Home పుస్త‌క స‌మీక్ష‌ అభ్యాసకుల కరదీపిక “తెలుగుబడి బాలవాచకం”

అభ్యాసకుల కరదీపిక “తెలుగుబడి బాలవాచకం”

by Kukatla Sai

కమ్మనైన భాష అమ్మభాష. మధురమైన భాష మన మాతృభాష. తీయనైన భాష తెలుగుభాష. తేనెలొలుకు భాష మన తెలుగుభాష అని వేనోళ్ళ కొనియాడబడిన భాష. ఆంధ్రభోజుడుగా గణుతికెక్కిన శ్రీకృష్ణదేవరాయలు “దేశభాషలందు తెలుగు లెస్స” అన్నారు. ప్రముఖ తమిళకవి సుబ్రహ్మణ్యభారతి “సుందర తెలుంగు తెలుగు” అని తెలుగుభాష గొప్పదనాన్ని చెప్పారు. “ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్” అని ఇటలీ దేశస్థుడైన నికోలా డి కాంటి తెలుగు భాషను కొనియాడినారు. అజంత భాష మనది. అమృత భాష మనది. అట్లాంటి తెలుగు భాషను మన పిల్లలు దోషరహిరంగా చదువలసిన అవసరాన్ని, తప్పులు దొర్లకుండా రాయవలసిన ఆవశ్యకతను రచయిత కూకట్ల తిరుపతి “తెలుగుబడి బాలవాచకం” ద్వారా నొక్కి చెప్పారు. అందు కోసమే ఈ చిరు పొత్తాన్ని మన ముందుంచారు. ప్రస్తుతం ప్రపంచీకరణ ప్రభావం వల్ల అందరూ అన్యభాషైన ఆంగ్లం మోజులో పడి, అమ్మభాషను అభాసుపాలు చేస్తున్న క్లిష్ట సందర్భంలో ఉన్నారు. అంతర్జాతీయంగా అనుసంధానం చేసే ఆంగ్లభాషను నేర్చుకోవడం మంచిదే కావచ్చు కానీ మన తల్లిభాషను మరచిపోతే తెలుగుజాతి మనుగడకు ముప్పు తప్పదని రచయిత నొక్కి వక్కానించారు. తెలుగు భాషను సులభంగా చదువ, రాయ నేర్చుకోవడానికి కవి, రచయిత కూకట్ల తిరుపతి తెలుగుబడి బాలవాచకం అనే పుస్తకాన్ని చక్కగా రూపొందించారు. కరీంనగర్ పట్టణానికి చెందిన ఈయన పెద్దపల్లి జిల్లా, మండలంలోని మూలసాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు భాషోపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఈ పుస్తకం ద్వారా పిల్లలు తెలుగు భాషను దోషరహితంగా చదువడం, రాయడంను సులువుగా నేర్చుకోవచ్చు. ఇందులో సరళపదాలు, గుణింతపదాలు, ద్విత్వాక్షరపదాలు, సంయుక్తాక్షరపదాలు, సంశ్లేషాక్షరపదాలు మరియు ఆ పదాలతో కూడిన వాక్య రచనలను సోదాహరణంగా వివరించిన తీరు పాఠకులను ఆకర్షిస్తుంది. ఇదే వరుస క్రమంతో, పద పద్ధతిలో తెలుగు భాషను సులభంగా అభ్యసించవచ్చు. ప్రతి అంశంలో వాక్య నిర్మాణాన్ని కూడా తేలికగా చేసి చూపించారు. వీటికి సంబంధించిన డిజిటల్ పాఠాల క్యూఆర్ కోడ్లను ఆయా పాఠాల దగ్గర పొందుపరచడం విశేషం. పాఠకుడు స్వయంగా ఈ పుస్తకంలోని పాఠాలను చదువుకోవచ్చును. అలాగే క్యూఆర్ కోడ్లను స్కాన్ చేసి డిజిటల్ పాఠాలను చూస్తూ, వింటూ భాషను సొంతంగా నేర్చుకోవడానికి అనువుగా ఈ పుస్తకాన్ని రచయిత కూకట్ల తిరుపతి అభ్యాసకులకు అనుకూలంగా మలచినారు. ఇలా సాంకేతిక పరిజ్ఞానం జోడించబడడం పుస్తక ప్రపంచంలో కొత్తదనంగా భావించవచ్చు. తెలుగు భాషలో సులభతరం నుంచి కఠినతరం వైపుగా బోధనాభ్యసన ప్రక్రియను కొనసాగించడానికి వీలుగా ఈ పుస్తక రూపకల్పన చేశారు.

