ఆత్మకు రూపాన్ని అందించి
అనంత లోకాల నుండి అవని పైకి
దిగుమతి చేసే దేవత – అమ్మ!
నెల తప్పిన నాటి నుండి
నిలువెల్లా మురిసిపోతూ –
కడుపులో కదలికలు మెదలుతుంటే
కలలలో తేలిపోతూ –
కూర్చున్నా, లేస్తున్నా, నడుస్తున్నా,
ఆపసోపాలు పడుతూనే
ఆనందంలో మునుగాడుతూ –
జవ సత్త్వాలు ఉడుగుతున్నా
నవ మాసాలు మోసి,
నిండు గర్భిణిగా నొప్పులన్నీ భరించి,
ప్రసవించి, ప్రభవింపజేస్తుంది
సృష్టిలో ఒక సరిక్రొత్త జీవిని!
పడతి నుండి పరిణామం చెంది
ప్రపంచంలో నిలుస్తుంది
ఒక మాతృమూర్తిగా!
నిస్వార్థమైన ప్రేమకు
ఒక నిలువెత్తు ప్రతీకగా!!
కనుల ముందు నిజమైన
తన కలను చూచి
కష్టాన్నంత క్షణంలో మరిచిపోయే
కమనీయ హృదయ – అమ్మ!
చనుబాలే అమృతంగా పంచి,
తన ఒడినే ఊయలగా మలచి,
జోలపాటతో యోగ నిద్రలోకి
ప్రయాణింపజేసే ప్రథమ గురువు – అమ్మ!
అమ్మ అడుగులు వేయిస్తుంది
అమ్మ నుడుగులు నేర్పిస్తుంది
అమ్మ ఆకలి తీరుస్తుంది
అమ్మ లోకం చూపిస్తుంది
అమలినమైన అనురాగానికి
ఆకృతి దిద్దితే – అది అమ్మ!
ఆమెకు సరితూగడు తానైనా
ఆ సృష్టికర్త బ్రహ్మ!!#
(మాతృమూర్తులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలతో …)