తెలుగు సాహిత్యలోకానికి సుపరిచితమైన పేరు. కవిత్వపరంగా చాలా తక్కువ కాలంలోనే చాలా వేగంగా అందివచ్చిన తెలంగాణ పల్లెటూరి పిలగాడు. వస్తురూప కవిత్వం రాసినా, కవిత్వంలో మోడ్రన్ ఎక్స్ ప్రెషన్స్, పదజాలం వాడినా, మనిషిలోని ఉక్కపోతను కవిత్వం చేసినా అతని శైలి దినదిన ప్రవర్ధమానం. మూస ధోరణి శిల్పాల్ని బద్దలు గొట్టుకుంటూ కవిత్వాన్ని మెరపెడుతున్న గౌండ్లోల్ల పోరడు. గౌడ వృత్తిని వారసత్వంగా తండ్రి అందుకోకపోయినా, మనువడిగా తాత ముత్తాతలను తల్సుకుని తాటికమ్మలపై కావ్య కన్యని నాట్యమాడిస్తున్న గీశిగాడు తండ హరీష్ గౌడ్.
ప్రతి కులానికి ఒక వృత్తి నేపథ్యపు తాలూకూ జీవితముంటుంది. వృత్తి పురాణం వుంటుంది. కులదైవం ఆరాధ్యుడుగా కొనసాగుతుంటాడు. అట్ల గౌండ్ల కులస్తులకు కాటమయ్య. కవి నోస్టాల్జియా నుంచి పుట్టికొచ్చిన కవిత్వం కొంతయితే, సమాజాన్ని నిశితంగా పరిశీలిస్తున్న వాడిగా ఎదుగూ బొదుగూ లేని గౌండ్ల బతుకును చూసి చలించిన మనసుతో కొంత కవిత్వం రాసినట్టు ‘వంకతాడు’ దీర్ఘ కవిత చదివితే మనకు అర్థమయితది.
కాటమయ్య తండ్రికి కల్లుసాక ఆరబోసి ‘వంకతాడు’ కల్లు రుశి జూడ వనంలోకి కదులుతుంటాం. 20 భాగాలుగా సవురిచ్చిన పొందికైన ‘కల్లు పటువ లెక్క అవుపిస్తది. మఖ్యంగా ఈ విభజన తన సౌలభ్యం కోసమే ఏర్పాటుజేసుకున్నట్టు అనుకోవచ్చు. చదివించే గుణం మెండుగా వున్న కావ్యం అవటం వల్ల తాటికమ్మపై పడ్డ నీరా బొట్లు గొంతు తడిపి కడుపు సల్ల జేసినట్టు తృప్తిని అనుభూతి చెందుతాం. ఈ దీర్ఘ కవిత కవి ఎంచుకున్న వస్తువు యొక్క సకల పార్శ్వాలను తడుముతూ భవిష్యత్తు కార్యాచరణకు పురికొల్పే దిశగా కొనసాగటం మనం గమనిస్తాం.
గౌండ్ల వృత్తి కారుల వేషధారణ, తాటి, ఈత వనాల్లో ఎదురయ్యే ప్రమాద సూచికలు, ఆటంకాలు, వివిధ రకాలుగా పేర్లు పెట్టబడ్డ చెట్లు, చెట్టెక్కడం, కల్లు తీయడం, కల్లు ఒంపడం, మండవ కాడి తతంగం, అతారెలు(పనిముట్లు , ఆయుధాలు), కల్లు అమ్మటంలోని కష్టాలు, తాటి ఉత్పత్తులైన ముంజలు, తాటిపండ్లు, గేగులు, కమ్మలు; గౌండ్లు పడే నిందలు- అసలు నిజాలు; ప్రపంచీకరణలో గౌడన్న జీవితం, బతుకు దైన్యం, గౌడతల్లుల గోస, వృత్తిలో స్త్రీ పాత్ర, వారి శ్రమ, వాడికదార్లు, కొత్తల(పైసల) రాకటపోకట, గతం, వర్తమానం, భవిష్యత్తు – కొత్త తరానికి దిశానిర్ధేశం చేయటం, కర్తవ్యబోధ, రేపటిపై ఆలోచన కల్గించటం, కార్యాచరణకు సంసిద్ధ పర్చడం – ఆధునిక జీవితం దిశగా వేసే అడుగుల అలికిడి మొ.న పలు పార్వ్వాలు ‘వంకతాడు’ ను ఒక్కొక్క జంగ ఎక్కుతాంటె తారసపడి ముచ్చట పెడుతాంటయి.
