Home Uncategorized లేఖల్లో తిలక్

లేఖల్లో తిలక్

by Cheedella Seetha Lakshmi
“ఆంధ్ర సాహిత్యంలో వచన కవితా శిల్పి,కవికుల తిలకుడు,రస గంగాధరుడు అయిన దేవరకొండ బాలగంగాధర తిలక్ తన రచనల ద్వారా ఒక విశిష్ట రచనా ప్రవృతిని,కవితా స్రవంతిని, నిర్దిష్టకులాలలో, నిరంతర రస ప్రవాహంగా ప్రవహింపచేశాడు. తన అమూల్య రచనల ద్వారా ఆంధ్ర సాహిత్య చరిత్రలో శాశ్వత కీర్తి చంద్రికల్ని ప్రసరింప చేశాడు. ఆయన రచనలు ఆంధ్ర సాహిత్య ధనాగారానికి ఒక అక్షయ రత్న సంపద వంటివి”.తిలక్ గొప్ప కవి.ఆధునిక తెలుగు సాహిత్యంలో ఇతనికొక విశిష్ట స్థానముంది.

నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలునా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అని తన కవితా లక్ష్యాన్ని చెప్పుకున్న దేవరకొండ బాల గంగాధర తిలక్ పశ్చిమగోదావరి జిల్లా తణుకు తాలూకా మండపాక గ్రామంలో ఆగస్టు 1 వ తేదీ 1921 సంవత్సరంలో జన్మించాడు.
సమాజంలో దగాపడిన వారి జీవితాలను చూసి చలించిన తిలక్ సున్నిత హృదయుడు కాబట్టి వాటినే తన కవితావస్తువులుగా మలచుకున్న
తిలక్ భావకవిత్వంలోని భావ సౌకుమార్యం, భాషా మార్దవం, అభ్యుదయ కవిత్వలక్షణాలతో కలసి వెలసిన తిలక్ కవిత్వం, అభ్యుదయ, భావ కవిత్వాల కలనేతతో “అమృతం కురిసిన రాత్రి,ప్రభాతము సంధ్య,గోరువంక కవితాసంపుటిలు,సుందరీ సుబ్బారావు,ఊరి చివర ఇల్లు అనే కథా సంపుటాలు,సుశీల పెళ్లి,,సాలెపురుగు అనే నాటకాలు,సుచిత్ర ప్రయాణం,ఇరుగుపొరుగు,సప్తశిల అనే నాటికలు ఎన్నో ప్రక్రియల్లో రచనలు చేసిన తిలక్ కేవలం 45 ఏళ్ల అతి చిన్న వయసులో సెప్టెంబరు 1 వ తేదీ 1966వ సంవత్సరంలో అనారోగ్యంతో తనువు చాలించాడు.చనిపోయాక కుందుర్తి ఆంజనేయులు రాసిన పీఠికతో 1968 సంవత్సరంలో ముద్రింపబడిన అమృతం కురిసిన రాత్రి ఉత్తమ కవితా సంపుటిగా 1971 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందింది.
సమాజాన్ని చూసి కరిగిపోయిన తిలక్
మిత్రులకు రాసిన లేఖల ద్వారా మిత్రులతో తిలక్ కున్న సత్సంబంధాలు ,తిలక్ వ్యక్తిత్వం,మనస్తత్వం మొదలగు ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది.

