Home పుస్త‌క స‌మీక్ష‌ బి.సి.వాద సాహిత్య స్తబ్దతను బద్దలుకొట్టిన గ్రంథం

బి.సి.వాద సాహిత్య స్తబ్దతను బద్దలుకొట్టిన గ్రంథం

by Laxminarayana

సాహిత్యం యొక్క ప్రధాన భూమిక సమాజ‌ హితాన్ని కాంక్షించడం. రాయబడే ప్రతీ విషయం సాహిత్యం లో భాగం అవుతుందా అనే ప్రశ్నకు సమాజ శ్రేయస్సును కోరుతూ, సమాజాన్ని ప్రభావితం చేయగలిగినదైతే అది సాహిత్యంగా పరిగణించడం ఏ మాత్రం తప్పు కాదు. సాహిత్యం యొక్క పరిధిని, సాహిత్యంలోని రీతులను పనికట్టుకొని హాద్దులు నిర్ణయించడం సాధ్యం కాని పని. ఒకనాడు మౌఖిక సాహిత్యం ఆ తర్వాతి కాలంలో 11వ శతాబ్దం నాటి నన్నయ  నుండి నేటి ఆధునిక కవుల దాకా, నాటి వేదాలు, పురాణాలు, ఇతిహాసాల నుండి నేటి నానీలు, హైకూలవంటి ప్రక్రియలదాకా దేనికీ కొలమానాలు రూపొందించలేం. కాబట్టే

సాహిత్యం యొక్క పరిధి విస్తృతమైంది. సామాజిక స్పృహతో పాటు, వ్యక్తిని సంకుచితత్వం నుండి విశాల భావాలోచన వికాసం వైపు పయనించేలా చేయగలిగిన శక్తి సాహిత్యానిది.

తెలుగు సాహితీ ప్రపంచాన ఎందరో గొప్ప కవుల ఉదయాస్తమానాలు జరిగినా వారు నాటిన ఆలోచనాంకురాలు సమాజాన్ని కాలానుగుణంగా ప్రభావితం చేస్తూ వున్నాయి. కొన్నిసార్లు ఆ ప్రభావం విప్లవాలకు దారితీయొచ్చు కాని అది విప్లవాత్మక వేగంతో జరుగుతుందా అనేది ఎవ్వరం నిర్ణయించలేం. తెలుగు సాహిత్యంలో సాహితీ కలాలు ఎన్నో వాదనలను, ఎన్నెన్నో వేదనలను కాగితపు కాన్వాస్ పై పుటలు, పుటలుగా చిత్రించాయి.  కాల, స్థల, పాలనా పరిస్థితులకు అనుగుణంగా  పేదల, పీడితుల కష్టాల, కన్నీటి కథలను ఎందరో కవులు సిరాచుక్కలతో వ్యవస్థపై కుమ్మరించారు. సాహితీ కలానికుండే శక్తి ప్రశాంతంగా కనిపించే అగ్ని పర్వతం లాంటిది. ర

చనాభిరుచి అనేది వ్యక్తి, వ్యక్తిని బట్టి మారుతుంది. అది పూర్తిగా స్వనిర్ణయ సాధికారతను కల్గి వుంటుంది. ఒకనాడు శిష్ట కులాలకు మాత్రమే అనే చందాన సాగేది పాండిత్య, రచనా ప్రస్థానం కాని నేడు  అన్ని వర్గాలకు వ్యాపించడం శుభపరిణామం. దాని వల్ల జరిగిన లాభం ఏమిటంటే? ఇతరుల భాదను చూస్తూ రాస్తున్న వ్యక్తి కంటే అనుభవించిన వాడు చేసే వ్యక్తీకరణ మరింత సహజంగా, ప్రభావవంతంగా వుంటుంది.  కుటుంబ ప్రాతిపాదికన వ్యక్తుల సమూహం చేత భాషా, ప్రాంత, కుల, మత వైరుధ్యాలచే నిర్మితమయ్యే సంక్లిష్ట వ్యవస్థ సమాజం. సాహిత్యమెప్పుడూ సాధారణ ప్రజల పక్షాన నిలిచి వారి నిత్యజీవితంలో నిక్షిప్తమై వున్న ఘోషను, గోసను వినిపించే స్వరం అవుతుంది. ఈ క్రమంలో దళిత వాదం, స్త్రీ వాదం, మైనార్టీ వాదం, బహుజనవాదం మొదలైన సాహితీ వాదాలు ఉనికిలోకి వచ్చాయి.

