ప్రతిష్టాత్మకమైన ఎన్.టి.ఆర్ పురస్కారం, ఎ.పి.జె అబ్దుల్ కలాం అవార్డు, ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్
సాధించిన ప్రముఖ చిత్రకారులు, కార్టూనిస్ట్ గంగాధర్ గారితో ముఖాముఖి – నరేశ్ చారి
గంగాధర్ గారు నమస్కారం. మీరు వేసిన చిత్రాలు, కార్టూన్స్ గురించి మా పాఠకులకు తెలియ చేయాలనుకుంటున్నాము.
1. మీరు పుట్టినది, విద్యాభ్యాసం, మీ బాల్యం గురించి చెప్పండి.
నేను జన్మించింది నిజామాబాద్ జిల్లాలోని బషీరాబాద్ గ్రామంలో. నా విద్యాభ్యాసం హైస్కూల్ వరకు బషీరాబాద్ లో సాగింది,ఇంటర్మీడియట్,డిగ్రీ(బి.ఎ) నిజామాబాద్ లో చదివాను.
2. మీరు ఆర్ట్ వైపు మొగ్గు చూపడానికి ప్రేరణ, ప్రోత్సాహం ఎవరు?
నేను చిన్నప్పటినుండి కార్టూన్స్ జోక్స్ ఇష్టపడేవాడిని ముఖ్యంగా ఆంధ్రభూమి వారపత్రికలో వచ్చే మల్లిక్ గారి కార్టూన్ల ద్వారా నేను ఎక్కువగా ప్రేరణ పొందే వాడిని. ఎలాగైనా నేను కూడా కార్టూన్స్ వేయాలి అని అనుకునేవాడిని కానీ ఎలా వేయాలి ? వేటిపై వేయాలి ? ఎలాంటి పెన్నులు ఉపయోగించాలి? అని చాలా ఆలోచించేవాడిని ఆ సమయంలోనే కార్టూనిస్టులను సంప్రదించాలనుకున్నాను కానీ పత్రికల్లో వారి వివరాలు ఏవీ వచ్చేవి కావు. కార్టూన్… దానిపై వారి సిగ్నేచర్ మాత్రమే వచ్చేది.వారి వివరాలకోసం ఎంత వెతికినా లాభం లేకపోయేది. ఎందుకంటే ఇప్పట్లో లాగా అప్పుడు సెల్ ఫోన్ లు ఉండేవి కావు, ల్యాండ్ లైన్ ఫోన్లు కూడా చాలా తక్కువ.
ఒకసారి బుక్ ఎగ్జిబిషన్లో కార్టూనిస్ట్ సత్యమూర్తి గారి ” కార్టూన్స్ ఎలా వేయాలి” అనే పుస్తకం కనిపించింది హమ్మయ్య అనుకొని వెంటనే ఆ బుక్ కొని తెచ్చుకున్నాను. అది మొత్తం చదివి కార్టూన్స్ వేయడానికి సిద్ధమయ్యాను. అప్పట్లో ఇండియన్ ఇంకును పెన్నులో పోసి ఆ పెన్నుతో కార్టూన్స్ వేసేవారు. ఆ ఇండియన్ ఇంకుతో పెద్ద తలనొప్పి డైరెక్ట్ గా ఆ ఇంకును పెన్నులో పోస్తే గడ్డ కట్టేది. గీతలు సరిగ్గా వచ్చేవి కావు. అందులో కొన్ని నీటిని కలిపి వాడాలి నీరు ఎక్కువ అయితే ఇంకు పల్చభారీ గీతలు మబ్బుగా వచ్చేవి అలా చాలా కష్టం అనిపించింది. ఎలాగోలా కొన్ని కార్టూన్స్ వేసి పత్రికలకు పంపించాను. అవి అలాగే శుభ్రంగా నాకు తిరిగి వచ్చేవి.
