Home ఇంట‌ర్వ్యూలు సామాజిక బాధ్యతనెరిగి రచనలు చేయాలి

సామాజిక బాధ్యతనెరిగి రచనలు చేయాలి

by Devendra

– అనిశెట్టి రజిత

మాది హన్మకొండలోని కుమార్పల్లి. మా బాపు అనిశెట్టి బాలరాజు, అమ్మ జయలక్ష్మి. మేమిద్దరం. నాకన్నా రెండేళ్ళు చిన్నది మా చెల్లెలు రేణుక. నేను 14, ఏప్రిల్, 1958 రోజున పుట్టాను. మా బాపు కాంగ్రెస్ రాజకీయాలతో సంబంధం కలిగి వుండేది. ఇంట్లో అటు వ్యవసాయపు వాతావరణం, రాజకీయ వాతావరణమూ ఉండేది. నేను మా వాడలోని పిల్లల్ని పోగేసి తీరొక్క ఆటలు ఆడేది. డ్రామాలు కూడా వేయించేది. అప్పటి నుంచే కొన్ని లక్షణాలు ఉండేవి. అందర్నీ కూడగట్టడం ఒక ఆటో, పాటో నేర్పించే ప్రయత్నం చేయడం. పెద్దవాళ్ళు చేసే ప్రతి పనినీ అంటే అనుకరించడం చేసేది. తిండికి లోటు లేదు. ఆటోరిక్షాలు లేని ఆ రోజుల్లో పది మైళ్ళ దూరంలో ఉన్న ఆంగ్ల భాష స్కూళ్లో చేర్పించారు. పొద్దున రిక్షాలో బయలుదేరి పోతే చీకట్లో ఇంటికొచ్చేది. పసితనం కాబట్టి ఆ అర్థంకాని ఆంగ్ల భాషల్లో చదువూ, బడి వాతావరణం, సుదీర్ఘమైన సమయం అంతా బడిలో ఉండాల్సిరావడం భరించరానిదిగా ఉండేది. రోజూ ఏడుపు, లొల్లి. రోజూ రిక్షా ఆగయ్య తాత అంగీలు చించడం, మా బాపు కమీజులు ఇయ్యడం… అంతా ఒక ప్రహసనంగా జరిగేది. చిన్నప్పటి నుండే పిల్లలను ఎవరైనా సతాయిస్తే చూసి గట్టి చెంపదెబ్బ కొట్టేది. కొట్టిన తరవాత ఏం జరగనుందో అని భయపడేది. రోజూ మా మేనత్త తన వెంట రిక్షాలో నన్ను తీసుకపోయి నన్ను బడిలో దించి తన బడికి వెళ్ళిపోయేది. చిన్నప్పటినుండీ నాకు మా చెల్లెలికి తల్లితో అటాచ్మెంట్‍ లేదు. మా మేనత్త విమలాదేవి పెత్తనంలో ఇల్లు నడిచేది. చదువుకున్నది, హిందీ టీచర్గా ఉద్యోగం చేసేది. మా ఇండ్లలో అది చాలా గొప్పే. ఆమె చాలా స్ట్రిక్ట్, చూస్తేనే అందరూ భయపడేది. నాలుగో తరగతికి వచ్చిన తర్వాత కూడా రోజూ నన్ను చావగొట్టేది. బహుశా చదువు విషయంలో నేను తిన్నన్ని చావు దెబ్బలు ఎవ్వరూ తినలేదేమో. అంతా పద్ధతి ప్రకారం జరగాలి ఆమెకు. ఆమె పెట్టిందే క్రమశిక్షణ అనుకోవాలె. ఇంట్లో మాకో కుట్టుమిషన్‍ ఉండేది. నాకూ మా చెల్లెలుకు మంచి డిజైన్లతో డ్రెస్సులు కుట్టి తొడిగేది. అయినా అవన్నీ నేను చదివే కాన్వెంట్ స్కూళ్లలోని పెద్ద ఉద్యోగస్తుల, పెద్ద హోదాలున్న వాళ్ళ పిల్లల డ్రెస్‍ల ముందు వెలవెలబోయేవి. మంచి బట్టలు లేవని ప్రతి శనివారం నేను కుంచించుకపోయేదాన్ని. ఆ రోజు బడిలో సిగ్గు సిగ్గుగా గడిపేది.

అనిశెట్టి రజితతో ముఖాముఖి గ్రహీత డా|| దేవేంద్ర


రకరకాల అనుభవాలలో బాల్యం గడిచింది. తల్లితో అటాచ్మెంట్‍ లేకపోవడం. తండ్రి ఎక్కువ కాలం హైదరాబాద్‍లో ఉండటం. ఇంట్లో మేనత్త పెత్తనం కింద తన్నులు తింటూ గడిపిన బాల్యం నాది. తల్లితో లేని ఆ అనుబంధం బహుశా ఇప్పటివరకూ ఒక వెలితిగా నన్ను వెంటాడుతూనే ఉందేమో. రోజూ తన్నులూ, ఆ ఇంగ్లీష్‍ చదువుల పట్ల అనాసక్తీ, ఆ వాతావరణం ఏదైతేనేమి, భవిష్యత్‍ చదువుకు ఒక గట్టి పునాది పడిందనుకోవాలి. తెలుగు భాష, పుస్తకాలు, సబ్జెక్ట్ పట్ల మమకారం, ఇష్టం ఉండేది. మాతృప్రేమ లాంటిది కావచ్చు.