ఏ వాదమైనా వ్యక్తి, వ్యవస్థ యొక్క అస్థిత్వాన్ని, జీవికను ఉనికిలో ఉంచే లక్ష్యంతో కొనసాగుతూ సమాజపు విపరీత పోకడలను నిరసించడంలో కీలక పాత్ర వహిస్తుంది. ప్రపంచీకరణ, పారిశ్రామికీకరణ మూలంగా మన సమాజాల్లో ఏర్పడిన సంఘర్షణలు, సంపీడిత పరిస్థితులను బహిష్కృతం చేసే స్వభావాన్ని కల్గి వుంటాయి. అక్కడి నుండి ఉద్భవించినవే దళిత, స్త్రీ, మైనార్టీ, బహుజన వాదాలు. ఈ క్రమంలో బిసీ వాదం అనే ప్రత్యేక వాదం ఉందా లేదా అనే ప్రశ్న తలెత్తక తప్పదు. ఈ ప్రశ్నకు సమాధానంగా నిలిచే దానికి సంబంధించిన అంశాలను చర్చించే వివిధ బీసీ వాద గ్రంథాల క్రమంలో నిలిచిన మరొక గ్రంథం “తెలంగాణ బి.సి. వాద సాహిత్యం”. ఈ పుస్తక రచయిత అట్టెం దత్తయ్య. అట్టెం దత్తయ్య నేటి కామారెడ్డి జిల్లాలోని షెట్పల్లి గ్రామ వాస్తవ్యులు. ఈయన ఇటీవలే “మహభారతంలో సంవాదాలు- సమగ్ర పరిశీలన” అనే అంశంపై పరిశోధనను పూర్తి గావించారు. ఇంతకుముందు ఈ రచయిత ఆధ్వర్యంలో ‘కళ్ళం’(సాహిత్య వ్యాస రాశి) 2018 అనే గ్రంథం వెలువడింది.

‘ఆకాశంలో సగం’ అనే నినాదంతో పురుషుల్లో సగభాగంగా వున్న స్త్రీలు వారి పట్ల కొనసాగుతున్న వివక్షకు వ్యతిరేకంగా స్త్రీ వాదం అనే పేరుతో పోరాడుతున్నారు. సమాజంలో సగ భాగంగా వున్న బిసీలు అనేక ఉద్యమాలలో క్రియాశీలంగా వుంటున్నప్పటికీ అటు రాజ్యాధికారమూ, ఇటు అస్తిత్వమూ లేని పరిస్థితుల్లోకి నెట్టి వేయబడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో బిసిలు అస్తిత్వ, రాజ్యాధికారం వైపుగా ఆలోచించడం అవసరం. దానికై సాహిత్య, సాంస్కృతిక పునరుజ్జీవనం తథ్యంగా రావాలి. బిసీలకు చెందిన సాహిత్య, సాంస్కృతిక అంశాలు బహుజన సాహిత్యం ముసుగులో అసౌష్ఠవ రీతిలో విసిరివేసినట్లుగా వున్న సందర్భంలో వాటినంతటినీ ఒక చోటకు చేర్చడం అనివార్యమైంది. ఈ అనివార్యతను తొలగించి బిసీ సాహిత్యం యొక్క స్థాయి, వ్యాప్తిలను తెలిపిన నిర్మాణాత్మక రచన ఈ “తెలంగాణ బిసీ వాద సాహిత్యం” అంటూ ఈ పుస్తకానికి ‘బహుజనుల వీలునామా’ పేరుతో పీఠిక రాశారు ఎస్.రఘు గారు.

ప్రస్తుత పరిస్థితుల్లో వైశ్వీకరణం(గ్లోబలైజేషన్), వైశ్యీకరణం( వాణిజ్యీకరణం) మూలంగా చేతి వృత్తులు, కుల వృత్తులతో పాటు అన్ని వర్గాలు అస్తిత్వాన్ని కోల్పోయి వృత్తి, విషయ నైపుణ్యాలకు విలువ లేకుండా పోయింది. వాటి పర్యవసానంగా సంపద కేంద్రీకరణ, అధికార కేంద్రీకరణ పెరిగిపోయి అన్ని వర్గాలు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబాటుకు గురవుతున్నాయి. వారి సామాజిక, ఆర్థిక స్థితిగతులను ఏకరువు పెట్టే క్రమంలో కొందరు స్వానుభవం చేత, మరికొందరు పరిశీలన అనుభవం చేత సాహిత్యాన్ని సృష్టించారు. ఆ సాహిత్యాన్ని సంకలనం చేస్తూ విమర్శించిన పుస్తకం ఈ ” తెలంగాణ బిసీ వాద సాహిత్యం” అంటూ పుస్తక పీఠిక రాశారు సాగి కమలాకర శర్మ గారు.

