దళిత అస్తిత్వ చారిత్రక తొలి దళిత నవల ‘హేలా వతి”. నిచ్చెనమెట్ల కుల సమాజంలో చరిత్రయవనిక పై తొలి దళిత నవల ‘హేలావతి’. రచ యిత ఉద్దేశం మత మార్పిడులు నివారిం చాలన్నది ఒకటైతే, హిందు మతంలోని లొసుగులను ఎత్తి చూపుతూనే సంస్కరణకు పూనుకున్న రచయిత తల్లా ప్రగడ సూర్య నారాయణ రావు. ఈ నవల కథా గమనాన్ని పరిశీలించే ముందు అప్పటి కాలాన్ని ప్రదేశాన్ని గమనంలోకి తీసుకోవాలి.
అప్పుడే నవల యొక్క విశిష్టత అవగతమ వుతుంది. మొఘల్ చక్రవర్తి బాబర్ కుమారుడు హుమాయూన్ను కాపాడిన వీరబలుని (మాల) కూతురే హేలావతి. ఆమె పెరిగి పెద్దదయి ఇస్లాం మతం తీసుకోవడానికి దారి తీసిన పరిస్థితులను రచయిత నాటకీయ ఫక్కీలో నాటి గ్రాంధిక భాషలో రాశాడు. వీర బలుడు కుటుంబం మతం మారడానికి కారణం. అంటరా నివారుగా నీచకులస్తులుగా హిందు మతంలో వారుపడిన కష్టాలు, కటిక పేదరికం, ఊరికి దూరంగా ఉండడం, బ్రాహ్మణులు ఎదురైతే తొలగిపోవడం, లేకుండే వారు విధించే శిక్షకు గురికావడం జరుగుతుండేది. ఆకలికి తాళలేక అడవిలోని గడ్డలు తవ్వుకొని తిని బతికే బతుక్కంటే మరణమే మేలని ఎదురు చూచే బతుకు ఎందులకు అని తలపోసేవారు.
హిందూ మతం కల్పించిన పుట్టుక కారణంగా మాలవాడైన వీరబలుని కుటుంబం పనిలేక తినడానికి తిండిలేక మరణావస్థకు చేరుకుంటుంది. ఆ సమయంలో శత్రువు చేతిలో ఓడిపోయి పలాయనం చిత్తగించి ప్రాణాలు అరచేతపట్టుకొని మొఘల్ చక్రవర్తి హుమాయూన్ పారిపోతుండగా నది అడ్డుగా వస్తుంది. నదిని దాటే క్రమంలో రాజు ఆ ఏటిలోపడి స్పృహతప్పి పడిపోగా అక్కడ కంద గడ్డలకై ఏటి ఒడ్డున తిరుగాడుతున్న వీరబలుడు చక్రవర్తిని కాపాడుతాడు. అతను చక్రవర్తిఅని ఎరుగడు. హుమాయూన్ వలన అతనికి అతని కుటుంబానికి తినడానికి తిండి దొరుకుతుంది.
కొన్నిరోజులు అకడే ఉన్న చక్రవర్తి వెళ్లే సమయంలో చక్రవర్తి ప్రాణాలు దక్కించిన వీరబలునికి కృతజ్ఞతగా కొంత ధనం ఇచ్చి పోతాడు.
వీరబలుడు ఆర్థికంగా నిలదొక్కుకుని ధనవంతుడు అవుతాడు. కానీ, కులంలో మార్పు ఉండదు. అతని కూతురైన హేలావతి బాల్యం నుండి అతి సుందరవతి. బాల్యవివాహాలు జరిగే కాలంలో కూతురు పెళ్లికి నచ్చినవాడు దొరకక ఆందోళన చెందుతారు. కానీ, ఆమెను అమితంగా గౌతముడు ప్రేమిస్తాడు. హేలావతికి తన కులం, హిందూమతం కారణంగా తను పుట్టిన మాల కులంపైన తన జాతికి పేరు లేని వర్ణం రుద్దిన హిందూ మతంపైన అసహ్యం కలిగి ఆమె మతం మారి మరొక మతస్థుని పెళ్లాడాలనుకుంటుంది. ఈ క్రమంలో ఆమెకు ఏటి జలగండం కలగగా, అప్పుడు గౌతముడు ఆమెకు బదులు తన ప్రాణాలు అర్పించి తన ప్రేమను చాటుకొని ఏటి మొసలికి బలవుతాడు.
గౌతముడు త్యాగానికి గుర్తుగా నిలుస్తాడు. ఆమె ఆయనను తలచుకుంటూ విచారమొందుతూ నిద్రలోకి జారుకుంటుంది. ఆనాడు తెల్లవారుజామున ఆమెకు ఒక కల వస్తది. ఆ కలలో ఆమె తన చుట్టూ పరిచారికలతో అంతఃపురకాంతలతో ఉన్నట్టు వచ్చిన కలను తల్లికి చెబుతుంది. అదే సమయంలో వారుండే చోటుకి దగ్గరలో కొండపై సోదెకత్తె శివశక్తి ఉంటుంది. సోదెకత్తెను భవిష్యత్తు గురించి అడిగి తెలుసుకొని తల్లిదండ్రులతో ఢిల్లీ చేరుకొని అక్కడ హుమాయూన్ చక్రవర్తి మంత్రి కుమారుడి ప్రేమలో పడి చివరకు హిందూ మతాన్ని వీడి ఇస్లాం మతం స్వీకరించి అతడిని పెళ్లి చేసుకోవడంతో కథ ముగుస్తుంది.
మొఘల్ చక్రవర్తిగా హుమాయూన్ ఉండగా, ఢిల్లీ పురవీధులలో హేలావతి తండ్రి వీరబలుడిని పాదుషా కౌగిలించుకొని అతడు తనకు చేసిన ఉపకారానికి రుణగ్రస్థుడై మాలడైన వీరబలుడిచే మత మార్పిడి చేయించి అతనికి సామంతుని హోదా కల్పించడం ద్వారా పంచముల గుణశీలములు వారి పరాక్రమములు చరిత్రలో విశిష్ట స్థానాన్ని ఆక్రమించాయి. 15వ శతాబ్దిగాథను ( యదార్ధ కథ)ను వందేళ్ల క్రితమే మన ముందుంచి యావత్తు దళితులకు గొప్ప మేలు చేశారు రచయిత.
- భూతం ముత్యాలు