత లోకమాత సీత తలుచుకుంటే రామాయణమంతా రమణుల కథే కదా అనిపించకమానదు.
మహేతిహాసంలో (మహాభారతంలో)మహిళల విషయానికి వస్తే స్వేచ్ఛాజీవి గంగ, ధీరమానస సత్యవతి, సౌజన్యవతి శర్మిష్ట, స్వాభిమాని దేవయాని, కపటి కద్రువ వినీత వినత, మేధానిది మేనక, సత్యవాది సరమ, ధర్మవాదిని జరత్కారువు, మృత్యుంజయ సావిత్రి, పరమ పతివ్రత పారమార్థికత, వీరమాత కుంతి, భారత భారతి ద్రౌపది. వీరిని తలుచుకుంటూనే ఉంటాం. మళ్ళీ మనం యథాస్థానంలోకి వస్తూనే ఉంటాం.
దేశ చరిత్రలో మహిళల్ని ఆలోచించుకుంటే గృహంలో యశోధర, ప్రచారిక సంఘమిత్ర, దేవిగా మారిన ఉభయభారతి, ఉత్తమ సేవిక సుజాత, వీర నారి రుద్రమ, రామాయణ రచయిత్రి మొల్ల, నాయకురాలు నాగమ్మ, వీరునికి వెన్ను చూపని చానమ్మ, చితిని వరించిన సంయుక్త, కృష్ణభక్తిని చూపే మీరాబాయి, విద్వేషాల మంటల్లో దుర్గావతి, యువతకు ప్రేరణ రaాన్సీరాణి ఇలాంటి చరిత్రలో ఎందరో ఇంకెందరో ఉన్నారు.
కీస్తు శకారంభం నుండి ప్రధమ భారత స్వాతంత్య్ర సంగ్రామం వరకు ఎందరో మహిళలు గృహిణులుగా, వీర వనితలుగా, పరిపాలకులుగా, విద్యావేత్తలుగా, వ్యవసాయదారులుగా, వృత్తి నైపుణ్య రమణులుగా, నాట్యగత్తెలుగా, సంగీత విద్వాంసులుగా, దార్శనికులుగా, కర్మయోగినులుగా, భక్తి ప్రచారకులుగా, దేశికలుగా, ఋషికలుగా, రచయిత్రులుగా, కవయిత్రులగా దేశంలో భిన్న ప్రాంతాలలో వికసించారు. అయితే ఈ దేశం జాతిలో శక్తి తగ్గి విదేశీయులను తనలో జీర్ణించుకునే పాటవం కోల్పోయిన నాటినుంచి స్వతంత్య్రాన్ని కోల్పోతూ వచ్చింది. దానివల్ల, స్వదేశీ ఆచారాలపై జీవన విధానాలపై విదేశీయ అశాస్త్రీయ భావజాలం పెత్తనం చలాయిస్తూ వచ్చింది. ఇది కాస్త రాజ్య సభల్లో, వీధుల్లో వీర విహారం చేసినా చాలాకాలం గృహంలోనే ప్రవేశించలేకపోయింది. అందువల్ల విశాల హిందూ ధార్మిక సాంస్కృతిక తాత్త్వికాంశాలను ఎన్నింటినో గృహిణి అందించగలిగింది. ఇలా జాతి జీవనాడి నిత్య చైతన్యంతో పోరాడిన స్థలం గృహమే. ఈ గృహానికి యజమానే గృహిణి. ఆమె పుణ్యఫలమే జాతిలో స్వాతంత్య్ర భావబీజాలు నాటుకోవడం, ఆధునిక మహిలకు స్పూర్తి ప్రదాతగా నిలవడం అంటూ వివరిస్తున్న రచయిత భావాలకు ప్రణమిల్లక తప్పదు.
ఇదొక అద్భుతమైన గ్రంథం. ప్రతి మహిళ ఇంట్లో నిత్యం నిలవాల్సిన గ్రంథం కూడా. స్వేచ్ఛ అనేది ఒకప్పుడు లోక కళ్యాణం కోసం ఉపయోగించేవారు. నేడు స్వేచ్ఛ దుర్వినియోగం ఎక్కడ ఎలా అవుతోందో అనే విషయాలు ఈ గ్రంథం చదివితే అందరికీ ఖచ్చితంగా బోధపడుతుంది. నామటకు నాకు చాలా కాలమైంది ఇంత చక్కని గ్రంథం చదివి అనిపించింది. గౌరవనీయులైన కసిరెడ్డి వెంకటరెడ్డి గారి కలం నుండి వెలువడిన ఈ గ్రంథం తెలుగు సాహిత్య చరిత్రకు ఒక తలమానికం.
కసిరెడ్డిగారి గురించి
కసిరెడ్డి వెంకటరెడ్డి కవిగా, వక్తగా, వ్యాసకర్తగా, జానపద వాజ్మయ పరిశోధకుడిగా, ధార్మిక సామాజిక విజ్ఞాన వ్యాఖ్యాతగా వాసికెక్కాడు