“బహుజనులు దళితులు ఒక్కరే, ఇవి రెండు సమానార్థక పదాలు. ఈ విషయం గుర్తించకుండా ఎస్సీలను దళితులుగా, బిసీ లను బహుజనులుగా పేర్కొని వారి మధ్య దూరం పెంచకూడదు” (తెలంగాణ బిసీ వాద సాహిత్యం-పేజీ  24) అంటూ కాలువ మల్లయ్య స్పష్టం చేశారు. లక్ష్మీనర్సయ్య ‘చిక్కనవుతున్న పాట’ లో ఎస్సీ, ఎస్టీ, బిసీ కవులందరూ తమ స్వానుభావాల్ని కూర్చుతూ రాసిన కవిత్వమే దళిత కవిత్వం అన్నాడు. పరాయి పల్లవి వ్యాసంలో సతీష్ చందర్ దళిత వాడలు అగ్రహారనికి ఎంతదూరమో బిసీ పేటలకూ అంతే దూరం. హరిజనోద్దరణ‌ కవిత్వం పేరుతో పులుపు చావని బిసీ కవులు మళ్ళీ రాయనవసరం లేదంటూ ఘాటుగా స్పందించాడు. బిసీ సాహిత్యకారులు తమ కోణాల్లో సాహితీ సృజన చేస్తున్నప్పటికీ వారి సాహిత్యం బిసీ అస్తిత్వవాద సాహిత్యంగా ఎందుకు గుర్తించబడలేదు అనే ప్రశ్నను బాణాల శ్రీనివాస్ లేవనెత్తాడు. ఇదే విషయంపై ఎస్.రఘు “కొన్ని గాయాలు మానవు కాని మానినట్టుగా వుంటాయి. అస్తిత్వ ఉద్యమాలు కూడా గాయాల్లాంటివే కొన్నిసార్లు అవి ఉవ్వెత్తున ఎగసి పడలేక పోవచ్చు, కాని అంతర్గత స్రావాలు జరుగుతూనే వుంటాయి అని చెప్తూనే బిసీల కన్నా పై తరగతి వారి చేతుల్లో మూల్గిన సాహిత్యం ఇప్పుడిప్పుడే వారికి సాన్నిహిత్యంగా ముందుకు సాగుతుండడం వల్ల బిసీలు తమ అస్తిత్వవాదాన్ని బలపర్చడానికి కొంత తెగింపును ప్రదర్శించడం లేదు” అనే కారణాన్ని తెలియపరిచాడు. ఇలాంటి సమయంలో 2001లో పూర్తి బిసీ వాద కవిత్వంగా జూలూరి గౌరీశంకర్ సంపాదకత్వంలో ‘వెంటాడే కలాలు- వెనుకబడిన కులాలు’ అనే సంకలన గ్రంథం వెలువడింది. ఆయన అగ్రకుల అధిపత్య, భూస్వామ్య వర్గాల అణచివేతను ఎదిరించడానికి దళిత, బిసీ, మైనార్టీలందరూ కలిసికట్టుగా ఉద్యమించాలని కోరుకున్నారు. కాని ఈ విషయాన్ని దళితులు మరో కోణంలో అర్థం చేసుకున్నారంటూ ‘కొత్త తొవ్వలు తీస్తున్న బిసీ కవిత్వం’ అనే వ్యాసంలో పగడాల నాగేందర్ తెలుగు సాహిత్యంలో దళితవాద కవిత్వం ఒక పాయలాగ మొదలై 1995-2000 మధ్య పూర్తి పాయలాగా చీలిపోయింది. దానికి కారణం “అనాది కాలం నుండి అగ్రకులాల చేతిలో అవమానాలకు గురికావడం వల్ల వారికి వారే అన్నట్లుగా భావించడం, దాంతోపాటు బిసీలను మీరు మాతో సమానమైన పీడితులు కాదు అంటూ వారిలో నిక్షిప్తమైన ఎత్తిపొడుపు భావన” అంటూ వివరించారు. శతాబ్దాలుగా సమాజంలో, చరిత్రలో కీలక పాత్ర పోషిస్తున్న సమాజ నిర్మాతలు, సంపద సృష్టికర్తలు బిసీలు అంటూ బి.ఎస్. రాములు ఒక వ్యాసంలో తెలియపర్చారు. దళిత సాహిత్యం, మాదిగ సాహిత్యం, మైనార్టీ సాహిత్యం, గిరిజన సాహిత్యం, క్రైస్తవ సాహిత్యం అంటూ అన్నింటికీ ఒక అస్తిత్వం వుంది. కాని బిసీ సాహిత్యం మాత్రం దళిత, బహుజన సాహిత్యంలో అంతర్భాగమైన నేపథ్యంలో బిసీ సాహిత్యం ‘సబ్బండ సాహిత్యం’ గా బలపడాలి అంటూ కాలువ మల్లయ్య తన వాదనను తెలియపర్చారు. ఇలా పలువురు రచయితల నిర్వచన, అభిప్రాయాలతో ఈ పుస్తకంలో  బి.సి.వాదం ఎందుకు ప్రత్యేకంగా ప్రారంభమైంది, ఇది కావడానికి ప్రేరణలు, కారణాలు ఏమిటి, బి.సి.ల గురించి వచ్చిన మొదటి గ్రంథాలు ఏవి, వెలువరించిన గ్రంథాల మీద వచ్చిన కుట్రపూరిత విమర్శ, విస్మరణ, అట్లాగే బి.సి.పదాన్ని మరో పదంగా మార్చుకోవాలనే సాహితీకారులు సమావేశాల ద్వార నిర్ణయించిన పదాలు,  బి.సి.వాదం గురించి రాస్తున్న వారిలో కనిపిస్తున్న రెండు ధోరణులు వంటి విషయాలను సోపపత్తికంగా “తెలంగాణ బిసి వాద సాహిత్యం- పరిచయం”  అనే విభాగంలో చర్చించారు.

