ప్రముఖ సాహితీ వేత్త గా, కవిగా, తెలుగు విశ్వ విద్యాలయం ఉప కులపతి గా, ఉత్తమ పరిశోధకుడిగా, ప్రామాణిక విమర్శకుడిగా, ఆచార్యుడిగా, రచయితగా, పేరు గాంచిన వారు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారు. ప్రస్తుతం తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం వారు అందజేస్తున్న దాశరథి పురస్కారం స్వీకరించిన సందర్భంగా ఆయనతో మయూఖ అంతర్జాల పత్రిక పక్షాన మాడిశెట్టి గోపాల్ చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూ..
ప్ర. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న తెలంగాణ మహాకవి
దాశరథి జన్మదిన సందర్భాన్ని పురస్కారించుకొని ప్రతిష్టాత్మక పురస్కారం ఇటీవల స్వీకరించిన సందర్భంగా మీ అనుభూతి లేదా స్పందన తెలియజేస్తారా?
• ప్రభుత్వం ఇచ్చే ఏ అవార్డ్ ఐనా ప్రతిష్టాత్మకమైనదే. నన్ను గుర్తించి పురస్కారం అందించిన సందర్భంగా ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. సాధారణంగా దాశరథి పైన కృషి చేసిన వారికే దాశరథి పురస్కారం ఇస్తారని అనుకుంటారు. సాహిత్యం లో కృషి చేసిన వారికి దాశరథి పేరిట పురస్కారం ఇస్తారు. మూడు కారణాల వలన నాకు ఈ పురస్కారం వచ్చిందని అనుకుంటున్న. సురవరం ప్రతాప రెడ్డి గారి పైన చాలా కృషి చేయడం, ఆయన జీవిత చరిత్ర రాయడం అలాగే ఆయన శత జయంతి సందర్భంగా వైజయంతీ సంస్థ నుండి దేవులపల్లి రామానుజ రావు గారి సూచన తో సురవరం ప్రతాప రెడ్డి గారి పైన 1988 నుండి 1996 వరకు 12 పుస్తకాలు అచ్చు వేశాము. నేను తెలుగు శాఖ కు అధ్యక్షునిగా ఉన్నప్పుడు 1996 లో ఉస్మానియా విశ్వ విద్యాలయం లో ప్రతాప రెడ్డి గారిపైన నా ఆధ్వర్యం లో సెమినార్ చేయడం తో పాటు పుస్తకం కూడా వేశాము. రెండవ కారణం నేను తెలంగాణ సారస్వత పరిషత్ కు 16 సంవత్సరాలు కార్యదర్శిగా ఉన్నాను. 20 సంవత్సరాలు ఆ సంస్థ తో అనుబంధం ఉంది. ఈ విషయం ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు. ఇక మూడవ కారణం నాదీ వనపర్తి సంస్థాన పరిధికి చెందిన సుదీర్ఘ సాహిత్య జీవితం. ఈ ప్రాంతం నుండి సీనియర్ వ్యక్తికి పురస్కారం ఇస్తే బాగుంటుంది అని అనుకున్నారేమో. ఈ మూడు కారణాల వలన నాకు పురస్కారం వచ్చిందని అనుకుంటున్నాను. ఈ పురస్కారం నాకు వ్యక్తి గతంగా వచ్చిందని అనుకోకుండా సంస్థలకే చెందుతుందని అనుకుంటున్నాను.
ప్ర. దాశరథిగారితో మీకున్న పరిచయ విశేషాలు, సాన్నిహిత్యం గురించి చెప్తారా?
• దాశరథి గారితో పరిచయం ఉంది కానీ పెద్ద పరిచయం కాదు. నేనూ ఆయన కలిసి పది సభల్లో పాల్గొన్నాము. దాశరథి గారి కవిత్వం గురించి నేను చాలా చోట్ల మాట్లాడాను. కొన్ని వ్యాసాలు కూడా రాశాను. దాశరథి గారి లో నేను గమనించిన గొప్ప గుణం ఏమిటంటే ఆయన ప్రసంగించేటప్పుడు మనిషి ఎత్తు తక్కువైనా, ఆ భావావేశంలో ఏడడుగుల మనిషి లాగా కనిపించే వారు. టీచర్స్ అందరికీ ఆ లక్షణం ఉంటే బాగుండు అనిపిస్తుంది. దాశరథి గారు మహంధ్రోదయం అనే పుస్తకాన్ని సురవరం ప్రతాప రెడ్డి గారికి అంకితం ఇచ్చారు. నాకు నచ్చిన అంశాలలో అది మొదటిది. ఆయన పట్ల నాకు అమిత గౌరవం.
