పుస్తక సమీక్ష: తెలంగానా యశోధరులు (వ్యాస సంకలనం),
రచయిత్రి: డా.నమీలకొండ సునీత, కామారెడ్డి, చరవాణి: 9908468171.
పేజీలు:180.
డా. నమిలకొంద సునీత పరిశోధక వ్యాస సంకలనం,
తెలంగాణ యశోధరులు- ఒక పరిశీలన
——+++++———
సమాజ హితాన్ని కోరేది సాహిత్యం. సాహిత్య సృజనకు లోతైన సామాజిక, సాహిత్య, తాత్విక అధ్యయనం మిళితమైతే బంగారానికి పరిమళం అబ్బినట్లుగా ఉంటుంది. మానవ జీవితంలోని వివిధ రంగాలు , సాహిత్యంలోని వైవిధ్య పరిణామాలను, వివిధ ప్రక్రియలను సునిశితంగా పరిశీలించి, తగిన వ్యాఖనాలతో ఎప్పటికప్పుడు రచయితలు వర్తమాన సాహితీ ప్రపంచానికి అందించాలి . నాటినుండీ నేటి వరకూ సమాజంలోని మార్పులను, లోటుపాట్లను ఎత్తి చూపి సంస్కరించడానికి ఎందరో మహానుభావులు, తత్వవేత్తలు, విద్యావేత్తలు, సామాజిక ఉద్యమకారులు, నాటి కాలపు రాజులు, ఈ నాటి ప్రజాస్వామ్య వాదులు, అభ్యుదయ మహిళలు, ప్రజా ప్రతినిధులంతా కృషి చేశారు. చేస్తూనే ఉన్నారు. తెలంగాణలోని వివిధ పార్శ్వాలలో రాణించిన మహామహులెందరో ఉన్నారు. నిస్వార్థ సేవాపరాయణుల జీవితాలను, ప్రతిభా సామర్థ్యాలను తెలుసు కోవడానికి, భావి తరాలకు అందించడానికి సాహిత్యం ఒక ఉపకరణంలా పని చేస్తుంది. అందులో భాగంగా అలాంటి ప్రతిభా సంపన్నుల గొప్ప కృషిని, వారి జీవిత అనుభవాలను, వారి రచనలను విశ్లేషణ చేయడంలో ఆరితేరిన వారిలో డా.నమిలకొండ సునీత గారు ఒకరు. తెలంగాణ సాహిత్య పునర్నిర్మాణాన్ని చేయాల్సిన బాధ్యత డా.సునీత లాంటి వర్తమాన రచయితలపై ఉంది. సమాజము-సాహిత్యము రెండూ పెన వేసుకొని పోయి సమాజాన్ని సంస్కరించడంలో ప్రధాన పాత్రను పోషిస్తున్నది. ఎంతోమంది ప్రాచీన సాహిత్య కారులు వర్తమాన సాహిత్యకారులు, భక్త శిఖామణులు, సమాజ హితం కోసం రచనలు చేస్తూ ఉద్యమాలు సాగిస్తూ తమవంతు పాత్రను పోషించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేములవాడ వాస్తవ్యురాలైన సాహితీవేత్త డాక్టర్ నమిలకొండ సునీత గారు ఇటీవల పరిశోధించి రాసిన తెలంగాణ యశోధరులు వ్యాస సంకలనం ఇందులకు ప్రతీకగా నిలుస్తుంది. ఇందులో ఎందరో మహానుభావులను, పాలకులుగా రాణించిన మహిళా మణుల ప్రతిభా సామర్థ్యాలను, అవధానులపాండిత్య ప్రకర్షను,పద్యకవుల కవన సౌరభాలను, విద్యావేత్తలు, ఆర్షధర్మ, సాహిత్య సామాజిక రంగాలకు చెందిన వరిష్టుల ప్రత్యేకతలను లోతుగా తవ్వి, పరిశోధించి 15 వ్యాసాలుగా రాశారు. ఈ వ్యాసాలు మేలిమి బంగారంలా తయారవడానికి రచయిత్రి చేసిన నేపథ్య కృషి, లోతైన అధ్యయనం అపారమైనది. శ్రీ విద్యో పాసకులు సద్గురు శివానందనాథ, ప్రముఖ సాహితీవేత్తలు ఆచార్య ఎస్వీ. రామారావు, డా. టి .శ్రీరంగ స్వామి, డా. అయాచితం నటేశ్వర శర్మ లు.ముందు మాటలు రాసి, రచయిత్రిని అభినందించారు.