ప్రతీ వృత్తి కార్మికునికి తనవైన పనిముట్లు (అతారెలు) వున్నట్లే, గౌడ వృత్తి కార్మికులకు సుత కొన్ని అతారెలు వుంటయి. ఒక్కొక్క అతారెకు ఒక్కో ప్రాధాన్యత వుంటుంది. మోకు, ముత్తాదు, గుజి, పిల్లబద్ద, నెరుసు రౌతు, గీతకత్తులు, కావడి బద్ద, మండువ, పటువ, బుడ్డి, లొట్టి, కుండ, మెర, నాగ, పాట, బుచ్చ, నీరా, పోద్దాడు, పరుపుతాడు, పండుతాడు, కర్రపుల్ల, నాపతాడు, సప్పశేదు,నలుసు, మోదుగాకు, మర్రిఆకు, పొందిచ్చుడు, నురుసు, మొర్రి, మొదలు, బింకీలు, ముంతలు, పట్టు, దమ్ము, కమ్మ, ర్యాక, చెలుగుడు,మడ్డి, మట్ట మొ.న పదజాలం గౌడులు నిత్య వ్యవహారికంలో వాడుతుంటరు.
*
‘నెరుసు’ను తెల్లని మల్లెపూలతో, గౌడన్ననే ‘కాటమయ్య’ అనడం; మోకు, ముస్తాదులను ఉదయం, సాయంత్రాలతో; తాడిచెట్టును
నిలువెత్తు నల్లనిరంగు రోడ్డు అనటం(metaphor); తాటిచెట్లను కన్నబిడ్డలతో, కల్లును దూదితో; కల్లు తీయటం సులువుగా నీళ్లు తాగటంతో ఔచిత్యవంతమైన పోలికలు చెప్పడం కనిపిస్తుంది. గీతవృత్తి అనేది తాళపత్ర విద్యగా, 65వ కళగా, గీత శాస్త్ర నిపుణతగా కవి రాతల్లో చెప్పబడింది. పారుతున్న ఏటి ఒడ్డున దొరికే నూరుగంటి రాయినో, పలుగు రౌతునో పట్టుకొచ్చి కత్తులను మెత్తగా నూరడానికి మెత్తని పౌడరసొంటి పొడిని తీస్తరు. దీన్ని నెరుసు!’ అంటరు. కొంచెం కొంచెం పిల్ల బద్ద మీద వేసుకుంట కత్తులు నూరుతరు.
నురుగు కల్లును తెల్లని నదిగా, మనసు గాయాలకు పూసే మందుగా, గౌడన్నను లోకాన్ని గిర్రున తిప్పే చక్రంగా వర్ణిస్తాడు. తాడెక్కడంలో ఎంతటి ఒడుపుతనం వుండాలో, కల్లు ఒంపడంలో అంతటి నేర్పరితనం సుత వుండి తీరాలి. ఆకుపట్టి దమ్ముపట్టడం ఒక కళ. మర్రి ఆకు, మోదుగాకు, పాట, ర్యాక యిలా ఒక్కో దాన్ని ఒక్కోతీరు వాడటం పరిపాటి. మర్రి ఆకుల కల్లుతాగుతే రిమ్మ వత్తదంటరు. మోదుగాకును సుట్టాకు అని సుత అంటరు. ర్యాక అనేది తాటాకు కమ్మజీరి ఒకింత నైపుణ్యంతో చేసి ఇచ్చేది. చిన్న పిల్లలు తాగటానికి సులువైనది. పట్టుకుంటే పడవలెక్క, తాగుతాంటే కడుపు సల్వ అంటుంటరు. ‘పాట’ వీటన్నింటికీ భిన్నమైనది. ఇది తాటిచెట్టులోని భాగమే. గీత గీయడానికి ముందు చెట్టును సాపు జేత్తానికే గొలను చెలుగుతుంటరు. కల్లు గీశినంక కుండల కల్లు పటువల పట్టుకరాంగనే ఒంపుతే అందులోని మలినాలు అట్లనే వుంటయి. అందుకే ఫిల్టర్ జేయడానికి ‘బుచ్చ’ వాడుతరు. మర్రి ఆకును పొట్లంగట్టినట్టు మల్శి అందులో తాటి పీచును బెట్టి కల్లు వంచుతరు. గశి, నుశి,నలుసు, మడ్డి,మలినం ఏదైనా సరే అందులోనే ఆగుతది. ఇక స్వచ్ఛమైన