Home పుస్త‌క స‌మీక్ష‌ మనిషి కోసం తపన

మనిషి కోసం తపన

by A, Gajender Reddy

వారాల ఆనంద్ రచనల్లో ‘మానేరు తీరం’ విలక్షణమైంది. ‘ప్రవాహం పయనమై సముద్రాన్ని చేరుతుంది. అవును. పరుగులెత్తడం తెలిసిన ప్రవాహం నేలతల్లిని ఆర్తిగా తడుముతూ గమ్యం వైపు సాగిపోతుంది” అంటూ ప్రారంభమౌతుంది. మరి మనుషుల్లో – ప్రవాహం తెలీని బతుకుల్లో మాటలు కోటలు దాటుతాయి, చేతలు సాగిలబడతాయి, గమ్యం గాభరా పడుతుంది.
నేడు మనుషుల్లో సహజత్వం క్షీణిస్తున్నది. నటన పెరుగుతున్నది. మనసుల్ని భూస్థాపితం చేసి లోకం వేదికపై దర్జాగా నటించేస్తూ బతికేస్తున్నామని, మానవీయ విలువల కంటే ఎక్కువగా కుహనా అవసరాలపై మక్కువను పెంచుకున్నామని అంటాడు. మనం ఎంత ఉదాసీనులమై పోయాం! “యథాలాపంగా ఊపిరి తీసుకుంటున్నట్లుగానే మనం లోకం కేసి చూడ్డం అలవాటు చేసుకుంటున్నాం. తూర్పు పడమరై పోయినా, ఆకాశం విరిగి మీద పడ్డా, ప్రవాహం ఎదురు తిరిగి దిశ మార్చుకున్నా, మనుషులు మమతానురాగాల్ని పోగొట్టుకున్నా, మానవతా విలువలన్నీ కట్టగట్టుకు కొట్టుకుపోయినా, స్నేహం నిర్దయగా స్వార్థమయి పోయినా, అవసరం మనిషిని ఆటవికున్ని చేస్తున్నా, మనిషి విలువ వినియోగ వస్తువై పోయినా మనం ప్రేక్షకునిలా అలా గంభీరంగా చూస్తూ మన బతుకు మనం బతికేస్తున్నాం”.
ఇప్పుడంతా లౌక్యం యాంత్రికత్వం కృత్రిమత్వం. మనిషన్న మాటకి అర్థం మారి యంత్రాలకు పర్యాయపదాలుగా మారుతున్నాం. మనల్ని మనం వదిలేసుకొని పరుగులు తీస్తున్నాం. ఎవరి కోసమో దేనికోసమో తెలీకుండానే చేస్తున్న పనిలో ఎవరికి ఆనందముంది? మనది కాని మనకోసం కాని బతుకు వేరేవారి నియంత్రణలో వేరెవరి లాభం కోసమో ఉక్కుచట్రంలో బిగించ బడి పరుగు తీస్తున్న బతుకు దేనికి? చరిత్రగతిలో ధూళిలా రాలిపోవడం తప్ప, అనంతయాత్రలో ఆనవాలు మిగల్చకుండా సాగిపోవడం తప్ప ప్రయోజనమేముంది? అని ప్రశ్నిస్తాడు ఆనంద్.

సమాజం దాకా ఎందుకు? ఇద్దరు కలిస్తే ప్రేమగా అభిమానంగా పలకరించుకుంటున్నారా? ఎన్ని దూరాలు, ఎన్ని అనుమానాలు? ఇద్దరు మనుషుల మధ్య రెండు మనసుల మధ్య రెండు ఆలోచనల మధ్య ఎడం నిజంగా ఎంత ఘోరం? అంటూ ఒకే మనిషిలోని అంతర్ బహిర్ తత్వాల మధ్య ఎడాన్ని కూడా ఉటంకిస్తాడు. ఆనాటి ఆ స్నేహాలు ఏవి? సెలవులకి ఊరికి పోయి వచ్చిన అనుభవాల ముచ్చట్లు అందరం కలిసి పంచుకోకుండా కాలు నిలిచేదా! కాలం నడిచేదా? అని గుర్తు చేస్తాడు. నేడు ప్రతిక్షణం అవిశ్వాసాన్ని మోస్తూ చివరి అంచుకు ఎలా చేరగలం? అందుకని ఇప్పుడు మనం ఏం చేయాల్సి ఉందో కూడ చెప్తాడు. ఆనంద్. “మనం ఒకరికి ఒకరంగా సాటి మనిషిగా స్నేహం పంచుకోవాల్సి ఉంది. అభిమానాన్ని పెంచుకోవాల్సి ఉంది. ప్రేమను నింపుకోవాల్సి ఉంది. మనల్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. శ్వాసలో విశ్వాసాన్ని నింపుకోవాల్సి ఉంది.” ఇద్దరి మనుషుల కరచాలనంలోంచి స్నేహం ఉరకలెత్తాలని, రెండు చూపుల ఆరాధనల్లోంచి ఆప్యాయతలు వెల్లివిరియాలని కోరుకుంటాడు. మమేకత్వం మనల్ని మనుషుల్ని చేస్తుందని భావిస్తాడు. ఎక్కడ మనిషిని తూచకుండా మనిషిలా చూస్తారో అక్కడిదాకా ఏకబిగిన నడిచిపోవాలనీ, పరుగులు

