దిగంబర(2009), గరళమ్(2013), తప్త స్పృహ(2015)తో సుపరిచితమైన కవి ‘మౌనశ్రీ మల్లిక్’. ఇప్పుడు “మంటలస్నానం'(2025) తో పలకరిస్తున్నడు. తన కవిత్వ పుస్తకాల శీర్షికలు ఆలోచింపజేసేవిగా వుంటయి. వ్యక్తిగా తన ప్రస్థానం అనేక ఆటుపోటుల సమాహారం. జీవితంలో నిలదొక్కుకోవడానికి ఎన్ని పోరాటాలు చేసాడో అది అతని వ్యక్తిగతం. ‘కవిత్వం, పాట’ తోటి మనిషికి ఎంత సన్నిహితునిగా మార్చాయో అదంతా సామాజికం. కవి జీవితంలో కవిత్వం ఎంత? కవిత్వంలో కవి జీవితం ఎంత? అనే ప్రశ్నలు వేసుకుంటున్నప్పుడు కవి ఆచరిస్తున్న సూక్తి లాంటి నినాదప్రాయ కవిత్వ వాక్యాలు మనల్ని ఆలోచింపజేస్తయి.
” జీవితంలో కవిత్వం వరించడం ఉత్సవం! కవిత్వంలో జీవితం తరించడం ఉద్యమం!!”
ఆచరణ – జీవితం రెండూ వేర్వేరు కానప్పుడు వ్యక్తి ఆదర్శనీయుడు అయితడు. నిజంగానే ‘మౌనశ్రీ’ ఆదర్శవంతుడనుకుంటే ఆచరణ జీవితం జమిలీగా కలిసిన ఒక మెటాఫర్ అయితది. కవిత్వానికి సంబంధించి, కవిత్వపుస్తకాలకు సంబంధించి, ప్రచురణకు సంబంధించి, వాక్య నిర్మాణానికి సంబంధించి తనదైన ప్రత్యేక శైలి తనకుంది. ఒక కవిత్వ పుస్తకానికి ‘ఎడిటర్’ ను పెట్టుకోవడం తెలుగు సాహిత్యంలో చాలా అరుదు. మౌనశ్రీ ఈ విషయంలో అందరికంటే ముందు వరుసలో ప్రథముడుగా అవుపిస్తడు. విరామ చిహ్నల ఉపయోగం, ఇవ్వవలసిన స్పేస్ – వాక్యంలోనూ, పేరాగ్రాఫ్ లోనూ, స్టాంజాలోనూ అర్థం చెడిపోకుండా అక్షరం పట్ల వున్న అమితమైన భక్తి మౌనశ్రీ రాతల్లో ప్రస్ఫుటంగా మనం దర్శించవచ్చు. ‘తప్తస్పృహా’ కు ‘మంటలస్నానం’ కవిత్వానికి మధ్య దశాబ్దకాలపు దూరం వున్నప్పటికీ సాహిత్యానికి దూరంగా, అక్షరానికి దూరంగా ఎడబాటు విరహం లేదు. అంతేకాదు ‘మంటలస్నానం’ కవిత్వం ‘తప్తస్పృహ ‘ లోని లోటుపాట్లను సవరించుకోగలిగింది. దిగంబర, గరళమ్ లో వున్నంత బిగి తప్తస్పృహ కాలానికి సడలినప్పటికీ ‘మంటల స్నానం’ అంతకు మించి బూమరాంగ్ లా తనచేతికి అందివచ్చింది. ప్రాణం పెట్టి పాట రాసినా అందులో ఎంతకాలం స్వేచ్ఛగా బ్రతుకుతాడో తెలియదు గానీ కవిత్వ పంక్తుల్లో అక్షరమక్షరం స్వేచ్ఛను అనుభవించగలడు, జీవించిన క్షణాల్ని మనతో పంచుకోగలడు. ఈ స్వేఛ్ఛ రాతకు సంబంధించింది. రాయగలిగే స్వేచ్ఛకు సంబంధించింది.
