Home పుస్త‌క స‌మీక్ష‌ బహుస్ఫూర్తిదాయకం ఈ లేఖావలోకనం.!

బహుస్ఫూర్తిదాయకం ఈ లేఖావలోకనం.!

లేఖలు అంటుంటేనే..
మనసు గతంలోని జ్ఞాపకాల్లోకి పరుగులు పెడుతుంది. ఇవి సమాచార మాధ్యమాలే కాదు, ఇరు మనసుల భావోద్వేగాలను మోసుకుపోయే పావురాలు కూడా! ఇతర ప్రక్రియల్లాగే సాహిత్యంలో లేఖారచనా ప్రాశస్త్యం కూడా అనన్య మైందే.! కమ్యూనికేషన్లు పెద్దగా విస్తరించని కాలంలో లేఖలే మనుషుల మధ్య వారధులు.
ఇవి మనసులను కలిపే రహదారులు.
ఒక మనిషి అంతరంగాన్ని లోలోపలి ఉద్వేగాల్ని మరో మనిషికిఅందజేసే వాహికలు.
ఉత్తరం రాయటం ప్రత్యుత్తరం కోసం ఎదురుచూడటం అదీ ఓ త్రిల్లింగ్..! ఉభయకుశలోపరి అంటూ మా నాన్న రాసిన ఉత్తరం నా కళ్ళముందిప్పుడు రెపరెపలాడుతోంది నాన్న దూరమైనా ఆ ఉత్తరాలు మాట్లాడుతూ భరోసానిస్తూనే ఉంటాయి. మాటలు గాలిలో కలిసి పోతాయి గానీ, రాతలు మిగిలిపోతాయి. కాలం గడుస్తున్న కొద్దీ మధురానుభూతులను పెంపొందిస్తాయి. ఆర్కైవ్ లోంచి పాత ఉత్తరాలను చదువుతుంటే.. ఓహో! అప్పటి పరిస్థితులు ఇవ్వా.! అప్పటి ఆలోచనలు ఇట్లా ఉండేవా అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా… అనిపిస్తుంది కదా..!
ఇంతటి ప్రాధాన్యత గల లేఖలు కాలక్రమంలో అంతరిస్తున్నాయంటేనే అదో రకమైన వేదన. నేడు లేఖల స్థానంలో సోషల్ మీడియా వచ్చి చేరడంతో లేఖలు రాసుకునే మంచి అలవాటు తగ్గిపోయిందనే చెప్పవచ్చు. అలాంటి ఈ సమయంలో వెలువడిన ‘లేఖావలోకనం’ డెబ్భై లేఖలతో కూడిన ఉత్తరాల పొత్తం తెలుగులో మొదటిది. ఈ గ్రంధానికి సంపాదకత్వం వహించిన
సాహితీవేత్త ప్రముఖ కవియిత్రి, కథయిత్రి నిత్యమూ అక్షరాలతో జ్వలించే జ్వలిత అభినందనీయులు..!
దీంట్లోని ఒక్కొక్క లేఖా గుండె లోతుల్లోంచి ఉబికి వచ్చిన కన్నీటి చుక్క..! ఇవి మనసు విప్పి మాట్లాడుతాయి భావోద్వేగాలను కురిపిస్తాయి. దీంట్లొని కొన్ని లేఖలు ఆవేశంతో రగిలిపోతే మరికొన్ని ఒళ్ళు జలదరింప చేస్తాయి.
అనిశెట్టి రజితగారి లేఖ “స్త్రీ బలిపశువూ, భోగవస్తువూ ఏకకాలంలో అయిపోయింది.. కావున స్త్రీలకు వేరే ఆకాశం వేరే నేలా కావాలంటే దాంట్లో తప్పేముంది!? స్త్రీల రక్షణకు ప్రత్యేక సామాజిక సూత్రాలేమైనా రూపొందించారా, తుప్పు పట్టిన చట్టాలతో ఆడపిల్లలను ఎలా రక్షితంగా చూడగలం..!?” అంటూ వారి ఆక్రోశాన్ని వెలిబుచ్చారు. నిజమే ఆకాశంలో సగం ఉన్న స్త్రీలకు చట్టాల్లో, చట్టసభల్లో ప్రాధాన్యత కరువైపోయింది నేటికీ..
ఆచార్య సూర్యాధనంజయగారి లేఖలో స్త్రీల వెనకబాటు తనం పోవాలంటే..”ప్రతీ మహిళ ఒక రాణి రుద్రమ, సమ్మక్క సారక్క, ఇందిరాగాంధీ, సరోజినీనాయుడు, చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, కిరణ్బేడీలా తమను తాము మార్చుకోవాలి అంటారు.” అందుకుగాను మరేం చేయాలి వారు!? ఏముందీ ముందుగా విద్యనభ్యసించి తమ కాళ్లపై తాము నిలబడి ఆత్మనిబ్బరంతో అడుగు ముందుకెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