ఈ పుస్తకంలోని ప్రధాన శీర్షికల్లో మొదటి అంశం “తెలంగాణ పద్య కవిత్వం – బిసీ వాదం”. పురాణం, ప్రబంధం, శతకం, ఉదాహరణం ప్రక్రియ ఏదైనా విషయాన్ని ఉద్ఘాటించడానికి పద్యం వారధిగా నిలిచింది. తెలంగాణ సాహిత్యంలో మొదటిసారిగా బిసి కులాలకు తన బసవపురాణంలో పాల్కురికి సోమనాథుడు స్థానమివ్వడంతో ప్రారంభం అయింది. పాత జ్ఞాపకాల వెలికితీత, బాధలు, వివక్షల ఇతివృత్తంతో,  వృత్తి ఆధారంగా కులం ఏర్పడిందా? కులం ఆధారంగా వృత్తి ఏర్పడిందా? అనే ప్రశ్న వస్తుంది. కొన్నిసార్లు అవసరం నిమిత్తం తప్పనిసరి పరిస్థితుల్లో ఇతర కుల వృత్తులు చేపట్టిన వారున్నారు. అంత మాత్రాన వారి కులం మారుతుందా? అనేది ప్రశ్న. ఇక వృత్తి పనిని నమ్ముకొని కాలం వెళ్ళదీస్తున్న వారికి, సమాజంలో కనీస ఆదరణ లేక వారి జీవన ఉపాధి పరిస్థితులు ఏవిధంగా మారాయి అనే తాత్వికతతో వివిధ రచయితలు రాసిన పద్యాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. వాటిలో వృషాధిప శతకంలో పాల్కురికి ” గొల్ల స్త్రీ లు వీధుల్లో చల్లను అమ్మేవారని” రాసిన విషయాన్ని, అలాగే బసవ పురాణంలో ” వీధిలో చల్లనమ్ముచు ఒక గొల్లకాంత జారి పడబోయి బసవరో అని కేక పెట్టగా బసవన కాపాడినాడు” లాంటి విషయాలు కలవు. వీటి ద్వారా బిసి కులాలకు చెందిన గొల్లల ప్రస్తావన నాటి కాలంలోనే రాయబడింది అనే విషయం ధ్రువీకరించాడు రచయిత దత్తయ్య. గొల్లడా! అనే శీర్షికతో కేశపంతుల వేంకట నర్సింహశాస్తి రాసిన ఐదు పద్యాలు చేర్చాడు. దోరవేటి ఒక పద్యంలో ఉప్పరుల గూర్చి ‘కట్టడముల ధాత! కరము మోడ్తు’ అని పల్కిన సందర్భాన్ని తెలియజేశాడు. దానితోపాటు దోరవేటి అన్ని కులాలను గురించి పద్యాల్లో ప్రస్తావించిన విషయం తెలియ పర్చాడు. గంగుల శాయి రెడ్డి ‘కాపుబిడ్డ'(1937) లో మున్నూరు కాపులు మొదటి రోజుల్లో పడ్డ కష్టాలను తెలుపుతూ రాసిన పద్యం అయిన ” కుడిమూపుపై కాడి యెడమ భుజంబున,,,,,,,,,,,” ను గూర్చి రాశారు. “తెలంగాణ పద్య కవిత్వం- బిసీ వాదం” శీర్షికలో 14 కులాల ప్రస్తావనతో వివిధ రచయితలు వారి రచనలలోని పద్య పంక్తులను సహ వాటి నేపథ్యంతో కూడిన విషయ వివరణ తెలియజేశారు.

