అంతర్గతాంశం..
వాస్తవిక మరపురాని నవలా నాయికలు….ఇందిర..మంజరి..జానకి..
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
నిర్వాహకులకు..నమస్కారం..
ఈ సదస్సులో నేను సమర్పించబోయే పత్రం…
వాస్తవిక మరపురాని నవలా నాయికలు….
1.ఇందిర…కాలాతీత వ్యక్తులు…డా.పి.శ్రీదేవి
- మంజరి….పాకుడు రాళ్ళు….శ్రీ రావూరి భరద్వాజ
- 3.జానకి ……జానకి విముక్తి…రంగనాయకమ్మ….
ఈ మూడు పాత్రలూ దాదాపు 10..15..సంవత్సరాల
తేడాతో సృష్టించబడిన పాత్రలు…
ఇంటా, బయటా ,ఇతరరంగాలలో స్త్రీలు పడుతున్న బాధలనేకం. పై మూడు పాత్రలూ వేటికవే విశిష్టమైన పాత్రలు….కాలవ్యవధి ఉన్నప్పటికీ మార్పులేని స్త్రీల
జీవితాలే కన్పిస్తాయి. రచయితలు భవిష్యత్సూచకంగా
పరిష్కారమార్గాలు సూచించడం మనం చూస్తాం..
మొదటగా….ఇందిర….కాలాతీత వ్యక్తులు..డా.పి.శ్రీదేవి.
మరపురాని పాత్రను చర్చించే ముందు రచయిత్రి ప్రతిభను
చెప్పుకోవడం అవసరం.
1929లో జన్మించి ,1961లో 32 సంవత్సరాలకే అనారోగ్యంతో మరణించిన శ్రీదేవి మరపురాని నవల . అందులో మరపురాని ఇందిర పాత్ర సృష్టి ఒక కళాఖండం…
నవల మాత్రమే కాక కథలు17, సమీక్షలు రాసి,ఎం.బి.బి.యస్ చేసి డాక్టరుగా,సేవలు చేసారు. ..ఎంత కాలం జీవించానన్నది కాదు ఎంతకాలం తన రచన ద్వారా మ బ్రతికున్నామన్నది ముఖ్యం..అని పెద్దలు చెప్పినట్లు శ్రీదేవి కలకాలం గుర్తుండిపోయే నవల రాసారు.అందులో 20 సం.ల ముందుచూపుతో ఇందిర పాత్రను సృష్టించారు….
ఈ నవల 1957-58 మధ్యకాలంలో తెలుగు స్వతంత్రలో
ధారా వాహికంగా వెలువడింది.
కథకు రంగస్థలం విశాఖపట్టణం. ఈ నవల నాలుగు స్తంభాలాటగా నలుగురి మధ్య, ప్రధానంగా తిరుగుతుంది.
ఇందిర,ప్రకాశం, కృష్ణమూర్తి,కళ్యాణి..ఏదో ఒక విధంగా మిగిలిన ముగ్గురితోనూ సంబంధమున్న పాత్ర..అంతేకాదు వాళ్ళ జీవితాల్లోకి చొచ్చుకు పోయే పాత్ర….
కానీ ఒకసారి నవల చదివితే గుర్తుండిపోయే పాత్ర ఇందిరనే…అంత విలక్షణమైన పాత్ర..నవలాకాలం 1953-54 మధ్యకాలం అయి ఉండవచ్చు..ఆ కాలం నాటికి స్త్రీలు
ఉద్యోగం చేయడమే అరుదు..ఆ మాటకొస్తే చదువుకున్న మహిళలే తక్కువ.సంప్రదాయ చట్రాలలో బిగుసుకొని,బాల్యవివాహాలు తో, ఇంటిచాకిరీతో ఉండే మహిళలే ఎక్కువ ఆనాడు.
సమాజంలో కనిపించే అరుదైన వ్యక్తులకు ప్రతీక ఇందిర.
భవిష్యద్దర్శనంగా ఇందిర పాత్రని సృష్టించారు.
