Home ఇంట‌ర్వ్యూలు డా .ముదిగంటి సుజాతా రెడ్డి

డా .ముదిగంటి సుజాతా రెడ్డి

by Rama Devi Nellutla

తెలంగాణా తొలితరం రచయిత్రులలో అగ్రగణ్యులు , సాహిత్య పరిశోధకులకు దారి చూపే దీపధారి , బహు గ్రంథకర్త డా . ముదిగంటి సుజాతా రెడ్డి .  ఆమె మాట మెల్లన , మెత్తన !మనసు తెల్లన ,చల్లన !
రచన లోతయిన, సమగ్రమైన పరిశోధన !  బోధన స్పష్టమైన , సులువైన జ్ఞాన వితరణ !

తన జీవితం గురించీ , వృత్తి గురించీ , ప్రవృత్తి గురించీ మయూఖ ముందు డా . సుజాతా రెడ్డి గారు పంచుకున్న అనుభవాలూ , జ్ఞాపకాలూ మీ కోసం ….

మీరింత  గొప్ప రచయిత్రిగా పేరు తెచ్చుకున్నారు కదా ! మీ పూర్వీకులలో ఎవరైనా రచయితలు ఉన్నారా ?

లేరు . అసలు విద్యావంతులే లేరు . ఇక రచనలు కూడానా ? ఆడపిల్లలకు చదువులే వద్దనే కాలం అది . ఎక్కువ మంది నిరక్షరాస్యులు , కొద్ది మంది చదివినా ప్రాధమిక విద్య కాగానే పెళ్లి చేసేవారు .

మీ కుటుంబ నేపథ్యం , పుట్టిన ఊరి నేపథ్యం చెబుతారా ?

మాది వ్యవసాయదారుల కుటుంబం . నాన్న రాంరెడ్డి , అమ్మ వెంకటమ్మ గార్లు . ఎంతో కష్టపడితే గానీ .. తిండిగింజలు పండని పరిస్థితి . ముగ్గురు ఆడపిల్లలం , ఇద్దరు అన్నదమ్ములు .నేను రెండవదాన్ని .

అప్పట్లో తెలంగాణా లోని అన్ని పల్లెల్లోలాగానే మాదీ చిన్న పల్లెటూరు . నల్గొండ జిల్లా నకిరేకల్ మండల్ లోని ఆకారం మా ఊరు . అసలు మా ఊరి పేరు అర్కవరం . ఊరి చెరువు కట్ట క్రిందనే సూర్యుడు , “శివుడు , విష్ణువు” కొలువుదీరిన త్రికూటాలయం ఉండేదట . కాకతీయుల కాలంలో చాలా ఊర్లల్లో త్రికూటాలయాలే ఉండేవి . అర్కుడు ఉన్నందువల్ల అర్కవరం అయి రానురానూ వాడుక భాషలో ఆకారం అనేవారు .

మరి ఆడపిల్లలకు చదువే అబ్బని రోజుల్లో మీరెలా చదువుకున్నారు ?

మొదట్లో ఊళ్ళో బడికి పంపారు . అయితే అప్పుడు నల్గొండ జిల్లా ప్రజా పోరాటాలతో అగ్ని గుండంలా ఉండేది. ఉద్యమంలో భాగంగా అప్పటి కమ్యూనిస్ట్ నాయకులు ఊళ్ళల్లో దొరల భూములు , ఇళ్ళూ ఆక్రమించడం , ఆస్తులు ధ్వంసం చేయడం చేస్తూ ఉండేవారు . ఆకారం లో మా భవంతి కూడా కూలగొట్టారు . బెదిరింపులు తీవ్రమవడంతో మా కుటుంబం ఆంధ్రా ప్రాంతంలోని నరసరావుపేటకు వెళ్ళింది . 1948 -49 ప్రాంతంలో నేను అక్కడ స్కూల్లో చదువుకున్నాను .

ఆ తరువాత తెలంగాణాకు వచ్చాక కూడా నల్గొండకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో .. వరంగల్ జిల్లాలోని మా అమ్మమ్మగారి ఊరైన వెంకటాద్రిపేటకు వచ్చి అక్కడ రెండేళ్ళున్నాం . అక్కడ ఓ పంతులు చెప్పే వీధిబడి లో నన్ను చేర్పించారు .

అక్కడే అఆలు , ఎక్కాలు ,గుణింతాలు నేర్చుకున్నాను . సిరి , చుక్క ఇవన్నీ భయంతో చదివేదాన్ని .ఏదైనా నేర్చుకోకపోతేనో , త్వరగా జవాబు చెప్పకపోతేనో ఒంటి కాలి మీద నిలబెట్టడం , గోడకుర్చీ వేయించడం వంటివి చేస్తూ ఉండేవాడాయన . అప్పట్లో  జొన్న పేలాలు తినేవాళ్ళం . బియ్యం , మొక్కజొన్న కంకులు , కూరగాయలు వంటివి చదువు చెప్పినందుకు పంతులుకు ఇస్తూ ఉండేవాళ్ళం .

మళ్ళీ నల్గొండకు  వెళ్లలేదా ? మీ హై స్కూల్ విద్య ఎలా కొనసాగింది ?

1950 లో కొంచెం పరిస్థితులు చక్కబడ్డాక నల్గొండకు వెళ్లాం . అయితే , మా నానమ్మ , బాపు ( నాన్న ), తాతమ్మ ( మా బాపుకు నాన్నమ్మ ) మాత్రం ఊర్లో ఉండి వ్యవసాయం , పాడి చూసుకునేవారు . మా అమ్మ , మేము అయిదుగురం పిల్లలం ఒక కిరాయి ఇంట్లో నల్గొండ లో మా చదువుల కోసం ఉండేవాళ్ళం .