కళాశాలలోకి వచ్చిన తరవాత ఒక్క తెలుగు క్లాస్‍ తప్ప అన్ని క్లాస్‍ల పట్ల అనాసక్తి ఉండేది. నాకు ఇంటర్‍లో ఆర్ట్స్ చదవాలని ఉండేది. కానీ మా మేనత్త ప్రెజర్‍ తెచ్చి సైన్స్లో చేర్పించింది. ఆ కాలేజీ రోజుల్లో చదువు తక్కువ ఆటా పాటలే ఎక్కువ, సీరియస్‌నెస్ లేదు. ఫలితంగా ఇంటర్‍లో ఫెయిల్‍ అయ్యాను. తరవాత మరో కళాశాల, హైదరాబాద్‍ పాలిటెక్నిక్‍లో ఫార్మసీ డిప్లొమాలో చేర్చారు. దాన్ని బహు సమర్థవంతంగా నిర్వహించుకుంటూనే ఇంటర్‍లో తప్పిన సబ్జెక్టస్ రాసి పాస య్యాను. మొదటి సంవత్సరం ఫార్మసీలో డిస్టింక్షన్‍లో పాసయ్యాను. ఫైనల్‍ ఇయర్‍ చివరన పరీక్షల కు నెలరోజుల ముందుగా 9 మార్చ్, 1979 రోజున మా బాపు హార్ట్ స్ట్రోక్‍తో చనిపోయాడు. నేను పరీక్షలు రాయలేకపోయాను. వరంగల్‍ కొచ్చి నాకిష్టమైన బి.ఏ.లో చేరాను. వెంటాడే పుట్టెడు సమస్యలున్నా బి.ఏ.అంటే ఇష్టం కాబట్టి బంగారు పతకం సాధించలిగాను వెంటనే యం.ఏ.లో చేరడం ,అందులో కూడా గోల్డ్ మెడల్ సాధించాను .ఆ తరువాత యం.ఫిల్‍.లో చేరాను. తరవాత సాగిన చదువంతా అర్ధాంతరమే. ప్రీ పిహెచ్‍.డి.లో 70 శాతం సాధించినా డాక్టరేట్‍ పూర్తి చేయలేదు. కారణం ఇంటా బయిటా రకరకాల వ్యక్తులూ, వాళ్ళు సృష్టించిన సమస్యలతో ఘర్షణా, తలెత్తిన సంక్షోభాలూ, బాధ్యతలు మీదబడిన ఒత్తిళ్ళు. వీటితో నిరంతరం ఎదురీతతో సరిపోయేది. అందుకే నేను బోల్డ్ గా మారిపోయాను.అప్పటికే వామపక్ష రాజకీయాలతో ప్రభావితమై సామాజికంగా యాక్టివ్‍గా ఉన్నాను. నన్ను నేను ఒక యుద్ధపు పనిముట్టుగా మార్చుకున్నాను. పనిముట్టనే అంటాను. ఆయుధం, అస్త్రం అనాలేమో! బాపు చనిపోయిన నాటినుండీ నాపై అంటే నా మెడలపై ఇంటి బాధ్యతల కాడిని అనివార్యంగా మోయాల్సివచ్చింది.
అటు కళాశాల చదువు ఇటు సమస్యలతో పెనుగులాట అంతా సమాంతరంగా సాగిపోయింది. మరోవైపు ఉద్యమ సంస్కృతి బలపడుతూపోయింది. నా నీడే నాకు శత్రువైన సందర్భాలు, లోకం తెలుసుకోడానికి నెత్తురు అర్పించిన సందర్భాలు అన్నీ అనుభవమయ్యింది ఈ ఆరేడేళ్ళ కాలంలోనే. మనుషుల్లో ఉన్న మృగత్వం, వేటాడే తత్వం, అబద్ధాలతో అంటకాగే తత్వం అన్నీ తెలిసివచ్చాయి. నిజాల కన్నా అబద్ధాలకే ఇప్పుడు పవర్‍, చెలామణి అయ్యే అవకాశం ఎక్కువ. కడుపులో కత్తులు పెట్టుకొని కౌగలించుకునేవాళ్ళే ఎక్కువ. అసూయలు జీవితాలతో చెలగాటమాడి దెబ్బతీస్తాయి. అబద్దానికీ నిజానికీ నిరంతర ఘర్షణ! మంచికీ చెడుకూ మధ్య నిత్య పోరాటం! జీవితమంటే విరామమెరుగని విచిత్ర యుద్ధం!