అలా ఎన్నోసార్లు పంపగా పంపగా అప్పట్లో బాలరంజని అని పిల్లల కథల పుస్తకం మాసపత్రికగా వస్తూ ఉండేది దానికి కొన్ని కార్టూన్లు వేసి పంపించాను. వారి వద్ద నుండి కొన్ని రోజులకు ఒక పోస్ట్ కార్డు వచ్చింది. అందులో “మీరు పంపిన కార్టూన్లలో ఒక కార్టూన్ సెలెక్ట్ అయింది దానిని వచ్చే నెలలో ప్రచురిస్తాము” అని ఉంది. ఆ వార్త చూసి చాలా సంతోషం అనిపించింది.త్వరలోనే ఎన్నో రోజుల కల తీరబోతోందని అనుకున్నాను. నెలరోజుల దాకా ఎదురు చూశాను.ఆ పత్రిక కావాలనుకుంటే నిజామాబాద్ వెళ్లి తెచ్చుకోవాల్సిందే నిజామాబాద్ వెళ్లి బుక్ షాప్ లో “బాలరంజని” బుక్ కావాలని అడిగాను.” సార్ ఈ నెల నుండి ఆ బుక్ రావడం లేదు” అని చావు కబురు చల్లగా చెప్పాడు.అంతే… నిరాశతో వచ్చేసాను. అయినా కార్టూన్లు గీసి పత్రికలకు పంపిస్తూనే ఉన్నాను. అప్పట్లో యండమూరి వీరేంద్రనాథ్ గారి ఆధ్వర్యంలో “హారిక”అనే వార పత్రిక వస్తుండేది. ఆ పత్రికకు కూడా కొన్ని కార్టూన్లు వేసి పంపించాను.కొన్ని రోజుల తర్వాత వారి వద్ద నుండి రిప్లై వచ్చింది.” మీరు పంపిన కార్టూన్లలో నుండి రెండు కార్టూన్లు ప్రచురణకు స్వీకరించాము” అని ఉంది. నా కార్టూన్లు పత్రికలో చూసుకోవచ్చనే కోరికతో వారం రోజులు భారంగా గడిపాను. తర్వాత మళ్లీ బుక్ షాప్ కి వెళ్లి హారిక పత్రిక కావాలని అడిగాను.”ఆ పత్రికను ఆపేశారు ఈ వారం నుండి రావడం లేదు” అని షాప్ అతను చెప్పాడు. అప్పుడు అనిపించింది ఔరా….. నా కార్టూన్ లకు ఇంత పవర్ ఉందా అని. ఉరిమిన ఉత్సాహం చల్లగా చెప్పబడింది. కొన్ని రోజుల విరామం…. అయినా ఆగేది లేదు మళ్లీ కార్టూన్లను గీయడంమొదలుపెట్టాను.
అప్పట్లో కార్టూనిస్ట్ గోపాలకృష్ణ గారు పాపులర్ అయ్యారు. ఒకసారి ఒక పత్రికలో ఆయన అడ్రస్ కనిపించింది. నేను వెంటనే గోపాలకృష్ణ గారికి రీప్లే కవర్ పెట్టి లెటర్ రాశాను. నేను వేసే కార్టూన్ ల గురించి వివరాలన్నీ రాసి “మీరు వేసిన కార్టూన్ల నుండి నాకు ఒక కార్టూన్ శాంపిల్ గా పంపించండి” అని రాశాను. ఆయన వద్దనుండి రిప్లై వచ్చింది. అతను వేసిన కార్టూన్ ఒకటి నాకు శాంపిల్ గా పంపించాడు. అతని కార్టూన్ చూస్తే నాకు మతిపోయింది. ఆయన కార్టూన్ మంచి క్వాలిటీ పేపర్ మీద చాలా నీట్ గా ఉంది. మొత్తానికి అతను వేసిన కార్టూన్ చాలా అద్భుతంగా ఉంది. ఆ ఇంకు కూడా చాలా షైనింగ్ గా ఉంది అలాగే కార్టూన్లు వేయడానికి రోటరీ ఇంక్ పెన్ను వాడమని సలహా కూడా ఇచ్చాడు. కొన్ని మెలకువలు తెలిపాడు. రోటరీఇంక్ పెన్ను మా ప్రాంతంలో దొరకదు. మళ్లీ నిజామాబాద్ వెళ్లి ఆ పెన్ను తెచ్చుకున్నాను. ఆ పెన్ను తెచ్చుకున్నాక కార్టూన్ వేయడం కాస్త సులభంగా అనిపించింది. ఇండియన్ ఇంకులాగా తలనొప్పి మాత్రం లేదు. ఆ మధ్యలో “ఆంధ్రజ్యోతి”వారపత్రిక వారు దీపావళి పండగ సందర్భంగా కార్టూన్ల పోటీ నిర్వహించారు. నేను కొన్ని కార్టూన్స్ వేసి పంపించాను. కొన్ని రోజుల తర్వాత వారి వద్ద నుండి పోస్టులో ఒక కవరు వచ్చింది.అది విప్పి చూస్తే ఆంధ్రజ్యోతి వారపత్రిక. పేజీలు తిప్పి చూస్తుండగా మధ్య పేజీ చూసి ఆశ్చర్యపోయాను .అందులో దీపావళి పండగ సందర్భంగా నిర్వహించిన కార్టూన్లు ప్రింట్ చేశారు. అందులో మొదటి బహుమతి పొందిన కార్టూన్ “డాక్టర్ శివ”బషీరాబాద్ అని ప్రింట్ చేశారు. అప్పుడు అనుకున్నాను అనుకున్నది సాధించానని. అందులో నేను వేసిన కార్టూన్లలో మొదటిసారిగా నా కార్టూన్ ప్రచురించడం మరియు మొదటిసారిగా ప్రింట్ అయిన నా కార్టూన్ కే మొదటి బహుమతి రావడం నిజంగా అద్భుతమనిపించింది.ఎంతో ఆనందం కలిగింది.
