పుస్తకం పేరు: వేములవాడ వైభవం పద్యకావ్యం. రచన: చొప్పకట్ల భాను, వేములవాడ. పుటలు:156. వెల: 116 రూపాయలు.
వేములవాడ క్షేత్రేశ్వరుడైన రాజరాజేశ్వర స్వామి వారిపై ఈ వంద సంవత్సరాలలో ఎంతోమంది కవులు, పండితులు వివిధ ప్రక్రియల్లో విలువైన రచనలు చేశారు. కీ.శే. మామిడిపల్లి సాంబకవి, వేదాంతం కాశీనాథం, కేశన్నగారి రాజశర్మ, వజ్జల సాంబశివశర్మ, బ్రహ్మనగారి నరహరి శర్మ మొదలగు పద్యకవులు స్వామి వారిపై కావ్యాలు రాశారు. దండకాలు రాశారు. స్తుతులు, సంకీర్తనలు, భజన పాటలు రాశారు. 150 సంవత్సరాల క్రితం యోగులైన బ్రహ్మశ్రీ సీతారామ యోగీంద్రులు, సంకేపల్లి రామశాస్త్రులు వంటి వారు స్వామి వారి పై సంకీర్తనలు రాశారు. కర్ణాటక సంగీత విద్వాంసులైన చౌటి భాస్కర్ లాంటి సంగీత కళాకారులు కూడా శాస్త్రియ సంగీతంలో తేనీయల్లాంటి కీర్తనలు రాశారు. ఇవన్నీ చతుష్కాల పూజల్లో అర్చకులు చదువుతున్నారు. కరీంనగర్ లో 1958-60 ప్రాంతాలలో నివసించిన కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ కూడా వేములవాడ రాజేశున్ని దర్శించి, స్వామి వారి మహిమను కొనియాడుతూ, మధ్యాక్కరలో పద్యాలు రాసి తన మొక్కు చెల్లించుకొన్నాడు. డా. వడ్డేపల్లి కృష్ణ, మిద్దెరాములు తదితరులు జానపదాల పాటలు, ఒగ్గు కథలు రాశారు. ధర్మపురి శేషప్ప, తిరుమలలో అన్నమాచార్యుడు, తెలుగు వాజ్మయ ప్రథమాచార్యులైన శ్రీ కృష్ణమాచార్యులు సింహగిరి వచనాలు రాసి ఇలా ఎంతో మంది వారి వారి భక్తి మార్గాలలో ఆ పరమేశ్వరున్ని ఆరాధిస్తూ, స్తుతిస్తూ తరించారు. తమ రచనల్లో భక్తి తత్వాన్ని ప్రాతిపదికగా తీసుకొన్నారు. అలాంటి కోవలో హృద్యమైన శివభక్తితో వృత్తాలలో పద్యాలు రాసి తన జన్మను సార్థకం చేసుకొన్నారు, సంస్కృత, తెలుగు పండితులు చొప్పకట్ల భాను గారు. కవి చక్కటి గాయకులు, చక్కగా పాడి వీటిని వాట్సాప్ గ్రూఫుల్లో పోస్టింగ్ లు చేయడంతో ఈ పద్యాలకు ఔచిత్యమేర్పడిందని చెప్పవచ్చును. ఈ పుస్తక ప్రచురణలో వెన్నుముకగా నిలిచిన రచయిత, న్యాయవాది వాసాలమర్రి నాగరాజు గారు ధన్యులు. వేములవాడ బ్రాహ్మణ్యం లో కొత్త నీరు రావడానికి ఇలాంటి రచనలు ఉపకరిస్తాయని చెప్పవచ్చును.
