Home ధారావాహిక నవల జీవనమాధుర్యం

జీవనమాధుర్యం

by Laxmi Madan

రెండవ భాగం
🌹🌹🌹🌹🌹🌹🌹

అలా ఎన్నో ఊహలతో ఉన్న అ దాపర్ణకి తను దిగాల్సిన ఊరు ఎప్పుడు వచ్చిందో చూసుకో లేదు. అప్పటికే బస్సు అంత ఖాళీ అయిపోయింది. కండక్టర్ అన్నాడు” మేడం ఇదే లాస్ట్ స్టేజ్ దిగండి”

” ఒక్కసారిగా ఊహా ప్రపంచం నుంచి బయటకు వచ్చి కిటికీలో నుండి బయటకు చూసింది. బస్టాండ్ అంతా కోలాహలంగా ఉంది .తను ఎక్కిన బస్సు ఖాళీగా ఉంది ,వెంటనే తన సూట్ కేసు బ్యాగు తీసుకుని కిందకు దిగింది.

ఎదురుగా కనబడిన మనుషులు చూసి ఆశ్చర్యపడింది. అతను ఎవరో కాదు రామాలయంలో పూజ చేసే పూజారి. వయసు పైబడి నడవలేక నడుస్తూ బసు కోసం అనుకుంటా ముందుకు వస్తున్నాడు.

అపర్ణ వెళ్లి పలకరించింది.

“పెద్దనాన్న బాగున్నారా”అన్నది అపర్ణ.

“ఎవరు తల్లి, నాకు చూపు అనడం లేదు గుర్తుపట్టలేకపోతున్నాను” అన్నాడు వణుకుతున్న శరీరంతో.

“నేను దక్షిణామూర్తి గారి అమ్మాయిని. నా పేరు అపర్ణ .చిన్నప్పుడు మీ అమ్మాయి, నేను ఇద్దరం కలిసి స్కూలుకు వెళ్లే వాళ్ళం గుర్తొచ్చిందా? పెదనాన్న”అని చెప్పింది అపర్ణ.

గుర్తుపట్టినట్లు తలాడించాడు పూజారి గారు. బ్యాగ్ లో నుంచి కొంత డబ్బు తీసి అతని చేతిలో పెట్టి

“ఇది ఉంచండి” అన్నది అపర్ణ.

“ఎందుకు బిడ్డ, నాకు డబ్బులు అవసరం ఉన్నవని నీకు అర్థం అయ్యిందా”అన్నాడు నవ్వుతూ.

“బస్సు వచ్చింది నేను వెళ్తాను బిడ్డ. వెళ్లే లోపల మా ఇంటికి రా?”అని చెప్పి కర్ర సహాయంతో ముందుకు వెళ్లిపోయారు పూజారి గారు.

ఒక్క నిట్టూర్పు వదిలింది అపర్ణ .”రోజులు ఎంత తొందరగా గడిచిపోయాయో అర్థం కావడం లేదు. పూజారి పెద్దనాన్న గుడిలో అలంకరించిన తీరు చూస్తే ఎంతో బాగుండేది. ఏంటో ఒంటరిగా ఎక్కడికో వెళ్తున్నారు” అని బాధపడింది.

తన స్నేహితురాలు వసంతకు ఫోన్ చేసింది..

” వసంతా! నేను మన ఊర్లో బస్సు దిగాను. మీ ఇల్లు ఎటువైపు ?చెబితే నేను వచ్చేస్తాను” అని చెప్పింది.

” వచ్చేసావా?కాస్త ముందే ఫోన్ చేయకూడదా? కార్ పంపిస్తాను, ఐదు నిమిషాలు వెయిట్ చెయ్.. మన ఊరు నువ్వు చూసినప్పటిలా లేదులే. చాలా మారిపోయింది. నువ్వు మా ఇల్లును గుర్తుపట్టలేవు.అక్కడే ఉండు ” అని చెప్పింది వసంత.

” సరే” అని అక్కడ బెంచ్ మీద కూర్చుంది అపర్ణ.