ఉపాధి అంటూ ఏమీ లేనప్పుడు కనాకష్టంగా కాలేజీ స్కాలర్‍షిప్‍లతో గడుపుతూ వచ్చాము. 1992లో కాకతీయ విశ్వవిద్యాలయంలో బోధనేతర ఉద్యోగిగా చేరాను. తిండికి బట్టకూ సరిపెట్టుకున్నాము. ఇక్కడొక విషయాన్ని తప్పక ప్రస్తావించాలి. 1969-71 తెలంగాణ ఉద్యమంలో 13 ఏళ్ళ వయసులో పాల్గొన్నాను. ఆ ఉద్యమ నేపథ్యమే నాకు ఉద్యోగం ఇప్పించింది అనుకుంటాను. ఒక విధంగా ఆ ఉద్యమమే నాకు నిన్నా మొన్నటి దాకా బువ్వ పెట్టింది. ఉద్యోగ ప్రస్థానంలో ఒక ఆడపిల్లగా, వెనుక ధనరాశులు లేవు, కులం బలం లేదు, తండ్రి నీడా లేదు. ఎక్కువగా మగ ఉద్యోగులతో కొలువైన ఉద్యోగ ప్రాంగణాల్లో సాటి తోటి ఉద్యోగులతో వేధింపులు ఎదుర్కోవడంలో వింతేమీ లేదు. అయితే ఇతర ఉద్యోగినీ మిత్రులు ఎదుర్కొన్న దానికీ నాకూ తేడా ఉండేది. ప్రధానంగా వారు అసూయనూ లైంగిక వేధింపులనూ ఎదుర్కొంటే నేను అసూయనూ స్త్రీ అయినందుకు ఓర్వలేనితనానికి సంబంధించిన వేధింపులు ఉండేవి. నా సామాజిక ఉద్యమ నేపధ్యం వాళ్ళకి తెలుసు కాబట్టి వేధింపుల నుండి చాలావరకు తప్పించుకోగలిగాను. ఇక క్లాస్‍-4, ఇతర ఉద్యోగినులు, భర్త చనిపోతేనో, తండ్రి చనిపోతేనో హ్యుమానిటేరియన్‍ గ్రౌండ్స్లో ఉద్యోగాలకు వచ్చిన ఆడవాళ్ళపై విపరీతమైన ఒత్తిళ్ళు, వేధింపులు ఉండేవి. వారిలో చాలా వరకు నా సపోర్టు, సహాయం కోసం వచ్చేవాళ్ళు. నేను వాళ్ళ పక్షాన నిలబడినందుకు నాపై కక్ష కట్టేవాళ్ళు. అదంతా ఒక అధ్యాయం. నేను దేనికి లొంగను, ఎక్కడా రాజీపడను. భయం, లాలూచీ, లొంగుబాటు నా డిక్షనరీలోనే లేవు. అప్పటికి నా వయసు 31-33 సంవత్సరాలు నా జీవితానుభవాలు నన్ను స్టబర్న్ గా తయారుచేసాయి. యధాతథ సమాజంపై నిరసన, కసి, ధిక్కారం నాలో జ్వలనాలుగా మారాయి. నేను సూటిగా మాట్లాడుతాను కాబట్టి కోతికి కొబ్బరికాయ దొరికినట్లు నన్ను ఏదోవంకతో నిందించాలని కాచుకుని ఉన్నవాళ్లకు మంచి అవకాశంగా వుంటుంది.