ఇప్పటి కాలంలో ఇందిర లాంటి స్వభావం కలిగిన వాళ్ళు కోకొల్లలు…
ఇందిర పెరిగిన విధానం,..చిన్నప్పుడే తల్లి చనిపోవడం,
తండ్రి బాధ్యతా రాహిత్యంతో ఉండడమే కాక,దురలవాట్లు కలిగి ఉండడం, తనని పోషించాల్సిన వాడు తన మీదే
ఆధారపడడం ఇవన్నీ ఇందిర వ్యక్తిత్వాన్ని రాటు తేల్చాయి.
ఇందిర వ్యక్తిత్వాన్ని చెప్పడానికి తాను మాట్లాడే మాటలు చాలు…” నా ఇల్లు నేను కట్టుకుంటుంటే పక్కనుంచి
నడిచే వాళ్ళ మీద ఇటుకలు పడ్డాయంటే నేనేం చెయ్యగలను? ఎవరిమట్టుకీ వాళ్ళు చూసుకు నడవాలి.
అంతె..అంటుంది..అంటె తన జీవితాన్ని బాగుచేసుకునేటప్పుడు ఎవరు అడ్డొచ్చినా అడ్డు తొలగించుకుంటాననే భావంతో కృష్ణ మూర్తి తో చెప్తుంది..
జీవితకాలం అందరూ గుర్తు పెట్టుకునే సంభాషణ కొనసాగిస్తుంది ఇందిర.
“నీ జీవితకాలం లో నిండుగా,నిర్భయంగా బతుకు.రోజుకు
పదిసార్లు చావకు. మన చుట్టూరా వున్న స్వార్ధం, ద్వేషం, క్రౌర్యం, భయం యివి మనిషిలోనూ ఉన్నాయి. కాబట్టి
వీటికి భయపడకు . అంటూ మనలో మానవత్వం ఉండటం నేరం కాదు…అంటుంది…ఇవన్నీ పెళ్ళయిన మొదటి రోజు కృష్ణమూర్తి కి బోధిస్తుంది. ఈనవలలో లోకాన్ని క్షుణ్ణంగా చదివిన పాత్ర ఇందిరనే….నా వ్యక్తిత్వాన్ని చంపుకోను అంటుంది.అంటే పెళ్ళయ్యాక
తనమీద అధికారం చలాయిస్తే ఊరుకోను న్నట్లు కృష్ణమూర్తి తో చెబుతుంది…
…ఇందిర తమ మేడపైనున్న ప్రకాశంతో.”..ఆడదాని మనసు నీకు తెలియదు ప్రకాశం..బతుకులో నాకు కావలసిందొకటి.దొరుకుతున్నదింకొకటి.అంచేత లోకాన్ని ధిక్కరిస్తున్నాను” .అంటుంది…తాను ఎందుకంత కఠినంగా ఉంటుందో ముక్కుసూటిగా మాట్లాడుతుందో చెప్తుంది.
తనకు భర్త ఎలాంటి వాడు కావాలో చెప్తుంది.
నేనున్నానులే.నీకేం భయంలేదు.నీ సమస్యలూ, బరువులూ నా మీద పడెయ్….అనే భర్త కావాలంటుంది.
పిరికివాడైన ప్రకాశాన్ని తిరస్కరిస్తుంది.వేరొకరి సానుభూతిని ఆశించని వ్యక్తి.తన మాటలతో ఎవరినైనా దగ్గర చేసుకోగలదు…అదేవిధంగా తనకు అవసరం లేదు అన్నప్పుడు దూరం కూడా చెయ్యగలదు.ప్రకాశానికి దగ్గరవుతున్న కళ్యాణిని ఇంటినుంచి బయటకు పంపిస్తుంది..ప్రేమలు,ఆప్యాయతలు, బంధాలు, బాంధవ్యాలూ ఇవన్ని ఇందిరకు శాశ్వతం కాదు..అలా
ఆమెను ఆ విధంగా తయారు చేస్తాయి పరిస్థితులు..