నేనక్కడి గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ లో 4 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు చదువుకున్నాను . పది మంది అమ్మాయిల్లో నేనొక్కదాన్నే టెంత్ పాస్ అయ్యాను .

అప్పటికీ , ఇప్పటికీ చదువులో .. ముఖ్యంగా ఆడపిల్లల చదువుల్లో విద్యాపరంగా , సామాజిక పరంగా మీరు గమనించిన మార్పులేమిటి ?

చాలా ఉన్నాయి . అప్పట్లో ఏడో తరగతి లేదా పదో తరగతి కాగానే ఆడపిల్లలకు పెళ్లి చేసేవారు .పై చదువులు చదివించడం తక్కువ . అందులోనూ కృష్ణా , గుంటూరు జిల్లాల తాలూకూ ఆంధ్రా అమ్మాయిలు  వాళ్ళ తల్లిదండ్రుల ఉద్యోగాల రీత్యా బోర్డర్ ప్రాంతాలైన నల్గొండ , కోదాడ , సూర్యాపేటల్లో ఉండేవారు . వాళ్ళను బాగానే చదివించేవారు .

అప్పటికీ ఇప్పటికీ చదువుల్లో వచ్చిన పెద్ద మార్పు ఏమిటంటే ..అప్పుడు తల్లిదండ్రులు నిరక్షరాస్యులైనా , తమ పిల్లల చదువు గురించి అంతగా తెలియకపోయినా , పాఠశాలల్లో ఉపాధ్యాయులు పూర్తి శ్రద్ధ చూపించేవారు . పిల్లలతో తరగతి పుస్తకాలతోబాటు సాహిత్యపఠనం చేయించేవారు . మరి ఇప్పుడు తల్లిదండ్రులు విద్యావంతులై ఉండి కూడా పిల్లలు అకడమిక్ గా బాగా గొప్పగా ఉండాలని చూస్తున్నారే తప్ప .. చాలా మందికి సాహిత్యం అన్న మాట కూడా తెలియదు .

స్కూల్ లో మాకు డ్రాయింగ్ , క్రాఫ్ట్ నేర్పేవారు . చెట్టునో , పూలకుండీనో , టేబుల్ నో గీయమనీ , పడవలు చేయమనీ , రంగు కాగితాలతో రకరకాల డిజైన్లు కత్తిరించమనీ .. ఇలా సృజనాత్మక శక్తిని పెంపొందించే కళలు నేర్పేవారు . స్కూల్ ఆవరణలో మడులు చేసి కూరగాయల మొక్కలు , పూల మొక్కలు వేసి మా చేతే నీళ్లు పోయించేవారు . ఎవరి మొక్క ఎక్కువ పూస్తే , కాస్తే .. వాళ్లకు అదో సంతోషం కలిగేది .

అప్పట్లో తెలంగాణలో నెలకొని ఉన్న దారిద్ర్య పరిస్థితులు , కరువు , తక్కువ ఆదాయాలు , లాభం లేని వ్యవసాయం , ఇతర కులవృత్తులు … వీటన్నిటి వల్లా ఆడపిల్లలకు  తొందరగా పెళ్లి చేసి భారం వదిలించుకోవాలనుకునేవారు . 1950 నుండీ బళ్ళల్లో ఉర్దూ మీడియం పోయి తెలుగు మీడియం వచ్చింది . 1952 నాటికి రావి నారాయణ రెడ్డి లాంటి వాళ్ళ నాయకత్వం లో కమ్యూనిస్ట్ పోరాటాలు సాగుతూనే ఉండేవి.

మీకు పుస్తకాలు చదవడం ఎలా అలవాటయింది ? మీ ఇంట్లో ఎవరైనా పాఠకులు ఉండేవారా ?

మా ఇంట్లో ఎవరూ పుస్తకాలు చదివేవాళ్ళు లేరు . అయితే గవర్నమెంట్ స్కూల్ అయినా మాకు మంచి గ్రంధాలయం ఉండేది . వారానికి ఒకట్రెండు లైబ్రరీ క్లాసులుండేవి . టీచర్స్ మాతోనే పుస్తకాలు పైకి పెద్దగా  చదివించేవారు . కొన్ని మాకు మేము చదువుకునేవాళ్ళం .వేయి పడగలు , నారాయణ రావు , గోన గన్నారెడ్డి వంటి పుస్తకాలు స్కూలు రోజుల్లోనే చదివాను . అర్థం కాకపోయినా శరత్ నవలల అనువాదాలు చదివేదాన్ని . సంజీవరావు గారి ‘ మొగలాయి దర్బారు ‘ నాలుగు భాగాలు పూర్తిగా ఎంతో ఉత్కంఠతో చదివాను . తరువాతి రోజుల్లో వివిధ సాహిత్య అధ్యయనం పట్ల ఆసక్తి కలగడానికి అదే పునాది అనుకుంటాన్నేను .

మీకు చదువు చెప్పిన టీచర్లు , మీతోబాటు చదువుకున్న విద్యార్థినులు గుర్తున్నారా ?