చాలా చిన్నప్పటి నుండి పత్రికలు చదవడం, నవలలూ, పురాణేతిహాసాలు చదవడం.. సాహిత్యం పట్ల ఇష్టం ఏర్పడింది. రేడియో కార్యక్రమాలు తప్పనిసరిగా వినడం.. సందర్భాలననుసరించి ప్రసారమయ్యే ‘కవి సమ్మేళనాలు’ రేడియో ద్వారా చాలా ప్రభావితం చేసాయి. జిల్లా గ్రంథాలయంలో పుస్తకాలు తెచ్చుకొని చదవటం ఒక అలవాటుగా మారిపోయింది. 1977లో వరంగల్‍లో ‘చైతన్య సాహితి’ లో వ్యవస్థాపన నుండీ ఎన్నో సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ఆనాటి సుప్రసిద్ధ కవులు, రచయితలు పరిచయం, వారి ప్రసంగాలు వినడం, తరవాత సాంస్కృతిక సమాఖ్య, శ్రీలేఖ సాహితి.. ఉమ్మడి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో సాహిత్య సదస్సులూ, ఉత్సవాల్లో పాల్గొనడం ఈ విధంగా సాహిత్యాభిరుచి పెరుగుతూపోయింది. ఒకవైపు చైనా, రష్యా, లాటిన్‍ అమెరికాల అనువాద సాహిత్యం, అభ్యుదయ, హేతువాద, విప్లవ సాహిత్యం చదవడం, మన తెలుగు కవుల కవితా సంపుటాలు చదవడం నాలో కవిత్వ, సాహిత్య పిపాస ఎక్కువవుతూపోయింది. నిజానికి పుస్తకాలే నాకు మంచి నేస్తాలుగా మారాయి. సాహిత్యంలోని సృజనశక్తి విలువ తెలుసొచ్చింది. సామాజిక ఉద్యమ సాంగత్యం సాహిత్యానికి మరింత చేరువ చేసింది. నా కలం పాళి ‘అగ్నిపాళి’గా మారిపోయింది. అప్పట్లోనే మా కుటుంబంలో ఒక పాపకు ‘సృజన’ అని పేరు పెట్టుకున్నాము. మన సమాజంలో ఆస్తులకు ఉన్నట్లే కళలకూ, వ్యాపారాలకూ, జ్ఞానానికీ వారసులుంటారు, వారసత్వ సమాజం కదా. నిజానికి శ్రామిక కులం, వర్గంలో పుట్టిన నాకు సాహిత్యానికి సంబంధించి ఎలాంటి శిక్షణ, మార్గదర్శకత్వం గానీ, వారసత్వం గానీ లేదు. మా ఇంట్లో ఎవ్వరూ ఎప్పుడూ ఏం తిరుగుడు? ఏం రాతలు? అని నియంత్రించనూలేదు. అది బాగా కలిసొచ్చింది. మా ఇంట్లో మా బాపు, మా మేనత్త ఇద్దరు చదువుకున్న వాళ్ళు ఉండటం వల్ల చదువుల విలువ తెలిసొచ్చింది. ప్రధానంగా మాది వ్యవసాయ కుటుంబం. చేను, చెల్క, పొలం ఉండేది. మా నాయినమ్మ సద్ది గంప నెత్తికెత్తుకొని పొలం కాడికి, చేనుకాడికి పోయేది. నేను ఆమెతోటి చేనుకాడికి పోయేదాన్ని. ఉత్పత్తి! మనం తినే తిండి ఎంతమంది శ్రమో తెలుసుకునే అవకాశం ఏర్పడింది.
నా బాల్యమంతా పరుచుకొని ఉన్న కష్టాలూ, ఆకలి, శ్రమ, శ్రమజీవుల శ్రమశక్తి, ఉత్పత్తీ అన్నీ కలిసి నా రచనలకు పీడితుల జీవన పోరాట ఆరాటాలు, చోదక శక్తులుగా కావడానికి దోహదం చేసింది. రాత్రంటే ఎంత భయపెట్టినా దాన్ని అధికమించి భయంలేని స్థాయికి వచ్చాను. ఎదురీత, ఎదురుపోరాటం తత్వంలోకి వచ్చేసింది. నేను నిలబడిన దానిపట్ల మొండితనం, నేను అనుకున్న లక్ష్యం, ఎనుకున్న మార్గం, చేపట్టిన పనిపట్ల నిబద్ధత ఏర్పడే నైజం అలవడింది. 1979 దశకం చివర్లో నుండి 1980, 1990వ దశకం వరకూ గోడలకున్న నోళ్ళు చాలా విషయాలు నేర్పాయి, కొత్త జ్ఞానాన్నిచ్చాయి. నాటి వామపక్ష పార్టీలన్నింటి నుండీ, ప్రజాతంత్ర వేదికలూ, ఉద్యమాలన్నింటి నుండీ పిలుపులందుకున్నాను వారితో చేరి పని చేయమనీ, కొన్నింటికి నాయకత్వం వహించమనీ అడిగినప్పుడు ఆ దారిలో ముందుకు సాగిపోయాను.
నా 13వ ఏట 9వ తరగతి చదుతున్నప్పుడు కొన్ని కవితలు రాశాను. అయితే అవి భావ కవితలు. ఇంకా అభ్యదయ సాహిత్య సంపర్కం రాని రోజులు. నిజమైన కవిత రాసింది 15, 16 ఏళ్ల వయసప్పుడు ఇంటర్‍ మీడియట్‍ చదువుతున్నా.. ‘చైతన్యం పడగెత్తింది’ కవిత తరవాత భావ కవితలెప్పుడూ రాయలేదు. ‘‘చైతన్యం పడగెత్తింది’’ కవిత అప్పటి తెలుగు టీచర్ల ప్రశంసలు అందుకుంది.
1984లో నాకున్న సామాజిక చేతన ఉద్యమానుభవాల స్ఫూర్తితో ‘గులాబీలు జ్వలిస్తున్నాయి’ అనే చిన్న పొత్తాన్ని ప్రచురించాను. అయితే అన్ని విధాలా గ్రంథం స్థాయిలో కాకుండా ఒక బుక్‍లెట్‍ స్థాయిలో వచ్చిందా పుస్తకం. 1997లో మాత్రమే ‘నేనొక నల్లమబ్బునవుతా’ అనే కవితా సంపుటిని ప్రచురించగలిగాను. మధ్యలో రచనా వ్యాసంగం కొనసాగింది కానీ ప్రచురణ జోలికి పోలేదు. ప్రజాకవి కాళోజీ ఇచ్చిన సూచనలు, సలహాల మేరకు ఇరవై ఏళ్లు పుస్తక ప్రచురణ చేయకుండా ఉన్నాను.1996లో కాకతీయ విశ్వవిద్యాలయంలో నేను బోధనేతర ఉద్యోగిగా పనిచేస్తున్నప్పుడు. మా గురువు గారు ఆచార్య వాసిరెడ్డి భాస్కరరావు గారు.. నన్ను ఉద్దేశించి కొన్ని మాటలు కఠినంగా మాట్లాడారు. ఆ మాటల అర్థం నీవు ఎందుకూ కొరగాకుండా పోయావని. నాపట్ల సదుద్దేశంతోనే అయినా నాకా మాటలు సూటిగా తాకాయి. ఒక పౌరుషం పట్టుదల వచ్చింది. కొన్ని నెలల్లోనే 1997లో ‘నేనొక నల్లమబ్బనవుతా’ కవిత్వం ప్రచురించి పెద్ద సభ పెట్టాను. ఇంక అక్కడి నుండి ప్రచురణాసక్తి పెరిగింది