తనకున్న ఆస్తిపాస్తులు తో కులాసాగా తిరిగే కృష్ణమూర్తి ని
చివరిలో వివాహం చేసుకుంటుంది….అదీ, అన్ని తన
అభిప్రాయాలతో ఏకీభవించిన తరువాతనే…
ఎంతో విలక్షణమైన పాత్ర ఇందిరది.ఆ నవలలో ప్రకాశం,కళ్యాణీ,కృష్ణమూర్తి మొ.న పాత్రలన్నీ వాస్తవిక పాత్రలే..ఆనాడే ఇందిర పాత్ర ద్వారా స్త్రీ స్వేచ్చ ను ప్రతిపాదించడం, మహిళలు ధృఢమనస్కులైసాంఘిక జీవనం చెయ్యాలనీ ఇందిర పాత్ర ద్వారా మహిళలకు సూచించారు..
నవల చదివిన వారెవరైనా ఇందిర పాత్రను మరిచిపోరు.నిజంగా మరపురాని పాత్ర ఇందిరది.
2. మంజరి….పాకుడు రాళ్ళు నవల…శ్రీ రావూరి భరద్వాజ
&&&&&&&&
2013లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సాహిత్య పురస్కారం ఙ్ఙానపీఠ్ అవార్డు సంపాదించి పెట్టిన నవల పాకుడురాళ్ళు….చలనచిత్ర పరిశ్రమను వస్తువుగా తీసుకుని, తెలుగులో మొట్టమొదటగా రాసిన నవల పాకుడు రాళ్ళు. దీనికి మొదట మాయా జలతారు అని పేరు పెట్టారు భరద్వాజ గారు…శీలా వీర్రాజు గారు దీనిని పాకుడురాళ్ళు గా మార్చారు. భరద్వాజ గారు అంతకుముందురాసిన పాలపుంత అనే ఓ పెద్ద కథను ఈ నవలగా రాసారు…3 సంవత్సరాలపాటు కృష్ణా పత్రిక లో
ధారావాహికంగా సాగిన నవల.1965…కి అటుఇటుగా రాయబడిన నవలగా చెప్పుకోవచ్చు…ఆ సమయంలో రంగస్థల నాటకాలను వెనుకబడి, రంగుల కలైన రంగుల వల వైపు వెళ్తున్న రోజులు.సినిమా నటులుగా స్థిరపడాలని పల్లెలనుంచి కూడా ఎంతోమంది మద్రాసు పట్టణానికి వెళ్ళడం, కొందరికి అది దొరక్క నిరాశ తో వెనుకకు మరలడం……ఇలాంటి రోజులు…
ఆ రంగంలో తెరవెనుక జరిగే రాజకీయాలు,ఎత్తులూ, పై ఎత్తులు , రకరకాల స్వభావాలు కలిగిన వ్యక్తులు ఇవన్నీ అక్షరబద్ధం చేశారు భరద్వాజ…సినిమాలోనే కాదు నిజ జీవితంలో కూడా
నటించేవారు మనకు నవలలో తరచూ తారసపడతారు.
ఇందులో ప్రధానపాత్ర మంజరి…ఈ పాత్ర మరపురాని పాత్ర…
నవ్యాంధ్ర కళా మండలి అనే నాటక సంస్థలో , స్త్రీ పాత్రధారిగా 15 ఏండ్ల మంగమ్మ నాటిక రంగం లో ప్రవేశించింది…అంతకుముందు నాగమణి అనే ఆవిడ దగ్గర పడుపు వృత్తి సాగించింది….గుంటూరు గుడిసెల్లో తిరిగి , బొంబాయి చలువరాతి మేడలో చేరిన మధ్య కాలంలో మంగమ్మ మంజరిగా మారి ఆమె అనుభవాలను చలనచిత్ర ప్రపంచాన్ని చూపిన నవల ఇది.తన వద్దకు విటుడుగా
వచ్చిన చలపతి సినిమా రంగాన్ని పరిచయం చేస్తాడు …
మద్రాసు తీసుకు వెళ్తాడు..అక్కడ మంజరి గా పేరు మార్చుకుంది….తన తెలివితేటలు నిరంతర, కృషి
పెట్టుబడిగా పెట్టి అవసరమైతే అందాన్ని ఎరగా వేసి
సినిమారంగంలో నాయికగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుంది. ఆరంగంలో నిలబడడానికి తన వ్యక్తిత్వాన్ని చంపుకొంటుంది.చేతినిండా డబ్బుండే స్థాయికి ఎదుగుతుంది.తక్కవ కాలంలోనే అగ్రశ్రేణి నాయికగా
అవుతుంది..అనుకున్నది సాధించేదాకా కృషి చేస్తుంది…
తన లక్ష్యం నెరవేరింతరువాత ఎవరినీ లెక్కచేయలేదు.