దక్షిణ కాశీగా ప్రసిద్దమైన వేములవాడ క్షేత్ర్రాన్ని, విరాట్ మూర్తులను, అమ్మవారు, గణపతి, నందీశ్వరుడు, దేవాలయ అవరణలోని వివిధ ఉపాలయాలైన భీమేశ్వరాలయం, నగరేశ్వరాలయం, బద్ది పోచమ్మ, కేదారేశ్వరుడు, మహలక్ష్మీదేవి ఆలయాలను చక్కగా కవి వర్ణీస్తాడు. ప్రధాన ఆలయంలో కొలువైన దేవతలు, కోటి లింగాలు, పంచాయతనాలు, ధర్మకుండ పుష్కరిణి, ఇక్కడి పండితులు, వేదమూర్తులు, సంస్కృత విద్యాలయ ఆచార్యులు, అర్చకుల పై ఆధ్యాత్మిక, తాత్విక దోరణీలో 140 పుటల్లో 124 పద్యాలతో వేములవాడ క్షేత్ర వైభవాన్ని పండించడంలో కృతకృత్యులయ్యారు. కొన్ని పద్యాలలో సామాజిక చింతనను రంగరిస్తూ దేవదేవున్ని ప్రశ్నిస్తుంటారు. లోకంలోని అనుచితమైన పోకడలపై దండెత్తుతారు. వీరు రాసిన పద్యాలు సరళంగా ఉండి, సామాన్యులకు అర్ధమయ్యే రీతిలో ఇంపుగా ఉన్నాయి. ప్రతి పద్యంలో ఒక కొస మెరుపుతో శివభక్తి అక్షరమక్షరంలో తాండవిస్తూ కనబడుతుంటుంటుంది. ఈ పద్యాలకు అనుబంధంగా మరో 14పేజీల్లో ఆరు రచనలు చేసి భేషనిపించుకొన్నారు. తాను రాసిన పద్యాల కిందటే భావాన్ని కూడా జతచేసి పఠితులకు ఆహ్లాదం కల్గిస్తాడు.
రచయిత భాను గారు వేములవాడ క్షేత్ర ఆనువంశిక అర్చక సంతతికి చెందిన వారు, తెలుగు, సంస్కృతాలలో పిజీ చేసి, ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసి, వన భూమి యైన ఆదిలాబాద్ జిల్లాలో మూడు దశాభ్దాలకు పైగా, తెలుగు పండితునిగా ఉద్యోగించి, తన శేష జీవితాన్ని సార్థకం చేసుకోవాడానికై వేములవాడ వైభవం పేరుతో పద్యకృతిని తన ఇష్టదైవమైన రాజన్నకు రాసి సమర్పించుకొన్నారు. గుడి వైభవం పై అలవోకగా పద్యాలు అల్లి తనలోని శివభక్తిని పద్య పుష్పాలుగా, బిల్వ దళాలుగా మలిచి అభిషేకిస్తూ, కైమూడ్పులర్పించుకొన్నారు. ఈ కావ్యంలోని పద్యాలు మోక్ష రసగంగై, సుబోధకమైన రీతిలో అర్థవంతమైన పద బంధాలతో అలరారి, పాటకున్ని ప్రభావితం, ప్రసన్నం చేస్తాయి. ఇందులోని పద్యాలు స్వతంత్ర ప్రతి పత్తిని కల్గి యుండి, దార్శనికునికి వేములవాడ క్షేత్ర సందర్శనను పునీతం చేస్తాయని కవే తన ముందు మాటగా చెప్పుకొన్నారు. మానవున్ని భక్తి మార్గంలో నడిపించడానికి ఇందులోని పద్యాలు మందార మకరంధాలై భాసిల్లాయని చెప్పడం అతిశయోక్తి కాదేమో. క్షేత్రేశ్వరుడైన మహదేవున్ని పరిపరి రకాలుగా స్తుతిస్తూ, తాత్విక చింతనతో ప్రశ్నిస్తూ, పద్యాలలో కవితా సౌందర్యాన్ని ఇనుమడింపజేశాడు. శివనామ స్మరణమ్ము సేయ మదిలో సిద్దుల్ ప్రవేశించిరో, శివ భావంబు రగిల్చిరో?శివ సుధారసమ్ము త్రాగించిరో అంటూ, శివ ధామమ్ము మహాధ్బుతమ్ము జన సంసేవ్యమ్ము నీ ధాత్రిలోన్! అంటూ దేవదేవున్ని స్తుతిస్తారు. వేములవాడ వైభవము వేడుకగా రచియింప బూని నీ/ నామము నే స్మరింప కవనామృత శైక కృతుల్ జనించె నా/ కోమల పద్యబిల్వములు కోరిక శివార్పణమ్ముగా/ నామది మొక్కి నీకు నిట అంకితమిచ్చితి శీ మహేశ్వరా!!అంటూ తన పద్యాలతో వైభవోపేతంగా కావ్యాన్ని అంకితమిస్తూ శివార్చన చేశాడు.