డా.సునీత ఈ వ్యాసాలకు సాహిత్య, సామాజిక వ్యాసాలుగా పేర్కొని తన కలాన్ని పదునెక్కించారు. రచయిత్రి తొలుతగా 2016లో ప్రభాత కిరణాలు అనే వ్యాస సంపుటితో సాహిత్య వ్యాసాలు వెలుగులోకి తెచ్చారు. నిత్య పరిశోధనలతో తన రచనా వ్యాసంగాలను కొనసాగిస్తూ, పత్రికలకు, ప్రత్యేక సంచికలు రాస్తూ తన సాహితీ ప్రావీణ్యాన్ని చాటు కొంటున్నారు. వీరు తెలుగు. ఎం. ఎ చేసి, ఎంఫిల్, పి. హెచ్. డి పట్టాలను పొందారు. వృత్తి రీత్యా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో ప్రభుత్వ తెలుగు అధ్యాపకురాలుగా పనిచేస్తున్నారు.తన సిద్ధాంత అంశమైన వరంగల్ జిల్లా పత్రికలు- సాహితీ సేవ గ్రంథాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ద్వారా పరిశోధించి, సుమారు 300 పేజీలతో అచ్చు వేసి పాఠ కాదరణను పొందారు. రచయిత్రి ఎం. ఫిల్ పరిశోధన గ్రంథం “మూక పంచశతి వ్యాఖ్యానాలు ఒక పరిశీలన” అచ్చులోకి రావాల్సి ఉంది. మూడవ గ్రంథంగా 2022 సంవత్సరంలో తెలంగాణా యశోధరులు పేరిట వ్యాస సంకలనాన్ని అచ్చులోకి తెచ్చారు.
ఇహ వీరి వ్యాసాలు ప్రత్యేకమైన శైలితో, తెలుగుదనంతో అలలారుతాయి. పలు సామెతలు, సంస్కృత శ్లోకాల ఉదాహరణలు, ఉపమాన, ఉపమేయాలు, అలంకారాలు, మాత్రా ఛందస్సు మొదలగు అంశాలతో వ్యాస నడవడిక హృద్యంగా సాగుతుంది. ఈ వ్యాస సంకలనం ప్రచురణకు హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు కొంతమేరకు ఆర్థిక సాయాన్ని అందించారు.
ఇక వీరి వ్యాసాలలోకి వెళ్తే తెలంగాణ సంస్థానాల్లో మహిళల పాత్ర, గద్వాల సంస్థానంలో సాహిత్య సేవ వీరి నిశిత పరిశోధనలకు అద్దం పడతాయి. తెలంగాణ ప్రాంతంలో 14వ శతాబ్దం నుండి 19 శతాబ్దం ఉత్తరార్థం వరకు కుతుబ్ షాహీల నుండి మొగలులు, నైజాం రాజుల పాలనా కింద 14 సంస్థానాలు పాలించాయని ఆమె పేర్కొన్నారు. ఈ సంస్థానాల రాణుల పాలనలో జరిగిన సామాజిక, సాహిత్య రంగాల గూర్చి అధ్యయనం చేసి చక్కటి పరిశోధక వ్యాసాన్ని అందించారు. ఇందులో గద్వాల, వనపర్తి , అమర చింత (ఆత్మకూరు), జటప్రోలు(కొల్లాపూర్), పాపన్నపేట , పాల్వంచ, బొరవెల్లీ , సిర్నా పల్లి, గోపాల పేట, తదితర సంస్థానాల గూర్చి రచయిత్రి చక్కగా చర్చించారు. గద్వాల సంస్థాన మూల పురుషుడు కాకతీయ ప్రతాప రుద్రుని కాలం నాటి గొన బుద్ధారెడ్డి యనిపెద్ద సోమ భూపాలుడని, ఇతనే శోభనాద్రి, సోమనాద్రి గా. పిలువ బడ్డాడని, క్రీ.శ.1663-1735 పేర్కొంటూ,ఇతనే గద్వాల కోట నిర్మాతలని అన్నారు. గద్వాల పాలకులలో శ్రీరామ భూపాలుడు, సీతారామ భూపాలుడు, తర్వాత ఆది లక్ష్మీ దేవమ్మ.దత్త పుత్రుడు కృష్ణ రాం భూపాలుడు ముఖ్యులను. పేర్కొన్నారు. ఇందులో భాగంగా అనేకమంది సాహిత్యకారులు ఈ సంస్థానాలలో కవులుగా రాణించి పలు గ్రంథాలు రాసినట్లు ఆమె పేర్కొన్నారు.