రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారు రచించిన నిరాతప తెలుగు గజళ్ళు పుస్తకం పైన కవర్ పేజి ఎంతో అందంగా ఉంది. దీనంగా చూస్తున్న రెండు కళ్ళ వెనుక దాగిన ఎన్నో అర్థాలు పరమార్థాలు. వెలుగు నీడల సమాహారాలు
అసలు నిరాతప అంటే ఏమిటో రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారు రాసిన తెలుగు గజల్ పుస్తకాన్ని చదివేంతవరకు నాకు తెలియదు. నిరాతప అంటే రాత్రి అని అర్థం. . పక్షాంతాల పక్షాలతో విహరిస్తుంది. నేత్ర వారి నేత్రీ అవుతుంది.అంటు ఈ పుస్తకంలో రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారు ఎంతో అందమైన డెఫినిషన్ అందించారు. పుస్తకం పేరులోనే ఇంత నీగూడార్థం ఉంటే పుస్తకంలో గజల్స్ ఎంత బావుకతతో అందంగా ఉంటాయో ఊహించవచ్చు. అసలు గజల్ ప్రక్రియ అంటే అది ఒక లిరికల్ పోయెట్రీ. పర్షియాలో పుట్టి ప్రపంచమంతటా పర్యాప్తం చెందిన అద్భుత కవితా గేయపక్రియే ఈ గజల్.
తెలుగులో దాశరధితో ప్రారంభమైన గజల్ రచన సినారె తో పరుగులు తీసింది.నేడు చాలామంది గజల్స్ విరివిగా రాస్తున్నారు.ఈ పుస్తకానికి ముందుమాట రాసిన కళారత్న బిక్కి కృష్ణ గారు గజల్ కోసం ఒక మాట చెప్పారు.గజల్ అంటే ప్రియురాలితో సల్లాపం లేక ప్రియుడితో సల్లాపం కాదు.కవి, కవయిత్రి యొక్క ఉన్నతమైన భావావేశం.(imaginative intensity) గజల్ అంటే ఐదు నుండి 15 షేర్లు వరకు ఉంటే సరిపోదు కాఫియా, రధీప్లు తఖుల్లస్ బాహర్లు మెర్పిస్తే సరికాదు. గజల్ అంటే తాత్వికత, గజిలియెత్, భావుకత కవితాత్మ, అభివ్యక్తి, నవ్యత ఉండాలి. రూపం, భావం, గతి, భావుకత, రసాత్మకత, కళాత్మకత, నాణ్యత రసధ్వని, చమత్కారం ఇత్యాది రూపాభివ్యక్తి సంబంధిత సౌందర్య శిల్పమే గజలియత్. మల్లీశ్వరి లాంటి భావుకత, తాత్వికత ఉన్న కవయిత్రికి మాత్రమే సాధ్యం. అందుకే కవయిత్రిని కళారత్న బిక్కి కృష్ణ గారు గజల్ పగ్లి మల్లీశ్వరి! అని సబోధించారు.
ఈ నిరాతప పుస్తకంలో మొత్తం యాభై గజల్స్ ఉన్నాయి. రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారి తెలుగు భాష మీద ఉన్న పట్టు అపూర్వం. రచయిత్రి యొక్క ఉన్నతమైన భావావేశం ఈ గజళ్ళ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఈ సంపుటిలో ప్రతి గజల్ దేనికదే అద్భుతంగా ఉన్నాయి. మనసుపెట్టి చదవాలి గాని ప్రతి గజల్ లో అందమైన హృదయం ఆవిష్కరిస్తుంది.
రాత్రిలో వెన్నెల ఉంటుంది. రాత్రిలో నిక్షిప్తమైన వెలుగు అందాన్ని తెలిపే ఈ నిరాతప గజల్ ఒకసారి పరిశీలిద్దాం
“మిణుగురుల ముసి నవ్వుల వన్నెలెన్ని మోసిందో ఈ నిరాతప
వెల్లువౌ వెలుగు విరి విలాసమెంత పూసిందో ఈ నిరాతప”
ఎంత అద్భుతంగా పోల్చారు కవయిత్రి. మిణుగురుల ముసి నవ్వుల వెలుగులే మోసింద అంట ఈ నిరాతప.