బెంచ్ మీద తన పక్కనే ఒకతను కూర్చుని ఉన్నాడు.తెల్ల పంచె ,లాల్చీ వేసుకుని ఉన్నాడు. మనిషి బాగా ఎత్తుగా తెల్లగా ఉన్నాడు. వయసు దాదాపు 75 ఏళ్లు ఉంటుందేమో!

“ఎక్కడో చూశాను ఇతన్ని అని అనుకొని

“అయ్యో ఈయన డ్రాయింగ్ మాస్టారు ఆనందం సార్ కదా” అని అనుకొని,

” నమస్తే సార్ బాగున్నారా!” అని అడిగింది అపర్ణ.

” బాగున్ననమ్మా ! కానీ, నువ్వు ఎవరో నేను గుర్తు పట్టలేదమ్మ! ఏమీ అనుకోవద్దు .వృద్ధాప్యం కదా! కళ్ళు కాస్త మసకబారాయి” అని అన్నాడు అతను.

” నేను మీస్టూడెంట్ ను సార్, నాపేరు అపర్ణ.నేను క్లాస్ లో ఎప్పుడైనా మీరు ఇచ్చిన చిత్రాన్ని అచ్చంగా అలాగే వేస్తే, ఎన్నోసార్లు నన్ను మెచ్చుకున్నారు. ఆడ్రాయింగ్ పైన మీరు పెట్టే సంతకంతో పాటు ‘ గుడ్ ‘ అని పెట్టించుకోవాలని క్లాస్ అంతా ప్రయత్నించేవాళ్ళు. అందులో నేను ఒక దాన్ని.ఎన్నోసార్లు నన్ను మెచ్చు కున్నారు .” అని చెప్పింది అపర్ణ.

ఆనందం సారు కొంచెం ఆలోచిస్తున్నట్లుగా తలపైకెత్తి,

” ఆ !గుర్తొచ్చింది. తరగతిలో అల్లరి కూడా బాగా చేసే దానివి. చాలా సంతోషం తల్లి, నన్ను గుర్తుపట్టి మాట్లాడించినందుకు. ఎక్కడ ఉంటున్నావ్ ?ఏం చేస్తున్నావు? భర్త పిల్లలు అందరూ కులాసానా?” అని అడిగాడు సార్.

” అన్ని వివరంగా చెప్తాను సార్ .మీరు ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు? మీఇంటి అడ్రస్ చేప్తే వస్తాను. నేను ఇక్కడ రెండు మూడు రోజులు ఉంటాను. మీఇంటికి వచ్చి కాసేపు కూర్చొని అన్ని వివరాలు చెప్తాను” అని అన్నది అపర్ణ.

ఆనందం సార్ తన ఇంటి అడ్రస్ చెప్పి ,తను వెళ్లాల్సిన బస్సు వచ్చిందని చెప్పి వెళ్ళిపోయారు.

అపర్ణ తన స్నేహితురాలు పంపించిన కారులో వాళ్ళ ఇంటికి చేరుకుంది. దారిలో ఊరంతా చూస్తుంది. తన పుట్టి పెరిగిన ఊరుకు, ఇప్పటి ఊరుకు పోలికే లేదు. అంతా పట్టణ వాతావరణం లాగే ఉంది.

” వసంత చెప్పినట్లు నేను ఒక్కదాన్ని వెళ్లడం కష్టమే” అని అనుకున్నది. ఇంతలో కారు ఇంటి ముందు ఆగింది .

కారు దిగి దిగగానే ఎదురుగా స్నేహితురాలు వచ్చేసింది.ఇద్దరూ ఒకరి ఫోటోలు ఒకరు వాట్సాప్ లో పంపించుకోవడం వల్ల గుర్తుపట్టుకోగలిగారు. లేకపోతే పూర్తిగా మారిపోయిన వాళ్ళ రూపాలను గుర్తుపట్టుకునే వాళ్ళు కాదు.ఎంతో లావుగా అయిన వసంతను చూసి,

” ఏంటే ఇంత మారిపోయావు,?” అని దగ్గరకు తీసుకుంది అపర్ణ.