ఎందుకు లేరు ? బాల్య జ్ఞాపకాలు మరువలేనివి కదా ! 1950 లో తెలంగాణా స్కూల్స్ లో తెలుగు మీడియం ప్రవేశపెట్టగానే పెద్ద ఎత్తున ఆంధ్రా ప్రాంతం నుండి వచ్చిన టీచర్లు రిక్రూట్ అయ్యారు . ఆగ్నెస్ అనే టీచర్ చాలా బాగా పాఠాలు చెప్పేది . అలాగే మాకు హెడ్ మాస్టర్ గా మృగశిర అన్న టీచర్ ఉండేది . ఆమె పెళ్లి చేసుకోలేదు . రోజులో అధికభాగం స్కూల్ లోనే గడిపేది .వాళ్ళ అక్కచెల్లెళ్ల పేర్లు కూడా  నక్షత్రాల పేర్లు ఉండేవి . విశాఖ .. అలాగన్నమాట . మృగశిర టీచర్ మా బడిలో మంచి లైబ్రరీ ఏర్పరచడానికి ముఖ్య కారణం . హిందీ బోధించే సత్యవతి టీచర్ నన్ను బాగా ప్రోత్సహించేది . వాళ్ళ చెల్లెలు ఇందిర నా క్లాసుమేట్ . అయినా అప్పుడలాంటి భేదాలు లేవు .

ఇక తరువాతి కాలంలో నల్గొండలో మంచి డాక్టర్ గా పేరు తెచ్చుకున్న డా . ప్రేమలత కూడా నా క్లాసే . రోజూ బగ్గీలో స్కూల్ కి వచ్చేది .

మరి మీకు టెంత్ అవగానే పెళ్లి చేయకుండా ఎలా చదివించారు ?

అప్పటి పరిస్థితుల దృష్ట్యా నాకు వెంటనే పెళ్లి చేసేందుకు అనుకూలంగా లేకపోవడంతో ఎన్నో తర్జనభర్జనల అనంతరం నన్ను హైదరాబాద్ నారాయణ్ గుడాలోని రెడ్డి విమెన్స్ కాలేజ్ లో పి యూ సీ లో ఇంగ్లీష్ మీడియం సైన్స్ లో జాయిన్ చేశారు . ఇంటికి దూరంగా ఉండటమో మరి ఎందుకో నేను అక్కడ అంత బాగా చదవలేకపోయాను .

పీ యూ సీ తర్వాత మళ్ళీ నల్గొండకు వెళ్ళిపోయి బి ఏ లో చేరాను . హైదరాబాద్ లో మా కాలేజ్ లెక్చరర్ అయిన పోతుకూచి వెంకట్రామయ్య గారే నల్గొండ డిగ్రీ కాలేజ్ లో మాకు సోషల్ స్టడీస్ బోధించేవారు .

మీ వివాహం ఎప్పుడు జరిగింది ? పెళ్లి వల్ల మీ చదువుకు ఏమైనా ఆటంకం వచ్చిందా ?

డిగ్రీ ఫస్ట్ ఇయర్ అవగానే నా పెళ్లి జరిగింది . మా అమ్మమ్మ తల్లిగారిల్లు కరీంనగర్ లోని పొతకపల్లి . ఆమె బంధువులే మా అత్తగారింటి వారు . ఈ సంబంధం చూసింది కూడా ఆమే . మా మామగారు కొండల్ రెడ్డి గారు స్వతంత్ర అభ్యర్థిగా ఉమ్మడి రాష్ట్ర తొలి అసెంబ్లీలో ఎమ్మెల్యే గా పనిచేశారు . ఆయనకూ , మా వారికీ కూడా ఆదర్శ భావాలుండేవి .  ఆర్యసమాజ్ విధానాలను అనుసరించేవారు . ఇక మా వారు గోపాల్ రెడ్డి హరిద్వార్ లో సంస్కృతం లో ఎమ్మే చదివారు . ‘ ఓ డాక్టరో , ఇంజనీరో , లాయరో కాదు , సంస్కృతం లో ఎమ్మే చేసి ఏం చేస్తాడు ?’ అన్నారు మా బంధువుల్లో కొందరు .

కట్నం వద్దన్నారనే ఒక్క కారణం తో  నేను పెళ్ళికి ఒప్పుకున్నాను . పెళ్లయ్యాక కూడా నేను చదువుకోవచ్చని వారు చెప్పడంతో చాలా సంతోషపడ్డాను .

మరి అనుకున్నట్టుగా మీ చదువు కొనసాగిందా ?

1960 లో గోపాల్ రెడ్డి గారికి ఉస్మానియా యూనివర్సిటీ లో సంస్కృత శాఖలో ఉద్యోగం వచ్చింది . నేను కోఠి విమెన్స్ కాలేజీలో చేరి బీ ఏ పూర్తి చేసాను . తరువాత ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వచ్చి 1963 లో ఎమ్మే చేశాను . 1963 లోనే మా పాప వాసవిక పుట్టింది . తనను మా అమ్మ చూసుకోవడంతో నా చదువుకేమీ ఇబ్బంది కాలేదు .  ఆ తరువాత ఏడాదికే బాబు ఉదయన పుట్టాడు .

మీరు ఉద్యోగం చేయాలని అనుకోలేదా ?

ఎందుకు లేదూ ? నాకు

ఉద్యోగం చేయడం ఇష్టమే ! అయితే ఊరిలో మా మామగారు హత్యకు గురికావడంతో, అక్కడి ఒత్తిడుల వల్ల ఓ సంవత్సరం మా ఊరిలో ఉండాల్సి వచ్చింది .ఉస్మానియా యూనివర్సిటీ లోనే ఫ్రెంచ్ విభాగం హెడ్ ఆఫ్ ది డిపార్టుమెంట్ భోగ్లే గారని .. ఆ తర్వాతి కాలంలో క్రికెట్ కామెంటేటర్ గా పేరు తెచ్చుకున్న హర్షా భోగ్లే తండ్రి …ఉండేవారు . ఆయన రెకమండేషన్ తో ఆ తరువాతి సంవత్సరం 1964 లో నృపతుంగ స్కూల్ లో హైస్కూల్ సెక్షన్స్ కి టీచర్ గా చేరాను .