ఆ నవ్వుల వెలుగు వెల్లువై విరిసి విలాసంగా పూసింది ఈ రాత్రి…అంటే రాత్రిపూట ఆ మిణుగురుల కాంతి, వాటి నవ్వు ద్వారా వచ్చిందని కవయిత్రి యొక్క భావం.
కలికి కళ్ళనున్నది అరుపో ఎరుపో మైమరుపో తెలియ నీదు
బతుకునెంతగా అష్టా చమ్మాటగా చేసిందో ఈ నిరాతప
ఈ షేర్ని గమనిస్తే కలికి కళ్ళనున్నది… కలికి అంటే స్త్రీ ఆడది అని అర్థం. ఆడదాని కళ్ళల్లో అరుపో, ఎరుపో మైమరపో తెలియ నీదు… అంటే అది కోపమో బాధో లేక ప్రేమతత్వమో తెలియదు. బతుకంతా అష్టాచమ్మాటగా చేసిందో ఈ నిరాతప
జీవితమంతా ఎప్పుడు ఆనందంగా వెలుగుతూనే ఉండదు. చీకటిలో బాధతో కూడా కూడి ఉంటుంది. అందుకే రేయి పగలుకు సంకేతంగా అష్టా చమ్మాటతో పోల్చారు కవయిత్రి.
ఎదురు చూపుల నీడల ఊడల నిట్టూర్పులెంతగా అలి సాయో
ఖేదమోద వాదననే ఖాంతాల తోసిందో ఈ నిరాతప
ఎదురు చూపులు చూసి చూసి మర్రి చెట్టు ఊడల వలె చూపులు ఊడల పెరిగి నిట్టూర్పులే మిగిల్చి అలిసిన మనసును ఈ చీకటి రాత్రి శోకంలో తోసింది.
ఇలా మొత్తం ఈ గజల్ తీసుకుంటే ఏడు షేర్లతో ముగిసింది. అదే విధంగా పూసిందో, చేసిందో,తోసిందో వంటి కాఫియాలతో, ‘ఈ నిరాతప’ అనే రధీఫ్తో అందంగా భావుకతతో మలిచారు.
క్షణాలెన్నో వస్తూ పోతూ అనే గజల్ లో
“క్షణాలెన్నో వస్తూపోతూ మనిషిని తొలిచి సురంగం చేస్తాయి
స్వార్థం నిస్వార్థాంలు మనసును నిలకడ లేని పతంగం చేస్తాయి”
నిజమే జీవితంలో ఆనంద క్షణాలు భారమైన క్షణాలు ఎదను తొలిచి తొలిచి సొరంగం చేస్తాయి.
అంతు చిక్కని ఆ సొరంగంలో ఎన్నో జ్ఞాపకాలు నిక్షిప్తమై ఉంటాయి.తవ్విన కొద్దీ బయట పడతాయి.
స్వార్థం, నిస్వార్థాంలు నాణెనిక బొమ్మ బొరుసులా మనిషిని నిలకడగా నిలవనియక పతంగం చేస్తాయి.
ఎంత చక్కటి పోలిక. పతంగం ఎలా రెపరెపలాడుతూ ఉంటుందో… మనసు అలాగే ఊగిసలాడుతుంది అని కవయిత్రి చెప్పకనే చెప్పారు.
“రేపేమో తెలియనీక కాల యవనిక ఆలోచనలలో మనిషిని
దారేమో ఎరుగనీక వలను చిక్కుకున్న కురంగం చేస్తాయి”
మనిషి జీవితంలో రేపన్నది ఏమో తెలియక కాలమనే రంగస్థలంపై నటుడిగా ఆలోచనలో మనిషిని పడవేస్తాయి. దిక్కులేక దారి తెలియక వలలో చిక్కుకున్న చాపల చేస్తాయి.