మా ఊరే ఒక ఈశ్వరార్చన పదమ్మూ వూరు కైలాసమే/ మా వూరందలి ధర్మకుండ జలముల్ మందాకినీ తీర్థముల్/ మా వూరినంతకు గాలి వెల్గు నతడే మా ఊరి రాజన్నయే/ మా ఊరంగల గోపురాల వితతుల్ మాహేశ్వర స్థానముల్!! అంటూ వేములవాడ క్షేత్ర ప్రాధాన్యతను కళ్ళకు కడుతాడు. మా ఊరి రాజన్న గోపురాలన్నీ మహేశ్వరుని స్థానాలేనని కవిసమయాన్ని వెల్లడిస్తాడు. ధర్మకుండ పుష్కరిణి ప్రాశస్త్యాన్ని గూర్చి రాస్తూ, ఇవి మందాకినీ(పవిత్ర గంగానది) జలములని, ఆ దేవేంద్రుడు బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకొన్నాడని, మోక్షాత్ముండయి తానమాడె తమితో మోక్షార్థియై నిచ్చటన్!! అని చెబుతాడు. ధర్మకుండ జలాన్ని పవిత్రంగా దూడాలని, అపవిత్రం కాకుండా కాపాడుకోవాలని నివేదిస్తూ, ఆందోళన చెందుతాడు. అతి కాలుష్యపు భాండమయ్యే నికటా, స్థితి తప్పి కాసారమై పోయిందని అంటూ, గతి నీవే సర్వ కల్మష హరా గంగాధరా శంకరా అంటూ వేడుకొంటాడు. అరు, ఏడు పద్యాలలో దేవాలయంలోని ప్రాచీనమైన చరిత్ర కనుమరుగై పోయిందని, బౌద్ద, జైన మూర్తుల కళాఖండాలు, కోమలుల విగ్రహాలు వంటివి శిల్పవిధంసములై మాయమై పోయాయని, మౌనంగా ఉండటం నీకిది ధర్మమేనాని నిందాస్తుతిలో ప్రశ్నిస్తాడు. లేరే అర్థ నిమిలితాక్షులు శీలా లీలా కళా ఖండముల్ /వారేరయ్యా తదీయ ధర్మ నిరతుల్ వాక్సత్య సంశోధితుల్ అంటూ ఆరవ పద్యంలో ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేస్తాడు.
