Home ధారావాహిక నవల బంగారు కల

బంగారు కల

by Chillara Bhavanidevi

ధారావాహికం – 9వ భాగం

శ్రీకృష్ణదేవరాయల ప్రభువు జన్మదినోత్సవం అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నది. యజ్ఞయాగాదులు, దానధర్మాలు ముగిశాయి.
ఐదుగురు సామంతరాజులు ప్రభువుకు కానుకలు సమర్పించారు. ప్రజలంతా ఇష్టమైన అందమైన కొత్తబట్టలు ధరించారు. సామంతులంతా తమ కిందివారికి రంగు రంగుల బట్టలు బహుకరించారు. ప్రతి రాజప్రముఖునికి ప్రత్యేక లాంఛనాలందాయి. రాజుగారికి సామంతులంతా విలువైన బట్టలు కానుకలు నగలు, ధనం అందజేశారు. ఆ ఒక్కరోజే రాజుగారికి పదిహేను లక్షల బంగారు పర్దావులు బహుకరించబడ్డాయి. ఒక్కొక్క పర్దావు విలువ మూడువందల అరవై రైస్‌లు. విజయనగర ప్రజలు నెలను పౌర్ణమి నుండి పౌర్ణమికి లెక్క వేసుకుంటున్నారు.
విజయనగర ప్రభువులు గత అనేక సంవత్సరాలుగా ఒక కోశాగారాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి ప్రభువు మరణం తర్వాత దానికి తాళం వేసి
ఉంచుతారు. అది ఎవరికీ కనపడకుండా తెరవకుండా ఉండేట్లు చూస్తారు. తర్వాత వచ్చిన రాజులు కూడా దానిని తెరవటం చేయరు. ఏ రాజుకైనా తప్పనిసరి అవసరం అయితే తప్ప ఆ కోశాగారాన్ని తెరిచే ప్రసక్తి లేదు. ప్రతిరాజు తన కోశాగారంలో కోటి పర్దావుల దాకా నిల్వచేస్తాడు. తన రాజ భవనం ఖర్చును మించి ఒక పర్దావు కూడా ఇందులోంచి తీయడానికి లేదు. ప్రతి రాజభవనంలో పన్నెండువేల స్త్రీలకు పైగా పోషించబడతారు. ప్రతి పర్దావు బంగారునాణెం మీద ఒకవైపు రెండుబొమ్మలు, రెండోవైపు ఆ రాజుపేరు ఉంటుంది.
జన్మదిన వేడుకలు పూర్తయ్యాక కృష్ణదేవరాయలు హంపీ వెళ్ళారు. ఈ నగరమంటే ఆయనకు చాలా ప్రీతి. రాజుకు నగరపౌరులు మహావైభవంగా స్వాగతం పలికారు. వీధుల్లో విజయతోరణ ద్వారాలు నిర్మించారు. ఈ ద్వారాల గుండా రాజు ప్రవేశించారు. వీధులన్నీ విలువైన వస్త్రాలతో వున్నాయి. రాజు రక్షక దళాలను సమీక్షించారు. కృష్ణరాయ ప్రభువు సంవత్సరానికోసారి చెల్లించే వేతనాన్ని అందరికీ పంచారు. పరివారాన్ని రాజాధికారులు తనిఖీచేసి వాళ్ళ పేర్లు, ముఖం, శారీరక గుర్తులు రాసుకున్నారు. దళసేనానులు కాపలాకి వెళ్ళటానికి వంతుల వివరాలు తెలియజేయబడ్డాయి.
శ్రీకృష్ణదేవరాయలు ప్రత్యేక ఉత్సవ సందర్భంగా ఆనాటి సాయంకాలం భువనవిజయంలో కొలువు తీరాడు. నగరం సర్వాలంకారాలతో శోభాయమానమై దివ్యమణి ప్రభలతో చూపరుల కళ్ళు మిరుమిట్లు గొల్పుతున్నది. ఈ రోజు రాయలవారి ముఖమండలం ఆనందాతిరేకంతో పూర్ణచంద్రకాంతిని ప్రతిఫలిస్తున్నది. ఒక ప్రత్యేకకారణంతో సిద్ధంచేయబడిన ఆ కొలువుకు శ్రీరంగ దేవరాయలు ఆహ్వానించబడ్డాడు. ఆయనతోబాటు వారి కుమారుడు రామరాయలు దుందుభి ధ్వానాలమధ్య సభలో ప్రవేశించాడు.