‘ఆవంత్స సోమసుందర్’ తిలక్ కు ప్రాణమిత్రుడు.సోమసుందర్ కు రాసిన లేఖలో ” జీవితంలో ఎప్పుడు ఎవరు వచ్చి గుండెల్ని పెనవేసుకుపోతారో ఏం తెలుస్తుంది.అలాగ సామీప్యంలోని ఆత్మీయమైన ఆవరణలోకి విచిత్రంగా సురభీకృతం చేస్తూ నువ్వొచ్చావు. అన్నా అని పిలిచావు.ఆ పిలుపు గుండె లోతులంటి, తిరిగి తమ్ముడూ అని ప్రతిబింబించక మానుతుందా? అందుకే ఇంకా మీరు అనే సంబోధన కృత్రిమంగా ఏదో దూరాన్ని పలకరిస్తున్నట్లు తోచి మానివేశాను.” అని రాయడం వల్ల మిత్రులను ఆత్మీయుతతో దగ్గరకు తీసే ప్రేమతత్వం కన్పిస్తుంది. వరవరరావుకు రాసిన లేఖలో ” నా కింత దగ్గరైన నువ్వు అలా అలా దూరదూరంగా ఎందుకున్నావో అని నా మనసు చాలా బాధ పడుతుంది.డబ్బూ,వ్యాపారమూ, ప్రయోజనమూ ప్రధానంగా ఎంచబడే నేటి సంఘంలో అవ్యాజమైన మైత్రి,ఆర్టిస్టుల మధ్య మైత్రి ఒకటి గదా!
కన్సిడరేషన్! నువ్వు నా కన్నా చాలా పిన్నవాడివైతే మాత్రం కుల వయో దశ భేదాలు కవులలో,కళారాధకులలో అప్లై చేయవు.” అంటాడు.మైత్రీ బంధానికి తిలక్ ఇచ్చిన విలువ గొప్పది.డబ్బు,హోదాకు లొంగనిది.కులాతీత,వయోతీతమైంది.నిస్వార్థ,అవ్యాజమైనదే అసలు సిసలైన మిత్రత్వము.నిజమైన మైత్రికి ఇవేవీ అడ్డుకావని మైత్రికి చక్కని నిర్వచనం చెప్పాడు.ఇలా లేఖలలో తిలక్ స్నేహానికిచ్చిన ప్రాధాన్యం తెలుస్తుంది.

జీవితంలో ఏదో సాధించాలనే ఆశ,తపన ” వేళ్ళ సందుల్లోంచి పొడి ఇసుకలా జారిపోయే కాలాన్ని, వయస్సునీ,తల్చుకుంటే భయమౌతుంది.” అని ఒక ప్రచురణ సంస్థ నెలకొల్పాలన్న తన ఉద్దేశ్యాన్ని తెలుపుతూ నీ సహకారం ఉంటే తప్పక కృతకృత్యుణ్ణవుతానని రాస్తూ సమయం దాటాక బాధపడి ప్రయోజనం లేదు.” అందుకే ఈ లోపుగా చేసి వెయ్యడం మంచిది కదా.” అంటూ సోమసుందర్ కు రాసిన లేఖలో తెలిపాడు.

మిరియాల రామకృష్ణకు రాసిన లేఖలో జీవితంలో తృప్తి ఎట్లా లభిస్తుందో వివరించాడు.” నెల బారుగా,చప్పగా,బాధగా వెళ్లిపోయే జీవితంలో ఏవో కొన్ని గొప్ప క్షణాల్ని మనవిగా చేసుకున్నామనే ఆనందమూ,దాన్ని నలుగురితో పంచుకోవడమూ కన్నా తృప్తి ఏముంది.” అంటూనే ” ఇక్కడ దట్టంగా పరచుకున్న మనుష్యారణ్యం మధ్య రోడ్ల దుమ్మూ,దోమలూ,రాజకీయాలు జుమ్మని చెలరేగే ఈ వాతావరణంలో కన్నా అడవుల పచ్చదనమూ,ప్రకృతి సన్నిహితంగా ఉన్న మీ జీవితమే సుఖకరమేమో.” అనడం వల్ల కుళ్లు మనుష్యుల మధ్య నలిగి బ్రతికే కంటే స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ అడవుల్లో ఉంటే మనసుకు తృప్తి అనే భావన కలిగినవాడు. అట్లాని మానసికమైన ఒంటరితనాన్ని భరించడం కూడా కష్టమే నంటాడు.

తిలక్ బాధాతప్త హృదయుడు.జీవితంలో జరిగిన సంఘటనలు, మనసులో మరపురాని ముద్రలే అతన్ని కవిగా చేశాయి మోగంటి మణిక్యాంబకు రాసిన లేఖలో చిన్నతనంలో ఒక వృద్ధుడు,జీర్ణాదేహుడు,ఆకలితో అలమటిస్తున్న వాణ్ణి చూసి ఎంతో ఏడ్చాడు.” జీవితం అంటే ఏమిటి? సృష్టి పరమార్థం ఏమిటి? అన్న చింతనలో పడ్డాడు.16,17 సంవత్సరాల వయసులో ఒకసారి పార్క్ టౌన్ స్టేషన్ లో దిగివస్తుంటే ఇద్దరు ముగ్గురు బాబూ! ఒక మాట అని పిలిచారు.ఏమిటో నని వారి దగ్గరకు వెళ్ళాడు.ఒక వస్తువు మీద గుడ్డను తీసి చూపించారు.భయంకరమైన, వికృతమైన శవం.దహనానికి చందా అడుగుతున్నారు.జేబులోంచి చేతికి వచ్చిన డబ్బు తీసి వాళ్ళకిచ్చి వెళ్ళాడు.గది కెళ్లగానే ఒళ్ళంతా ఏదో అయిపోతున్నట్లు భయపడ్డాడు.రాత్రంతా ఆలోచనలతో సతమతమయి అంతా మిథ్యగా అనిపించింది.బ్రతుకు మీద విరక్తి కలిగింది.