మంజరి.చలపతిని,నిర్మాతలను ఆడిస్తుంది…కానీ ఆమెలో
కృతఙ్ఞత ఉంది.నాటకరంగంలో తనని నాయికను చేసిన
మాధవరావు,రామచంద్రం పట్ల కృతజ్ఞతగా ఉంటుంది.
లోకం నీతిని తెలుసుకుంటుంది.కాలానుగుణంగా తన స్వభావాన్ని మార్చుకుంటుంది…తెలుగులో అగ్రశ్రేణి నాయికగా ఉన్నప్పుడే హిందీలో అవకాశాలకోసం ప్రయత్నాలు చేస్తుంది. భారత దేశం తరఫున సాంస్కృతిక రాయబారిగా అమెరికా కూడా వెళ్తుంది.అక్కడ మార్లిన్ మన్రోని కలుసుకుంటుంది. ఆమె జీవిత గాధ విని
సినిమా నాయికల జీవితాలన్నీ ఇలాగే ఉంటాయన్న విషయాన్ని గ్రహిస్తుంది.
ఇలా మంజరి చివరికి అనుభవాల రాపిడి లో నలిగిపోయి ఏదైనా పల్లెటూరు పోయి హాయిగా ప్రశాంతంగా పడుకుని నిద్రపోతే బాగుండు..అనుకుంటుంది….మనశ్శాంతి కరువై బాధపడుతుంది.నవల చివరిలో నాటకరంగం సంస్థ వాడైన మాధవరావు మంజరిని కలుస్తాడు.మంజరి రాజభవనాన్ని చూస్తాడు.” నువ్వుమంచిదానివి.మెత్తటిదానివి.జాలిగుండె నీది “అంటాడు మాధవరావు ఒక సందర్భంలో…
దానికి మంజరి “కొంత మేరకే నిజం.కొందరు సుఖపడుతున్నా నేను చూడలేను.ముఖ్యంగా నా శత్రువులూ.నన్ను సాధించిన వారి మీద కసి తీర్చుకోవడం లో నేను పరమానందం అనుభవిస్తారు.డబ్బుతో, మనుషుల్నీ కళలనూ కొని వ్యాపారం చేసేవారంటే ఇష్టం లేదంటుంది…ఎప్పుడో నేను పొందిన అవమానం, తిన్న దెబ్బలు, ఈసడింపులూ….సినిమా లైన్ లోనూ ఓ బుకింగ్ రావడం కోసం ఎన్ని ఆశ్రయింపులు, ఎంతోమంది ఎన్నెన్ని ఆశలు చూపడం…తలచుకుంటే ఎంతో అసహ్యం వేస్తుందో చెప్పలేను”.అంటుంది.. తనకు ఆప్తుడనిపించిన మాధవరావు తో తన వేదనను వినిపిస్తుంది.
చివరిగా ఆమె తెలుసుకున్న సత్యం..”..జీవితంలో విషాదం డబ్బు లేకపోవడం కాదు.మనల్ని ప్రేమించే వాళ్ళు లేకపోవడం. మనం ప్రేమించడానికి ఎవరూ దొరక్కపోవడం..” అంటుంది మాధవరావు తో…
చివరకు మోసం చేసే మనుషుల ఉచ్చులో చిక్కి వేదనననుభవించి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంటుంది….మాధవరావు ఆమె ఇంట్లో ఉండగా నే.
