తెలుగు సాహిత్యంలో ఎన్ని ప్రక్రియలు వచ్చినప్పటికీ పద్య ప్రక్రియకు ఉన్న ప్రాధాన్యతనే వేరు. వేమన, సుమతి, కుమారా, కుమారీ, నరసింహ, దాశరథి మొదలైన శతక పద్యాలు నేటికి ప్రజల నాలుకలపై నాట్యమాడుతున్నాయంటే కారణం, ఆ పద్యాలకున్న ధారాశుద్ధి ధారణా శక్తి, ఆ శతక కర్తల రచనా పఠిమ, శైలి గొప్పతనాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆధునిక కాలంలో కూడా శతకాలు రాసే కవుల సంఖ్య మరీ తక్కువనేం చెప్పలేము. ఎక్కువ మంది రచయితలు మాత్రం వచన కవిత్వం వైపు మొగ్గుచూపుతున్న మాట నిజం. తెలుగు భాషోపాధ్యాయులు కూకట్ల తిరుపతికి కూడా 2005లో వెలువడిన “మేలుకొలుపు” వచన కవిత్వ గ్రంథమే, మొదటగా కవిగా, రచయితగా మంచి గుర్తింపును తెచ్చింది. ఆ తర్వాత 2006లో పద్య ప్రక్రియలో “శ్రీ చదువులమ్మ శతకము” ను తీసుకొచ్చి, పద్యకవిగా సాహితీ లోకాన్ని మెప్పించారు.
కూకట్ల తిరుపతి వృత్తి రీత్యా ఉపాధ్యాయుడైనప్పటికీ సాహిత్యాన్ని తన ప్రవృత్తిగా మలుచుకొని అనేక రచనలు చేస్తున్నారు. సామాజిక ఉద్యమాలలో పాల్గొంటున్నారు. సాహిత్య సంస్థలకు బాధ్యులుగా పలు సాహిత్య కార్యక్రమాలను జరుపుతున్నారు. తెలుగు భాష ఉపాధ్యాయునిగా పిల్లలకు తరగతి గదిలో పాఠాలు బోధిస్తూనే, వారి కొరకు ఒక యూట్యూబ్ చానల్ ను తన పేరుతోనే ఏర్పాటు చేశారు. అందులో తెలుగు భాషా మూలాల్లోకి వెళదాం అనే పేరుతో భాషా వివరణలు, అన్ని తరగతుల తెలుగు వాచకాలలోని పద్యం, పాట, గేయం, వచన పాఠాల పఠనాలు, వ్యాకరణాంశాల విశ్లేషణలతో పాటు సాహిత్య అంశాలను సైతం సమాహారంగా అందిస్తున్నారు. ఈ సమాజాన్ని చక్కజేయమంటూ, జ్ఞాన ప్రదాయిని చదువులమ్మను వేడుకుంటూ కూకట్ల తిరుపతి “శ్రీ చదువులమ్మ శతకము” రాయడమనేది గొప్ప విశేషంగా చెప్పవచ్చు. భారత దేశానికి, ప్రపంచానికి శుభం చేకూరాలని రాసిన తీరు ఆకర్షణీయంగా ఉంది. పిల్లలకు స్ఫూర్తిదాయకంగా, నైతికతను బోధించేలా ఉన్నది. సమాజంలో నానాటికీ మారుతున్న విలువలు, చెదిరిపోతున్న బాంధవ్యాలు, మసకబారిపోతున్న మానవత్వం, అంతరించి పోతున్న సంస్కృతీ సంప్రదాయాల పట్ల ఈ శతకంలో తిరుపతికవి ఆందోళన కనపడుతుంది.
“చక్కజేయు మమ్ము! చదువులమ్మ!” అనే మకుటంతో కూర్చిన ఈ శతకంలోని పద్యాలన్ని అన్ని వర్గాల పాఠకులకు అర్థమయ్యేలా, ఆకట్టుకునేలా, ఆలోచింప చేసేలా ఉన్నాయి. ఇందులో వర్తమాన సామాజిక స్థితిగతులను చక్కగా వివరించారు. వస్తుగతమైన నూట పద్దెనిమిది ఆటవెలది పద్యాలతో అందమైన హారాన్ని చదువులమ్మ మెడలో అలంకరించారు. శతక రచనా సంప్రదాయ పద్ధతిని పాటిస్తూ, “శ్రీ సరస్వతమ్మ శీఘ్రము రావమ్మ” అంటూ తొలి పద్య పాదాద్యక్షరాన్ని శ్రీకారంతోనే మొదలుపెట్టారు కవి. అలాగే విఘ్నేశ్వర, సరస్వతి, ఇష్ట దేవత, గురు, తల్లిదండ్రుల స్తుతి పద్యాలను సంప్రదాయ శతక లక్షణాలలో భాగంగా శతక కర్త పొందు పరిచినట్లు భావించవచ్చు. కవి వంశావళి, ఫలశ్రుతిని సీస పద్యాలలో అందించడం ప్రాచీన శతక రచనా పద్ధతి అయినప్పటికీ, శతక పద్యాల ఇతి వృత్తాలన్ని అత్యాధునిక కాలానికి చెందినవి కావడం గమనార్హం. విద్యకు సంబంధించిన అనేక అంశాలతో పాటు తల్లి పట్ల, తల్లి భాష పట్ల, నేలతల్లి పట్ల తన ప్రేమాభిమానాలను చాటుకున్నారు.