కల్లు సర్రున బొండిగ జారుతది. కల్లు తాగే చోటును ‘మండువ’ అంటరు. రోజూ తాగే వారిని వాడికదార్లు అని, వారికి పోసే కల్లును ‘వాడిక’ అని అంటరు. వీళ్లు నెలకో, సంవత్సరానికో ఒకసారి ధన రూపంగానో, ధాన్యరూపంగానో ‘వాడిక’ పైసలు ఇస్తుంటరు. గౌడ్ అన్న కల్లు పోసిన గుర్తుకోసం బొగ్గు ముక్కతో గీతలు గీసుకునేటోడు. కల్లు బాగా పారుకం ఉన్న రోజుల్లో మూడు మాట్ల తాడును ఎక్కుతుంటరు. అట్లా రోజుకు మూడుసార్లు గీయటం వల్ల కల్లుకు తీపిదనం వత్తది. అట్ల వచ్చిన తీపిదనపు కల్లును ‘వడగల్లు’ అంటరు. దీన్ని సాధారణంగా రాత్రి బాగా పొద్దుపోయినంక తీస్తరు. దీన్ని ఎక్కువమంది చాలా ఇష్టంగా తాగుతరు. వడగల్లు తాగితే పెయ్యంత గుమ్ముగుంటది. మనసంతా తేలిక అయితది. వడగల్లు దొరికినోడు అదృష్టవంతుడని సుత చెప్పుకుంటరు. ఇట్లా మూడు మాట్ల ఎక్కే క్రమంలో తిండి మీద ధ్యాస ఉండదు. ఎండనక, వాననక కల్లు గీయడం, నల్లకట్టెబడి పోవడం వెనుక కవి ఆంతర్యం ఇదే అనిపిస్తది.
గౌడ్ అన్న వ్యక్తిత్వం గురించి చెబుతూ ‘పిట్ట మనసు నీది’ అంటాడు కవి. చెట్టును గుండెకాయగా, దైవంగా కొలిచే కాటమయ్య తండ్రిగా భావిస్తాడని చెబుతాడు. ‘సుట్టమొస్తే ఊరంతా పండుగ చేస్తవు’ , ‘గూడున్నంతవరకే ముడుసుకుంటవు’ వంటి స్టేట్మెంట్స్ ‘విరోధాభాస’గా ధ్వనిస్తాయి. అట్లనే తీయటి మాటలు చెప్పడం, మాటలతో కోటలు కట్టడం రాని వ్యక్తిగా అభివర్ణించడంలో ఎవ్వరినీ మోసం చేయనితనం, నిజాయితీగా బతికే వ్యక్తిగా గౌడ్ అన్నను చిత్రీకరించడం చూస్తాం. ఇందుకు విరుద్ధమైన మనుషులు కూడా సమాజంలో, మన నిజ జీవితంలో తారసపడొచ్చుగాక! ఒక్క చుక్క విషం పాలలో కలిసినా మొత్తం విషమనే చెబుతాం కదా! “పుట్ట మొదట్ల మొక్కి చెట్టెక్కడం” అంటే పుట్టలోని పాములకు హాని చేయకుండా మొక్కి తన పని తాను చేసుకుపోతాడని, ఇతరులకు కీడు చేయని మనస్తత్వం అని చెప్పడం ఇందులోని భావంగా గ్రహించవచ్చు.
సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకుంటూనే గౌడవృత్తిని కొనసాగించేవారు ఉంటారు. కేవలం కల్లు గీయడం ద్వారానే పూట గడవదు. మూడు నాలుగు నెలల కంటే ‘కల్లు సీజన్’ ఎక్కువ ఉండదు. కల్లు పారని సమయం కొంతైతే, కల్లు పారినా వర్షం పడటం వల్ల పనికి రాకుండా పోయే కాలం వెరిసి గౌడ్ అన్న జీవితం దుర్భరం. కల్లు లేని కాలంలో మళ్లీ ఏదో ఒక పని వెతుక్కోంది…పూట గడవని పరిస్థితి. అందుకే “ఒక్క రోజు కూడా నాకా పెట్టవు” అంటాడు కవి. అంటే ‘పని ఎగ్గొట్టకపోవడం’ అని అర్థం. ఇగ కట్టలు కట్టలు కూడబెట్టుకునే స్థితి ఎక్కడుంటది?