ప్ర. మీ విద్యాభ్యాసం వివరాలు తెలుపుతారా ?
• నేను ప్రాథమిక విద్యభాసం మా వూరి లోనే చేశాను. మా వూరు తాళ్ళూరు వనపర్తి జిల్లా లో ఉంది. మా వంశం లో ఎవరు కూడా 4 వ తరగతి చదువుకున్న వారు లేరు. వ్యవసాయం ప్రధానంగా ఉన్న కుటుంబం మాది. తర్వాత కొల్లాపురం లో 5 వ తరగతి నుండి హెచ్.ఎస్సీ వరకు చదువుకున్నాను. హైదరాబాద్ న్యూ సైన్స్ కళాశాలలో పి.యు.సి. బి.యస్సీ చదివాను. పి.జి చెయ్యాలనుకున్నప్పుడు మిత్రులు అంతా ఏం.ఏ. తెలుగు చేయమన్నారు. నాకు ఏం.ఎస్సీ జియాలోజీ లో ఆసక్తి. నాకు తెలియకుండానే మిత్రులు అప్లికేషన్ ఇవ్వడం తో ఏం.ఏ తెలుగు చేశాను. అక్కడి ప్రముఖులు దివాకర్ల వేంకటావధాని, సినారె గారు, తాటిబండ్ల మాధవ శర్మా గారు,పల్లా దుర్గయ్య గారు లాంటి వారు నన్ను అభిమానించే వారు. ఏం.ఏ లో నాకు బంగారు పథకం వచ్చింది. దివాకర్ల వేంకటావధాని గారు మహా భారతం పైన పి.హెచ్.డి చెయ్యమని సూచన చేశారు. ఆయన రిటైర్ అవబోతుండడం తో నారాయణ రెడ్డి గారి కింద నన్ను పి.హెచ్.డి విద్యార్థిగా వేశారు. విద్యార్థి గా నన్ను సినారె గారు బాగా అభిమానించే వారు.. అలా పి.జి. పి.హెచ్.డి పూర్తయ్యింది. 1970 లో తెలంగాణ ఉద్యమ సమయం లో తెలుగు అకాడమీ లోఉద్యోగం వచ్చింది. నాకు బొధన చాలా ఇష్టం. అందుకే ఏ.వి కళాశాలలో లెక్చరర్ గా చేశాను. ఆ సమయం లో ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమీ సురవరం ప్రతాప రెడ్డి గారి రచనలు, సాహిత్యం మీద గ్రంథాలు రాయమని ఒక పోటీ పెట్టింది. అప్పుడు నేను సురవరం ప్రతాప రెడ్డి గారి జీవితం సాహిత్యం అనే పుస్తకానికి నాకు అకాడెమీ అవార్డ్ వచ్చింది. ఈ లోగా ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖ లో లెక్చరర్ పోస్ట్ కు అప్లికేషన్ లు కోరడం తో నేను అప్లై చేశాను. 1973 లో నాకు ఆ పోస్ట్ వచ్చింది. ఆ విశ్వవిద్యాలయం లో లెక్చరర్ గా, ప్రొఫెసర్ గా, రీడర్ గా, బోర్డు ఆఫ్ స్టడీస్ ఛైర్మన్ గా, హెడ్ గా 34 సంవత్సరాలు పని చేశాను. 2005 లో ఉద్యోగ విరమణ చేశాను.
ప్ర. మీ పరిశోధన గురించి తెలుపండి.
