Home పుస్త‌క స‌మీక్ష‌ చినువా అచెబి రచన “Things Fall Apart’; నైజీరియా లో నల్లగుండె చప్పుడు

చినువా అచెబి రచన “Things Fall Apart’; నైజీరియా లో నల్లగుండె చప్పుడు

Thing fall apart అనే ఈ ఆఫ్రికన్ నవల ని ఇటీవల చదివాను. రచయిత Chinua achebe. స్వయం గా ఆంగ్ల ఆచార్యుడు కనుక ఇంగ్లీష్ లో రాశాడు.నైజీరియా అనగానే మనకి మనసు లో ఏర్పడే చిత్ర పటం వేరు కాని ఈ నవల చదివిన తరువాత అది పూర్తిగా కనుమరుగై మరో రూపం ఏర్పడుతుంది. ఆ రకంగా తన ఈబో జాతికి ఇంకా ఆఫ్రికా ఖండానికి చినుబా అచెబా ఒక గొప్ప సేవ యే చేశాడు. ఈ నవల రమారమి 50 భాషల్లోకి అనువదింపడి,కోటి ప్రతులకి పైగా అమ్ముడై ఇంకా తన జైత్రయాత్ర ని కొనసాగిస్తూనే ఉంది. నల్ల జాతి ప్రజల గుండె చప్పుళ్ళని జోసెఫ్ కాన్రాడ్ లాంటి వాళ్ళు వినిపించి ఉండవచ్చుగాకా..! కాని దానిలో లేని ఒక తమదైన స్వరం నూతనం గా దీనిలో వినిపిస్తుంది,కారణం చినుబా అచెబా తాను స్వయం గా ఆ భూమిపుత్రుడు కావడం..!

స్థూలం గా నవల లోకి వెళదాము. చెప్పాలనంటే దీనిలోని ప్రతి పేజీలోనూ ఏదో ఓ ఆసక్తి కరమైన అంశం తారసపడుతుంది. బహుశా నైజీరియా కి సంబందించిన జీవితం మనకి చాలా తక్కువ తెలిసిఉండటం వల్ల అలా అనిపినిస్తుందేమో..! అమెరికన్,రష్యన్,ఇతర యూరపు కి చెందినవి ఎక్కువగా చదివాము తప్పా ఆఫ్రికన్ నవల సీరియస్ గా చదివింది ఎక్కడని..?సరే దానికి కారణాలు అనేకం..అదో పెద్ద గ్రంథం.ఇంచుమించు ప్రతి ఆఫ్రికా దేశం లోనూ ఈ నవల పాఠ్యగ్రంథం గా ఉన్నది. మన వలెనే వాళ్ళూ బ్రిటీష్ వారి చేతనే పాలించబడ్డారు.ఆ పాలన లో జరిగిన కథయే ఈ పుస్తకరూపం లో వచ్చింది.మరి ఆ బ్రిటీష్ వాళ్ళ సైకాలజీ ఏమిటో అర్థం కాదుగాని ఈ నవలని మొదటిసారిగా ప్రచురించింది కూడా లండన్ లోనే..!

Okonkwo తన గ్రామం లోనే కాదు ఆ చుట్టుపక్కల ఉన్న తొమ్మిది గ్రామాల్లో యోధుని గానూ,పెద్ద మనిషి గానూ పేరున్న వ్యక్తి.పండుగ సమయాల్లో జరిగే కుస్తీ పోటీల్లో ఫాల్గోవటం దాంట్లో గెలిచి వీరతాళ్ళు వేయించుకోవడం అక్కడి ఆనవాయితీ.అలాంటి వారికి ప్రత్యేక గౌరవం ఉంటుంది. ఈ Umuofia గ్రామం లో మన కథానాయకుడు Okonkwo పెద్ద రైతు కూడా. అతని తండ్రి Unoka దుబారా మనిషి గా,తాగుబోతు గా ,అప్పులు చేసి చెడు పేరు తెచ్చుకున్న వాడిగా ప్రసిద్ధి. ఆ విధంగా తాను కాకూడదని ఎంతో పట్టుదల గా జీవితం లో ఓ స్థాయి కి వస్తాడు. Yams పంట ని విరివి గా పండిస్తాడు.కోళ్ళు,పశువులు బాగా ఉన్నాయి.తన కాంపౌండ్ లో ముగ్గురు భార్యలకి,తనకి ఎవరి ఇళ్ళు వాళ్ళకి నిర్మించాడు.మొత్తం 11 మంది సంతానం.