మీరు జర్మనీ వెళ్లడం ఎలా జరిగింది ?

ఉస్మానియా యూనివర్సిటీ లో మా వారు సంస్కృత శాఖ లో పని చేస్తూనే భోగ్లే గారి ద్వారా జర్మన్ నేర్చుకోవడం మొదలుపెట్టారు . అదే శాఖలో ఉన్న జర్మన్ దంపతులు జీమెన్స్ గార్లతో పరిచయం అయి , వారి ప్రోత్సాహంతో ఉస్మానియాలో లెక్చరర్ ఉద్యోగానికి ఓ సంవత్సరం పాటు వేతనం లేని సెలవు పెట్టి జర్మనీ వెళ్లారు . ఆ సంవత్సరం మా ఇద్దరు చెల్లెళ్ళనీ , తమ్ముళ్ళనీ ఓ పనివాడినీ మా ఇంట్లో ఉంచుకుని చదువు చెబుతూ ఉండేదాన్ని .

ఇక ఆయన ఇంకొన్నాళ్ళు అక్కడే ఉండాలనుకోవడంతో .. 1965 లో మా బాబుని అమ్మ దగ్గర వదిలి , పాపను మాత్రం తీసుకుని మొదటిసారిగా మ్యూనిచ్ విమానం ఎక్కాను . అప్పుడు జర్మనీ వెళ్ళడానికి వీసా అవసరం లేకుండేది .

మీ జర్మనీ జీవితం

 ఎలా ఉండేది ? ఎన్నాళ్ళున్నారక్కడ ?

జర్మనీకి వెళ్ళగానే బేసిక్ జర్మనీ నేర్చుకున్నాను . ఏదైనా ఉద్యోగం చేయాలంటే తప్పనిసరిగా జర్మనీ వచ్చి ఉండాలి . అందుకని నైట్ స్కూల్ లో చేరి జర్మనీ నేర్చుకున్నాం . గోపాల్ రెడ్డి గారికి సంస్కృతం బాగా వచ్చును గనుక గ్రామర్ సహితంగా జర్మనీ నేర్చుకోవడం తనకు సులభమైంది . అందువల్ల ఆయనకు ఏ భాషైనా తొందరగా వచ్చేది . నాకూ జర్మనీ నేర్పుతూండేవారు . నేనక్కడ ఒక లైబ్రరీలో ఉద్యోగం చేశాను . ఆ సమయంలో చాలా ఇంగ్లీష్ , జర్మన్ , సంస్కృతం పుస్తకాలు చదివాను .

మాకు అక్కడ ఏ వార్తలూ తెలిసేవి కాదు . అప్పుడు టీవీలూ లేవు . ఎప్పుడన్నా ఓ సినిమా చూసేవాళ్ళం .ఇండియా నుండి అప్పుడప్పుడూ ఉత్తరాలు వచ్చేవి అంతే ! మా సమయంలో ఎక్కువ భాగం పఠనం , పరిశోధనకే వినియోగించే వాళ్ళం . అవన్నీ నోట్స్ గా రాశాను . తిరిగి 1969 లో ఇండియా వచ్చేసాం .

ఇండియా వచ్చాక ఏం చేశారు ? రాగానే మళ్ళీ ఉద్యోగం చేయాలన్పించిందా ? విశ్రాంతిగా ఉండాలనుకున్నా

రా?

మాకు ఇక్కడికి వచ్చేదాకా తెలియదు గానీ , మేమొచ్చిన సమయానికి ప్రత్యేక  తెలంగాణా ఉద్యమం తీవ్రంగా జరుగుతున్నది . బళ్ళు , కాలేజీలు ఏవీ నడవడం లేదు . ఇక కరీంనగర్ జిల్లా పొతకపల్లి దగ్గర మా ఇంటి పరిస్థితులూ ఏమంత బాగా లేవు . మేము జర్మనీ వెళ్తూ వ్యవసాయం చూసుకోమని మా దగ్గరి బంధువుకు అప్పజెప్పి వెళితే ఆయన మొత్తo అప్పులు చేసి నానా గందరగోళం చేసి పెట్టాడు . ఒక సంవత్సరం పాటు ఊళ్ళోనే ఉండి , ఆ సమస్యలన్నీ తీర్చుకుని మళ్ళీ హైదరాబాద్ చేరాం .

అప్పట్లో జర్మనీకీ , ఇక్కడికీ తేడా ఎలా ఉండేది ? ఎందుకొచ్చాంరా అనిపించిందా ?

అట్లా ఏమీ అనుకోలేదుగానీ , తేడా మటుకు చాలా ఉండేది . ఎక్కడ జర్మనీ .. ఎక్కడ ఇండియా ! మనం ఆ స్థాయికి ఎప్పుడు వస్తామో అనిపించేది . ముఖ్యంగా మన దగ్గర అపరిశుభ్రత చాలా ఎక్కువ . చాలా మందికి విద్య అందుబాటులో లేదే అనిపించేది .

జర్మనీ లో అప్పటికే ప్రతిదీ ‘ రెడీ టూ కుక్ ‘ లాగా దొరికేది . ఉదాహరణకు అక్కడ చికెన్ రెడీమేడ్ గా దొరికితే ఇక్కడ కో

డిని కొనాలి , బూరు తీసి కొయ్యాలి , అప్పుడు గానీ వండుకోలేము . బోలెడు సమయం దానికే పోయేది . మేము యూనివర్సిటీ క్వార్టర్స్ దగ్గర ఉండేవాళ్ళం . కనీసం కోడి గుడ్లు కావాలంటే సుల్తాన్ బజార్ నుండి రాంకోఠి మధ్యలో ఓ షాప్ లో మాత్రమే దొరికేవి . అప్పటికి వంట గ్యాస్ సౌకర్యం వచ్చింది గానీ , కూపన్ సిస్టం .. దానికి పెద్ద క్యూలో నిలబడాల్సి ఉండేది . ప్రతిదానికీ కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు ఉండేది .

