“ఈ దమయంతి ఏ మహారాజు కూతురో కాదు… నలుడు నడిరాత్రి నట్టడివిలో వదిలేసి పోయినా పుట్టింటికి పోవడానికి. తల్లిదండ్రులు లేని… తన కుటుంబాన్నే పోషించుకోలేని ఓ నిరుపేద అన్నకు చెల్లెలు. నీకు చెప్పుకునే కారణాలు ఎన్ని ఉన్నా… నాకు ఉన్న ఒకే ఒక్క కారణం… నా బిడ్డల్ని బతికించుకోవడం… బిడ్డల కోసం నేను బతకడమే! పరిస్థితులు, అవసరాలే అన్నీ నేర్పుతాయి. దాచుకోవడానికి నాదగ్గర ఏమీలేదు.” ఓ దమయంతి నిస్సహాయ స్థితిలో తీసుకున్న నిర్ణయాన్ని ఈ మాటలు చెబుతాయి. (మన్నించండి… మరో సారీ)
“నీ దెగ్గిర ఐదేండ్లు సదవతారు పిలకాయలు. వాల్లకు మంచీ సెడ్డా ఇవరంగా సెప్పొద్దా?” తన కొడుక్కు చదువు చెప్పిన ఓ టీచర్ను నిలదీసిన తల్లి. (అందుకో నా లేఖ)
“మరుగు, మరుపు చేస్కోపోతే బతుకు ఎట్టా సాగుతాది చిన్నోడా? సుకానికి ఉన్నా లేకపోయినా… కష్టానికి కాపుకాసే వాళ్ళే కదా అయినోళ్ళు. బాధలో ఉన్నప్పుడు పాత కతలు ఎత్తిపోదిస్తే పెద్దంతరం అయితాదా?” పిల్లలు చేసిన తప్పుల్ని పెద్ద మనసుతో క్షమించేసిన ఓ తల్లి. (ముత్యాల దారం)
“…ఇన్నేండ్లూ మొగుడు, బిడ్డలు, కుటుంబరమే ప్రపంచమని బతికినావు. ఇప్పుడు ప్రపంచాన్ని చూడు వా. నీకోసం నువ్వు బతుకు. నీకు అప్పుడు ఎంత ధైర్యం వస్తాదో చూద్దువు గాని. ఇదో కొత్తబతుకు.” ఎంతో ఆత్మీయంగా, లాలనగా, మృదువుగా, ఓదార్పుగా చెప్తున్న సుగుణ. (కొత్తబతుకు) ఇంతకూ ఆమెకు సుగుణ ఏమవుతుంది? మనిషవుతుంది!
అమ్మా నాన్న విడిపోయినప్పుడు కోర్టులో జడ్జిగారు అడిగినప్పుడు నాన్నతోనే ఉంటామని ఎందుకు చెప్పారా పిల్లలు? అలా అన్నవాళ్లు పన్నెండేళ్ళ తర్వాత తిరిగి తల్లి ఒడిలోకి ఎందుకు చేరారు? (వసంత రాగాలు)
ఆ రోజు కోర్టుకు వచ్చిన వింత కేసు విన్నప్పటి నుండీ జడ్జి గారి మనస్సు నలతపడుతోంది. ఆ కేసు వేసిన వ్యక్తి కాళ్ళు మొక్కాలి అనిపించింది. ఏమిటా వింత కేసు? తను ఎంత భంగపడి పిలిచినా వృద్ధులైన తన తల్లి, సోదరుడు తన వద్దకు రావడం లేదని, వారిని వారికంటే చిన్నవాడు, ఆర్థిక స్తోమతా ఉన్న తాను చూసుకుంటానని… వారిని తనవద్దకు వచ్చేలా చేయమని కేసుపెట్టాడు. (అమ్మను చూడాలి)
“అమ్మా! నువ్విక ఆ మూలగదిలోకి వెళ్ళక్కర్లేదు. ఒళ్ళు నొప్పులు, జ్వరంతో బాధపడక్కర్లేదు. ఇవాళ సాయంత్రమే మన ప్రయాణం. హైదరాబాద్ కే కాదు… స్వేచ్ఛ, ఆనందం నిండిన మనదైన మన ప్రపంచంలోకి.” తల్లికి ధైర్యాన్నిచ్చిన బిడ్డ మాటలు. (మూలగది)
ఈసందర్భాలను చదువుతుంటే జీవితాలను చదువుతున్నట్టుంది కదా. అవును, యం.ఆర్. అరుణకుమారి గారు ముందుమాటలో చెప్పుకున్నట్టు పాపులర్ రచయిత్రి కావాలని రాసిన కథలు కాదివి. జీవితాల్లో ఆప్యాయతా, అనురాగాలను స్పర్శిస్తూ జీవితం పట్ల ప్రేమతో రాసిన కథలు. ‘ఇంగ సెలవా మరి!’ అంటూ ఇరవై ఒక్క కథల గుచ్ఛాన్ని తెలుగు పాఠకులకు అందించారు. ‘ఇంగ సెలవా మరి’ అనే శీర్షికతో ఓ కథ ఉన్నప్పటికీ చాలా కథలకు ఈ శీర్షిక సరిపోతుంది, బహుశా అందుకే పుస్తకానికి అదే పేరు పెట్టుంటారు. ఈ కథలన్నీ మానవ సంబంధాల ఔన్నత్యాన్ని చిత్రిస్తూ రాసినవి.
పెంచిపెద్ద చేసిన తల్లిదండ్రులను పట్టించుకోని సంతానం గురించి మనం చాలా చూస్తుంటాం. కానీ తల్లిని తను చూసుకోవడానికి తన దగ్గరకు రమ్మని కోర్టులో కేసు వేసిన కొడుకు గురించి తెలుసుకోవాలంటే ‘అమ్మను చూడాలి’ కథ చదవాలి. తన తల్లిదండ్రుల ప్రేమను తన స్వార్థానికి ఉపయోగించుకుంటున్న భర్తకు బుద్ధి రావడానికి ‘మీ ఇంటికి పొండి’ అంటూ తల్లిదండ్రులను పంపించిన కూతురి కథ ‘మీ ఇంటికి పొండి’.
జీవితమంతా తనవెంట నీడలా నడిచి, అర్ధాంతరంగా సెలవు తీసుకున్న అర్ధాంగి నీలతో సంభాషణం ‘ఇంగ సెలవా మరి!’ ఆమె ఆదరించిన జనమంతా ఎవరికి వారుగా బతికేస్తుంటే మనుషుల మధ్య ఆప్యాయతలు, అనుబంధాలు ఏమైపోతున్నాయంటూ ఆవేదనతో ఒరిగిపోతాడు. భార్యాభర్తల అపురూపమైన బంధాన్ని ప్రేమకావ్యంగా చూపెడుతుందీ కథ.
ఈ పుస్తకంలో చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన కథలు ‘గూట్లో రామచిలుక’, ‘రెక్కలు చాచిన పంజరం’. స్త్రీ సాధికారతకు గొప్ప ఉదాహరణలీ కథలు. ‘గూట్లో రామచిలుక’ కథలో కుటుంబాన్ని ఆదుకోవడానికి భర్త, అత్తమామల ఒత్తిడితో పసిబిడ్డను వదిలి సౌదీ వెళ్లిన జమున పదేళ్ళ తరువాత తిరిగివస్తే కనిపించిన పరిణామాలతో ఆగ్రహోదగ్రురాలవుతుంది. తన స్థానంలో మరో స్త్రీని, తన రక్తం పంచుకున్న బిడ్డ ఆ ఇంట పనిమనిషిగా ఉండటం చూసి భర్త, అత్తమామల్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టడం పాఠకులకు సంతోషాన్నిస్తుంది.
