పురాతనం నుండి అధునాతనం వరకు తెలుగుభాషను ఎందరో మహానుభావులు సుసంపన్నం చేశారు. ప్రతినిత్యం తెలుగు భాషను పరిపుష్టం చేయడానికి మరెందరో మహనీయులు పలు విధాలుగా పాటుపడుతూనే ఉన్నారు. ఇందులో భాగంగా “తెలుగు వ్యాకరణం” మీద ఎన్నో పుస్తకాలను వెలువరిస్తున్నారు. ప్రత్యేకించి పాఠశాల దశ విద్యార్థుల కోసం తేలికపాటి పదాలతో, వ్యాకరణ సూత్రాలను సరళంగా అందించడానికి తెలుగు పండితులు కుంట వేంకటేశం గారు పూనుకోవడం ప్రశంసనీయం. తెలుగు పాఠ్యాంశాల బోధనాభ్యసన ప్రక్రియలో అంతర్భాగంగా వచ్చే భాషా వ్యాకరణాంశాలను, ఛందో అలంకారాలను అలతి అలతి పదాలతో లలితమైన రీతిలో లక్ష్యాలక్షణం చేశారు. కమ్మనైన అమ్మభాషకు మరింత కమ్మదనాన్ని అద్దారనడంలో అతిశయోక్తి లేదు.
తేట తెలుగు భాషకు చెందిన వర్ణములు, అందలి భేదముల వివరణతో “విద్యార్థి వ్యాకరణ కిరణం” భాషా పునాదుల్లోకి ప్రసరించింది. పద విభాగములు, భాషా భాగములు, వాచకములు, వచనములు, విభక్తి ప్రత్యయములను విడమరచి చెప్పిన తీరు తేజోవంతంగా ఉంది. వాక్య భేదములు, విరామ చిహ్నములను సోదాహరణంగా విశ్లేషించిన విధం సహజాతిసహజంగా ఉంది. తెలుగు సంధులు, సంస్కృత సంధుల పరిచయం అరటిపండును ఒలిచి నోట్లో పెట్టినట్టే ఉన్నది. సమాసములు, అలంకారములు, ఛందస్సులను అలవోకగా అభ్యసించేటట్టుగా అక్షరాల ఆసువోశారు.
పెద్దపల్లి జిల్లా, కమాన్ పూర్ మండలం, జూలపల్లి వాస్తవ్యులు కుంట వేంకటేశం గారు. ఆయన పుట్టినూరులోనే 1989లో పాఠశాలను నెలకొల్పి, విద్యాగంధాలను పంచిన విద్యాభిమాని. 2006లో తెలుగు భాషోపాధ్యాయులుగా ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశించారు. ఆ వెనువెంటనే 2008లో తెలుగు భాష సహోపాధ్యాయులుగా ఎంపికవడం ఆయన పట్టుదలకు నిదర్శనం. పిల్లలకు మాతృభాషా మాధుర్యాన్ని పంచుతూ, వారిలో విలువలను జీవన నైపుణ్యాలను పెంచుతున్న ఆదర్శ ఉపాధ్యాయులు కుంట వేంకటేశం గారు. “అనంతవరం మాణిక్యలింగం, శతక సాహిత్యం – పరిశీలన” అనే అంశంపై పరిశోధన చేసి, కాకతీయ విశ్వవిద్యాలయం ద్వారా ఎం.ఫిల్. పట్టాను పొందిన గొప్ప పరిశోధకులు. దశాబ్దాల బోధనానుభవం, పరిశోధనలో పటుత్వం కుంట వేంకటేశం గారి సొంతం. తెలుగు వ్యాకరణం గొట్టు కాదు. తేలికైనది తెలుగు భాష. పిల్లలు తెలుగును సులువుగా నేర్చుకోవచ్చని, ఈ పొత్తం ద్వారా రచయిత నిరూపించారు.
బాల వ్యాకరణ పీఠికలో చిన్నయసూరి స్వయంగా “పెక్కు లక్ష్యములు సావధానముగా పరిశీలించి, రచనా ప్రణాళిక నిర్ణయించుకొని” తానొక లక్షణ గ్రంథమును రచించినట్లు పేర్కొన్నారు. వ్యాకరణం పాఠకుల్లో సాధు, అసాధు శబ్ద వివేకాన్ని కలిగిస్తుంది. భాష యొక్క కీలక స్వరూపాన్ని ఆవిష్కరిస్తుంది. కవి ప్రయుక్తములైన శబ్దాలకే లక్షణం చేస్తుంది. లక్ష్యం లేకుండా లక్షణం పుట్టుట అసంభవం కదా! కాబట్టి వ్యాకరణం ప్రయోగశరణమైనది. విద్యార్థులు భాషను సులువుగా నేర్చుకోవడానికి వ్యాకరణం దోహదపడుతుంది. విద్యార్థులు పరీక్షలలో మంచి మార్కులు సాధించడానికి, వ్యాకరణ అధ్యయనం తోడ్పడుతుంది. పిల్లలు ఉత్తమ పాఠకులుగా, లేఖకులుగా ఎదగడానికి ఈ చిరు పొత్తం చంద్రునికో నూలు పోగులాగా సహకరిస్తుందని భావిస్తున్నాను.
ఈ పుస్తకంలో రచయిత కుంట వెంకటేశం గారు తనకున్న భాషా పరిజ్ఞానంతో, బోధనానుభవసారంతో, ఎన్నో విషయాలను సముచిత వివరణలతో, చక్కని ఉదాహరణలతో తెలియజేశారు. దీనిప్రతి ప్రతి పాఠశాల గ్రంథాలయంలో ఉండదగినది. బడిపిల్లలందరికీ అందుబాటులోకి తీసుకురాదగినది. ఉపాధ్యాయులు ప్రత్యేకమైన చొరవ తీసుకొని, విద్యార్థులకు చేరువ చేయాల్సిన అవసరముంది. తెలుగు వ్యాకరణాన్ని సులభరీతిలో, బొత్తిగా వివరంగా, విపులంగా విడమరచి చెప్పిన ఈ గ్రంథాన్ని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. విద్యార్థుల మదిలో చెరగని ముద్రవేసే విధంగా ఈ పుస్తకాన్ని రూపొందించారు. తెలుగుభాషా బోధకులకు ఆదర్శప్రాయుడిగా నిలిచిన కుంట వేంకటేశం గారికి హృదయ పూర్వకమైన అభినందనలు, శుభాకాంక్షలు. ఇలాంటి మరెన్నో పుస్తకాలు ఆయన కలం నుండి జాలువారాలని ఆకాంక్షిస్తూ…
సెలవిప్పటికీ… స్నేహమెప్పటికీ…