Home పుస్త‌క స‌మీక్ష‌ A Review on “EM and the BIG HOOM”

మనం అనేక రచనలు చదువుతుంటాము. వాటిల్లోని ఆ కథ ఎక్కడో ఓ ప్రదేశం లో జరుగుతూంటుంది.అది నగరమో,పట్టణమో,పల్లెనో…కానీ ఒకసారి చదివేసి అవతల పెట్టేసిన తరువాత కూడా ఆయా ప్రదేశాలు మనల్ని అంత త్వరగా వదలవు. మనం మానసికంగా అక్కడికి ప్రయాణం చేస్తూనే ఉంటాము.రచయిత ఎంతో మమేకమై రాస్తే తప్పా దాన్ని మనం అంతగా అనుభూతి చెందలేము. ఈ కళ అందరి లోనూ సమానంగా ఉండదేమో..!వారి పరిశీలనాశక్తి ఇంకా దాన్ని అక్షరాల్లోకి మార్చే వారి మంత్రజాలం లో ఉంటుందేమో.

ఉదాహరణకి చార్లెస్ డికెన్స్ ని చదివితే లండన్ లోకి,థామస్ హార్డీ ని చదివితే వెసెక్స్ లోనికి,మార్క్ ట్వైన్ ని చదివితే మిసిసిపి లోకి, విలియం ఫాల్క్నర్ ని చదివితే అమెరికా దక్షిణ భాగం లోని లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్ళిపోతాము.ఇక పారిస్ ప్రయాణం చేయాలంటే గై డి మపాసా ని ,పీటర్స్ బర్గ్ లోకి వెళ్ళాలంటే దోస్తోవిస్కీ ని చదవవలసిందే. జేన్ ఆస్టిన్ ఆవిడ తన జీవితమంతా ఓ పల్లె ప్రాంతం లోనే ఉన్నది,ఆ అందాలన్నీ ప్రైడ్ అండ్ ప్రెజుడిస్ వంటి నవలల్లో చూడవచ్చు.

అసలు ఆ అందమంతా ఎక్కడనుంచి వస్తుంది.ఏ ప్రదేశమైనా గానీ దానికి ఓ రంగు ,రుచి ఉంటుంది.అది అక్కడి పరిసరాల్లోనూ,మనుషుల్లోనూ,వాతావరణం లోనూ గూడు కట్టుకుని ఉంటుంది.దాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఎలాంటి జడ్జ్ మెంట్ లేకుండా చిత్రించినపుడు ఒక నిజాయితీ ఉట్టిపడుతుంది.సరైన మాటలు పడాలి.అవి పఠిత కి దృశ్యాన్ని చూపించాలి.అలా అన్ని సార్లు జరుగుతుందా కష్టమే.కాని కొంతమంది లో ఆ నేర్పు పిసరంత ఎక్కువగా ఉంటుంది.

అలాగే జోసెఫ్ కోన్రాడ్ ని చదివితే మనం సముద్రం మీద తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది.ఎందుకంటే తను అలానే జీవించాడు కాబట్టి.అలా అని సముద్రం మీద తిరిగినవాళ్ళు అందరూ అలా రాశారా అంటే లేదనే చెప్పాలి.ఒక భావాన్ని ఎంతో నేర్పుగా దృశ్యమానం చేసే కళ ఇలాంటి వారి లో చాలా ఎక్కువ గా ఉన్నదని అనిపిస్తుంది.ఇది నాకోసం,నేను నా హృదయభారాన్ని ఆపుకోలేక రాసుకున్నది …మీకు నచ్చిందా సరి లేదా మంచిది అన్నట్లుగా ఉంటాయి కొన్నిసార్లు వారి రాతలు.అక్కడే వస్తుంది ఓ నిజాయితీ తో కూడిన అందం.

సోమర్సెట్ మామ్ ,గ్రాహం గ్రీన్ కథలు వాళ్ళ పర్యటనా ప్రభావం అనుకుంటాను,వివిధ ప్రదేశాల్లో ఆయా పాత్రలు జవ జీవాలతో ఉంటాయి. ఇక మన దేశం లోని ముస్సోరి లో నివసించే రస్కిన్ బాండ్ గురించి ప్రత్యేకించి చెప్పేదేముంది. ఆయన రచనలు చదువుతుంటే హిమాలయ సానువుల్లోని గుట్టలు,మిట్టలు,చెట్లు చేమలు,జంతువులు,కీటకాలు,అక్కడి శిధిల నిర్మాణాలు ఒక్కటేమిటి ఆ ప్రాంతం లోకి వెళ్ళి విహరించినట్లుగా ఉంటుంది.