ఈ సంస్థానాలలో కవులకు, పండితులకు ముఖ్యంగా పద్య కవులకు, సాహిత్యకారులకు చక్కటి ఆదరణ లభించిందనట్లు తెలిపారు.గద్వాల ప్రభువు పెద్ద సోమ భూపాలుడు స్వయంగా కవి, జయ దేవుని గీత గోవిందాన్ని తెలుగు సేత చేశారని రాశారు. గద్వాల ప్రభువుల కాలంలోనే కవి, పండితులు , అవధానులైన తిరుపతి వెంకట కవులు, మరియు రామ భూపాలుడు కాలంలో, శ్రీపాద కృష్ణమూర్తి వంటి ఉద్దండులైన కవులు ఈ సంస్థానాలకు విచ్చేసి సన్మానింపబడ్డారని పేర్కొన్నారు. ఇందులో భాగంగా వివిధ సంస్థానాధీ శులైన మహిళలు అందించిన చక్కటి పరిపాలనను, సాహిత్య సేవలను ఈ వ్యాసంలో రచయిత్రి సోదాహరణంగా వివరించారు. తెలంగాణ సంస్థానాలలో మహిళలు రాచరికం చేశారని చక్కటి పరిపాలనను అందించారని ఎంతోమంది కవులను ఆదరించారని ఆమె విపులంగా పేర్కొన్నారు. వివిధ సంస్థానాలలోని రాణుల గూర్చి రాశారు . అమ్మక్కమ్మ లింగమ్మ, మంగమ్మ, చొక్కమ్మ , వెంకట లక్ష్మమ్మ, ఆది లక్ష్మీదేవి, సరళాదేవి, భాగ్యలక్ష్మమ్మ వెంకటరత్నమాంబ, రాణి శంకరమ్మ, మల్లమ్మ , ఎల్లమ్మ లచ్చవ్వ దొరసాని, లక్ష్మీనరసాయమ్మ , గిరియమ్మ , చీలం జానకి బాయి మొదలైన మహిళామణులు సంస్థానాలను చక్కగా పరిపాలించారని ఉదాహరించారు.
ప్రముఖ పద్య కవులైన వేముగంటి నరసింహచార్యులు, వారి రచనలపై 26 పేజీలలో సుదీర్ఘ వ్యాసము రాసి, హైలైట్ నిలిచిపోయారు. వేముగంటి వారు మహాభారతంలోని తిక్కన వంటి ఉద్ధoడ పండితులని ఆమె పేర్కొన్నారు. సంస్కృతాంధ్ర భాషలతో పాటు ఉర్దూ భాషలో చక్కటి పాండిత్యాన్ని సంపాదించుకొని అనేక పద్య కృతులను రాసి పండితలోకం మెప్పు పొందారని, మెదక్ జిల్లా రచయితల సంఘం అధ్యక్షునిగా పనిచేసేసమయంలో ఎంతోమంది యువ కవులకు ఆదరువుగా నిలిచి, వారిని ప్రోత్సహించారని పేర్కొన్నారు. ఆధునిక ప్రాచీన కవిత్వాల వారధిగా వేముగంటి వారు రాణించారని పేర్కొన్నారు. వేముగంటి వారి రచనల్లో ఆధ్యాత్మికత ఆత్మీయత, జాతీయత, సామాజిక అంశాలు పుష్కలంగా ఉన్నాయని అందుకే వీరి రచనలు సుప్రసిద్ధమయ్యాయని ఆమె పేర్కొన్నారు. పాఠశాలల్లో , విశ్వవిద్యాలయాల్లో వీరి రచనలు పాఠ్యాంశాలుగా తీసుకున్నారని ఆమె పేర్కొన్నారు. వేముగంటి వారు బెజవాడ గోపాలరెడ్డి , డా.బోయి భీమన్న, దాశరథి కృష్ణమాచార్యులు, దేవులపల్లి రామానుజారావు, డాక్టర్ సినారె, పేర్వారం జగన్నాథం గడియారం రామకృష్ణ శర్మ వంటి ప్రముఖులు సమకాలీనలుగా ఉన్నారని, వారి సహచర్యంతో విశిష్టమైన రచనలు చేసి వాసికెక్కి నట్లు తెలిపారు . వేముగంటి కృతులు ప్రబోధము, భాష్పాంజలి, అమరజీవి, బాపూజీ, కవితాంజలి, తిక్కన, వీర పూజ, మంజీర నాదాలు, శ్రీ వెంకటేశ్వర ఉదాహరణము , గణేశ ఉదాహరణము, ఆంధ్ర విష్ణువు, భక్త