హ్యాండ్ బుక్ “సబ్బని సాహిత్య వ్యాసాలు” !
కొందరు ప్రతిభా మూర్తులు ప్రచారార్భాటాన్ని ఎంతమాత్రం ఇష్ట పడరు.
తనకు నచ్చిన పనిని ,ఇష్టం గా మార్చుకొని నిబద్దతతో చేసుకుంటూ పోతుంటారు.ఎవరి ప్రశంసల కోసమే ఎదురు చూడరు. అదీ వారి గొప్పతనం.
ఈ కోవలోకి వచ్చే అరుదైన కరీంనగర్ కవి సబ్బని లక్ష్మి నారాయణ గారు. తెలంగాణా సాహిత్య చరిత్ర లో వీరి పాత్ర మరువలేనిది.
ఒక్క తెలంగాణా ఉద్యమ సాహిత్యం లో భాగంగా పది పుస్తకాలను వెలువరించిన ఘనత వీరిది.ఇంకా చెప్పాలంటే ప్రాంతీయ వివక్ష లేని రచయిత గా సబ్బని గారిని పేర్కొన వచ్చు.
కేవలం కవిత్వమే కాదు,గేయాలు,వ్యాసాలు,దీర్ఘ కావ్యాలు,అనువాదాలు,నానీలు,పద్య శతకాలు మొదలైన విభిన్న సాహిత్య ప్రక్రియల్లో వీరి రచనలు వెలువడ్డాయి.
వీరు ఇటీవలే వెలువరించిన “సబ్బని సాహిత్య వ్యాసములు” ప్రత్యేకంగా పేర్కొన దగింది.
తెలుగు సాహిత్యం లో ఇరవై నాలుగు మంది సంఘ సంస్కర్తలు, రచయితలు,కవులు, నవల కారులు సాహితీ విమర్శకులు మొదలైన అత్యంత ప్రతిభా మూర్తుల సాహితీ వ్యక్తిత్వాన్ని విశ్లేషిస్తూ రాసిన విలువైన వ్యాసాలు ఇవి.
ఇందులో నవయుగ వైతాళికుడు గా పేరుపొందిన గురజాడ అప్పారావు మొదలుకొని తెలంగాణా రుబాయిల్లో శిఖర స్థాయిని చేరుకున్న డా.ఏనుగు నరసింహారెడ్డి వరకు వివరణాత్మక వ్యాసాలు ఇందులో పొందు పరిచారు.
గురజాడ 150 వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆధునిక భాషా సాహిత్యాల యుగ కర్త గురజాడ పేరుతో చక్కటి వివరణాత్మక వ్యాసం రాస్తూ..
“సామాజిక ప్రయోజనం,హృదయానందం అనేవి సాహిత్య హితం కూర్చే రెండు మౌలికమైన ప్రయోజనములు.ఈ విషయాలను గుర్తెరిగి రచనలు చేసిన సాహిత్య సృజన శీలి గురజాడ” అంటారు.
విశ్వనాథ సత్యనారాయణ గురించి రాస్తూ..
వారు బహుముఖ ప్రజ్ఞాశాలి అనీ అనేక సాహిత్య ప్రక్రియల్లో వారి ప్రతిభ అసామాన్యమ ని , వారికలం నుండి వెలువడిన నవల “మ్రోయు తుమ్మెద” ఒక ఆణిముత్యం గా పేర్కొన్నారు.
జాషువా కవితా వైభవాన్ని కీర్తిస్తూ..
పద్యాన్ని హృద్యంగా పండించి సామాజిక చైతన్యం తో,సమాజం లోని అసమానతలు రూపు మాపడానికి కృషి చేసిన మహా కవుల్లో జాషువా అగ్రగణ్యుడనీ,సదా స్మరణీయులని ప్రశంసించారు.
గిడుగు వారిని వ్యవహార భాషోద్యమకారులుగా అభివర్ణిస్తూ …
“వాచకాల్లో పుస్తకాల్లో సాహిత్యంలో వ్యవహారిక భాష ఉండాలని పట్టుబట్టి ఉద్యమంలా పనిచేసి దాని అమలుకు కృషిచేసిన బాధ్యుడు గిడుగు వారు. వారు సమాజ సేవలో పాల్గొంటూనే ముఖ్యంగా లిపిలేని సవర భాషకు లిపిని, భాషను, వాచకాలను, నిఘంటువులు, ఇచ్చిన ఘనుడు గిడుగు వారు. వారు తెలుగువారికి ఎంతో ప్రాతస్మరణీయులు”. అని పేర్కొన్నారు
మహా కవి శ్రీశ్రీ ని గురించి రాస్తూ…
శ్రీశ్రీ కవిత ఒక్కొక్కటి ఒక అగ్నికణం.వాటికి వ్యాఖ్యానాలు రాయాలంటే పేజీలు చాలవు.
శ్రీశ్రీ కవితాక్షరాలు ఆవేశం తో ఊగి పోయేలా చేస్తాయి.అద్భుత వీర రస వాహిని శ్రీశ్రీ కవిత్వం అని కొనియాడారు.