రచయిత ప్రవేశించి, “అనన్యమైన ప్రతిభా సంపదలున్న వ్యక్తి మీద జీవితం ఏదో ఒక రూపంగా కసితీర్చుకుంటుంది” .అంటారు.
మంజరి విషయంలోనూ అదే జరిగింది. పోలీసులడిగే ప్రశ్నలకు అక్కడ సువిశాలమైన ఆ చలువరాతి మందిరంలో శబ్దం కూడా శిలా రూపం దాల్చింది.అంటారు భరద్వాజ గారు.
సినీతారల జీవితాలు అద్దాలమేడలు…పేకమేడలు…ఎప్పుడు కూలుతాయో తెలియదు.
పంజరంలోంచి బయటపడలేని పక్షుల జీవితాలు..రెక్కలు ఉండీ ఎగురలేని జీవితాలు. రంగుల వలలు. …
మంజరి పేదరికంతో నూ బాధపడింది. ఎడాపెడా డబ్బు సంపాదించీ వేదన చెందింది. ఉత్థాన పతనాలను చవి చూసింది..పాకుడు రాళ్ళని తెలిసీ , వాటిపై పయనించి తనను తాను కోల్పోయింది.
ఈనాడు కాదు ఆనాడూ పాకుడురాళ్ళ వంటి సినీ ప్రపంచంనుండి జారిపడిన తారలు న్నారు.ప్రపంచ ప్రఖ్యాతి పొందిన హాలీవుడ్ నటి మార్టిన్ మన్రో స్లీపింగ్ పిల్స్ వేసుకుని మరణించింది.
పాకీజా వంటి అద్భుత కళాఖండం లో నటించిన మీనాకుమారి తాగుడుకి బానిసై మరణించింది…
మహానటి సావిత్రి స్వచ్ఛమైన ప్రేమకు నోచుకోక ,తాగుడుకు బానిసై ఈ లోకొన్ని విడిచి పెట్టింది.
ఇలా ఈమధ్య తారల్లో ఫటాఫట్ జయలక్ష్మి, సిల్క్ స్మిత, దివ్యభారతి లాంటి ఎంతోమంది జీవితాన్ని చాలించారు చిన్న వయసులోనే…
ఇలా సినీరంగులవలలో చిక్కుకుని బయటకు రాలేక, అందులో ఉండలేక, వ్యధననుభవించిన వారందరికీ ప్రతీక మంజరి పాత్ర…చీకటి వెలుగుల రంగేళీ,, మాయా జలతారు మనుషులనీ మాయం చేస్తుందని చెప్పకనే చెప్పారు…ఇది వాస్తవం…వాస్తవ జీవన చిత్రణ, మరపురాని పాత్ర, సినీ ప్రపంచంలోని లోటుపాట్లను గురించిన ఒక హెచ్చరిక మంజరి పాత్ర….పాకుడు రాళ్ళు నవల….మరపురాని నవల…మరపురాని పాత్రగా మిగిలింది మంజరి..
- మూడవ నవలా నాయిక జానకి….జానకి విముక్తి నవల….రంగనాయకమ్మ….
స్త్రీల సమస్యలు ప్రధానంగా చేసుకుని1960ల నుండీ మహిళా రచయితలు నవలలు రాస్తున్ధప్పటికీ 1980 ల తరువాత వెలువడిన నవలా సాహిత్యం సమస్యలకు పరిష్కారదిశగా సాగింది..1975-85 మధ్య కాలం అంతర్జాతీయ మహిళాదశాబ్దంగా యూ.ఎన్.ఓ. ప్రకటించింది.ఈ నేపథ్యంలో స్త్రీల సమస్యలు సమావేశాల్లో చర్చించడం, తమకుతాముగా మహిళలు చైతన్యవంతులవడం, ఈ దశాబ్దంలో జరిగింది.రంగనాయకమ్మ పేకమేడలు, రచయిత్రి వంటి నవలలు రాసినా1980 లో ప్రచురించబడి వెలుగు చూసిననవల జానకి విముక్తి…
.. జానకి విముక్తి..మార్క్సిస్ట్ భావజాలంతో కూడిన నవల అయినప్పటికీ స్త్రీ వాదం పురిటినొప్పులు పడుతున్న కాలం.ఈ దశలో జానకి విముక్తి రావడం ప్రత్యేకతను సంతరించుకుంది.