ఇంకోసారి మిత్రులతో సినిమాకి వెళ్తున్న సమయంలో ఒక ఎనిమిదేళ్ల పిల్ల ఆకలిగా ఉంది.డబ్బులిమ్మంది అందరూ ఆమెని విదిలించుకుని చీ అని తోసి వేస్తుంటే సభ్యత కోసం తిలక్ కూడా విదిలించుకున్నాడు.ఆ రోజు రాత్రంతా బాలికనే కళ్ళముందు నిలిచింది తెల్లవారి జేబులో పది రూపాయలు వేసుకుని ఆ అమ్మాయి కోసం అంతా గాలించాడు.కానీ ఆమె కనిపించలేదు.మూడు రోజులు వెతికాడు కానీ వృధా. ” ఆమె అందమూ ,సొగసైన కళ్ళు,ఆ బాల్య చాపల్యమైన మనస్సు ఏ ధూళిలో ఏ బాధలో ఏ మంటలో దినదినమూ కాలిపోతున్నాయి ” ఎవరు దీనికి కారణం?…విలవిలలాడి పోయాను.ఆమె నా చెల్లెలే అయితే అలా ఛీదరించుకునేవాణ్ణ ?” అనుకున్నాడు నెలరోజుల తర్వాత ఆమె కనిపిస్తే జేబులోంచి ఆరు రూపాయలు తీసి చేతిలో పెట్టి ఒక రోజు కడుపు నిండా తిను అని వెళ్ళిపోయాడు.అప్పటి సంఘటనలు మనసులో కలవరం రేపి ” ఈ జీవితానికి,సమాజానికి అర్థం తెలుసుకోవడానికి,ఒక అర్థం ఇవ్వడానికి ఒక ఆదర్శ జ్వాలలో నా బ్రతుకును చుట్ట బెట్టి తోడు లేని ఈ దారిని నాటి నుండి ప్రయాణం” సాగించి అనేక బాధలతో,అనారోగ్యంతో అలమటించి ” గొప్ప అనుభవాన్ని కవిత్వాన్ని పొందాడు మధురమైన
ఆ హృదయాన్ని,మనస్సుని లోకంచుట్టూ తిప్పి సౌందర్యాన్ని అవలోకించి ఆహ్వానించాడు.” అని చెప్పిన సున్నిత హృదయుడు,కోమల మనస్కుడు జీవితానికి,సృష్టికీ ఒక అర్థం వెదికి సమాజానికి సుఖ సంతోషాల్ని అన్వేషించాలనే తపన కలవాడు.” మనిషీ, సంఘమూ,దేశమూ, విశ్వమూ ఈ సర్వ జగత్తు జ్ఞాన సరస్సులో విరిసిన ప్రేమ పద్మం లాగా సత్యం,శివం, సుందర శీలమై ఉండాలి.” అంటాడు.”