• ఆంధ్ర మహా భారతం లో రస పోషణ విరాట్ ఉద్యోగ పర్వాలు అంశం పైన పరిశోధన చేశాను. నేను ముఖ్యంగా సైన్స్ విద్యార్థి ని కావడం, అందులో మహా భారతం గురించి పరిశోధన చేయడం తో చాలా కష్టపడాల్సి వచ్చింది. సినారె గారు మధ్య మధ్యలో తొందరగా చేయమని అడిగేవారు. నేను ఆసక్తి తో సంస్కృతం కూడా కొంత నేర్చుకున్నాను. మహా భారతం ప్రౌడ రచనా కావడంతో సంస్కృతం తెలుగు టెక్స్ట్ చదివి అవగాహన చేసుకున్నాను. నా అనుభూతిని ఆసరాగా చేసుకొని థీసిస్ పూర్తి చేశాను. అది కొంత విలక్షణమైన అంశం అయినప్పటికీ అందరూ నన్ను ప్రసించారు.
ప్ర. పరిషత్తు తో మీ అనుబంధం గురించి చెప్పండి?
• నా పైన దేవులపల్లి రామానుజ రావు గారికి మంచి అభిమానం ఉండేది. అందుకే పరిషత్తు కార్యక్రమాల లో నన్ను ఇన్వాల్వ్ చేసే వారు. సురవరం గారి రచనల పైన పుస్తకాలు తేవాలని వేసిన కమిటీ కి నేనే ఛైర్మన్ ను. దాదాపు 12 పుస్తకాలు అచ్చు వేశాము. మొదట కార్యదర్శిగా చేశాను. సినారె గారి అస్తమయంతో కమిటీ నన్ను అధ్యక్షునిగా ఎన్నుకుంది. అలా అకాడమీ కి ప్రస్తుతం అధ్యక్షునిగా సేవలు అందిస్తున్నాను. సినారె గారి పలుకుబడి గొప్పది. ఆయన పేరు చెప్పితే ఎవరైనా సహకరించే వారు. అంతా క్రితం పరిషత్తు స్థలం ప్రభుత్వం లీజ్ కు ఇచ్చింది. సినారె గారు అధ్యక్షులుగా, నేను సెక్రెటరీ గా ఉన్న సమయం లో అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వారు ఆ స్థలాన్ని పరిషత్తుకు ఇచ్చి 14 లక్షలు డబ్బు కట్టమని అడిగారు. కానీ అప్పుడు పరిషత్తు దగ్గర అంత డబ్బు లేదు. కాని సినారె గారు రెడ్డి లాబ్స్ అంజిరెడ్డి గారిని అప్పుగా అడిగితే వారు ఉచితంగానే సమకూర్చారు. అలా స్థలం పరిషత్తు కు స్వంతమయ్యింది. పరిషత్తుకు ఆదాయం కోసం వెనుక బిల్డింగ్ మరియు షాప్ లు వేశాము. సినారె గారి పీరియడ్ లో అద్భుతమైన పని జరిగింది. వారు కీర్తి శేషులయ్యాక ఒకటే సారి పైనుండి క్రిందికి పడ్డట్టు అయ్యింది. శాంత బయోటెక్ అధినేత వరప్రసాద్ రెడ్డి గారు ఒకసారి పరిషత్తు కు వచ్చినప్పుడు ఆడిటోరియం పునరుద్ధరణ పనుల కోసం కొంత సహకారం గురించి అడగగానే అందుకు అంగీకరించి సంపూర్ణ సహకారం అందించారు.తద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించ గలుగుతున్నాము. గ్రంథ ప్రచురణ, సదస్సులు, గ్రంథావిష్కరణలు , పురస్కారాలు తదితర కార్యక్రమాలతో సారస్వత పరిషత్తు అమోఘమైన సేవలు అందిస్తున్నది. ఈ మధ్య పురస్కారాలు అందించాలనుకున్న వారు లక్ష యాభై వేలు ఇస్తే వారి పేరిట సంవత్సరానికి ఒకసారి 5 వేల రూపాయల పురస్కారం అందిస్తున్నాము. పరిషత్తు ఎప్పుడు పైరవీ లకు, పక్షపాతానికి లొంగదు. ఇటీవల పురస్కారాల ప్రదానం జరిగింది. 