మన దేశంలో అయితే అమృతా ప్రీతమ్‍, ఇస్మత్‍ చుగ్తాయి, ఇందిరాగోస్వామి, మహాశ్వేతాదేవి, నీలకంఠన్‍, పెరుమాళ్‍ మురుగన్‍, బెంగాళీ సాహిత్యం మొదలగునవి. తెలుగులో అయితే రావిశాస్త్రి, రంగనాయకమ్మ, ఓల్గా ఇంకెందరో.. చెప్తూపోతే పేజీలు నిండిపోతాయి. ఒక్కొక్క కవీ, రచయితవి ఒక్కో కథో, నవలో, కవితో అయి ఉండవచ్చు లేదా సంపుటాలు, సంకలనాలూ కావచ్చు. ఇక ఒక రచయితకు సంబంధించి మొత్తం రచనలన్నీ ప్రభావితం చేయలేకపోవచ్చు. ఒక రచనో, కొన్ని రచనలో, చాలా రచనలో ప్రభావితం చేస్తుండవచ్చు. రావిశాస్త్రి రచనలన్నీ, దాశరథి రంగాచార్య రచనలన్నీ ప్రభావితం చేస్తాయి. కొన్ని నచ్చుతాయి. కొన్ని ప్రభావితం చేస్తాయి.
విప్లవాల కోట అయిన చరిత్రాత్మకమైన వరంగల్‍ నగరం నడిబొడ్డున జన్మించడం వల్ల పరోక్షంగా విప్లవోద్యమాల భావజాలం, కదనం అన్నీ ప్రభావితం చేసాయి కూడా. దానికి తోడు చదువుతున్న విప్లవ సాహిత్యం ఉద్యమాలకు ఆకర్షితం చేస్తుంది, చేసింది. సమాజ అవకతవకలపై, అసమానత్వాల పట్లా, దోపిడీ పీడనల పట్ల నిరసన, ఆధిపత్యాలు, పెత్తనాల పట్ల ధిక్కార స్వభావం ఉన్నవాళ్ళు తప్పకుండా విప్లవోద్యమాలకూ, ప్రజాతంత్ర ఉద్యమాలకూ ఆకర్షితమవుతారు. నేనూ అంతే. నేనూ మానసికంగా మమేకమై, ప్రత్యక్షంగానూ పాల్గొన్నాను.

జండర్‍ వివక్షత అంతటా ఉంది. స్త్రీగా పుట్టడంతోనే వివక్షతలూ, అవమానాలూ మొదలవుతాయి. మన పుణ్య భారతదేశంలో ఆడపిల్లగా పుట్టడం పెద్ద దౌర్భాగ్యం. ఉద్యమరంగమైనా, సాహితీ కళారంగమైనా మొదట స్త్రీగా అయినందుకు తాను ఎన్నో రెట్లు తన అర్హతలనూ ప్రూవ్‍ చేసుకోవాలి. కులం రీత్యా వెనకకు నెట్టివేయబడటం, కులం వల్ల ఏర్పడిన వర్గం రీత్యా నిర్లక్ష్యానికీ గురికాబడటం. సాంఘిక ఆర్థిక హోదాల స్థాయిననుసరించి నిరాదరణకూ గురికావడం. ముఖ్యంగా ఒక స్త్రీ స్వేచ్ఛా భావాలనూ, కదలికలనూ నిరంతర నిర్భందాలు అడ్డకుంటాయి, అసూయ ద్వేషాలు కబళిస్తాయి. అన్నింటికన్నా స్త్రీ ఎదుగుదలను ఆపేది డిమోరలైజేషన్‍ చేయడం అనేది వాస్తవం. ఇదంతా ఒక్క మగవాళ్ళ వల్లనే అన్నిసార్లూ జరగకపోవచ్చు. దేనికీ తీసిపోని మహిళలూ ఉంటారు. వాళ్ళు కులస్వామ్య, పితృస్వామ్య భావజాలంలో నిండా మునిగి అచ్చం పితృస్వామ్య, కులస్వామ్య దురహంకారుల్లా ప్రవర్తిస్తుంటారు. నేను ఉద్యమాల్లో ఒక స్త్రీగా, సాహితీరంగంలో ఒక స్త్రీగా, వెనుకబడిన తరగతుల కులాల స్త్రీగా కొంత వివక్ష ఎదుర్కొన్నాను. ఇంతెందుకు ఈర్షా అసూయలతో ఇప్పటికీ సాటి రచయిత్రులు, రచయితలు కొందరు బట్టకాల్చి మీదేస్తుంటారు. వెనకనుండి వీపులో వెన్నుపోటు పొడిచి పోతుంటారు. ‘‘వెనక దగా ముందు దగా కుడిఎడమల దగా’’ శ్రీశ్రీ అన్నట్లుగానే ఉంది నేటి పరిస్థితి. ‘యూ టూ బ్రూటస్‍’లకు తక్కువేమీ లేదు. అలాంటి ఏ అనుభవమూ నాకు కలగలేదంటే అది అబద్ధపు అతిశయోక్తి అవుతుంది. బాధ్యతలను బరువు అని తప్పించుకునేవాళ్ళూ, ఇన్‍స్టాంట్‍ గా వేదికలూ, పేరూ, గుర్తింపుల కోసం వెంపర్లాడేవాళ్ళు, పునాదుల్లేకుండా గాలిలో మేడలు కట్టేయాలనుకునేవాళ్ళు సాహిత్య కళారంగాల్లో ఉంటారు. చాలా ప్రమాదకర సంస్కృతిని విషరోగంలా వ్యాపింపజేస్తుంటారు. ప్రతిభ ఎవరి సొత్తూ కాదుగానీ నిజంగా ప్రతిభ ఉండి కృషి చేసేవాళ్ళను పడగొట్టాలనే చూస్తారు. నేను దానికి మినహాయింపేమీ కాదు. వెనక నుండి చేసే కుట్రలకు భయపడతాను. ముందునుండి చేస్తే ఎదుర్కొని తలపడతాను భావజాలంతో. నిజాయితీ, నిబద్ధత ఉన్నవాళ్ళంటే ఒక రంగంలో కానీ సమాజంలో కానీ విపరీతమైన అసహనం ఉంటుంది జనానికి. పేదవాళ్లు, ఉన్నత వర్గం కాని వాళ్లు బహుజనులకు ఆత్మవిశ్వాసం వుంటే, అది అహంకారంలా కనిపిస్తుంది మన ‘పేద్దోళ్ళ‘కు. వెనక కూతలూ, కుట్రలూ లేదా తోకముడుచుకొని పోవడాలు. లేదా అబద్ధాలు, అభూత కల్పనలు, అర్థ సత్యాలంటారే.. అర్థసత్యాలతో మనమీద నల్లగుడ్డ కప్పుతారు. అందుకే నేను ముందన్నాను చూడండి ‘‘లోకం తెలుసుకోవడానికి ఇంత నెత్తురు అర్పించాల్సి వచ్చిందీ “అని. నిన్న్నా మొన్నటి దాకా, ఇకముందు కూడా ఉంటాయేమో బట్ట కాల్చి మీదేసి నిందించడాలు. ఏళ్ళపాటు ఆ కాలిన గాయాలతో చిత్రహింసను అనుభవించాను. కొన్ని ఊరుకుంటే ఉసురే తాకుతుందనీ అనుకున్నాను. కొన్ని చిక్కుముళ్ళు విప్పి చూసాను.