తిలక్ కవితా తత్వంలో అమృతం కురిసినరాత్రి గురించి ఒక అద్భుత విశ్లేషణ చేశారు సబ్బని గారు..
“వస్తువును కవిత్వం చేయడంలో ఒక గొప్ప రసజ్ఞుడైన కవి దేవరకొండ బాలగంగాధర తిలక్. అమృతం కురిసిన రాత్రి, అందరూ ఆదమరచి నిద్ర పోతుంటే తను మాత్రం వర్షములోని అమృతపు సొనను పట్టుకొని దోసిల్లతో తాగి తిరిగి వచ్చాను అంటాడు. నిజంగా తిలక్ కవిత్వంలో అమరుడు 45 ఏళ్ల నడివయసులో కవితా రసగంగాధరుడి కవిత్వానికి ముగ్దులై అప్సరసలే తిలక్ ని స్వర్గలోకానికి తొందరగా తీసుకుపోయారేమో అనిపిస్తుంది” అంటారు
వచన కవితా పితామహుడైన స్వర్గీయ కుందుర్తి గారిని ఈ కవి బాగా ఇష్టపడతాడు ఆయన రాసిన తెలంగాణ దీర్ఘకావ్యం గురించి ఒక మంచి వ్యాసాన్ని సమర్పించారు
“నిజంగా కుందుర్తి తెలంగాణా ఒక దృశ్యమాన కావ్యం. కళ్లకు కట్టినట్లు సంఘటనలు, దృశ్యాలు మనకు కనిపిస్తాయి. ప్రజలు పడిన కష్టాలు తెలుస్తాయి. అర్ధనాదాలు వినిపిస్తాయి.
తెలంగాణ ఒక కష్టాల కడలి, కన్నీటి కావ్యం, కాలగమనంలో, నిజాం నిరంకుశ పాలనలో తెలంగాణా సాయుధ పోరాట క్రమాన్ని,
ఆ రోజుల్లో ప్రజలు పడిన కష్టనష్టాల్ని పోలీస్ చర్యతో అప్పటికి అవి సద్దుమణిగిన తీరును అంతవరకే టైం లిమిట్లో తన కావ్యాన్ని ముగించారు”.
తెలంగాణ సాయుధ పోరాట నేపద్యంగా ఈ కావ్యాన్ని రాసినందుకు కుందుర్తిని స్మరించుకుంటూ శ్రద్ధాంజలి ఘటించాడు రచయిత.
మరో వ్యాసం లో కాళోజీ ధిక్కార స్వరం గురించి రాశారు.
“కాళోజీ రాసిన కావ్య భాష చాలా పదునైన భాష. ప్రజల భాష ,పలుకుబడుల భాష ,ఆ భాషలో ఉధృతి ఉంది ,నిరసన ఉంది, ధిక్కార స్వరం ఉంది ,ధ్వని ఉంది .కాళోజీ సాహిత్యంలో సామాజికాంశం కానిదేదీ లేదు.
కాళోజీ తెలంగాణ అంటే తెలంగాణ భాష. ఈ భాషకు ప్రాణమిచ్చాడు కన్నతల్లిలా ప్రేమించాడు. తెలంగాణ భాషలో రాయండి అని, తెలంగాణ భాషను బ్రతికించండి అని పసిపిల్లాడిలా కన్నీరు కారుస్తూ సెలవిచ్చాడు.”
ప్రముఖ అభ్యుదయకవి సోమ సుందర్ గారిని ప్రశంసిస్తూ ..కొన్ని రచనలు సామాజిక ప్రయోజనం ఆశించబడతాయి రాయబడతాయి. అలాంటిదే అవంత్స సోమసుందర్ “వజ్రాయుధం” ఈ కవి ధన్యుడు.
అణగారిన నేల కోసం, ప్రజల కోసం, కవిత్వము రాసిన అభ్యుదయ కవి, ఎంతో ఆలోచనతో తన ఇరువది ఐదేళ్ల వయస్సులో రాసిన కావ్యమే వజ్రాయుధం.
ప్రముఖ కవి దాశరథి గారి గురించి రాస్తూ.. “కవి వాక్కు వేద వాక్కు, కవి వాక్కు ,బాలవాక్కు, కవి వాక్కు బ్రహ్మ వాక్కు నాడైనా నీడైనా కవి కాంతి దర్శి. దూరదృష్టి గలవాడు. కవిస్పూర్తి ప్రదాత. చిత్తశుద్ధి నిజాయితీగల కవి నిత్యం సత్యాన్వేషణ చేస్తాడు. ఈ ప్రశంసలకన్నిటికి దాశరధి సత్య వాక్కులే సాక్ష్యాలు అంటారు.”
“త్వమే వాహమ్” లో ఆరుద్ర కవిహృదయాన్ని గురించి చక్కటి ప్రస్తావన చేస్తారు.
“ఆరుద్ర “త్వమేవాహమ్” ను వివరణలు లేకుండా చదువుకోవడం కష్టం. కవి తన భావన లో ఒక వ్యవస్థను ఊహించుకొని చక్కటి ప్రతీకలతో పోలుస్తూ ఈ కవిత చెప్పారు.