ఇప్పుడు విదేశాలకు వెళ్లేవాళ్లకూ , యాభై అయిదేళ్ల క్రిందట వెళ్లిన మీకూ ముఖ్యమైన తేడా ఏమిటి ?

మేము డబ్బు సంపాదించుకోవడానికి వెళ్ళలేదు . మా వారికి కొత్త భాషలు నేర్చుకోవడం పట్ల ఉన్న ఆసక్తి , ఇతర భాషల సాహిత్యం , సంస్కృతీ అధ్యయనం చేయాలన్న తృష్ణ .. ఈ రెంటి వల్లనే యూనివర్సిటీలో జీతం, సీనియారిటీ నష్టపోయి కూడా జర్మనీ వెళ్ళాం తప్పితే మరొకటి కాదు . తిరిగి వచ్చాక కూడా మేమిద్దరం ఉద్యోగాలు చేస్తే తప్ప వీలు కాని పరిస్థితులే ఉండేవి .

ఇక ఇప్పుడు వెళ్ళేవాళ్ళు  ఉన్నత విద్య కోసమో , పరిశోధనల కోసమో , ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేకనో , మెరుగైన

జీవితం కోసమో , కేవలం డబ్బు కోసమో .. ఇలా ఎవరి కారణాలు వారికి ఉండొచ్చు .

మీరు యూనివర్సిటీ ఉద్యోగం కొరకు ప్రయత్నించలేదా ?

ఎమ్మే లో కాలేజీ వాళ్ళు పొరపాటుగా నా ఇంటర్నల్ మార్కులు యూనివర్సిటీ వారికి పంపలేదు .అందుకని నాకు పీజీ లో హయ్యర్ థర్డ్ క్లాస్ వచ్చింది . అందులో నా పొరపాటు ఏ మాత్రం లేకపోయినా ఫలితం నేను భరించాల్సి వచ్చింది . అలా యూనివర్సిటీ జాబ్ రాలేదు . 1970 లో మళ్ళీ విద్యాసంస్థలు తెరిచాక కొన్నాళ్ళు తార్నాకా లోని సెయింట్ ఆన్స్ లో పనిచేశాను . 1971 లో ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయి నారాయణ్ గూడా రెడ్డి కాలేజీ లో పార్ట్ టైం లెక్చరర్ గా చేరి , ఆ తరువాత ఫుల్ టైమర్ గా మారాను . 2000 లో రిటైర్ అయ్యేదాకా అక్కడే పని చేశాను . అప్పుడు ఎయిడెడ్ కాలేజీగా ఉండేది , తరువాత అటానమస్ అయింది .

మీకు సాహిత్య సృజన పట్ల మక్కువ ఎలా కల్గింది ?

చిన్నప్పుడు స్కూల్ రోజుల్నుంచీ వివిధ పుస్తకాలు చదవడం అలవాటయిందన్నాను కదా ! ఎమ్మే లో నా సబ్జెక్టు తెలుగు గనుక అలా కూడా బాగా సాహిత్యం చదివాను . ఇక జర్మనీ లో ఉన్నప్పుడు జర్మన్ , ఇంగ్లీష్, సంస్కృతం భాషల్లో గొప్ప గొప్ప వాళ్ళ పుస్తకాలు చదివి వాళ్లెలా రాశారు , వీళ్ళేం చెప్పారు అని క్షుణ్ణంగా పరిశీలించడం , ఆ అధ్యయనాల్ని నోట్స్ గా రాయడం అలవాటయింది . పర్షియన్ , ఈజిప్షియన్  వంటి ప్రాచీన సంప్రదాయ సాహిత్యాన్ని చదవడం , ఆయా రచనల్ని మన తెలుగుతో , సంస్కృతంతో పోల్చడం , రాయడం .. అలా అప్పుడు కలిగిన ఆసక్తి కొనసాగింది .

కాల్పనిక సాహిత్యం .. ముఖ్యంగా స్త్రీలు రాసిన నవలలు పాఠకులను ఉర్రూతలూగిస్తూ , డబ్బు కూడా తెచ్చిపెడుతూన్న రోజుల్లో మీరు పరిశోధనాత్మక ,వాస్తవిక చిత్రణతో కూడిన రచనల్ని ఎంచుకోవడానికి కారణం ఏమిటి ?

ఎందుకో మరి నాకు తెలియకుండానే పరిశోధన , అధ్యయనం అంటే నాకు ఇష్టం ఏర్పడింది . దానికి తోడు జర్మనీ లో సంస్కృత

విభాగం ఇంచార్జిగా ఉన్నప్పుడూ , ఇక్కడికి వచ్చాక యూనివర్సిటీ సంస్కృత శాఖ లోనూ పనిచేసిన మా వారు గోపాల్ రెడ్డి కూడా ఈ విషయంగా చాలా సహకరించారు . ఆయన సహకారమే లేకపోతే వెయ్యి పేజీల ‘ సంస్కృత సాహిత్య చరిత్ర ‘ గ్రంథం రాయడం సాధ్యపడేది కాదు .