సభలో అందరూలేచి గౌరవ పురస్సరంగా నిలబడ్డారు. ఆశ్చర్యకరమైన విషయమేమంటే శ్రీకృష్ణదేవరాయలు కూడా సింహాసనం నుంచి లేచి నిలబడ్డాడు. శ్రీరంగదేవరాయలు దిగ్భ్రాంతి చెందాడు. రాయలు మందహాసంతో శ్రీరంగదేవరాయలను చూశాడు. రాయలవారు సింహాసనము నుండి ఎందుకు లేచారో అతనికర్థం కాలేదు. తన ఆసనంమీద కూడా ఆ రోజు మరెవ్వరో కూర్చున్నారు. శ్రీరంగదేవరాయలు ఆలోచనాపరుడై నిశ్చలంగా అలాగే నిలుచున్నాడు. ఒక నిమిషం తర్వాత మళ్ళా భేరీనినాదం విన్పించింది. శ్రీకృష్ణదేవరాయలు ఆనంద మందహాసంతో శ్రీరంగదేవరాయలుకేసి చూస్తూ ముందుకు నడిచాడు. అతని దగ్గరకు వచ్చి చేయి పట్టుకొని తన సింహాసనం పక్కనే ఉన్న ఉన్నతాసనాన్ని చూపాడు. దాని పక్కనే ఉచితాసనంపై రామరాయలను కూచోమని సైగచేశాడు. రాయలు తన సింహాసనాన్ని అధిష్టించగానే భేరీనినాదం ఆగిపోయింది. అంతటా నిశ్శబ్దం. రాయల ప్రవర్తన అందరికీ నేడు కొత్తగా కన్పిస్తున్నది.
శ్రీకృష్ణదేవరాయలు ఆ నిశ్శబ్ద వాతావరణంలో జలధర ధ్వాన సమాన గంభీర స్వరంతో ఇలా అన్నారు`
‘‘నేటినుంచి కందవోలు రాజ్యాధినేత శ్రీ శ్రీరంగదేవరాయలుగారు మాకు సామంతులు కారు. వారిని సర్వ స్వతంత్రులుగా ప్రకటిస్తున్నాం.’’
సభలో హర్షధ్వానాలు మిన్నుముట్టాయి. శ్రీరంగదేవరాయలు సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయాడు. రాయలవారి కృపకు కారణం అనూహ్యంగా ఉంది.
తిమ్మరుసు మహామంత్రి లేచారు. చిరునవ్వుతో సభనంతా పరికించాడు. అందరి మనస్సుల్లోని ప్రశ్నను అవగతం చేసుకున్నాడు. ధీర గంభీరంగా ఇలా అన్నాడు.
‘‘సభాసదులారా! ఈనాడు మరో ముఖ్యమైన అంశాన్ని తెలియజేస్తున్నాను.
