Home పుస్త‌క స‌మీక్ష‌ నవకవులకు కరదీపిక-‘దాస్యం దిక్సూచి’

నవకవులకు కరదీపిక-‘దాస్యం దిక్సూచి’

by Burra Vijayalaxmi Nagraj

హృదయ స్పందనకి, మస్తిష్కపు మథనానికి వెల్లువైసాగే భావోద్వేగాల పరంపరకి అక్షరరూపమే కవిత్వం.అయితే… రాసేది అంతా కవిత్వమేనా? కవిత్వం రాయాలని సంకల్పించిన ప్రతి మదిని తొలిచే ప్రశ్న….

తుప్పల్ తెప్పల్ మాటల్ రాల్చి కవిత్వమని మొరాయించకు
కవిత్వాన్ని వంచించకు
వచనమై సోలిపోతావ్

అంటారు ప్రముఖ కవి త్రిపురనేని శ్రీనివాస్ గారు తమ రహస్యోద్యమం గ్రంథంలో.

మరి పది కాలాల పాటు సాహితీ ప్రపంచంలో నిలిచి పోవాలి అంటే ఏ విధంగా కవిత్వం రాయాలి? కవిత్వం రాయాలి అని నిర్ణయించుకున్న ప్రతి కవి మదిలో మెదిలే ఆలోచనలు ఇవి. ఏం చేయాలి ?ఎలా రాయాలి రాసేదంతా కవిత్వమేనా? అంటూ ఎన్నో సందేహాలతో సతమతమవుతూ వుంటారు. అలాంటి నవ కవులకు కరదీపిక లాంటిది దాస్యం సేనాధిపతి గారు రచించిన దిక్సూచి .

కథ, కవిత్వం, సమీక్షకులుగా, విమర్శకులుగా …అంశం ఏదైనా ఆధునిక సాహితీ ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు దాస్యం సేనాధిపతి గారు. వారు ఇప్పటికే వివిధ ప్రక్రియల్లో 14 అమూల్యమైన గ్రంధాలను వెలువరించారు. వారి కలం నుండి వెలువడిన పదిహేనవ గ్రంథం ఇది. సీనియర్ కవి ,రచయిత శ్రీ దాస్యం లక్ష్మయ్య గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న నేటికవిత అంతర్జాల సమూహంలో సలహాదారులుగా ఉంటూ… 80 వారాలపాటు నిర్విఘ్నంగా దాస్యం సేనాధిపతి గారు “మనలో మనం” శీర్షిక పేరుతో నిర్వహించిన కవిత్వ కార్యశాలకు అక్షర రూపం… అందులో నుండి మరింత మంది కొత్త కవులకు ఉపయుక్తంగా ఉండే విధంగా వ్యాసాల రూపంలో అందించబడిన మార్గదర్శి …ఈ “దిక్సూచి”.

ఈ గ్రంథంలో కవిత్వమంటే ఉబుసుపోక చేసే వ్యాపారమో… కాలక్షేప వ్యాపకమో కాదు… కవిత్వమంటే కవి చేసే సామాజిక చింతనకు కళారూపం ,సామాజిక పరిస్థితుల మీద కవి ప్రకటించే తీర్పు కవిత్వం అని ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారి వాక్యాలను సందర్భోచితంగా దాస్యం గారు ఉదహరించిన తీరు బాగుంది.

ఉత్తమ కవిత్వానికి ఉండవలసిన లక్షణాలను గురించి చెబుతూ… మంచి భావన, హత్తుకునే భాష, మనసును మురిపించే శిల్పం… మూడింటి మేళవింపు మంచి కవిత అని ప్రసిద్ధ కవి డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారి అభిప్రాయాలను ప్రస్తావించారు .కవితా వస్తువుకు కాదేది అనర్హం అని శ్రీశ్రీ గారు అన్నట్లు కవితా వస్తువును ఈ ఎంపిక చేసుకోవడానికి వస్తువు ఏదైనా సరే…కవితా వస్తువు ఎంపికలో వైవిధ్యం చూపాలని , సమకాలీన అంశాలను కవితా వస్తువుగా తీసుకుంటూ… పాఠకుల్లో ఆలోచన పెంచే విధంగా ఉండాలి అంటారు దాస్యం గారు.

కవిత శీర్షిక అంశానికి లోబడి ఉంటూ,ఆసక్తిని పెంచేలా , సూక్ష్మంలో మోక్షం అన్నట్లు శీర్షిక మొత్తం కవితా వస్తువును ప్రతిబింబించేలా ఉండాలి అని అభిప్రాయం వ్యక్తం చేసారు.