అంతే కాకుండా ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు శాఖాధిపతిగా ఉన్న ఆచార్య దివాకర్ల వెంకటావధాని గారి పర్యవేక్షణలో నేను రచించి సమర్పించిన సిద్ధాంత  గ్రంథం ‘ మను -వసు చరిత్రల తులనాత్మక పరిశోధనము ‘ నాకు 1975 లో పీ హెచ్ డీ  తెచ్చిపెట్టడమే కాక పాఠకుల , విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో  నా తరువాతి రచనలు ఆ దిశగానే సాగాయి ..

చాలా పుస్తకాలు  రచించిన మీరు వాటిని ఎలా ప్రచురణ లోకి తీసుకొచ్చారు ? శ్రమతో  బాటూ ఇదంతా ఎంతో ఖరీదైన వ్యవహారం కదా !

అవును . రాయడానికి ఎంత శ్రమైనా పడతాం గానీ , ప్రచురణ కష్టమైన పని . డబ్బుతో కూడుకున్నది కూడా! చాలా పుస్తకాలు నా స్వంత ఖర్చుతో వేసుకున్నవే !అయితే గోపాల్ రెడ్డి గారూ , నేనూ కల్సి రాసిన ‘సంస్కృత సాహిత్య చరిత్ర ‘ గ్రంథాన్ని ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు మొదట 1986 లో ప్రచురించారు . కాగితం ఖర్చుల క్రింద రెండు వేల రూపాయలు మాత్రం ఇచ్చారు . ఆ తరువాత అదే పుస్తకాన్ని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం వాళ్ళు ఏడు సార్లు పునర్ముద్రించారు . ఆఖరి ముద్రణ 2000 కాపీలు తీసారు .

అలాగే 1991 లో ‘ తెలుగు నవల -అనుశీలనం ‘ పుస్తకం తెలుగు విశ్వవిద్యాలయం వారి ఆర్ధిక సహాయంతో ముద్రింపబడింది . శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారిచే 1993 లో ప్రచురింపబడిన ‘ ‘వేమన -నాట సంప్రదాయం ‘ గ్రంథానికి గాను టిటిడి ధర్మ ప్రచార పరిషత్ వారు నాకు కొంత డబ్బు ఇచ్చారు .

ఇక 1975-76  నాటి నా పిహెచ్డీ గ్రంథం ‘ మను -వసు చరిత్రల తులనాత్మక అధ్యయనము ‘ 1981 లో తెలుగు యూనివర్సిటీ వారు అచ్చు వేశారు .అలాగే నేను ఎమ్మే లో రాసుకున్న నోట్స్ ను యధాతథంగా 1982 లో ‘శ్రీనాథుని కవితా సౌందర్యము ‘ పుస్తకంగా వెలువరించాను .అదే విధంగా రెడ్డి విమెన్స్ కాలేజీ లో పని చేస్తున్నప్పుడు ఎమ్మే క్లాస్ కోసం ‘తెలుగు సాహిత్య చరిత్ర ‘ బోధించమన్నారు . అందుకోసం ఎంతో అధ్యయనం చేసి చారిత్రిక , సామాజిక నేపథ్యంలో తెలుగు సాహిత్య చరిత్ర అంశంపై నోట్స్ రాసుకుని విద్యార్థులకు బోధించడం జరిగింది .ఇది 1996 లో పుస్తకంగా వచ్చి 2004 లో పునర్ముద్రణ జరిగింది .

ఎన్నో యూనివర్సిటీలకు నా పుస్తకాల్లోని అధ్యాయాలు పాఠ్యఅంశాలుగా  ఎంపిక చేయబడ్డాయి .యూనివర్సిటీ పరిశోధక విద్యార్థులకూ , పోటీ పరీక్షల వారికీ ఈ పుస్తకాలు ఎంతో ఉపయోగపడ్డాయని సంతోషం కల్గింది .

రసావిష్కరణ అనే మాట సాధారణంగా కావ్య ప్రసక్తి వచ్చినపుడు మాట్లాడుతాం కదా ! మీరు రచించిన ‘ రస చర్చ -ఆధునికత ‘ అనే పుస్తకం గురించి చెప్పండి .

రస చర్చ నిజానికి కావ్య గ్రంథాల విషయంలోనే జరుగుతుంది . కానీ ఆధునిక సాహిత్యంలో కూడా బహు పాత్రలు , ఎక్కువ సందర్భాలు , అనేక సన్నివేశాలు కలిగి ఉండే నవలల విషయంలో రసపుష్టి ఉంటుందని చెప్పే ప్రయత్నం చేశాను .ఈ పుస్తకం 2010 లో వచ్చింది . సాహిత్య ప్రక్రియ వేరు కావచ్చు గానీ , ప్రాచీన కావ్యాలలోలాగానే నవలల్లో కూడా ఒక సమగ్ర జీవితం , లేదా కొన్ని జీవితాలకు సంబంధించిన పూర్తి చిత్రణ , విశ్లేషణ ఉంటాయి . ఒక కవి కావ్యంలో ఏమి చెప్పాడో అదే మాదిరిగా ఒక రచయిత తన నవలలో వర్ణించిన భావాలను పాఠకుడు పూర్తిగా మమేకమై అనుభవించడమే రసావిష్కరణం . ఇది కవితలో , కథలో , నాటకంలో కూడా ఉంటుంది గానీ ,నిడివి దృష్ట్యా  నవలలో ఎక్కువ .

పరిశోధనాత్మక సైద్ధాంతిక రచనలకే పరిమితమైన మీరు కాల్పనిక నవలలు రాయడం ఎప్పుడు ఎలా ప్రారంభించారు ? మీ నవలల గురించి చెబుతారా ?