తెలుగు భాషను చదువడం, రాయడం నేర్చుకున్న తర్వాత తెలుగు వాడిగా జీవించడానికి పనికి వచ్చే పాఠాలను ఇందులో పొందుపరచడం ముదావహం. తెలుగు పండుగలు, మన ఆటలు, తెలుగు సామెతలు, తెలుగు జాతీయాలు, పొడుపు కథలు, తిథులు, వారాలు, నక్షత్రాలు, రాశులు, కార్తెలు, మాసాలు, ఋతువులు, కాలాలు, ఆయనాలు, తెలుగు సంవత్సరాలు, తెలుగు అంకెలను అందుబాటులో ఉంచారు. ఇప్పటి తరానికి ఈ పుస్తకం ఎంతో ఉపయుక్తంగా ఉన్నది. తెలుగు భాషను నేర్చుకోవడంతో పాటు తెలుగువాడిగా జీవించడానికి, తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను అలవర్చుకోవడానికి, అనువుగా ఈ పుస్తక రూపకల్పన జరిగిందని చెప్పవచ్చు. ఈ పుస్తకానికి భావస్పోరకమైన ముఖచిత్రాన్ని కూకట్ల సాయి భారవి అందించారు. ఈ చిరు పొత్తానికి విశేషమైన ప్రజాదరణ లభించడాన్ని బట్టి చూస్తే, మాతృభాషాభిమానం ఇంకా సన్నగిల్లడం లేదనిపిస్తున్నది. మన దేశంలోని ముంబై, చెన్నై, రాజస్థాన్, న్యూఢిల్లీ తదితర ప్రాంతాలలోని తెలుగువారితో పాటు అమెరికా, మయన్మార్, దుబాయ్ మొదలైన దేశాలలోని ప్రవాస తెలుగువారి నుంచి ఈ పుస్తకానికి విశేషమైన స్పందన లభించడం అభినందనీయం. దక్షణాఫ్రిక దేశంలోని ప్రవాస తెలుగు పిల్లలకు తెలుగు పాఠ్య పుస్తకంగా తెలుగుబడి బాలవాచకంను వినియోగించుకోవడం గర్వకారణం. తీయనైన తెలుగు భాష మూలాల్లోకి వెళ్ళి, తెలుగును తేలికగా నేర్చుకోవడానికి ఈ పుస్తకం దోహదం చేస్తుంది. ప్రతి తెలుగువాడు చదవవలసిన పుస్తకమిది. ప్రతి పాఠశాల గ్రంథాలయంలో ఉండవలసిన పుస్తకం తెలుగుబడి బాలవాచకం. మాతృభాషాభిమాని, తెలుగుభాషోద్యమకారుడు, తెలుగుభాషోపాధ్యాయుడు, కవి, రచయిత కూకట్ల తిరుపతి కలం నుండి తెలుగుభాషకు సంబంధించిన పుస్తకాలు ఇతోధికంగా వెలువడాలని కోరుకుంటున్నాను. మాతృభాష పరిరక్షణ కోసం పాటుపడుతున్న కూకట్ల తిరుపతి గారికి అభివాదాలతో కూడిన అభినందనలు, శుభాకాంక్షలు.

తెలుగుబడి బాలవాచకం
రచయిత: కూకట్ల తిరుపతి
వెల : 80/-
పుటలు: 79
ప్రతులకు: కూకట్ల లక్ష్మి,
ఇ.నం: 08-03-207/4/2/ఇ/1, రోడ్డు నం.07,
వాసుదేవ కాలని, కట్టరాంపూర్, కరీంనగర్.
పిన్: 505001. తెలంగాణ రాష్ట్రం. చేబలుకు: 9949247591.

You may also like

Leave a Comment