ఎత్తుగడ అంటే కవితకు స్వాగత తోరణంలా ఉండాలి …పాటకు పల్లవి ఎంత ముఖ్యమో వచన కవితకు ఎత్తుగడ అంత ముఖ్యం అని… ఎత్తుగడ యొక్క ప్రాముఖ్యతను చాలా చక్కగా వివరించారు. ఎత్తుగడ ఏవిధంగా ఉండాలో విపులంగా చర్చిస్తూ డాక్టర్. రాధేయ గారి రెప్పలు మోయలేని దుఃఖం కవిత లోని ఎత్తుగడ

“నేనీ మధ్యనే
మందహాసాన్ని జారవిడిచుకొని
ప్రశ్నార్ధకాన్ని మోస్తున్నాను”.

ని ఉదహరిస్తూ…ఎంత ఆర్ద్రంగా పాఠకున్ని ఎత్తుగడతో ఆకట్టుకోవచ్చో వివరించారు.

కవిత్వ నిర్వహణ మరియు నిర్మాణ క్రమం గురించి తెలియజేస్తూ ఎంత ప్రయోజనకరమైన వస్తువును ఎంచుకున్నా అది ఎక్కువమంది పాఠకులను చదివించ లేనప్పుడు ఆ రచన వల్ల ప్రయోజనం ఉండదు కాబట్టి కవితకు ఎత్తుగడ ప్రారంభ పంక్తులు ఎంత ముఖ్యమో , నిర్వహణ నిర్మాణ క్రమంలో అభివ్యక్తి విశ్లేషించడానికి వినియోగించబడే భాష, పదబంధాల ప్రయోగంలో ఔచిత్యం మరియు కవితను గాఢంగా మలచడానికి ప్రతీకలు, ఉపమానాలు, వర్ణనలు, పోలికలు విషయంలో కవి అంత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది అని… కవితను అందంగా ,ఆకర్షణీయంగా, ఆలోచనాత్మకంగా, కవితాత్మకంగా గాఢంగా మలచడానికి శిల్పం గురించి చాలా శ్రద్ధ తీసుకోవాలని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

కవిత్వంలో అలంకారాల ప్రయోగం గురించి చెబుతూ మంచి కవితకి అలంకారాలు ఆభరణాలు అని చక్కగా పోల్చారు. ప్రతి అలంకారాన్ని ఉదాహరణలతో విశ్లేషిస్తూ ఒక్కో అలంకారాన్ని విడమర్చి వివరించిన తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా ఉంది.

ప్రముఖ కవి అలిశెట్టి ప్రభాకర్ గారు రాసిన” మరణం నా చివరి చరణం కాదు” అనే కవితలో

మరణం నా చివరి చరణం కాదు
మౌనం నా చితాభస్మం కాదు
మనోహరాకాశంలో విలపించే చంద్రబింబం నా అశ్రు కణం కాదు …
నిర్విరామంగా నిత్య నూతనంగా
కాలం కలం అంచున చిగురించే నెత్తుటి…
ఊహను నేను
కవితలో ఉపమానాలు కవి యొక్క అభ్యుదయ భావాలకు అద్దం పట్టాయి అని చెబుతూ కవితలో ప్రయోగించబడిన ప్రతి పదబంధాలను ఎంతైనా విశ్లేషించుకోవచ్చు అంటారు.

కవి చెప్పదలచుకున్న భావాన్ని స్వీకరించబడిన వస్తూ ఆధారం చేసుకుని ఒక్కో పంక్తిలో ఎన్ని అక్షరాలు ఉండాలో నిర్ణయించుకుంటూ… భావవ్యక్తీకరణకు భావధార ననుసరించి ఒక్కో భావాన్ని ఆయా భాగాల్లో ఆవిష్కరించుకుంటూ భావ గణాలను విభజించుకోవాలన్నారు. కవిత్వం నిర్వహణలో క్లుప్తత గుప్తతకు పెద్దపీట వేస్తూ పునరుక్తి దోషం రాకుండా కవితని ఆకర్షణీయంగా మార్చుకోవాలన్నారు ప్రముఖ కవి కోటం చంద్రశేఖర్ గారు తమ ఇష్టపది కవితా సంపుటి లో సాహిత్య అకాడమీ చైర్మన్ డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారి గురించి రాసిన ఆయన కవితని ఈ అంశానికి ఉదహరించడం సందర్భోచితంగా ఉంది.