శ్రీ మన్మహామండలేశ్వర శ్రీ కృష్ణదేవరాయల వంశానికి ఏనాటి నుండో ఆర్వీటివంశం వారు పరమాప్తులు, మిత్రులు. శ్రీ రాయలవారు విజయనగర రాజ్యాధినేతలయే సమయంలో దక్షిణ పూర్వ దిగ్విజయ యాత్రల సమయంలో ఎంతో తోడ్పడినవారు ఆర్వీటివారు. అందరిలో రాయలవారి ఆదరాభిమానాలు చూరగొన్నవారు శ్రీశ్రీశ్రీ శ్రీరంగదేవరాయలవారి తృతీయపుత్రుడు చిరంజీవి రామరాయలవారు. వీరు అన్ని దండయాత్రల్లో పాల్గొని అరివీర భయంకర శౌర్య ప్రతాపాలను ప్రదర్శించారు. అవక్ర పరాక్రమంతో ఉదయగిరి దుర్గంలో శత్రు మూకల్ని సంహరించారు. కోటను స్వాధీనం చేసుకొని రాయవారికి అందించారు. కందవోలును ముట్టడిరచిన అదిల్‌షాతో పోరాడి వారి అశేష సేనావారాన్ని నిశ్శేషం చేశారు. పరాక్రమశాలి, ధీమంతుడు అయిన రామరాయలవారు శ్రీకృష్ణదేవరాయల అభిమానం చూరగొన్న అదృష్టవంతులు. అందుకని అభినందనసూచకంగా శ్రీవారు ఈ యువరత్నానికి తమ పుత్రికారత్నమైన తిరుమాలాంబికను కన్యాదానం చేయటానికి నిశ్చయించారు. నేటికి ఎనిమిదోరోజు వైశాఖ శుద్ధ త్రయోదశి వివాహానికి అనుకూలమని దైవజ్ఞులు నిర్ణయించారు. ఈ సభ ఇవ్వాళ ముగిసింది. మరలా ఏకాదశి రోజున దర్శనం ఉంటుంది’’ అని విరమించారు తిమ్మరుసు మంత్రి.
సభలో ఒక్కసారిగా ఆనంద కోలాహలం మిన్నుముట్టింది. మంగళతూర్యార వాలు సందడిరచాయి. పటాహా, భేరి, ఢక్కా, కాహళ, దుందుభి ధ్వానాలతో సభాంతరాళం పిక్కటిల్లింది.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
శ్రీకృష్ణదేవరాయలు, తిమ్మరుసుమంత్రి, రామలింగనాయకుడు సమావేశ మందిరంలో దీర్ఘ సమావేశం జరుపుతున్నారు. తిమ్మరుసు చాలా గంభీరంగా
ఉన్నారు.
‘‘విజయనగర రాజప్రతినిధిగా ఉన్న సేనాధిపతి పెమ్మసాని తిమ్మనాయకుడ్ని మధురై పాండ్యరాజును అణచటానికి పంపాము’’ రాయలు సాలోచనగా అన్నారు.
‘‘అక్కడినుంచి వచ్చిన వార్తల ప్రకారం తిమ్మనాయకుడు మధురై పాండ్య రాజును ఓడిరచాడు. కానీ రాజ్యకాంక్షతో కన్నూమిన్నూ గానక తిమ్మనాయకుడు మధురై రాజ్యానికి తనను స్వతంత్రరాజుగా ప్రకటించుకున్నాడు. అతనిని పట్టితెచ్చే వీరుడెవరని సభలో ప్రశ్నించినప్పుడు విశ్వనాథనాయకుడు ముందు కొచ్చాడు. అతడు తిమ్మనాయకుని కుమారుడవటం విశేషం’’ తిమ్మరుసు చెప్పారు.
రాయలు గంభీర వదనంతో వింటున్నారు.
‘‘అవును ప్రభూ! మనకందిన వార్త ప్రకారం విశ్వనాధ నాయకుని ప్రభుభక్తి ఎన్నదగింది. అతను సైన్యంతో మధురకెళ్ళి తండ్రిని ఓడిరచి, బంధించి విజయనగరానికి ఖైదుగా తెచ్చి అప్పగించాడు. విశ్వనాథనాయకుడు ఇపుడు మీ దర్శనానికి వేచివున్నాడు ప్రభూ!’’ రామలింగ నాయకుడు గంభీరంగా అన్నాడు.
‘‘తక్షణం అతనిని ఆహ్వానించండి’’ తిమ్మరుసు ఆనతిచ్చారు.
విశ్వనాథనాయకుడు వీరసింహంలా అడుగుపెట్టాడు. రాయలతనని ప్రశంసా పూర్వకంగా చూశారు.
‘‘విశ్వనాథ నాయక! నీ వీరత్వం ఉన్నతమైనది. పితృభక్తి కన్నా రాజభక్తి గొప్పదని నిరూపించావు. మధురై రాజ్యానికి నిన్ను రాజును చేస్తున్నాను. నేటినుండి నీవు మా సామంతరాజుగా మాకు అభిమానపాత్రుడయ్యావు.’’
