మరణం ఏ కాలంలోనైనా ఎంతటి ధీరోదాత్తుడినైనా చలింప చేస్తుందనడానికి మన ప్రాచీన సాహిత్యంలో అనేక ఆధారాలున్నాయి. మరణానికి సమీపమవుతున్నామన్న భావన పండు ముసలి నైనా రోదనకు గురి చేస్తుంది. ఎంతటి తాత్వికుని హృదయమైనా వేదనకు లోనవుతుంది. స్మశాన వైరాగ్యాన్ని నిండా నింపుకున్న వాడు కూడా మరణం మాట వింటే నాలుగు కన్నీటి బొట్లను రాల్చకుండా ఉండలేడు.
“సంసారం జనన మరణ రూపమైనది .పూర్వకర్మవశాన జీవుడు శరీరాన్ని ధరించి దానిని విసర్జించే వరకు కర్మ చేస్తూనే ఉంటాడు .ఆ కర్మ ఫలితంగానే అతడు మరో శరీరాన్ని పొందుతాడు. ఇట్లా జీవుని యాత్ర నిరంతరమైంది . చక్రాకార మైంది.”వంటి ఎన్ని మాటలను చదివినా, జీర్ణించుకున్నా తన వరకు వచ్చేసరికి భయపడి పోవడం మనిషి సహజ నైజం. ఋగ్వేదం, భగవద్గీత ,కఠోపనిషత్తు, భారతం ,భాగవతం, రామాయణం, మరియు అనేక ప్రాచీన, ఆధునిక కావ్యాలతో పాటు సాహిత్యంలోని అనేక ప్రక్రియలలో జనన మరణాల గురించి కవులు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. మానవజాతికి ధైర్యం చెబుతూనే ఉన్నారు.
ప్రసిద్ధ కవి, అనువాదకులు, విమర్శకులు ఏనుగు నరసింహా రెడ్డి రచించిన “తెలంగాణ రుబాయిల”లోని మరణ తాత్వికత నన్ను ఎంతగానో ఆకర్షించింది .
536 రుబాయిల ఈ బృహత్ గ్రంథంలో మరణాన్ని ఎంతో తాత్వికంగా చెప్పడం కనిపించింది. ఈ రుబాయిల ద్వారా పుట్టుక ఎంత సహజమో మరణము అంతేనన్న ఎరుకను కవి మనకు కలిగించాడు. ఏనుగు నరసింహారెడ్డి తన రుబాయిలలో మరణాన్ని గానంచేస్తూ మన అందరిలో ధైర్యాన్ని నింపాడు. పుట్టుకకు చావుకు మధ్య ఉన్న నాలుగు క్షణాలలో సాధించవలసిన కార్యాలపై దృష్టి పెట్టమని బోధ చేసాడు. సామాన్యుడైనా, ఎంతటి మనగాడైనా,లేక ప్రతిభావంతుడైనా మరణానికి తలవంచక తప్పదని తెలిపాడు. “బలమే జీవనం- బలహీనతే మరణం” అంటూ వివేకానందునిలా మనలను జాగృత పరిచాడు. గహనమైన మృత్యు అంశాన్ని సులభమైన శైలిలో వ్రాసిన నరసింహారెడ్డి రుబాయిలు అందరము చదవదగినవి.
“పుట్టిన ఊరును వదలి పోతం
పెరిగిన పట్నము వదిలి పోతం
ముందు వెనకాల ముచ్చటేగాని
నడిచిన నేలను వదిలిపోతం”(155)
పై రుబాయిలో మనకు అర్థం కానిది ఏముంది. పుట్టిన చోటనే మనిషి గిట్టాలని లేదు. పెరిగిన చోట తరగడం కూడా ఉంటుంది ఏనాటికైనా నడిచిన చోటు విడిచిన చోటు కాక తప్పదు. కాకపోతే ఒకరి వంతు ఈరోజు అయితే మరొకరి వంతు రేపు. రేపో మాపో దేహం రూపు మాయక తప్పదనే భావన పై రుబాయిలో కనబడుతుంది.