ఈ పద్యంలో…
“మాతృమూర్తి కంటె మమకారమేదయ్య/
మాతృభాష కన్న మధురమేది/
మాతృభూమి యెన్న మకుటాయమానంబు/
చక్కజేయు మమ్ము! చదువులమ్మ!”
అంటూ తల్లిప్రేమను మించిన ప్రేమ లేదనీ, తల్లిభాషను మించిన తియ్యదనం లేదనీ, జన్మభూమికన్న గొప్పది ఏదీ లేదని చెప్పారు. ఈ పద్యం ద్వారా పిల్లలలో మాతృభక్తి, మాతృభాషా ప్రేమను, మాతృదేశ భక్తిని పెంపొందింపచేయవచ్చు. ఏ వ్యక్తికైనా ఇవి అవసరం మాత్రమే కాదు, అనుసరణీయం, ఆచరణీయం కూడా.
“కులమతమ్ములనుచు కుత్సితంబేటికీ?/ మానవతను మించు మార్గమేది” అని నేడు కులమతాల కుమ్ములాటలలో కూరుకుపోతున్న ప్రజలకు మానవతను మించిన మార్గం లేదని హితవు పలికారు. “పరువు తీయుచుండె అరువు సంస్కృతి నేడు/ సంప్రదాయ పథము సన్నగిల్లె…” నని విదేశీ విష సంస్కృతి మోజులో పాల మీగడ లాంటి మన దేశపు సంస్కృతి సంప్రదాయాలు నశిస్తున్నాయని ఆవేదన చెందుతారు. “మైత్రి బంధమెన్న మకుటాయ మానంబు/ ఇచ్చి పుచ్చుకొనుడు యింపుగాను/చెలిమి కంటె మించి కలిమియు సరికాదు” అంటూ స్నేహ బంధాన్ని మించిన బంధం మరేదీ లోకంలో లేదని తన స్నేహ హస్తాన్ని అందించారు.
ఇలా ఈ శతకంలోని ఏ పద్యం తీసుకున్న ఏదో ఒక హితబోధను, అద్భుత ఆచరణను, మానవీయ భావనను కలిగించేదే. ప్రకృతి రమణీయతను, పల్లె పరువాలను కళ్ళకు కట్టినట్టు వర్ణిస్తూ, ఉన్న ఊరు కన్న తల్లి లాంటిదనే మాటను నిజం చేస్తూ, వాటి పట్ల కవికున్న అచంచలమైన ప్రేమను చాటుకున్నారు. అవినీతిపరులైన వారి అంతులేని సంపదను, దోపిడీని వేలెత్తిచూపుతూ, వాటిని అరికట్టాల్సిన అవసరాన్ని వక్కానించారు. దేశభక్తి గొప్పదనాన్ని, జాతీయత వాద అవసరాన్ని, బలంగా వినిపించారు. శాంతి, స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వం, సౌభ్రాతృత్వం లాంటివి ప్రతి ఒక్కరికి దక్కాలని కోరుకున్నారు. అన్నదాతలకు అండగా నిలిచారు. పేద ప్రజలకు సంకటంగా మారిన పెరుగుతున్న నిత్యావసర ధరలను నిరసించారు. వాటిని ప్రభుత్వాలు నిలువరించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ధనిక, పేద భేదాలు తొలిగిపోయి, కులమతాల కుత్సితాలు కూలిపోయి, వర్గ వైషమ్యాలు వదిలిపోయి, ఎలాంటి అంతర దొంతరలకు తావు లేకుండా, సమసమాజ నిర్మాణానికి సహకరించవలసిందిగా చదువులమ్మను వేడుకుంటూ, కూకట్ల రాసిన ఈ శతకం కొత్త లోకపు ఆవిష్కరణకు ఒక మేలుకొలుపు పిలుపు కావాలని కోరుకుంటున్నాను. కూకట్ల తిరుపతి కలం నుండి భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో సామాజిక పరమైన మంచి రచనలు వస్తాయని ఆశిద్దాం.
చదువులమ్మ శతకం
వెల: రూ. 20/
పుటలు: 45
ప్రతులకు:
కూకట్ల లక్ష్మి, ఇం. నెం. 1-29/1,
గ్రా: మద్దికుంట, మం: మానుకొండూర్,
జిల్లా: కరీంనగర్. 505505.
చరవాణి: 9949247591.