7 మందిని ఎంపిక కోసం 24 మంది న్యాయ నిర్ణేతలను పెట్టాము. అలా పారదర్శకంగా పురస్కారాల ఎంపిక కొనసాగుతుంది. వరప్రసాద్ రెడ్డి గారు లక్ష రూపాయలు ఇచ్చి ఒక పురస్కారం ఇవ్వమన్నప్పుడు తిరుమల శ్రీనివాసా చార్య గారికి ప్రదానం చేశాము. భవిష్యత్తు లో వనరులను చూసుకొని ముఖ్యంగా యువ కవులకు, యువ రచయితలకు ప్రోత్సాహం అందిద్దామని అనుకుంటున్నాము. తెలుగు భాషను అభిమానించే అందరికీ పరిషత్తు ఒక కేంద్రంగా ఉండాలని మా ఆశయం. ఇటీవల ఒక పుస్తకాన్ని పది మంది తో వ్యాసాలు రాయించి అచ్చు వేశాము. కవిత్వం రాయడం ఎలా అనేది ఆ పుస్తకం. అది చాలా మంచి పుస్తకం. ఆ పుస్తకం చివర దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి ఇంటర్వ్యూ వేశాము. ఏదైనా ప్రయోజన కరమైనది ఉంటే గాని , అణగారిన వర్గాల గురించి కవిత్వం రాస్తే గాని అవి వేస్తున్నాము. సమాజానికి ప్రయోజనం లేని అంశం తీసుకుంటే మనం నిలువలేము. సమాజం ముఖ్యం. అలాగే సాంప్రదాయాన్ని విస్మరించ కూడదు. సంప్రదాయం తల్లి వంటిది. ఆధునిక సాహిత్యం అర్థాంగి లాంటిది. భార్యతో జీవించాలి. తల్లిని గౌరవించాలి.
ప్ర. తెలుగు సాహిత్యం పట్ల మీరు ఎలా ఆకర్షితులు అయ్యారు?
• మా చేను లో కూర్చుంటే కృష్ణ తుంగభద్రా నది సంగమం, సంగమేశ్వర దేవాలయం కనిపించేవి. అలా నది నాకు బాల్యం నుండే ఒక ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించే లక్షణాన్ని ఇచ్చింది. బహుశా నాన్న గారు సంగమేశ్వరం లో శివుణ్ణి చూసే నాకు ఆయన పేరు పెట్టారని అనిపిస్తుంది. తెలుగు చెప్పే ఉపాధ్యాయులు కూడా ఆసక్తి కలిగించేలా చెప్పే వారు. చంద్రమౌళి శర్మ గారు నాకు చక్కగా పాఠం చెప్పే వారు. ఆ ప్రభావం నాపైన చాలా ఉంది. సహజంగా చిన్నప్పటి నుండి ఎందుకో తెలియదు కానీ తెలుగు భాషపైన అభిమానం కలిగింది. విద్యార్థి గా కూడా కొన్ని రచనలు చేశాను. హైదరాబాద్ లో రెడ్డి హాస్టల్ లో ఉండేవాడిని. దాని పక్కనే అప్పటి ఆంధ్ర సారస్వత పరిషత్ ఉండేది. మరో పక్కన శ్రీకృష్ణ దేవరాయ భాష నిలయం ఉండేది. విద్యార్థి గా ఉన్నప్పుడే పరిషత్తుకు, భాష నిలయం లో జరిగే అనేక సభలకు వెళ్ళి వినే వాడిని. సినారె గారిని మొదట చూసింది భాషా నిలయం లోనే 1963 లో అలా నాకు సాహిత్యం పట్ల ఆసక్తి కలిగింది. భగవంతుడి దయ, గురువుల ఆశీర్వాదం నాకు అన్నీ అవకాశాలు వచ్చాయి. అంతకంటే నేను కోరుకునేది ఏమీ లేదు.
ప్ర. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి గా, గురువుగా మీ అనుబంధం తెలుపండి.
• నా జీవితం లో ఆ విశ్వ విద్యాలయాన్ని తలుచుకోని రోజు ఉండదు. నాకు ఎన్ని ఆస్తులైన ఉండవచ్చు కాక, కానీ నాకు అన్నం పెట్టిన యునివర్సిటి అది. చాలా గొప్ప విశ్వవిద్యాలయం అది. తెలుగు శాఖ లో సినారె, దివాకర్ల వారి పేరు చెప్పితే ఆరోజులలో చాలా గౌరవంగా చూసేవారు. సినారె గారు పాఠం చెప్పితే గోడలు విన్నాయి, మేడలు విన్నాయి,వాడలు విన్నాయి అనే కవిత్వం రాశాను ఇటీవల. నేను ఉద్యోగం లో చేరే సమయం లో వి.సి. గా నూకల నరోత్తమ రెడ్డి గారు ఉండేవారు. ఆయన ఒకప్పుడు గోల్కొండ పత్రిక సంపాదకులు. ఎంతో మంది ప్రతిభావంతులు ఉన్నప్పటికీ నాకు పరిస్థితులు అనుకూలించడం తో ఆ విశ్వవిద్యాలయంలో ఉద్యోగం లభించడం నా అదృష్టం గా భావిస్తున్నాను.