“రాల చెక్కీ పోతడొకడు బొమ్మ గీసి పోతడొకడు
పుడమి గర్భపు పూలనేరి
కావ్యమల్లీ పోతడొకడు”(178)
పై రుబాయిని చదవగానే నాతో పాటు మీకు కూడా ‘సత్య హరిశ్చంద్ర’నాటకం లోని ‘కాటిసీను’లో ఉన్న “ఇచ్చోటనే” అనే జాషువా ప్రసిద్ధ పద్యం గుర్తుకు రావడం సహజం. శిల్పికి ,చిత్రకారునికి, కవికే కాదు సామాన్యుడి నుంచి అసామాన్యుడి వరకు మృత్యువు దృష్టిలో అందరూ సమానులే . అందుకే యముడిని ‘సమవర్తి’ అని అంటారు. శిల్పి, చిత్రకారుడు, కవి తమ శిల్పాల, చిత్రాల, కావ్యాల ద్వారా శాశ్వతంగా నిలిచిపోతారు. అశాశ్వతమైన దేహం నశించినా శాశ్వతమైన చిరునామాతో వారు లోకంలో నిలిచిపోతారు. అలా నిలవడమే కదా కావాల్సింది.పై రుబాయి నిర్మాణంలో ఏనుగు చూపిన కౌశలం నన్ను ముగ్ధమనోహరున్ని చేసింది.”పుడమి గర్భపు పూలనేరి” అన్న మూడవ వాక్యం 1,2,4 వాక్యాలకు అన్వయం కావడం విశేషం. ‘పోతడొకడు’పద ప్రయోగం ఈ రుబాయిలో అద్భుతంగా కుదిరింది. ‘ఎప్పటికైనా పోయేదే’అనిt మరణం గురించి సాధారణ జనం మాట్లాడుకునే సంగతి అందరికీ తెలిసిందే. జనం నాడిని పట్టుకున్న కవి ‘పోతడొకడు’ అని నిర్దిష్టమైన అభిప్రాయాన్ని ప్రకటించాడు. ఇది ఎంతో సహజ సుందరంగా ఇమిడిపోయింది. సీస పద్యంలో జాషువాకున్న సౌలభ్యం రుబాయి ప్రక్రియలో నరసింహారెడ్డికి లేదు. అయినా ప్రక్రియపై పట్టున్న రచయిత కావడం మూలాన తాను అనుకున్న భావాన్ని తక్కువంటే తక్కువ పదాలలో ఇమిడించగలిగాడు. ఒక ప్రక్రియ మరో ప్రక్రియ లోకి మారడం మన సాహిత్యానికి కొత్తేమీకాదు. పురాణాలు కావ్యాలయ్యాయి.కావ్యాలు నాటకాలైనాయి. నాటకాలు కథలైనాయి.కథలు గేయాలైనాయి. ఇక్కడ పద్యం “రుబాయి” రూపం పొందింది. అద్భుత జనాదరణ పొందిన ఒక పద్యం అత్యాధునిక కవి చేతిలో అంతే జనాదరణ పొందిన మరో రూపంలోకి మారడం ఇక్కడ గమనార్హం.
“కోరుకొని ఇటకొచ్చినామా? మనకు తెలియదు
కోరినంతనే వెళ్ళగలమా? మనకు తెలియదు
నటన బాగా చేయవోయీ! పాత్రధారి
ఎపుడు వేదిక ఎటుల
దిగుదుమొ మనకు తెలియదు”(8)
జీవన రంగస్థలంలో మనం నటీనటులమే. మనకు ఇచ్చిన పాత్రను సరిగ్గా నిర్వహిస్తే అదే పదివేలు. సంచిత పుణ్య పాపకర్మలు మన తదుపరి జన్మకు కారణం అవుతాయని పెద్దలు చెప్తారు. కోరుకున్న జన్మను పొందుతామా… లేదా అనేది మనకు తెలియదు. పోతన కైవల్య పదాన్ని కోరుకున్నాడు. మరుజన్మ లేకుండా చూడమని చాలామంది భగవంతుని ప్రార్థిస్తారు. “మరణం అంటే పునర్జన్మకు సిద్ధం కావడం ” అని అరవిందులు చెప్పాడు. పై రెండు పరస్పర భిన్న అంశాలు.అయినా అవన్నీ మనకెందుకు?. జన్మించాము. లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే మన చేతుల్లో ఉంది. “రాకపోకలు” మన ఆధీనంలో లేవు.