ఆయన కంచు
కరిగే మంచు కూడా
ఆయన ఉరుము,చినుకయ్యే మేఘం కూడా

అంటూ రాసిన ప్రతి పాదం ప్రతి పద బంధం లో అద్భుతంగా సిద్ధారెడ్డి గారి మూర్తిమత్వాన్ని సంక్షిప్త పదాలతో క్లుప్తంగా గుప్తంగా ఏ విధంగా రాయాలో నమూనీకరించారు .

కవిత్వం పఠితుల హృదయాలను కదిలించేలా సమాజంలో మృగ్యమై పోతున్న విలువల గురించి ఆవిష్కరించే క్రమంలోవచన కవిత్వ సృజనలో వక్రోక్తి, ఆర్ద్రతలను ప్రతిబింబిస్తూ మనసులను కదిలించేదిగా ఉండాలి. అలాగే కవిత్వం నిర్మాణంలో ధ్వని, ప్రాస, విసురు, లయ, భావలయ, మెటానమీ, ప్రతీకాత్మక అభివ్యక్తిలు కవితను గాఢంగా మార్చడానికి ఉపయోగపడతాయని తెలియజేస్తూ కవయిత్రి కే రాధిక గారు అన్నదాత శీర్షికతో రాసిన కవితలోని చక్కని ఎత్తుగడ ఉదహరించారు.

చినుకమ్మ పలకరించనిదే
నేలమ్మ నవ్వదు…
నేలమ్మ నవ్వనిదే… చిగురాకు వేయదు…
చిగురాకు వేసి… గింజ చేతికి వస్తే గానీ …
రైతన్న కడుపు నిండదు.

అంటూ అలతి అలతి పదాలలో చిక్కనైన భావాన్ని నిక్షిప్తం చేశారు.

ఎంపిక చేసుకున్న కవితా వస్తువును శక్తివంతంగా సంగ్రహంగా ధ్వని యుక్తంగా చెప్పడానికి ఉపకరించే భావచిత్రాల గురించి తెలియజేస్తూ.. ఒక భావ చిత్రాన్ని కవితలో దృశ్యం మానం చేసే క్రమంలో అది అనుభూతిని పెంచే అంశంగా ఉంటూ ..పాఠకులకు ఉత్తేజ పరిచే విధంగా పదబంధాల ప్రయోగం ఉండాలి. ఎందుకంటే భావ చిత్రం కంటికి కనిపించక పోయినప్పటికీ పాఠకుడు తన పంచేంద్రియాల ద్వారా అనుభూతి చెందుతాడు . కవితా వస్తువులు సమర్థంగా అభి వ్యక్తీకరించేందుకు ఔచిత్యమైన ఉపమానాలు వర్ణనలు చేయడానికి భావచిత్రాలు ఎంతగానో ఉపయోగపడతాయి .ఈ అంశాన్ని గురించి విశదీకరించడానికి సినారే మరియు అహ్మద్ ఫైజ్ ,జున్ను లక్ష్మి గార్ల కవిత్వాన్ని ఉదహరణగా తీసుకోవడం సందర్భానికి తగినదిగా ఉంది.

కవిత్వంలో విరామ చిహ్నాలు గురించి తెలియజేస్తూ కవితలో పాదాన్ని ఎక్కడ విరవాలో తెలుసుకోవడం ఒక కవిత్వ నిర్మాణాత్మక కళ. కవితలో ఒక పంక్తి/ వాక్యం/ పాదం అంత మైనప్పుడు ఒక క్షణం విరామం తీసుకుంటాం. తర్వాతి పాదాన్ని చదివే ముందు ఆలోచిస్తాం… కాబట్టి కవితలు పదాన్ని సరైన చోట ముగించడం వల్ల గొప్ప అర్థాన్ని ఇవ్వగలిగిన వాళ్లమవుతాం అంటారు. ఫుల్ స్టాప్, కామ, సెమీ కోలన్, కోలన్ , హైఫన్ ,బ్రాకెట్ వంటి విరామ చిహ్నాలు కవితా పాదాల్లో సరైన విధంగా ఔచిత్యరీతిలో… ప్రయోగించడం వల్ల కవితలు మరింత ప్రభావవంతంగా శక్తివంతంగా మలచవచ్చు అంటారు విరామ చిహ్నాలకు కవితల్లో సముచిత స్థానం కల్పిద్దాం అంటూ సూచించారు ఇలా విరామ చిహ్నాలతో పదబంధాలు బలంగా ప్రయోగిస్తూ… కోటం చంద్రశేఖర్ గారు రాసిన ఒక గులాబి కథ అనే కవితని ఉటంకించారు.