వ్యుత్పత్తి,వివేకం,ఉద్రేకం ఇన్నింటిని సమ్యక్ స్వరంలా మేళవించి” ఏదో సాధించాలనే తహతహలాడేవాడు.నిజమైన వెలుగు కోసం ” ఏళ్ల తరబడి సృష్టించుకున్న మౌఢ్య భావాలు,సంకెళ్లని పగులగొట్టి” స్వార్థమూ, సంఘ గౌరవమూ, ధనమూ ప్రధానమైన ఈ లోకాన్ని ఖాతరు చేయక ఏ పరిస్థితినైనా ఒంటరిగా ఎదుర్కోగల ఆత్మీయశక్తి నాకుంది ఆనుకొని ” సంపూర్ణ నిర్మలానురాగం ముందు తప్ప తల వాల్చగూడదని ప్రతిజ్ఞ చేసుకున్నాడు.” అని మానసిక ఆవేదనను,ఆశయాన్ని తేటతెల్లం చేశాడు.” నిర్ధయా, నిశ్చితమైన నిధి కొండరాళ్ల మీద తలబాదుకొని ఏడ్చినవాణ్ణి కాబట్టి ఏ విశ్వాసాన్ని వృధా పోనివ్వను.” సున్నితమైన నా మనస్సు మీద కూడా ఎన్నో దెబ్బలు తగిలాయి.” అంటూ మానసిక బాధను వ్యక్తపరచి ” ఒక్కొక్క కన్నీటి చుక్కను తుడువగలిగితే జన్మ సార్థకమన్న శరత్ మాటలను స్వతహాగా ఆచరించాలన్న ఉబలాటం కలిగిన వాడు.ఆయన మాటల్లోనే ” ఒక సంఘము నుండి ఉబికే బాష్పాన్ని తుడువగలిగితే ఒక్క అధరం మీదికి హాస్యాన్ని రప్పింపగలిగితే జీవితం ధన్యమౌతుందని నా ఉద్దేశ్యం.కరుణ,సౌందర్యమూ, మానవత్వమూ ఈ మూడు ప్రాతిపదికలుగా నా ఆదర్శాన్ని,ఆలోచనల్ని నిర్మించుకున్నాను నా రచనలూ నా జీవితమూ ఈ భావనల్ని వ్యక్తీకరించకపోతే నేను జీవచ్చవాన్ని” అని తన కవితా లక్ష్యాన్ని, జీవితాదర్శాన్ని వివరించాడు.తిలక్ మనస్తత్వమేమిటో ఎంతో చక్కగా వివరించాడు లేఖల ద్వారా.” *దుఃఖానికీ, బాధకీ కరుగలేకపోతే ఈ బాలగంగాధరుడు తన కవిత్వాన్ని,తన ప్రాణాన్ని కూడా బంగాళాఖాతంలో విసిరిపోతాడు అతనిలో ఎంతో దృఢవిశ్వాసం కన్పిస్తుంది.మనిషికి మానవత్వముండాలి.కరుణ, జాలి,దయా ఉండాలి.అవి లేకపోతే జీవచ్చవమేనన్న అభిప్రాయం కలవాడు.తిలక్.జీవితానుభవాలకు,రచనలకు అవినాభావ సంబంధమున్న విషయం ప్రస్పుటమైందీ లేఖల్లో.