” అవునే చాలా మారిపోయాను. బాగా ఒళ్లు వచ్చేసింది. ఇంట్లో అందరూ కూడా తిడుతున్నారు. ఆరోగ్యం పాడవుతుంది కాస్త డైట్ చూ సుకో అని ” అని నవ్వుతూ అపర్ణను చేతులతో పట్టుకుంది.

” కానీ, నువ్వు మాత్రం ఏమీ మారలేదు అప్పూ! అలాగే ఉన్నావ్. ఈ చీర కట్టులో బాగున్నావు. అందమైన జడ ఏమాత్రం చెక్కుచెదరలేదు సుమా! ” అన్నది వసంత.

” ఇంట్లోకి రానిస్తావా? లేక ఈ ముచ్చట్లతోనే కడుపు నింపుతావా? నిన్నటి నుండి ప్రయాణం చేసీ చాలా అలసిపోయాను” అన్నది అపర్ణ.

” అయ్యో! నిన్ను చూసిన సంతోషంలో ఆవిషయమే మర్చిపోయానే! పద పద లోపలికి వెళదాము. నీకు గది ఏర్పాటు చేశాను. స్నానం చేసి టిఫిన్ చేసి అలసట తీరేవరకు పడుకో” అని చెప్పి స్నేహితురాలిని లోపలికి తీసుకెళ్ళింది వసంత.

ఇల్లంతా పెళ్లి సందడిగా ఉంది. పూల తోరణాలు, మామిడి ఆకుల తోరణాలు కట్టి ఎంతో అందంగా ఉంది. చక్కని పరిమళాలు వెదజల్లుతుంది . ఒక్కసారి అలసట అంతా మాయమైపోయింది. వాళ్ళ ఇంట్లో ఉన్న కొంతమంది తెలిసిన బంధువులను పలకరిస్తూ గదిలోకి వెళ్లిపోయింది అపర్ణ.

తనకు కేటాయించిన గదిలోకి వెళ్లిన అపర్ణకు, ఆగదిలోని అమరిక ఎంతగానో నచ్చింది. ఆ గది వసంత వాళ్ళ తల్లి తండ్రులదట. వసంత అత్తగారు కూడా ఒకటే ఊరు కావడం వల్ల ఇంచుమించు అందరూ కలిసే ఉంటారు. అందులో వసంత అత్తగారు వాళ్ళు మేనరికం. వసంత ఒకతే అమ్మాయి. అందుకని తల్లిదండ్రులు తన దగ్గరే ఉంటారు. ఆ గదిలోని సామాను చూస్తుంటే చాలా ముచ్చట వేసింది. పాత కాలపు పందిరి మంచం , డ్రెస్సింగ్ టేబుల్ ఇంకా కొన్ని చెక్క బొమ్మలు. ఇలా ఎంతో బాగుంది.మరో పక్క చిన్న దివాన్.అది తనకోసం కావొచ్చు అనుకున్నది.ఇల్లంతా మార్పులు చేసినా, ఈ గది అలాగే ఉండాలని వాళ్ళ కోరికట.గదిలో గంధపు పరిమళం వస్తుంది. దేవుడి పటానికి గంధపు పూమాల వేశారు.

అపర్ణ తన సూట్ కేస్ తెరచి, అందులో నుండి టవల్, సబ్బు,షాంపూ ,కట్టుకునే చీర బయటకు తీసి,సూట్ కేస్ మూసి, ఒక పక్కగా పెట్టింది.బాత్రూమ్
లోకి వెళ్లి హాయిగా నీళ్లు ఒంటి మీద పోసుకుంటే, బడలిక తీరినట్లు అనిపించింది. ఇంతలో బయట నుండి వసంత పిలుపు వినిపించింది.

” అప్పూ! కుంకుడు కాయ రసం బాత్ రూం లో పెట్టించాను.నీకు నచ్చితే చెయ్యి,లేదా షాంపూ కూడా అక్కడే ఉంది ” అని చెప్పింది .