మానవతే మాయం, అత్యంత హేయం
కుళ్ళిన చర్య, దారి మళ్లిన చర్య-
మగాడైతే గర్వమా, మృగాడై కీచకపర్వమా
పదే పదే ఆవిష్కృతం
పదే పదే పునరావృతం
ఇది “అణకువ అణచివేత” లో గాయపడ్డ ఒక గులాబీ కథ
” ఆత్మాభిమానం గుండెకోతలో” రాలిపడ్డ ఒక గులాబీ కథ

అవసరం ఉన్న చోట అవసరమైనవే సందర్భోచితంగా భావ గణం కవితా వస్తువుకు పుష్టిని ఇచ్చే విధంగా చిహ్నాల ప్రయోగం ఉండాలి అని అభిప్రాయపడ్డారు. కవిత్వంలో పదబంధాల ప్రయోగం ఔచిత్యం గురించి వివరిస్తూ…

నిన్ను నువ్వు వెతుక్కోవటం ప్రారంభిస్తే
లోకాన్ని దూషించవు…
జీవితం గుండెల్లో చిత్రశాల నువ్వే…!
దరహాసానివీ నువ్వే!

అంటూ కవి ఏటూరి నాగేంద్రరావు గారు రచించిన చిత్రశాల కవితలోని నర్మగర్భంగా అద్భుత భావాలకు అక్షరాకృతి ఇచ్చిన కవి గారిని ప్రశంసిస్తూ పద బంధ ప్రయోగంలో ఔచిత్యాన్ని పాటించారు అంటారు.

మరొక అంశం “స్వగతం” గురించి ప్రస్తావిస్తూ సాధారణంగా వేదన భరితమైన అంశాలను, నివేదన రూపమైన అంశాలను, అంతరంగం లోని ఆలోచన తరంగాలను వస్తువుగా స్వగతం రూపంలో నిక్షిప్తం చేస్తాము. వీటిని ఆర్తిని జోడించి అభ్యర్థన రూపంలో ఆవిష్కరించవచ్చు లేదా ఆకాంక్షలను అక్షరాల్లో సంబంధిత పదబంధాల్లో జొప్పించవచ్చు. స్వగతంలో కవి నేరుగా వస్తువు పక్షాన నిలిచి తన భావ ప్రకటన చేయడం సహజం. చాలా సందర్భాల్లో మనకు చెట్టు గురించి అంతర్వేదన …ఇల్లు గురించిన స్వగతం…ఇల్లాలి గురించిన అంతరంగం… అమ్మ గురించి, నాన్న గురించి స్వగతాలు చదువుతూ ఉంటాం.స్వగతం గురించి స్వయంగా దాస్యం సేనాధిపతి గారి మొదటి కవితా సంపుటి నుంచి తీసుకున్న ఒక కవితను పరిశీలిస్తే…

ఎవ్వరూ పట్టించుకోరు
పర్యావరణం అంటూ…
పెద్ద పెద్ద మాటలు!
ట్రీ గార్డులో ట్రిమ్ముగా
నేను షోకేస్ బొమ్మను!
మున్ముందు ఫలాలను ఇస్తానని కాబోలు
నాతో ఫోటోగ్రాఫులు
గుక్కెడు నీళ్లే
బుక్కెడు బువ్వ నాకు !
అయినా ఎవడూ
ఓ చుక్క విదల్చడు
పర్యావరణం
ప్రతి వాడికీ ఓ ఫేషన్!
అంటూ ఒక మొక్క యొక్క అంతర్వేదనను ఆర్థ్రంగా ఆవిష్కరించారు.

మనిషి అంతరంగంలో భావ తీవ్రత ఉన్నప్పుడు మాత్రమే కవిత్వం రాయగలడు అయితే వస్తువుని విశ్లేషించే క్రమంలో… వస్తువుని బలంగా వ్యక్తీకరించే సందర్భంలో కవికి ఆసరాగా నిలిచేది… కవిని కవిగా నిలబెట్టేది…భాషే! చక్కని భాషతోనే కవిత్వం నిలబడ గలుగుతుంది. కవిత్వం సృజన చేసే క్రమంలో… కవికి భాష గౌరవాన్ని తెచ్చిపెడుతుంది అంటారు. అంతేకాకుండా కవిత్వ రచనలో ఎక్కడ సంక్లిష్టతకు , సందిగ్ధతకు తావు ఇవ్వకుండా భాషను ప్రయోగించాలనీ… సరళంగా వ్యక్తీకరించినప్పటికీ… అలతి అలతి పదాలను ఎంపిక చేసుకున్నప్పటికీ …కవితాత్మకంగా రాయడం మాత్రం మరువకూడదు. చేతి రాతలోనే కానీ… టైపు లో కానీ అక్షర దోషాలు దొర్లకుండా చూసుకోవాలి అని సూచించారు.