రాజన్న రాజగోపురాలను పరమేశ్వర స్థానంగా, సుమహోహరంగా వర్ణించడంలో కవి తన నేర్పరి తనాన్ని, స్థానీయతను ప్రదర్శిస్తాడు. అదిగో చూడు మహోర్ధ్వ లోక మదిగో, ఆనంద సంధాయక/మదిగో, వేదమహర్షి దర్శిత మహామంత్ర ప్రభావమ్మదే/ అధిగో బ్రహ్మ మురారి ముఖ్య సురులే యాశించు భవ్య స్థల/ మదిగో చూడుము రాజగోపుర మదే, మాహేశ్వర స్థానమిదే|| పూర్తిగా దేవాలయ వైభవాన్ని ఇలా చెబుతాడు. ఆ దేవాలయ శిల్పముల్ శిఖరముల్, కోడెమొక్కుల విధం, ధర్మకుండపు జలం, భవ్య గర్భాలయ ఆ దివ్యోజ్జ్వల రాజలింగని మదిన్ తలుతున్ అని చక్కటి దైవీభావ అనుభూతికి లోనై చెబుతాడు. ఆలయంలోని ఒక పక్కగా పేర్చి యున్న కోటిలింగాలను 19వ పద్యంలో ఇలా చెబుతాడు. ఏ రాజన్యులు పేర్చిరో, ఏ రుష్యాదుల ఊహయో నిల్పిరి దివ్య లింగ వితతిన్ అంటూ కవితాధారలో అభిషేకిస్తాడు. క్షేత్ర స్థలపురాణాన్ని, వేములవాడ చాళుక్యుల చారిత్రక పాలనను సమ్మీళితం చేస్తూ పద్యాలు భావబందురతో రాయడం కనిపించింది. తొలి చాళుక్యపు రాజరాజు ఇచటనే తోయంబునన్ స్నాతుడై గనినట్టి రాజమూర్తియని దక్షిణామూర్తి లింగ వర్ణనలో 28, 83వ పద్యాలలో చెబుతాడు. విరాన్మూర్తి రాజలింగాన్ని ద్వాదశ జ్యోతిర్లింగాలలో, పంచభూత లింగాలతో మయమైన లింగంగా పోలుస్తూ వర్ణించి చెప్పే విధానం, కవి జ్నాన సంపన్నుడై, ఎంతగా శివభక్తిలో తాదాత్యం చెందాడో అర్థమవుతుంది. కాశీనాథ విశ్వేశుడై వెలిశాడని, శివ గోకర్ణ, కాళహస్తీశ్వరుడై, భువి రామేశ్వరుడై, చిదంబర పురీ వాసుడై,హేమాద్రి పురాన వెలసిన కేదారేశ్వరుడై ఇట అమరనాథేశ్వరుడు భాసిల్లుతున్నాడని స్తుతిస్తాడు. పదమొక పద్యమయ్యె శివపాదపు పీఠిక నాశ్రయించి సొంపెదిగిన వాక్యముల్ విమల బిల్వ దళంబుల రూపమెత్తగా పదపద భావముల్ చెలగి పారినాయని 54 వ పద్యంలో కవి తన్మయుడై పోతాడు. అమ్మవారైన తల్లి శ్రీరాజరాజేశ్వరీ దేవి గూర్చి 74,75,77,79 పద్యాలలో రసరమ్యంగా స్తుతించారు. కల్లోలముల్ బాపు నట్టి భవ లోకానంద స్తోత్రముల్/ ఉల్లమ్మంతయు నిండె విశ్వజననీ, ఉద్యప్రభా రూపిణీ అని కీర్తిస్తాడు. ఇది ఒక రాజపీఠ మనే శక్తి పీఠమని, ఇందుకు గ్రంథాల్లో ఆనవాళ్ళు లేకున్నా తల్లి పాదముల వద్దే కాసేపు నిలిచినట్లయితే నిజం తెలిసి పోతుందని తన్మయుడవుతాడు. శ్రీ రాజేశ్వరి పాద పద్మ యుగమా, శ్రీ చక్ర స్థానమేనని, ఒక మణీద్వీపమని శక్తి స్వరూపాన్నిసుందరంగా ఆవిష్కరిస్తాడు. చల్లని తల్లివమ్మ హరిచందన చర్చిత చారుగాత్రివే, చల్లని చూపులున్న సిరి జల్లుల వెల్లి వరాల తల్లివే||అని ప్రార్థిస్తాడు.