ప్ర. మీ రచనా వ్యాసంగం గురించి తెలియజేస్తారా ?
‘పూల కారు’ అని కవిత్వం 1984 లో అచ్చయ్యింది. విచిత్రం ఏమిటంటే కె.సి.ఆర్ గారు ఆ పుస్తకాన్ని సిద్దిపేట లో ఆవిష్కరించారు. ఆ సమావేశం లో కసిరెడ్డి గారు ఉన్నారు. జాతీయ సాహిత్య పరిషత్తు నుండి అక్కడ ప్రస్తుత సి.ఎం గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. యువభారతి వారు కోరితే ఒక చిన్న పుస్తకం రాశాను. తిక్కన రసభారతి విమర్శగ్రంథము, ముసలమ్మ మరణం వంటి పుస్తకాలను ప్రచురించాను. ఆకాశవాణి భావన ప్రసంగాల సంపుటి ‘భావ దీపాలు’, సురవరం ప్రతాపరెడ్డిగారి జీవితం, సాహిత్యం, సిద్ధాంత గ్రంథమైన ఆంధ్రమహాభారతంలో రసపోషణం గ్రంథాలను వెలువరించాను.
ప్ర. తెలుగుసాహిత్య అధ్యాపకునిగా, తెలుగు సాహిత్య భాషా సాహిత్యసేవకునిగా మీ అనుభవ, అనుభూతి విశేషాలను తెలుపుతారా?
దాశరథి గారి కవితావేశం, సినారె గారి బోధనా కౌశలం, దివాకర్ల గారి పాండిత్యం ..ఇవన్నీ చూసిన తర్వాత కొన్నైనా అలవరచుకుంటే విద్యార్థులకు మేలు కలుగుతుందని అనుకోని నేను కృషి చేశాను. నాకు బోధన ప్రాణం. నా ఉద్యోగ విరమణ రోజున నేను చెప్పాను..డబ్బులు ఇవ్వకున్న ఫరావా లేదు ఉచితంగా పాఠాలు చెపుతాను అని. మళ్ళీ జన్మ అంటూ ఉంటే నేను తెలుగు లెక్చరర్ గానే జన్మిస్తాను.
ప్ర. మీ ఇతర పురస్కారాల వివరాలు తెలుపండి.
• చాలా ఉన్నాయి కానీ పురస్కారాలకు పొంగిపోయే మనస్తత్వం కాదు నాది. ఇచ్చేవారు గౌరవం తో ఇస్తారు మనం తీసుకుంటాం అంతే. నాకు 1972 లో సాహిత్య అకాడమీ అవార్డ్ వచ్చింది. వివిధ ప్రైవేట్ సంస్థల పురస్కారాలు దాదాపు ఇరవై దాకా ఉన్నాయి.
ప్ర. మీ గురించి చెప్పాల్సి వస్తే ఒక సాహితీ వేత్త గా, కవిగా, ఉప కులపతి గా, పరిశోధకులు గా, విమర్శకులు గా ఆచార్యులుగా ఉన్నారు. మీకు సంతృప్తి నిచ్చిన అంశం ఏది?