‘‘ధన్యుడ్ని ప్రభూ!’’ విశ్వనాథనాయకుడు నిష్క్రమించాడు.
తిమ్మరుసు రాయలకేసి ప్రశంసాపూర్వకంగా చూశాడు. తాను తీర్చిదిద్దిన మహాప్రభువు రాజనీతిజ్ఞతను కళ్ళారా చూస్తున్న తిమ్మరుసు మనస్సు తృప్తిగా పులకరించింది.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
ఆ రోజు వైశాఖ శుద్ధ ఏకాదశి.
చంద్రుని వెన్నెల కాంతులతో భూమ్యాకాశాలు స్వచ్ఛంగా వెలుగుతున్నాయి. విజయనగర పరిసర ప్రాంత ప్రకృతి అంతా జరగబోవు కల్యాణ మహోత్సవానందాన్ని అప్పుడే పొందుతున్నట్లు కన్పిస్తున్నది. ఆకాశ మార్గంలో వికాసరేఖల్లా విజయనగర ప్రాంతంలోని పర్వతపంక్తులు గంభీర రమ్యంగా దర్శనమిస్తున్నాయి. ఆ పర్వతశ్రేణులపై నాటినట్లుగా ఉన్న చెట్లు, ఆ వెనకు లేత గచ్చకాయరంగు ఆకాశం, ఆపైన పడమటికి వాలిపోయి మెల్లగా ప్రయాణం చేసే చంద్రుడు, అంతా ఒక అద్భుత చిత్రపటంలా కన్పిస్తోంది.
మగపెళ్ళివారు విజయనగరానికి మూడుకోసుల దూరంలో ఉన్నారు. రాత్రి రెండుజాములు దాటింది. ఆనందాతిరేకం వల్ల ఎవ్వరికీ నిద్రరావటం లేదు. సహజ సుందర ప్రకృతివల్ల… వాతావరణంలోని చల్లదనం వల్ల మెల్లగా నిద్రాదేవి ఒడిలో సేదతీరారు. కాలినడకన మెల్లమెల్లగా సైన్యం కదులుతున్నది. భద్రగజంపై అంబారీపైన రామరాయలు, అన్నివైపులా ఆశ్వారోహకులు మందగమనంతో నడుస్తుండగా విజయనగర ప్రకృతి దృశ్యాలు చూస్తున్నాడు. పరిచితమైన ప్రదేశాలే కానీ ఈరోజు వింత సొగసుతో కన్పిస్తున్నాయి. ఇదివరకు తెలియని నూతన సంచలనానికి మనసు లోనవుతోంది. తెలియరాని తీయనిబాధ కలుగుతుంది.
పెళ్ళిబృందం విజయనగరాన్ని సమీపించింది. రామరాయల తండ్రి శ్రీరంగదేవరాయ ఆజ్ఞతో దుందుభిధ్వానాలు భేరీ ఖీంకారాలు మోగాయి. మంగళ తూర్యారవాలు చెలరేగాయి. మేనాల్లో నిద్రిస్తున్నవారు తుళ్ళిపడి లేచారు. అందరి హృదయాలు ఒక్కసారి ఉప్పొంగాయి. ఠీవిగా సంబరపడ్డారు.
దూరాన రెండుకోసుల దూరంలో ఎత్తుగా దట్టమైన వెలుగు కన్పించింది. ఆ కాంతి వెనుకగా ఉన్నతంగా విజయనగర రాజసౌధోపరిభాగాలు కన్పిస్తున్నాయి. వాటికి తాపిన చిన్నమణులు నక్షత్రాల్లాగా, పెద్దవి చంద్రునిలా వెలుగుతున్నాయి. కోటకి కట్టిన మణిహారాలు నక్షత్ర మాలికల్లా, ద్వారాలకి ఇరుపక్కలా ఉంచిన పూర్ణమణికుంభాలు బాలసూర్యగోళాల్లా ప్రకాశిస్తున్నాయి. దీపాల కాంతులామణులపై బడి ప్రతిబింబించటం వల్ల విజయనగరమంతటా పున్నమి వెలుగుల్ని నింపుకుంది. నగరమంతా చిత్రవర్ణ దృశ్యంగా ఉంది.