కట్టా శ్రీనివాస్ గారి లేఖ వాళ్ళ అమ్మాయికి ఎన్నో మంచి మాటలు చెప్తూ రేపు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో.. ఏమి మానాలో ఏమి మానకూడదో జీవితానికీ కవిత్వానికీ వర్తించేలా సున్నితంగా స్ఫూర్తి దాయకంగా చెప్తారు. ఇలాంటి తండ్రులు సమాజంలో ఉన్నంతకాలం, ఏ అమ్మాయీ అబలా కాదు అనుకున్నది సాధించే తీరుతుంది.
కుప్పిలి పద్మ గారి లేఖ “స్త్రీల జీవితాల్లో బై చాయస్ పెళ్లి చేసుకోవడం చదువుకోవడం నచ్చిన పని చేయడం ఆమెకే ఉండాలంటారు. లైంగిక దాడులకు ప్రధాన కారణం పురుషాధిక్య ఆలోచనా ధోరణే.. దీన్ని అడ్డుకోవడానికి చట్టాలే కాదు సాంస్కృతిక విప్లవం అత్యంత అవసరమే” అంటారు.
నిజమే.. జరుగుతున్న పరిణామాలను బట్టి ఆలోచిస్తే.. స్త్రీ తనను తాను తిరిగి తీర్చి దిద్దుకోవలసిన ఆవశ్యకత ఆసన్నమైంది. లేదంటే వాడిపారేసే కరివేపాకో.. తొక్కి నడిచిపోయే బండ లాగే చూస్తారు.!
తిరునగరి దేవకీ దేవి గారి లేఖలో “స్త్రీల మీద చిన్న చూపు వేధింపులు రూపుమాపబడాలి అంటే ప్రభుత్వ విధి విధానాలలో మీడియాలో కోర్టు తీరుతెన్నులలో విద్య విధానాలలో సమూలంగా మార్పు వస్తే తప్ప హత్యాచారాలకు ముగింపు పలుకలేమని “ఘంటాపథంగా తెలియజేశారు. వ్యక్తుల్లో వ్యవస్థల్లో ఇప్పటికైనా మార్పులు రావాల్సిన అవసరం
ఎంతైనా ఉంది.
ఈ ‘లేఖావలోకనం’లో అధ్యాపకులు ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువే.. వారు వారి వారి విద్యార్థులకు.. లేఖల ద్వారా హితోపదేశం చేశారు.. నాంపల్లి సుజాత తన విద్యార్థికి లేఖ రాస్తూ సమాజంలో జరుగుతున్న అన్యాయాలు అత్యాచారాలు సూచనప్రాయంగా తెలియచేస్తూ తదనుగుణంగా “ఆడపిల్లలు క్రమశిక్షణ నియమనిబంధనలు జీవన నైపుణ్యాలను పెంపొందించుకోవాలి” అన్నారు.
కొండపల్లి నీహారిణీగారిది సందేశాత్మక లేఖాసారాంశం..” అమ్మాయిల మీద హింస రూపుమాపాలంటే బళ్లను వేదికలుగా చేసుకొని, పాఠ్య పుస్తకాల్లో స్థాయీలవారీగా, విలువలనూ, ఆత్మస్థైర్యాన్నీ మిళితం చెయ్యాలంటారు”..అవును
మొక్కప్పటినుంచే విలువలతో కూడిన విద్య నేర్పినట్లైతే తప్పక ఫలితాలుంటాయి.
శిలాలోలితగారు వారి లేఖలో ఇలా అంటారు “తప్పు జరిగాక విచారించే కంటే మూలాల్లోకి వెళ్ళి విశ్లేషించుకుంటే బాగుంటుందని” కొన్ని కారణాలను కూడా తెలియజేశారు. “తలుపులేని గుడిసె బతుకులో తప్పనిసరిగా చూసే అమ్మానాన్నల లైంగిక చర్యలు, తాగిన తండ్రి ప్రేలాపనలు, కుటుంబంలో దొరకని ప్రేమ, స్నేహం, కరుణ వల్లే యువత దారి తప్పవచ్చు అంటారు”.
మూలాలకు చికిత్స చెయ్యాలి గానీ.. పుండెక్కడో ఉంటే మందింకో కాడా అయితే..ఎలా..!? శైలజామిత్రగారు ఎవరిని ఏమీ నిందించలేక కాలానికో లేఖ రాశారు. దేశంలో ప్రతి రోజూ ఎక్కడో ఓ చోట స్త్రీ మానభంగానికి, అవమానానికి, హింసకు గురవుతుంది. “భయం పోగొట్టే చట్టం బాధను పోగొట్టే చుట్టం “ఉండాలంటారు. కనీస ఓదార్పూ బాధిత మహిళలకూ అవసరమే..!
చదువుల తల్లి సావిత్రిబాయి గారికి విన్నవిస్తూ జ్వలిత గారిలేఖ ఇప్పటి సమాజ పోకడలు, జరుగుతున్న అత్యాచారాలకు కారణాలతో పాటు పరిష్కారాలు సూచిస్తూ.. “ఆడపిల్లలకు అక్షరజ్ఞానమూ రక్షణ నైపుణ్యాలను ఆత్మస్థైర్యం పెంపొందించాలంటూ.. మనుష్యులను ప్రేమించే విలువలను పిల్లలకు నేర్పాలంటూ” వారి లేఖా సారాంశం.
ఎవరో వస్తారని.. ఏదో మారుస్తారనీ ఎదురు
చూడకుండా ఎవరికి వారే మారాల్సిన
అవసరం ఇప్పుడత్యంతావశ్యకం..!