ఆనాడు మెజారిటీ కవులు, రచయితలు, కళాకారులు ఉద్యమకారులుగా మారిన సందర్భం. 1969-71 నుండి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం తపిస్తున్న నేను 1990వ దశకంలో మళ్ళీ ఉధృతంగా తలెత్తిన తెలంగాణ సోయితో తెలంగాణ రచనలు, సభలు, సదస్సుల్లో పాల్గొన్నాను. నా కవితా సంపుటి ‘ఉసురు’ ఆ సమయంలో వచ్చిందే. తెలంగాణ సోయి ప్రధానంగా తెలంగాణ భాషా సంస్కృతుల మీద జరిగిన దాడికి వ్యతిరేకంగా మొదలయ్యిందే. నా తల్లి భాషలోనే నేను ఎక్కువ రచనలు చేసాను. వివిధ సాహిత్య వేదికల ఏర్పాటుల్లో పాల్గొన్నాను. ‘తెలంగాణ రచయితల వేదిక’ వ్యవస్థాపనలో ఉండి అన్ని తెలంగాణ జిల్లాలలో మహాసభలూ, సదస్సులూ జరుగుతున్న క్రమంలో పాల్గొన్నాను.‘వరంగల్‍ రచయితల వేదిక’ను నిర్మించిన కవులు, రచయితలతో కలిసి నిత్యం ఉద్యమంలో పాల్గొన్నాను. వివిధ సాహిత్య సంకలనాల ప్రచురణ చేయడం వరకూ అన్నిట్లో నేను వ్యక్తిగతంగా పూర్తిస్థాయిలో పనిచేసాను.