ముందే చెప్పినట్టు నవలలో సమగ్ర జీవన చిత్రణ ఉంటుంది . అయితే నా నవలలు పూర్తిగా కాల్పనికమైనవి కావు . వాస్తవ జీవితాల ఆధారంగా వ్రాయబడ్డవే . తొలి తెలంగాణా ఉద్యమం , రజాకార్ల ఆగడాలు , ఆ రోజుల్లోని సాంఘిక , ఆర్ధిక జీవన స్థితిగతులు , కొన్ని అనుభవాలు , జ్ఞాపకాలూ … వీటి  నేపథ్యంతో 1990 లో ‘ మలుపు తిరిగిన రథచక్రాలు ‘ నవల రాశాను . దాశరథి రంగాచార్య గారికి చూపిస్తే ‘ ఇట్లాoటి నవలలు ఇప్పుడెవరూ వెయ్యరు , మీరు  స్వంతంగా ప్రచురించుకోవడం మంచిది ‘ అని సలహా ఇచ్చారు . ఆ తరువాత 1994 లో ‘ సంకెళ్లు ‘నవల రాశాను .

స్త్రీ వాదం ఉధృతంగా తలెత్తిన రోజుల్లో మీరు రచించిన ‘ ఆకాశంలో విభజన రేఖల్లేవు ‘ ఏ విధంగా ప్రత్యేకమైనదని భావిస్తారు ?

జ : స్త్రీ పురుషులిద్దరూ సమానమే ! ఏ ఒక్కరు ఇతరుల స్వేచ్ఛను , వ్యక్తిత్వాన్ని కించపరిచి అణగదొక్కాలని చూసినా అది దోపిడీనే అవుతుంది . అయితే , స్త్రీ వాదం స్త్రీలకు మాత్రమే సంబంధించిన విషయం కాదు . స్త్రీ ఆధిక్యత రావాలంటే కూడా సరికాదు .మొత్తం సమాజానికి సంబంధించిన విషయం ఇది . పురుషులు మారితేనే , స్త్రీని తమతో సమాన హక్కులున్న వ్యక్తిగా గుర్తించి , గౌరవిస్తేనే ఆదర్శ సమాజం ఏర్పడుతుంది . మహిళా ఉద్యమాల ఆశ , ఆశయం ఇదే అని చెప్పే ప్రయత్నం చేశాను .

ఆత్మకథ రాయాలని ఎందుకు అనిపించింది ? దాని గురించి చెప్పండి .

జ : నేను పుట్టి పెరిగిన తెలంగాణా వాతావరణం ఇతర తెలుగు ప్రాంతానికి పూర్తిగా భిన్నమైనది . స్వరాజ్య పోరాటం , బీదరికంతో పోరాటం , చదువుకోవడం కోసం పోరాటం ఆ కాలంలోని ఆడపిల్లలందరికీ సమానమే అయినా ఇక్కడ ,  నిజాం పాలన నుండి విముక్తి కోసం పోరాటం అదనం . రజాకార్ల దుశ్చర్యలు , రైతాంగ పోరాటాలు ప్రత్యక్షంగా చూసిన అనుభవం , ఆ తరువాతి రోజుల జ్ఞాపకాలు అందరితో పంచుకోవాలనిపించి ‘ ముసురు ‘ పేరుతో నా ఆత్మకథ రాసి 2010 లో ప్రచురించడం జరిగింది . తెలంగాణా స్త్రీలలో ఆత్మకథ రాసిన తొలి వ్యక్తిని నేనే అని పరిశీలకులు అన్నారు .

మీ ఇతర రచనలన్నీ ప్రచురణకు నోచుకున్నాయా ? ప్రస్తుతం ఏమి రాస్తున్నారు ?

నేను రాసిన  నవలలే కాకుండా , కథలు కూడా సంపుటాలుగా ముద్రించబడ్డాయి . 1998 లో విసుర్రాయి , 2001 లో ‘ మింగుతున్న పట్నం ‘ 2005 లో ‘ వ్యాపార మృగం ‘ 2010 లో ‘ మార్క్స్ పుట్టాలి ‘ 2014 లో ‘ నిత్య కల్లోలం ‘ పుస్తకాలుగా వచ్చాయి .ఇప్పుడయితే ఏమీ రాయడం లేదు .

ప్రస్తుతం దినపత్రికలో సీరియల్ గా వస్తున్న ‘ తెలంగాణా తెలుగు సాహిత్య చరిత్ర ‘ గురించి చెబుతారా ?

ఇది 2015 లోనే రాశాను . నమస్తే తెలంగాణా లో సీరియల్ గా ప్రస్తుతం వేస్తున్నారు . చాలా మంది తెలంగాణా అభిమానులే కాక , పరిశోధక విద్యార్థులు , పోటీ పరీక్షలకు చదివే వారు ఫోన్లు చేసి మెచ్చుకుంటున్నారు . తెలంగాణా గడ్డ మీద ఉద్భవించిన సాహిత్యం చాలా విలువైనది . అయితే ఎక్కువ భాగం గుర్తింపుకు నోచుకోకుండా పోయింది . దానిని వెలికి తీసి వెలుగు లోకి తీసుకు రావాల్సిన అవసరం ఉంది .

ఒక ప్రక్కన పరిశోధన , మరో ప్రక్కన ఉద్యోగం , ఇంకొక ప్రక్కన రచనా వ్యాసంగం , అన్నిటికన్నా ముఖ్యం ఇంటి పని , పిల్లల పెంపకం .. ఇవన్నీ ఎలా సాధ్యపడ్డాయి ?