” ఆర్ద్రమైన ప్రతి హృదయమూ అశ్రుసిక్తమైన ప్రతి నయనమూ సుందరమైన ప్రతి దృశ్యమూ నన్ను కలలో కూడా వశం చేసుకుంటాయి.ఒక్క పాటకోసం ఒక్క మాటకోసం అవసరమైతే ఈ ధనాన్ని జగత్తునీ కాదనగల సాహసం వుంది నాకు”.అని ప్రపంచాన్నే ఎదిరించి పోరాడిన ధీశాలి, కవితా వీరుడు.కవికి ఉండవలసిన ఉత్తమగుణం తిలక్ లో కనిపిస్తుంది.కవి ఊహలో చరించకుండా జగత్తులో చేదు నిజాన్ని చవిచూసి అనుభవించి ఆవిష్కరించాడు. బాహ్య జగత్తులోని విశిష్ట సన్నివేశాల వలన, ప్రజ్ఞా విశేషం వలన తమలో కలిగిన ఆలోచనా వైవిధ్యం చేత,తమకు కలిగిన అనుభవాలను కావ్య చిత్రణం ద్వారా వ్యక్తీకరించి ఆనందం చేకూర్చడం తిలక్ లక్ష్యం.ఇంద్రియాలకు తృప్తి కలిగించేది అతని దృష్టిలో ఆనందం కాదు మానవత్వంలో పరిపూర్ణత నొందుటలోనే ఆనంద మున్నదని అతని సిద్ధాంతం. *సుందర స్వప్నాల మేడమెట్ల నుండి వాస్తవిక శిథిల రూపాలలోకి హఠాత్తుగా జారిపడిన నాకు తెలుసు అంటాడు.” పైకి నవ్వుతున్నా అలలో విరగబడుతూ ఆడుతున్న సముద్రం కడుపులో వున్న బడబాగ్ని జ్వాల నెవరు గుర్తిస్తారు”. అని వాపోతాడు,లోతుల్ని వెతుకుతాడు.
జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా గాయాలు తగిలినా ఎదుర్కోగలిగే శక్తి గలవాడు.కృంగిపోవడం నా స్వభావానికి వ్యతిరేకం అన్న ధీరమనస్కుడు.
అసలు కవి అంటే ఎవరు?కవి ధర్మాన్ని లేఖల్లో వివరించాడు.” సున్నితమైన ఊహ,ఉద్రేకము,” ఉంటేనే గొప్ప రచనలు వస్తాయన్న విశ్వాసము కలవాడు.సాధారణంగా మానవులందరూ దైనందిన సమస్యలతో ,బాధలతో సతమతమవుతూ వుంటారు.చిన్న చిన్న కోరికలూ,ద్వేషాలూ,అల్పమైన ఊహాలతో సతమతమవుతూ వుంటారు.” నేలబారుగా జడంగా స్తబ్దంగా గొంగళిపురుగుల్లా పాకుతారు.వాళ్ళకి సౌందర్యం డబ్బులోనూ ఉద్యోగం లోనూ భేషజంలోనూ కనబడుతుంది కానీ కళాశీలికి యివేమీ కనిపించవు.అతనికున్న విలువలు వేరు.అతని చూపు వినీల గగనాన్ని బురుసుకుంటూ నక్షత్రమండలంలోకి పోతుంది.అతడు మనిషి లోపల మనిషిని చూస్తాడు.అతని దృష్టి ఎక్కడ అందం వున్నా నిజం వున్నా అక్కడ వాలుతుంది. దేనికోసమో తపన,అన్వేషణ నిరంతరంగా సాగిస్తాడు.ఈ యాత్రలో అతడు లౌకిక జగత్తును లక్ష్య పెట్టడు. అందుకే అతని ఊహ శాశ్వతమైంది.అతని నీతి అతీతమైంది.అతని రచన అక్షరమైంది. నశించనిది.” కవి ఊహ లోకోత్తరమైంది. అందువల్లనే ఉత్తమ రచన సార్వజనీనము,సార్వకాలికమౌతుందన్న ప్రాచీన ఆలంకారికుల అభిప్రాయాలను తలపింపచేశాడు.

కవి సంప్రదాయబద్ధుడుగా కాక కాలానుగుణంగా నూతనత్వాన్ని సంతరించుకొని రచన సాగించాలంటాడు. కుళ్ళిన ముసలిదైపోయిన సంఘాన్ని,బూజు పట్టిన భావాల్ని రూపుమాపే బాధ్యత కూడా రచయితదే. అంటూ సంఘాన్ని మేల్కొల్పాలి,ప్రజలను చైతన్యవంతులను చేయాలి.ఆత్మవిశ్వాసం ఉండాలి.కవిత్వాన్ని సమగ్రంగా దర్శించడమూ,జీవిత విధానాన్ని గురించి స్పందించడమూ చాలా అవసరం అంటాడు తిలక్.