అదో చరిత్ర. తెలుగు రాష్ట్రం ఒక్కటిగా ఉన్నప్పుడు సాహిత్య, సాంస్కృతిక రంగాలు అగ్రకుల ఆంధ్రా ప్రాంతం వారి ఆధిపత్యంలో ఉండేవి. సాహిత్య కూటములు, పీఠాలు, పీఠాధిపత్యాలు అన్నీ వీళ్ళ పలుకుబడిలో విలసిల్లుతూ ఉండేవి. తెలంగాణ సాహిత్యకారులు అనామకులుగా వాయిస్‍ లేకుండా ఉండేవాళ్ళు. కవుల్లో ర్యాంకులుండేవి. అన్ని ర్యాంకులూ ఆంధ్రా వాళ్ళవే. అన్ని వేదికలూ, పురస్కారాలూ వాళ్ళవిగా ఉండేవి. (ఇప్పుడు మారిందా అంటే సందేహమే). గాయపడిన మనిషిని చితకబాదినట్లు ఈ క్రూరమైన బానిసత్వంతో పాటు ఇందులో అగ్రకులాలకు (పాలకవర్గ కులాలు) తప్ప ఇతర వెనుకబడిన, బహుజన కులాల రచయితలు, కళాకారుల పట్ల చిన్నచూపు ఉండేది. కులం చెప్పుకోవడానికి భయపడేవాళ్లు. ఎక్కడా వీరికి ఒక స్థానం, స్థాయి ఉండేది కాదు. కొంచెం ప్రవేశం ఉన్నచోట అంచులకు నెట్టబడి ఉండేవాళ్ళు.
దామాషా పద్ధతిన అన్ని కులాల మహిళా రచయితలకు వేదిక నిర్మాణంలో స్థానం కల్పించి వారి గొంతుక వినిపించేలా చేయడం. పెద్ద చిన్నా, ఎక్కువ తక్కువ కులం, స్థాయి అని లేకుండా అందరు కలిసి వేదిక ‘మ్యానిఫెస్టో’ను అనుసరించి ప్రజాస్వామికంగా పని చేయాలన్నదే లక్ష్యం. ఒక విధంగా రిజర్వేషన్స్ పెట్టుకున్నాము అని చెప్పాలి. ప్రధానంగా ఇది మహిళల అంశాలు, విషయాలు, సమస్యలపై పనిచేసే రచయిత్రుల వేదిక.
ప్రజాస్వామికత అనేది అలంకారంలా వాడుకునే ఆభరణంలాంటి పదం కాదు. ప్రజాస్వామికంగా ఉండటం అంత సులభమైన పనీ కాదు. ఏదైనా ఆచరణలో, ఆత్మపరిశీలన, సమీక్ష, విశ్లేషణ ద్వారా సాధ్యమవుతుంది. దశాబ్దం దాటిన ‘ప్రరవే’ ప్రయాణంలో ఆ దిశలోనే ఉన్నాము అనుకుంటున్నాను. భావజాల పరంగా కలిసివచ్చే సోదర సంఘాలు, వేదికలతో కలిసి పనిచేయడం, ప్రజా సమస్యలపై గళమెత్తడం, కార్యాచరణల్లో పాల్గొనడం, రచనలు చేయడం గత పదేళ్ళుగా మా ఆచరణాత్మక కార్యక్రమం. సమస్యాత్మకంగా ఉన్న క్షేత్ర పర్యటనలు, రిపోర్టులు, ప్రచురణలు మా ముఖ్య కార్యక్రమాల్లోని కొన్ని అంశాలు.

నా రచనల్లో కవిత్వం పాలు ఎక్కువ. 1980ల నాటి ఉద్యమాల అనుభవంతో ‘‘గులాబీలు జ్వలిస్తున్నాయి’’ చిన్న కవితా సంపుటి. స్త్రీవాద ఉద్యమ ప్రభావంతో ‘‘నేనొక నల్లమబ్బునవుతా’’(1997) కవితా సంపుటి, ‘‘చెమట చెట్టు’’(1999), ‘‘ఓ లచ్చవ్వ’’ దీర్ఘకవిత(2005) (దళిత బహుజన స్త్రీ, రాజ్యాధికారం) ‘‘ఉసురు’’(2002) తెలంగాణ కవిత్వం, ‘‘గోరంత దీపాలు’’(2005) నానీల కవిత్వం, హైకూల సంపుటి, ‘‘దస్తఖత్‍’’, వచన కవిత ‘‘అనగనగా కాలం‘‘ , ‘‘మట్టిబంధం’’(2006) కవితా సంపుటి, ‘‘నన్హే ఓ నన్హే’’(2007) నానీల కవిత్వం, ‘‘మార్కెట్‍ స్మార్ట్ శ్రీమతి’’ దీర్ఘ కవిత(2010), ‘‘నిర్భయాకాశం కింద’’ (2016), కాలం కాన్వాస్ మీద(కవిత్వం)2023

కాకతీయ విశ్వవిద్యాలయంలో మొదటిదైన బి.సి. ఉద్యోగుల సావనీర్‍ ‘బి.సి. సంకల్పం’ (2010) ప్రచురించాం. తెలంగాణ ఉద్యమ కవిత ‘తెలంగాణ ఉరుములు-మెరుపులు, ‘వెతలే కతలై’ (2011) రచయిత్రుల కథా సంకలనం ముద్రించాం. ‘ఊపిరి’(2012) తెలంగాణలో ఆత్మహత్యలపై నిరసన కవితా సంకలనం వచ్చింది. ‘జిగర్‍’(2013) తెలంగాణ విశిష్టతలపై కవిత్వ వచ్చింది. అపూర్వ త్యాగాలకు నీరాజనం పడ్తూ శరీర అవయవదానంపై ‘ఆకాశ పుష్పం’ (2014) కవిత్వం, ‘ముజఫర్‍నగర్‍ మారణకాండపై నిషిద్ధ మేఘాల్లోకి మా యాత్ర’. ‘అగ్నిశిఖ’ అత్యాచారాల వ్యతిరేక సంకలనం. ‘పోలవరం ప్రాణాంతక ప్రయోగం – ముంపు గ్రామాల గోడు’ అచ్చేశాం. ‘అక్షర శరధి దాశరధి’(2016) దాశరధి రంగాచార్య రచనలపై వ్యాస సంకలనం. ‘తీరొక్క పువ్వులు’(2016) భిన్న అస్తిత్వాల సాహిత్యం, పరిచయ వ్యాసాలు. ‘తెలంగాణ రచయిత్రుల శతాధిక కథల సంకలనం’(2017), మహాశ్వేతాదేవి రచనలపై వ్యాసాల సంకలనం(2018), ‘బోల్షివిక్‍ విప్లవం’ స్ఫూర్తి వ్యాసాల సంకలనం(2019), ‘ఏడాది ప్రయాణం’ క్షేత్ర పర్యటనల రిపోర్టులు. ప్రస్తుతం ‘కరోనా కాలం కథలు’ (2020), ఆమె పదం (2023), భారత దేశంలో వితంతు వ్యవస్థ (2023)