మొదట్లో మా పాపను కొన్నాళ్ళు , మా బాబును చాలా ఏళ్ళు మా అమ్మే పెంచింది . ఇక నేను ఉద్యోగం చేస్తున్నప్పుడూ , తరువాత కూడా రాములు అన్నతడు మా ఇంట్లో వంట చేయడమే కాదు , పనులన్నీ చేసి పెట్టేవాడు . ఆడవాళ్ల. వ్యాసంగాలన్నీ వంటిల్లు మింగేస్తుంది .ఆ విధంగా రాములు నా  బరువును చాలా మటుకు తగ్గించాడు . అందరికీ ఆ అవకాశం దొరకదు .అందుకే , నా  ఫ్లాట్ పక్కనే  …అతనికి కూడా ఒక ఫ్లాట్ కొనిచ్చాను .

మీరు ఎన్నో దేశాలు పర్యటించారు కదా , యాత్రా రచనలేవైనా చేశారా ?

అవును , జర్మనీ మొదలుకొని ఈజిప్టు , ఇంగ్లాండ్ , స్పెయిన్ , ఇటలీ , జపాన్ , చైనా దేశాలన్నీ తిరిగాను . 2011 లో ‘ అద్భుత చైనా యాత్ర ‘ రచించాను .

 

మీ పిల్లలకు మీ సాహితీ వారసత్వం వచ్చిందా ? పుస్తకాలు చదువుతారా ? రచయితల పిల్లలకు కూడా పుస్తకాలు చదివే అలవాటు లేకపోతే ఇతరులెలా చదువుతారు అన్న మాటతో మీరు ఏకీభవిస్తారా ?

లేదు . మీ మూడు ప్రశ్నలకూ నా సమాధానం ఇదే ! ఒక వృత్తిలో ఉన్నవారి పిల్లలు అదే వృత్తి చేపట్టాలని లేదు . పైగా రచన వృత్తి కాదు , ప్రవృత్తి . ఇక పోతే పుస్తక పఠనం లాంటి అభిరుచులు ఎవరికి వారు పెంపొందించుకోవాలి. ఇప్పటి వేగవంతమైన జీవన విధానంలో డబ్బు సంపాదించడం , అనుభవించడం .. వీటికే జీవితం సరిపోతోంది . ఎవరి పిల్లలయినా ఇంతే ! అయితే పాఠకులు , పుస్తక ప్రేమికులు ఎప్పుడూ ఉంటారు .

సాహిత్యం బతికి బట్ట కట్టాలంటే ఏమి చేయాలి ? వర్ధమాన రచయితలకు , పరిశోధకులకు మీరిచ్చే సందేశం ఏమిటి ?

ప్రస్తుతం ప్రపంచ సాహిత్యంతో పోటీ పడుతూ తెలుగు రచనలు బాగానే వస్తున్నాయి .నవలలు తగ్గినా కవిత్వం , కథలు చాలా వస్తున్నాయి .ఈ మధ్య కాలంలో సాహిత్యంలో కొత్త వాదాలేవీ రాలేదు . అయితే విదేశాల్లోలాగా రచనను వృత్తిగా తీసుకునే పరిస్థితి మన దగ్గర లేదు . ప్రింట్ పత్రికలు మూతబడుతున్నాయి. ఆన్ లైన్ వెబ్ మ్యాగజైన్లు వస్తున్నాయి . ఎలాంటి రెమ్యూనరేషన్ లభించడం లేదు. ఒకప్పుడు పత్రికలు ఆడవాళ్లే ఎక్కువగా చదివేవారు . వాళ్లంతా ఇప్పుడు టీవీ సీరియల్స్ కీ , రకరకాల గేమ్ షో లకీ అలవాటు పడ్డారు . అయితే నిరాశపడవల్సిందేమీ లేదు . చదివేవాళ్లే చదువుతారు .

మన విద్యావిధానం సరిగా లేదు . నిరుద్యోగం ఎక్కువగా ఉంది . ఉపాధి లేనపుడు పుస్తకాలేం కొంటారు , ఏం రాస్తారు ? పాఠశాల , కళాశాల స్థాయిలోనే సాహిత్యానికి కొంత ప్రోత్సాహం ఉండాలి . సెలవుల ముందు కొన్ని పుస్తకాలు కేటాయించి సెలవుల్లో చదవమని స్కూల్స్ తెరిచాక వాటిపై వ్యాసరచన , ఉపన్యాస , చర్చ , క్విజ్ లాంటి పరీక్షలు పెట్టి వాటికి కొన్ని మార్కులు కేటాయించాలి . అప్పుడే పిల్లలకు సాహిత్యంతో పరిచయం ఏర్పడుతుంది .

రచనలు చేయాలనుకునే వారు ముందు బాగా చదవాలి . ఏమీ చదవకుండానే రాయాలనుకోకూడదు . వివిధ రచనా ప్రక్రియల్ని అర్థం చేసుకోవాలి . నిఘంటువులను చూడాలి . దానివల్ల భాషాసంపత్తి పెరుగుతుంది . చాలా మంది ఇవేవీ చేయడం లేదు . తప్పులతో రాస్తున్నారు .  తప్పు పదప్రయోగాలు చేస్తున్నారు . తప్పు ఉపమానాలు వాడుతున్నారు . ఇక యూనివర్సిటీ వాళ్ళు కూడా సరిగా అధ్యయనం చేయడం లేదు . ముందు వాళ్ళు రాసిన వాటిల్లోంచి అందులోంచి కొంత .. ఇందులోంచి కొంత ముక్కలు తెచ్చి పేర్చి వ్యాసాలూ , పుస్తకాలూ రాసేస్తున్నారు . ఈ ధోరణి మారాలి . అప్పుడే తెలుగు సాహిత్యం నిలబడుతుంది .

 

You may also like

1 comment

Penugonda Sarasija November 23, 2021 - 12:58 pm

Excellent interview..bold n true person..hatts off to madam mother n ramulu..

Reply

Leave a Comment