*
కవిత్వం ఎవరి పక్షం? జవాబుగా ప్రజల పక్షం అంటూ సర్వదిక్కులు పిక్కటిల్లేలా ప్రతిధ్వని వినిపిస్తుంటది. కవిత్వం ప్రజల పక్షం అయితే ఏంటి? కాకుంటే ఏంటి? ప్రజలకు ఒనగూరే ప్రయోజనం ఏంటి? ఈ కవిత్వం ప్రజలు చదువుతారా? తమ బాధల్ని చెమట వాసనతో నెత్తుటి సిరాలో ముంచి రాసిన కవిని హత్తుకుంటారా? మరెందుకీ కవిత్వం! కవులకీ, శ్రమజీవులకీ మధ్య వారధి ఎవరు నిర్మించాలి? కవిత్వాన్ని మోసుకెళ్లి వారి హృదయాల్ని తాకేలా ఎవరు చేయగలరు? ఎప్పుడు కవి అవసరం? అసలు ఈ ప్రపంచానికి కవుల అవసరం వుందా? చర్చ ఫలవంతంగా జరిగే ఒక సుహృద్భావ వాతావరణం కావాలి. కవిత్వం రాతల్లోనే కాదు చేతల్లోనూ పని చేస్తుందని ప్రపంచంలోని వివిధ ఉద్యమాలు నిరూపించిన సందర్భాలు లేకపోలేదు. యితర ఉద్యమాల మాటేమో గాని ‘తెలంగాణ ఉద్యమం’ సాక్షీభూతంగా పేర్కొనవచ్చు.

“రోజులో ఒక్కసారైనా
ఎండలో మాడి స్వేదమై రాలాలి
జీవితంలో ఒక్కసారైనా
చెడుపై దావానలమై ఎగబడి దాడి చేయాలి” (మంటల స్నానం)
కవి ప్రభోదకుడై వుంటడు. ఉత్ప్రేరకమై పనిచేస్తడు. ఉద్యమాలకు ఆయువుపట్టు అయితడు. ఆరిపోని జ్వాలకు రక్షణ కవచమై నిలుస్తడు. చెనుట చిందించేవాడే మనిషి అని ఎలుగెత్తి చాటుతడు. అభ్యర్థించటం కాదు పిడికిలి బిగించమనే సందేశాన్ని పంపిస్తడు.
*
వస్తువును కవి నిర్దేశిస్తాడా? లేక కవులను వస్తువు నిర్ధేశిస్తుందా? రెండు రకాలుగా జరుగుతుందని అనుకుంటే ‘వస్తువు’ ను నిర్దేశించే కవులు మొదటి రకం. వస్తువు చేత నిర్దేశింపబడే కవులు రెండవరకం. మొదటిరకం కవులకు వస్తువు స్థిరమైనది. దాన్ని దాటి బైటికి రాలేరు. భక్తి కవులు, ప్రకృతి ఆరాధకులు మొ.నవారు ఈ కోవకు చెందుతరు. రెండవ రకం కవులు చలన సహితమైన సమాజంలోని మార్పులకు స్పందిస్తూ కాలంతో పాటుగా కొంతమంది, కాలం కంటే ముందుగా కొంతమంది చైతన్యవంతులై కొనసాగుతరు. మౌనశ్రీ ఈ రెండోరకం కవి అని చెప్పటం నా ఉద్దేశ్యం. వర్తమాన అంశాల్ని ఇప్పటి మనుషుల భావోద్వేగాల్ని, వీటిని కూడా కవిత్వం చేయగలమా? అనిపించేవి ‘వస్తువు’ లుగా కనిపిస్తయి. అయితే చాలా వరకు ‘వస్తువులన్నీ నిర్దిష్టంగా గాక సాధారణీకరించినట్టుగానే మాట్లాడతయి. కవి విశ్వ మానవతావాదిగా కనిపిస్తడు. నిర్దిష్టం(Specific )గా మాట్లాడనంతవరకు మనం సేఫ్ మోడ్ లో వున్నట్టు భావించాలి. సాధారణీకరించి (Generalised) మాట్లాడుతున్నప్పుడు, మానవత్వం ఎజెండాగా కొనసాగుతున్నప్పుడు రక్షణ తంత్రాలు (Defense mechanism) అంతగా అవసరం పడవు. అందరూ బాగుండాలి – అందులో మనముండాలి అనే ఆశావాహ దృక్పథం, పాజిటివ్ నేచర్ ‘మౌనశ్రీ’ కవిత్వంలోనూ కనిపిస్తయి. ఎంత సాధారణీకరించి మాట్లాడుతున్నప్పటికీ నిర్థిష్టమైన స్వరం అప్పుడప్పుడూ తొంగిచూసి వెళ్తుంటుంది.
“కొంతకాలానికి
ఊరు నోరు తెరుచుకుంటుంది
నీ గురించి మాట్లాడటానికి’ బంధుగణం ఒళ్లు విరుచుకుంటుంది.
నిన్ను జైకొట్టడానికి!
