Home పుస్త‌క స‌మీక్ష‌ స్ఫూర్తి ప్రదాత విజయనగరం మహారాజా”

స్ఫూర్తి ప్రదాత విజయనగరం మహారాజా”

by Radhika Mangipudi

ఇది కేవలం ఒక జీవిత చరిత్ర కాదు. 20వ శతాబ్దంలో మనందరి మధ్య నడచిన ఒక రాజర్షి జీవన ప్రస్థానానికి సజీవ చిత్రం. నియమబద్ధమైన వారి జీవన విధానానికి,  హృదయ సౌశీల్యానికి అక్షర రూపం.  ఇది కేవలం వారి గొప్పతనాన్ని చాటి చెప్పడానికి ఉద్దేశించబడినది కాదు. వారి జీవితపయనంలోని అనేక మజిలీలతో పాటుగా, నిబద్ధతకు, నిరాడంబరతకు, నిస్వార్ధ తత్వానికి మారుపేరైన వారి జీవనశైలికి అద్దంపడుతూ రాబోవు తరాలవారికి కూడా మార్గదర్శకమయ్యే గ్రంథం. చదువుతున్నంతసేపూ మనం కూడా పివిజి రాజుగారి జీవనపయనంతో పాటుగా ప్రయాణిస్తాము. అంతలాగా మనల్ని లీనంచేసి ఆసాంతం చదివింపజేస్తుంది. చక్కటి అందమైన తెలుగుశైలిలో పొందికగా అమరిన ఈ పుస్తకం చదివితే ఎక్కడా అనువాద రచనగా అనిపించదు. అచ్చమైన తెలుగు గ్రంథంగా అనిపిస్తుంది. అనువాదకులకు నా ప్రత్యేక అభినందనలు.

‘రాజ కుటుంబీకులు’ అనగానే వారు ఎంతో  విలాసవంతమైన జీవితం గడుపుతారని, వారి జీవితం వడ్డించిన విస్తరిలా ఎప్పుడూ హాయిగా నిండుగా ఉంటుందని మాత్రమే ఆలోచించేవారు తప్పకుండా ఈ పుస్తకం చదవవలసి ఉంది. ఎందుకంటే పైకి కనిపించే వారి హుందా ఆయన చిరునవ్వు వెనుక ఎన్ని రాచరికపు కట్టుబాట్లు ఉన్నాయో, జీవితంలో ఎన్ని ఒడిదుడుకలను ఎదుర్కొన్నారో తెలుస్తుంది. అందులోనూ పివిజి రాజుగారు, వారి తండ్రి అలక్ నారాయణ గజపతి గారు బ్రిటిష్ పరిపాలనా కాలంలో ఎదుర్కొన్న సమస్యలు, వాటిని పరిష్కరించుకునేందుకు వారు నిలబడి పోరాడిన తీరు ఈ పుస్తకం ద్వారా స్పష్టంగా తెలుస్తాయి.

పివిజి రాజు గారు అనగానే విజయనగర సంస్థానానికి పట్టాభిషిక్తులైన ఆఖరి మహారాజుగా, ప్రజా సోషలిస్టు పార్టీ నాయకులుగా, కేంద్రమంత్రివర్యులుగా ఎన్నో ప్రజోపయోగ కార్యక్రమాలను నిస్వార్ధంగా చేసిన మహనీయులుగా చాలామందికి తెలుసు.  వారి జీవితాన్ని గురించిన పుస్తకం అనగానే వారి జీవితంలో మధురమైన ఘట్టాలు, వారు సాధించిన విజయాలు, వారి ఉదాత్తతను చాటే కార్యాలు మాత్రమే ఉంటాయనుకుంటే అది పొరపాటే. వారి  జీవితం నిజానికి పరచిన పువ్వుల బాట కాదు. ఎన్ని రకాల సవాళ్లను సమస్యలను ఎదుర్కొంటూ వారు ఆ స్థాయికి చేరుకున్నారో కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తూ, అన్ని కోణాలనుండీ ఉన్నది ఉన్నట్లుగా చెప్పిన పుస్తకం ఇది.

