విడాకులు

by Yalamarti Anuradha

కారు హారన్‌ మ్రోగుతోంది.

అన్వేష్‌ వచ్చినట్టున్నాడు అనుకొని స్నేహ చెప్పులేసుకొని వచ్చి కారులో కూర్చుంది.

‘దారిలో నీలూని పికప్‌ చేసుకుందాం’ అంది ముక్తసరిగా !

‘ఏమిటే హాట్‌ హాట్‌ గా ఉన్నావ్‌ ! ఎటు వెళ్దాం !’

”హాటా నా ముఖమా? బాధగా ఉంది. అంతే. ఎక్కడికయినా ప్రశాంతంగా ఉండే చోటుకు పోనీయ్‌” అంది. కాస్త దూరం వెళ్ళగానే కారు ఆపాడు అన్వేష్‌.

హారన్‌ ఎంతగా మ్రోగించినా నీలూ రాదేం? చూద్దాం అని లోపలికి వెళ్ళింది.

అప్పుడే బయటకు వస్తూ కనిపించింది నీలిమ తల్లి.

”స్నేహా! నీలూ రాంబాణమ్మ గారి పాపకు జాండీస్‌ అయితే హాస్పిటల్‌ లో చేర్చారట. అక్కడే ఉందట”.

”అలాగా! నేను వచ్చి వెళ్ళానని చెప్పండి” అని వచ్చి కారులో కూర్చుంటూ విషయాన్ని చెప్పింది అన్వేష్‌ కి.

”ఈ విషయం సరే! అసలు విషయం చెప్పు !”

”చెబితే సిల్లీగా ఉందని నవ్వుతావేమో?” సందేహిస్తూ అంది.

”నా సంగతి తెలియదా? కొత్తగా మాట్లాడుతున్నావ్‌?”

”నాకు అన్నీ కొత్తగానే కనిపిస్తున్నాయి. నలభై యేళ్ళు కాపురం చేసిన మా మాయ్య, అత్తయ్య ఇప్పుడు విడాకులు తీసుకోవాలనుకోవటమేమిటి?”

”అదేముంది ఎప్పుడు పడకపోతే అప్పుడు విడాకులు. దానికి వయసుతో సంబంధం ఏముంది? నాకిందులో ఏం కొత్తదనం కనిపించటం లేదే!”

”జనాలంతా ఇలా తయారయ్యారేం? విడాకులు అనేది మన సంస్కృతికి విరుద్ధం. అలాంటి ఆలోచనే రావద్దంటాను”

”అలా అని ఇష్టం లేకున్నా సర్దుకు పోవాలా? ఎన్నాళ్ళిలా ?”

”అందుకని మనుమళ్ళు వచ్చే వయసులో విడాకులా! ఛ !ఛీ”

‘ఇంతకీ సమస్య ఏమిటీ?”

”ఇన్నాళ్ళూ అత్తయ్య చెప్పినట్లు మామయ్య వినేవాడు. ఏమయ్యిందో తెలియదు. ఎదురు తిరిగాడు. మామయ్య నేనేం చెబితే అది జరగాలి అంటున్నాడు. అది అత్తయ్య తట్టుకోలేకపోతోంది.”

”బుద్ధునికి బోధి చెట్టులా ఎక్కడో జ్ఞానోదయమయి ఉంటుంది”

”నాకనిపిస్తుంది ఈ బుద్ధి పెళ్ళయిన కొత్తలోనే ఉంటే బాగుండేది అని. అప్పుడే ఆవిడను అదుపులో పెట్టుకొని ఉంటే ఈ సమస్య ఉండేది కాదుగా!”

”అదేంటి స్నేహా! ఆడవాళ్ళను అదుపులో పెట్టుకోవటం అనేది మీ స్త్రీవాదులు ఒప్పుకోరుగా!”

”అదే! నాకు ఒళ్ళు మండుతుంది. అదుపులో పెట్టుకోవటం అంటే మనులు చెప్పి చేయించుకొనే పని మనిషిలా చూడటం అని గాదు. తప్పుగా ప్రవర్తిస్తే భార్యనయినా సరైన దారిలో పెట్టాల్సిందే అని. నీకు తెలుసా! మా అత్తయ్యా మాటలు విని మా అమ్మమ్మకు మందులు కూడా కొనేవాడు కాడు మామయ్య. తాతయ్య చనిపోయిన దగ్గరనుంచీ ఒక్కర్తీ కష్టపడి పెంచి, పెద్దచేసి ఇలా తన తిండి తను తిని వీళ్ళందరికీ ఇంత సంపాదించి పెడుతున్నాడంటే ఆ క్రెడిట్‌ ఎవరిది మా అమ్మమ్మది కాదూ! అలాంటి అమ్మమ్మను సరిగ్గా చూచుకోపోతే ఊరుకోను” అని గట్టిగా చెబితే ఇప్పుడే అవస్థ తప్పేదిగా! ఎవరికిచ్చే వాల్యూ వాళ్ళకివ్వాలని. ఎవరినీ కించపరచుకుండా ఇద్దరికీ న్యాయం చేసే దక్షత భర్తగా ఈ మగవాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారో’ అని జాలివేస్తుంది కూడా!”