EM and the big HOOM అనే ఈ ఆంగ్ల నవల ని చదవడం పూర్తి చేసిన తర్వాత అనేక భావాలు ముప్పిరిగొన్నాయి.అసలు టైటిల్ పెట్టడం లోనే ఓ తికమక ఉంది అనిపించింది.అయితే చదివిన తర్వాత ఇదే సరైన టైటిల్ అనిపించింది.ప్రస్తుతం మన దేశం లో ఆంగ్లం లో రాసేవారి సంఖ్య బాగా పెరుగుతోంది.ఇది భారతీయ ఆంగ్లం…భారతీయ వాస్తవికతని మోసుకువచ్చే వాహకం.సగర్వం గా తనదైన ఘుమ ఘుమలతో ప్రపంచవేదిక పైన తన పరిమళాల్ని వెదజల్లుతున్నది.

ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఇమెల్డ  తీవ్రమైన మానసిక సమస్యలకి గురి అయి పేరానాయిడ్ గా మారుతుంది.ఉదాహరణకి మున్సిపాలిటి వాళ్ళు రోడ్డు పక్కన గోతులు తవ్వితే అది తన మీద కుట్ర చేయడానికే అన్నట్లు భావిస్తుంది.అలా అనేక పరిస్థితుల గుండా  నలుగురు ఉన్న కుటుంబం తమ జీవనాన్ని కొనసాగిస్తుంది.ఆమె చేసే పనులు ,మాట్లాడే మాటలు చదువరులకి కొన్నిసార్లు జాలి కొన్నిసార్లు కోపం పుట్టిస్తాయి.EM అనేది ఇమెల్డ కి,BIG HOOM అనేది అగస్టస్ కి పెట్టిన ముద్దు పేర్లు వంటివి.అదే ఈ పుస్తకానికి టైటిల్ అయ్యింది. ఊహించని ట్విస్ట్ లు అలాంటివి ఏమీ ఉండవు గాని, ఒక  మానసిక సంతులనం కోల్పోయిన వ్యక్తి తో అందరూ దయగలిగి ప్రవర్తించాలనే సందేశం అంతర్లీనం గా దీనిలో ఇవ్వడం జరిగింది.రచయిత ఓ చోట చెప్పినదాని ప్రకారం 72000 పదాలు (ఇంచుమించు వార్ అండ్ పీస్ నవల సైజు) తాను ఒరిజినల్ గా రాస్తే దాన్ని ఆ తర్వాత 235 పేజీలకి కుదించడం జరిగిందట.

సరే…రచయిత విషయానికి వస్తే వీరి పేరు జెర్రీ పింటో. గోవా కి చెందిన రోమన్ కేథలిక్ కుటుంబం నుంచి వచ్చారు.ఒకప్పుడు గోవా ప్రాంతాన్ని పోర్చ్ గీస్ వారు పాలించిన విషయం మనకు తెలుసు.ప్రస్తుతం వాళ్ళు లేరు,కాని వారి సంస్కృతి తో ముడిపడిన ప్రజలు మిగిలిపోయారు.డిసూజా,పెరీరా,డికోస్టా ఇలాంటి వారి ఇంటి పేర్లతో మిగిలిపోయిన సంతతి వాళ్ళ కథలు మన తెలుగు వారికి తెలిసింది బహు తక్కువ అని భావిస్తున్నాను.అక్కడి నుంచి తగినన్ని అనువాదాలు మన భాషలోకి వచ్చినవి స్వల్పమేనని చెప్పాలి.

ఈ నవల ఇతివృత్తం గూర్చి చెప్పాలంటే మానసికంగా దెబ్బతిన్న ఒక మాతృమూర్తి కథ.ఆమె పేరు ఇమెల్డ. ఆమె భర్త పేరు ఆగస్టస్.కూతురి పేరు సుసాన్.కొడుకు పేరు ఏమీలేదు.ఆ కొడుకు తన గొంతు తో ఈ కథ ని మొత్తం వినిపిస్తుంటాడు.అంటే కొడుకు చివరి దాకా పేరు చెప్పడు.రచయితనే మనం ఆ కుమారుని గా భావించవచ్చు. కథ చెప్పే పద్ధతి లో ఒక విన్నూత్నమైన విధానాన్ని అనుసరించాడు. దానివల్ల కొంతమంది పాఠకులు గజిబిజి పడినా ఆశ్చర్యం లేదు.అయితే భాష సరళతరమైన శైలి లో సాగుతుంది.