3.కార్టూన్లను వేయడం మీరు ఎవరిదగ్గరైనా నేర్చుకున్నారా? చూసి వేసేవారా?
నేను ఎవరి వద్ద నేర్చుకోలేదు కేవలం సొంతంగా ప్రాక్టీస్ చేసి నేర్చుకున్నదే. కార్టూన్లు నవ్వుతెప్పిస్తూ ఆలోచన లలో పడవేస్తాయి. ఈ కారణం వల్ల నే నేను కార్టూన్స్ కు ఆకర్షతుణ్ణ య్యాను, సాధనచేసి నేర్చుకున్నాను.
4. ఆర్. ఎం. పి. డాక్టర్ గా ప్రజాసేవ చేస్తున్నారు కదా! మరి వృత్తి, ప్రవృత్తులను ఎలా సమన్వయం చేసు కుంటున్నారు?
డాక్టర్ వృత్తి నా కల! నా కలను సాకారం చేసుకున్నాను.వృత్తి సంపాదనను ఇస్తే, నా ప్రవృత్తి నాకు సంతృప్తిని ఇస్తుంది. ఎక్కువగా సొంత పనులకే సమయం కేటాయిస్తాను ఏదో హాబీగా అప్పుడప్పుడు మాత్రమే ఇవి వేస్తుంటాను. నాకు బాగా నచ్చింది అనుకున్న తరువాత నే ఎక్కడికైనా పంపిస్తాను.
5. ‘రీడింగ్ విమెన్’ చిత్రాన్ని , మనిషిలోని మూడు దశల చిత్రాన్ని ఒకే గీతను ఆధారంగా చేసుకుంటూ వేశారు. అది మీరు సొంతంగా నేర్చుకున్నదేనా? ఎవరి ప్రభావమైనా ఉందా?
మీరు అడిగిన డ్రాయింగ్ నేను సొంతంగా ఊహించుకుని వేసినదే. ఎవరి ప్రభావం లేదు. సృజనాత్మకత జోడించి నూతన రేఖాచిత్రం గీయడం లో స్పష్టం గా వచ్చేలా ప్రయత్నం చేస్తాను. నా ఊహల లోకం నుంచి వ్యంగ్య చిత్రాలు గీసాను, గీస్తాను కూడా
6. నిజామాబాద్ లో మీ ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినప్పుడు ఎలాంటి స్పందన వచ్చింది?
సాధారణంగా పల్లెటూరు లలో. అంత అవకాశాలు ఉండవు. జిల్లా స్థాయిలో. ఉన్నా మనస్ఫూర్తిగా స్పందనలు తెలియజేయరు.
మామూలు స్పందన లభించింది. ఆర్ట్ గురించి వాళ్లకు పెద్దగా అవగాహన, అభిరుచి లేవనుకుంటున్నాను.
7. హైదరాబాద్ వంటి నగరాల్లో అలాంటి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలని ఎందుకు అనుకోలేదు?
అది అది ఖర్చుతో కూడుకున్న పని.తగినంత సేల్స్ కాకపోతే బూడిదలో పోసిన పన్నీరు లాగా అవుతుంది పరిస్థితి. ఇంతే కాదు చాలా విషయాలు అందుబాటులో ఉండవు. ఆర్థికంగా నే కాదు, మిగతా సౌకర్యాలు వేరే ప్రాంతం నుంచి వచ్చి. ఇలా చిత్ర ప్రదర్శన చేయడం కష్టం.
8. మీరు పొందిన అవార్డులు, సత్కారాల గురించి చెప్పండి.
ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, పద్మశ్రీ ఎన్టీఆర్ అవార్డు, ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు ఇలా అన్నీ కలిపి 20 అవార్డుల వరకు వచ్చాయి. అవార్డు లు , రివార్డులు కళాకారులకు ఆనందాన్ని , అలాగే బాధ్యతలనూ ఇస్తాయి .
9. ఈ అవార్డులు , సత్కారాలు మీకు సంతృప్తిని కలిగించాయా? ఇంకా ఏదైనా ఆశిస్తున్నారా?
నాకు వచ్చిన అవార్డులు,రివార్డులు సత్కారాలపరంగా చూస్తే సంతృప్తి గానే ఉంది. కానీ ఆర్థిక పరంగా చూస్తే మాత్రం అసంతృప్తిగానే ఫీలవుతున్నాను.