లోకవిదితమైన బాధలను పేర్కొంటూ, కక్షలు శిక్షలు శివుని కాలిగోటిని తాకగలవా ప్రశ్నిస్తూ కోపతాపాల శివశివా అని 62వ పద్యంలో చెబుతాడు. సదముల భక్తి భావనయు, సంచిత పుణ్య ఫలార్ధ సంపదన్/ శైవ వైభవ రసామృత పానపరాయణత్వమున్/ధర్మ తత్పరతలు, సద్గుణ శీలతలు, సత్యనిష్టతలు శివ సన్నిధిని చేరే యోగ్యతలని 63వ పద్యంలో యదార్థత భక్తి చింతనను అరటి పండు ఒలిచి పెట్టినట్లు చెబుతాడు. బ్రాహ్మణార్చకుల గూర్చి 91వ పద్యంలో జట ఘన చెప్పగల్గెదరు, చారు మనోజ్న సువర్ణ సంపుటముల వోసినట్లే ఇక్కడి వేదభూమిలో శ్రుతులు వినిపిస్తాయని కడు రమ్యంగా చెబుతాడు. 123లో బ్రాహ్మణుల అగ్రహారంగా మహాగ్రపురమై వేములవాడ భాసిల్లిందని చెబుతాడు. దేవాలయం ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్కృత విద్యాలయం గూర్చి 116,117, 118 పద్యాలలో జిజ్నాసతో వర్ణిస్తాడు. ఘన సంస్కృతాలయము, నచ్చట నేర్చిన విశేష పూర్వ పుణ్య ఫలములేనని, ఇది ఒక శిపప్రసాదమేనని, వేద ప్రాజ్నుల బోధనల వల్ల అవధానులు, కవులు, కళాకారులెందరో తయారయ్యారని వర్ణిస్తాడు. నాదోపాసకులర్థ శాస్త్ర విభుధుల్, నాట్య ప్రవీణుల్, వాచక చతురులు వర్థిల్లినారని అంటాడు. ఒక శివ సుప్రభాత, ఒక శతక కావ్యంగా కూడా ఈ రచనా శైలి శివభక్తితో నిండిపోయిందని చెప్పవచ్చును. రాజన్న ఆలయంలో ప్రత్యేకంగా విశిష్ట శివమహా లింగార్చన గూర్చి 76లో చెబుతాడు. మన్నును సంస్కరించి పరమాధ్బుతమౌ శివలింగ విగ్రహా/లన్నియు పేర్చి నొక్కసుకళాకృతి తీర్చి మహేశ లింగమున్ అని వర్ణీస్తాడు. పర్యావరణ విహితమైన రావి చెట్టు, అశ్వత్థ వృక్షాల వర్ణనలు 8.9 పద్యాలలో కానవస్తావి. ఇవి గత కాలపు తీఫి గుర్తులని, చాళుక్యరాజుల సంపదలకు ప్రతీకలుగా నిలిచాయని అంటాడు. 16,17 పద్యాలలో దేవాలయంలోని గండాదీపాన్ని స్తుతిస్తూ, కవి తాత్విక చింతనలు అద్ది చీకటి లోకంలో ఉన్న జనజీవనులకు, ఆకలి చీకట్లు నిండిన లోకానికి, దినదిన గండంగా బతుకుతున్న ప్రజలను పవిత్ర జీవనులుగా మార్చడానికి వెలుగు రేఖలను ప్రసరింపజేయాలని కోరుతాడు. . అనుబంధ రచనల్లో రాజరాజేశ్వర కరావలంబ స్తోత్రం, దండకం, అక్షరార్చన, స్తుతి పంచకంతో సహా శ్రీరామచంద్ర కరావలంబ స్త్రోత్రాన్ని చేర్చి తన భక్తి ప్రపత్తులను వేములవాడ వైభవంలో పొదిగి పునీతుడయ్యారు. ఉపయుక్తమైన ఫోటోలు చేర్చి పద్యాలకు సొగసులు చేర్చారు.