నవలలో కథానాయిక జానకి…అమాయకురాలు.భర్తచేత పీడింపబడి, ఆ పీడను సహించలేక, అన్న, సత్యం బోధనలతో , చైతన్యవంతంగా తన జీవన మార్గాన్ని మార్చుకుంటుంది.
ఈ సందర్భంలో కుటుంబరావు గారి మాటలు గుర్తు చేసుకోవాలి.” మన సమాజంలో కొందరు తక్కువ కులాల్లో పుడతారు.కొందరు బీదలకడుపున పుడతారు.మరి కొందరు ఆడవాళ్ళు గా పుడతారు.”అంటారు.
అంటే ఆడదానిగా పీడించబడడానికి కులం,మతం, బీద, ధనిక తేడాలు లేవు.ఆడతనం ఒక ప్రత్యేకత తరహా తక్కువతనం…
విప్లవ చైతన్యాన్ని ఇష్టపడే రచయిత రంగనాయకమ్మ
జానకి విముక్తి నవల ద్వారా స్త్రీ సమస్యల విముక్తి మార్గాలను చెప్పారు.
పితృస్వామ్య భావజాలం పేరుకుపోయిన సమాజంలో
పురుషాధిక్యత పెచ్చుమీరిన సమాజంలో ఆడది ఎక్కువ చదువుకోకపోవడం వలన , పెద్దలు నమ్మిన సంప్రదాయాలను మనసులో స్థిరపరచుకుంటుంది. జానకి.
పెళ్ళయింతరువాత రెండేళ్ళ నుండీ అత్తవారింట్లో ,అత్తవలన , భర్త వల్ల పడుతున్న బాధలని తన అన్న సత్యంతో చెప్పుకుంటుంది.ఈ సందర్భంలో నవల మొదలవుతుంది…జానకీ పరిచయం అవుతుంది పాఠకులకు…భర్త మూర్ఖ చేష్టలన్నీ అన్న అసహ్యించుకోగా,
చీదరించుకో గా ,తనంటే అంత ప్రేమ చూపడం తనకు తెలియకుండానే జానకికి ఇష్టమనిపిస్తుంది…అంటారు రచయిత.అతని చేష్టల వలన తన మనసు భర్తకు వ్యతిరేకంగా మారుతుందని తనకు తెలుస్తుంది.”ఈ నీచునితో కాపురం చేస్తోనే వున్నావు అంటే చిన్నబుచ్చుకుంటుంది…”తప్పుతుందా! అంటుంది.”
ఇక్కడ కట్టుబాట్లకు లోనైన సాధారణ యువతి కనబడుతుంది.”తక్షణం వెళ్ళిపోయాం పద!”
అని సత్యం అనగానే ఆశ్చర్యంగా చూస్తుంది.అలా చెయ్యొచ్చా! అన్నట్లు…”నీకిష్టమైతే మంచి వ్యక్తిని పెళ్ళి చేసుకుందువు గాని..” అని అన్న అనగా, ఛీ! పెళ్ళేంటీ! అంటుంది.మళ్ళీ పెళ్ళి చెసుకోవడం అవమానంగా భావించిన సగటు ఇల్లాలు జానకి.అంటే భర్త ఏమన్నా ,కొట్టనీ, తిట్టనీ, ఇంటెడు చాకిరీ చేసి కూడా, ఏమీ ప్రతిఘటన చెయ్యకుండా ఉండాలి ఆడది
..ఇది సమాజం నీతి.జానకి విముక్తి నవల కాలం నాటి
న్యాయం.ఇప్పుడు కొంత మారినప్పటికీ స్త్రీ జీవితం పెళ్ళితో మారుతుందన్న ది నిజం…మంచీ కావచ్చు, చెడూ కావచ్చు.