ఈ పుస్తకంలో మరొక శీర్షిక “తెలంగాణ పాట- బిసి వాదం”. ఆట- పాట, పని- పాట, ఆడుతు పాడుతు పనిచేస్తుంటే ఇలాంటి మాటలను బట్టి చూస్తే మనిషి జీవితంలో పాటకున్న ప్రాముఖ్యత ఏపాటిదో అర్థం అవుతుంది. పండితులకూ, పామరులకు అందరికీ ఆమోదయోగ్యమైనది, ఆదరపూరకమైనది పాట. “జర్మన్ భాషా సుభాషితం ప్రకారం ప్రతి వస్తువులోనూ ఒక  పాట నిద్రిస్తూ వుంటుంది, ప్రతి వస్తువూ ఆ పాటను స్వప్నిస్తూ వుంటుంది(అదే, పుట :73)” అన్నట్టుగా ఈ శీర్షికలో పాటల ద్వారా బిసీ కులాలు, వారి జీవన విధానం, సంఘర్షణలు, వారి పాటలో వృత్తికి సంబంధించిన పంక్తులు మొదలైన అంశాల పరిశీలన కలదు. అలాంటి కొన్ని ఉదాహరణలు: గూడ అంజయ్య చేతివృత్తుల వారి కష్టాలను తెలుపుతూ రాసిన పాట ‘బావయ్యో…బావయ్యో’, గోరటి వెంకన్న సబ్బండ వర్ణాల కష్టాలను తెలిపిన పాట ‘పల్లే కన్నీరు’ ఇందులో కుమ్మరి, కమ్మరి, మంగలి, కంసాలి, సాకలి, గౌడ, కురుమ కులాల బతుకు చిత్రం ఎలా ఛిద్రం అవుతుందో తెలియపరిచాడు. బిసీ కులాలను గూర్చి ఒకే పాటలో పలికిన మరో రచయిత జయరాజ్ పంక్తులు: ‘గడ్డాలు మీసాలు గీసి/గుడ్డల్ని శుభ్రంగ ఉతికి/ వండె గుండిల్ని చేసి/ వంటా వార్పుల నేర్పి/మనిషిని మనిషిగ చేసి ,,,,,,,,,,బహుజనులే మన ప్రేమ పావురాలు/బహుజనులే మన శాంతి కపోతాలు’ అంటూ బహుజన కులాల ప్రాముఖ్యాన్ని తెలిపాడు. అదే విధంగా కందికొండ రాసిన యూట్యూబ్ పాటలో: ‘చలో చలో చలో చలో బిసి/ నీవే నీ తలరాతను రాసుకోలేసి/60శాతం ఉండి అడుక్కునుడు ఏంది’ అంటూ బిసిల్లో ఐక్యత నింపేలా వారు రాజ్యాధికారం వైపు అడుగులు కల్పించాలంటూ స్ఫూర్తిని నింపే మరో పాటను నొక్కిచెప్పాడు. ఈ శీర్షికలో వివిధ రచయితలు పాటల రూపంలో బిసి కులాలకు సంబంధించి ప్రత్యేకంగా స్పృశిస్తూ రాసిన పాటలను, బహుజన, సబ్బండ వర్ణాల నేపథ్యంగా రాయబడిన పాటల ప్రస్తావనను గూర్చి అట్టెం దత్తయ్య విశ్లేషించారు. ఈ విభాగంలో సూచించిన ప్రధానమైన అంశం బి.సి.ల ఆశ్రితగాయకుల మౌఖిక సాహిత్యం అంతా గ్రంథస్థం అయిననాడు బి.సి.ల నిజమైన అస్తిత్వం తెలుసుకునే అవకాశం ఉంది అనే అంశం తెలిపాడు.

“తెలంగాణ వచన కవిత్వం- బిసీ వాదం” అనేది మరొక శీర్షిక. నిజానికి బిసీ వాద సాహిత్యం ఎక్కువ మొత్తంలో వచన కవిత్వంలో వచ్చిందని చెప్పొచ్చు. దానికి కారణం పీ.వీ.నరసింహ రావు గారి నూతన ఆర్థిక సంస్కరణల వల్ల జరిగిన పారిశ్రామికీకరణ, ప్రపంచీకరణల ఫలితంగా చేతి, కులవృత్తుల ప్రాభవం తగ్గిపోయింది.  బిసీల జీవన స్థితిగతులు దైన్యంలోకి నెట్టబడ్డాయి. వాటిని ఏకరువు పెట్టేందుకు 2000 సంవత్సరం తర్వాత చాలా మంది రచయితలు తమ కలాల గలాలను వచన రూపంలోనే ఎక్కువ  మొత్తంలో వినిపించారు. అలాంటి వచన కవితా సంకలనాలలో కొన్ని ‘ బహువచనం’, ‘మేమే‘, ‘మొగి‘,  ‘వెంటాడే కలాలు- వెనుకబడిన కులాలు’, ‘ఇరుసు’, ‘సమూహం’, ‘బి.సి.కవితా సంకలనం’ వంటి వచన కవితా సంపుటాలలో వారి అస్తిత్వాన్ని, జీవన సంఘర్షణలను, వృత్తుల విలువ తగ్గడం వల్ల ఎదుర్కొంటున్న కష్టాలను ప్రతిబింబించే రీతిలో వచ్చిన వచన కవితా సంకలనాలను పూర్తిస్థాయిలో విశ్లేషించే ప్రయత్నం కనిపిస్తుంది. వీటితో పాటు కొన్ని కులాల మీద వచ్చిన దీర్ఘ కవిత అయిన‘బువ్వకుండ’ వంటి వాటిని విశ్లేషిండం వల్ల రచయిత దత్తయ్య పాఠకులకు బిసీ సాహిత్యంలో రూపొందిన వచన కవిత్వ సాంద్రతను తెలిపే ప్రయత్నం చేశాడు. ఉదాహరణకు యువ రచయిత, పరిశోధకుడైన వడ్కాపురం క్రిష్ణ కుమ్మరి కులం వారి వ్యధలను తెలుపుతూ రాసిన ‘మట్టి చిత్రం’ కవితలో కొన్ని పంక్తులు:

“జీవితమంతా మట్టిమయం

అంతెందుకు!?

అసలు మట్టి అంటేనే జీవితం

జీవితమే మట్టి కదా

అదే మట్టికుండ నాడు

రాగి, ఇత్తడి,వెండి

ఆఖరుకు ఇనుమును కూడా తట్టుకుని నిలబడింది

నేడు ప్లాస్టిక్

చెరలో బందీగా కనుమరగవగా

ఉత్పత్తి కులం నేడు ఉత్తి చేతులతో నిలబడిపోతున్నది…”

ఇలా వచన కవిత్వంలో బిసీలకు సంబంధించిన వివిధ కులాలపై వచ్చిన కవిత సంపుటాలను, అందులోని వాదాన్ని, వర్ణనలను పాఠకులకు పరిచయం చేశారు.

తెలంగాణ కథ- బి.సి వాదం, తెలంగాణ నవల బి.సి వాదం అనే పేర్లతో మరో రెండు శీర్షికలు కలవు. ఇక కథ, నవలల్లో బిసిల ప్రస్తావన అస్తిత్వ ఉద్యమానికి ముందు నుంచే వారి కులాలకు చెందిన, వారి జీవనశైలికి సంబంధించిన అంశాలతో కథలు, నవలలు కలవు. సమాజంలో ఉత్పత్తి, సేవా, చేతివృత్తుల పాత్ర గణనీయమైనది అవ్వడం మూలంగా వారి జీవన ముఖచిత్రాల గూర్చి ప్రత్యేకంగా  బిసీ వాదం పేరుతో కాకుండా ఒక కథ, నవలకు కథా వస్తువును ఎంచుకొనే క్రమంలో సహజంగానే కథా సంవిధానాల్లో వారి జీవిత చిత్రాలు అల్లబడినాయి. కథ, నవల ఎప్పుడూ ప్రజల పక్షం వహిస్తూ అన్ని వర్గాల వారి శ్రామిక, పీడిత, సమస్యాత్మక అంశాలను, భూస్వామ్య, పెట్టుబడిదారీ, పారిశ్రామికీకరణల పర్యవసానంగా ఉత్పన్నమైన సమస్యలను, వివాదాలను చిత్రీకరించే విధంగా వుంటాయి. దానికి తోడు సమకాలీన, చారిత్రక కల్పిత అంశాలచేత మనిషిని ఒక కొత్త ప్రపంచంలో లీనమయ్యేలా చేయగల్గి, సగటు మనిషిని వాటిలో ప్రతిబింబించే స్వభావాన్ని  కల్గి వుంటాయి. సమాజంలో, కుటుంబంలో అంతర్గతంగా ఇనుమడింపబడిన విభిన్నత కల్గిన కథావస్తువుతో సమాజాన్ని పెద్ద కాన్వాస్ లో దర్శించడానికి కథలు, నవలలు తోడ్పడ్తాయి.  బహుజనులను ఆధారంగా చేసుకొని వచ్చిన కథలు, నవలలకు సంబంధించిన వివరాలను రచయిత ఈ “తెలంగాణ బిసీ వాద సాహిత్యం” పుస్తకంలో ఎక్కువ మొత్తంలో నమోదు చేశారు. అందులో కొన్ని: చేనేత జీవిత సాధకబాధకాలను చెప్పే ‘పడుగు పేకలు’, గొల్ల- కురుమల కథల సంకలనం ‘వేపకాయంత నిజం’, నేరెల్ల శ్రీనివాస్ గౌడ్  ‘ మా బతుకులు’, తుమ్మల రామకృష్ణ సంపాదకత్వంలో నాయీ బ్రాహ్మణుల జీవితాలను చిత్రించిన ‘అడపం’, ఉప్పల నరసింహం ‘సబ్బండ వర్ణాల సారస్వతం’ మొదలైన కథల సంపుటాలు ప్రధానంగా కనిపిస్తాయి. ఇక నవలల విషయానికి వస్తే గుడెళ్ళగుమ్మి మారెమ్మ, పట్నమొచ్చిన పల్లె- భూపాల్, సాంబయ్య సదువు, చీకట్లో చిరుదీపం, భూమిపుత్రుడు- కాలువ మల్లయ్య, సంకెళ్లు తెగాయి- ముదిగంటి సుజాతా రెడ్డి, ఊరువాడబ్రతుకు- దేవులపల్లి కృష్ణమూర్తి, పరంపర- శిరంశెట్టి కాంతారావు, సుషుప్తి- మాదిరెడ్డి సులోచన, బతుకు తాడు, కల్తీ బతుకులు- నేరెళ్ళ శ్రీనివాస్ గౌడ్ మొదలైన నవలలు ఇవన్నీ కూడా కేవలం మచ్చుకు కొన్ని మాత్రమే. దత్తయ్య ఈ పుస్తకంలో బహుజన, సబ్బండ కులాలపై వివిధ కవులు రాసిన కథలు, నవలలను చాలా మొత్తంలో తెలియపరిచారు. ముఖ్యంగా కథలను గురించి రాస్తూ బి.సి.ల జీవితాలకు సంబంధించి కథకులు విస్తృతంగా రాసినప్పటికి వాటిలో కులాల ప్రస్తావనలు మరుమరుగుగా చేయడం వెనుకున్న భయమేమిటో సందిగ్ధత ను రేకెత్తించే విషయం అని కథా రచయితలను ప్రశ్నిస్తాడు.