“మట్టి బొమ్మిది నమ్మ బోకండి ఓ మనుజులారా! మాయమైపోతుంది చూడండి” అన్న గేయంలోని తాత్వికత మనకు అర్థం కావాలి. ఏ రూపంలో ఏ దిక్కు నుండి ఎప్పుడు ఎక్కడ మృత్యువు మనలను కబళిస్తుందో తెలియదు. తెలియని దానికి భయపడుతూ రోజూ చావును తలుచుకుని భీతిల్లడం అవివేకమని పై రుబాయి స్పష్టం చేస్తున్నది.
“కొండకు జ్ఞాపకం లేదు లావా జన్మ
మర్రికీ గుర్తుకు రాదు విత్తన జన్మ
మునుపు ఎక్కడో దాగిందో ఈ అంతరాత్మ
అసలు పసిగట్టలేనిదీ పూర్వజన్మ” (26)
“జన్మించిన వారికి మరణం, మరణించిన వానికి జన్మము తప్పదు. కాబట్టి మరణించిన వారి కోసం దుఃఖించకూడదు” అని భగవద్గీత చెప్తుంది. ఇలా చెప్పడంలో పునర్జన్మ ,పూర్వజన్మ అనే భావన ఉంది. లావా పూర్వజన్మ. కొండ ప్రస్తుత జన్మ. విత్తనం పూర్వ జన్మ. మర్రి ప్రస్తుత జన్మ. వాటికి పూర్వజన్మ జ్ఞానం లేదు .వాటికే కాదు. పూర్వజన్మ జ్ఞానం ప్రకృతిలో ఏ జీవజాలానికి లేదు .ఈ సందర్భంగా అరవిందుల వారి మాటలను గుర్తుకు తెచ్చుకుందాం. “మరణమన్నది లేనట్లయితే ప్రాణి ఎల్లప్పుడూ ఒక రూపంలో ఉంటుంది. అందువల్ల ఆ ప్రాణి జీవితం అసమగ్రమవుతుంది. మరణం వల్లనే ప్రాణి జీవితం సమగ్రమవుతుంది”. దీని ప్రకారం లావా కొండ కావడం, విత్తనం మర్రి కావడం సమగ్రం. సమగ్రమైనప్పుడే కదా జన్మ ధన్యం. ప్రాచీన సాహిత్యంలో పూర్వజన్మ వాసనలు కొందరికి ఉన్నట్లు రాశారు. ఈ కలికాలంలో మానవమాత్రులకు అది సాధ్యం కాదు. భూతకాల చింతన విడిచి వర్తమానంలో జీవించడమే మనకు ఇప్పుడు కావాల్సింది. “ఎన్నెన్నో జన్మల బంధం”అన్న పదబంధం ఎంత ప్రసిద్ధమైందో మీకు తెలుసు కదా! దానిని చదివినప్పుడు పూర్వజన్మ ఏకవచనం కాదని, బహువచనమని తెలుస్తున్నది.
“ఇంటి నిండా బంధువర్గము ఒక్కరాపరు
ఊరినిండా మిత్ర వర్గము ఒక్కరాపరు
ప్రాణ దీపం శిథిలకాయము వీడిపోగా
జగతి నిండా ప్రేమ మూర్తులు ఒక్కరాపరు”
(43)
మనలోని ప్రాణాన్ని జ్యోతి రూపంగా భావిస్తాము. అది ఆత్మ యొక్క రూపం. ప్రాణాన్ని విడవడమంటే ఆత్మ జ్యోతి దేహాన్ని వీడటమే. పై రుబాయిలోని సౌందర్యమంతా నాలుగో పాదంలో ఉంది.నాలుగో వాక్యం చదివేసరికి మనం గొప్ప అనుభూతికి లోనవుతాం. ఒక కృష్ణుడు, ఒక క్రీస్తు, ఒక అల్లా ,ఒక బుద్ధుడు, ఒక మహావీరుడు, ఒక గురు గోవిందుడు, ఒక శిరిడీసాయి లేక అందరూ ప్రత్యక్షంగా పక్కనే ఉన్నా పోయే ప్రాణాన్ని ఆపలేరని అర్థం చేసుకుంటే ఈ రుబాయి గొప్పతనం ఏమిటో మనకు తెలుస్తుంది.ఎంతటి536 కరుణాహృదయుడైనా మరణం విషయంలో నిస్సహాయుడే కదా!.