‘రెక్కలు చాచిన పంజరం’ కథలో భర్త పోయిన జీవమ్మ కొడుకు ఇంటి నుంచి పల్లెకు వెళ్లిపోతానంటుంది. కారణం అడిగిన కోడలికి, కూతురుకు ఆమె చెప్పిన మాటలు కళ్ళు తెరిపించేలా ఉంటాయి. “నాలుగు గోడల మధ్య ఉండాల్సినప్పుడు ఎక్కడైతే ఏమిటి?” అంటూ ప్రశ్నిస్తుంది. వంటింటి నాలుగు గోడల పంజరం… పడకటింటి నాలుగు గోడల పంజరం… మొత్తం ఇంటి నాలుగు గోడల పంజరం…! పంజరమే ప్రపంచం అయిపొయింది స్త్రీకి. కోడలు చదువుకున్నది. ఈ విశాల ప్రపంచంలో స్వేచ్ఛా విహంగం అనుకుంది. కానీ కాదని అర్థమైంది. ఆమె కూడా పంజరంలోనే ఉంది. కాకపోతే ఆమె ఉన్న పంజరం తలుపు థెరిచిఉన్తున్ది. కుటుంబ అవసరాల రీత్యా బయటకు వెళ్ళినా, అదృశ్య కట్టుబాట్లు, ఆధిపత్య ఆంక్షలు, ఊచల్లా ఆమె చుట్టూ దడి కట్టుకునే ఉంటాయి. భర్త బతికినంత కాలం ఆయన అదుపాజ్ఞల్లో భయంతో బతికిన తాను ఇప్పుడు ఆ భయాన్ని వదిలించుకోవడానికి ఆ యింటికి వెళ్ళాలనుకోవడం చాలా గొప్పగా ఆలోచన. ఆ ఇంట్లో స్వేచ్ఛగా తిరగాలని, తనకు నచ్చినట్టు బతకాలని నిర్ణయించుకోవడం చాలా గొప్ప ముగింపు.
అమ్మాయిల ఆత్మవిశ్వాసానికి సంబంధించిన మరో కథ ‘ఏడడుగులు’. తన శరీర ఆకృతిని హేళన చేసిన పెళ్ళికొడుకును తోసిరాజిన ఆధునిక యువతి సుప్రజ కథ ఇది. భిన్నమైన శిల్పంలో రాసిన ‘మూలగది’ కథలో ‘ మగాడు సెక్స్ కోసం ఆడదాన్ని ప్రేమిస్తే, ఆడది ప్రేమ కోసం సెక్స్ ఇస్తుంది’ మాటలు నిజం ,చాలా బంధాలలో.
‘అపురూపమా అందుకో నా లేఖ’, ‘ఉయ్యాల… మొయ్యాల!’ కథలు కొడుకులు కావాలని, చివరికి వారివల్ల భంగపడిన తల్లిదండ్రుల కథలు.
తన జీవితంలో ఎదురైనా విషాదాన్ని దిగమింగుకొని, ‘ప్లీజ్ నాన్నా, నా కొడుకు భద్రం!’ కథగా రూపొందించినట్లు పుస్తకం అట్ట లోపలి భాగంలో రాసిన మాటల ద్వారా అర్థమవుతుంది. ఆమె రాసిన మాటలు, ఆ కథ పాఠకుల హృదయాలను కదిలించివేస్తుంది.
మన జీవితాల్లోని అనేక కోణాలను ఆవిష్కరించే ఈ కథలు కేవలం సందేశాన్ని మాత్రమే కాదు, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి. ఆలోచింపజేస్తాయి. మనిషితనాన్ని ప్రతి కథలోనూ పలికించిన అరుణకుమారి గారు అభినందనీయులు. సుద్దాల అశోక్ తేజ గారి మాటల్లో చెప్పాలంటే ప్రతి కథలో మానవ సంబంధాలను మానవీయ పరిమళ పూమాలగా చేయాలనే సంకల్పం కనిపిస్తుంది. కథలన్నీ చదివాక మనల్ని మనం బేరీజు వేసుకునే ప్రయత్నం చేస్తామనడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఆ రకంగా అరుణకుమారి గారు రచయిత్రిగా సంపూర్ణ విజయం సాధించినట్లు.
- ప్రగతి