• మంచి ప్రశ్న అడిగారు. నేను ఉస్మానియా బోర్డు ఆఫ్ స్టడీస్ ఛైర్మన్ గా ఉన్నప్పుడు నాకు అందరూ బాగా సహకరించారు. నా జీవితం లో ఇప్పటివరకూ ఎప్పుడు రాజకీయాలు చేయలేదు. రాజకీయాలు చేయడం, సాటి వారి మీద కుట్రలు చేయడం నా జీవితం లో లేదు. అందుకే విద్యార్థులు, అధ్యాపక వర్గం నాకు సహకరించారు. నా పదవీ కాలం లో నా పైన చిన్న గొడవ కూడా లేదు. పూర్వ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి టీచర్ గా నా మీద గౌరవం. తెలుగు విశ్వవిద్యాలయం ఉప కులపతి గా నాకు అవకాశం ఇచ్చారు. నాకు అక్కడ అందరి సహకారం అమోఘం గా లభించింది. మొదటి సమావేశం లోనే దేన్నైనా సహిస్తాను కానీ, క్రమశిక్షణ రాహిత్యాన్ని సహించను అని చెప్పాను. అప్పటి వరకు తెలుగు విశ్వవిద్యాయంకు, నాక్ గుర్తింపు లేదు. నేను నాక్ కమిటీ గుర్తింపు వచ్చేలా చేశాను. దాని కోసం నేను కష్టపడ్డాను, అందరూ సహకరించారు. యునివర్సిటి కి సున్నం వేయించి అందంగా కనపడెలా చేశాను. అక్కడ గార్డెన్ కూడా డెవలప్ చేశాను. పరిసరాల అందం మారిపోతే విద్యార్థులు కూడా ఆనందం గా చదువుతారనే భావన తో ఆ పనులు చేశాను. తెలుగు విశ్వవిద్యాలయం రూపు రేఖలు మారాయని అందరూ ప్రశంసించారు. ప్రపంచ తెలుగు సభల సందర్భంగా నన్ను 30 రోజుల వ్యవధి లో ఒక పెద్ద సావనీర్ తీసుకురావాలని కోరారు. దాన్ని ఛాలెంజ్ గా తీసుకొని కొందరు అధ్యాపకుల సహకారం తో నాలుగు రోజులలో 1100 పేజీల రాయల్ సైజ్ లో ప్రింట్ చేయించాను. మేము స్టాల్ పెడితే కొన్ని వేల కాపీలు అమ్ముడయ్యాయి అవి. సుమారు 60 లఘు పుస్తకాలు కూడా వేశాము. సరియైన అంశం పైన, నాణ్యమైన పేజీ లతో వేశాము అవి. అది తెలుగు విశ్వవిద్యాలయానికి దక్కిన ఘనత.
ప్ర. ప్రస్తుతం వస్తున్న సాహిత్యం పట్ల మీ అభిప్రాయం చెప్తూ వర్థమాన రచయితలకు సూచనలు ఏవైనా ఇస్తారా..
• సాహిత్యం లో అనేక ప్రక్రియల లో రాస్తున్న ఎవరినీ నిరాకరించకూడదు. కానీ ఒక ప్రయోజనం ఉండాలి. ఒక సందేశం ఉండాలి. భాషా చాతుర్యం ఉండాలి. అవి లేకుండా అంతగా రచన రాణించదు. సినారె గారి భావన లో ఎవరైనా ఒక రచనా బాగా లేదని అంటే కాలం ఒక ప్రవాహం. కాలం ప్రవహిస్తూ ఉంటుంది. అది మంచిని తీసుకెళ్లి, చేత్తను ఒడ్డు పైన పడేసి పోతుంది. సాహిత్యం కూడా అలాంటి ఒక ప్రవాహం అని అనేవారు. ఇప్పుడు చాలా మంది చదవడం కు దూరంగా ఉంటున్నారు. సమయం చాలా అమూల్యమైనది. రచయితలు సమాజనికి ఉపయోగపడే రచనలు చేస్తే మంచిది. ఎవరు రాసిన ఒక ప్రామాణికతతో రాయాలి. భాష పట్ల గౌరవం ఉండాలి. భాష జ్ఞానం ఉండాలి. సంస్కృతి పైన, భాష పైన గౌరవం లేక పోతే ఆ జాతి ఎక్కువ కాలం నిలువదు. దేశాభిమానానికి భాషాభిమానమే మూలం అని కొమర్రాజు లక్ష్మణ రావు అన్నారు. ఇప్పుడు వస్తున్న భాష తీరు కొంచెం మారి తెలుగుదనం ఎక్కువ అయితే బాగుంటుంది.
1 comment
ఇంటర్వ్యూ బాగుంది. చాలా సమాచారం రాబట్టారు