కవిత్వ నిర్మాణం- ముగింపు విషయం గురించి చర్చిస్తూ… కవి ఎంపిక చేసుకున్న కవితా వస్తువును బట్టి ,కవి యొక్క అభివ్యక్తి పటిమను అనుసరించి, కవి యొక్క భాషా సంపత్తిని బట్టి, అన్నింటికీ మించి… కవిత ద్వారా కవి ఏం చెప్పదలచుకున్నాడో దాన్నిబట్టి కవితకు ముగింపు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ముగింపు మరింత కవితాత్మకంగా ఉండాలి .కవిత్వం ముగింపు విషయంలో కవులు మరింత శ్రద్ధ పెట్టి…
కవిత చివరలో అంశాన్ని బట్టి వ్యంగ్యంగా/ ఓ మెరుపు/ఓ చరుపు/ఓ విరుపులతో స్పష్టంగా ముగించాలి అంటారు.

కవిత్వంలో అభ్యుదయ భావాల ప్రకటన, ధిక్కార స్వరం, భావ కవిత్వంలో ప్రణయ సంకీర్తనం, కవిత్వంలో మానవతావాదం…వంటి అంశాలను గురించి కూలంకషంగా సోదాహరణంగా ప్రముఖుల మరియు వర్ధమాన కవులు యొక్క రచనలు తీసుకొని చక్కగా విశ్లేషించారు.

కవిత్వానికి పెద్దబాలశిక్షవంటి ఈ పుస్తకంలో… కవయిత్రి పాటిబండ్ల రజని , కొండేపూడి నిర్మల ,విమల ,వాసా ప్రభావతి , ముక్తేవి భారతి , శైలజా మిత్ర , కె శివారెడ్డి , నన్నపు వెంకట రామి రెడ్డి ,దాస్యం సేనాధిపతి వంటి ప్రముఖులు రాసిన కవితలే కాకుండా… రమాదేవి బాల బోయిన ,అనుశ్రీ ,గోస్కుల శ్రీలత రమేష్ ,రమాదేవి కులకర్ణి ,బండారు సుజాత ,చీదెళ్ళ సీతాలక్ష్మి , లక్ష్మీ మదన్, రంగరాజు పద్మ , ఉదయశ్రీ ప్రభాకర్ , వకుళవాసు ,అరుణ కీర్తి పతాక ,బుర్ర విజయలక్ష్మీనాగరాజ్ , జయంతి సుధాకర్, వేల్ముల జైపాల్ రెడ్డి ,స్వప్నకృష్ణ ,శ్రీదాస్యం లక్ష్మయ్య, కాసర్ల లక్ష్మీ సరోజ రెడ్డి, చిందం సునీత, విజయ దుర్గ, హసీనా బేగం, లింగుట్ల వెంకటేశ్వర్లు, నవీన్ హోతా ,ఆది విజయలక్ష్మి శ్రీనివాస్, భాస్కర బాలభారతి,అప్సర్వలీషా, వెగ్గళం ఉషశ్రీ ,కొమురవెల్లి అంజయ్య, భాను శ్రీ వంటి వర్ధమాన కవుల రచనలు కూడా ఉదహరించడం ముదావహం. పలువురు వర్ధమాన కవుల కవితలను పరిశీలిస్తూ వాటిలోని గుణదోషాలు తెలియజేస్తూ రాయబడిన ఈ గ్రంథం వారిలో ఆత్మ విశ్వాసాన్ని నమ్మకాన్ని పెంపొందిస్తుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

కవిత్వ రచనలోని ప్రతి అంశాన్ని కూడా సోదాహరణంగా వివరిస్తూ… విపులంగా వ్యాఖ్యానిస్తూ… సీనియర్ రచయితల యొక్క కవితలను అంశాలకు అనుగుణంగా ఉటంకిస్తూ …కవిత్వ రచనలో మెలకువలను గురించి దాస్యం సేనాధిపతి గారిచే రచించబడిన ఈ గ్రంథం వర్ధమాన కవులకు కరదీపిక అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
-బుర్ర విజయలక్ష్మీనాగరాజ్
9966559567

పేజీలు:198
వెల :200రూ.
ప్రతులకు :దాస్యం సేనాధిపతి
9440525544

You may also like

Leave a Comment