ఆ నిశ్శబ్ద వాతావరణంలో ఒక్కసారిగా పెక్కు నగారాధ్వనులు వెలువడ్డాయి. ఆ ధ్వనులతో బాటు వెలుగు దగ్గరయింది. పెళ్ళికొడుకు బృందం ఇంకొక కోసుదూరం ప్రయాణించింది. అటువైపునుంచి వధువు పక్షంవారు మరికొన్ని గజాలు కదిలారు. రెండు బృందాలు ఒకరికొకరు అంతదూరంలో ఉండగా నగారా ధ్వనులు ఆగిపోయాయి.
అద్భుతంగా అలంకరించబడిన ఒక పట్టపుటేనుగు మీద శ్రీకృష్ణదేవరాయలు ప్రత్యక్షమయ్యారు. వందిమాగధులు స్తోత్రం చేశారు.
‘‘రాజాధిరాజ, రాజపరమేశ్వర, మూరురాయరగండా! జయ జయహో!
అరివీర భయంకర దోర్దండా
సరస సాహితీ సమరాంగణ సార్వభౌమా! జయ జయహో!
మరోసారి దుందుభి ధ్వానాలు మారుమోగాయి.
వరుడు రామరాయలు ఉన్నతమైన ఏనుగుపై విరాజిల్లుతున్నాడు. కొంచెం దూరంలో అతని తండ్రి శ్రీరంగదేవరాయలు అంబారి మీద కూర్చొని ఉన్నాడు. ఎడమవైపు అతని సోదరులు, వెనుకగా రాజపరిచారం. దుందుభి ధ్వానాలు మరలా మారుమ్రోగాయి. వందిమాగధులు శ్రుతిపక్వంగా స్తోత్రం చేశారు.
‘‘శ్రీరంగదేవరాజసుత చిరంజీవి రామయ రాజా జయ జయహో!
సమస్త సద్గుణాస్తోమ భద్రా రామయ రాజా జయ జయహో!
భూసుత సాహస ధుర్యా రామయ రాజా జయ జయహో!’’
వరునివైపు వారి నగారాలు ఒక్క పర్యాయం మోగి ఆగాయి.
అటువైపునుంచి శ్రీకృష్ణదేవరాయలు ఇటువైపునుంచి శ్రీరంగదేవరాయలు భద్రగజారోహణ గావించారు. ఆ వెనుక రామరాయలు ఉభయవర్గాల రాజబంధువులు కిందికి దిగారు. వధువువైపు వాళ్ళు పరిపించిన రత్నకంబళ్ళపై వరుని పక్షమువాళ్ళు కూర్చున్నారు. ముత్తయిదువులు గంధాక్షతలు కురిపించారు. విలాసినీ జనులు పన్నీరు జల్లారు. ఇటువంటి ఉచిత మర్యాదలకు ఇరుపక్షాలవాళ్ళు ఆనందించారు.
ముహూర్తానికి సర్వం సిద్ధమైంది. వివాహమండపంలో వధూవరుల్ని ఒకచోట కూర్చోబెట్టి దిష్టి తీశారు. ఇద్దరికి మంగళస్నానాలు చేయించారు. మంత్రయుక్త ఆవాహనతో సకల శుభదేవతల పూజ జరిగింది. వరుడు వధూపక్షంవాళ్ళిచ్చినవి, వధువు వరునిపక్షంవాళ్ళిచ్చినవి పట్టువస్త్రాలు ధరించారు.