‘నైరాశ్యం, ఊపిరాడనితనం, దుఃఖం, నిస్సహాయత’ మొదలైనవి ప్రపంచీకరణ నేపథ్యం లో గౌడన్న స్థితిగతుల గురించి చెప్పడానికి కవి వాడుకున్న పదజాలం. ఇవన్నీ నెగటివ్ సెన్స్ లో ఉన్నవే. విషాదాన్ని చెప్పడానికి పనికొచ్చేవే. కాళ్లకు గుజి బంధమేసుకుని, మోకుతో తాడిచెట్టును అమురుకుని ఎగబాకుతున్నట్టు కనిపించే దృశ్యం ఆహా! అనిపించినా, తన గుండె మాటున దాగిన వేదన మాత్రం అతడికే తెలుసు. అయితే ఈ క్రమంలో ఒంటిమీద, కాళ్ళ మీద, చేతుల మీద కాయలు కాసిన గుర్తులు కనిపిస్తాయి. ఇవి గౌడ వృత్తి కార్మికునికి తరతరాల వారసత్వపు ఆనవాళ్లు. అందుకే కవి”ఎంతెత్తు చెట్లెక్కినా జీవితపు మెట్లెక్క లేని నిస్సహాయతల పొగ పచ్చబొట్టు పొడిపించుకున్నట్టు కాళ్లకు చేతులకు బర్రలు తప్ప మిగిలిందేముంది?” అని ప్రశ్నిస్తాడు. అంతలోనే వాడికదారుల నవ్వుల మాటలు వింటాంటే “మనిషితనం నిటారుగా నిలబడ్డట్టున్న వెన్నెముకను తొడుక్కునేది,” అనే ఆశాభావాన్ని సైతం ప్రకటిస్తాడు. నెత్తురు నెరుసుడు తప్ప గొప్పగా ఏం మారలేదని వెంటనే ఉద్ఘాటిస్తాడు.” ప్రపంచకమంతా ఆకుమీదుగా గొంతులకు జారే” సన్నివేశాల్ని ఒడిసి పట్టుకుని కల్లు మండువే ఇంటికాడ రచ్చబండ అయ్యే తీరును పదిల పరుస్తాడు.
గౌడ్ అన్న బతుకు గాలికి పెట్టిన దీపం అని వేరే చెప్పనక్కర్లేదు. గతంలో గౌడ తల్లులు, ఆడిబిడ్డలు తాడిక్కబోయిన భర్త ఇంటికి తిరిగి వచ్చేవరకు ‘తాళిబొట్టు’ తీసి పక్కన పెట్టే వారట. పైలంగా ఇంటికి చేరుకున్నాకే తిరిగి మెడలోకి చేర్చుకునే వారట. జీవితంలో కష్టసుఖాల్లో సగభాగం పంచుకునే అవ్వలు మండువకాడ, కల్లు అమ్మబోయినకాడల్లా ఎన్ని దెప్పి పొడుపులు, సూటిపోటి మాటలు, పరాశికపు సరసాలు,బనాయుంపులు ఎన్నింటినో భరించేటోళ్లు. ఇసువంటి దినదిన గండం బతుకులు ఎట్లా నెట్టుకొచ్చిన్రో కవి సూఛాయగా చెబుతాడు. ఒకలకొకరు పక్కన నిలబడబట్టే మరో తరానికి బాటపడ్డదనే నిజాన్ని బట్ట బయలు చేస్తాడు. “కల్లు ఒంపి నలుగురి దూప తీర్చే ఆ చేతులే లేకుంటే శ్రామిక సూర్యుడు ఏ దిక్కుకు నడిచెళ్ళేవాడో” అని శ్రమకు పట్టం కడతాడు. ‘స్వరాలముల్లె, ఉద్యమ గొంతుక, మకుటం లేని మహారాజు’ వంటి ప్రతీకలతో తాడి చెట్టు ఎక్కిస్తాడు. కల్లు అమ్మే కష్టాలు చెబుతూనే మూడు కన్నుల చందమామలైన ముంజలను నోటికి అందిస్తాడు. బహుజన వృత్తి కులాలకు నపరింత ముంజల రుశిని చూపెడతాడు. ‘ముంజల దేశానికి అధిపతివని, ఎండాకాలం పూట చల్లని ప్రిస్క్రిప్షన్ రాసే నాడీ శోధకుడివి’ అని వెన్నెల ధారాన్ని కురిపిస్తాడు. కవి రాతల్లో గౌడ్ అన్న దేవదూతవుతాడు. తాడిచెట్టు దేవతా వృక్షం అవుతుంది. కల్లు అమృతమై కురుస్తుంది. తాటి ఉత్పత్తులు చిన్నపిల్లలకు ఆట వస్తువులైన తీరును చూపెడతాడు. నాలుకలను ముత్తాదుకు ముడి వేసుకోవడం, తాడిచెట్టు ఉన్నంతకాలం గౌడ్ అన్న పేరు వినబడుతూనే ఉంటదని చెప్పటం అద్భుతం అనిపించకమానదు.