ఇంత అమూల్యమైన ఈ పుస్తకంలో మరిన్ని పరిమళాన్ని జోడించినట్లు ప్రముఖుల లేఖలు ప్రచురించడం ముదావహం..! సావిత్రిబాయి పూలే జ్యోతిబాపూలేకు వ్రాసిన ప్రేమ లేఖలు, సావిత్రిబాయి శిష్యురాలు ముక్తాబాయి పత్రికకు రాసిన తిరుగుబాటు లేఖ,
ఔరంగజేబు తన గురువుగారికి రాసిన అమూల్యమైన లేఖ, అమెరికా అధ్యక్షుడు అబ్రహం లింకన్ వారి అబ్బాయి గురించి ఉపాధ్యాయులకు వ్రాసిన లేఖ, బోయి భీమన్న గారి లేఖ..
ఆ అమూల్యమైన లేఖలని చదువుతూ ఆ కాలానికెళ్లి పులకించిపోతాం..! పుస్తకానికి ముందుమాటలు ఆచార్య సూర్యాధనుంజయ్ యశస్వి సతీష్ శీలా సుభద్రాదేవి గారల మాటలు పుస్తకానికి మరింత శోభనిచ్చాయి.. ఇక శేషబ్రహ్మం గారి కవర్ పేజీ అందంగా, అర్ధవంతగా అదనపు ఆకర్షణగా అమరింది..!

ఈ పుస్తకం ద్వారా జ్వలితగారు ఆశించిన మార్పు తప్పకుండా రావచ్చనీ.. వస్తుందని కోరుకుంటూ వారికి హార్థికాభినందనలతో…!

ప్రతులు..
జ్వలిత,సాహితీవనం.
15-21-130/బాలాజీ నగర్
కూకట్పల్లి..72
హైద్రాబాద్..
మొబైల్..9989198943
మెయిల్..jwalitha2020@gmail.com.

 

You may also like

Leave a Comment