రేపు తను ఒక భర్త అయితే ఇదేనా పరిస్థితి అని దిగులుగా పెట్టాడు ముఖం అన్వేష్‌!

”ఏమిటా ఫేస్‌! ఇప్పుడు ఆ కష్టమే నీకు వచ్చినట్లు అంత దీనంగా!”

”నిజంగా వచ్చినట్లే ఉంది”

”వస్తే ఎలా నడుచుకోవాలో చెప్పటానికి నేనున్నానుగా!” అభయహస్తం ఇస్తూ ఉంది.

”ఇంకా చెప్పేదేమిటి ఆల్‌ రడీ చెప్పేసావ్‌ గా”

”ఎక్కడ పూర్తిగా చెప్పనివే”

ఇంకా డీలా పడిపోయాడు.

”నువ్వు జాగర్తగా డ్రైవ్‌ చెయ్యి నాయినా. లేకుంటే ఈ సమస్యలకు దూరంగా పై లోకాలల్లోకి వెళ్ళి తెలియని సమస్యల మధ్య పడతాం”

అన్వేష్‌ సడెన్‌ బ్రేక్‌ వేశాడు విసుక్కుంటూ.

బ్రేక్‌ పడకపోతే ఆ కాలేజీ కుర్రాడు ప్రాణం అరక్షణంలో గాలిలోకి ఎగిరిపోయేవే! అసలు ప్రాణాల మీద తీపి కనిపించడం లేదే! రోడ్డు వాళ్ళ సొంత ఇంటిదారిలా ఆ నడక లేమిటో!”

”అందుకే! నేనసలు డ్రైవ్‌ చెయ్యను” అంది స్నేహ.

”అదృష్టవంతురాలివి” అయినా అతనంత ధీమాగా ఎలా వెళ్తున్నాడు? వాళ్ళ అమ్మా నాన్న  ఎంత కష్టపడి పెంచుతూ ఉండి ఉంటారు! వేరే వాళ్ళ ప్రాణాలు కాపాడకపోయినా ఫరవాలేదు. తమ ప్రాణాలు గురించి కూడా వాళ్ళు పట్టించుకోవటం లేదేమిటి?”

”వింత వింత లోకంలో ఎన్నెన్నో చూడాలి..” హమ్‌ చేస్తున్నాడు అన్వేష్‌.

ఒక్కోసారి ట్యూన్స్‌ కి తగ్గ మాటలు సొంతవి కలిపి పాడటం అలవాటు అన్వేష్‌ కి.

అవన్నీ గమనించే స్థితిలో లేదు స్నేహ!

”మామయ్య, అత్తయ్యని ఇంట్లోంచి పొమ్మనటమేమిటి?” ఆ విషయం విని తట్టుకోలేక పోతోంది. అత్తయ్య చెడ్డపనులే చేసింది. దానిని సహించటం కూడా చెడ్డపనే. అది మామయ్య చేసాడు. ఇప్పుడు తనో బుద్ధిమంతుడిలా అత్తయ్యను ఉన్న ఫళాన బయటకు పొమ్మంటే ఎక్కడికి వెళుతుంది?”

”ఏమిటి! నాతో మాట్లాడకుండా నీలో నువ్వే ఆలోచించుకుంటున్నావ్‌?”

”ఆఁ ఏం లేదు. మా మగవాళ్ళు ఎంత స్వార్థపరులో అని!”

”అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ మా మగజాతి మీదకే యుద్ధమా?”

”కాదా మరి! పెళ్ళయిన దగ్గరినుంచీ భర్తే సర్వస్వం అని అతని చుట్టూ అల్లుకుంటూ తన గురించి ఆలోచించుకోకుండా, తన కోసం ఏ డబ్బూ దాచుకోకుండా అంతా మనది అనుకుంటే ఉన్నట్టుండి భర్త నా ఇల్లు, నా ఆస్థి, నీకేం లేదు పొమ్మంటే ఎంత దారుణం?”