రామదాసు, శ్రీ వాసవీ సరస్వతి వైభవము భావాంజలి, వ్యాసకలాపము, అక్షర దీపాలు, పురుషకారము, మేలుకొలుపు, శ్రీ వివేక విజయము, అమృత వర్షిని, ప్రియదర్శిని, సువర్ణ సుమాంజలి, శ్రీహరి చరణస్మరణ గీతి, శ్రీకృష్ణ లీలామృతం , శ్రీరామ పద్యమాలికా స్తోత్రము,పంచాష్టకములు, తదితర కృతులపై విశ్లేషించారు. ఒకరకంగా చెప్పాలంటే వేముగంటి పద్య కృతులన్నిటిని సాకల్యంగా పరిశీలించి చక్కటి వ్యాసాన్ని పరిశోధకులకు కరదీపికగా, పాఠకాదరణకు పాత్ర మయ్యేలా అందించారు. వేముగంటి జీవితము, సాహిత్యం పై ఒకటి రెండు పరిశోధనలు విశ్వవిద్యాలయాలలో జరిగాయని, అవి సరిపోవని ఆమె పేర్కొన్నారు. వీరి రచనలపై రచనలపై విడివిడిగా విశ్వవిద్యాలయాలలో పరిశోధనలు జరగాల్సిన అవసరాన్ని ఆమె నొక్కి చెబుతూ చర్చించారు.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం ఆస్థాన కవి, పద్యకవి అయిన స్వర్గీయ మామిడిపల్లి సాంబ కవి గారు మరుగున పడిన మహాకవుల జాబితాలో చేరినా, వీరి రచనలను వెలికి తీసుకొని రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వీరి రచనలు ముఖ్యంగా వారి సామాజిక కృతులపై వివరంగా విశ్లేషించారు. 19వ శతాబ్దంలో పద్య కవిగా ద్విపద రామాయణం , రాజేశ్వర సుప్రభాతం వంటి రచనలతో పాటు బుర్రకథలు యక్షగానాలు, నాటకాలు హరికథలు రాసిన కవిగా వీరు సుప్రసిద్ధులని ఆమె తెలియజేశారు . సాంబకవి గారిని డాక్టర్ సినారె వంటి మహాకవి గురుతుల్యులుగా భావించారని పేర్కొన్నారు. భక్తి ప్రధానమైన రచనలతో పాటు దేశభక్తి జాతీయత మానవతావాదం సమాజ శ్రేయస్సు వీరి రచనల్లో నిండుగా కనిపిస్తాయని ఆమె పేర్కొన్నారు. వీరు పద్య కృతులైన లోభ సంహారము,ముక్తాహారము, మహాదేవరశతకము, జయశ్రీ, మధురఝంకా కరములు, రాజేశ్వర తారావళి వంటి వాటితో పాటు నదులపేరిట వెలువరించిన ఖండకావ్యాలు వీరి రచనా వైదుష్యానికి ప్రతీకలుగా నిలిచాయనీ, ప్రాచీన ఆధునిక సాంప్రదాయాలతో వీరి రచనలు భాషించాయని ఆమె పేర్కొన్నారు. ముక్తాహారము, కుంజ విహారం, లోభ సంహారము, జయశ్రీ పద్య కృతులను విపులంగా చర్చించారు. కుంజవిహారము పద్య కృతి కి నామౌచిత్యము పాటించారని, రాధా మాధవుల ప్రణయ వృత్తాంతాన్ని ప్రధానంగా తీసుకొని 40 పద్యాలతో కావ్యంగా మలిచారని ఆమె పేర్కొన్నారు. సాంబకవి అవధానాలతో తిగుళ్ళ శ్రీహరిశర్మ వంటి అవధానులు వెలుగులోకి రావడానికి స్ఫూర్తినిచ్చారని ఆమె పేర్కొన్నారు. సాంబకవి సాహిత్యం, పద్య కృతులపై చక్కటి పరిశోధన చేసిన శ్రీమతి డా.ఇట్టేడు విష్ణు వందనా దేవి అభినందనీయురాలన్నారు. ఆర్ష కవి దోర్బల విశ్వనాథ శర్మ పద్య కవిత్వం గురించి, వివిధ దైవతాలపై ఆయన రాసిన ఆధ్యాత్మిక గ్రంథాలను చక్కగా విశ్లేషిస్తూ పరిచయం గావించారు.
మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు గారి సాహిత్యము, వారి ఉన్నత వ్యక్తిత్వం గూర్చి పరిపాలన దక్షతల గూర్చి రాసిన వ్యాసంలో పలు విషయాలు చర్చించారు. పీవీ గారు శ్రీ రామానంద తీర్థ , బూర్గుల రామకృష్ణారావు తదితరుల స్ఫూర్తితో స్వాతంత్ర ఉద్యమంలో చైతన్య శీలిగా వ్యవహరించారని, రాజకీయ పదవుల్లో రాణిస్తూనే, మరో పక్కన సాహితీ రచనా వ్యాసంగాలను, సాహితీ గ్రంథాధ్యయనాలను కొనసాగించారని పేర్కొన్నారు. వీరు నైజాం విముక్తి కాలంలో రాసిన గొల్ల రామవ్వ కథ లో అప్పటి తెలంగాణ జీవభాష పదాలను ప్రయోగించారని ,వరంగల్ లో సదాశివరావు గారితో కలసి కాకతీయ పత్రికకు సారథ్యము వహించి, పాత్రికేయునిగా వ్యవహరిస్తూనే వీరు వివిధ పేర్లతో నాలుగు కథలను రాసినట్లుగా పేర్కొన్నారు. విశ్వనాథ రాసిన వేయి పడగలను సహస్ర ఫణి భూషణ్ పేరున హిందీలో అనువదించి బహు భాషావేత్తగా ప్రసిద్ధిగాంచారని పేర్కొన్నారు. వీరు “లోపలి మనిషి” పేరిట ఆత్మకథను రాసుకున్నారని ఇందులో తన స్వీయ అనుభవాలను ఆనంద్ పాత్ర ద్వారా వ్యక్తీకరించారని అన్నారు.
కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన వివిధ రచనలు ముఖ్యంగా ఏకవీర, వేయి పడగలు నవలలను విశ్లేషణాత్మకంగా చర్చించారు.ఏకవీర నవలా నేపథ్యాన్ని చక్కగా వివరించారు. తెలుస్తుంది ఈవ్యాసం రచయిత్రి రచనా కౌశలానికి దృష్టంతంగా నిలుస్తుంది. తెలంగాణలోని పద్య కవిత్వ వైభవంతోపాటు అవధాన రంగంలో ప్రముఖులైన కవుల మూర్తీభవించిన అవధాన వైభవాన్ని తెలంగాణ అవధాన వైభవము అన్న శీర్షికన చర్చించారు. వేములవాడకు చెందిన ప్రముఖ కవి వేదాంతం కాశీనాథం గారి పద్య రచనల గూర్చి, వారి గొడగూచి పద్య కృతి విశిష్టత గూర్చి కాశీనాథుని కావ్యానుశీలనము అనే శీర్షికన విపులంగా విశ్లేషించారు . వేములవాడ శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర పురా వైభవం, ప్రాశస్త్యం గూర్చి చక్కగా పరిశోధించి రాశారు. మహాభారతంలోని వివిధ జానపద పాత్రలు, జానపద గేయాలు, జానపదుల నోళ్ళల్లో నానిన పాటల గూర్చి రసవత్తరంగా రాశారు. ‘మహాభారత పాత్రలు జానపద ప్రతీకలు’ అనే శీర్షికన రాసినఈ వ్యాసం పురాణేతిహాసాల పట్ల వారికి గల అవగాహనను వ్యక్తం చేస్తుంది. జానపద సాహిత్యంలో మహాభారత పాత్రలు ఏ రకంగా ప్రచారంలో ఉన్నాయో ఆమె ఈ వ్యాసం ద్వారా విప్పి చెప్పారు. రైతులు వ్యవసాయంలో ఉన్నప్పుడు వర్షాల వల్ల పిడుగుపాటుకు గురికాకుండా ఉండటానికి పాండవ మధ్యముడైన