” ఓహ్! అవునా! ఎన్నాళ్ళయింది కుంకుడుకాయ రసంతో స్నానం చేసి.సరెనే ! ” అని చెప్పి చక్కగా కుంకుడు రసంతో తలస్నానం చేసి ,సున్నిపిండితో స్నానం చేసి బయటకు వచ్చి,తలకి చిన్న పంచె కట్టుకుని ,తనకి ఎంతో ఇష్టమైన పింక్ చీర కట్టుకుంది.లైట్ గా మేకప్ చేసుకుని, కొంచెం పెద్ద బొట్టుపెట్టుకుని,ముత్యాల దండ మెడలో వేసుకుని తనని తాను చూసుకుంది.వెంటనే భర్త గుర్తొచ్చి ఒక సెల్ఫి తీసుకుని పంపించింది.
తర్వాత తలని తుడుచుకుని, జుట్టు వదిలేసి ఒక క్లిప్ పెట్టుకుని బయటకు వచ్చింది.అపర్ణని చూసిన వసంత
” భలే అందంగా ఉన్నావే” అని పిలిచి అందరికీ పరిచయం చేసింది.

అపర్ణ కూడా అదే ఊరు కావడం వల్ల తనకు చాలామంది తెలిసినవాళ్లే.
అలా అందరితో మాట్లాడుతూ కూర్చుంది. ఇంతలో అందరిని టిఫిన్ చేయడానికి రమ్మని పిలుపులు వచ్చాయి. పెళ్ళంతా సాంప్రదాయంగానే ఉండాలని ఏర్పాటు చేసింది వసంత. ఆకాలపు ఉపహారాలు, భోజనాలు ఇంటి వెనక పెరట్లో తడికల పందిళ్లు, పచ్చని విస్తారాకులలో భోజనాలు. కింద కూర్చొని తినగలిగే వాళ్ళకి చాపలు పరిచారు. కింద తినలేని వాళ్ళకి వరుసగా టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఆ తడికల పందిరిలోకి వెళ్ళగానే ఎంతో సంతోషం అనిపించింది అపర్ణకు . తన పెళ్లి జరిగిన విషయం గుర్తుకొచ్చింది. ఇంకా అదే విధంగా ప్లాన్ చేసుకున్న వసంతను మనసులోనే అభినందించింది.

” వసూ! ఎంత బాగా ఏర్పాట్లు చేసావే, ఇంతకీ ఆలోచన నీదా ?మీ ఆయనదా?” అని అడిగింది.

“ఏం? నాకు అలాంటి ఆలోచనలు రావు అనుకున్నావా?. నిజం చెప్పాలంటే మా ఆయనదే” అని చెప్పి పక్కకు తిరిగినంతలో వసంత వాళ్ళ ఆయన శ్రీనివాసరావు వస్తూ కనిపించాడు.

“అదిగో మాటల్లో వచ్చారు మాశ్రీవారు” అని అపర్ణ వైపు చూసి,

“మాఆయన శ్రీనివాస రావు, ఇదేమో నా ఫ్రెండ్ అపర్ణ” అని పరిచయం చేసింది.

పరస్పర పరిచయాలు అయ్యాక..

“రండి అపర్ణ గారూ!టిఫిన్ చెయ్యండి ” అన్నాడు శ్రీనివాస రావు.

” అందరం కలిసి తిందాం మీరూ రండి ” అని వసంత వైపు చూసింది అపర్ణ.

“మేము ఇప్పుడు ఏమీ తినకూడదు.ఈ రోజు అమ్మాయిని పెళ్లి కూతురును చేస్తున్నారు కదా!అంకురార్పణ,ఇంకా కొట్నం ఉంటుంది “అని చెప్పింది.

“అవును మరచే పోయాను.సరే, నేను వెళ్లి టిఫిన్ చేసి వస్తాను. ఏదైనా సహాయం చేస్తాను తిన్నాక ” అని చెప్పి అపర్ణ పందిట్లో కి వెళ్ళింది .

పందిట్లోకి వెక్కిన అపర్ణ ఆ వాతావరణం చూసి మై మరచి పోయింది.

సశేషం

You may also like

Leave a Comment