రాజాధిరాజ రాజపరమేశుడు శ్రీ శ్రీకృష్ణదేవరాయలు సమంత్రకంగా
కాళ్ళుకడిగి రామరాయలకు కన్యాదానం చేశారు. మంత్రోచ్ఛారణ కొనసాగింది. వధూవరూలచే వివాహ ప్రతిజ్ఞ జరిపించారు. మంగళ తూర్యారవాలు మిన్నంటగా రామరాయలు తిరుమలాంబిక మెడలో మూడుముళ్ళు వేసి సూత్రధారణ చేశాడు. బ్రాహ్మణోత్తములు వేదమంత్రాలతో ఆశీస్సులందించారు. సకల ప్రపంచం వధూవరులను అక్షింతలతో ఆశీర్వదించింది. తలంబ్రాలు పోసుకోవడం పూర్తి అయింది. రామరాయలవంటి ధైర్య శౌర్యవంతుని భర్తగా పొందిన తిరుమలాంబిక ఉప్పొంగిపోయింది. వీరాధివీరుడు అల్లుడయ్యాడని రాయలు ఆనందించాడు. ఆదరించి ఎన్నో కానుకలు ఇచ్చాడు. సర్వసేనాధ్యక్ష పదవినిచ్చి గౌరవించాడు. అల్లునికి వివాహకానుకగా సిద్ధవటం, పొత్తపి, ఉదయగిరి దుర్గాలనిచ్చి సత్కరించారు రాయలు.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
మంజరి, చంద్రప్పలు వ్యాసరాయల వారి ఆశ్రమానికి వెళ్ళారు. తమ వివాహముహూర్తం నిర్ణయించమని కోరారు. ఆయన వాళ్ళిద్దరికేసి సందిగ్ధంగా చూశాడు.
‘‘మీ ఇద్దరికీ వివాహయోగ్యంలేదు నాయనా. ఒకవేళ జరిగినా వియోగం తప్పదు.’’
‘‘ఎందుకని స్వామీ’’ చంద్రప్ప అడిగాడు.
‘‘లోగడ కూడా మీరిద్దరూ వివాహప్రయత్నం చేసినట్లు, అది భగ్నమైనట్లు మీ జాతకాలు చెప్తున్నాయి.’’
‘‘అంటే మేము ఒకరినొకరు కాకుండా వేరొకరిని చేసుకుంటామా’’ చంద్రప్ప మళ్ళీ అడిగాడు. వ్యాసరాయలు మౌనం వహించాడు.
మంజరి లోలోపల పరితాపం చెందుతున్నది. స్వామి చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి. ప్రతిసారీ ఏదో ఒక అవాంతరమెదురౌతున్నది. తిరుమలాంబిక రాకుమారి వివాహమయ్యాక మంజరికి తన వివాహం గురించి చింత పట్టుకుంది. ఆమె గతంలో మరో జ్యోతిష్కునికి తన జాతకం చూపించుకుంది. తాను చంద్రప్పను వివాహమాడితే అతనికి మృత్యువు సంభవిస్తుందని ఆ జ్యోతిష్కుడు చెప్పాడు. అప్పటినించి మంజరి క్షుభితురాలయింది. తనపట్ల చంద్రప్ప కనపరిచే అనురాగాన్ని కాదనలేదు. అలాగని చేతురాలా అతని మరణాన్ని కోరలేదు.
‘భగవంతుడా! ఏమిటీ విషమపరీక్ష? ఈ విషయాన్ని చంద్రాతో ఎలా చెప్పగలను’ అని లోలోపల వేదనపడుతున్నదామె. అతని బలవంతంమీదే వ్యాసరాయలవారిని కలవటం జరిగింది.
రాజగురువైన వ్యాసరాయలంటే కృష్ణరాయలకు అమిత గౌరవం. రాయలకు పదవీగండం ఉన్నప్పుడు కొద్దికాలం విజయనగర సింహాసన మధిష్టించిన జ్ఞాని ఆయన. అటువంటి వ్యాసరాయల మాట పొల్లుకాదు. తమ వివాహం జరగదు. వ్యాసరాయలవారికి నమస్కరించి ఇద్దరూ ఆశ్రమం బయటికి వచ్చారు.
మౌనంగా నడుస్తున్నాడు చంద్రప్ప. ఆమె చేతిని బిగించి పట్టుకున్నాడు.
‘‘మంజూ! నీవులేనిది నేను జీవించలేను’’ తమకంగా కౌగిలించుకున్నాడు. ఇద్దరి కళ్ళు నిండుకున్నాయి.