ఇక ఈ శీర్షికల తర్వాత చివరగా ‘తెలంగాణ బి.సి.వాద సాహిత్య విమర్శ’ పేరుతో ఒక శీర్షిక కలదు. విమర్శ అనగా సమీక్షించడం, పర్యాలోచించడం అనే అర్థాలు కలవు. బహుశా వెనుకబడిన వర్గాలపై వచ్చిన సాహిత్యం గురించి విమర్శ చేయడం పై స్థాయి వర్గాల వారికి ఆసక్తి వుండకపోవచ్చు. అందుచేత బిసీల, బహుజనుల సాహిత్యం పెద్దగా విమర్శకు నోచుకోలేదు. కవిత్వం, నవల, నాటకం, కథ ఇలా ప్రక్రియ ఏదైనా రచయిత దానిని ఏ పరిస్థితుల్లో రాశాడు, ఏ కోణంలో రాశాడు, ఏ ఆశయం చేత రాశాడు, తదుపరి దాని ప్రభావం ఎలా వుండబోతుంది అనే విషయాలన్నింటికీ విమర్శ దారి చూపుతుంది. బిసి సాహిత్య విమర్శలో ప్రధానంగా చెప్పబడే నాలుగు పుస్తకాలను తెలిపారు. అవి ‘బి.సి కథలు ఒక విశ్లేషణ 2000-2010’- కథా సాహిత్యం పై బి.ఎస్.రాములు 2011 లో వెలువరించారు. ‘కవిత్వంలో బిసి సూర్యోదయం’ 2015 లో జూలూరి గౌరీశంకర్, ఈయన ఆధ్వర్యంలోనే బిసీ వాద కవిత్వం పై ‘ఒక కవిత ఇరవై కోణాలు’. మరొక విమర్శ గ్రంథం ‘ప్రవాహం’ ఇది బిసి అస్తిత్వవాద యువ కవిత్వం పై వెలువడిన సంకలనం దీనికి చింత ప్రవీణ్ సంపాదకత్వం వహించారు.  ఇలాంటి ఎన్నో విషయాలను ప్రస్తావించిన దత్తయ్య ’వినతి‘ అనే శీర్షకలో ఇదొక చిన్న ప్రయంత్నమని వినయంగా చెప్పుకుంటాడు. ఇంకా కొన్ని కులాల గురించి, కొన్ని ప్రక్రియలలో వచ్చిన బి.సి.ల జీవితాలను గురించి ముందు ముందు రాసే ప్రయత్నం చేస్తానని చెప్పుకోవడం సమగ్రతకోసం ప్రామిస్ చేసినట్లుగా కనిపిస్తుంది.