అన్వేష్‌ మౌనం పాటించాడు.

”భర్తే కదా ఆమె ఆస్థి. అతనే నిరాకరిస్తే ఆమె పరిస్థితి ఏమిటి?”

”ఏం చెయ్యమంటావ్‌!”

”భార్య తనకంటూ సంపాదనను సమకూర్చుకోవాల్సిందే! ఒకరకంగా చూస్తే తప్పే! కానీ ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆలోచిస్తే అది ఒప్పే అనిపిస్తుంది?”

”దీనికి మరో పరిష్కారం లేదా?”

”ఎందుకు లేదు. విడాకులు తీసుకోకుండా చక్కగా  కలిసి ఉండటమే అసలైన పరిష్కారం” ఆశ్చర్యంగా చూసాడు అన్వేష్‌.

”అవును అనూ! భార్య అంటే ఒకరు, భర్త అంటే ఒకరు. ఆ ఒకరు + ఒకరు పెళ్ళితో కలిసిపోయి ఒకరు అవటమే వివాహమంటే, ఒకటి + ఒకటి = ఇద్దరు అంటే అది వివాహ బంధానికి సరైన ఈక్వేషన్‌ కాదంటాను”

”అసలు ఇదంతా కాదుగానీ ఇన్నాళ్ళూ అత్తయ్య మామయ్యను అలా ఏడిపిస్తోంది, ఇలా ఏడిపిస్తోంది అని మామయ్య మీద జాలిపడే దానివి. మరి ఇప్పుడేమిటి ప్లేట్‌ ఫిరాయించేసావ్‌ అత్తయ్య వైపు తిరిగి”

”అప్పుడు మామయ్య బాధితుడు కాబట్టి అతని మీద జాలి. ఇప్పుడు అత్తయ్య బాధితురాలు కాబట్టి ఈమె మీద జాలి. అందులో ఈమె స్త్రీ.”

”అంతేలే ! పక్షపాతం.. ఎక్కడికిపోతాయ్‌ బుద్ధులు”.

”అవును… అసహాయ స్థితిలో ఎవరున్నా ఆదుకోవల్సిందే ! అత్తయ్యకు బుద్ధి చెప్పాలి. అంతవరకు ఒప్పుకొంటాను. వీధిన పడెయ్యటానికి ఒప్పుకోనంటాను”

”నేనూ ఒప్పుకుంటాను లేకపోతే నువ్వు నన్ను చంపేస్తావ్‌!”

”ఆడవాళ్ళను ఏడిపించే, మగవాళ్ళందరినీ అదే చెయ్యాలనిపిస్తుంది”

”మరి మగవాళ్ళను ఏడిపించే ఆడవాళ్ళని” భయపడుతూనే అడిగాడు.

”మీకులా మాకు రెండు న్యాయాలు ఉండవు మగాళ్ళకో న్యాయం, ఆడోళ్ళకో న్యాయం. అందరికీ ఒకటే న్యాయం.”

”స్నేహా! అయిపోతున్నా!” అన్నది దీనంగా ముఖం పెడుతూ.

సరే సరదాలోకి దిగిపోదాం. ఈ విడాకుల మాటలు వినీ వినీ ఇంట్లో మేం సరదాగా విడాకులు నీవే ఏర్పరచుకున్నాం! చివరకు ఏం అనిపించింది?

”సరదాకి కూడా ఈ విడాకులు సీను ఇంట్లో బాగోలేదని అందరిదీ ఒకటే మాట”

”మంచిది. ఇంక కారు దిగి మంచి కాఫీ కొట్టిస్తే వెళ్ళిపోతాను”

”అసలు తను చూడనే లేదు. కారు తమ ఇంటి ముందే ఉంది”

”అదేమిటి. ఇంటికి తీసుకు వచ్చావ్‌?” ఆశ్చర్యంగా అడిగింది.

”నువ్వు ప్రశాంతంగా ఉండే చోటుకు తీసుకు వెళ్ళమన్నావ్‌? అది నీకు ఇక్కడే బాగా దొరుకుతుందనిపించింది. అందుకే ఇక్కడికే తీసుకువచ్చాను” అన్నాడు.

అతని సమాధానానికి చిన్నగా నవ్వుతూ.. ”సరే! రా కాఫీ తాగి వెళ్దువు గాని” అని అంది స్నేహ. ఇద్దరూ నవ్వేసుకుంటూ లోపలికి నడిచారు.

You may also like

Leave a Comment