‘బుస్‌…’ మనే శబ్దం విని చటుక్కున ఆమెను వదిలేశాడు.
నాలుగుబారల నల్లత్రాచు పడగవిప్పి తీక్షణంగా వీళ్ళకేసి చూస్తున్నది. మంజరి కొయ్యబారిపోయింది. శరీరమంతా గజగజా వణికిపోతున్నది. ఇద్దరిలో ఎవరు కదిలినా పడగ విసరటానికి సిద్ధంగా ఉంది త్రాచు.
‘‘కదలకు’’ పెదవులు కూడా కదలకుండా అన్నాడు చంద్రప్ప.
ఇద్దరూ బొమ్మల్లా నిలబడిపోయారు.
కాసేపు విప్పిన పడగను అలాగే ఉంచి ఎలాంటి అలికిడి లేకపోవటంతో జరజరా పాక్కుంటూ పక్కనున్న పొదల్లోకి వెళ్ళిపోయింది త్రాచు.
మంజరికి దడ తగ్గలేదు. అది అపశకునంలా తోస్తున్నది. తనెంత నష్టజాతకురాలు! తల్లిని పోగొట్టుకుంది. ప్రేమించిన చంద్రప్ప కూడా తనకి దూరంకాక తప్పదు. వీరేంద్రుని అసభ్య ప్రవర్తన మరింత బాధిస్తోంది. అది ఎవ్వరికీ చెప్పుకునేది కాదు. అతడు రాజబంధువు. అతని కంటపడకుండా
ఉండగలగటమే తను చేయగలిగిన పని. అదికూడా చాలా కష్టతరంగానే
ఉంది.
తిమ్మరుసువారి కుమారుడు గోవిందరాయలు తనపట్ల చూపించే శ్రద్ధకు కారణం తనూహింపలేదు. చంద్రప్ప తనూ ఎన్ని వెన్నెలరాత్రులు విజయనగర శిల్పారామాల్లో విహరిస్తూ ఎన్నెన్ని కలలు కన్నారో! వివాహం అనేది జరిగినా జరక్కున్నా చంద్రప్ప తనూ మానసికంగా ఏనాడో భార్యాభర్తయ్యారు. మంత్రాలు, సూత్రాలు లేకుంటే మాత్రమేం! కానీ లోకం…
‘‘మంజూ!’’ చంద్రప్ప పిలుపుకి ఈ లోకంలోకి వచ్చింది.
‘‘ఏమాలోచిస్తున్నావు మంజూ! గురువుగారి మాటలకు బాధపడకు. జ్యోతిష్యంలో ఉండే ప్రతి దోషానికి నివారణ, శాంతి ఉంటుంది. అన్నీ మళ్ళీ చర్చించి చేద్దాం.’’
‘‘ఇక వెళ్దాం చంద్రా! దేవేరివారు నాకోసం ఎదురుచూస్తారు’’
‘‘అవునుగదూ! మరిచాను… తిమ్మరుసు మంత్రిగారు నిన్ను అన్నపూర్ణాదేవి మందిరంలో నియోగించారు కదా!’’
‘‘అవును చంద్రా! అన్నపూర్ణాదేవి చాలా గుణవంతురాలు. ఆ వీరేంద్రుడే ఆమె మనసును కలతపెడుతున్నాడు.’’
‘‘నువ్వు జాగ్రత్త. మనం త్వరలో ఒకింటివాళ్ళమవుతాం. ఎటువంటి భయాలు సందేహాలు పెట్టుకోకు’’ ఆమె చేతిని సున్నితంగా నొక్కి అశ్వారోహిణుడై వెళ్ళిపోయాడు చంద్రప్ప.
అతను వెళ్ళినవైపే చాలాసేపు చూస్తూండిపోయిందామె. తనవల్ల అతనికి గండం అనేమాట ఆమెను బాధిస్తోంది. తాను మరణించయినా అతనికి జీవితాన్నివ్వాలనుకునే హిందూ స్త్రీ ఆమె. దానికి పునాదిగా ఒక ఆలోచన మబ్బుతెరలా కదిలిందామె మనసులో.

You may also like

Leave a Comment