నీ చిరపరిచితులకు చలనం వస్తుంది
నిన్ను కలిసి తరించడానికి” (చెప్పు తెగేలా చెప్పు)
*
మౌనశ్రీ కవిత్వ నిర్మాణ పద్ధతుల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఇవి తన కవిత్వ శిల్పాన్ని గురించి విడమరిచి చెబుతయి. నెగెటివ్ గా మాట్లాడి పాజిటివ్ దృక్పథాన్ని పెంపొందించే నిర్మాణ వ్యూహం ‘మొక్కలు నాటకండి’ కవితలో చూడొచ్చు .

సినిమా, టీవీ పాటల కవి
“దయ చేసి మొక్కలను అస్సలు నాటకండి
ఒకవేళ బుద్ధి పుట్టి నాటినా వాటి సంరక్షణ మరిస్తే మాత్రం
ఆ మొక్కలను హత్య చేసినట్టే కాదు
ఈ పుడమిని అభిమానభంగం చేసినట్టు
ఔను మరి చెట్టుంటేనే కదా
అవని అయినా ప్రాణి అయినా ఉండేది”
*
మానసిక ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసే బాహ్య ప్రపంచపు అలజడికి కార్య కారణ సంబంధం నెరిపి, రెండు సందర్భాలకు ఔచిత్య వంతమైన అన్వయ సంయమనం ప్రదర్శించి ఒక తీర్పును వెలువరించే నిర్మాణ వ్యూహం “పిట్టమనసు’ కవితలో దర్శించవచ్చు.
“పిసరంత పిట్టకైనా
చెట్టంత మనిషికైనా
కడుపు తీపి ఒక్కటే”
*
సాధారణమైన, సామాన్యమైన అంశాలు విరోధాబాసను తెలీకుండానే ఎలా ప్రదర్శిస్తాయో తెలిపే నిర్మాణ వ్యూహం ‘గమనిస్తే’ కవిత చెబుతది.
” జై కొట్టే సమూహంలో బుసకొట్టిన గుంపూ ఉంటుంది”
*
గతాన్ని నెమరేసుకోవడం అంతా ‘నాస్టాల్జియా’ అనుకుంటే పాఠకుడు వింటున్నట్టుగా ముచ్చట చెప్పుకుంటూ జ్ఞాపకాల దొంతరల్ని ఉల్లి పొరల్లా ఒలుస్తూ ఒల్శెంత దుక్కాన్ని ఒక్కమాటలో చెప్పి కంట తడి పెట్టిస్తడు. జీవితం మొత్తం చెప్పడం ఒకెత్తు. ముగింపు చెప్పడం మరో ఎత్తు.
” అది నా మనుగడను మలుపు తిప్పిన ఇల్లు మాత్రమే కాదు
మా అమ్మ తుదిశ్వాస విడిచిన ఇల్లు” (పాత అద్దె ఇల్లు)
*
కవి యుద్ధం గురించి మాట్లాడుతడు. యుద్ధం పుట్టకతో ముడిపడి వున్న బంధాన్ని చెబుతడు. యుద్ధం ఎక్కడలేదని ప్రశ్నిస్తడు? పాలస్తీనా – ఇజ్రాయేల్ సందర్భాన్ని ప్రస్తావిస్తడు. బుద్ధుడు, జీసన్, ప్రవక్త ఏయే యుద్ధాలు చేసారు? కవి ఎటువంటి యుధ్ధాన్ని కోరుకుంటున్నడు? ఈ కవిత మాట్లాడుతది.
“ఔను యుద్ధం జరగాలి. మతాల సరిహద్దులు దాటి కులాల గీతలు దాటి
మేం మనుషులమని
ప్రపంచం ముక్త కంఠంతో నినదించే
యుద్ధం జరగాలి
ఔను యుద్ధం జరగాల్సిందే! (యుద్ధం జరగాల్సిందే..!)
*
వస్తు సృహ, కవిత్వ నిర్మాణ కౌశలం మెండుగా వున్న కవి మౌనశ్రీ మల్లిక్. విరహమైనా, శృంగారమైనా, కరుణను ఒలికించినా ఏ రసాస్వాదనలోనైనా పాఠకులు మునకలు వేసేంత సమ్మోహన వాక్యం తనది. తను సాహిత్య ఇగురం తెలిసిన కవి. తనను తాను, తన కవితావాక్యాన్ని నిత్యం పుటం పెట్టుకుంటూ సానబారిన కవిత్వ వెలుగుల్ని మున్ముందు మరిన్ని పంచాలని కోరుకుంటూ ‘మంటల’ స్నానం’ వెలువరిస్తున్న శుభ సందర్భంగా అభినందనలు.