తిలక్ ప్రకృతిలోని అందాన్ని చూసి పరవశించిపోయేవాడు.ప్రకృతిని ఆరాధించేవాడు.లేఖల్లో ప్రకృతి వర్ణన కూడా కనిపిస్తుంది.సహజ చిత్రీకరణ,కవి దృష్టి ప్రత్యేకంగా లోతుల్ని చూస్తుంది.గుండెను హత్తుకుపోయే విధంగా ఉంది.ప్రకృతి వర్ణన సహజంగా వుంది. సోమసుందర్ కు రాసిన లేఖలో ” ఈ రెండు రోజుల నుంచీ వర్షం కురిసి కురిసి భూమి తడిసి తడిసి పచ్చి పచ్చి బాలింతరాలిగా అందంగా వుంది ” అంటాడు
వర్షాకాలంలో తడిగా ఉన్న భూమి ఎట్లా ఉందో ఉపమాలంకార ప్రయోగం చేశాడు. ఆలంకారిక రచన,ప్రకృతిసాన్నిహిత్యాన్ని కోరుకునేవాడు.దట్టంగా పరచుకున్న మనుషారణ్యం మధ్య రోడ్ల దుమ్మూ దోమలూ రాజకీయాలూ జుమ్మని చెలరేగే ఈ వాతావరణంలోకన్నా అడవుల పచ్చదనము,ప్రకృతి సన్నిహితంగా వున్న జీవితమే మంచిదని మిరియాల రామకృష్ణ గారికి రాసిన ఉత్తరంలో తెలియజేశాడు.వర్షాకాలం అంటే తిలక్ ఇష్టపడేవాడు.ఆకాశంలో నల్లని మబ్బులు,ఒక్కసారిగా వాన,భూమి చల్లబడి పచ్చబడి మనసుకు ఎంతో హాయిసిస్తుందని చెప్తూనే ” స్నానం చేసి వచ్చిన యవ్వనవతి శరీరంలాగా విచిత్రమైన అందం,ఆకర్షణ.” ఉందని వర్ణించాడు.
మోగంటి మాణిక్యాంబా దేవికి రాసిన లేఖలో మనసులోని వ్యధను ఎవరూ గుర్తించలేరని రాస్తున్న సందర్భంలో పైకి నవ్వుతున్నా అలలలో విరగబడుతూ ఆడుతున్న సముద్రం కడుపులో ఉన్న బడబాగ్ని జ్వాల నెవరు గుర్తిస్తారు అంటూనే జీవితం చాలా విచిత్రమైంది,అద్భుతమైందని చెప్తూనే ” రంగురంగుల అలలలో వంగి బ్రతుకు అంచుల్ని ముంచుతూ వుంటుంది. ఎన్ని స్వప్నాలూ,ఎంత లోతు తెలియని భయంకరాఘాతాలు.” అంటూనే సూర్యోదయాన్ని యీ విధంగా ” చీకటి లొత్త గిత్తి మెత్తని వెల్తురు తూర్పున ఆడదాని అనురాగంలాగ వ్యాపిస్తోంది.నక్షత్రాలు కాంతి విహీనమై గాజుపూసల్లాగా వున్నాయి. అక్కడక్కడ ఒక మబ్బు ఏ అప్సరస ఒంటిమీద నుండో జారిన చీరకొంగులాగ గాలిలో తేలిపోతుంది.మనోహరమూ,శాంతమూ అయిన ఆ ప్రకృతిలో లీనమౌతున్న నా మనసుకు మళ్లీ అశాంతి.” అంటూ తన అనుభూతిని వివరించాడు ఇంతలోనే నిరాశావాదం.” లోపల్లోపల ఏదో ఒంటరితనం ఒక్కణ్ణే నా బాధలతో ఏదో ఎడారి అంచులమీద నడచిపోతున్నాను– అనిపించింది.ఈ సంసారమూ ఈ స్నేహాలూ అన్నీ ఎండమావులేమో– అనిపిస్తుంది.మబ్బు పట్టి ఆకాశంలో ఈ రోజంతా తెలియని చక్కని కౌశలమూ ప్రజ్ఞా వుంది.నేను కొంత ఆశ్చర్య పడ్డాను.ఇంత బాగా రాయగలడా కథలు కూడా అని— కాని నీ కథల పుస్తకంలో ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించుటకుగాని,బలపరచుటకుగాని నీవు చేసిన ప్రయత్నం- ఆ కథాశిల్పంలో ముఖ్య దోషంగా కనబడింది.ఆ కథల రక్తిని అనుభవించకుండా చేసింది. పాలటబులో డిజైనులవల్ల కళ ఎప్పుడూ పరిమితమూ సంకుచితమూ అయిపోతుంది.అయితే ఆ రోజుల్లో నువ్వు ఆ ప్రభావపు ఇనుప కౌగిలిలో ఉండేవాడిని.కాని ‘కాలనేమి’ లో దోషం మచ్చుకైనా లేదు”.