ఉదాహరణకి ఇమెల్డ అనే తన తల్లికి ఎప్పుడు ఏ కారణం చేత ఈ పిచ్చి అనేది వచ్చింది అనేది తెలుసుకోవడానికి కొడుకు అనేకరకాలుగా ప్రయత్నిస్తుంటాడు.బై పోలార్ డిజార్డర్,పేరానోయా ఇలాంటి మానసిక సమస్యలచేత ఆమె బాధపడుతూంటుంది.ఆమె మాత్రం ఇతరుల దృష్టిలో మెంటల్ లేదా పిచ్చిది.అంతే.కాని ఈ కొడుకు చాలా ఓపిక గా ఉంటూ ఆమె ని మాటల్లో పెట్టి సమాధానాలు రప్పించడం ద్వారా,ఆమె రాసిన ఉత్తరాలు,డైరీలు పరిశీలించడం ద్వారా కొంత విషయాన్ని తెలుసుకుంటూంటాడు.

వీరి కుటుంబం పేరు మెండిస్ ,కొన్ని ఏళ్ళ క్రితం జీవనోపాధి వెదుక్కుంటూ గోవా ప్రాంతం నుంచి బర్మా వెళ్ళి మళ్ళీ ముంబాయి వచ్చి మహీం అనే ఏరియా లో స్థిరపడతారు.అక్కడ ఒక చిన్న అపార్ట్మెంట్ లో నివసిస్తూంటారు.మధ్య తరగతి కుటుంబం అని చెప్పాలి.ఇమెల్డ తాను యవ్వనం లో ఉన్నప్పుడు ఎలా చదువుకున్నది,ఉద్యోగ జీవితం గడిపింది,ఎలా ఆగస్టస్ తో ప్రేమ లో పడింది,ఏ విధంగా ఆమె తల్లిదండ్రుల తో గోవా ప్రాంతం లో గడిపింది ఇంకా ఇలాంటివి సమస్తం మనకి ఇమెల్డ చెబుతుంది.అంటే కొడుకు మాటల్లో పెట్టి అడిగినప్పుడు పేజీలు పేజీలు గా ఆమె చెప్పుకుపోతుంది.అలా కథ నడుస్తుంది.

కూతురు సుసాన్ గాని,భర్త అగస్టస్ గాని ఎంతో ఓపికతో ఈమె ని చూసుకుంటూంటారు. ఎందుకంటే ఉన్నంతసేపు బాగానే ఉంటూ ఒక్కోసారి ఇష్టం వచ్చినట్టు తిట్టడం చేస్తుంది.కొన్నిసార్లు రోడ్డు కి అడ్డం గా వెళ్ళి సూసైడ్ ప్రయత్నం చేస్తుంది.ఇంట్లో ఉన్నంతసేపు బాగా టీ తాగుతుంది లేదా బీడీలు కాలుస్తుంది.ఇంకా కూతురు లేదా కొడుకు తో మాట్లాడేటప్పుడు కూడా సెన్సార్ అనేది ఏమీ ఉండదు.మనసు లో వచ్చినదంతా మాటాడేస్తుంది.నిజం చెప్పాలంటే నవల అంతా పిచ్చి వచ్చిన వారి ప్రవర్తన మీద కేంద్రీకరించి రాసినట్లుగా అనిపిస్తుంది.చివరకి ఆమె ఒక హాస్పిటల్ లో మరణిస్తుంది.ఆమె జీవించిఉన్నప్పుడు జరిగిన సంగతులు తలుచుకుంటూ మిగతా ముగ్గురు బాధపడుతుండగా నవల ముగుస్తుంది.235 పేజీలు ఉన్న ఈ నవల ని అలీఫ్ బుక్ కంపెనీ వారు ప్రచురించారు.

ఈ నవల కి 2016 లో సాహిత్య అకాడెమీ అవార్డ్, వింధాం కాం బెల్ అవార్డ్ వచ్చింది.2012 లో హిందూ లిటరరీ పురస్కారం వరించింది.సాల్మన్ రష్దీ,అమితావ్ ఘోష్,కిరణ్ దేశాయ్ వంటి ప్రముఖులు ఇచ్చిన కితాబులు ఈ పుస్తకం లో ప్రచురించారు.ప్రస్తుతం జెర్రీ పింటో, మెల్ జోల్ అనే స్వచ్చంధ సంస్థ తో కలిసి పని చేస్తున్నారు.కాలమిస్ట్ గా కొన్ని పత్రికల్లో రాస్తుంటారు.అంతేగాక ఔత్సాహిక రచయితల కోసం వివిధ  నగరాల్లో తరగతులు కూడా నిర్వహిస్తుంటారు.

– మూర్తి కెవివిఎస్ (ఫ్రీ లాన్సర్, ఖమ్మం)

       ఫోన్:  7893541003

You may also like

1 comment

ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్ August 27, 2021 - 7:28 am

సమీక్ష బాగుంది సార్

Reply

Leave a Comment