10. మీరు విదేశాలను కూడా సందర్శించినట్లు విన్నాం. ఆయా దేశాలలో మీ అనుభవాలను తెలియజేయండి.
ప్రమోషన్ లో భాగంగా సింగపూర్ ,థాయిలాండ్ దేశాలు సందర్శించాను. మొదటిసారిగా రెండు విదేశాలు సందర్శించడం లో జీవితంలో మర్చిపోలేని అనుభవం.
11. విదేశాల్లో మన చిత్రకళ పట్ల ఉన్న ఆసక్తి ఎటువంటిది?
ప్రాంతం ఎక్కడైనా వాళ్ళ అభిరుచి అవగాహనబట్టి ఉంటుంది.
12. ఈ కళలో ఎవరికైనా శిక్షణ ఇస్తున్నారా? వాటి గురించిన వివరాలు చెప్పండి.
లేదు. ఎవరికి శిక్షణ ఇవ్వదలుచుకోలేదు. ఆర్థిక రాబడి లేని రంగం ఇది.
13. మీరు వేసిన చిత్రాలను తెలంగాణ రాష్ట్రానికి అంకితం ఇస్తున్నట్టు చెప్పుకున్నారు. కారణం చెప్తారా?
కె.సి.ఆర్ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. తెలంగాణ ప్రభుత్వం చేసే పనులు పథకాల వల్ల ఆకర్షితుడనై తెలంగాణ ప్రభుత్వానికి అంకితం ఇచ్చాను.
14. గంగాధర్ అనేది మీపేరు అయితే శివ ఆర్ట్స్ అని పెట్టుకోవడానికి ప్రత్యేక కారణం ఉందా?
నా అసలు పేరు గంగాధర్. అంటే గంగను ధరించిన వాడు. ఎవరు శివుడు. ఇది ఒక కారణమైతే అప్పట్లో సినీ హీరో నాగార్జున నటించిన “శివ” చిత్రం విడుదలై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ పేరు పెట్టుకోవడానికి మరో కారణం. ఇక మూడో కారణం కూడా ఉంది కార్టూనిస్టులు, ఆర్టిస్టులు, రైటర్స్ వారి అసలు పేరు కాకుండా కలం పేరు ఇష్టమైనది పెట్టుకుని ఆ పేరు మీదనే కార్టూన్స్,ఆర్ట్స్ ,రచనలు చేస్తుంటారు కాబట్టి ఈ మూడు కారణాలు కలిపి శివ అనే కలంపేరు(పెన్ నేమ్ ) పెట్టుకోవడం జరిగింది.ఆర్.ఎం.పి వైద్యునిగా పనిచేస్తాను కాబట్టి అందరికీ డాక్టర్ శివ అంటేనే తెలుసు.
15. మీకు తెలిసిన, మీరు ఇష్టపడే రాష్ట్రీయ, జాతీయ చిత్రకారులు ఎవరు?
నాకు ఇష్టమైన రాష్ట్రీయ చిత్రకారుడు బాపు, జాతీయ చిత్రకారుడు ఆంజనేయులు.
16. మీ చిత్రాల్లో మీకు నచ్చిన చిత్రం ఏది? ఎందుకు?
ఇప్పటివరకు నేను వేసిన కార్టూన్స్ ఆర్ట్ చిత్రాలలో నాకు బాగా నచ్చింది కేవలం ఒక్క లైన్ తో వేసిన డ్రాయింగ్. దాని ప్రత్యేకత ఏమంటే కేవలం ఒకే ఒక్క లైన్లో మనిషి జీవితంలోని మూడు దశలను అంటే బాల్యం, యవ్వనం,వృద్ధాప్యం ఈ మూడు దశలను కేవలం ఒక్క లైన్తో వేయడం నిజంగా అద్భుతం ఈ డ్రాయింగ్ తోనే గిన్నిస్ బుక్ రికార్డు కోసం ప్రయత్నిస్తున్నాను.చివరిగా నా కోరిక కాంబోడియా దేశంలోని ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ప్రఖ్యాత హిందూ దేవాలయ “అంగ్ కోర్ వాట్”ను సందర్శించాలని. అలాగే బ్యాంకాక్ సిటీలోని “జేమ్స్ ఆర్ట్ గ్యాలరీ”(రత్నాలతో చేసిన ఆర్ట్ గ్యాలరి) దర్శించాలని ఉంది.నాలాంటి వారి ప్రతిభను ప్రోత్సహించే వారు ఎవరైనా టూర్ ను స్పాన్సర్ చేస్తారని అనుకుంటున్నాను.కచ్చితంగా చేస్తారని ఆశిస్తున్నాను.