వరవరరావు రచనలపై తన అభిప్రాయాన్ని తెలుపుతూ వరవరరావుకు రాసిన లేఖలో “అమృతవృష్టిలో అక్కడక్కడ బెట్టుగా ఉంది.యజ్ఞంకై కొత్త టానిక్,సోషలిస్టు సీత–ఇటువంటివి అనుచితంగా తోచాయి.
కుక్క నోట్లోంచి ఎంగిలాకు– ఆ ఇమేజరీ ఎందుకో? ఫోర్స్ డ్ గా వున్నట్లు అనిపించింది.రాకాశశికి మబ్బురంగు పైట అన్నాడు.మబ్బే పైటగా ఉంటుంది గదా.ఆషాఢ మాసంలో ఆ రంగుగల మరో పైట ఏముంటుంది? శశికి మరోసారి రివైజ్ చేస్తే మంచిదేమో అనుకున్నాను.నాకు నచ్చిన లైన్స్ గురించి చెప్పడం లేదు.మీరు మరోసారి చూడండి.మరి మీ కెలా తోస్తుందో? అన్నట్లు “వూసి” అని రెండు మూడు సార్లు ప్రయోగించారు.దాని అర్థం? నాకు కొత్తగా ఉంది.” – యూసేజ్. వరవరరావు తన రచనను సమర్థించినట్లు తెలిశాక నేను తప్పుగా అర్థం చేసుకున్నాను,పొరపాటయింది అని వేరే లేఖలో” పేజీలు సరిజేసి చదివితే రచన సందర్బశుద్ధిగా కనబడింది.” అని రాశాడు. వెనుకటి కవులకు తన కాలంలో కవులకు తారతమ్యాన్ని వివరిస్తూ ” నా వెనుక తరంలో కవులలో ముఖస్తుతీ వెనకాలే దూషణా ప్రత్యేకంగా ఉండేవి.సామాన్యుడి కన్నా ఊహలో,సంస్కారంలో మరికాస్త పెరుగుదల సూచించవలసిన ఆ కవులలో కనబడే ఈ కృత్రిమత్వం ,పిరికితనం దుర్భరమనిపించేవి.ఆఖరుకి కవిత్వంలో కవిత్వాన్ని గురించి నిజాయితీగా చూడలేని వీరి నుంచి ఏ మాశించగలమనుకొనే వాడివి.” అంటాడు.

జానకీ జానికి రాసిన ఉత్తరంలో ‘ మోడరన్ పోయిట్రీ పేరుతో పత్రికలలో ప్రకటితమయ్యే వాటిని చూచి విసుగు చెందాను.దాని మూలంగా చాలా విచారిస్తున్నాను.ప్రబంధయుగంలో చివరికాలంలో వచ్చిన సాహిత్యంలోని సమానమయిన క్షీణత, పదాల గారడి,నడకల శూన్యత,ప్రాస కొరకు ప్రయత్నించుట అందులో మనకు గోచరిస్తాయి.” అంటూ నవీన కాలాన్ని గూర్చి శ్రీపాద గోపాలకృష్ణ మూర్తి రాసిన వ్యాసమే బాగుందని చెప్తూ సమకాలీన చరిత్రను గూర్చి విశదంగా విమర్శిస్తారని అనుకుంటున్నాదన్నాడు.

ఈ విధంగా తిలక్ లేఖల్లో అతని అనుభూతులు,అనుభవాలు, కవితాలక్ష్యం,రచనోద్దేశ్యం,విమర్శ, ప్రకృతి వర్ణన,ఆరోగ్య విషయాలు,మిత్రత్వానికి యిచ్చిన విలువ మొదలైనవి అనేకాంశాలు విదితమౌతున్నాయి.స్నేహితులకు తన మనోగతాన్ని స్పష్టంగా,నిర్మొహమాటంగా, కవితాత్మకతలో విశదపర్చడం లేఖలవల్ల గమనించవచ్చు. మారుతున్న కాలాన్ని బట్టి సత్యాన్ని అన్వేషించి సమాజాన్ని జాగృతం చేసేదే నిజమైన కవిత్వమనే అభిప్రాయం వున్నవాడు మానవత్వంలో పరిపూర్ణత నొందజూచుటలోనే ఆనందమున్నదని అతని సిద్ధాంతం.
ఈ రకంగా లేఖల వలన కవిత్వంపట్ల తిలక్ కున్న ప్రత్యేకమైన,ఖచ్చితమైన అభిప్రాయం తెలుస్తుంది.
తెలుగు సాహిత్య కన్యకు తన రచనల ద్వారా తిలకం దిద్దిన ప్రముఖ కవి తిలక్ సాహిత్య పరంగా కూడా లేఖలకు ప్రముఖ స్థానముందని చెప్పడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు.

You may also like

Leave a Comment