నేను రచయితలకు, కవులకు, కళాకారులకు చెప్పాలనుకున్నది వేదికలకూ, శాలువాలకూ ఎగబడకండి. అన్నీ ఇన్‍స్టాంట్‍గా రావాలని దిగజారిపోకండి. పురస్కారాల పైరవీలు మానుకొమ్మనీ, కవిత్వ సాధన చేస్తూ సాహిత్య అధ్యయనం కొనసాగిస్తూ రచనలు చేయాలని, కవులు తమ ఆత్మను అమ్ముకుంటే ఆ సమాజం ఆత్మను కోల్పోతుంది. సామాజిక బాధ్యతనెరిగి రచనలు చేయాలి. నూతన సమాజ ఆవిష్కరణకు రచనలు చేయాలి. ప్రతి రచనలో కొత్తదనం కోసం తపించాలి. పేరుకీర్తులూ, పొగడ్తలూ, సన్మానాలూ, పురస్కారాలూ అన్నీ తాత్కాలికమైనవి. కేవలం బాధ్యతాయుతంగా మనం చేసే రచనలే వీటన్నింటినీ మించినవి అయ్యుండాలి. కవులు, రచయితలు, కళాకారులు తమ సృజన కళల ద్వారానే మ్రుత్యుంజయులు అవుతారు.

కవిత్వం మనిషితనం వేర్వేరు కాదు.కవిగా జీవిస్తే చాలదు. మనిషిగా జీవిస్తేనే కవి గా జీవించినట్లని రవీంద్రుడు అంటారు.మనిషిగా కవిగా జీవించే ప్రయత్నం చేస్తూ చేస్తూ జ్వలించే గులాబీల జ్వాలా ముఖాలనూ,నేనొక నల్లమబ్బునై చల్లారుస్తూ, చెమట చెట్టులా నిలబడి ఉసురుసురని నిట్టూరుస్తూ,అనగనగా కాలం కథలు తెలుసుకుంటూ, నిర్భయాకాశం కింద సమస్త జనం సేదతీరాలన్న ఆకాంక్షతో ఇప్పుడు కాలం కాన్వాస్ మీద కాల చిత్రాలను జీవితపు ఫ్రేమ్ వర్క్ లో దృశ్య మానం చెయ్యాలని ఈ కవితా సంపుటి వెలువరిస్తున్నాను

నేను డిగ్రీ చదువుతున్నప్పుడు 1977 లో అనుకుంటా!మా నాన్న గారితో కలిసి కాళోజి గారి ఇంటికి వెళ్ళాను. నేను నోట్ బుక్ లో ఆలోచన తట్టినప్పుడు రాసుకున్న కవితలను ధైర్యం చేసి వారికి చూపించాను.కవితల్ని చూసి సంతోష పడ్డాడు.లకోట(పెద్దగా) ఉన్నాయానీ చెప్పి, ఇట్లాగే రాస్తూ ఉండమని ఆశీర్వదించిండు.1979 లో కాళోజి గారి అధ్వర్యంలో వరంగల్ వేదికగా “చైతన్య సాహితీ “ఎర్పాటు చేసి 2 నెలకొక సారి కవులను, రచయితలను పిలిచి మాట్లాడించే కార్య క్రమాలు జరుగుతుండేవి.ఆ సంస్థ లో నేను కార్యవర్గ సభ్యురాలిగా ప్రతి ప్రోగ్రామ్ హాజరయ్యే దానినీ. “మిత్ర మండలి”ద్వారా ప్రతి నెల సాహిత్య కార్యక్రమాలు జరుతుండేవి.ఇలా వారితో సాహిత్యాను బంధం కొనసాగుతూ వచ్చిందీ.1979 లో మా నాన్న చనిపోవడంతో, కుటుంబ బరువు నాపై పడటం, కాకతీయ విశ్వవిద్యాలయంలో అడ్మినిస్ట్రేషన్ విభాగం లో చేరి ఉద్యోగ జీవితం ప్రారంభించా ను. అయినప్పటికీ సాహిత్యంతో నిత్య అనుభందం కొననసాగింది.. వీలును బట్టి కాళోజీ ఇంటికి వెళ్ళినప్పుడు మనుమరాలు అని పిలిచేవాడు.వారి కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆత్మీయంగా మాట్లాడే వారు.2023 లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కాళోజి అవార్డ్ ప్రకటించినప్పుడు వారి జ్ఞాపకాలతో నా కళ్ళు చెమ్మగిల్లాయి.

You may also like

Leave a Comment