గీత వృత్తి కార్మికులు కాలక్రమంలో బతుకుదెరువు కోసం వలసలు బోతున్న వైనాన్ని చెబుతూనే మరోపక్క”మరో చెట్టు పుట్టుక కోసం మట్టలను చెలుగుతూనే ఉంటవు”వంటి వృత్తి ధర్మాన్ని తలకెత్తుకునే వాక్యాల్ని సైతం పఠింప చేస్తాడు. ప్రభుత్వ పథకాలు ఏమేరకు దోహదపడ్డాయో, ఓట్ల పండుగప్పుడు ఏ విధంగా చర్యలో పాల్గొనే ఉద్వేగ పూరిత ఉత్ప్రేరకాలు అవుతున్నారో తెలుసుకోమంటాడు. పిల్లల భవిష్యత్తుకు ఇకనైనా మంచి కార్యాచరణ పథకం రచించుకోమని చెబుతూ- ఉన్న అవకాశాల్ని వినియోగించుకోవాలని, రాజకీయంగా ఎదగాలని, స్ఫూర్తిని రగిలించిన” సర్వాయి పాపన్న” వారసత్వాన్ని పున: ప్రతిష్ట చేయాలని, అందుకు బహుజనులందర్నీ ఒకే తాటిపై నిలుపాలని, భావి చరిత్రకు కొత్త పేజీని అందివ్వాలని, ధైర్యాన్ని నూరిపోసే, జాగృతం చేసే కవి హితబోధ విజయవంతం కావాలని కోరుకుంటూ “లెమ్మనంగనే పిలుపందుకునే ‘వంకతాడు” కు ప్రణమిల్లుతూ శనార్తులు.
Author
Bhandari Rajkumar
Bhandari Rajkumar
పేరు : బండారి రాజ్ కుమార్ పుట్టిన ఊరు : పాత మగ్ధూంపురం, చెన్నారావుపేట మండలం, వరంగల్ జిల్లా వృత్తి : సెకండరీ గ్రేడ్ టీచర్ రచనలు: 1) గరికపోస (వచన కవిత్వం)-2010 2) నిప్పు మెరికెలు(తెలంగాణ మలిదశ ఉద్యమ కవిత్వం)- 2013 3) గోస (వచన కవిత్వం) - 2016 4) వెలుతురు గబ్బిలం (వచన కవిత్వం) - 2018 5) తెలంగాణ కవి ముద్ర ( విమర్శ) -2023 పురస్కారాలు: 1) భారతీయ భాషా పరిషత్ యువ పురస్కారం - 2018 2) తెలంగాణ సారస్వత పరిషత్ విమర్శ పురస్కారం-2024 3) మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్ ఉత్తమ విమర్శ పురస్కారం- 2024 4) తెలంగాణ హరిత కవిత, ఎక్స్ రే, రాధేయ, రంజని కుందుర్తి, ఫీవర్స్ ఫ్రంట్ ఉత్తమ కవితా పురస్కారాలు 5)) శ్రీశ్రీ స్మారక, బండారు సదాశివరావు, సంచిక- అమృత లత, పాలపిట్ట- అమృతలత, ముట్టూరి కమలమ్మ కథల పోటీల్లో బహుమతులు