ఇప్పుడున్న సమాజంలో స్త్రీల కేమైనా సమస్యలున్నాయా లేవా…ఉంటే.. అవి యేమిటి? ఎందుచేత ఉన్నాయి?
అవి ఎలా పోతాయి? అనే విషయాలు స్త్రీలకు తెలపడమే ఈ నవల ముఖ్య ఉద్దేశ్యం అంటారు రచయిత..ముందుమాటలో…
జానకి విముక్తి నవల 3 భాగాలుగా ఉంటుంది.
ప్రధానంగా జానకి, భర్త వెంకట్రావు, అన్న సత్యం పాత్రలుంటాయి.
మొదటి భాగంలో జానకి హావభావాలతో ఆమెను చిత్రీకరిస్తారు రచయిత….ఈ భాగంలో జానకి ఆమె ప్రమేయం లేకుండానే భర్త బాధలను అన్నతో పంచుకోగా
పుట్టింటికి పోదామని జానకిని తీసుకు వెళ్తాడు సత్యం….
చిన్నప్పుడే పెళ్ళయిన ,లోకం చూడని ఆడదానికి స్వంత నిర్ణయాలుండవు కదా! అన్నతో వెళ్ళిందె కానీ తన సంసారం మూన్నాళ్ళ ముచ్చటేసింది బాధ పడుతుంది.
మళ్ళీ భర్త వచ్చి పశ్చాత్తాపం నాటకాలాడి జానకిని తీసుకువెళ్తాడు..అప్పుడూ తన ప్రమేయం ఏమీ లేదు..
వయసు పెరిగే కొద్దీ, అన్న బోధనల వలన, పుస్తక పఠనంతో తనని తాను తెలుసుకుంటుంది..రెండవ భాగంలో సాహసం మూర్తీభవించిన మనిషిగా, సత్యాన్ని, నిజాయితీని నమ్మే మనిషిగా జానకి కన్పిస్తుంది…అప్పటికి ఒక మగ పిల్లవాడిని జన్మనిస్తుంది….
ఎన్ని సంవత్సరాలు గడిచినా మారని మనిషి వెంకట్రావు.
” మూఢాచారాలని నమ్మే వెంకట్రావు, అబధ్ధాలాడే వెంకట్రావు,కోపంకలిగిన వెంకట్రావు,నీతిలేని వెంకట్రావు, అవసరాన్ని బట్టి ఊసరవెల్లి లా రంగులు మార్చే వెంకట్రావు
వల్ల చేదు అనుభవాలెన్నింటినో చూసింది జానకి.
ఆ అనుభవాలకు పరాకాష్ట భర్తకు వ్యభిచార లక్షణాలు కూడా వుండడం….ఇంక ఆమె సహనానికి తెరపడింది.
కోపం కట్టలు తెంచుకుంది…ఆవెశం ఊపిరి పోసుకుంది.
వెంకట్రావు ను నిలదీసింది ..ఇది జానకి మానసిక పరిణామ
క్రమం…అవునూ! పిల్లిని కూడా కట్టేసి కొడితే పులి అవుతుంది…అలాగే జానకి బాధలు పడీ,పడీ చివరకు భర్తతో పెనవేసుకున్న జీవిత బంధం అబధ్ధమనీ, కృత్రిమమనీ,మోసపూరితమనీ రుజువైనప్పుడు ఒక నిర్మలమైన ఆత్మకు కలిగే పరితాపం అది.