అర్జునుని తలుచుకుంటారు. ఆంధ్ర తమిళ ప్రాంతాల్లో వ్యవసాయ భూముల్లో ఐదు రాళ్ళను పెట్టి గుడులుగా భావించి పంచపాండవులని పూజిస్తారనే పలు విశేషాలను రచయిత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. గిరిజనుల్లో ఒక తెగ అయిన గోండులు పొలాల్లో విత్తనాలు చల్లే ముందు భీమసేనుని అర్చిస్తారని ఆమె పేర్కొన్నారు. మహాభారతంలోని ఏకలవ్యుడు సూతుడు విశ్వరూపుడు, ఘటోత్కచుడు, ఇరావంతుడు పాత్రల గూర్చి, సుభద్ర సారె, ధర్మరాజు జూదము, ద్రౌపది మాటలు.. తదితర అంశాలపై వచ్చిన జానపద గేయాలు గూర్చి చక్కగా చర్చించారు. తాళ్లపాక తిమ్మక్క రాసిన సుభద్ర కళ్యాణము ఆధారంగా వచ్చిన జానపద గేయాల గూర్చి చక్కగా చర్చించారు.
అవిభక్త నిజామాబాద్ జిల్లా నవలా సాహిత్యం పై చక్కటి సుదీర్ఘ వ్యాసము రాశారు. ఈ ఉమ్మడి జిల్లా తొలినాళ్ల నుండే నవలా సాహిత్యంలో కీలకపాత్రను పోషించి మిగతా జిల్లాలకు ఆదర్శంగా నిలిచిందని ఆమె పేర్కొన్నారు. తాను నివసిస్తున్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లానే కాక, పొరుగున ఉన్న మెదక్ జిల్లా సాహిత్య రచనలు, అక్కడి కవుల సృజనలపై ఆమెకు చక్కటి పట్టు ఉంది. ప్రజల మనిషి నవల రాసిన వట్టికోట ఆల్వార్ స్వామి నిజామాబాద్ జిల్లాలో జైలు జీవితం గడిపారని ఇక్కడి నుండే వచ్చిన ప్రసిద్ధ నవలా రచయిత లోకమలహరిగారు, డా. కేశవరెడ్డి, 40 నవలలు రాసిన బొమ్మ హేమా దేవి, మరియు కేవీనాథం, తాళ్ల లక్ష్మీనారాయణ గౌడ్, డాక్టర్ అమృతలత, కంఠo నేని రాధాకృష్ణ, యాటకర్ల మల్లేష్ ,వి.శాంతి, మేడిచర్ల ప్రభాకర్ రావు ,మల్లవరపు చిన్నయ్య, కస్తూరి మురళీకృష్ణ, సిరిగాద శంకర్ ,డాక్టర్ వి. ఆర్ శర్మ ,దారం గంగాధర్, ఎనిశెట్టి శంకర్, శ్రీమతి అయాచితం స్పందన తదితరులు నవలా సాహిత్యంలో వాసిగాంచారని ఆమె పే ర్కొన్నారు. సుమారుగా ఆరేడు దశాబ్దాల నుండి ఇక్కడ నవలా సాహిత్యం వర్ధిల్లుతుందని ఆమె పేర్కొన్నారు. రచయిత్రి తెలంగాణ యశోదరులు పేరిట తెలంగాణలో ప్రసిద్ధులైన వారితో పాటు, వెలుగులోకి రాని మహనీయమనిందరినో వెలుగులోకి తెచ్చే ప్రయత్నం సఫలీకృతమైనది. ఈ పుస్తకం పరిశోధకులకు ఎందరికో దారి దీపంగా నిలుస్తుంది అనడం అతిశయోక్తి కాదు. ఆ బాలగోపాలం చదివి భద్రపరచుకున్నదగిన పుస్తకం మిది. డా.సునీత సాహిత్య వికాసం అధ్యయనం, రచనా వ్యాసంగం తో ముడిపడి తన రచనలను పత్రికలకు పంపుతూ.అచ్చులోకి తేవడం.అభినందనీయం.
-సంకేపల్లి నాగేంద్రశర్మ, రైటర్, కరీంనగర్ .dt 26.6.2023