ఈ కావ్యం పాఠకులకు సులభంగా అర్థం కానంత రీతిలో ఉన్నా, అది ఒక ప్రయోజనం ఆశించి రాసిన మహత్తర కావ్యం. అలా ఆరుద్ర గారు చిరస్మరణీయులుగా ఈ కావ్యంలో నిలిచిపోతారు.”
కవి శేషేంద్ర గారి పైన సబ్బని గారికి విపరీతమైన అభిమానం. వారిని వారి ప్యాలెస్ లో కలిసి స్వయంగా ఒక ఇంటర్వ్యూ నే చేశారు.
ఇందులో శేషేంద్ర గారి ఆధునిక ఇతిహాసం “నా దేశం నా ప్రజలు” గురించి ఒక గొప్ప వ్యాసాన్ని సమర్పించారు ఇందులో ఆయన గురించి వ్యాఖ్యానం చేస్తూ..
“కవి శేషేంద్ర ఒక రసైక ప్రేమ మూర్తి, పురుషుడు తనకు కావలసిన రసాత్మక భౌతిక మానసిక ఆనందాన్ని స్త్రీ నుండి పొందుతాడు. సంతృప్తిని బ్రతుకులోనింపు కుంటూ పరిపూర్ణ విజయుడై ముందుకు సాగుతాడు విజయ పథం లో.
శేషేంద్ర నా “నా దేశం నా ప్రజలు” కథా కావ్యం కాదు ఒక కవి జగత్తు, శ్రామికుడి జగత్తు, మిళితమై సాగిపోయిన భావాత్మక కావ్యం. అడుగడుగునా ప్రకృతి ఇందులో పులకించి పరవశించిపోతుంది కవి చేతిలో పడి. శేషేంద్ర కవిత్వంలోని గొప్పతనం ఒక కొత్త అభివ్యక్తి,
కొత్త డిక్షన్. కవి మాటల్లోనే చెప్పాలంటే శేషేంద్ర కవిత్వం ఒక విశిష్ట భాష అంటాడు సబ్బని.
ఇంకా ఇంకా..డా. సి.నారాయణ రెడ్డి గారి విశ్వంభర గురించి, ద్వా నా శాస్త్రిగారి సాహిత్యం గురించి,నవలా రచయిత వడ్డెర చండీ దాస్ గురించి,మినీ కవి అలిశెట్టి ప్రభాకర్ గురించి, కె.శివారెడ్డి “మోహనా ఓ మోహనా “గురించి,
డా.ఎన్.గోపిగారి జలగీతం గురించి, ఆచార్య రాచపాళెం రాసిన దీర్ఘ కావ్యం పొలి గురించి,బి.ఎస్ రాములు బతుకు పోరు నవల గురించి, కవి డా.ఏనుగు నరసింహారెడ్డి విశేష సంఖ్య లో తెలంగాణా రుబాయీలు గురించి, నేత కార్మికుల జీవన పోరాటం గురించి నేను రాసిన మగ్గం బతుకు దీర్ఘ కావ్యం విశిష్టతను గురించి.. ఎన్నో విలువైన వ్యాసాలు, వ్యాసాల్లో అర్థవంతమైన వ్యాఖ్యలు ,విశేషణలు చేశారు.
ప్రముఖ సాహితీ వేత్త ఆచార్య దార్ల వెంకటేశ్వర రావు ఈ పుస్తకానికి తన ముందు మాట లో
ఇందులోని సాహిత్య వ్యాసాలన్నీ తెలుగు వారి సాహిత్య సమైక్యతను,సహృదయత ను చాటేవిగా ఉన్నాయని ప్రశంసించారు.
ఈ పుస్తకాన్ని విశిష్ట సాహిత్య అభిమాని,నేటినిజం ఎడిటర్ బైస దేవదాస్ గారికి అంకితమివ్వడం రచయిత సముచిత నిర్ణయం గా నేను భావిస్తున్నాను.
ఈ పుస్తకం తెలుగు విద్యార్థులు,పరిశోధకులు,అధ్యాపకులకు హ్యాండ్ బుక్ గా,అధ్యయన గ్రంథం గా ఉపయోగ పడుతుందని నేను అభిప్రాయ పడుతున్నాను.
ఈ పుస్తకం కస్తూరి విజయం ప్రచురణల ద్వారా ప్రింట్ ఆన్ డిమాండ్ బుక్ గా అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంది.
సాహిత్య విలువలున్న ఒక మంచి పుస్తకాన్ని తెలుగు సాహిత్య లోకానికి అందించిన కవి మిత్రుడు సబ్బని లక్ష్మి నారాయణ గారిని మనసారా అభినందిస్తున్నాను.
‘సబ్బని సాహిత్య వ్యాసములు’ పుస్తకం లభ్యమయే చోటు అమెజాన్, ఫ్లిప్ కార్ట్.
సబ్బని లక్ష్మీ నారాయణ ఫోన్ నంబర్ : 8985251271