నేటి సమాజంలో కూడా ఎంతోమంది జానకి వంటి బాధలను భావిస్తున్న ఆడవారున్నారు..తను చదివిన పుస్తకాల ఙ్ఙానంతో …ఇంకానా…ఇకపై చెల్లదు… దుర్మార్గం..అనుకుని ఒక స్థిర నిశ్చయంతో ఇంటినుంచి
,అతని నుంచి దూరంగా కొడుకుతో సహా వెళ్ళిపోతుంది..
3 విభాగంలో గుప్పిట్లో ఉంచిన తన సంసారవిషయాలన్నీ
ఆవేశంతో తల్లికి అన్నకు చెబుతుంది. …
“24 గంటలూ ఏదో ఒక సాధింపు తో చూస్తూ ఉంటాడు.మనిషిలో ఏ గుణము చూద్దామన్నా అసహ్యమే! నోరు తెరిస్తే అబద్ధాలు.” అని అతని దుర్గుణాలచిట్టా పరుస్తుంది.
సున్నిత స్వభావం, పేదలపై సానుభూతి కలిగిన జానకి లోకఙ్ఙానంతో ఎదిగి, స్టడి సర్కిల్ లో పనిచేస్తున్న ,పరిచయమైన ప్రభాకర్ అన్నివిధాలా యోగ్యుడని
భావించి అతనితో జీవితం పంచుకోడానికి సిద్ధపడుతుంది.
అతను కోరిన తరువాత…కొడుకుతో సహా అతని జీవితంలో ప్రవేశిస్తుంది.ఆత్మానుభవంతో ప్రవర్తించి ,మానసిక, శారీరక బాధలనుండి విముక్తి పొందింది.
ఇలా జానకి పాత్రలో క్రమ పరిణామాన్ని చూపారు.
రచయిత.తనకు తానుగా చైతన్యవంతమైతేనే ఆ మార్పు శాశ్వతం అని కూడా ఆ పాత్ర ద్వారా చూపారు.సాంప్రదాయ బద్ధంగా పెరిగిన జానకి,తాను సంపాదించిన ఙ్ఙానంతో తన మార్గొన్ని సుగమం చేసుకుంది.
ఈ రోజుల్లో ఇలాగే కొంతమంది భర్తలతో వేగలేనప్పుడు విడాకులు తీసుకుని మళ్ళీ వివాహం చేసుకోవడం చూస్తూనే ఉన్నాం..పురుషులందరూ అలా ఉంటారని కాదు…కానీ చదువుకుని,ఉద్యోగం చేస్తున్న స్త్రీని కూడా నీకేం తెలియదు…అని తీసి వేయడం ,ఆమెపై పెత్తనం చేయడం ఇంకా జరుగుతూనే ఉన్నది..ఆడవాళ్ళు సహనవంతులు కాబట్టి సర్దుకుని వెళ్ళిపొతున్నారు….అత్యాధునిక కాలంలో ఆడవాళ్ళ ద్వారా బాధలు పడుతున్న మగవాళ్ళు కూడా లేకపోలేదు…
ఈవిధంగా సగటు స్త్రీ గా మొదలైన జానకి పాత్ర తన జీవితానికి తానే నియంత అనే విధంగా నిర్ణయాలు తీసుకునే సాహసం కల స్త్రీ పాత్ర జానకి..
ఈ విధంగా విభిన్న పరిస్థితులు, వివిధ రంగాల, వివిధ కాలాలూ, కలిగిన సమాజంలో నిరంతరం మనకు ఎదురవుతున్న మనుషులు,కుటుంబ వ్యవహారాలు,వైవిధ్యం కలిగిన మనస్తత్వాలు మూడు నవలల్లోని మూడు పాత్రలు…
ఇందిర…..మంజరి…..జానకి…..
నాకు సదస్సులో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తున్న సదస్సు నిర్వాహకులకు హృదయపూర్వక ధన్యవాదాలు…
డా.( శ్రీమతి ) గడ్డం శ్యామల….
అసోసాయెట్ ప్రొఫెసర్…(రిటైర్డ్)
ఎస్.పి.యం.కె.,
హైదరాబాదు… తెలంగాణా రాష్ట్రము….