పుస్తక ప్రారంభంలోనే అలక్ నారాయణ గజపతి రాజు గారు మద్రాసు కోర్టులో తన పిల్లల జీవితాలకి సంబంధించిన కీలక నిర్ణయం కోసం పోరాడిన విషయాలను గూర్చి చదివితే పసివయసులోనే ఆ పిల్లలు ఏ విధమైన ఆందోళనకు గురై ఉంటారో అర్థం చేసుకోవచ్చు. పివిజి రాజు గారు ఒక సాధారణ పార్టీ కార్యకర్తగా పనిచేసిన తీరు దగ్గరనుంచి, జీవితంలో రాజకీయ ఉన్నతి పొంది అత్యుత్తమ స్థాయిలో ఉన్న సమయంలో యాక్సిడెంట్ జరగడం వలన అనుభవించిన మనోవేదన వరకు ఎన్నో విషయాల గురించి విపులంగా చర్చించబడింది. ‘దుఃఖాలకు కృంగిపోక సుఖాలకు పొంగిపోకుండా జీవితంపై సమదృష్టి గలవాడే స్థితప్రజ్ఞుడు’ అని చెప్తుంది భగవద్గీత. పివిజి రాజుగారు దీనికి సజీవ ఉదాహరణగా స్ఫూరిస్తారు వారి జీవితయాత్ర చదివితే. వారియొక్క పూజ్య గురువుల అనుగ్రహంతో ఎంతో ఆధ్యాత్మిక పరిణితి పొందిన కర్మయోగి ఆయన. అందుకే ఈ వ్యాసం ప్రారంభంలో వారిని ‘రాజర్షి’ అని సంబోధించాను. చిన్న సమస్య వస్తే చాలు విపరీతంగా కృంగిపోయి ఆందోళనపడే ఈతరం పిల్లలు తప్పకుండా చదువుకోవలసిన పుస్తకం ఇది. మాన్సాస్ విద్యాసంస్థల విద్యార్థులు మరీ ముఖ్యంగా చదవాలి. ఏ ఆశయ సాధన కోసం ఎంత కష్టపడి ఈ సంస్థలను నిలబెట్టారో, ఎంతమంది అక్కడ చదువుకుని ప్రపంచ ప్రఖ్యాతి పొందారో, ఎటువంటి మహానుభావులు ఈ విజయనగరం నేలపై నడయాడారో నేటి తరం తప్పక తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

పివిజి రాజుగారు కుసుమాగజపతి గారు దంపతులు భూదానోద్యమ సమయంలో వినోబాభావే గారితో పాటు కలసి నడిచి ఎంతో ప్రచారం చేశారు. ఊరి నడిబొడ్డులో తమ వంశపారంపర్యంగా వస్తున్న కోటను విద్యాభివృద్ధి కోసం దానం ఇచ్చేయడం అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. అందుకే ‘వేల ఎకరాల భూమిని  ప్రజలు కోసం దానమిచ్చిన ఉదాత్త హృదయులు మా రాజుగారిని’ విజయనగర ప్రజలు తరతరాలుగా గర్వంగా చెప్పుకుంటారు.

పూసపాటి గజపతి రాజవంశం.. నిరంతరం ప్రజల బాగును దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకున్న కుటుంబం అది. విద్యాసంస్థలను నెలకొల్పడంలో కానీ, బ్రిటిష్ పరిపాలనా పద్ధతులకు కొన్నిసార్లు తలవంచడం కానీ, అప్పట్లో లక్షల రూపాయల విరాళాలతో వివిధ ప్రదేశాలలో కట్టించిన కట్టడాలు కానీ.. అన్నిటి వెనుక ఉద్దేశం ఒకటే..  దీనజనోద్ధరణ, నలుగురికి ఉపయోగపడాలనే తాపత్రయం. అంతటి ఉదాత్తమైన  వంశ చరిత్ర అంతా కూడా సంపూర్ణంగా ఈ పుస్తకంలో పొందుపరిచారు. కనుక సుమారు 300 యేండ్ల చరిత్రతో పాటు, రాష్ట్రంలో సంభవించిన యుద్ధాలు, అప్పటి రాజకీయ సామాజిక ఆర్థిక పరిణామాలనన్నింటినీ సమగ్రంగా అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకం ఉపయోగపడుతుంది.  విజయనగరంవారు మాత్రమే కాకుండా తెలుగువారందరూ గర్వపడాల్సిన అంశాలను తనలో అందంగా పొందుపరచుకున్న ఈ పుస్తకం తప్పక పాఠకాదరణ పొందుతుందని ఆశిస్తూ మాన్సాస్ యాజమాన్యానికి హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు,

You may also like

Leave a Comment