అట్టెం దత్తయ్య రూపొందించిన “ఈ తెలంగాణ బిసీ వాద సాహిత్యం” పుస్తకంలో పద్యం,పాట, వచన, కథ, నవలా ప్రక్రియల్లో బిసిలకు సంబంధించి కవులు వివిధ కోణాల్లో బహుజన, బిసీ కులాలను గూర్చి వ్యక్తం చేసిన అంశాలను విస్తృత పరిశీలనతో సంక్షిప్తంగా పొందుపరిచారు.  దత్తయ్య చేసిన ఈ ప్రయత్నం మాటల్లో, వాక్యాల్లో మాట్లాడినంత సులభం కాదనే విషయం పుస్తకాన్ని చదివే  ప్రతీ పాఠకుడికి అర్థం అవుతుంది. ఈ పుస్తకం బిసీలు, వారి అస్తిత్వవాదానికి సంబంధించిన కోణంలోనూ, పరిశోధన చేస్తున్న, చేయబోయే వారికి మార్గదర్శనం చేయడంలో ఎంతో కొంత పాత్ర పోషిస్తుందనడంలో సందేహం లేదు. బిసీ వాదం పై వచ్చిన పుస్తకాల వరుసలో అట్టెం దత్తయ్య పుస్తకం కూడా విలువైనదిగా మారబోతుందనేది సత్యం. ఏదేమైనా అట్టెం దత్తయ్య  సలిపిన ఈ కృషి ఒక చారిత్రక సందర్భాన్ని గుర్తుచేస్తుంది. అదేమిటంటే నాడు తెలంగాణ ప్రాంతంలో సాహితీవేత్తలు, సాహిత్యమే లేదన్న ఆంధ్ర సాహితీ మేధావులకు తెలంగాణ సాహిత్య విస్త్రృతిని, సాహిత్యకారులను పరిచయం చేస్తూ సురవరం వారు రూపొందించిన  ‘ఆంధ్ర కవుల సంచిక’ లాగానే,  నేడు దళిత, మైనార్టీ, బహుజన వాద సాహిత్యాల ముసుగులో బిసీ వాద సాహిత్యం విస్తృతి, కవులు తెరచాటైన  స్థితి ఏర్పడింది. ఇలాంటి స్థితిలో రచయిత దత్తయ్య రాసిన ఈ “తెలంగాణ బిసీ వాద సాహిత్య గ్రంథం” బీసీ వాద సాహిత్యం యొక్క విస్తృతిని, కవులను సాహితీ ప్రపంచానికి తెలియజేసి నాటి  సందర్భాన్ని పునరావృతం చేసిందని చెప్పొచ్చు. ఏదేమైనా బీసీ వాదాన్ని వ్యక్తీకరించే  ప్రయత్నం లో ఈ “తెలంగాణ బిసీ వాద సాహిత్యం” గ్రంథం ఒక అడుగు ముందుకు వేసిందని చెప్పవచ్చు.

తెలంగాణ బి.సి.వాద సాహిత్యం   రచయిత: అట్టెం దత్తయ్య

ప్రచురణ సం: 2021   పుటలు : 259

వెల : 23

ప్రచురణ : ప్రణవం పబ్లికేషన్స్

రచయిత పరిచయం

పేరు                         :         అట్టెం దత్తయ్య

చదువులు               :         బి.ఏ (ఎల్), టి.పిటి, ఎం.ఏ. తెలుగు (ఓ.యు) ఎం.ఏ (జర్నలిజం), ఎం.ఏ(సంస్కృతం)

రచనలు:    1. కళ్ళం (సాహిత్య వ్యాసరాశి) (2018) 2. తెలంగాణ బి.సి.వాద సాహిత్యం (2021)

సంపాదకత్వం:   1. నిత్యాన్వేషణం (సాహిత్య దీర్ఘవ్యాసాల సమాహారం) 2018, 2. శిలాక్షరం (బి.ఎన్.శాస్త్రి సాహిత్యం – సమాలోచనం) 2019

సహాయ సంపాదకత్వం

  1. ఆలోకనం (31 తెలంగాణ జిల్లాల సాహిత్యం – చరిత్ర, సంస్కృతీ సమాలోచనం) 2017, మూసీ ప్రచురణ
  2. శతవాసంతిక (ఉస్మానియా వందేళ్ళ సంబరాల ప్రత్యేక జ్ఞాపిక 1917-2017) 2019 ఓ.యు. తెలుగుశాఖ ప్రచురణ.
  3. తెలంగాణ సాహిత్యం – సమాలోచన (పరిశోధక విద్యార్థుల సాహిత్య వ్యాసాలు) 2019 ఓ.యు. తెలుగుశాఖ ప్రచురణ.

ఇంకా

జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో 25కు పైగా పత్రసమర్పణలు, వివిధ ప్రతికలలో 70కి పైగా వ్యాసాల ప్రచురణ.

చిరునామా : ఇం.నెం. 3-9/3, గ్రా.శట్పల్లి, మం.లింగంపేట్, జిల్లా, కామారెడ్డి, తెలంగాణ

ఫోన్ : 9494715445

 

 

 

You may also like

Leave a Comment