“ఎన్నో సందళ్ల నడుమ రోజు జారిపోతుంది
ఏ అలజడి లేకుండా శతాబ్ది దొర్లి పోతుంది
ఊదకుండానే ఆరిపోయే దీపం మనిషి
ఏ సడీ లేకుండా ఊపిరి ఆగిపోతుంది”. (74)
కాలం గడవడం అంటే జీవితం కూడా గడవడమే కదా! జీవితం వెలుగుతున్న దీపం.ఏదో ఒకనాటికి ఆ దీపం ఆరిపోక తప్పదు.
దీప ప్రమిదలోని తైలం అయిపోయాక దానిని ఎవరు ఊదవలసిన అవసరం లేదు. చమురు నిండుకున్న తర్వాత దీపం ఎంత నిశ్శబ్దంగా ఆగిపోతుందో, జీవశక్తి నశించిన దేహంలోని ఆత్మ జ్యోతి అంతే నిశ్శబ్దంగా దేహాన్ని వీడుతుంది. చుట్టూ ఎంత మంది ఉన్నా పోయే ప్రాణాన్ని ఆపలేరు. పై రుబాయి లోని ‘రోజు’,’శతాబ్ది’ కాల వాచకాలు. కాలానిది కరిగిపోయే లక్షణం. పుట్టిన మనిషి కాలంతోపాటు కొంత దూరం నడిచి అస్తమిస్తాడు. కాలాన్ని ఎవరు ఆపలేనట్లుగానే మరణాన్ని ఎవరూ ఆపలేరు. మనిషి చనిపోవడాన్ని “కాలం చేశాడు” అని కూడా అంటారనే విషయాన్ని మీకు ఇక్కడ గుర్తు చేస్తున్నాను.
“శ్వాస తీసినన్నినాళ్ళు సౌఖ్యంగా ఉండాలి ఊపిరున్నన్నాళ్ళూ ఉత్సాహముండాలి
కాయలన్నీ చెట్టు వీడుననితెలుసు
పండు రాలేదాక పుండు రాకుండాలి”. (31)
పుట్టుక ,చావుల మధ్య క్షణభంగురమైన జీవితం ఎలా ఉండాలనే ప్రశ్నకు కవి జవాబులా కనబడుతుంది ఈ రుబాయి. ఇందులోని మూడవ వాక్యం తాత్వికతతో నిండి ఉంది. “పండు రాలేదాకా పుండు రాకుండా ఉండాలి” అన్న కవి ఆకాంక్ష ఆయన స్వీయ వేదనలోంచి పుట్టింది. తెలంగాణ రుబాయిలు రాస్తున్న సమయంలోనే నరసింహా రెడ్డి గారి బావమరిది క్యాన్సర్ మహమ్మారితో మరణించాడు. క్యాన్సర్ పుండుతో తన బావమరిది తల్లడిల్లి పోయిన నరక క్షణాలను కళ్ళారా చూశాడు కవి. అందుకే శత్రువుకు కూడా
ఇటువంటి బాధ రావద్దని కోరుకున్నాడు.
‘చిలుక ఈ చెట్టు నుండి ఎగిరి పోతుంది'(147), ‘ప్రతి వస్తువు మృత్యు దిశన పరుగులిడును కాదె'(241), ‘సమయమెళ్ళిపోతుంది ఎలా ఎలా ఆపను’ (87), ‘వికసించిన ప్రతీ మొగ్గ వాడిపోవును ‘(80), ‘ఎట్ల నైనా కాడి ఎత్తేయవచ్చు'(58) మొదలైన రుబాయిలలో కూడా మరణ తాత్వికత మనకు కనబడుతుంది. “తెలంగాణ రుబాయి”ల లోని వస్తువైవిధ్యంలో మరణ భావన చోటు చేసుకోవడం, తాత్వికంగా అది అభివ్యక్తం కావడం, సులభశైలిలో క్లిష్టమైన భావనలను పాఠకులకు అందించడం కవి రచనా శక్తిని ,పరిశీలనాసక్తిని తెలుపుతున్నవి. అందుకే పాఠకుల విశేష ఆదరణను అవి పొందుతున్నవి.
“జీవమన శరీరమున నేమో వచింతు
విసురు గాలిది ఇటు దూరి వెడలెనటుల”
పాలమూరు ప్రసిద్ధ కవి కీర్తిశేషులు వల్లపురెడ్డి బుచ్చారెడ్డి గారి గజల్ అనువాదమైన “ముక్త గీతికల”లోని ఒక గజల్ తో ఈ వ్యాసాన్ని ముగిస్తున్నాను.