వారి ఈబో తెగ లో బహుభార్యత్వం సాధారణం. కన్యాశుల్కం అనేది ఉంది. Okonkwo రెండవ భార్య మొదటి భర్త ని విడిచి ఇక్కడకి వచ్చిన మనిషి.సరే..ప్రాణానికి ప్రాణం అనేది ఆ తెగ లోని ఆచారాల్లో ఒకటి. ఉదాహరణకి వీరి గ్రామానికి చెందిన ఒక ఆడ మనిషిని పక్క గ్రామం కి చెందిన వ్యక్తి చంపితే వాళ్ళ కుటుంబం లోని ఓ వ్యక్తిని చంపడానికి ఇవ్వమని అడుగుతారు.అప్పుడు వాళ్ళు మూడేళ్ళ పిల్లాడిని ఇస్తారు.అతని పేరు Ikemefuna.మరో మూడేళ్ళు పెంచిన తరువాత ఈ కుర్రాడిని గొడ్డలితో నరికి చంపుతారు.అది అక్కడి వ్యవహారం.ఇవ్వలేదంటే గ్రామం అంతా ఏకమై దోషి యొక్క ఇంటి పై పడి నరుకుతారు.అదీ విషయం…అలాగని ఎవర్నీ పడితే వాళ్ళని నరుకుతారు అనుకుంటే తప్పు.ఉదాహరణకి Okonkwo తుపాకి పొరబాటున పేలి ఒకరి ప్రాణం పోయినప్పుడు ఊరి పెద్దల్లో ఒకడని కూడా చూడకుండా అతని ఇళ్ళని నాశనం చేసి,ఏడేళ్ళు కుటుంబాన్ని గ్రామం నుంచి బహిష్కరిస్తారు.ఇదంతా తమ కట్టుబాటు లో భాగమే కనక మన హీరో కూడా మౌనం గానే భరిస్తాడు.

భూమి వారికి అత్యంత పూజనీయమైనది. ఒక దేవత. అలాగే సర్పం…కొండచిలువ సైతం ఒక దేవత.ఎట్టి పరిస్థితుల్లోనూ చంపరు.అది ఇంటి లోనికి వచ్చినా,దానికి కావాలిసింది తిని వెళ్ళేవరకు వేచిచూస్తారు తప్పా చంపరు. అలాగే ఊరి పెద్దలు కూర్చోవడానికి మేక చర్మాన్ని చాప లా వాడతారు. మన పూర్వీకులు జింక,పులి చర్మాలు ఉపయోగించిన వైనం గుర్తుకు రావడం లేదూ..? సరే…ఎంతో ఆనందంగా…చిన్న చిన్న వైరుధ్యాలతో సాగిపోయే మన కథానాయకుని జీవితం ఏడేళ్ళ ప్రవాస సమయం లో మలుపు తిరుగుతుంది. ఆ ప్రవాసం ఎక్కడో కాదు,తన మేన మామ ఇంటి ప్రాంగణం లో..Mbanta గ్రామం లో..!

ఈ గ్రామానికి వచ్చి ఏడేళ్ళు ఉండాలి,పొరబాటున తన తుపాకి గుండు తగిలి స్వగ్రామం లో ఒకరి చావుకి కారణమైనందువల్ల.అలా ఒకటి రెండు ఏళ్ళు గడుస్తున్న సమయం లో తన మిత్రుడు Obierika చూడటానికి వచ్చి,తమ గ్రామం లో వచ్చిన మార్పులు గురించి చెబుతాడు.క్రైస్తవ ప్రచారకులు ఊరి లోకి వచ్చి తమ తెగ లో కొందరిని మతం మార్చారని,మిస్టర్ బ్రౌన్ అనే తెల్లవాడు దానికి కారకుడని వివరిస్తాడు.మన తాతముత్తాతల,దేవతల ఆత్మలు ఘోషిస్తున్నాయని అంటాడు. Okonkwo కూడా బాధపడతాడు.ఊరికి సంబందించిన పెద్ద ఒకాయన కూడా చర్చ్ కి వెళుతుంటాడు.ఊరిని ఏ విధంగా మిషనరీస్ ఓ క్రమ పద్ధతి లో విడదీసిందీ చర్చించుకుంటారు.