తీయాలనీ ఆనంద్ మనసు మానేరులా ఉరకలు వేస్తుంది. సాగిపోతున్న కాలంలో ప్రతిక్షణం ఓ నూతన శకానికి నాంది పలకాలి. ఓ సరికొత్త ఆలోచనకి అనుభూతికి తొలిమెట్టు కావాలి. మనిషిని చిగురింపజేసే, మనసుని పురివిప్పదీసే నూతనోదయం కావాల్సిందే, మనిషి మనిషిగా మిగలాల్సిందేనని ఆకాంక్షిస్తాడు.

మౌనం, మాట, మరుపు, మనసుల గురించి ఆనంద్ చెప్పిన వాక్యాలు ఆణిముత్యాలు. వినగలిగితే మౌనంలో కోటి గొంతుకల రవాన్ని పెదాలు వినిపిస్తాయి… నిశ్శబ్దాన్ని నిక్షిప్తం చేసుకొని భావ తరంగాల్ని మోస్తూ సాగే మౌనం ఖచ్చితంగా అర్థవంతమయిన సంభాషణమే. మాట ఎగసిపడే భావనా తరంగం. జాలువారే ఆత్మీయతా ప్రవాహం. మాట మనసులో ముంచితీసిన అనుభూతి ప్రతిబింబం. మాట పలికితే గుండెల్నినట్టుంటుంది. మనిషికి మరపు వరం. మనిషి కదలికకే మూలం. గతంలోని బాధామయ అనుభవాల్ని మరువకుంటే వర్తమానం భయంకరమవుతుంది. అట్లాగే గతకాలపు సంతోషంలో కొట్టుకుపోతూ ఉంటే భవిష్యత్తు బాధామయమవుతుంది. మనిషి మనస్సు అనురాగపు ఆర్ద్రతను ఆశిస్తుంది. తనను తానుగా గుర్తించే తోడును కోరుకుంటుంది. ఎవరి ఊహయితే ఉరకలు పెట్టిస్తుందో ఎవరి స్నేహమయితే ఆనంద తీరాన్ని చేరుస్తుందో ఎవరి తోడయితే సంతోషపు సముద్రాల్లో ఈదులాడిస్తుందో ఆ తోడు కోసం స్నేహం కోసం ఆ ఆలంబన కోసం మనసు తహతహ లాడుతుంది.

ఇంకా “శిశువు కెవ్వుమన్న పిలుపులో జీవన పోరాటపు ప్రతిధ్వని వినిపిస్తుంది” “ఆకాశం వేయి వెలుగుల సూర్యునికి మాతృమూర్తి… ఆకాశం మనకు నేస్తం… మొత్తంగా శూన్యం తాత్కాలికం.. చేతనే శాశ్వతం” వంటి చైతన్యం వైపు మనిషిని నడిపించే మహా పంక్తులు మనల్ని వెన్నాడుతాయి.

ఈ పుస్తకానికి విశ్వేందర్ రెడ్డి అందించిన ముఖచిత్రం, లోపలి పేజీలలో కల్యాణం శ్రీనివాస్ గీసిన భావగర్భితమైన బొమ్మలూ మనల్ని ఆకర్షిస్తాయి. ‘మానేరు తీరం’ వారాల ఆనంద్ హృదయం ద్రవించి, మేధస్సును మధించి, మనిషి కోసం తపించి రాసిన గ్రంథం.

ప్రతులకు : వారాల ఆనంద్

9440501281

You may also like

Leave a Comment