“పకృతి సిరులే మానవ మానస వికాస హేతువై మారి మనిషి
మనసులోన కళానుభూతి నింపి ఆనంద తరంగం చేస్తాయి “
ఇలా ఒకటి కాదు ప్రతి గజల్ మనిషిలోని అంతర్లీనంగా పడుతున్న వేదనను ఆవిష్కరిస్తూ తపోబలంతో భాషలోని క్లారిటీ భావంలోని ప్యూరిటీ హృదయంలోని రసజ్ఞ ప్రతీ షేర్లలోనూ శిల్పీకరించారు.
ఒంటరి మనసంటే ఏమిటో… మబ్బెంత మురిసిన
నీవిచ్చిన ఏకాంతంలోనే…ఇలా ఎన్నో అద్భుతమైన గజల్సు ఈ పుస్తకంలో ఉన్నాయి
మనుగడ నిచ్చే మట్టి ఈ షేర్ లో….
“నీవు నేను మనం కాలేని మది రాగాల వివాదాల మనసులునొక్కటిగా చేసే సాహితీ సంధానం నేనే”
“దిశదిశల రుతువుల స్థితులెంతెంత మారినా కానీ
సదా గమనమే మార్చక గమ్యం చేరే సంచారం నేనే “
మనిషి మనుగడకు కారణం మట్టి. మనుషుల్లోనూ మనసులోని అంతరాలు…నువ్వు నేను మనం కాలేని మది రాగాల వివాదాలలో మనసులను ఒక్కటిగా చేసే సాహితీ సంధానం నేనే కదా!
నాలుగు దిశలలోను నాలుగు రుతువుల లోనూ కాలాలు ఎంత మారినా గమనాన్ని మార్చక గమ్యానికి చేర్చే సంచారం నేనే కదా అంటూ మట్టి స్వగతాన్ని మనకు అందించారు.
మనసు అశ్రువులను అడుగుతోంది ఈ గజల్ లో
“మనసు అశ్రువులను అడుగుతోంది నన్ను ఎందుకు వణికిస్తున్నావు అని
ఆయువు కాలాన్ని అడుగుతోంది నన్నెందుకు తరిగిస్తున్నావు అని”
ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పుస్తకంలో ప్రతి గజల్ చాలా బాగుంది. కళారత్న బిక్కికృష్ణ గారన్నట్టు రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారి గజల్స్ కి సాటి ఆమె గజల్స్ మాత్రమే.
చివరిషేర్లో కవినామముద్ర ఉండాలి దీనీనే *తఖల్లాస్* అంటారు. గజల్ లో ఒకసారి వాడిన పదం మరలా వాడకపోవడమే గజల్ కు సౌందర్యం. ఇందులో కవయిత్రి సఫలీకృతులయ్యారు అని చెప్పడం అతిశయోక్తి కాదు.
శుద్ధమైన తెలుగు భాషలో పరిశుద్ధమైన ప్రేమ తత్వంతో అద్భుతమైన భావుకతతో అనితరసాధ్యమైన శిల్ప నైపుణ్యంతో అరుదైన తెలుగు భాష పదాలతో చక్కని కాఫీయా, రధీఫ్ లతో కొత్త ప్రయోగాలతో తాత్వికతో పాటు నియమాలు పాటిస్తు చక్కటి గజల్ను మనకందించారు సుప్రసిద్ధ కవయిత్రి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారు. అదేవిధంగా ఈ పుస్తకాన్నికి గజల్స్ కి కూచి గారి చిత్రాలు మరింత అందాన్ని చేకూర్చాయి.ఈ నిరాతపలో మనస్సును స్పృశించే భావుకతను పుష్కలంగా జోడించిన మనోహర భావాలు అందుకు తగ్గ అద్భుతమైన చిత్రాలు కన్నుల విందు చేస్తున్నాయి. చదివిన ప్రతి ఒక్కరూ ఆ భావుకత సంద్రంలో తడిసి ముద్దై ఆనందడోలికల్లో మునిగి తేలుతారు. సాహితి పిపాసుల హృదయ స్వాంతన కాగలదు ఈ “నిరాతప “.