బైబిల్ విషయం లో ఈబో పెద్దలు లేవనెత్తిన కొన్ని ప్రశ్నలు మిష్టర్ బ్రౌన్ ని ఇరకాటం లో పడేస్తాయి.దానితో అతను వేరే దారి అవలంబిస్తాడు.స్కూల్,ఆసుపత్రి,టీచర్ ట్రైనింగ్ సంస్థలు వంటివాటిని ప్రభుత్వం తో మాట్లాడి ఈ ఊరికి రప్పిస్తాడు.అక్కడ చదువుకున్న వాళ్ళు పైకి వచ్చి ఉద్యోగాలు చేయడం చూసి ఈబో తెగ లోని పై వర్గం వారు కూడా మిషనరీ సంస్థ లకి తమ పిల్లల్ని పంపడం మొదలెడతారు.అంతదాకా కింది వర్గం వారు మాత్రమే తమ పిల్లల్ని పంపేవారు.

ప్రవాసం ముగిసి Okonkwo తన గ్రామం వచ్చేస్తాడు.పరిస్థితులు అన్నీ మారిపోయి కనిపిస్తాయి.తమ దేవతలకి,పూర్వీకుల ఆత్మలకి విలువ లేకుండాపోయింది.చర్చ్ నుంచి పాటలు,మాటలు వినబడుతున్నాయి.దీనికి గాను మనం ఏమీ చేయలేమా అని మిత్రులతో అంటాడు.మన లోని వాళ్ళే కొంతమంది అటు మొగ్గినపుడు ఏమి చేగలం అంటారు వాళ్ళు.తెల్ల మిషనరీస్ వ్యాపారాన్ని గ్రామానికి తీసుకు వచ్చారు.పాం ఆయిల్,దుంపలు వంటివి కొనుగోలు అయ్యేందుకు కేంద్రాలు తెరిచారు.డబ్బులు బాగా స్థానికుల చేతిలో ఆడుతున్నాయి.

ఇదిలా ఉండగా స్థానిక పండుగ జరిగే సందర్భం లో కియాగా అనే మతాన్ని తీసుకున్న వ్యక్తి అలజడి సృష్టిస్తాడు.బాగా అల్లర్లు జరుగుతాయి.కథానాయకుని నాయకత్వం లో అతని అనుయాయులు అంతా కియాగా ఇంటికి వెళ్ళి ధ్వంసం చేసి ఆ వ్యక్తిని చంపేస్తారు.అంతేగాక చర్చ్ ని కూడా తగలబెడతారు.అయితే ఈ సందర్భం లో మిష్టర్ బ్రౌన్ కాకుండా వేరే తెల్లజాతీయుడు ఉంటాడు.అతను ఈ సంగతి అంతా పైనున్న డిప్యూటీ కమీషనర్ కి వెళ్ళి చెబుతాడు.అతనూ ఒక బ్రిటీష్ వాడే.ఆ అధికారి వెంటనే జవాన్లని పంపించి చర్చలకి అని చెప్పి ఊరి పెద్దల్ని కొందర్ని రప్పించి వాళ్ళని బంధించి చిత్ర హింసలు పెడతారు. వీళ్ళని ఒదలాలీ అంటే ఊరంతా కలిసి పెనాల్టీ కట్టాలని ఇంకా కొంతమంది Okonkwo లాంటి అందరూ వచ్చి లొంగిపోవాలని కబురుపెడతారు. దీనితో ఒళ్ళుమండి వచ్చిన ప్రభుత్వ మెసెంజెర్ ని నరికి చంపుతాడు కథానాయకుడు.

ఇక లాభం లేదని కమీషనర్ ఈ ఊరికి వస్తాడు తన బలగం తో. ఊరి చివరన చెట్టు కి ఓ శవం వేలాడుతుందని దాన్ని దింపి సాయపడండి అంటారు ఊరివాళ్ళు.ఆత్మహత్య చేసుకున్న వారి అంత్యక్రియలు తాము జరపమని చెబుతారు.సరే అని చెప్పి ఆ శవాన్ని జవాన్లతో దింపిస్తాడు కమీషనర్.ఇంతకీ అది ఎవరిదో కాదు Okonkwo యొక్క శవం. కమీషనర్ నిర్ఘాంతపోతాడు.ఇక మీద ఎప్పుడూ ఇలా ఫీల్డ్ మీదకి తాను రాకుడదని అనుకుంటాడు. మరో రకంగా తనకి ఆనందం అనిపించింది,ఎందుకంటే తాను రాయబొయే పుస్తకానికి మంచి వస్తువు ,సరంజామా దొరికిందని.తాను రాబొయే పుస్తకం పేరు ఏమిటంటే The pacification of the primitive tribes of the lower Niger. ఆ పుస్తకం లో ఈ ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి గూర్చి కూడా ఓ పేరాగ్రాఫ్ రాయాలి అనుకుంటాడు.

(సమాప్తం)

 

You may also like

Leave a Comment